కాలం నుదుటిపై చందనమై మెరిసిన కవిత్వం: రవీంద్రనాథ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాం కవితలు

అది 1938. రవీంద్రనాథ ఠాగూర్ నవల గోరా (1909)ని సినిమాగా తీయాలని దర్శకుడు నరేష్ చంద్ర మిత్రా నిర్ణయించున్నాడు. సంగీత దర్శకత్వం ఎవరు నిర్వహించాలనే చిక్కు సమస్య వచ్చిపడింది. రవీంద్రనాథ ఠాగూర్ అప్పటికి ఇంకా సజీవంగానే ఉన్నాడు. కొంచెం ఆలోచించిన తర్వాత కవి, గాయకుడు కాజీ నజ్రుల్ ఇస్లాం ని అడిగాడు. నజ్రుల్ ఇస్లాం అప్పటికే బెంగాలీ కవిత్వంలో, సంగీతంలో గుర్తింపు సంపాదించి, ఉచ్ఛ దశలో ఉన్నాడు. నజ్రుల్ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. అయితే, విడుదలకి ముందు ఇబ్బంది వచ్చి పడింది. రవీంద్రుని సంగీతంపై సర్వహక్కులు విశ్వభారతివి. నజ్రుల్ ఇస్లాం పట్ల రవీంద్రనాథ ఠాగూర్ కి ఉన్న ప్రేమాభిమానాలపట్ల ఎందరికో అసూయ ఉండింది. అదే కారణమో, మరొకటో గాని విశ్వభారతి ఆ సినిమా సంగీతాన్ని గుర్తించ నిరాకరించింది. అది రవీంద్రుని సంగీత స్థాయికి తగినది కాదన్నది. సినిమా ఆగిపోయే పరిస్థితి. సినిమా రీళ్ళనీ, ప్రొజెక్టర్ నీ తీసుకుని నజ్రుల్ ఇస్లాం రవీంద్రుణ్ణి కలవడానికి శాంతినికేతనానికి బయలుదేరాడు. రవీంద్రునికి విశ్వభారతి ప్రతినిధులు తమ వాదనని విన్పించారు. ఇక సినిమాలో తన సంగీతాన్ని విని చూడమని నజ్రుల్ రవీంద్రుని కోరాడు. ‘ఈ పనికిమాలిన చెత్తంతా ఎందుకు. నీ పాటలకి, సంగీతానికి వంకలు పెట్టడానికి వాళ్ళెవ్వరు? నా పాటల్ని నీకంటే బాగా అర్ధం చేసుకున్నామని వాళ్ళు అనుకుంటున్నారా? నా పాటలని నీకంటే గొప్పగా గౌరవిస్తారా వాళ్ళు?’ అని రవీంద్రుడు జవాబు ఇచ్చాడు. సినిమా చూడాల్సిన అవసరమే లేదని, విడుదలకు అవసరమైన సంతకాలు చేసి పంపించాడు. ఆ సినిమాలో గ్రామ్ చరా ఓయి రంగా మాటీర్ పథ్ (గ్రామానికి అవతల ఎర్రటి మట్టి దారిలో) అన్న గీతానికి నజ్రుల్ సమకూర్చిన సంగీతం ఆనాటి కాలానికి ఎంతో ముందున్నదనీ, ఆ పాటని విని ఉంటే రవీంద్రుడు ఆశ్చర్యపోయేవాడని అంటారు.

బెంగాల్ సాంఘిక, సాంస్కృతిక మేధో పరిణామంలో పునర్వికాసం (రినైజాన్స్) రెండు శతాబ్దాలు కొనసాగిందని చరిత్రకారులు చెబుతారు. ప్లాసీ యుద్ధానంతరం రాజారామమోహన్ రాయ్ నుండి రవీంద్రనాథ ఠాగూర్ వరకూ ఈ పునర్వికాసం రెండు శతాబ్దాలు కొనసాగింది. ఈ పునర్వికాస సాహిత్య, సాంస్కృతిక రంగాలలో రవీంద్రనాథ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాంలది ముఖ్య భూమిక. ఇద్దరి మధ్యా వయసులో 38 సంవత్సరాల అంతరం ఉన్నది. అయినా, బెంగాల్ సాహిత్యంలో, సంగీతంలో ఇద్దరూ దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా సమకాలికులుగా ఉన్నారు. నజ్రుల్ కు రవీంద్రుడంటే వల్లమాలిన గౌరవం. నజ్రుల్ ని రవీంద్రుని కవితలని కంఠస్తం చేసిన ‘హఫీజ్’ అని పిలిచేవారిమని ముజఫర్ అహ్మద్ తన జ్ఞాపకాలలో రాశాడు (ఖురాన్ ని కంఠోపాఠంగా చదివే మనిషిని గౌరవ పూర్వకంగా హఫీజ్ అని పిలుస్తారు). రవీంద్రునికి నజ్రుల్ అంటే అమితమైన వాత్సల్యం. నజ్రుల్ తన కథలలో, బంధన్ హారా నవలలో రవీంద్రుని కవితా పంక్తులని విస్తారంగా ఉపయోగించాడు. నజ్రుల్ ‘ధూమకేతు’ పత్రికను ఆహ్వానిస్తూ రవీంద్రుడు చిన్న కవితను పంపాడు (ఆగస్టు 1922). ‘నజ్రుల్ మన దేశానికి వసంతాన్ని తీసుకొని వచ్చాడు గనక నా ఇటీవలి నృత్య రూపకం ‘బసంతో’ని తనకి అంకితమిస్తున్నానని రవీంద్రుడు పేర్కొన్నాడు (ఫిబ్రవరి 1923).

రవీంద్రుడు నజ్రుల్ ని ఇంతగా అభిమానించడం కొందరికి నచ్చలేదు. అసూయతో వివాదాన్ని రేకెత్తించారు. 1926 నాటికి ఇది తీవ్రమైన రూపం తీసుకుంది. శరత్ ను కూడా ఇందులోకి లాగారు. రవీంద్రుని అనుచరులలో కొందరు, నజ్రుల్ లక్ష్యంగా వ్యంగ్య కవితలనీ, విమర్శలనీ ప్రచురించారు. కాజీ నజ్రుల్ ఇస్లాం కవిత ‘అనామిక’ కి వ్యంగ్య విమర్శగా గాజీ అబ్దుల్ బిత్కెల్ పేరుతో ‘బొటనవేలు’ అనే కవితని ప్రచురించారు (అనామిక అంటే ఉంగరం వేలు అని కూడా అర్ధం). ఇంకా, నజ్రుల్ కవితలు, అనామిక, మాధోబీ ప్రొలాప్, గోపోన్ ప్రియ వంటి కవితలు అసభ్యకరంగా ఉన్నాయని సజనీకాంత దాస్ వ్యాసం రాసి రవీంద్రుని దగ్గరకు వెళ్ళాడు. మదుకర్ కాంజీలాల్ ‘తోమాదేర్ ప్రతి’ (నీ కోసం) అనే శీర్షికతో ‘విద్రోహి’ కవితపై వ్యంగ్య కవితని రాశాడు. శనిబారెర్ చిట్టీ పత్రిక ఈ దాడికి కేంద్రంగా నిలిచింది. 1927 లో ‘కోచి ఓ కచ’ అనే ఒక ఐదు అంకాల నాటికని ప్రచురించారు. అందులో మగ పాత్రల పేర్లు, ఎడిటర్, కార్ల్ మార్క్స్, షెల్లీ, లెనిన్, ట్రాట్స్కీ, విట్మన్, ప్రొలెటేరియట్ బైరన్. స్త్రీ పాత్రల పేర్లు ‘బౌదీ’ (మరదలు), పోత్లీ , ఖేడీ, ‘చింపిరి గుడ్డ’, ‘విరిగిన గాజు’, ‘రాలిన వెంట్రుక’ వగైరాలు. ఇందులో ఉద్దేశించిన అసలు వ్యక్తుల పేర్లు – కార్ల్ మార్క్స్ (ముజఫర్ అహ్మద్), ట్రాట్స్కీ (సౌమెన్ ఠాకూర్), ప్రొలెటేరియట్ బైరన్ (నజ్రుల్ ఇస్లాం).

ఆధునిక సాహిత్యం అని పిలిచే దానిపైన, ప్రత్యేకించి నజ్రుల్ ఇస్లాం పైన వ్యక్తిగతంగా ఎక్కుపెట్టిన దాడి ఇది. ఇందులో హిందూ స్త్రీ, బ్రహ్మసమాజికురాలు ప్రమీలా సేన్ గుప్తాని నజ్రుల్ ఇస్లాం పెళ్లి చేసుకోవడం పై అక్కసు కూడా ఇమిడి ఉంది. ఆధునిక సాహిత్యమనే దానిపై రవీంద్రుడు, శరత్ లు భిన్నమైన వైఖరులు తీసుకున్నారు. మన సాహిత్యంపై పరదేశీ ప్రభావం ఒక విధమైన అహంకారాన్ని తీసుకొచ్చిందని, దానిని రవీంద్రుడు ఈసడించాడు. శరత్ ఆధునిక సాహిత్యకారులని బలపరిచాడు. నజ్రుల్ ఇస్లాం కవిత ‘కంధారీ హుషియార్’ కవితలో ‘రక్త’ అనే పదానికి బదులు ‘ఖూన్’ అనే అరబిక్ – పర్షియన్ పదాన్ని వాడినందుకు తనని రవీంద్రుడు తప్పుపట్టాడు. ఈ నేపథ్యంలోనే ‘గొప్ప మనిషి ప్రేమ ఇసుకవంతెన (బోరోర్ ప్రీతి బాలిర్ బాంధ్)’ అనే డిసెంబర్ 1927 వ్యాసంలో నజ్రుల్ ఇస్లాం తన వాదననీ, వేదననీ వ్యక్తం చేశాడు. ఈ వివాదాన్ని బెంగాలీ సాహిత్యంలో ‘ఖూనేర్ మామ్లా’ (నెత్తుటి సమస్య) అని పిలుస్తారు.

1927 చివరలో ఈ వివాదాన్ని చల్లార్చే ప్రయత్నాలలో భాగంగా రవీంద్రుని అధ్యక్షతన ఒక సాహిత్య సమావేశం జరిగింది. మొదతిరోజు జరిగిన చర్చలని వక్రీకరించి కథనాలు రావడంతో రెండురోజులలో తన ప్రసంగాలతో పాటు, ప్రశ్నలు, జవాబులని ఠాగూర్ ప్రచురించాడు. ఆధునికవాదాన్ని మొండిగా ఖండించే వైఖరిని రవీంద్రుడు తిరస్కరించాడు. సాహిత్య విమర్శలో సరైన దృక్పథాన్ని అనుసరించాలని కోరాడు.

ఈ వివాదం సద్దుమణిగి రవీంద్రనాథ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాంల మధ్య సంబంధాలు మళ్ళీ మెరుగుపడ్డాయి. 1935 ఆగస్టులో నాగరిక్ పత్రికకి ఏదైనా ఒకటి రాసి పంపమని రవీంద్రుని కోరుతూ నజ్రుల్ ఒక లేఖ రాశాడు. 75 ఏళ్ల వార్ధక్యంలో, ఆరోగ్యం సహకరించని పరిస్థితులలో తన అశక్తతని వ్యక్తం చేస్తూ రవీంద్రుడు జవాబు రాశాడు. జవాబు చదివి చలించిపోయిన నజ్రుల్ ‘తీర్థపథిక్’ అనే కవిత రాశాడు. రవీంద్రుడు చనిపోయిన తర్వాత ‘రబిహారా’ (రవీంద్రుడిని కోల్పోయాం) అనే గొప్ప కవితనీ, ‘ఘుమాయితే దావో శ్రాంతో రబిరే (అలసిన రవీంద్రుని నిద్రపోనివ్వండి అనే అద్భుతమైన పాటనీ రాశాడు. ఇంకొక రెండు కవితలని కూడా నజ్రుల్ రాశాడు. రబిహారా కవితని ‘మనం ప్రకాశమానమైన రవిని కోల్పోయాం’ అనే శీర్షికతో వరవరరావు అనువదించారు. ఇటీవలే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ‘విద్రోహి’ పుస్తకంలో ఆ అనువాదాన్ని మనం చదవవచ్చు.

ఒక కవిని ఏ కాలంలోనైనా నిలిపి వుంచేదేమిటి? ఎందుకు మనం కవులని చదువుకుంటాము, గుర్తు చేసుకుంటాము? వరవరరావు తెలుగులో ఆవిష్కరించిన నజ్రుల్ ఇస్లాంని తెలుగు పాఠకులు తలచుకుంటున్న సందర్భంలో, రెండు కవితలని గుర్తు చేసుకోవడం సమంజసంగా ఉంటుంది. బెంగాలీ సంవత్సరం 1300 (1893)లో రవీంద్రనాథ ఠాగూర్ వంద సంవత్సరాల తర్వాత కాలాన్ని తలచుకుంటూ 1400 సంవత్సరం అనే కవితని రాశాడు. నజ్రుల్ ఇస్లాం అప్పటికి ఇంకా పుట్టలేదు. 32 సంవత్సరాల తర్వాత, 1925లో రవీంద్రనాథ ఠాగూర్ ఊహలకి జవాబుగా అదే పేరుతో నజ్రుల్ ఇస్లాం ఇంకో కవిత రాశాడు. రవీంద్రనాథ ఠాగూర్, నజ్రుల్ ఇస్లాంల ఆ రెండు కవితలని చదువుకుందాం..

1400 సంవత్సరం
-రవీంద్రనాథ ఠాగూర్
అనువాదం: సుధా కిరణ్

వంద సంవత్సరాల తర్వాత
నా కవితని కుతూహలంతో చదువుతున్న మనిషీ
వంద సంవత్సరాల తర్వాత
ఈ నవ వసంత ఉషోదయం
వికసించే పూలు
పక్షుల పాటలు
అనురాగ భరిత అరుణిమ
ఇవి వేటినీ నీకు నేను అందించలేను

అయినా, ఒక్కసారి ఆ దక్షిణపు తలుపు తెరిచి
కిటికీ వారగా కూర్చో
సుదూర దిగంతాలవైపు దృష్టి సారించి
ఒక్కసారి ఊహించుకో
వంద సంవత్సరాల క్రితం ఒకానొక రోజున
చంచల పులకాంకిత రాశి ఏదో
స్వర్గం నుంచి జారి భూమి హృదయాన్ని తాకింది
ఫాల్గుణ మాసపు తొలి వేకువ వలే
బంధనాలు తెంచుకున్న ఉన్మత్త ఆనందమేదో
తేలియాడే పూల సౌరభాన్ని రెక్కలమీద మోస్తూ
దక్షిణపు గాలి వడివడిగా పరుగులు తీస్తూ
భూమిని యవ్వనపు రంగులతో ముంచెత్తింది
వంద సంవత్సరాలకి పూర్వం ఒక రోజున
ఆ రోజున అక్కడ ఒక కవి మేల్కొని ఉన్నాడు
హృదయం నిండా పాటలతో
ప్రేమతో పూల వలే వికసించే మాటలకోసం
వంద సంవత్సరాల క్రితం ఆ రోజున

వంద సంవత్సరాల తర్వాత
మీ చుట్టూ పాటలై వినిపించే
ఆ నవ కవి ఎవ్వరో?
ఆ కవికి నా ఈ వసంతపు ఆనంద అభినందనలు
మీ వసంత కాల గానంలో
వందసంవత్సరాలకి పూర్వం
నా ఈ వసంతదినపు ధ్వనులనీ
తేనెటీగల పాటలనీ, చిగురుటాకుల గుసగుసలనీ
మీ హృదయంలో ప్రతిధ్వనించనీయండి

1400 సంవత్సరం
-కాజీ నజ్రుల్ ఇస్లాం
అనువాదం: సుధా కిరణ్

వంద సంవత్సరాల క్రితం
కవీ, మమ్మల్ని ప్రేమగా తలచుకున్నావు
వంద సంవత్సరాల క్రితం

మార్మికుడా, రహస్య శిశువా
కళ్ళకు గంతలను తొలగించుకుని
సుదూర స్వర్గం నుండి ఎప్పుడు దిగివచ్చావు?
దక్షిణ దిశనుండి మా కిటికీ తెరిచి
రహస్య స్వప్న సంచారీ
వసంత సౌరభ వీచికవై వచ్చావు
వంద సంవత్సరాల తర్వాత ఒక రాత్రివేళ నీ కవితను చదువుతున్న వేళ
పరధ్యానపు సీతాకోక చిలుక వలే బాధతో మెరిసే సజల నయనాలతో
సడిచేయని రెక్కలు అల్లార్చుకుంటూ ఉదాసీనంగా వెళ్ళిపోయావు
వంద సంవత్సరాల తర్వాత
యవ్వనపు మార్దవాన్ని అద్దిన
నీ కవితని మేము ప్రేమగా, శ్రద్ధగా చదువుతూనే ఉంటాము
రెప్పలు మూతపడుతున్న కునికిపాటులో, కలల తలపులలో,
ప్రియురాలు నీ గీతాన్ని వింటున్నది
సజలనయనాలతో
ఈ రోజుకీ
ఆ మూసివున్న దక్షిణపు కిటికీ మళ్లీ , మళ్ళీ తెరుచుకుంటూనే వున్నది.
అలుపెరుగని వసంత పవనం వేదనతో రోదిస్తూనే వుంది
మనసులలో, వనాలలో, చిగురుటాకుల గుసగుసలలో
కన్నీళ్ళలో తడిసిన పూలు రాలిపడుతూనే వున్నాయి మళ్ళీ, మళ్ళీ

పూల నల్లని కనురెప్పలు మెల్లగా అల్లాడుతున్నాయి
తుమ్మెదలు ప్రియురాలి అధరాలనుంచి తేనెలు గ్రోలుతున్నాయి

నల్లని కనుల పూల మొగ్గలు గాలికి సుతారంగా ఊగుతున్నాయి
పూల పుప్పొడిని పులుముకున్న తేనెటీగలు మకరంద మాధుర్యాన్ని గ్రోలుతున్నాయి
పక్షులు ప్రేమ గీతాలు పాడుతున్నాయి
యవ్వనపు అరుణకాంతిలో వనకన్య అలంకరించుకుంది
గాలి తెమ్మెర ప్రేమ పలకరింతలతో
పుడమి పులకాంకితమౌతున్నది

వంద సంవత్సరాల తర్వాత, నీ ఆలోచనలలో లీనమై
కవీంద్రుడా, నీ కవితని ఆరాధనతో చదువుతున్నాను
నీ పిలుపుతో, నీ సంగీతంతో నేను మేల్కొంటాను
నీ చతురతని అర్ధం చేసుకున్నాను
మా యవ్వన జీవితంలోకి నువ్వు రహస్యంగా అడుగుపెడతావు
మా కవిత్వంలో, సంగీతంలో, రంగురంగుల స్వప్నాలలో నిండిపోతావు
నిత్య యవ్వన కవీ,
ఇప్పుడు వికసించిన పూలు, పక్షుల పాటలు
అరుణ రాగ రంజిత ఉదయాలు
నీ ప్రేమలో మరింత అందంగా తయారయ్యాయి
వసంత ఉత్సవపు వేకువలలో
మా యవ్వన వేడుకలలో నువ్వూ ఒక పాటవయ్యావు
ప్రియ బాలకుడా, చిర ప్రేమికుడా
యువతీ, యువకులు నీ సమాగమానికై నిరీక్షిస్తున్నారు
ప్రియకవీ, పాడు, పాటలు పాడు
వికసించే పూల మధ్య నువ్వు పాడే పాటలు
నేనూ, నా ప్రియురాలూ పాడుకునే పాటలు
నన్ను నిద్రపుచ్చే పాటలు
నడిరేయి నిద్రలో కలగంటాను
నా ప్రియురాలు విలపిస్తోంది, ‘ప్రియకవీ, స్నేహితుడా, జ్ఞానీ..’
హఠాత్తుగా కల చెదిరిపోతుంది
ప్రియురాలి సజల నయనాలని నేను చూస్తాను
ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటాను
వంద సంవత్సరాల క్రితం
నువ్వు మేల్కొన్నావు, ఇతరులని మేల్కొల్పావు
నీ మాటతో ఒక విషాద రాగం రెక్కలు చాచి ఎగిరిపోయింది
కిటికీలోంచి ఒక్కక్షణం పాటు వెనక్కి తిరిగి చూసి
నీ కనురెప్పల మధ్య కన్నీటి పొరని అది ముద్దాడింది
పూల మొగ్గల ముంగురులని సవరించి ఎగిరిపోయింది
చెమ్మగిల్లిన నీ నయనాలతో
నీ మాటలు మొగ్గతొడిగాయి, కొన్ని వికసించాయి
మరికొన్ని ప్రతిధ్వనించాయి
నీ మాటలు మా కలలలో నిలిచిపోయాయి

హఠాత్తుగా ఒక తలుపు తెరుచుకుంది
వసంతపు వేకువ సమయాన నీ పలకరింపు మమ్మల్ని చేరుకుంది
వందసంవత్సరాల క్రితం నువ్వు పంపిన వసంత దూతిక
మాలో కోరికలని రగిలించింది

కవి చక్రవర్తీ, మేము నిన్ను చూడలేదు
నువ్వు నిర్మించిన తాజ్ మహల్
కాలం నుదుటి పైన చందనంలా మెరుస్తోంది
మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది
మేము మా యవ్వనాన్ని నిందించుకుంటాము,
‘వంద సంవత్సరాల తర్వాత ఎందుకీ యౌవనమ’ని
ముంతాజ్ ని మేము చూడలేకపోయాము

కవి చక్రవర్తీ, వేయి సంవత్సరాల తర్వాత
కొత్త కవులు నిన్ను కీర్తిస్తూనే వుంటారు
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పాటలు నీ గొప్పదనాన్ని పాడుతూనే ఉంటాయి
నీ చేయిజారిన గీతాలు
అరణ్యాలలో నీ సందేశాలని కొత్తగా వినిపిస్తూనే ఉంటాయి

మా కాలంలో
వీణలు వందల బాణీలు వినిపిస్తాయి
ఇంకా తనివితీరదు
వంద సంవత్సరాలు దాటినా నీ సంగీతం ఇంకా మా కలలలో ప్రయాణిస్తూనే వుంది
నిత్య రవీ,
శాశ్వతంగా మాకు వెలుగును అందించేందుకు
కవి సుదూర దిగంతాలలో నిలిచిపోయాడని అనిపిస్తుంది

వంద సంవత్సరాల క్రితం,
నువ్వు మమ్మల్ని ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించావు
ఈ రోజు మేమూ నిన్ను అలాగే పలకరిస్తాము
నీ పాదాల దగ్గర పూలమాలని అలంకరిస్తాము

మహాకవీ, మా మధ్య నువ్వు అసంపూర్ణంగా, మృదువుగా, నిశ్శబ్దంగా నడయాడావు
వంద సంవత్సరాల తర్వాత
వణికే నా బొంగురు గొంతుతో
నీ వసంత గీతాన్ని కానుకగా పంపుతున్నాను

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply