(ఆమెది పదునైన విమర్శ. మార్క్సిజం వెలుగులో సమాజ సాహిత్య సంబంధాలను నిశితంగా విశ్లేషించే విమర్శ. ఆమె అక్షరాలకు ఎలాంటి రాగద్వేషాల్లేవు. వర్గపోరాట పునాది మాత్రమే అన్ని అస్తిత్వ సమూహాలను సంఘటితం చేస్తుందనే ప్రత్యామ్నాయ ఆలోచనల ‘చూపు’ ఆమెది. వచనమైనా, అనువాదమైనా అత్యంత సహజంగా రాసే శైలి ఆమెది. ప్రస్తుతం దేశంలో చెలరేగుతున్న ఫాసిజాన్ని ఎదిరించడానికి అన్ని అస్తిత్వ సమూహాలు సంఘటితం కావాలంటున్న కాత్యాయనితో ‘కొలిమి’ సంభాషణ.)
మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి?
పుట్టి పెరిగినది నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు అనే చిన్న గ్రామం. బి.ఎస్సీ తర్వాత మా కుటుంబం హైదరాబాద్ కు వచ్చింది. తెలుగు సాహిత్యంలో పీజీ కి హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయినయ్యాను. కెకెఆర్ గారి గైడెన్స్ లో, విమల కవిత్వం పై ఎం. ఫిల్, వలసపాలనలో విద్య – తెలుగు సాహిత్యంలో ప్రభావాలు, స్పందనలు అనే అంశంపై పిఎచ్. డి, అక్కడే చేశాను.
మీకు సాహిత్యం ఎట్లా పరిచయం అయింది? సాహిత్యంలో మీమీదున్న ప్రభావాలేమిటి?
ఇంట్లో అందరికీ పుస్తకాలు చదివే ఆసక్తి ఉండటంతో చాలా పుస్తకాలు అందుబాటులో ఉండేవి. మా ఊళ్ళోనూ, కాలేజ్ లోనూ మంచి లైబ్రరీలు ఉండేవి. వీటన్నిటితో చదవటంలోని రుచి తెలిసింది. రష్యన్ సాహిత్యం, బెంగాలీ సాహిత్యం మొదట్లో ఎక్కువగా పరిచయమైంది. మానవ స్వభావాల్లోని వైవిధ్యాన్ని, షేడ్స్ నూ ఆ రచయితలు చిత్రించే విధానం చదివినప్పుడల్లా ఆశ్చర్యం గొలుపుతూనే ఉంటుంది. జీవితానుభవాలతోబాటు సాహిత్యాభిరుచిలో మార్పు సహజమే.
అన్ని ప్రక్రియల సాహిత్యాన్నీ చదువుతాను. కానీ కవిత్వంకన్నా వచన సాహిత్యంపై అభిరుచి. భావవ్యక్తీకరణకు, స్పష్టతకు వచనంలో ఎక్కువ స్కోప్ ఉంటుంది. వచన శైలులలోని వైవిధ్యాన్ని స్టడీ చెయ్యటం ఆసక్తికరం. ఆలోచనకు పనిచెప్పే ప్రతి పుస్తకమూ ఇష్టమే కాబట్టి తత్త్వ శాస్త్రానికీ, సాహిత్య విమర్శకూ చెందిన రచనలు మరింత ఆసక్తికరంగా తోస్తాయి.
మన వెలుపలి ప్రపంచాన్ని విమర్శించటమే కాకుండా లోపలి ప్రపంచాన్ని నిర్మోహంగా విమర్శకు పెట్టమనే రచనలంటే ఇష్టం. దొస్తయేవ్స్కీ, చలం, త్రిపుర వంటి రచయితలు ఆ ధైర్యాన్ని అందిస్తారు. వాళ్ళతో విభేదించే అంశాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు నేర్పిన మెథడాలజీ విలువైనది. చలం రచనల్లో స్త్రీ స్వేఛ్చకన్నా ప్రధానమైన అంశం- కెరియరిజం మీదా, హిపోక్రసీ మీదా ఆయన చేసిన పోరాటమని నాకు అనిపిస్తుంది. సాహిత్యంతో పరిచయం కాకపోతే జీవితంలో చాలా కోల్పోయేదాన్నని అనుకుంటాను.
వామపక్ష ఉద్యమాలతో మీ పరిచయం, ప్రయాణం గురించి చెప్పండి. మీ ఆలోచన, ప్రాపంచిక దృక్పథం ఎట్లా రూపొందినయి?
వామపక్ష భావజాలంతో నా పరిచయం ప్రధానంగా సాహిత్య అధ్యయనం ద్వారానే. వీక్లీలతోబాటు సృజన, ప్రజాసాహితి, చార్వాక వంటి పత్రికలు చదివే అవకాశం దొరికింది. ప్రతి సాహిత్య రచనకూ ఒక స్వభావం ఉంటుందనీ, బలహీనుల పక్షాన నిలబడేది ఉన్నతమయిన సాహిత్యమనీ అర్థమయ్యేకొద్దీ, అటువంటి సాహిత్యంలోని భావజాలంపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో మార్క్సిజం పరిచయమయింది. సమాజాన్నీ, మానవ సంబంధాలనూ గురించి నాకున్న అనేక సందేహాలకు అక్కడ జవాబులు దొరికాయి.
హైదారాబాద్ వచ్చాక వామపక్ష ప్రజాసంఘాలతో, సాహిత్య సంఘాలతో పరిచయం పెరిగింది. విలువైన మిత్రులు దొరికారు. కొన్ని సంఘాలతో, వేదికలతో కలిసి పనిచేసే అవకాశం ఏర్పడింది. ఐతే, ఇక్కడ ప్రగతిశీల సంస్థల మధ్యనున్న తీవ్రమైన వైరుధ్యాలు ఆశ్చర్యపరిచాయి. స్థూలంగా ఒకే లక్ష్యాన్ని, వ్యూహాన్ని ప్రకటించుకున్న సంస్థల వైరుధ్యాలు కొన్నిసార్లు పరస్పర హత్యలదాకా పోవటం చాలా బాధించింది. సైద్ధాంతికంగా అభిమానం ఉన్నప్పటికీ ఈ నిర్మాణాలలోని కొన్ని లక్షణాలు నన్ను భయపెట్టాయి. వాటిలో సాంకేతికంగా సభ్యురాలిగా ఉండలేకపోయాను. నేను గౌరవించే వ్యక్తులు, ఆచరణ వివిధ సంస్థలలో ఉన్నప్పుడు ఆయాకార్యక్రమాలలో, వేదికలలో కలిసి పనిచేయటానికి నాకు అభ్యంతరం కనబడలేదు.
‘చూపు’ పత్రిక నేపథ్యం, నిర్వహణ గురించి చెప్పండి. ఆ పత్రిక ఆగిపోవడానికి కారణాలు ఏమిటి?
కొన్ని ప్రగతిశీల సంస్థల పత్రికలతో కలిసి పనిచేసినప్పుడు కొన్ని విషయాలు గమనించాను. వాటిలో రచయితలుగా, పాఠకులుగా ఉండేవాళ్లు దాదాపుగా ఆ సంస్థల సభ్యులూ, సానుభూతిపరులూ మాత్రమే కావటమూ, ఆ సంస్థలపై విమర్శనాత్మకంగా ఉండే రచనలకు చోటు లేకపోవటమూ కనబడేది. స్థూలంగా భావసారూప్యం కలిగిన సమూహాల నడుమ అధ్యయనానికీ, చర్చకూ చోటిచ్చే ఒక వేదిక ఉంటే బావుంటుందని కొందరు మిత్రులం అనుకున్నాం. దాని ఫలితమే ‘చూపు’.
మేం ఆశించినట్టే వివిధ ప్రగతిశీల సంస్థలకు చెందినవారు, అస్తిత్వవాద సమూహాలూ కూడా పత్రికను పాజిటివ్ గా స్వీకరించి, రచనలు చేశారు. మంచి చర్చలు జరిగాయి. ఆర్థిక, సాంకేతిక బాధ్యతలను మిత్రులు, కుటుంబ సభ్యులూ పంచుకున్నారు. నవ్య ప్రెస్ ఆర్కే గారు, ఆర్టిస్ట్ మోహన్ గారూ ఇచ్చిన సపోర్ట్ గొప్పది. పత్రిక బాధ్యులుగా కొందరి పేర్లు దానిపై కనబడటం కేవలం సాంకేతికం. నిజానికి అదొక ఉమ్మడి ప్రయత్నం. పేర్లు చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది.
పత్రిక ఎలా ఉండాలనే దానిపై మాకు స్పష్టత ఉండింది కానీ, నిర్వహణకు సంబంధించిన వ్యాపార పరిజ్ఞానం లేదు. వ్యాపార ప్రకటనలకూ, ఏవయినా సంస్థలతో ఆర్థిక సంబంధాలకూ దూరంగా ఉండాలనేది పాలసీ. నవోదయ, మైత్రి, మణి బుక్ స్టాల్ వంటి కొందరుతప్ప, వ్యక్తుల ద్వారా అమ్ముడయిన కాపీలకు డబ్బులు చాలాసార్లు తిరిగి వచ్చేవి కాదు. క్రమంగా ఆర్థిక భారం పెరిగి, ఆపెయ్యక తప్పలేదు. ఆ తరువాతి కాలంలో తెలుగు సాహిత్య, మేధా రంగాల్లో వచ్చిన మార్పులు చూశాక అంత కష్టపడి కొనసాగించాలన్న ఆసక్తి కూడా పోయింది.
ఐనా, పత్రికను సుదీర్ఘకాలం నడపాలన్నది మా లక్ష్యం కాదు కూడాను. భిన్నమైన సమూహాల నడుమ ప్రజాస్వామికమైన చర్చను నిర్మొహమాటంగా జరపటం చిన్న బృందాలకు కూడా సాధ్యమేనని చెప్పాలనుకున్నాం. ఆ విషయంలో రాజీ పడకుండా తీసుకు రాగలిగామనే సంతృప్తి ఉంది.
మీ అనువాద రచనలకు ఎంపిక ఎలా చేసుకుంటారు? మూల రచనలోని జీవం పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
అనువాద రంగంలోకి ముందుగా అనుకుని రాలేదు. చూపు, మరికొన్ని పత్రికల కోసం అవసరమైన రచనలను అనువాదం చేసే క్రమంలో ఆసక్తి ఏర్పడింది. ఏకకాలంలో రెండు భాషలతో ఇంటరాక్ట్ కావటం ఆసక్తికరంగా తోచింది. హెచ్ బిటి, గీతా రామస్వామి అడిగిన కొన్ని పుస్తకాల అనువాదంతో మొదలయిన ఈ వ్యాసంగం, వేర్వేరు ప్రచురణ కర్తలకు వివిధ ప్రక్రియల్లో దాదాపు ముఫ్ఫై పుస్తకాల దాకా సాగింది.
అనువాదం సహజంగా రావాలంటే భాష తెలిస్తే చాలదు, ఆ భాషలు మాట్లాడే జన జీవితంలోని సంప్రదాయాలను కూడా తెలుసుకోవాలి. అందుకు అవసరమైన సమాచారాన్ని స్టడీ చేస్తాను. అలాగే, మన ప్రాపంచిక దృక్పథానికి, భావోద్వేగాలకూ సరిపడని రచనలకు మంచి అనువాదం చెయ్యలేమని నా అభిప్రాయం. ఏదో ఒక కోణంలోనయినా నాకు ఆసక్తి కలిగించనిదే ఏ పుస్తకాన్నీ నేను అనువాదం చెయ్యను. ముందుగా మూల రచనను చదివి, అర్థం చేసుకుని, సందేహాలకు జవాబులు తెలుసుకున్న తర్వాతనే అనువాదం మొదలు పెడతాను. ఇంగ్లిష్ అనువాదం ద్వారా చేస్తున్నప్పుడు ఎన్ని వెర్షన్స్ దొరికితే అన్నీ చదివి, మూల రచయిత భావాలకు దగ్గరగా ఉన్న దానిని ఎన్నుకుంటాను. ఆ రచన తాలూకు మూడ్ నుండి పక్కకు పోకుండా ఉండటానికి, ఒక సమయంలో ఒక పుస్తకం మీద మాత్రమే పనిచేస్తాను.
ఒక్కొక్క రచయితను అనువదించటం ఒక్కో ప్రత్యేకమైన అనుభవం. రోజర్ గరౌడీ, జేమ్స్ పెట్రాస్ రచనల అనువాదం, మార్క్సిజాన్ని గురించిన చాలా సందేహాలకు జవాబులనిచ్చింది. గణేశ్ ఎన్ దేవి After Amnesia, ఆలోచనకు పదును పెట్టింది. వైకం మహమ్మద్ బషీర్ కథా శిల్పం ఆశ్చర్యం గొలుపుతుంది. బిభూతి భూషణ్ ప్రపంచంలో ఉన్నప్పుడు, హృదయం శుభ్రపడుతున్నంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చేగెవారా, జార్జ్ రెడ్డి, బయోగ్రఫీలకు పనిచేయటం ఉత్తేజకరమైన అనుభవం. ఇలా ప్రతి రచనా ఎంతోకొంత నేర్పించింది.
అనువాదం కానీ, స్వతంత్ర రచనను కానీ ప్రొఫెషన్ గా తీసుకోవాలనో, పెద్ద సంఖ్యలో రాయాలనో ఉద్దేశాలేమీ లేవు. ఇష్టంగా ఎన్నుకున్న పనిని వీలైనంత బాగా చెయ్యాలనేదే లక్ష్యం.
వామపక్ష ఉద్యమాల ప్రభావం తెలుగు సాహిత్యంపై ఎట్లా ఉన్నది?
ఆధిపత్య వర్గాల కీర్తనల్లో మునిగిపోయిన సాహిత్య వస్తువును, సామాన్యుల జీవితాలకు వాహికగా చేయటంలోనూ, ప్రజల కళారూపాలకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించటంలోనూ వామపక్ష భావజాలం పాత్ర గొప్పది. ఉద్యమ సాహిత్యంలో గొప్ప శిల్పం, సౌందర్యం ఉండవని సంప్రదాయ సాహితీవేత్తలు చేసే వ్యాఖ్యలు ఆధార రహితమైనవి. శివసాగర్, విమల, కౌముది వంటి కవులు విప్లవ కవిత్వంలో గొప్ప ఈస్థటిక్ విలువలను తెచ్చారు. షహీదా, తాయమ్మ కరుణ, అనూరాధ వంటి రచయిత్రులు మానవసంబంధాల్లోని అతి సున్నితమైన అంశాలపై కథలు రాశారు.
ఉద్యమాలు ఉధృతంగా ఉన్నప్పుడు ఉద్వేగ ప్రధానమైన సాహిత్యం వెలువడటం, దానిలో సూక్ష్మ రాజకీయాల పరిశీలనకు చోటు లేకపోవటం ఒక వాస్తవం. అలాంటి సందర్భాల్లో నినాద ప్రాయమైన సాహిత్యం రావటమన్నది ఉద్యమ సాహిత్యంలో కూడా సహజమైన విషయమే. ఉద్యమాల అవగాహనలో విస్తృతి పెరిగేకొద్దీ, ఉద్యమ సాహిత్యంలోని గాఢత పెరుగుతుంది.
రష్యన్ సాహిత్యంలో యుధ్ధకాలంలోని రచనల్లో కూడా, ఉద్యమకారుల అంతస్సంఘర్షణనూ, ఉద్యమాలలోని ఆటుపోట్లనూ చిత్రించిన సాహిత్యం వెలువడింది. అది పాఠకుల అవగాహనను పెంచి, ఉద్యమాలకు సన్నిహితం చేస్తుంది. అలాంటి ప్రయత్నం తెలుగు విప్లవ సాహిత్యంలో తగినంతగా జరగటం లేదు. దానితోబాటు, సాహిత్య విమర్శలో కూడా అప్ప్లైడ్ విమర్శ మాత్రమేగాక, ఉద్యమసాహిత్యాన్ని గైడ్ చెయ్యగల విమర్శ పెరగాలి. అలాంటి విమర్శను స్వీకరించే సహనం ఉద్యమ రచయితల్లో పెరగాల్సి ఉండటం మరింత ముఖ్యం.
తెలుగు నేలన స్త్రీవాదం రావటానికి నేపథ్యం ఏమిటి? దాని పరిణామ క్రమాన్ని చెప్పండి?
స్త్రీల సమస్యలపై సంస్కరణోద్యమాలూ, వామపక్ష ఉద్యమాల్లో భాగంగా జరిగిన పోరాటాలూ తెలుగు ప్రాంతానికి కొత్తవి కాదు. కానీ స్త్రీవాదం అనే మాట ఇక్కడ ప్రస్తావనకు రావటం 80 ల నుంచే. అది సృజనాత్మక సాహిత్యంగానూ, చరిత్ర రచనగానూ వచ్చినంతగా సామాజిక ఉద్యమాల రూపంలో ఈ ప్రాంతంలో వచ్చిందని అనుకోను. అలా జరిగిన కొన్ని ప్రయత్నాలు కూడా ఎన్ జీవో ల పరిధిలోనే కావటంతో, ఆయా ప్రాజెక్టుల పరిమితులకు లోబడినవిగానే మిగిలిపోయాయి తప్ప, ఇతర దేశాల్లో మాదిరి ప్రత్యేక ఉద్యమాలుగా జరిగే అవకాశాలు లేకుండాపోయాయి.
ఐతే, ప్రగతిశీల ఉద్యమాలతోసహా అన్ని రంగాలలోనూ స్థాయీభేదాలతో ఉనికిలో ఉన్న పితృస్వామ్యాన్ని గురించి స్త్రీవాదులు లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఉపయోగపడ్డాయి.
తెలుగు సాహిత్యంపై స్త్రీవాదం వేసిన ప్రభావం ఏమిటి?
సాహిత్య భాషలో, వ్యక్తీకరణలో స్త్రీలను అవమానించే ప్రయోగాలు వాడటాన్ని, విప్లవ కవులు సైతం దాన్ని తప్పించుకోలేక పోవటాన్ని 70 లలోనే రంగనాయకమ్మ విమర్శించారు. వి.వి ఒక్కరు తప్ప, దానికి పాజిటివ్ గా స్పందించిన మేల్ రైటర్స్ ఆనాడు కనబడరు. ఆ విమర్శను ఒక ఉద్యమంగా నిర్వహించింది స్త్రీవాద సాహిత్యం. ఇప్పుడు ఎంత పేరున్న సాహిత్యకారులైనా అలా రాయటానికి సాహసించటం లేదు. కుటుంబం, మాతృత్వం, లైంగికత వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తటానికి గత తరాల్లోని కొందరు రచయితలు చేసిన ఒంటరి పోరాటాలకు ఆమోదనీయత ఏర్పడటం కూడా స్త్రీవాద సాహిత్యం సాధించిన విజయమే.
స్త్రీవాదంలోని కుల, వర్గ స్వభావంపై దళిత రచయిత్రులు చేసిన విమర్శపై మీరేమంటారు? ఆ విమర్శలకు స్త్రీవాదం ఎట్లా స్పందించింది?
వ్యక్తుల అనుభవాలనుండి పొందిన జ్ఞానంతో జీవితాచరణను రూపొందించుకునే ఆర్గానిక్ మేధావులు అట్టడుగు జీవితాలనుంచే ఎప్పుడూ వస్తారు. కానీ ఆ అనుభవాల ప్రాతిపదికన రూపొందే సిద్ధాంతాలను అందుకునే, అధ్యయనం చేసే వెసులుబాటు మధ్యతరగతి అక్షరాస్యులకు ముందుగా అందుబాటులోకి రావటం సహజం. స్త్రీవాదం దీనికి మినహాయింపు కాదు. ఆమేరకు తొలి దశ స్త్రీవాదంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అది ఎక్కువగా మధ్యతరగతి స్త్రీల అనుభవాలనే వినిపించింది. దళిత స్త్రీల ప్రత్యేక సమస్యలపై అవగాహన తక్కువగానే కనబడి ఉండవచ్చు.
ఆ విషయాలపై దళిత రచయిత్రులు చేసిన విమర్శ న్యాయమైనదీ, అవసరమైనదీ కూడా. మొదట్లో కొందరు దానికి బాధపడి ఉండొచ్చు. తరువాతి కాలంలో జనరల్ స్త్రీవాద అవగాహనలో అదనపు అంశాలు చేరాయి. వ్యక్తీకరణలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి.
అస్తిత్వ వాదాల్లో ఎవరి అస్తిత్వం గురించి వాళ్ళే రాయాలనే వాదన ఉంది కదా? దాన్నెలా చూడాలి? ఆ సమూహాలకు చెందని వాళ్ళ రచనలపై స్పందన ఎట్లా ఉంది?
ఎవరి అనుభవాలను వాళ్ళే రాయటం వల్ల జీవిత చిత్రణలో సహజత్వం, గాఢత ఉంటుందన్నది వాస్తవం. ఐతే, తమ సమస్యల విశ్లేషణకూ, పరిష్కరించే ప్రయత్నాలకూ కేవలం జీవితానుభవం చాలదు, సైద్ధాంతిక పరిజ్ఞానం కావాలి. ఈ రెండిటి నడుమ అనుసంధానం ఉండటం సాహిత్య సృజనకైనా, సామాజిక ఉద్యమాలకైనా నిండుదనాన్ని ఇస్తుంది. నేరుగా తమ అనుభవంలో లేకున్నా, గాఢమైన సహానుభూతితో ఇతరుల గురించి గొప్ప రచనలు చేసిన వాళ్ళున్నారు. గురజాడ, చలం, ఉప్పల లక్ష్మణరావు, కొ.కు, వంటి రచయితలను తిరస్కరించటం స్త్రీలకు సాధ్యమవుతుందా? అధోజగత్ మానవుల కష్టాలను అర్థం చేసుకోవటంలో రావిశాస్త్రిని తెలుగు సాహిత్యంలోంచి మినహాయించటం వీలవుతుందా?
స్త్రీవాద, దళితవాద సాహిత్య విమర్శల ప్రత్యేకతలు ఏమిటి?
ఈ వాదాలలో సాహిత్య విమర్శ పేరిట ప్రత్యేకంగా వచ్చినదేగాక, సృజనాత్మక సాహిత్య రూపాల ద్వారా కూడా ఆ వాదాలు విమర్శలను చేశాయి. సాహిత్య వస్తువుల్లో, రూపంలో కనబడే పితృస్వామ్య, బ్రాహ్మణీయ భావజాలాలను ఎత్తిచూపి నిరసించాయి. జెండర్ కూ, కులానికీ సంబంధించిన ఆధిపత్యాలు సాహిత్యంలో ఎలా వ్యక్తమవుతున్నాయో వివరించాయి. వీటి ప్రభావం తెలుగు సాహిత్య వాతావరణాన్ని సెన్సిటైజ్ చేసింది. ప్రజాస్వామిక భావాలతో రచన చేసే వాళ్ళు తమను తాము సరిదిద్దుకున్నారు.
ప్రపంచీకరణ గురించి స్త్రీవాదుల, దళితవాదుల, మైనారిటీ వాదుల దృక్పథం సాహిత్యంలో ఎలా ప్రతిఫలించింది?
ప్రపంచీకరణ ద్వారా బలపడిన వ్యాపార సంస్కృతి స్త్రీల జీవితాలపై వేసిన ప్రభావం తీవ్రమైనది. మార్కెట్ల విస్తరణలో స్త్రీలను వినియోగదారులుగా మార్చే క్రమం వాళ్ళ శరీరాలను, జీవిత విధానాన్నీ, కుటుంబంలో వారి పాత్రనూ నిర్దేశించే శక్తిగా వ్యవహరించింది. అసలు స్త్రీలనే వినియోగ వస్తువులుగా మార్చివేసింది. దీనికి ప్రతిఘటనగా వచ్చిన సాహిత్యంలో విమల రాసిన ‘సౌందర్యాత్మక హింస’, ‘వేశ్యా శిశువు’ వంటి కవితలు, కొండేపూడి నిర్మల కవితా సంపుటి, ‘మల్టీ నేషనల్ ముద్దు’ వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇతర ప్రక్రియల్లో కూడా బలమైన సాహిత్యం వచ్చింది.
దళితవాద సాహిత్యం ప్రధానంగా కుల వివక్షను, బ్రాహ్మణీయ భావజాలాన్ని విమర్శించటం మీద కేంద్రీకరించటంతో స్థానికమైన ఇతివృత్తాలే ఎక్కువ. నాకు గుర్తున్నంతలో ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో ప్రపంచీకరణ నీడపై సెటైర్ గా దీర్ఘ కవితను పైడి తెరేష్ బాబు రాశారు. కులవృత్తులు, గ్రామీణ సమాజాల విధ్వంసంతో శ్రామిక కులాల జీవితాల్లో ఏర్పడిన కల్లోలంపై కొన్ని కథలు, కవితలూ వచ్చాయి.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో ముస్లిం దేశాలమీద జరుగుతున్న ప్రత్యక్ష దాడులనూ, భావజాల రంగంలో పెంచిన ముస్లిం వ్యతిరేకతనూ నిరసించే సాహిత్యం ముస్లిం రచయితలనుండి, ఇతర ప్రజాస్వామిక వాద రచయితలు, సంస్థలనుండి కూడా వచ్చింది.
స్త్రీవాద, దళితవాద సాహిత్యాల వేగాన్ని నియంత్రించిన పరిస్థితులు ఏమిటి? వర్తమాన సందర్భంలో ఈ అస్తిత్వాల చలనశీలతను ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఏ వాదమైనా ప్రారంభదశలో ఉన్న ఉధృతి అలాగే కొనసాగదు. తొలిదశలో ఆ వాదాలు లేవనెత్తిన ప్రశ్నలు కొత్తవి, సామాజిక ఆమోదం లేనివి. అందువల్ల ప్రతిఘటనను ఎదుర్కొంటూ మరింత బలంగా మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత క్రమంగా వాటిని ఇతర వర్గాలు కూడా ఇష్టంగానో, అయిష్టంగానో అంగీకరించటంతో ప్రధాన స్రవంతి సాహిత్యంలో ఆ విలువలు భాగమయ్యాయి. ఇవాళ ఎవరూ స్త్రీలను, దళితులను అవమానించే ప్రయోగాలను సాహిత్యంలో వాడలేరు. సమాజంలో ఇప్పటికీ కుల వివక్ష పోలేదు, పితృస్వామ్యం పోలేదు. అవి రూపాలు మార్చుకుని, బలపడి కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని గుర్తించి, విశ్లేషించే సాహిత్యం రావాలి. అందుకు అధ్యయనమూ, ఆచరణా కూడా అవసరమవుతాయి. అలాంటి వైవిధ్యం పెద్దగా కనబడటం లేదు.
వర్తమాన హిందూ ఫాసిస్టు సందర్భంలో ముస్లిం వాదం నుండి ఎలాంటి ధిక్కార స్వరాలు వినబడుతున్నాయి?
గుజరాత్ మారణకాండ నాటినుండి ఈ అంశంపై ముస్లిం సాహిత్యకారులు విస్తృతంగా రాస్తున్నారు. ఈ దేశంలో ముస్లింలు అనుభవిస్తున్న పరాయితనాన్ని, అభద్రతను, ఈ సమాజానికి ముస్లింల కంట్రిబ్యూషన్ నూ చెప్పే సాహిత్యం అన్ని ప్రక్రియల్లోనూ వస్తోంది. అఫ్సర్, ఖదీర్, రహమతుల్లా, షరీఫ్… ఇంకా చాలామంది మంచి రచనలు చేశారు. ముస్లిం మైనారిటీల నడుమ ఐక్యతకు, అభివృద్ధికీ అడ్డుగా నిలుస్తున్న మతం లోపలి సమస్యలను, అంతరాలనూ కూడా స్కైబాబా, షాజహానా వంటి కవులు చర్చకు పెట్టారు.
అస్తిత్వవాదాలకు మార్క్సిజంతో ఉన్న వైరుధ్యం ఏమిటి? అది సాహిత్యంలో ఎట్లా ప్రతిఫలించింది?
అస్తిత్వవాదాలకు మార్క్సిజంతో సైద్ధాంతికంగా ఉన్న విభేదంకన్నా, కమ్యూనిస్టు నిర్మాణాలపై ప్రకటించిన విభేదాలు ప్రధానమైనవి. కమ్యూనిస్టుల సంస్థలలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదన్న విమర్శను ముఖ్యంగా స్త్రీవాదులు, దళితవాదులు లేవనెత్తారు. ఈ విమర్శ ఆ వాదాల సాహిత్యంలోనూ తీవ్రంగా వినబడింది. ఒక దశలో అది సైద్ధాంతిక చర్చలను దాటి, వ్యక్తిగత దూషణల దాకా చేరింది. కొన్ని విప్లవ సంస్థల నుండి కొందరు స్త్రీలు, దళితులు బయటికి వెళ్ళటమూ మరికొన్ని సంస్థలే చీలిపోవటమూ జరిగాయి.
అయినప్పటికీ మార్క్సిజం వెలుగులో సాగే ఉద్యమాల్లోనూ, సాహిత్యంలోనూ భాగం కావలసిన సూక్ష్మ రాజకీయాలనూ, అంతర్గత ప్రజాస్వామ్యాన్నీ బలంగా చర్చించటమనే పరిణామం ప్రారంభమయింది. ఆయా వాదాల సాహిత్యం ముందుకు తెచ్చిన విలువలు, తెలుగు సాహిత్యంలో విస్తృతిని సాధించి, సెన్సిటైజ్ చెయ్యటం ఈ సంఘర్షణవల్ల చేకూరిన మంచి ఫలితం. ఇక, ఆయా అస్తిత్వ సమూహాలకు సామాజిక రంగంలో అందిన సత్ఫలితం పెద్దగా లేదనే నా అభిప్రాయం. స్త్రీల తరపున, దళితుల తరపున తీవ్రమైన చర్చలు చేయగలిగిన మేధావులు, ఉద్యమ నాయకుల్లో ముఖ్యులు ఎన్ జీవో సంఘాలకో, పాలకవర్గ పార్టీలకో పరిమితం అయ్యారు. బ్రాహ్మణీయ ఆధిపత్యంపై యుద్ధం ప్రకటించిన కొందరు నాయకులు చివరికి మతతత్వ వాదులతో లీనమవటంతో పోరాటం, ప్రహసనంగా ముగిసింది.
పితృస్వామ్యం, కులం సగర్వంగా ఊరేగుతూనే ఉన్నాయి.
తెలుగు సాహిత్య విమర్శకులు గిరిజన, ఆదివాసీ సాహిత్యాలను అంతగా పట్టించుకోక పోవటానికి కారణం ఏమిటి?
ఆ సమూహాల నుండి వస్తున్న లిఖిత సాహిత్యమే తక్కువ కదా? దానికి సామాజిక, ఆర్థిక కారణాలు ఎన్నో ఉన్నాయి. అసలు సాహిత్య విమర్శ అనేదే యూనివర్శిటీల సిధ్ధాంత గ్రంథాలకూ, దినపత్రికల్లోని కొన్ని అంగుళాల సమీక్షలకూ పరిమితమయింది. మొదటి రకం వాటిలో రీడబిలిటీ ఉండేవి అరుదు. రెండో రకం మొక్కుబడి వ్యవహారం. ఇక మిగిలినవి ఆన్లైన్ మాగజీన్లు. అక్కడ స్పేస్ సమస్య లేదు. కానీ ఏ రచననైనా సీరియస్ గా తీసుకుని చర్చించే పాఠకులే తగ్గిపోయారేమోనని అనిపిస్తోంది. ఏదో సంచలనం ఉన్నప్పుడు తప్ప రెస్పాన్స్ కనబడదు. ఒకప్పుడు సారంగ వంటి పత్రికలలో సీరియస్ సాహిత్య చర్చలు ఉండేవి. ఇప్పుడు అంతగా కనబడవు. ఇన్ని ప్రతికూలతల నడుమ అసలే తక్కువగా వస్తున్న గిరిజన, ఆదివాసీ రచనలపై ఫోకస్ తక్కువే ఉండవచ్చు. రమేశ్ కార్తీక్ నాయక్, మల్లిపురం జగదీశ్ వంటి కొందరి రచనలకు మంచి ఆదరణ ఉన్నదనే అనుకుంటున్నా.
సాహిత్య అవార్డులపై మీ అభిప్రాయం? రచయితల ఆచరణ ఎట్లా ఉండాలి? రచన దానికదే ఆచరణ అవుతుందా?
ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యూడల్ వ్యవస్థలోని రాజపోషణకు అవశేషమే అవార్డులు. ముఖ్యంగా ప్రభుత్వ అవార్డులు. అది ఎంత ప్రజా ప్రభుత్వమైనా సరే, ప్రజలతో ఎంతోకొంత వైరుధ్యం ఉండితీరుతుంది. ఎన్నిక చేసిన కొందరు ప్రతిభావంతులకు పురస్కారాలు ఇవ్వటమనే ప్రక్రియలో సబ్జెక్టివ్ ఆసక్తులకు చోటు ఉండక తప్పదు. పౌరులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చెయ్యటం లాంటిది కాదు అవార్డులు అడగటం. ప్రజాస్వామిక వ్యవస్థను కోరుతున్నామని చెప్పే బుద్ధిజీవులు ఈ పోషణను తిరస్కరించటం ఒక బాధ్యత.
ప్రజల సమస్యలపై రాయటం గొప్ప విషయమే. ఆ అక్షరాలకు కట్టుబడిన రచయితలైతే ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడే పాలకుల నుండి ప్రత్యేక గౌరవాలను తిరస్కరించటం కనీసమైన విలువ. తెలుగు సాహిత్య రంగంలో ఈ విషయంపై తీవ్రమైన చర్చ జరగటమూ, వాటి ఫలితంగా విప్లవ రచయితల సంఘం ఏర్పడటమూ అందరూ ఎరిగిన చరిత్ర.
ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. బుద్ధిజీవుల చుట్టూ ఎన్నో అవకాశాలూ, ప్రలోభాలూ ఉన్నాయి. మాటలకూ, చేతలకూ సంబంధాన్ని ఆశించలేని వాతావరణం స్థిరపడింది. పితృస్వామ్యాన్నీ, బ్రాహ్మణీయ భావజాలాన్నీ రాతలలో చెండాడే రచయితలు, ఆ విధానాలను అమలుచేసే పాలకులవద్ద పురస్కారాలకు పరిగెడతారు. మేం ఫలానా సంఘంలో సభ్యులం కాదనే సాంకేతిక సమాధానంతో తప్పుకుంటారు. ఈ పోషణలను వ్యతిరేకించే పాలసీ కలిగిన సంస్థలు కూడా పురస్కార గ్రహీతలను గౌరవించక తప్పదు. ప్రశ్నిస్తే వాళ్లెక్కడ దూరమవుతారోనన్న నిస్సహాయత.
ఇతర భాషల సాహిత్య రంగాల్లో కొందరు సజీవమైన మేధావులు కనబడుతుండటం ఒక ఆశ. తెలుగుకు సంబంధించినంత వరకూ ఇదొక కాలం చెల్లిన చర్చ.
వివిధ అస్తిత్వాల మధ్యన వైవిధ్యాన్నీ, వైరుధ్యాలనూ ఎట్లా అర్థం చేసుకోవాలి? వర్తమాన ఫాసిస్టు దాడిని ఎదుర్కొనేందుకు సంఘటితం కావటానికి వివిధ అస్తిత్వ సమూహాల ఐక్యత ఎట్లా సాధ్యమవుతుంది?
కొన్ని అస్తిత్వ సమూహాల ప్రజలు ఈ అంతరాలవారీ వ్యవస్థలో పీడితులుగా ఉన్నారనేది సాధారణ అవగాహన. అయితే, ఈ సమూహాల ప్రయోజనాల నడుమ పోటీ ఏర్పడినప్పుడు వాటి నడుమ వైరుధ్యాలు ఏర్పడతాయి. అలాగే, ప్రతి సమూహంలోని వ్యక్తుల నడుమ ఉండే అంతర్గత ప్రత్యేకతల కారణంగా వైరుధ్యాలు ఏర్పడక తప్పదు. ఉదాహరణకు తన జెండర్ ద్వారా పీడితురాలైన ఒక స్త్రీ, వర్గం/ కులం కారణంగా తనకన్నా తక్కువ స్థాయికి చెందిన పురుషుడిపై ఆధిక్యత చెలాయించగల సందర్భాలు ఉండవచ్చు. అలాగే పితృస్వామ్య సమాజాల్లో పీడిత సమూహాల్లోని పురుషులు కూడా తమ సమూహాల స్త్రీలపై పీడనను ప్రయోగించే అవకాశం ఉన్నది.
ఆర్థిక దోపిడి, పీడనలనే ఉమ్మడి సమస్యలపై పోరాటంలో భాగంగా పీడిత సమూహాల నడుమ ఐక్యతకు పునాది ఏర్పడగలదన్నది వర్గదృక్పథం లోని అవగాహన. ఇంత స్థూలమైన అవగాహనలో వివిధ అస్తిత్వ ప్రత్యేకతలనూ, వాటి సమస్యలనూ స్పష్టంగా అర్థం చేసుకోవటం కుదరదని అస్తిత్వ రాజకీయాలు భావించాయి. ఆయా ప్రత్యేక అస్తిత్వాల వైపునుండి మాత్రమే అన్ని రంగాలనూ సూక్ష్మంగా విశ్లేషించటం ఈ దృక్పథంలోని బలమూ, బలహీనతా కూడాను.
పీడనకు గురవుతున్న ఇతర అస్తిత్వాలతో ఐక్యత అనేది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష కాగలదే తప్ప, అస్తిత్వ రాజకీయాలలో అదొక తప్పనిసరి నిబంధన కాబోదు. ఎందుకంటే, ఒక అస్తిత్వానికి మేలు చేసే అంశం, మరొక అస్తిత్వానికి నష్టదాయకం కాగలదు. దీన్ని ఆయా అస్తిత్వాలకు చెందిన వ్యక్తుల మంచి చెడుల దృష్టితో కాకుండా, ఆ రాజకీయాల్లోని తాత్వికమైన పరిమితిగా చూడగలిగితేనే వివిధ అస్తిత్వాల నడుమ వైరుధ్యాలనేగాక, ఒకే అస్తిత్వంలోని ఉపవర్గాల నడుమన సైతం శత్రుపూరిత ఘర్షణ ఏర్పడగల వాస్తవాన్ని అర్థం చేసుకోగలం.
ఈనాటి పాలక వర్గంతో ఐక్య పోరాటానికి ఈ సమూహాలన్నీ కలిసి పనిచేయటం వెనుక ఇన్ని సమస్యలున్నాయి. ప్రజలు వివిధ సమూహాలుగా విడిపోయి ఉన్నారు. పూర్తిస్థాయి ఐక్యతను ఆశించలేక పోయినా, పరస్పర సహానుభూతితో కలిసి పనిచెయ్యగల తక్షణ వేదికలనైనా ఏర్పాటు చేసుకోగల వాతావరణం ఏర్పడాలి. అందుకోసం దేశంలోని మెజారిటీ ప్రజలకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కలిగించగల ప్రయత్నాలు అన్నీ స్థాయిలలోనూ చెయ్యటం తప్ప తక్షణ పరిష్కారాలను ఆశించలేము.
మీ ఇంటర్వ్యూ చాలా inspiring గా వుంది. ప్రజాక్షేత్రంలో పని చేస్తున్న చాలామంది సందేహాలు నివృత్తి అవుతాయి
Thank you so much
లోతైన ప్రశ్నలతో, స్పష్టమైన జవాబులతో, ఎన్నో అంశాలను విశదపరుస్తూ its a beautiful and inspiring interview
Thank you Mamatha
మంచి ఇంటర్యూ. కాత్యాయని ఎప్పటిలానే పదునుగా, స్పష్టంగా, సూటిగా మాట్లాడారు.
Thank you Suresh
నీ ప్రయాణం చాలా గొప్ప స్ఫూర్తిని కలిగిస్తూ నాలాంటి వాళ్ళకు ఎడ్యుకేటివ్ గా మార్గదర్శకంగా ఉంది కాత్యాయనీ, థాంక్యూ సొ మచ్!
Thank you Siva Lakshmi
After a long time read a meaningful and critical views on the contemporary Telugu literature. Interviewer also deserves appreciation for selecting nice questions to elicit the best answers.
Thank you so much
INTERVIEW AND ANSWERS ALL ARE NUMBER ONE —GREAT ONE
Thank you so much
మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు విలువైనవి.
Thank you
లోచూపునిచ్చే ఇంటర్వ్యూ.
Thank you