(ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే ప్రముఖ సాహితీ విమర్శకురాలు. వివిధ సామాజిక, ప్రజాస్వామిక, హక్కుల ఉద్యమాలకు బాసటగా నిలిచారు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని ఆధునిక స్త్రీవాద కోణంలో పరిశీలించారు. తెలుగు సాహిత్య విమర్శలో మార్క్సిస్టు దృక్పథంతో కొత్త దారులు వేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో వివిధ హోదాల్లో పని చేసి రిటైరయ్యారు. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తెలంగాణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజల పక్షం నిలబడి గొంతెత్తేవాళ్లే ప్రజా రచయితలు అంటున్న ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహేతో ‘కొలిమి’ ప్రతినిధి సంభాషణ)
కొలిమి: నమస్కారం మేడం.
ప్రొఫెసర్ కాత్యాయని: నమస్కారమండీ.
కొలిమి: మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
ప్రొ. కాత్యాయని: నేను మా అమ్మమ్మ గారి గ్రామమైన అద్దంకి దగ్గరలోని మైలవరంలో పుట్టాను. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. నాలుగో యేట నాన్న రామకోటి శాస్త్రి ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా చేరారు. మొదట వరంగల్‌కు వచ్చిన రోజు కాళోజీ గారి ఇంట్లో పప్పు అన్నం తిన్నాం. కాళోజీ గారి ఇంటికి ఎదురుగా కిరాయి ఇల్లు తీసుకున్నాం. నా బాల్యం వరంగల్, హైదరాబాద్‌ను చుట్టుకొని వుంది. హన్మకొండలోని సుజాతరెడ్డి స్కూల్లో నాలుగో తరగతి చదువుతుండగా మా నాన్నకు హైదరాబాద్ బదిలీ అయింది. హైదరాబాదులో నామాలగుండులో నెహ్రూ మెమోరియల్ స్కూల్లో చదువుకున్నాను. తొమ్మిదో తరగతి వరకు సికిందరాబాద్ రెజిమెంటల్ స్కూల్లో చదివాను. హన్మకొండలో పీజీ స్టడీ సెంటర్ ఏర్పాటుతో మళ్లీ హన్మకొండకు వచ్చాం. సుజాతరెడ్డి స్కూల్లో చదువుతూ ఉండగానే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఒక ఏడాది నా చదువుకు అంతరాయం కలిగింది. ఓసారి మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థుల నేతృత్వంలో మా పాఠశాల తరగతులు బహిష్కరించారు. మా పాఠశాల విద్యార్థులతో ఊరేగింపు తీశాం. ర్యాలీలో ‘గోంగూర గోబ్యాక్’, ‘పోలీసులు ఎందుకు? గడ్డి పీకెటందుకు’ అని నినాదాలు ఇచ్చాను. దీంతో పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జిగారు మందలించి ఇంటికి పంపారు. మా అమ్మ ఇందిరాదేవి ఐదో తరగతి వరకు చదువుకుంది. భారతం, భాగవతం, పురాణాలు, పత్రికలు బాగా చదువుతుండేది. ఆమెతోపాటు నాకూ క్రమంగా చదవటం అలవాటయింది. ఏడో తరగతి నుండి ఉపన్యాస పోటీల్లో పాల్గొనేది. వ్యాస రచన, డ్యాన్స్, నాటికలు వేసేదాన్ని. తెలంగాణ ఉద్యమ సమయంలో స్కూళ్లు బందవడంతో కిషన్ పురాలో బాలానందం సంఘం పెట్టుకున్నం. మనోవాణి లిఖిత పత్రిక కూడా నడిపినం.
కొలిమి: మీ కుటుంబ సాహిత్య నేపథ్యం చెప్పండి.
ప్రొ. కాత్యాయని: మా నాన్న రామకోటి శాస్త్రి. ఆయన తెలుగు సాహిత్య విద్యార్థి. ఉస్మానియాలో బిరుదురాజు రామరాజు వద్ద పీహెచ్‌డీ చేశారు. ఎం.ఏ. తర్వాత నాన్న గుడివాడ కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. పరిశోధన మీద బాగా ఆసక్తి. అలాగే ఓసారి అలంపురంలో సాహిత్య సభలకు పత్ర సమర్పణ చేయమని రామరాజు కోరారు. నాన్న తిక్కన మీద ఉపన్యాసం ఇచ్చారట. దీంతోనే రామరాజు గారు పీహెచ్‌డీ సీటు ఇస్తానని చెప్పడంతో ఉద్యోగం వదిలేసి హన్మకొండలో స్థిరపడ్డారు. పరిశోధన క్రమంలో వట్టికోట ఆళ్వారుస్వామి ఇంట్లో ఉన్నారు. అందుకనే నాన్న తన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాన్ని ఆయనకు అంకితమిచ్చారు. మా అమ్మకు విపరీతమైన పఠనాభిలాష. మా నాన్న విశాఖలో చదువుకుంటున్నపుడు మా అమ్మకోసం ఆంధ్రపత్రికను పోస్టులో వచ్చేలా చూశారు. మా బామ్మ బాల్య వితంతువు. సాహిత్య వాతావరణం ఇవ్వడంతో ఆమె పాత్ర ఉంది. పద్దెనిమిదేళ్లకు భర్త చనిపోతే మా నాన్నను దత్తత తీసుకుంది. బామ్మ పురాణాలు చదివి మాకు, చుట్టు పక్కలవారికి వినిపించేది. వేసవి సెలవుల్లో పురాణాల్లోని సూక్ష్మంగా కథలు కూడా చెప్పేది. దీంతో సాహిత్యం పట్ల పఠనాభిలాష క్రమంగా మొదలైంది.
కొలిమి: మీకు సాహిత్యంతో ప్రాథమిక పరిచయం ఎలా మొదలైంది?
ప్రొ. కాత్యాయని: నిజానికి నేను ఆరో తరగతి నుంచే చదవడం మొదలైంది. మా అమ్మ ఇందిర, మా బామ్మ నిత్యం చదవటం, ఇతరులకు బోధించేది. ఇదంతా చూసి క్రమంగా నాకు సాహిత్యం మీద అభిరుచి కలిగింది. వేసవిలో మొదటగా నేను ‘వేయి పడగలు’ నవల చదివాను. మా నాన్న వద్ద పద్య సాహిత్యం ఉండేది. పాఠశాల నుంచే యుద్దనపూడి సులోచనరాణి, రంగనాయకమ్మ రచనలు చదవడం అపుడే మొదలయింది. ఇంటర్మీడియట్‌లో సివిక్స్, డిగ్రీలో బి.ఏ.లిటరేచర్ చదివాను.
కొలిమి: మొట్ట మొదటి మీ రచన ఏది? దానికి ప్రేరణ ఏమిటి?
ప్రొ. కాత్యాయని: తొమ్మిదో తరగతి నుంచే కవిత్వం రాయడం మొదలైంది. తెలంగాణ ఉద్యమం కవిత్వ పాఠాలు నేర్పింది. ఆ విరామ సమయంలో ఏం చేయాలనే భావనతో కవిత్వం రాయడం మొదలు పెట్టాను. ఆ రోజుల్లో ఆర్ట్స్, సైన్స్ కు చదువుల్లో పోటీ ఉండేది. ఆర్ట్స్‌లో డెబ్బయి ఐదు మంది ఉంటే నలుగురం పాసయ్యాం. వారిలో నేను ప్రథమ శ్రేణిలో వచ్చాను. చదువులో ఉన్న వివక్షపై ఆంధ్రపత్రికకు ‘అంతరాలు’ అనే వ్యాసం రాశాను. అచ్చయినందుకు ఐదు రూపాయల పారితోషికం కూడా అందుకున్నాను.
కొలిమి: మీ రచనల్లో మీకు బాగా నచ్చిన రచన ఏది?
ప్రొ. కాత్యాయని: ఏ రచయితకైనా తన రచనలన్నీ తనకు బాగానే వుంటాయి. క్లాసికల్ లిటరేచర్ మీద, ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన రచన నాకు బాగా నచ్చింది. ఎందుకంటే స్త్రీవాద దృక్పథం ఆధునిక సాహిత్యాన్ని మాత్రమే చెబుతుంది. నేను మాత్రం ప్రాచీన సాహిత్యంలో మహిళలు ఎట్లున్నరు? కుటుంబ నియమాలు ఏంటి? తెలుసుకోవాలనే ఆసక్తితో అధ్యయనం చేశాను. సంప్రదాయ సాహిత్యంలో మహిళల కష్టాలున్నవి. పేట్రియాటిక్ భావావేశాలున్నయి. వారికి తెలియకుండానే వాళ్ల బాధలకు పరిష్కారాలు, ఒంటరి ధిక్కారాలు కనిపించాయి. స్త్రీవాదం, మార్క్సిజం విదేశీ భావనలు అనేది అందరిలో ఉంది. అయితే దేశీ సాహిత్యంలో కూడా స్త్రీవాద ధిక్కార దృక్పథం నాకు స్పష్టంగా కనిపించింది. మహిళలు ఎక్కడుంటే అక్కడ స్త్రీవాదం వుంటుంది. అది ఉద్యమంగా, సమూహంగా, వ్యక్తిగత నిరసన రూపంలో కూడా వుండవచ్చు. ఆ సూక్ష్మస్థాయిలోని నిరసన గుర్తించాక అద్భుతంగా అనిపించింది.
కొలిమి: మీకు విమర్శ కాకుండా బాగా నచ్చిన ప్రక్రియ ఏది?
ప్రొ. కాత్యాయని: నాకు ముందుగా నవలలు బాగా ఇష్టం. ఆ తర్వాత కథలు. దీనికి కారణం 1967లో రంగనాయకమ్మ ‘స్వీట్ హెూం’ సీరియల్‌గా పత్రికలో వస్తుండే. ఆ నవలల్లోని పాత్రల విభిన్న అభిప్రాయాలు, ఆలోచనలు, ఆదర్శాలు నా వ్యక్తిత్వం మలచుకోవడంలో నాకు బాగా పనికి వచ్చాయి. కథ కూడా చాలా ఇష్టమైన ప్రక్రియ.
కొలిమి: తెలుగు సాహితీ లోకాన్ని బాగా ప్రభావితం చేసిన మీ రచన?
ప్రొ. కాత్యాయని: ప్రాచీన సాహిత్యం మీద స్త్రీవాద కోణాలపై చేసిన పరిశోధనపై ప్రొఫెసర్ చేకూరి రామారావు వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను. చాలా మంది ఆధునిక సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూశారు. కానీ ప్రాచీన సాహిత్యాన్ని స్త్రీవాద కోణంలో చూడటం ప్రత్యేక గుర్తింపు లభించింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో కొందరు ప్రొఫెసర్ మురళీ, ప్రొ. జనార్ధనరావు, ప్రొ. సీతారామారావు, ప్రొ.బుర్ర రాములు, ప్రొ. పాపిరెడ్డి అధ్యాపకులతో కలిసి 1982లో స్త్రీజనాభ్యుదయం సంస్థను ఏర్పాటు చేశాం. అయితే ఏది చదివినా స్త్రీల కోణం నుంచి అధ్యయనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 1990లో తోట జ్యోతిరాణి, శోభ, నేనూ మహిళల సమస్యల పై వ్యాసాలు రాసేవాళ్లం. స్త్రీ స్వేచ్ఛ, లైంగికత, పేట్రియార్క్ అశ్లీలత, సమానత్వం తదితర అన్ని కోణాల్లో అధ్యయనం చేసి పుస్తకాలు వేశాం. ఆ పుస్తకం గురించి మహిళ ఉద్యమాలకు నాయకత్వం వహించేవాళ్లు చాలా మంది తమకు మంచి రీసోర్సుగా ఉపకరించిందన్నారు. వామపక్ష మహిళా సంఘాలకు ఒక సిలబస్‌గా ఉపకరించింది. సమహిళా జీవన సమస్యలు – మూలాల అన్వేషణ’ పుస్తకం తమకు ప్రేరణగా నిలిచిందని చాలామంది చెప్పారు.
కొలిమి: సాహిత్యానికి విమర్శ అవసరం లేదనే వాదన వస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
ప్రొ. కాత్యాయని: ఇటీవల వచ్చిన బహుళ వ్యాస సంకనలంలో ‘అసుర’ రాసింది పోయెటిక్ కోణంలో అనుండవచ్చు. సమాజానికి విమర్శ అవసరమే. విమర్శకులు పాఠకుల కంటే విభిన్నం కాదు. కానీ పాఠకుల కంటే ఉన్నతస్థాయి పాఠకులుగా విమర్శకులను భావించాలి. రచనలోని ఉద్వేగాలు, ప్రేరణలు, ఆలోచనలు, ఆవేదనలు అందరికీ కలగకపోవచ్చు. విమర్శకులు తాము గుర్తించిన ప్రత్యేక విషయాలను విశ్లేషణాత్మకంగా రాయడమే విమర్శ వ్యాసమౌతుంది. విమర్శ ఒక విశాలమైన భవంతిలాంటిది. ఆ భవనంలోకి ఏ ద్వారం నుంచి వెళ్లాలి? ఎక్కడ వెలుగుంది? వెచ్చదనమెక్కడుంది? రత్నాలు ఎక్కడ దొరుకుతాయో విమర్శ విప్పి చెబుతుంది. అందుకే విమర్శ ఉండాల్సిందే. పాఠకులకు, రచయితలకు విమర్శ ఒక వారధిలాంటిదిగా మనం గుర్తించాలి.
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటు నేపథ్యం ఏమిటి? దాంట్లో మీ పాత్ర?
ప్రొ. కాత్యాయని: ఇది ఉద్యమాల యుగం అనుకుంటున్నాం కదా! చాలా అస్తిత్వ, సామాజిక సమస్యలు ఉన్నవి. వీటి మీద ఏదో ఒకస్థాయిలో పనిచేయాలనే లక్ష్యం. వర్గ పోరాటమే అంతిమ లక్ష్యమనే దృక్పథం నుంచి వచ్చాను. ఇక్కడ కొన్ని మహిళా సమస్యలు పక్కకు నెట్టబడుతున్నాయి. కనుక ప్రత్యేకంగా అధ్యయనం చేయాలనుకున్నాం. 1980 నుంచి 1995 వరకు మహిళల సమస్యలపై క్రియాశీలంగా పనిచేశాను. ఒక సాహిత్య విద్యార్థిగా ప్ర.ర.వే. ఏర్పాటు చేశాం. స్త్రీవాదం 1990 నుంచి ప్రధాన స్రవంతిగా వచ్చింది. తర్వాత దళిత, మైనార్టీ సాహిత్య ఉద్యమం ఊపందుకుంది. ఈ క్రమంలోనే స్త్రీవాదాన్ని ప్రశ్నించడం మొదలెట్టారు. స్త్రీవాదంలో అగ్రవర్ణ జీవితం తప్ప దళిత, మైనార్టీ దృక్పథం లేదని ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో రచయితలు ఎవరికివారుగా చీలిపోయారు. ఒక దశలో స్త్రీవాదంలో స్తబ్దత నెలకొందనే క్రమంలో ప్ర.ర.వే ఏర్పడింది. స్త్రీవాదం ఒక జాతిగా మహిళలందరూ ఒక్కటేనని చెబుతుంది. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా సామాజికంగా, ఆర్థికంగా, భౌగోళికంగా స్త్రీలకు విభిన్న సమస్యలున్నాయని గుర్తించాం. ఒకవైపు సిద్ధాంతానికి, మరోవైపు సమస్యలకు సమన్వయం కుదర్చకపోతే సమాజాన్ని ముందుకు నడిపించదని మాకనిపించింది. ఆ ఆలోచనల నుంచే విశాఖలో కె.మల్లీశ్వరి మిత్రబృందం 2010లో ‘మనలో మనం’ కార్యక్రమం ఏర్పాటు చేసి సమావేశానికి మహిళా రచయితలందరినీ ఆహ్వానించింది. విశాఖ రచయిత్రుల సమావేశంలో అన్ని రకాల సమస్యలపై చర్చిచింది. అక్కడ అగ్రవర్ణ ఆధిపత్య సమస్యపై దళితులు లేవనెత్తారు. దళితులు, మైనార్టీలు, అగ్రవర్ణ రచయితలు స్నేహపూర్వకంగా కలిసి చర్చిస్తేనే పరిష్కారం వుంటుందని భావించాం. అందుకోసం ఒక సంస్థ అవసరమని భావించాం. ఒక ఏడాది ‘మనలో మనం’ పేరుతోనే సాహితీ సమావేశాలు జరిపాం. 2010లో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్మాణం చేశారు. సంస్థ నిర్మాణంలో కూడా ఒక నియమావళి ఏర్పాటు చేశాం. రచయిత్రుల సమన్వయంతో మహిళల విభిన్న సమస్యలపై కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. చల్లపల్లి స్వరూపరాణి, పుట్ల హేమలత, జాజుల గౌరి అధ్యక్షులుగా, నేను జాతీయ కార్యదర్శిగా పనిచేశాను. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాడ్డక తెలంగాణకు కార్యదర్శిగా కొనసాగుతున్నాను. హైదరాబాద్ లో జరిపిన తొలి ప్ర.ర.వే కార్యవర్గ సమావేశానికి రాకుండానే ప్ర.ర.వేలో అగ్రవర్ణాలకు ప్రచారం వచ్చిందని ఆరోపిస్తూ దళిత రచయిత్రులు కొందరు మట్టిపూలు అనే సంస్థను ఏర్పాటు చేశారు. మహిళా విమర్శకుల కోసం ఇటీవల హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో కథా వర్క్ షాపు కూడా నిర్వహించాం. త్వరలోనే ఆ సదస్సు వ్యాసాలు పుస్తకంగా రానుంది.
కొలిమి: ప్రజా రచయితలని ఎవరిని అనాలి? రచయితలు ప్రభుత్వ అవార్డులు తీసుకోవడంపై మీ అభిప్రాయం?
ప్రొ. కాత్యాయని: ప‌్రజా రచయితలు ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవాలి. ప్రజా సమస్యలను పట్టించుకొని, వాటి గురించి రాసేవారే ప్రజా రచయితలు. సమస్యల పరిష్కారానికి ప్రజాపక్షంగా మాట్లాడేవారినే ప్రజా రచయితలుగా భావిస్తారు. అవార్డులు తీసుకోవడం అనేది చాలా స్థాయిల్లో వుంటుంది. సమాజం మొత్తం ఒకే చైతన్యస్థాయిలో లేదు. ప్రభుత్వానికి పూర్తి ధిక్కారంలో ఉన్నామని ప్రకటించడం రచయిత అత్యున్నత దశ. నిజానికి మనం ప్రభుత్వ ఉద్యోగం చేయడం లేదా ? ప్రభుత్వానికి పన్నులు కట్టడం లేదా? అన్ని రకాల అవార్డులు ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఇవ్వదు. రచయితలు అవార్డులు తీసుకోవద్దనే స్టాండ్ విరసంకు ఉంది. ఎందుకంటే విరసం పూర్తిగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంగా వుంది. ప్ర.ర.వేలో విభిన్న భావజాలం కలిగిన రచయితలున్నారు. ప్ర.ర.వే సమసమాజ కేంద్రంగా అందరినీ కూడగట్టుకొని ముందుకు వెళ్తుంది. నిబద్దతకు కంకణ బద్దులైన రచయితలు ఎక్కడి నుంచి వస్తారు ? నిరంతరం సమసమాజ భావజాల వ్యాప్తితో రచయితల్లో మార్పు సాధ్యం. అవార్డులు తీసుకోవడం మీద అంత చర్చ అవసరం లేదనుకుంటాను. ఆచరణ ముఖ్యమైంది. ఆచరణలో ఉన్నవారికి అవార్డులు ఏమీ రావు. నాకు కేంద్ర సాహితీ అవార్డు వచ్చింది. నేను అవార్డు తీసుకోవడం పట్ల కొందరు చాటుమాటుగా మాట్లాడుకున్నారు. ప్రజలవైపు నిలబడే సందర్భం వచ్చినపుడు ఒక దశలో మేధావులు, రచయితలపై జరుగుతున్న దాడులను నిరసించాను. నాకొచ్చిన అవార్డును మెమెంటో, లక్ష రూపాయల చెక్కును వెనక్కి పంపాను.ఇచ్చిన అవార్డులు వెనక్కి తీసుకునే వ్యవస్థ తమ వద్ద లేదన్నారు. రచయితలపై జరుగుతున్న అపచారానికి చింతిస్తున్నామని జవాబు రాశారు. అయితే అవార్డుల మీద రచయితకు భ్రమలుండకూడదు. అవసరమైనపుడు రచయితలు ధిక్కార స్వరం వినిపించాలి.
కొలిమి: సాహిత్యంలో అత్యంత ప్రభావశీలురైన విమర్శకులు ఎవరు?
ప్రొ. కాత్యాయని: నేను ప్రధానంగా వరవరరావు, త్రిపురనేని మధుసూదనరావుల ఉపన్యాసాలు, వారి రచనలు చదివి ప్రభావితమయ్యాను. సాహిత్యాన్ని ఎట్లా అవగాహన చేసుకోవాలనే విషయాన్ని వీరి ద్వారా తెలుసుకున్నాను. 1978 నుంచి మార్క్సిజంతోపాటు వీరి ఉపన్యాసాల నుంచి ఒక దృక్పథం ఏర్పడింది. వాళ్ల రచనల నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రాచీన సాహిత్యం చదవడానికి త్రిపురనేని మధుసూదనరావు రచనలు నూతన మార్గం వేశాయి.
కొలిమి: సాహిత్య విమర్శలో మీ కృషి గురించి చెప్పండి?
ప్రొ. కాత్యాయని: నాకు నవలలు ఇష్టం కావడం వల్లనే ‘చివరకు మిగిలేది’ నవల పై పరిశోధన సిద్ధాంతం రాశాను. పీజీలో నవలు ఒక పేపరు కూడా వుండేది. అప్పటి నుంచి నవలలు బాగా ఇష్టంగా చదివేది. మార్క్సిజం మీద ఇష్టంతో 1978లో రావిశాస్త్రి గారి రచనలు చదివి వ్యాసాలు రాశాను. దాంతో సాహితీ దృక్పథం మీద చాలా స్పష్టత వచ్చింది. దుష్యంతుని విషయంలో రాజు రక్తం తప్పు చేయదనడంలోని క్లాసికల్ సాహిత్య రాజకీయం బాగా ఆలోచింపచేసింది. మార్క్సిజం, ఫెమినిజం వెలుగులో ప్రాచీన సాహిత్య అధ్యయనం విమర్శ రచనకు ఉపకరించింది. నాపై రంగనాయకమ్మ రచనల ప్రభావం చాలా ఉంది.’స్వీట్ హెూం’నుంచి ‘జానకి విముక్తి’వరకు చదివాను. కుటుంబ జీవితంలో స్త్రీ తన వ్యక్తిత్వం ఏవిధంగా నిలుపుకోవాలో తెలుసుకున్నాను. యద్దనపూడి సులోచనరాణి రచనలు కూడా ఇష్టమే. రోమాంటిక్‌గా విషయాన్ని చెప్పడం ఆమె ప్రత్యేకత చెప్పుకోవచ్చు. నేను ఎక్కువగా వచన సాహిత్యాన్ని ఇష్టపడి చదివాను. గురజాడ,కందుకూరి రచనలు చదివి విమర్శ కూడా రాశాను.
కొలిమి: ఒక రచయిత తాను ఎపుడు విజయవంతమైనట్లు భావించాలి?
ప్రొ. కాత్యాయని: ఇంటికి వున్న సాహిత్యానికి కొత్త కోణాలను ఆవిష్కరించి చూపడమే రచయితగా విజయవంతమైనట్లు భావించాలి. రోటీన్‌గా అందరూ చెప్పిన అంశాలనే మళ్లీ చెబితే విషయానికి మొనాటనీ ఏర్పడుతుంది. అందరికంటే భిన్నంగా, ఎవరూ చెప్పని ఒక కొత్త పార్శ్వాన్ని చూపితే అది మంచి రచన అవుతుంది. ప్రతీ రచనలో కొత్త విషయాన్ని చెప్పడానికి లోలోపల యుద్ధం చేస్తాను. అది కొత్త విషయాన్ని చెప్పలేకపోతే నేను వ్యాసం రాయలేను.
కొలిమి: విమర్శలో మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి?
ప్రొపెసర్ కాత్యాయనీ : ప్రాచీన సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో విమర్శ చేసే ప్రారంభంలోనే కొందరికి కంటయ్యాను. నాకు రెండు అనుభవాలు ఎదురైనవి. హైదరాబాదులోని ఓరియంట్ కాలేజీ సదస్సులో మొల్ల రామాయణం మీద పత్ర సమర్పణ చేశాను. సీతాదేవి, శ్రీరాముడి పాత్రలను సాధారణ వ్యక్తులుగా వ్యక్తిత్వ విశ్లేషణ చేశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పత్రాల్లో శ్రీరాముణ్ణి దేవుడు, శక్తి, మహత్తు తదితర అంశాలతో ఇతరులు చిత్రించి విశ్లేషణ చేశారు. నా పత్రంలో మనుషులుగా మానవ సంబంధాలు, స్త్రీ వేదనగా చిత్రించడాన్ని సంప్రదాయ పండితులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త కోణంలోని నా పత్రానికి ప్రొఫెసర్ నిర్మల, ప్రొఫెసర్ పద్మావతి, పాపినేని శివశంకర్ మద్దతు పలకడం సంతోషం అనిపించింది. మరోసారి రాజమండ్రిలో రిఫ్రెషర్ కోర్సులో ‘సాహిత్యంలో స్త్రీ ‘ అనే అంశం పై సదస్సులో మాట్లాడుతున్నాను. సాహిత్యంలో సీతను శ్రీరాముడు వదిలివేయడానికి సాహిత్యంలో జరిగిన రాజకీయాన్ని విశ్లేషించాను. స్త్రీవాదాన్ని ఆధునిక సాహిత్యంలో మాట్లాడాలన్నారు. కానీ ప్రాచీన సాహిత్యంలో స్త్రీవాదం ఏంటని ప్రశ్నించారు. అయితే నా విశ్లేషణలో దోషాలుంటే చెప్పమని ఎదురు ప్రశ్నించాను. ఇక్కడ కేయూలో కూడా స్త్రీవాద దృక్పథంతో సాహిత్య అధ్యయనం చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోయారు.
కొలిమి: నేటి సాహిత్య విమర్శ పరిస్థితి ఏమిటి?
ప్రొ. కాత్యాయని: సమగ్ర విమర్శకు పత్రికలు నియమాలు పెడుతున్నాయి. స్థల, కాల పరిమితులతో పత్రికల్లో విమర్శ ఇబ్బందిగానే వుంది. అయితే ఇంటర్ నెట్ పత్రికల్లో విమర్శ విస్తృతంగా రాస్తున్నారు. ఇది మంచి పరిణామం. విశ్వ విద్యాలయాల్లో విమర్శ పేలవంగా, బలహీనంగా, మోహమాటంతో కూడి వుంటుంది. ప్రస్తుతం పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు. అకాడమిక్ విమర్శలో సిరియస్ నెస్ అవసరం ఉంది. ఇది ఎవరూ పెంచుకోవడం లేదు. బయట చేస్తున్నవాళ్లు మరింత కృషి చేయాల్సిన అవసరం వుంది.
కొలిమి: ప్రాచీన సాహిత్యం చదవడం అనవసరమని, అదంతా చెత్త అనే ఒక అభిప్రాయం బలంగా ఉన్న ఆ రోజుల్లో మీరు ఆ సాహిత్యాన్ని విమర్శనాత్మకంగా చూడటం మొదలెట్టారు. ఆ పని అవసరం, మీకు అందించిన పరికరాలు, మీ అన్వేషణలు, నిర్దారణలు చెపుతారా?
ప్రొ. కాత్యాయని: ప్రాచీన సాహిత్యాన్ని మహిళల కోణం నుంచి చదవాలనిపించింది. అధ్యయనంలో స్త్రీవాద ఉద్యమ పరికరాలు నాకు బాగా ఉపకరించాయి. ప్రధానంగా మానవ సంబంధాలు, స్త్రీ పురుష సంబరాలు అవగాహన చేసుకున్నాను. మహిళలు ఎందుకిలా ఉన్నారో విచారించడానికి ప్రాచీన సాహిత్యం ఉపకరించింది. త్రిపురనేని మధుసూదనరావు, కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల విమర్శ ఉపకరించింది. కట్టమంచి గారు ఓ చోట ‘తెలుగు సాహిత్యంలో మహిళలు ఎందుకిలా ఉన్నారో ఎవరూ ఆలోచించడంలేదని వ్యాఖ్యానిస్తారు. ఆదే నాకు కొత్త మార్గాన్ని సూచించింది.
కొలిమి: రచయితగా బుచ్చిబాబు విలక్షణమైనవారు. ఆయన మీద పరిశోధన కొత్తదారి అనిపించలేదా ? మీ అనుభవాలు, విశ్లేషణలు పాఠకులతో పంచుకుంటారా?
ప్రొ. కాత్యాయని: అల్పజీవి, అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది, ఏకవీర నవలలు నా ఎం.ఏ. సిలబస్‌లో చదివాను. అపుడే చాలా విషయాలు తెలుసుకున్నాను. బుచ్చిబాబు నవల మీదనే పీహెచ్‌డీ చేశాను. ఆయన రచనల్లో జాతీయోద్యమం, ఇడిపస్ కాంప్లెక్స్, మానవీయ కోణంలో విలువలు, శీలం, లైంగికత తదితర అద్భుత పరిశీలనలు కనిపిస్తాయి. ఆంగ్ల సాహిత్యంతోపాటు ఫ్రాయిడ్, యాడ్లర్ ప్రభావం మనకు కనిపిస్తుంది. బుచ్చిబాబు మీద ఒక మోనోగ్రాఫ్ కూడా రాశాను. త్వరలో ముద్రణకు కానుంది. ఇపుడు మళ్లీ ఆలోచిస్తుంటే బుచ్చిబాబులో స్త్రీవాద కోణాలు కూడా ఉన్నాయనిపిస్తుంది. చివరకు మిగిలేది నవల మీద పరిశోధనకు ఆచార్య సుప్రసన్నాచార్య, బంగోరె, ఆచంట జానకీరామ్, ఆర్.ఎస్.సుదర్శనం తదితరులు అభినందించిన అనుభం ఇప్పటికీ మరచిపోలేనిది. రావిశాస్త్రిలాంటి వాళ్లు బుచ్చిబాబు రచనల మీద పీహెచ్‌డీ చేస్తున్నావా? అంటూ తీసిపారేశారు. ఆయనలో మార్క్సిస్టు ఆలోచనలు లేవనికావచ్చు. వాస్తవానికి మానవీయ కోణంలో అవగాహన చేసుకోవాల్సిన రచయిత బుచ్చిబాబు.
కొలిమి: వాసిరెడ్డి సీతాదేవి, కొడవటిగంటి దగ్గర మొదలై ఈ నలభై ఏళ్లలో ఎందరో కథా నవలా రచయితలను విశ్లేషించారు. ఇపుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది?
ప్రొ. కాత్యాయని: కథా విమర్శ మీద నేను రాసిన వ్యాస సంకలనం 600 పేజీలతో త్వరలో పుస్తకం రానుంది. ఒక్కొసందర్భంలో ఒక్కో రచన చేశాను. సీతాదేవి నవలపై వ్యాసం రాయడానికి తరగతి గది నిర్దేశించింది. రాబందులు రామచిలుకలు నవల బి.ఏ. విద్యార్థులకు సిలబస్‌లో వుంది. ఆ నవలను విద్యార్థులకు చెప్పడానికి అధ్యాపకురాలిగా వివిధ రంగాల నిపుణులతో చర్చించేదాన్ని. ఆ క్రమంలోనే ప్రొఫెసర్ జ్యోతిరాణి, నేను కలిసి ఆరవై పుటల వ్యాసం రాశాం. ఆరోజుల్లో సుధా సృజన పత్రికలో సమీక్ష చేశారు. గురజాడ, కొకు శతజయంతుల సందర్భాల్లో వారి కథలు చదివి అనేక సభల్లో మాట్లాడాను. కొత్త కోణాలు బయటకు వచ్చాయి. కొడవటిగంటి కథల్లో ప్రాతివత్యం మీద విమర్శ వ్యాసం రాశాను. శ్రీశ్రీ కథలు, నాటకాలు, కవిత్వం మీద విమర్శ రాశాను. ఆయా సామాజిక సందర్భాలు విమర్శకులను ఉత్తేజపరుస్తాయి. సమాజానికి ప్రతీ రచయిత తాను ఎన్నుకోబడని ప్రతినిధి అనుకొని ప్రజలను చైతన్యం చేయాలి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సాహిత్యం ఒక మార్జిన్.
కొలిమి: వరంగల్ ఉద్యమాల నేపథ్యం మీ సామాజిక, సాహిత్య జీవనాన్ని ఏమేరకు ప్రభావితం చేశాయి?
ప్రొ. కాత్యాయని: వరంగల్ లేకపోతే కాత్యాయని లేదు. నాకీ సాహిత్యం లేదు. ఎం.ఏ తర్వాత నేను, నా వ్యక్తిత్వం రూపొందింది. అంతకుముందు మధ్యతరగతి మంచి విద్యార్థిని. బుద్ధిగా కాలేజీకి వెళ్లడం, చదువు కోవడం, అల్లరి చేయడం వరకే పరిమితం. వరంగల్ ఒక నిర్దిష్ట దృక్పథాన్ని మాత్రం ఇచ్చింది. ఆర్ట్స్ కాలేజీ సాహిత్యం పట్ల కొత్త దృక్పథాన్ని చూపించింది. ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకురాలిగా ఉద్యోగంలో చేరడం నాకు గొప్ప అవకాశం. ఆ కాలంలో కాలేజీ తరగతి గదుల్లో రాడికల్ విద్యార్థుల ప్రశ్నలు బాగా ఆలోచింప చేశాయి. విద్యార్థులు నన్ను విస్తృతంగా చదవడానికి ప్రేరేణగా నిలిచారు. అక్కడి నుంచే మార్క్సిస్టు ప్రాథమిక సూత్రాల అధ్యయనం మొదలైంది. జగిత్యాల జైత్రయాత్ర, విరసం సాహిత్య పాఠశాల ప్రభావం చూపాయి. అక్కడే వరవరరావు, త్రిపురనేని మధుసూదన్ రావు, చలసాని ప్రసాద్, కె.వి.రమణారెడ్డి, అల్లం రాజయ్య, అందరినీ ఆ సమావేశాల్లో కలవడం గొప్ప జ్ఞాపకాలు. ప్రతీ సమావేశానికి హాజరయ్యేదాన్ని. రాడికల్ విద్యార్థులు కాజీపేట పరిసర గ్రామాల్లో నిర్వహించే మీటింగులకు వెళ్లి వినేది. మిత్రులతో కలిసి అర్ధరాత్రి మా ఇంటికి వచ్చేది. ఈ అనుభవాలే నన్ను తీర్చిదిద్దాయి. వరంగల్ లేకపోతే దృక్పథం లేదు. నా అస్తిత్వం లేదు.
కొలిమి: కొత్త రచయితలకు మీరిచ్చే సలహాలు?
ప్రొ. కాత్యాయని: విమర్శకులు బాగా అధ్యయనం చేయాలి. సృజనకు అంతగా చదవాల్సిన అవసరం ఉండదు. కానీ విమర్శకు ఎక్కువ అధ్యయనం చేయాలి. సృజనకారులు కూడా ఇతరుల రచనలు చదవడం మంచిది. ఒక అనుభవం నుంచి, ఉద్వేగం నుంచి, ఓ బాధ నుంచి కథ, నవల కవిత రాయవచ్చు. విమర్శకు విస్తృతంగా అధ్యయనం చేయాల్సి వుంటుంది. ఒకరి రచనలు చదవకుండా రచనలు చేస్తే జీవం వుంటుందా ? అని కవి కె.శివారెడ్డి ఓ సందర్భంలో ప్రశ్నిస్తారు. అవును మరి. రచననలో జీవం వుండాలంటే సాహిత్యం చదవాలి. ఇతరులను చదివినపుడు వ్యక్తీకరణలు, సందర్భాలు తదితర విషయాలు తెలిస్తే తాము చేయబోయే రచనలో అందం వస్తుంది. కథను చదివి కథ చెబితే అది విమర్శకాలేదు. కథా రచయిత ఏ లౌకిక అంశాల మీద దృష్టి పెట్టింది కనుక్కోవాలి. రచనలో పైకి కనిపించని అంతర దృష్టిని కనుగొని తెలియజేయాలి. విభిన్న కోణాల ఆవిష్కరణకు విస్తృత అధ్యయనం చేయాలి. సమాజానికి, రచనకు మధ్యన ఉన్న అనుసంధానాన్ని బయట పెట్టడమే విమర్శ లక్ష్యం కావాలి.
కోడం కుమారస్వామి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. కవిగా, మంచి విమర్శనాత్మకంగా వుంది.
కోడం కుమారస్వామి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. కవిగా, మంచి విమర్శనాత్మకంగా వుంది.
ధన్యవాదాలు సర్….
VERY GOOD INTERVIEW SIR
యి రోజుల్లో ప్రజారచయితలు అంటూ ఉన్నారా ???
గుర్తింపులు — బిరుదల కోసం — డబ్బు కోసం —-ఆరాటపడే రచయితలు నేడు
వాళ్ళ లో గ్రూప్ లు
నా ఆర్టికల్ గురించి రాయి — అని రాపించుకునే వాళ్ళు
రాసేది ఒకటి — చేసేది మరొకటి
బుచ్చి బాబు // తిలక్ లాంటి వాళ్ళు ఎక్కడ ??
బుచ్చి రెడ్డి గంగుల
అపూర్వ స్పందనకు ధన్యవాదాలు సర్…
Interview bavundi
ధన్యవాదాలు సర్…
కోడం గారు ఇంటర్యూ చాలా బాగా చేశారు…మరిన్ని మంచి రచయితలవి కూడా మీద్వారా అందించండి.
ధన్యవాదాలు సర్…
something good interview. but very deep questions need to ask to get more information about prof.kathyayani vidmahe madam.
మరో అవకాశం వస్తే తప్పకుండా అడుగుతాను …ధన్యవాదాలు సర్…