కుచ్చుల గౌను

ఉదయం పది గంటలు కావొస్తుంది..
ఊరు బయట ప్రదేశం …
ఒకవైపు సర్కారుకు సంబంధించిన పాత కార్యాలయ భవనాలు… మరోవైపు ప్లాట్లు …ఆ ప్లాట్లల్లో అక్కడక్కడ వెలసిన ఇండ్లు ఉన్నాయి. మరికొన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి.. కాగా ఇంకొన్ని ప్లాట్లల్లో పెరిగిన మురికి కంప …తంగేడు.. చెట్లను చూస్తుంటే మాత్రం ఇప్పట్లో అక్కడ అయ్యే అవకాశం కూడా అక్కడ కనిపించడం లేదు.

ఆ రెండు ప్రదేశాలకు మధ్య తారు రోడ్డు సాగి ఉన్నది. పెద్దగా కాకపోయినా కొద్దో గొప్పో రేయింబవళ్ళు జన సంచారం మాత్రం ఉండే ప్రాంతంగా స్పష్టంగా తెలుస్తున్నది.

అక్కడ-
ఎవ్వరి ప్లాట్లల్లోనో నాలుగు గుడారాలు దగ్గర దగ్గరగా వేసుకుని ఉన్నాయి. గుడారాల ముందు నలుపు తెలుపు వన్నె రాళ్ళు చిన్న చిన్న కుప్పలుగా పోసుకుని ఉన్నాయి. ఆ కుప్పల ముందు ఇద్దరు యువతులు కూచొని సమ్మెటతో విసురాళ్ళను… రోళ్లను జాగ్రత్తగా మలుస్తున్నారు .

అప్పటికే తయారు చేసి వున్న విసుర్రాళ్ళు, రోళ్లు, ఒక పక్కకు పెట్టుకుని ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఎత్తి అక్కడే నిలిపి ఉన్న తోపుడు బండి మీద ఎక్కిస్తున్నది ఓ పెద్దవ్వ. ఆమె మోకాళ్ళ దిగువ వరకు ముతక చీర ధరించి, రవిక లేని వీపును చీరకొంగుతో చుట్టి కప్పుతూ నడుం దగ్గర బిగ్గరగా దోబుకుని ఉన్నది.

అక్కడే ఉన్న చెలిగిన నల్లతుమ్మ చెట్టు కింద ఓ నలుగురు పిల్లలు కూర్చుని మట్టిలో ఆడుకుంటున్నారు. చూస్తుంటే పిల్లల్లో సరైన పోషణ కనిపించడం లేదు. రేగిన జుట్లతో, పాత మాసిన బట్టలతో కనిపిస్తున్నారు.

మరోవేపుగా చూస్తే….ముగ్గురు యువకులు ఆటో ట్రాలీ నుండి పెద్ద పెద్ద బండ రాళ్ళను కిందికి దింపుతున్నారు. బనియన్లు ధరించి … అడ్డపంచెలు కట్టుకుని ఉన్నారు. ఆ పనిని గమనిస్తూ పెద్ద రుమాలు…. గోసి.. కట్టిన ఒక పెద్దమనిషి అక్కడే తచ్చర్లాడుతున్నాడు.

కాసేపటికి….
ఒక గుడారం నుండి ఒక యువతి బయటకు వచ్చింది. నేరుగా తోపుడు బండి వద్దకు వెళ్లి తోసుకుంటూ ముందుకు సాగింది. వెంటే నలుగురు పిల్లల్లో ఓ ఏడేండ్ల చిన్నది “అమ్మా… నేనొస్త… ” అంటూ వెనకాలే నడిచింది.
“అనే…అనంతా …. పిల్ల బద్రం ” వెనక నుండి వెంటనే చెప్పింది పెద్దవ్వ.
“సరే సరే… ” వెను తిరిగి చూడకుండానే చెబుతూ ముందుకు సాగింది ఆ యువతి… అనంతమ్మ.
“అనే లీలా… అమ్మను వొదిలి అక్కడిక్కడ బోవొద్దు ” మళ్ళీ పిల్లను ఉద్దేశిస్తూ కేకేసింది పెద్దవ్వ.
“సరేలేవే… ” పిల్ల కూడా వెనక్కి తిరిగి చూడకుండానే చెబుతూ తల్లితో ముందుకు సాగింది.

తల్లీ కూతురు అర కిలోమీటరు వెళ్ళగానే ఊరు మొదలయ్యింది. దుకాణాలు.. ఇండ్లు.. కలగలసి ఉన్నాయి.
“ఇసుర్రాళ్ళో … రోళ్ళో… ” అరవడం మొదలెట్టింది అనంతమ్మ.
అట్లా ఊరు చౌరస్తా వరకు వెళ్ళింది. ఒక్కరూ పిలవలేదు. ఆరోజు ఆదివారం ఆ ఊరి సంత. అప్పుడే సంత మొదలవుతున్నది. తన తోపుడు బండిని ఒక పక్కగా ఆపుకుంది అనంతమ్మ.. లీల మాత్రం తన పిల్ల చేష్టలతో అక్కడున్న దుకాణాలు గమనిస్తూ… అటు ఇటు తిరగడం మొదలెట్టింది.

“ఇసుర్రాళ్ళో … రోళ్ళో… అయ్యా… అమ్మా…రోళ్లు…. బాగున్నయి…. ” అంటూ గిరాకీ రప్పించే ప్రయత్నం చేయడం మొదలెట్టింది అనంతమ్మ.

చూస్తుండగానే మధ్యాహ్నం గడిచింది. ఇద్దరూ వెంట తెచ్చుకున్న సద్ది విప్పుకుని అక్కడే తినసాగారు.
“అమ్మా… గా షాపుల కుచ్చుల గౌను ఎంత బాగుందే… ” తింటుంటే అంది లీల
“అవును బిడ్డా. నేను కూడా అదే సూస్తున్న …! “కూతురు ధరించిన రంగు కావిన గౌన్ను ఒకింత బాధగా చూస్తూ అంది అనంత.
“దస్ర పండక్కి ఇప్పిస్తవానే ” ఆశగా అడిగింది లీల
“నా దగ్గర పైసలు ఎక్కడివే…!? రెండు రోళ్లు అమ్ముడు బోతే పోయేటప్పుడు బజ్జీలు ఇప్పిస్తలే… ” చెప్పింది.
ఆ మాట ఆ పిల్లకు రుచించలేదు.
“నాయిన ఇప్పియ్యడా?” అడిగింది.
“అడిగి సూద్దంలే” చెప్పింది అనంతమ్మ.
“పో… ఎప్పుడూ ఇంతే… ఏది ఇప్పియ్యరు ” ఆపిల్లకు కోపం వచ్చింది.
అది చూసి అనంతమ్మ ఏం మాట్లాడలేదు
పిల్ల బొమ్మలు అడిగినా, బట్టలు అడిగినా, ఎప్పుడూ ఏమి ఇప్పించ లేదు. అందుకే తనకు కోపం వచ్చిందని అనంతమ్మ తెలుసు. అందుకే బిడ్డ కోపాన్ని చూస్తూ, అదే దుకాణంలో బొమ్మకు కట్టిన నచ్చిన చీరను కొనుక్కోలేక పోతున్న బాధను తనలోనే దాచిపెట్టుకుంటూ అట్లాగే కూర్చుండి పోయింది.

చూస్తుండగానే మరో గంట గడిచింది. ఆ సమయానికి కూడా ఒక్క వస్తువు కూడా అమ్ముడుపోలేదు. ఒక్క గిరాకీ వచ్చిన బాగుండు అన్నట్టుగా వచ్చిపోయేవాళ్లను చూస్తూ….
“అమ్మా…తాత… అయ్యా… రోళ్లు ” అంటూనే ఉన్నది అనంతమ్మ.
లీల అప్పటికి అలిగి అలసిపోయి తోపుడు బండి నీడ కింద పడుకొని కునుకు తీస్తున్నది..

కాసేపటికి….
ఎవ్వరో పెద్దావిడ బండి వద్దకు వచ్చింది.
“ఎట్లిస్తున్నవ్? ” వస్తూనే అడిగింది.
“ఇస్రాయి రెండొందలు , రుబ్బు రోలు రెండొందలు , రోలు వొంద ” చెప్పింది అనంతమ్మ.
“ఇచ్చే రేటు జెప్పు ” అడిగింది పెద్దావిడ.
“నీవు ఏది తీసుకుంటే దాని మీద పది రూపాయలు తగ్గిచ్చుకో ” అంది అనంతమ్మ
“తియ్యక్కడ…! రోలుకు ముపై మస్తు ” అంది.
“ముప్పై రూపాయలా మలిసిన కూలైన పడాలి కదమ్మా ” అంది అనంతమ్మ.
“ముప్పై లాగా రెండు రోళ్లు గావాలే. ఇస్తే ఇయ్యి లేదంటే లేదు… ” కచ్చితంగా అంది పెద్దావిడ.
“ఎనభై చేసి తీసుకోమ్మా ” దీనంగానే అడిగింది అనంతమ్మ.
“లేదు లేదు ” అంటూ చేతులు ఆడిస్తూ ముందుకు వెళ్లింది పెద్దావిడ.
“అమ్మా … గిట్టదు గాని యాభై చేసి తీసుకో ” పిలిచింది అనంతమ్మ.
పెద్దావిడ వెనక్కి తిరిగి వచ్చింది. రోళ్లను అటు ఇటు తిరగేసి చూసింది.
“సరిగ్గ మలవలే…” అంటూ రోళ్లను అక్కడే పెట్టేసి తన దారిన వెళ్ళిపోయింది.
అనంతమ్మ ఆశ నీరు గారిపోయింది. గిరాకీ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయింది కూడా.

అట్లా నెమ్మదిగా పొద్దు గుంకింది..
పడుకున్న పిల్ల లేచి మళ్ళీ అటు ఇటు తిరగడం మొదలెట్టింది. ఎటూ తిరిగి ఎదురుగా షాపు
ముందు వేలాడ దీసి ఉన్న కుచ్చుల గౌను చుట్టే ఆ పిల్ల మనసుతో పాటుగా … ఆ పిల్లా తిరుగుతుంటే ~
“బత్కులు బండ వారిపాయె .. ప్చ్… ” అనంతమ్మ మనసు బాధ విల విల లాడింది.

ఆ బాధను మరిపిస్తున్నట్టో…
ఆ బాధ నుండి బయటికి లాగుతున్నట్టో ” అనంతా.. బాగున్నావానే ” జనాల్లో ఉన్నట్టుండి ఎవ్వరిదో ఆడాళ్ళ గొంతు వినబడింది. అది ఎరిగిన గొంతే. కానీ ఎవ్వరో వెంటనే పోల్చుకోలేక అటు ఇటు చూసింది.
“ఎందుకే అన్నం తింటలెవా… ఇంత బక్కగైన్నవు ” జనాల్లోంచి బయటకు వచ్చింది అనసూయ. ఆమె అనంతమ్మ చిన్నప్పటి స్నేహితురాలు. చిన్నప్పుడే పెండ్లయ్యింది. అడపా దడప కలుసుకున్నప్పటికీ… అనంతమ్మ పెళ్లి తర్వాత కలిసిందే లేదు.
“ఆన్సూయా బాగున్నవానే ” అనంతమ్మ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది..అందాకటి అలుపు మరచిపోయినట్టు అయింది…
“అనే…పదేండ్లయ్యింది… నిన్ను జూసి..! ఎట్లున్నవు? అమ్మోళ్ళు ఎట్లున్నరు? నిన్ను ఇచ్చింది నాగోరం కదా… ఇప్పుడు ఈ ఊర్ల ఉన్నారా? ” ప్రశ్నల వర్షం కురిపించింది అనసూయ .
“అందరం బాగున్నం. మీరు ఎట్లున్నరు? యాడున్నారు? ” అడిగింది అనంతమ్మ.
“మేము మా ఊర్లనే ఉన్నం.అందరం బాగున్నం…ఈ ఊర్ల మా మ్యానత్త తోటి కోడలి బిడ్డ ఉంటది. సమూర్త పజనం ఉంది వొచ్చినం ” చెప్పి- ” మీ సంగతులు ఏందే?” అడిగింది అనసూయ.
“నీకు తెల్సు కదానే … మా నాయిన కాలం జేసినాక, ఊర్లో బతుకు తెరువు లేక తమ్ముడు ఊరు వదిలిండు. ఇప్పుడు జడ్చర్ల దగ్గర కష్షర్ మిషన్ లో పని చేస్తున్నడు. అమ్మ గూడా అక్కన్నే పనిచేస్తుంది. మా అత్తోళ్ళేమో ఏ ఊర్ల బతుకు తెరువు ఉంటే ఆ ఊరికి తిరుగుతున్నరు … ఇప్పుడు ఈ ఊర్ల ఉన్నం… గిరాకిలు ఏమి లేవు…! ఏందో మా ఒడ్డెరోళ్ల బతుకు ఊరూరు బతుకయ్యింది… ” వాపోయింది అనంతమ్మ.
“మీ ఆయన గూడా అప్పుడు కష్షర్ మిషన్లనే పని చేస్తుండే కదానే ….” అడిగింది అనసూయ.
“మానేసిండు… “
“ఔనా… మల్ల ఇప్పుడు ఏం జేత్తున్నడు? “
“ఈ ఊర్ల పెద్ద దేవుళం కడ్తున్నరు. మా ఆయన… మా మర్ది… మా బావ … దేవుళం పనికి రాళ్ళు కొడ్తున్నరు. దేవుళం అయ్యేవరకు ఈడనే ఉంటం… ” చెప్పింది అనంతమ్మ.
“అట్లనా… మంచిది… ఇంతకు పిల్లలు ఎంత మంది?” అనసూయ అడుగుతుంటేనే
ఎదురు షాపు దగ్గర నుండి అక్కడికి చేరుకుంది లీల.
“ఇదొక్కతే…. మల్ల పిల్లలు గాలేదు…! ” చెప్పి – “నీకు ఎంత మంది? ” అడిగింది అనంతమ్మ.
“నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల….” చెప్పింది అనసూయ.

అదే సమయంలో ~
అనంతమ్మ భర్త నాగరాజు సైకిల్ మీద వచ్చి ఆగాడు.
“బ్యారం ఎంతయ్యింది? ” డబ్బుకు చేయి సాచి అడిగాడు.
“ఒక్క బ్యారం రాలేదు. యాష్ట కొస్తుంది ” చెప్పింది అనంతమ్మ.
“అట్లేట్ల… ” అన్నాడు నాగరాజు.
“నేనేం చేద్దును… ” అంది అనంతమ్మ.
నాగరాజు ఇంకేం మాట్లాడలేదు. ” ఐదొందలైన దొరుకుతయి అనుకుంటి… ఇప్పుడెట్లా… ” తనలో తాను గుణుక్కోసాగాడు.
“ఇప్పుడు పైసలు ఎందుకు? ” అడిగింది అనంతమ్మ.
“మీ తమ్ముడొచ్చిండు. సన్న బియ్యం…. తీసుక పోదాం అనుకుంటి… అట్లనే వేరే కర్సులు గూడ వుండే…” చెప్పాడు నాగరాజు.
“ఎప్పుడొచ్చిండు? ” అనంతమ్మ కండ్లు మెరిసాయి.
“మద్యాన్నం వొచ్చిండు… ” చెప్పి ~ ” బ్యారం లేకుంటే పోయింది…ఇంటికి పో ” చెప్తూనే సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయాడు నాగరాజు.
“నీ మగడు గూడా గుర్తు పట్టకుండా అయిపొయిండు.. ” అంది అనసూయ.
“ఆ…. కాలం ఎప్పుడూ ఒక రీతిన ఉంటదా ” అంది అనంతమ్మ.
“అవున్లే గాని…పోన్ నంబరు ఉంటే ఇయ్యి. అప్పుడప్పుడు పోన్ జేసి మాట్లాడ్త.. ” అడిగింది అనసూయ.
“నాకేం పోన్ లేదే… ఆయన నంబరే నా నంబరు… ” అంది అనంతమ్మ.
“చెప్పు రాసుకుంటా ” అంటూ తన రవికలో దాచుకున్న చిన్న పాత మ్యాన్యూవల్ ఫోను బయటకు తీసి అనంతమ్మ చెప్పిన నెంబర్ ని ఫోన్లో సేవ్ చేసుకుంది అనసూయ.
“సంతల బొమ్మిడి శాపల కోసం వొచ్చింటి. సుట్టాలు ఎదురు జూస్తుంటరు పోతా… ” అంటూనే మళ్లీ రవికలో నుండి పాత పర్సు ఒకటి బయటకు తీసి, అందులో నుండి వంద రూపాయలు తీసి లీల చేతిలో పెడుతూ… ” నేను. మీ యమ్మ సిన్నప్పుడు దోస్తులం… ఏమైనా కొనుక్కొని తిను ” మురిపెంగ చెప్పి ” వొస్తనే ” అనంతమ్మకు చెప్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది అనసూయ.
“పైసలు ఇయ్యే ” అనసూయ వెళ్ళిపోగానే పిల్ల చేతులోంచి వంద తీసుకుంది అనంతమ్మ.
ఇచ్చిన వంద నోటుని మెరుస్తున్న కళ్ళతో చూసుకుంటున్న పిల్ల ముఖం ఒక్కసారిగా వాడిపోయింది.
“వంద రూపాయలు సుద్ది ఇంట్ల జెప్పొద్దు ” చెప్పింది అనంతమ్మ.

సరిగ్గా అప్పడే…
“రోలు ఎట్లా? ” అడుగుతూ గిరాకి వచ్చింది.
“వొంద ” చెప్పింది అనంతమ్మ.
“యాభై చేసి ఇయ్యి” వచ్చినావిడ గీసింది
“రాదు… డెబ్భై చేసి తీసుకో “
“నేను నలభై అడుగుదం అనుకున్న…” తెలివి ప్రయోగించింది ఆవిడ.
“ఎన్ని గావాలే ” గిట్టుబాటు కాకపోయినా దిగొచ్చింది అనంతమ్మ
“ఒక్కటి జాలు ” అంటూ ఉన్నవాట్లో మంచి రోలు కోసం వెతికింది ఆవిడ.
“అన్నీ బాగున్నయి… ” అంటూ ఒకరోలు ఎత్తి అందించింది అనంతమ్మ.
ఆమె ఆ రోలును తన చేతుల్లోకి తీసుకొని అటు ఇటు తిప్పి చూసి, పది రూపాయల నోట్లు ఐదు చేతిలో పెట్టి, అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

అనంతమ్మ కూడా ఇంకా అక్కడ ఉండలేదు. బిడ్డను వెంట తీసుకొని బండిని తోసుకుంటూ ఇంటిదారి పట్టింది. ” మా యన్న మద్యాన్నం వొచ్చిండంటే… మ్యానకోడలు కోసం ఉరికిరావాలే…. ఎందుకు రాలేదబ్బా ” వెళ్తూ మనసులో అనుకుంటుంది.

దారి మధ్యలో పిల్ల అడిగింది.
“గిరాకీ వొస్తే బజ్జీలు తినిపిస్తా అన్నవు “
“ఒక్క రోలే అమ్ముడు బోయింది గదా…రేపు తినిపిస్తలే .. ! .మీ మావ వొచ్చిండంట… జెల్ది పోదం…” అంది అనంతమ్మ.
పిల్ల ముఖం మాడ్చుకుంది.
అది అనంతమ్మ గమనించింది కానీ పట్టించుకోలేదు.

అరగంట తర్వాత ~
నెమ్మదిగా ఇల్లు చేరుకున్నారు.
అప్పటికి బాగా పొద్దు బోయింది. పిల్లలు గుడారాల్లో దూరి ఉన్నారు.
యారాళ్లు బయటే ఉన్న కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. మరిది సమ్మెట కర్రల్ని సరిచేస్తున్నాడు.
బావ బుంగతో దూరం నుండి అవుజుకు నీళ్ళు మోస్తున్నాడు పెద్దవ్వ..పెద్దాయన రాళ్ళ దగ్గర కూచుని ఏదో మాట్లాడుకుంటున్నారు.. మగడు నాగరాజు ఎప్పుడు ఇల్లు చేరుకున్నడో…. సమీపం నుండి సాగిన కరెంటు స్తంభం నుండి ఇల్లీగల్గా లాక్కున్న కరెంటు తీగ కనెక్షన్… గాలికి ఊడిపోవడంతో కర్రతో కొడుతున్నాడు…

అనంతమ్మ కళ్ళు తన అన్న కోసం వేదికాయి. గుడారంలో కూచొని చెల్లెలు కోసమే ఎదురు చూస్తున్న అనంతమ్మ అన్న పరమేషు , అనంతమ్మ కనబడగానే వెంటనే బయటకు వస్తూ
“సెల్లె… బాగున్నవా ” ఎదురొచ్చాడు..
అతడి చేతికి కట్టు కట్టుకుని ఉంది.
“అయ్యో అన్నా… ఏమైంది? ” కంగారు పడింది అనంతమ్మ.
“కష్షర్ కాడ కింద పడ్డ. బొక్క ఇరిగింది. ఈ ఊర్ల పసురు మందు కట్టు కడతరు గదా… అందుకే వచ్చిన.. ” మేనకోడలు తల నిమురుతూ చెప్పాడు.

అనంతమ్మ కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి. కొంగుతో కళ్ళ నీళ్ళు తూడుచు కుంటూ …. “అమ్మ , వొదినే, పిల్లలూ అందరూ బాగున్నరా” అడిగింది.
“అందరం బాగున్నం… ” చెల్లెలిని చూస్తూ అతని మనసు చెరువు అవుతుంటే , ఆమె వీపు తడుతూ చెప్పాడు.

“గిరాకీ ఎంతయ్యింది అనంతా? ” అంతలోనే అడుగుతూ వచ్చింది పెద్దవ్వ..
“ఒక్కటే రోలు… ఇప్పుడే ఇంటికి వొస్తుంటే అమ్ముడయ్యింది… నలభై రూపాయలు ” అంటూ వచ్చిన 50 రూపాయల్లో పది రూపాయల్ని ఎప్పుడో ఇంటికి రాకముందే పక్కకు పెట్టేసుకొని, బండి మీద ఉన్న చెక్క పెట్టేలోంచి నాలుగు పదుల్ని తీసి అత్తకు అందించింది అనంతమ్మ

***

అదే రోజు రాత్రి తొమ్మిది దాటింది …
అందరూ అరుబయట నులక మంచాలు వేసుకుని కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు…..
పిల్లలు అప్పటికే పడుకుని ఉన్నారు.
పెద్దాయన మాట్లాడుతుంటే అందరూ వింటున్నారు-
“ఎనకటికి మన బతుకులు ఎట్లుండేరా… ఉన్న ఊర్లనే పని దొరుకుతుండే…ఈ మాయదారి కష్షర్ మిషన్లు వొచ్చి మన బతుకుల్ని ఆగం చేసే..! మన రాయి లేకుండా ఇల్లు లేదు… బాయి లేదు… బాట లేదు.. బడి లేదు… గుడిలేదు… సస్తే బిందానం గూడా లేదు. అట్టాంటిది ఇప్పుడు పనులు దొరక్క ఆ ఊరు ఈ ఊరు సంచారమాయే…..! ఈ మిషన్లు మీద మన్నుబడా… ” అంటూనే బీడీ వెలిగించుకున్నాడు పెద్దాయన.
ఆ వెంటనే పెద్దవ్వ అందుకుంటూ ~
“ఆ…. ఎనకటి రోజులు తలుసుకుంటేనే దుక్కం వొస్తది….మన రాళ్ళు మనం కొట్టుకుని రాజుల్లాగ బతికేటోళ్ళం…కష్షర్ మిషన్లు వొచ్చి కడుపు గొట్టి… మనల్ని కూలోళ్లను చేసిపెట్టే…. “అంటూ బాధ పడిపోయింది.
“ఆ….! ఎనకటికి మనం రాజులం అంట …! ఆ రాజుల కతలు రాళ్లసాలు… ” పెద్దకొడుకు అందుకున్నాడు.
“కతలు రాళ్లసాలు – సొమ్ము రాళ్ళ పాలు..! సామెతలు ఉన్ననే ఉన్నయి..! మా తాత ఈ కత బాగా చెప్తుండే…ఇవన్నీ ఎనకటి కతలు… చెరిత్ర…! వడ్డె రాజులు…. అంటే వొడియరాజులు… వీళ్ళ వొంశమే మనదంట… అప్పుడెప్పుడో వొందల ఏండ్ల నాడు యుద్ధం చేసి ఓడిపోయి… పట్టుబడకుండా అడవుల్లోకి పారిపోయి… అడవుల్లో బతుకు దెరువు లేక రాళ్లు కొట్టింన్రంట…అట్లా మన కుల వృత్తి రాళ్లు కొట్టడం అయ్యిందని ఒక కత..! కాదు.. ఓడి పోలేదు.. శెత్రురాజులకు దొరకవొద్దని రాళ్లు కొట్టే యేషం కట్టిన్నరని ఇంకో కత..! కాదు… శత్రు రాజుల్ని పట్టుకొనడానికి రాళ్ళు కొట్టె యేషంలో పోయిన్నరని మరొకత…! అట్లా కొందరు … యుద్ధాల తిప్పలు మనకెందుకు … ఈ రాళ్ళు కొట్టుడే బాగుందని అట్లనే ఉండి పోయిన్నరంట… ” చెప్పుకొచ్చాడు పెద్దాయన.
“మనోళ్లకు ఇంకా తెల్వది గాని ఒడ్డె ఓబన్న చెరిత్ర గూడ పెద్దది…” నడిపికొడుకు అందుకున్నాడు.
“అవును… తెల్లోళ్లతోనా కొట్లాడిన చెరిత్ర… ఉయ్యాలవాడ నర్సిమ్మరెడ్డి సైన్యానికి ముందు ఉండి నడిసిన చెరిత్ర… ” అన్నాడు పెద్దాయన.
“అందుకే గదా నాయినా… నా కొడుక్కి ఓబులేశు అని పేరు పెట్టుకున్న…! ఇది చూసి కొందరు అడుగుతుంటరు .. మీరు కర్నూలు దిక్కునుండి వచ్చిన్రా…ఆ దిక్కు పేరు పెట్టిన్నరని…” నడిపి కొడుకు చెప్పుకు వస్తుంటేనే చిన్నకొడుకు నాగరాజు అందుకుంటూ ~
“దిక్కు ఏదైతేనేం..మన జాతి పేరు నిలవెట్టినోడు
మనకు దేవుడు లెక్క ” అన్నాడు.

అట్లా వాళ్ళ మాటలు కులవృత్తి నుండి కష్టనష్టాలనుండి జాతి వరకు మళ్లాయి. అనంతమ్మ ఆ మాటలు వినడం లేదు. ఆమె ఆలోచనలు రేపటి బేరాలు గురించి సాగుతున్నాయి.
“రేపు ఎట్టయినా ఊరు మొత్తం తిరుగాలే. దొరికిన
బ్యారం మొత్తం మీద వొంద రూపాయలు సంపాదించాలే… “

***

మరునాడు పొద్దుటే పరమేషు ఊరెల్లి పోయాడు. వెళ్తూ- ” సెల్లె….! నీకు బావకు పిల్లకు దస్ర పండక్కి బట్టలు తెద్దం అనుకున్న. కానీ నా పరిస్థితి బాగలేదు.మాకు జీతాలు తక్కువొస్తున్నయి. అవి గూడా టైంకు ఇస్తలేరు. అమ్మకు నెల నెలా మందులు కొనాల్సి వొస్తుంది. పిల్లలు ప్రయివేటు ఇస్కూలు ఫీజులు గట్టాలే…! ఇప్పుడు బొక్క ఇరిగింది. పనికి పోలేను. అంత ఆగమాగం అయ్యింది ” బాధగా చెప్తూ…అనంతమ్మ చేతిలో వంద రూపాయలు, మేనకోడలు చేతిలో యాభై రూపాయలు పెట్టాడు.
“వొద్దన్నా. నీ సేతి ఖర్చులకు ఉంచుకో.. ” అంటూ 110 రూపాయలను కూడా అన్న జేబులో పెట్టబోయింది.
“వొద్దు.. వొద్దు.. మీ పరిస్థితి ఏం బాగలేదు నాకు తెల్వంది గాదు .. ” అంటూ చెల్లెలి తల నిమిరి కన్నీళ్ళతో వెళ్లిపోయాడు పరమేషు.

***

తన అన్న వెళ్లిపోగానే ఎప్పట్లా ఊర్లోకి రోలు అమ్ముకోవడానికి బయలుదేరింది అనంతమ్మ. ఆరోజు పిల్లలందరితో కలిసి తన బిడ్డ లీల కూడా బడికి వెళ్ళింది. అందరూ దగ్గర్లో ఉన్న సర్కారు బడికే వెళ్తున్నారు.

మాములుగా చౌరస్తాలో ఒక చెట్టు నీడన పండి పెట్టుకునే అలవాటు.కానీ ఆరోజు అనుకున్న ప్రకారం ఊర్లో సందు సందుకు తిరగాలనుకునే బయలుదేరింది అనంతమ్మ.
“మొత్తం ఇన్నూట అరవై జమైనవి…! ఇయ్యాల వొంద సంపాదిస్తే మున్నూట అరవై అయితది.. ” మనసులోని లెక్కలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నది అనంతమ్మ.

అనుకోకుండా మధ్యలోనే ఎవరో కలవారి కుటుంబం ఎదురయ్యింది.
” విసుర్రాయి, రోలు, రుబ్బురోలు, ఈ మూడు మా ఏదో సంప్రదాయానికి మా పిల్ల వెంట అత్తగారింటికి ఇచ్చి పంపించాలే . ఆ తర్వాత వాటిని వాడేది ఉండదు పెట్టేది ఉండదు పక్కకు పడేసుడే. రేటు చెప్పు ” నిండా నగలతో ఉన్న ఒక ఆవిడ అడిగింది.
“మీరు వాడినా వాడకపోయినా మా కష్టం మాదే కదమ్మా. మూడు ఐదొందలు ఇచ్చి తీసుకోండి.. ” చెప్పింది అనంతమ్మ.
“ఐదొందలా… మూడు కలిపి నూటా యాభై ” మరొక ఆవిడ అంది.
“రాదు తల్లీ… ఇవి మలవడానికి మా సేతులు బొగ్గలు వొస్తయి… ” నల్లగా కందిపోయి ఉన్న చేతులు చూపిస్తూ అంది అనంతమ్మ.
“ఎవరిదైనా కష్టమేలే…మాకైనా పైసలు చెట్లకు కాయ లేదు కదా..” ఇంకొక ఆవిడ అంది.
“మా కష్టాన్ని చూసి మొత్తం నన్నూరు ఇచ్చి తీసుకోండమ్మ ” అభ్యర్థనగా అంది అనంతమ్మ.
“పిల్ల పెళ్ళికి కోట్ల కట్నం ఇస్తున్నం. ఈ వంద రెండొందల దగ్గర బేరం ఏందే? ఆ పిల్ల చెప్పిన మొత్తం 500 ఇచ్చి తీసుకోండి… ” చూస్తూ చూస్తూ అందరికంటే పెద్దావిడ మిగతా వాళ్ళ మీద గయ్యిమంది.
తర్వాత ఎవ్వరూ బేరం ఆడలేదు. 500 రూపాయలు అనంతమ్మ చేతిలో పెట్టి వస్తువులు తీసుకొని వెళ్ళిపోయారు. అనంతమ్మ అనందానికి
అవధులు లేవు.
“ఇంట్లో ఈ మూడింటి లెక్కకు మున్నూట యాభై ఇస్తే … నూట యాభై నేను సంపాదించుకున్నట్టు…..అప్పుడు నాతో ఉన్న మొత్తం ఇన్నూట అరవై కలుపుకుని నన్నూట పది రూపాయలు…! సాయంత్రం వరకు ఇంకో 90 సంపాదించుకుంటే 500 అవుతయి ” మనసులోనే అనుకుంటూ అక్కడే ఓ చెట్టు కింద కాసేపు కూర్చుందామని వెళ్ళింది.

అంతలో మళ్ళీ కనబడింది అనసూయ. ఈ మారు ఒంటరిగా లేదు…చుట్టాలు అందరితో కలిసి ఉంది… చుట్టాల అందరూ ఎదురుగా ఉన్న దుకాణంలో ఏదో కొనుగోలు చేస్తున్నారు . అనసూయ మాత్రం అనంతమ్మతో మాటలు కలిపింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అనంతమ్మ చేతులు చూసి ~
“ఏందే… నేను నిన్న సూడలే…” అనంతమ్మ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది.
“రాళ్ళు కొట్టి కొట్టి ” చెప్పింది అనంతమ్మ.
“ఇవన్నీ నీవే కొట్టి మలిసినవా? ” బండి మీద ఉన్న రోళ్ళు ఇసుర్రాయిలు చూస్తూ అడిగింది అనసూయ.
“నేనే మలిసిన ” చెప్పింది అనంతమ్మ.
“అట్లానావే…!” అని కాసేపు ఆగి ~ ” మీ యారాళ్ళు కూడా ఇదే పనా? అప్పట్లో ఉమ్మడి సంసారం ఉండే ఇప్పుడు ఏర్పాటయ్యిన్రా ” అడిగింది అడిగింది అనసూయ.
“అత్త మామ ఉన్నరు గదా…ఒక్క తాననే ఉన్నం. కానీ ఎవరి సంపాదన వాళ్ళదే…అందరం ఇదే పని. ఎవరి రాళ్ళు వాళ్లే మలుసుకుంటం. ఎవరివి వాళ్లే అమ్ముకుంటం.. ఈ రాళ్ళన్నీ అమ్ముడు పోయినాక నేను మల్లా మలుసుకుంట… ” చెప్పింది అనంతమ్మ.
“మస్తు కష్టం గదనే… నెలకు సంపాదిస్తవు? ” అడిగింది అనసూయ.
“నయాపైసా సేతికి ఇయ్యరు.. పెత్తనం మా యత్త చేస్తది. కోడండ్లది ఏమిలేదు. కష్టం చేసుకుని… అమ్ముకొని… పైసలు అత్త సేతుల్లో పోయాలే…! ” అనంతమ్మ గొంతులో కొంత నిష్ఠూరం ద్వనించింది.
“అయ్యో ” అంది అనసూయ.
“అయినా ఆమె దాసిపెట్టేది గూడ ఏముందిలే …!? పెత్తనం పోవద్దని పైసలు చేతులు తీసుకుంటది గాని, కొడుకులు లెక్కకు లెక్క అడిగి ఎవరి పైసలు వాళ్ళు తీసుకుంటరు… ” చెప్పింది అనంతమ్మ.
“సంసారాలు ఇంతే ” అంది అనసూయ.
ఆ తర్వాత కాసేపు చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత అనసూయ చుట్టాలతో కలిసి ముందుకు వెళ్ళిపోయింది. అనంతమ్మ మెల్లగా తన దారిన బండి తోసుకుంటూ ఎప్పట్లా ” యిసురాళ్ళో… రోల్లో… ” అరుస్తూ ఊర్లోకి బయలుదేరింది.

ఆమె మనసు ఇప్పుడు ఉల్లాసంగా ఉంది జమైన డబ్బులతో కూతురుకు కుచ్చులగౌను కొనివ్వాలని aaramta

మనసులో అనుకున్న ప్రకారం ~ చౌరస్తా దగ్గర ఉన్న
బట్టల దుకాణం వద్దకు వెళ్ళింది. కుచ్చుల గౌను ఇంకా అమ్ముడు పోలేదు. ఎప్పట్లా ఒక కవర్లో పెట్టుకుని వేలాడ తీసుకొని ఉంది. దగ్గరగా వెళ్లి గౌన్ను పట్టుకొని అటు ఇటు తిప్పి చూసింది.
“ఏమ్మా ఎందుకు చూస్తున్నవ్? కొన్నేట్టయితే చూడు. చేతులు పెట్టొద్దు. బట్ట మాసిపోతుంది..” లోపల్నుంచి షేఠు అరిచాడు. అతడి గొంతులో అనంతమ్మ కొనుక్కోలేదని భావన స్పష్టంగా కనిపిస్తున్నది.
“కొంటా సేటు… దర జెప్పు ” అన్నది అనంతమ్మ.
“ఐదొందలు ” చెప్పాడు షేఠు.
“తక్కువ జేసుకో… మున్నూరు ఇస్త ” అంది అనంతమ్మ.
“మాది ఫిక్స్డ్ రేటు షాపు 500కు 5 పైసలు తక్కువ లేదు ” షాప్ లో పనిచేసే అబ్బాయి బయటికి వచ్చాడు.
“పేదోళ్ళం సేటు…” అంది అనంతమ్మ.
“ఒకటే మాట… నాలుగు వొందలు.. ” లోపలి నుంచి చెప్పాడు షేఠు.
అనంతమ్మ ఇంక మాట్లాడలేదు ఆలోచనలో పడింది.
వచ్చిన అబ్బాయి లోపలికి వెళ్ళిపోయాడు.
“చిట్టితల్లి కండ్లల్లో ల్లో సంతోషం కోసం కొనుక్కోవాలె ” ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని షాపులోకి నడిచింది.
“ఇయ్యండి సేటు ” చెప్పింది.
ఇందాకటి అబ్బాయి ఆ గౌను తీసి ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేయడం మొదలెట్టాడు.

సరిగ్గా అప్పుడే ~
“ఎందే ఏం కొంటున్నావు? ” నేరుగా దుకాణంలోకి వచ్చాడు భర్త నాగరాజు.
“దస్ర పండక్కి పిల్లకు అంగి కొనుక్కోమని మా యన్న పైసలు ఇచ్చి పోయిండు… ” చెప్పింది అనంతమ్మ.
“ఖానాకు గతి లేదు అంటే ఎల్లికి బులావ్ అన్నట్టుంది… పిల్లకు ఇప్పుడు బట్టలు ఎందుకు? దస్ర బట్టలు నేను కొంటా గాని, ఆ పైసలు ఇయ్యి…! మేస్త్రి నాకు ఇచ్చిన సమ్మెట ఎవడో ఎత్తుకుపోయిండు….ఇప్పుడు కొత్త సమ్మెట కొనాలే. లేదంటే పోగొట్టింది మనం కాబట్టి జీతంల పట్టుకుంటరు ” అన్నాడు నాగరాజు.

అనంతమ్మ ఏం మాట్లాడలేకపోయింది. గుండె బరువెక్కింది. మాట గొంతు దాటలేకపోయింది.
వాడగాలిలా ఏ బాధనో నిలువెత్తున సాధిస్తుంటే నాలుగు వందలు తీసి భర్త చేతిలో పెట్టింది.

డబ్బులు తీసుకుని నాగరాజు వెళ్ళిపోయాడు.
ఆమెకు అంతా తెలుసు…
దసరాకు కూడా ఆ గౌను ఇంటికి రాదనీ… అందుకే
షాపు నుండి నిరాశతో కాదు ఊబికి వస్తున్న దుఃఖంతో బయటకు వచ్చింది…

కుచ్చుల గౌను….
మళ్ళీ దుకాణం ముందు వేలాడింది…
** **

పదాలకు అర్థాలు :

  1. చెలిగిన = చెట్టు అడ్డదిడ్డంగా పెరగకుండా పక్క కొమ్మల్ని నరికి నిటారుగా తయారు చేయబడటం.
  2. యాష్ట = అలసట
  3. బిందానం = సమాధి
  4. ఇన్నూరు = 200 అని అర్థం
  5. మున్నూరు = 300 అని అర్థం.
  6. నన్నూరు = 400 అని అర్థం

కవయిత్రి, కథా రచయిత, విమర్శకురాలు, పరిశోధకురాలు. పూర్వ పాలమూరు జిల్లా ఆత్మకూరులో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ.(తెలుగు సాహిత్యం) చదివారు. పీఎచ్‌డీ పరిశోధన చేశారు. రచనలు : ఇప్పటి వరకు 10 నవలలు, 70 కథలు, వందలాది వ్యాసాలు, కవితలు రాశారు. అవార్డులు : 1. తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించే ‘కీర్తి పురస్కారాన్ని 2015 సంవత్సరానికి సంబంధించి ‘వాసిరెడ్డి రంగనాయకమ్మ’ స్మారక అవార్డు (నవలా విభాగంలో) పొందారు. 2. తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ధర్మనిధి పురస్కారం. పాకాల యశోద రెడ్డి అవార్డు (2023). ప్రస్తుత నివాసం హైదరాబాద్‌.

 

 

Leave a Reply