రచయితలు రాజ్యం చేతిలో బందీలయినపుడు ఆ నిర్భంధ పరిస్థితుల్లో నిరీక్షణ, మానవీయ సంబంధబాంధవ్యాలు, నిరాశ, నిస్పృహలను ఏదో రూపంలో వ్యక్తీకరిస్తారు. జైలులో ఖైదీల ఆరాటాలు, ఆవేదనలు, ఉద్వేగాలను ‘ఆంధ్రప్రభ’ పత్రికకు ఒక కాలమ్‌గా రాయడం కవి వరవరరావు గారికి పరీక్షలాంటిదే. బయటి ప్రపంచంలోని సమాచార నేపథ్యంలో లోపలి వాస్తవాల దృష్టికోణం నుంచి రాసిన కవిలేఖలు ఒక రాజకీయ తాత్విక కవితాత్మక ఆలోచనలు పాఠకులను కదిలిస్తాయి. రచయితలు తమ జైలు అనుభవాలను అక్షరీకరించడం సహజమైన చర్య. చాలా మంది రచయితలు జైలు నుంచి బయటకు వచ్చాక అక్కిడి బాధలు, వేదనలు, అనుభవాలను రచనలుగా ప్రచురించారు. కవి వరవరరావు గారికి జైలు నుంచే తన పేరుతో ‘జైలు లోపలి నుంచి’ ఒక రెగ్యులర్ కాలమ్ రచన చేసే అపూర్వ అవకాశం లభించింది.
సికిందరాబాద్ కుట్రకేసు, రాంనగర్ కుట్ర కేసులలో నిందితుడిగా ముషిరాబాద్ జైలులో ఉన్నపుడు వరవరరావు జైలు నుంచి కవితామయమైన లేఖల సమాహారమే ‘సహచరులు’. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీయార్ పాలనలో 1985`89 మధ్యకాలంలో ‘ఆట పాట మాట’ బంద్ చేసి అత్యంత దారుణమైన అణిచివేత అమలు జరిపింది. వరవరరావుకు ఆప్త మిత్రుడు పిల్లల డాక్టర్ రామనాథంను మారవేషాల్లో ఉన్న పోలీసులు ఆయన క్లినిక్‌లోనే పట్టపగలు కాల్చిచంపారు. వరవరరావు గారిని చంపుతామని బహిరంగంగా నినాదాలు చేశారు. మరోవైపు ఆయన మీద హత్యయత్నం కూడా చేశారు. దీంతో వరవరరావు రచించే, జీవించే స్వేచ్ఛ కోసం తన బెయిల్ రద్దు చేసుకొని జైలు కోరుకుంటున్నట్లు వరవరరావు 1985 డిసెంబరు 26న సంచలన ప్రకటన చేసి జైలుకు వెళ్లారు. మూడేళ్లు గడిచినప్పటికీ బయటి ప్రపంచంలో పరిస్థితులు ఏమి మారలేదు. మరోవైపు ఒంటరి జైలు నిర్భంధంలో ‘ప్రాణాల కన్నా విలువైనది స్వేచ్ఛ’గా భావించి అనుభవంలోకి వచ్చిన వరవరరావు 1988లో బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు.
జైలు నిర్భంధంలో ఉన్న వరవరరావు కోసం దేశవ్యాప్తంగా సంఫీుభావం కూడ గట్టటానికి అప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకుడిగా ఉన్న అరుణ్‌శౌరిని వివి సహచరిణి హేమలత గారు, ఎన్.వేణుగోపాల్ గారు సంప్రదించారు. వరవరరావు కవి, రచయిత కావడంతో జైలు జీవితంలో సహచర ఖైదీలు, వాళ్ల కష్టాలు, కన్నీళ్ళు, అక్కడి పక్షులు, పూవులు, మొక్కలు, చెట్లు, నీలాకాశ దృశ్యం, తను చదువుతున్న పుస్తకాల స్పందనలు, ఆలోచనలు సున్నితమైన ఉద్వేగాల ప్రతిస్పందనలు భావుకుడైన కవి వరవరావు కలం నుంచి జాలువారిన లేఖల సారాంశమే ‘సహచరులు’. తెలుగులో అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు ఈ పదమూడు సృజనానుభవ లేఖలను ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో 1988 డిసెంబరు 25 నుంచి 1989 ఏప్రిల్ 16 వరకు ప్రచురించారు. అదేవిధంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్లదిన పత్రికలో వసంత కన్నభిరాన్, కె.బాలగోపాల్, ఎంటి.ఖాన్, కె.జితేంద్రబాబు, జగన్మోహనచారి(జె.సి.), ఎన్.వేణుగోపాల్ చేసిన ఆంగ్ల అనువాద వ్యాసాలు ‘కాప్లివ్ ఇమాజినేషన్’ పేరుతో పెంగ్విన్ ఇండియా 2010లో ప్రచురించింది. అదేవిధంగా శశినారాయణ్ స్వాదీన్, నుస్రత్ మొహియుద్దీన్‌ల హిందీ అనువాదం ‘క్రాంతికారీ కవి వరవరరావు కీ జేల్ డైరీ’ పేరుతో 2008లో దేశవ్యాప్తంగా పాఠకుల ఆదరణ పొందాయి.
వరవరరావు లేఖల సారాంశం ‘వ్యక్తిగతం’గా ఉందని, జైలులో ఉన్నాడన్న అభిమానంతో ఎక్కువ మంది లేఖలను చదవడానికి ఆసక్తిని చూపించారని కాళోజీ ముందుమాటలో వ్యాఖ్యానించారు. వి.వి. రాసుకున్నవి వైయుక్తిక అనుభవాలు ఐనప్పటికీ సమాజంతో అనుబంధం ఉన్న కవి కావడం వల్లనే ‘సహచరులు’ లేఖలకు సార్వజనీనత లభించిందంటారు కాళోజీ. వరవరరావు గారు తనకున్న విశ్వాసాల బలంతో సహచరుల సలహాలు, విరసం అందించిన ప్రోత్సాహం, నక్సల్బరీ వసంత ప్రేరణతో నూతన సంస్కృతి, చరిత్రను నిర్మాణం చేస్తున్న కవిగా వరవరరావు గురించి కాళోజీ పేర్కొన్నారు. విరసంలో చేరిన తర్వాత వి.వి. సృజనాత్మక రచనలో కవిత్వం మాయమైందనే వారికి ‘సహచరులు’ పుస్తకం ఒక జవాబుగా నిలుస్తుందని కాళోజీ అభిప్రాయ పడ్డారు.
స్వేచ్ఛ లభించేదాక జైల్లో నిరీక్షణే ఒక శిక్ష
రాజకీయ ఖైదీలకు జైలు జీవితం నిరీక్షణలోనే కాలం గడిచిపోతుంది. ‘బయట సామాజిక ఆచరణలోను, ప్రజలు నిర్మిస్తున్న చరిత్రలోను భాగంగా లేవు వర్తమానానికి ప్రేక్షకునిగా, గతానికి గుర్తుగా మాత్రమే ఉన్నావని కాలం ప్రతీక్షణం గుర్తు చేస్తుందంటారు’ వరవరరావు. నిరీక్షణ జైలుఊచల మధ్య దారుణమైన ఒంటరి మానసిక సంక్షోభానికి గురి చేస్తుంది. నిరీక్షణ జైల్లో ఒక సాధారణ దైనందిన నిత్య అలవాటుగా మారుతుంది. క్రమంగా వ్యసనంగా స్థిరపడిపోతుంది. కొన్నిసార్లు పనికిరాని విషయాల కోసం నిత్యం ఎదురుచూడటం అలవాటుగా మారుతుందంటారు కవి. తన వెయ్యి రాత్రుల ఒంటరి నిర్భంధంలో పక్షులు, చెట్లు, పూవులు, చిరుగాలులు, నీలాకాశమే నిశ్శబ్దంగా కవిని పలకరిస్తాయి. అధ్యయనం, రాత అలవాటైన కవికి చదువే అతన్ని మరింత దృడమైన మానసికశక్తి కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాయోమో అనిపిస్తుంది. ఉరిశిక్ష వేదికను రెండుసార్లు ఎక్కిదిగిన భూమయ్య, కిష్టాగౌడ్‌ల నిరీక్షణ, ‘ప్రాణాలను ఉరికొయ్యకు తగిలించి విప్లవం కోసం…’ అంటాడు. జైలులో విచారణ పేరుతో ఏళ్ల తరబడి మగ్గుతున్న జోద్‌పూర్ ఖైదీలు, బెంగాల్ ఖైదీల తదితరుల నిర్భంధాల నిరీక్షణకు తుదిమొదలు లేని దుస్థితిని పాఠకుల ముందుంచుతారు. ‘‘సేచ్ఛ లభించే వరకు జైల్లో నిరీక్షణే ఒక శిక్ష’’ అనీ, అట్లనీ దీర్ఘకాల నిర్భంధం ఖైదీలను, ముఖ్యంగా రాజకీయ ఖైదీలను నిరాశ, నిస్పృహలు కుంగదీసి మనిషిని శిథిలం చేస్తాయనుకోవడం సరికాదంటారు. భావుకత, చైతన్యం కలిగిన రాజకీయ ఖైదీకి నిరీక్షణ కూడా ఒక అఖండ దీపంలాంటిదని, అదెపుడూ మండుతూ రెప్పపాటు కూడా చూపును మూసుకోదంటాడు.
కవి క్రాంతదర్శని ప్రాచీన లాక్షణికులు చెప్పినదాంట్లో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు. 1965లో వరవరరావు గారు ఢల్లీిలో తాను ఉన్నపుడు సోవియెట్ కవి సిమనోవ్ ప్రసిద్ధగీతం ‘వెయిట్ ఫర్ మీ’(నాకోసం నిరీక్షించు) తన తెలుగు అనువాద కవితను ఒక మిత్రుడు కొత్త సంవత్సరం జైలుకు తనకే పంపడం యాదృచ్చికమే అనపిస్తుంది.
‘‘నిరీక్షించు నా కోసం
ఎన్ని కడగళ్లయినా వహించి
మృత్యువును నిర్జించి తిరిగి వస్తాను
నా కోసం ఎదురు చూడని వాళ్లంతా
అపుడు నన్ను ‘అదృష్టవంతు’డంటారు
నీవు నిరీక్షణలో నన్ను
మృత్యుముఖం నుంచి రక్షించుకున్నావని
వాళ్లకి అర్థం కాదు
అది మనకు మాత్రమే తెలుసు’’
ఈ కవిత ఒకరకంగా హేమలతక్కను ఉద్దేశించి అనువాదం చేసింది మాత్రమే కాదు, తన కోసం జైలు బయటి సమాజంలో ఎదురుచూసే మిత్రుల, అభిమానులు, ఆత్మీయుల్లో ఆత్మస్థైర్యం నింపే అద్భుతమైన అనువాద కవిత.
ప్రకృతిలో మమేకయిన కవిహృదయం
తొలిసారిగా 1973 అక్టోబరులో వరవరరావు గారు డిటెన్యూగా వరంగల్ జైలుకు వచ్చారు. ప్రస్తుతం చారిత్రక వరంగల్ కేంద్ర కారాగారం కేసీయార్ నిర్ణయాలకు నేలకూలిందనుకోండి. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. ఇపుడు ఆ జైలు గురించి కవి కలం నుంచి జాలువారిన అక్షరాల్లోనే ఆనవాళ్లు చదువుకోవాలిక. జైల్లో గాలి, వెలుగుపూలు, ఇంత సమృద్ధిగా లభించిన అనుభవం, కవి కోల్పోయిన సేచ్ఛను, పొందిన ఒంటరి తనాన్ని హఠాత్తుగా గుర్తు చేసుకుంటాడు. జైలులో కూడా పూలు పూస్తాయని నమ్మకం కలిగించడానికి ప్రతీ ములాఖత్‌లోనూ కర్ఛీప్ నిండా గులాబీలు తీసుకుపోయేవాడినంటాడు. ఇది కవి వరవరరావు సున్నితమైన హృదయ సౌకుమార్య సంస్కృతిని తెలియజేసే సంఘటనగా చెప్పుకోవచ్చు. జైలులో వూవులను అతిసున్నితంగా లాలించి, ప్రేమించే భావుకుడైన మనిషి ఒక కవి అనే విషయం జైలు సిబ్బందికి అర్థం కాకపోవచ్చు.
ఏ జైల్లోనయినా ఎక్కువ సహచరులతో ప్రధానంగా సాహితీ మిత్రులతో రాజకీయ చైతన్యం కలిగిన కామ్రేడ్స్‌తో గడిపిన కవి, ప్రకృతిలోని చెట్లు, మనసు, పక్షుల భాషలు, తెలుసుకోవడానికి గతంలో ఎపుడూ అవకాశం రాలేదంటాడు. చెరబండరాజుతో గత జైలు జ్ఞాపకాలయిన బట్టలుతకడం, అల్సర్, క్యాన్సర్ బయటపడటం గుర్తు చేసుకుంటాడు. ప్రకృతిలో లీనమైన కవి ప్రేమను చాలా ప్రైవేటుగా దాచుకోవాలంటూనే ‘మూడు పూలు ఆరుకాయలుగా’ వికసించడం తప్పదంటాడు వివి.
‘‘రాలిపోయిన పూల జ్ఞాపకాలు మిగిల్చిన తొడిమల దగ్గర
కొత్త చిగుళ్లు పూస్తాయి
వర్తమానం ఆకుల చాటున కనిపించని భవిష్యత్తు కోసం
గత విషాద మాధుర్యాన్ని వినిపిస్తుంది.’’
నిశ్శబ్ద ఏకాంతంలో పావురాల సందడి
తన ఒంటరి ఏకాంత నిర్భంధంలో కవి జైలు గదిలోని వెంటిలెటర్‌లో రాత్రి పావురాల జంట కాపురం పెట్టింది. జంట పక్షులకు స్వప్నభంగం కలగకుండా లాకప్ నుంచి కిటికీవైపు కవి నడిచేటపుడు సడిలేని అడుగులతో నడుస్తాడు. వరవరరావు ఎంత సున్నితమైన హృదయం కలిగిన భావుకుడనే విషయం మనం కవి వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవచ్చును. మామిడి చెట్టు చిటారు కొమ్మల్లో కూర్చొని అదృశ్య కోకిల పలికే కలకూజిత వసంతగానం ఆస్వాదిస్తాడు. జైలు కవి పరిశీలనలో కేవలం పూలచెట్లు, పక్షులే కాదు పిల్లి, ఎలుకలతో తన అనుభవాలను చెబుతాడు. కవికి పిల్లులతో చెలిమి లేకున్నప్పటికీ పేచీ కూడా లేదంటాడు. ఖైదీల కోసం చేసిన పెరుగు మాయమవుతున్న సందర్భంలో తన సెల్‌లో పిల్లులు తినకుండా పెరుగును జాగ్రత్త చేస్తాడు. రెండేళ్లుగా తన జైలు గదిలో పేరుకుపోయిన పత్రికలు, పుస్తకాలను ఎలుకలు అధ్యయనం చేశాయని, రామ్‌నగర్ కుట్ర ఛార్జిషీటు కాగితాలను ఎలుక కొట్టేస్తే కేసు ఎక్కడి పోతుందని చమత్కరిస్తాడు కవి.
ఓ రోజు జైల్లో ఒక పావురం ఖైదీల కిచెన్ రేకుల మీద కూర్చునుంటుంది. తీరా దగ్గరకు పోయిచూస్తే ఆయుపట్టులో గాయపడి వుంటుంది. కవి తన చేతుల్లోకి తీసుకొని గింజలేసి వెంటిలెటర్‌లో పిల్లుల కంట పడకుండా రాత్రంతా కాపాడుతాడు. తెల్లవారుజాములో పావురం చనిపోతుంది. పావురం భౌతికకాయాన్ని నిమ్మచెట్టు పాదులో ఖననం చేస్తూ మీరట్ మతకలహాల ఘటనపై రాసుకున్న చరణాలు గుర్తుకు వచ్చాయని ఆవేదన చెందుతాడు. ప్రాణుల పట్ల మనుషుల్లో మాయమవుతున్న మానవీయ విలువల కోసం తల్లడిల్లుతున్న కవి మనుస్సును అర్థం చేసుకోవచ్చు.
పుస్తకాల పురుగులు రాజకీయ ఖైదీలు
పుస్తకాలు మురిపిస్తాయి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిపిస్తాయి. పుస్తకాలు ఒంటరితనంలో వెచ్చని స్నేహాన్నిస్తాయి. నిర్భంధంలో స్వేచ్ఛనిస్తాయి. బందీకి పుస్తకాలు నిజంగా రెక్కల్లాంటివని, చైతన్యానికి ఆహారం లాంటిదని వరవరరావు చెబుతాడు. వర్తమాన చరిత్ర నిర్మాణంలో లేకుండా తత్కాలిక నిర్భంధంలో ఉన్న రాజకీయ ఖైదీలు తమ విరామ సమయాన్ని పూర్తిగా అధ్యయనంలో పుస్తకాల పురుగులుగా మారిపోతారు. భావిచరిత్ర నిర్మాణం కోసం గత చరిత్రను అవగాహన చేసుకుంటారు. గుగి వా థీయాంగో జైలు డైరీలోని ఖైదీల మానసిక స్థితిని తెలుపుతాడు. బయట సమాజంతో సజీవ సంబంధం కోసం పత్రికలు ఆధారం. ప్రతీ ఉదయం పత్రికల కోసం ఉద్వేగభరితమైన నిరీక్షణ. కవి వరవరరావుకు సామ్రాజ్యవాదాన్ని, పురుషాంహకారాన్ని ద్వేషించడం నేర్పింది గుగి వా థియాంగో రాసిన నవల ‘డెవిల్ ఆన్ క్రాస్’లోని నాయిక వరీంగా అంటాడు.
ఉత్తరాలకు ఓపెన్ హార్ట్ సర్జరీ
అలల మీద, కలల మీద కూడా రాజ్యం నిఘా నిరంతరం వుంటుంది. మన కవి వరవరరావుకు 1965లో ఢల్లీిలో ఉద్యోగం చేస్తున్నపుడు ఉత్తరాలు పరాయివాళ్లు చదువుతారనే విషయం తొలుత అనుభవంలోకి వచ్చిందట! 1973లో తొలిసారిగా అరెస్టయినపుడు ఉత్తరం రాయబోతే ఇంకెవరో చదువుతారనే భావన అసలు కలం కూడా కదిలేది కాదని ఆవేదన చెందుతాడు. మన ప్రేమ, స్నేహం అవసరాలు, బలహీనతలు, గొప్పలు, అబద్దాలు, నిజాలు ఒకటేమిటి హృదయాంతరంగంలోని అరలు,పొరలు అపరిచిత వ్యక్తుల చేత ఓపెన్ హర్ట్ సర్జరీ తర్వాత కుట్లు వేయకుండానే మన ముందుకు వస్తాయని వరవరరావు ఉత్తరాలపై ఆందోళనకు గురవుతాడు. జైలు జీవితం తన చైతన్యంలో భాగమై, సహచరులను ఇతరులకు పరిచయం చేసింత సులువుగా తన ఉత్తరాలు ఇతరులు చదువుతారనే వాస్తవానికి అలవాటు పడిపోయానంటాడు వివి. ఉత్తరం రాస్తే అది చేరినట్లు మళ్లీ ఉత్తరం వచ్చేదాకా చేసే నిరీక్షణ అన్నిటికన్నా దుర్భరమైందని కవి భావన.
విప్లవ రాజకీయ ఖైదీలు నేలతల్లి చెర విడిపించడానికి చెరసాలకు బందీలయ్యమనే దృక్పథంతోనే నూతన ఉత్తేజం పొందుతారు. కన్నతల్లీ, నేలతల్లీ, విప్లవమూ విప్లవ సంస్కృతిలో పర్యాయపదాలు. వరవరరావు కేవలం తన కన్నతల్లిని మాత్రమే కాదు, విప్లవ యోధులను, కన్న తల్లుల ఉద్యమస్పూర్తిని, యాది చేసుకుంటాడు. దక్షిణాఫ్రికా కవి, బెంజిమన్ ఫ్రాంక్లిన్ మొలైసేని బోథా జాత్యంహకారం ప్రభుత్వం ఉరి తీస్తుంది. ఉరి తీసే ముందు రోజు అతని తల్లి కడసారి వీడ్కోలు పలికి బయటకు వస్తుంది. అదేవిధంగా బెంగాలీ కవి అమరుడు ద్రోణాచార్య ఘోష్ కవితా చరణాలను గుర్తు చేసుకుంటాడు. ఖైదీలు ఒకరికొకరు పసిపిల్లలవుతూ ఓదార్పును పొందుతారు. నంబూద్రిపాద్ ఆత్మకథ చదివినందువల్ల వరవరరావు తన కన్నతల్లి అనుబంధం గుర్తుకు వచ్చి మనసు ఆర్థ్రమవుతుంది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన వారంరోజులకు ఇంటికి పోగానే వరవరరావు తల్లి తన ఒడిలో కూర్చొబెట్టుకుని ఒళ్లంతా పుణికిందని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. అప్పటికీ తనకు ముప్పై ఏడేళ్ళు, ముగ్గురు పిల్లల తండ్రినని తల్లి ప్రేమను యాది చేసుకుంటాడు. అవును జైల్లో ఉన్నవాళ్లు తమ కన్నతల్లయినా, పిల్లల్నయినా తమవారు ఎవరినైనా మాటలతో, కళ్లతో తప్ప స్పృశించలేని జైలు ఊచల నిర్భంధాన్ని వర్ణిస్తాడు వి.వి.
‘కష్టజీవులకు ఇరువైపు నిలిచేవాడు కవి’
ఎంత మంది కవులు కష్టజీవికి ఒకవైపయినా నిలిచారనేది ఎవరికి వాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్న. కష్టజీవికి ఒకవైపయినా నిలిచానో లేదో కాలం తేలుస్తుందనీ, జైలులో మాత్రం తనకు కవిత్వం ఇరువైపుల నిలిచిందని వి.వి. ప్రకటిస్తాడు. తన హృదయంలో నిరంతరం నిశ్శబ్దంగా నినదించే నెచ్చెలిగా ఒక అంతర్జ్వాలగా, ఒక ఆచ్చాదనగా కవిత్వం జైలులో తోడుగా ఉందంటాడు. విప్లవోద్యమం మాదిరిగానే జైలు జీవితం కూడా రాజకీయ కార్యకర్తలను కవులుగా తీర్చిదిద్దుతుందంటాడు. హోచిమన్‌కు అంత సుదీర్ఘమైన జైలు జీవితం లేకపోతే ‘జైలు డైరీ’ అంత గొప్ప కవిత్వం రాసి ఉండేది కాదంటాడు. విప్లవ రాజకీయాల వల్ల పదునెక్కిన శివసాగర్, జైలు జీవితం వల్ల కవిత్వం పరిణతి పొందిందంటాడు. ఇప్పటికీ జైళ్లు గొప్ప కవిత్వ కర్మాగారాలుగా ఉన్నాయనడానికి ‘సౌదా’ రాసిన ‘జైలు నుంచి ప్రేమ లేఖ’ శక్తివంతమైన కవిత్వంగా ఉదహరిస్తాడు.
జైలు నిర్భంధంలోని మనుషులకు కాళ్లు, రెక్కలూ, దినమూ రాత్రి అనే ద్వందార్థాలతో కళ్లయినా, కామనలయినా, కాలగమనమయినా ఊహలూ, కలలే మరి! ఖైదీ నిర్వ్యాపకత్వాన్ని పగటి కలగానో, పీడకలగానో నిరర్థకం చేయడు. ‘కౌంట్ ఆఫ్ మాంట్’ క్రిష్టో నవలలో జీవితమంతా జైల్లోని చీకటి అరలో గడిపి, ఒక మనిషి చేసిన సేచ్ఛాకాంక్ష వల్ల ఆలోచనలు, కృషి అతణ్ణి తత్వవేత్తను, శాస్త్రవేత్తను చేసినవి. ప్రవాస జీవితం గడపాల్సిన సాహితీ వేత్తలు, మేథావులు ఊహలు, కలలు అనే రెండు పాదాల మీదనే బతుకును నిలదొక్కుకోగలరని వరవరరావు చెబతాడు. మంచి పుస్తకాలతో ఒంటరిగానైనా గడపడం కష్టమేమీ కాదని తెలుసుకొన్నవారు కొందరేనంటాడు. రిమాండులోనే దీర్ఘకాలం ఉండవలసి వస్తున్న రాజకీయ ఖైదీలకయినా జైలు నిర్భంధమే కానీ జీవనవిధానం మాత్రం కాజాలదని, కాకూడదని ఖరాఖండిగా ‘కలలు`ఊహలు’ లేఖలో చెబుతాడు.
‘‘ప్రజల్లో ఉన్నపుడు
ప్రభాతంలా ఉంటారు
ప్రవాసంలో ఉన్నపుడు
పరిమళంలా ఉంటారు
జైల్లో ఉన్నపుడు
కొలిమిలో ఇనుములా ఉంటారు’’
రాజకీయ ఖైదీలకు సాధారణ ఖైదీలకున్నంత ఆశగానీ, భ్రమగానీ విడుదల గురించి ఉండదు. చైతన్య విస్తృత పరిధి, అవగాహన వల్ల వీళ్లు ఎపుడూ ఆ విషయమే ఆలోచిస్తూ కూచోరు. ఇతర సామాజికాంశాలు తెలుసుకొని, చర్చించడానికి క్రమశిక్షణ కలిగిన చైతన్య క్రియగా వాళ్ల సంస్కృతిలో భాగం చేసుకుంటారు. వీళ్లు నిర్భంధాన్నే ఇష్టపడుతారంటే కాదు, రాజకీయఖైదీకి స్వేచ్ఛాకాంక్ష వుంటుంది. అది ధైన్యానికి, పిరికి తనానికి, లొంగుబాటుకు, మానసిక దౌర్బాల్యాన్ని ప్రొత్సహించదు. కొలిమిలో కాలుతున్న ఇనుమువలె సహిస్తూ మండుతూ వుంటారు. రాజకీయఖైదీలకు నిరీక్షణ తెలిసినంతగా నిరాశ తెలియకుండా ఉంటారని వరవరరావు పేర్కొంటాడు. ఎంత భయంకర పరిస్థితుల్లోనూ, విషాదాల్లోనూ నిరాశ నిస్పృహలు తనను దరిచేరలేదని కవి ప్రకటిస్తాడు. బావోద్వేగ స్వభావం, సున్నిత మనస్తత్వం ఉన్న తనకంటే స్థితిమితంగాను, స్థిరంగాను మిగతా రాజకీయ ఖైదీలు నిర్భంధాన్ని అర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు తన అనుభవాన్ని ‘ఆశ నిరాశలు’ లేఖలో వెల్లడిస్తారు.
నిర్భంధమే ఒక క్రమశిక్షణ గల రాజకీయ ఖైదీకి స్వచ్ఛంద మౌనం. నా స్వభావమూ, ఉద్యోగమూ, ఉద్యమమూ ముప్పెటగ సాగిన మాటలు మాటలేగానీ మౌనం కాదంటాడు మన కవి. మౌనం బంగారమే కావచ్చుని, అది ఎల్లవేళలా నిజం కాదంటాడు రష్యన్ కవి యవషెంకో. సంక్షోభ సమయంలో దానిని పరిష్కరించగల వజ్రం లాంటి వాక్కు కావాలంటాడు. మనిషి ఎక్కువ కాలం మౌనంగా ఉండీ మాట్లాడటం మరిచిపోకుండా
మాట్లాడటానికి జైలు సూత్రాల నిర్భంధమే అవరోధంగా మారుతుంది. దైనందిన అవసరాల కోసమే మాట్లాడటం తప్పా ఒంటరి సెల్‌లో భావాలను స్వీకరించడానికి ఎవరుంటారు ?
‘‘శబ్దమే లేకపోతే
ఇన్నాళ్లు కళ్లలో దాచుకున్న
ఈ దృశ్యం ఎట్లా వెలిగేను
మనవాళ్లతో మాట్లాడీ వినీ
మళ్లీ మాటలు నేర్చుకోవాలి
…మాట పోగొట్టుకుంటే
మనిషికేం మిగుల్తుంది’’
‘పరాధీన స్వేచ్ఛ’లో చిన్న చిన్న సరదాలు, అవసరాలకు మనిషి స్వాధీనంలో లేని స్వేచ్ఛ ఖైదీని నిరంతరం సలుపుతూనే వుంటుందని జైలు కవి వి.వి. భావన. జైలులో విశ్రాంతిగా ఉన్నట్లు కనిపించినా యాంత్రికమైనదే. మనోగతమైన భావాలను స్వేచ్ఛగా చెప్పాలని ఉన్నప్పటికీ, వినడానికి ఎవరూ కనిపించని ఒంటరితనం దారుణమైన నిర్భంధమే. సంక్లిష్ట సంక్షుభిత పరాధీన ప్రపంచంలోని ఒక చిన్న శకలమే జైలు. ‘ఒక కుట్ర కేసు కొట్టివేస్తే మరొక కుట్రకేసులో జైలు కొచ్చిన నన్నడిగితే మాత్రం పాత వ్యవస్థ గర్భంలోనే నూతన వ్యవస్థ బీజరూపంలో ఉన్నట్లుగానే ఈ పరాధీన భౌతిక వాస్తవికతలోనే స్వేచ్ఛభావన గాజుగదిలో బంధించబడిన జ్వాలలా ప్రకాశిస్తుంటుందని’ నవసమాజం వి.వి. వ్యాఖ్యానిస్తారు. అణిచివేత, నిర్భంధాల మూలాల్లోనే ప్రకాశించే నూతన స్వేచ్ఛా ప్రపంచం ఉంటుందని అవగాహన చేసుకోవచ్చు. ‘మనిషి ఒక నూతన ప్రపంచం కోసం స్వప్నించడమే మానవత్వం. కొత్త సమాజం పట్ల విశ్వాసం ఉంచడం, దాన్ని ఆశించడం మంచిదే. అతను జీవించడానికి ఆశనే ఆధారం చేసుకుంటాడని’ గుగి వా థియాంగో రాసిన ‘డినెయిడ్ ఏ రైటర్స్ ప్రిజన్ డైరీ’ నుంచి వి.వి. ఊటంకింపులు మనల్ని ఆలోచింపచేస్తాయి.
చైతన్య ఖైదీకి తోడు చైతన్య ఖైదీయే ఉంటే తప్ప జైలు నిబంధనలు దృష్ట్యా ఉండే ఆంక్షల వల్ల ఆచరణలో ఒకే ఖైదీలున్నా సహచర్యం లేనట్లే లెక్క. బాధా సారూప్యం కంటే మనుషుల్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భావసారూప్యత మరింత సన్నిహితులను చేస్తుంది. నిర్భంధ బాధ సారూప్యత తక్షణ అవసరాలకు మాత్రమే వర్తిస్తుంది. సెప్టెంబరు 17 కవి, జర్నలిస్టు సలంద్ర లక్ష్మీనారాయణ మరణవార్త తనను కలిచివేసిందని ఆవేదన చెందుతాడు. సలంద్రతో అనుబంధం విరసం సభ్యుడిగా మాత్రమే కాదు, ఆలోచన విధానంలోని పని ఇద్దరు కవుల్ని సన్నిహితులను చేసిందంటాడు. జైలు స్టాఫ్ కిచెన్‌లోనూ పనిచేస్తున్న ఖైదీలను చూసి ‘‘వీళ్లింత ఒళ్లు దాచుకోకుండా ఇక్కడ పనిచేస్తారు. దేశంలో ఈ రెండు చేతులకు పనిలేక, జానెడు కడుపు నిండక, వీళ్లు జైళ్లకొచ్చారా లేక ఈ చేతులు నిర్భంధంలో తప్ప పనిచేయవా’’ అని ఆశ్చర్యమూ, ఆవేదన కలుగుతాయని కవి ‘పరాధీన సేచ్ఛ’ లేఖలో చెప్పుకుంటాడు. కవి తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని స్థూల విషయాలనే కాదు, సూక్ష్మ అంశాలను పరిశీలిస్తూ మనుషులతో పంచుకుంటాడు. జైలు కవి తన ముగ్గురు పిల్లల గురించి ‘‘నా భావావేశాల ప్రతిరూపం సహజ, చాలా నిశ్శబ్దంగా తాననుకున్నదే ఆరునూరైనా చేసుకుపోయే నా క్రిటిక్ అనల, అరిందలా కబుర్లు చెప్పె అడాల్‌సెంట్ రెబల్ పవన’’ అంటూ వారి వ్యక్తిత్వాన్ని కవిత్వంలో చెబుతాడు.
తెలుగు సాహిత్యంలో ఇందుకు భిన్నంగా కనిపిస్తాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో అరెస్టయి ఉన్నవ లక్ష్మీనారాయణ జైలు పాలయ్యారు. జైల్లో ఉండగ ‘మాలపల్లి’ నవల రాసిన తర్వాత రహస్యంగా బయటకు చేర్చారు. ఆయన విడుదలయ్యాక ‘మాలపల్లి’ ముద్రణయింది. బ్రిటీష్ యువతి మేరీటేలర్ ఒక నక్సలైట్ నాయకుడిని పెళ్లి చేసుకున్నందుకు మూడేళ్లు బీహార్‌లోని జంషెడ్‌పూర్‌లో జైలు జీవిత అనుభవాలను మేరీటేలర్ ‘భారతదేశంలో నా జైలు జీవితం’ ప్రచురించింది. చెకోస్లొవెకియా పాత్రికేయుడు జూలియస్ ప్యూజిక్ ‘రక్తాక్షరాలు’(నోట్స్ ఫ్రం ది గాలొస్), నీగ్రో విప్లవకారుడు జార్జ్ జాక్సన్‌ను జైలు జీవిత అనుభవమే గొప్ప రచయితను చేసింది. తల్లీతమ్ముడు,లాయర్లకు రాసిన ఉత్తరాలను ‘సాలిడాడ్ బ్రదర్స్’ పేరున పెద్దఎత్తున ప్రచారం పొందాయి. చివరకు అమెరికన్ ప్రభుత్వం జాక్సన్‌ను జైల్లోనే చంపేసింది. దక్షిణ కొరియాలో ఉరిశిక్షపడిన కిమ్‌చిహా తన ఆత్మకథ రాశారు. అదేవిధంగా కెన్యా రచయిత గుగి వా థియాంగో ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ నవలను టాయిలెట్ పేపర్ మీద రహస్యంగా రాసి బయటకు వచ్చాక ముద్రించారు. ఎమర్జెన్సీ రోజుల్లో బొజ్జ తారకం ‘నదిపుట్టిన గొంతుక’(కవిత్వం) ముద్రించారు. కె.వి. రమణారెడ్డి రాసిన ‘డిటెన్యూ డైరీ’, అరుణ్ ఫరెరా ‘సంకెళ్ల సవ్వడి’ జైలు అనుభవాల రచనలుగా మనకు కనిపిస్తాయి. ఇదంతా కేవలం చదివి వదిలేస్తే సాహిత్యం కాదు. పాఠకులను ఆలోచింపచేసి చరిత్రలోని పాలకుల ధోరణి, కవులు, రచయితల ఆకాంక్షలను అర్థం చేసుకొని కొత్త ప్రపంచాన్ని నిర్మించడంలో పాఠాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.