కాలాన్ని కాపలా కాచే కవిత్వం

కాలానికి కళ్ళుంటే అది దేని చూస్తుందో, కాలానికి చెవులుంటే అది దేనిని వింటుందో, కాలానికి నోరు ఉంటే అది దేని గురించి మాట్లాడుతుందో కవిత్వం కూడా అదే చేస్తుంది. కవిత్వం కాలాన్ని కాచుకున్న కాపలాదారు కదా! నడుస్తున్న కాలాన్ని కదిపితే కవిత్వమై మనతో సంభాషిస్తుంది.
“సరే ఈ రాత్రి ఏం చేస్తాం
కనీసం కలలైనా కందాం
మనుషులమని మనకు మనమైనా గుర్తెరగటానికి
కాసేపు కలలైనా కనాలిగా!” అంటూ కలగనే ఆశను, కలల్ని కూలుస్తున్న వ్యవస్థల్ని గుర్తుచేస్తుంది.

యీ వాక్యాల నడుమ పాతికేళ్ల యువకుడి గుండెల్లో సంఘర్షణ ఇతనిదొక్కడిదే కాదు, ఈ తరానిది. కవి గూండ్ల వెంకటనారాయణ ఇటీవల వెలువరించిన ‘కాపలాదారుల పాటలు’కవితా సంపుటిలో కవితల్ని చదువుతుంటే తెలివిమాలిన లోకాన్ని, జడత్వంతో బండబారిపోయిన ఈ లోకాన్ని వెలుగులోకి పిలుస్తున్న స్నేహ వాక్యం వినిపిస్తుంది. ప్రేమ పదం కరచాలనం చేస్తుంది. చిమ్మ చీకటి కమ్మిన సమూహంలోకి బుడ్డీదీపాన్ని చేత పట్టుకుని నడిచి వస్తున్న యువరక్తం మన ముందు నిలబడుతుంది. దుఃఖంగా కోపంగా బాధ్యతగా ప్రేమగా తమ రేపటిని కలలో ఒత్తిలేసుకుని కాపలా కాచుకుంటున్న గొంతు ఒకటి పలరిస్తుంది.

మనం సూర్యుణ్ణి కలగందాం.
లేకుంటే, పొద్దు పొడుపు వరకూ ఎందుకు?
ఈ చీకటిలో నక్షత్రాలనే కలగందాం.

మనం సూర్యుడు, నక్షత్రాల గురించి మాట్లాడుతుంటే మన వాళ్ళ కన్నీళ్ళు ఈ తల్లి చీరకొంగు చివర ఇంకిపోతున్న తడి తగుల్తోంది/ అంటున్న వాక్యాలు మనసుని చుట్టుకుంటాయి.
బుల్డోజర్ చేతులతో హృదయాల మధ్య అగాధాలు, విద్వేషపు కాలువలు తవ్వుతూ తమ ఎత్తులులను పారిస్తున్న దుర్మార్గపు చర్యల్ని చూపెడుతుంది. దేశభక్తి అంటే ద్వేషభక్తిగా పరిణమించిన రోజులను ఎలా చక్కబెట్టుకోవాలో అలోచనలు అల్లుతుంది. నిర్వీర్యం చేస్తున్న దేశ వనరులు, వనరుల దోపిడీ తరాలకుతరాలను చీకటి గుహల్లోకి మళ్లించి తమ మూఢత్వాలకు వైభవోపేతంగా ఊరేగింపు చేసుకుంటున్న రాజ్యం, మనిషి శత్రువుగా అంతటా తిరిగటం మన కళ్ళతో మనం చూస్తాం. పొలం గట్ల మీద కూలి అడ్డాల్లో, అడవుల్లో కునుకుపాట్లు పడుతూ,నిద్రలేని రాత్రులని తమ బీడీల పొగల్లో ఖర్చు చేస్తున్న శ్రమజీవుల గుండెచప్పుడు ఈ సంపుటిలో మనల్ని కదుపుతోంది.

ఈ కవితలు కేవలం కవి చెప్పిన చలికాలానికి మాత్రమే వర్తించే కవితలు అని మాత్రనే అని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే ఈ దేశంలో అన్నీ కాలాలు విషాదంగా కన్నీరు పెట్టుకుంటున్నాయి. కాలం కన్నీళ్లను తుడిచి చేతులువంటి ఈ కవితల్ని మనందరి చేతుల్లో కొవ్వొత్తులగా వెలిగించుకోవాల్సిన సంధర్భంలో బతుకుతున్నాం కనుక. ఏ వాక్యం ముట్టుకున్నా చెమట వాసన వస్తుంది. వొంటికి, మనసుకి పులముకుంటే మనుషులుగా చిగురిస్తాం. ఆశగా, నమ్మకంగా రేపటిని కాపలా కాచుకుంటాం. అచ్చమైన మట్టి పాదాలతో మట్టి దారుల వెంట నడుస్తున్న పిల్లవాడి గుండె చప్పుడై కైగట్టిన కవితను చదవండి…
“కైపెక్కిన రాత్రి”
చీకటిలో మగ్గే రాత్రుల గురించే మాట్లాడుకుందాం ఇక్కడే మన ఒడలిపోయిన ప్రేమల గురించి
మనసు విప్పి దుఃఖించగలం
తాగివాగే మనుషుల విషాదాల గురించి చర్చించగలం

ఈ చీకటిలోనే నువ్వూ నేనూ
ఒకటనే విషయం తెలుస్తోంది
పగలు మన మధ్య మతం, కులం, దేశం
అడ్డు రావచ్చు గాక
కానీ ఈ రాత్రిలో
చిక్కగా పండిన ఈ చీకటిలో
మన ఆత్మల కైపులు నిజాలను కక్కుతాయి.

దోరగా పండిన రేగిపళ్ళ సోపతి కదా మన మధ్య వంతెన!
ఏ కాషాయమో వస్తే ఏం?

బురఖా కళ్ళ అందం కదా ఈ దేశం
దాని ముందు ఎన్ని వేల సంవత్సరాల సనాతనం అయినా బలాదూరే.

తాగి వాగుతున్న ఈ పిచ్చోడు
ఒక సిగరెట్ వెలుగులో కవిత్వం రాస్తున్న ఈ దేశద్రోహి
ఈ దేశానికి ప్రేమను కానుక చేస్తున్నాడు.

రేపు పోరాటాలు జరగవచ్చు గాక
నెత్తురు పారవచ్చు గాక
కానీ ఈ తాగినవాడు చెప్పే తత్వం తప్పదు
ఇది ప్రేమల బాగ్ దేశం కాక మానదు.

సుర్మా కన్నుల సోయగాలు
ఈ నేలంతా వీచగ ఎవడూ ఆపడు
పోలేరు కుంకుమ ఎర్రని విప్లవం
దేశపు నరాలలో నెత్తురై పారక మానదు
నల్లవాడి వెన్నెల పతాకం ఎగరక మానదు.

అప్పటికి ఈ తాగుబోతోడు మిగిలి ఉంటే
ఒక పసిపాప నవ్వుని
గుండెలపై ఈ జాతి చిత్రపటంగా గీసి
ఇది మన దేశం అని చాటించండి.

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply