తెల్లారుజాము గావస్తంది…
యాదమ్మ శేతిల అరిగిపోయిన కొబ్బరి పుల్లల శీపురుజేసే సప్పుడిని చీకటికి చిరాకేసిందేమో! మెల్లగా చెదిరిపోతూ ఎలుతురికి జాగిచ్చింది.
అందరికీ పొద్దుమీకయిందంటే చాలు. ఎప్పుడెప్పుడాని అలసిన పానంతో గూడు జేరి, బుక్కెడు తిని, మల్సుకొని పండాలనుకుంటరు. కానీ, యాదమ్మ నిద్రనెప్పుడో కష్టాలూ, కన్నీళ్లూ మింగినయి. నిద్రపట్టని చీకటి రాత్రులను జూసి భయపడకుండా ఎన్నెన్నో ఆలోచనలు యాదమ్మ సోపతుంటయి. తెల్లారక ముందే లేచి ఇంట్ల పనులు జేస్కుని, నాలుగిండ్లల్ల పన్జేస్తెనే తనవీ, తన బిడ్డల ఐదేళ్లూ నోట్లెకు పోతయ్.
సాన్పు జల్లి, జాజలికి, తన తలరాత లాంటి అర్ధంగాని ఓ మెలికల ముగ్గేసి లోపల్కి నడిచింది యాదమ్మ. డికాషన్ తాగి పనికి పోదమనీ, పొయ్యిరాజేసి జరన్ని నీళ్లుబెట్టి చాపత్తేసింది. శక్కెర డబ్బా ఖాళీగా ఎక్కిరిచ్చింది. మసిలిన డికాషన్ని గిలాసల ఒంపుకొని గోడకానుకొని కూసుంది.
చేదు కాషాయంలా వున్న గదే డికాషన్ని సప్పరిస్తా ఆదమరిచి నిద్రబోతున్న ఇద్దరాడిపిల్లలను జూసి భారంగా నిట్టూర్చింది యాదమ్మ.
“దినాం వెదురు మొక్కల తీర్గ ఈ ఆడిపిల్లలు ఎదగబట్టిరి. సంపాదించిన నాలుగు రాళ్లూ మంచు ముద్ద లెక్క ఖర్సు కాబట్టె. ఆ తాగుబోతు సచ్చినోడికి పెండ్లాం, పిల్లలూ యాదికిరారు. సంపాదించిన కాడికి తాగి, ఎన్నో పండి ఎప్పుడో అస్తడు.” అనుకుంటా, పిల్లలను లేపి దర్వాజా దగ్గరికేసుకోమనిజెప్పి బయటవడ్డది.
***
యాదమ్మ అడుగులు దూరం దూరం బడుతున్నయి. ఆలోచనలు మట్టుకు పరిగెత్తుతున్నయి. “ఎవలన్నా దయగల్లమ్మ సల్లన్నం బెడితే తెచ్చి ముందుగాల ఇంటికెళ్లి పిల్లలకువెట్టి రావాలె. నిన్న పొద్దుమీకిగూడా ముగ్గురం తైతంబలేదాగిబన్నం. పెద్దది మొన్ననే పదమూడో యేడులబడ్డది. ఏం జెప్పకున్నా జర అన్నీ అర్ధం జేసుకుంటది. శిన్న పొల్లనే అన్నం గావాలని మబ్బుల వొక్కతీర్గ ఏడిసింది. గివాలెట్లన్నా జర్రన్ని నూకలు కొంచెవొయ్యి బిడ్డలకు బువ్వొండివెట్టాలే” అని మనసులనుకుంటా ముందుకు కదిలింది.
అది అక్టోబర్ నెల. పెద్ద పండుగ రోజులాయె. దసర పండుగకు ఏటా వరిపిండి కొట్టా, సకినాలూ, అప్పాలు జేయ సాయం జేయమంటా పెద్ద దొరసానుల ఇండ్ల నుండి కబురొస్తది. యాదమ్మకి ఇవి చెయ్ దిరిగే రోజులే! రెక్కలు ముక్కలయితున్నా, ఇంటికి పైసల్తో బాటూ కాసిన్ని అప్పాలుగూడ పట్టుకొస్తది గాబట్టి తనకు కష్టం కనపడదు. పిల్లలు కూడా గందుకే ఈ నెల్లా హుషారుగుంటరు. కానీ, ఈ యేడెందుకో పిల్లలు మొగం శిన్నబుచ్చుకునుంటుండ్రు. అప్పాలు జూసినా, మల్లె పువ్వులసుంటి అన్నం జూసినా గూడా నల్లమొగం బెట్టుకుని వుండేసరికి రాత్రి పన్నంక బిడ్డలను దగ్గరికి తీసుకొని ఏంటిదని బుజ్జగించి అడిగింది.
ఇద్దరూ ఏడుసుకుంటా “అందరూ పండుగలు జేసుకుంటే మనమెప్పుడూ మంది మొగం జూశుడేనా అవ్వా? మనం ఎందుకు జేసుకోమే పండుగ?? మా సోపతులందరూ మంచిగ కొత్త బట్టలు గట్టి, ఇంట్ల పిండంటలు జేసుకుని మంచిగుంటరు. పండగంటే ‘పెద్దోల్లకే’ గానీ, మనసుంటి పేదోల్లకు కాదానే?” అని బిడ్డలు అడిగేసరికి తుమ్మ ముల్లు గుండెల్ల గుచ్చినట్టయింది యాదమ్మకి.
కన్నీటితో బాధను దించుకున్న పిల్లలు హాయిగ నిద్రలకి జారుకున్నరు.
యాదమ్మ ఏవేవో ఆలోచనలు జేయబట్టింది. ” ఎట్లైనా నా బిడ్డల మొగంల నవ్వు జూడాలే! వాల్ల మొగం సంబురంతో దీపమోలె ఎలుగుడు నా రెండుకండ్లతో జూడాలె. తల్లిగా ఈ వొక్క పని నేనెట్లైనా సరే జెయ్యాలె ” అనుకుంటా కలత నిద్రబోయింది.
***
తరువాతి రోజు యాదమ్మ తన పనిగాంగనే సక్కగ అవుసులాయన దగ్గరికిబోయింది.
“ఏం బిడ్డా! గిట్లచ్చినవ్ ” అన్నడు అంజయ్య, యాదమ్మను జూసి.
“నాయనా నీతో శిన్న పనివడ్డది. జర్ర జేసిపెట్టే అని యాదమ్మ మొదాలు తన కాలివేళ్లకి పసుపు దారం సుట్టుకొని, మెట్టెలుదీసి అంజయ్య ముంగలవెట్టింది.
వాటిని అంజయ్య అటూ ఇటూ దిప్పిజూసి “గిప్పుడు వీటినేం జెయ్యాలె బిడ్డా” అన్నడు అర్ధంగాక.
“నాయనా! బందబస్తుగుండాలని నా లాగ్గంల మా తల్లిగారోళ్లు మట్టెలు గింత దొడ్దుగ జేయించిండ్రు. జర ‘శానిగ’ జేసి పెట్టరాదే! ఆ మిగిలిన ఎండి నువ్ దీస్కొని ఎంత జేస్తే అంత పైసలియ్యి అన్నది మొహమాటంగా!
అంజయ్య నవ్వుతూ “బిడ్డా! నీ కష్టం కనపడకుంట ఎంత సక్కగ కతల్లి జెప్పినవే! అనుకుంట మట్టెలు దీస్కొని కుంపటిపైనుంచి సెగ జూపి, తీగ సాగదీస్కుంట మట్టెలు సన్నగ జేయవట్టిండు.
ఇంతల యాదమ్మ నిమ్మలంగ ఆమె దస్తీల సుట్టుకొచ్చిన “వొక పుస్తే”నుదీసి తలొంచుకుని ఆయన ముంగలకునెట్టింది.
అంజయ్య తలెత్తి కళ్లజోడు సరి జేసుకుని, యాదమ్మను జూసి “ఇది సుత బరువుగనే ఉన్నదా బిడ్డా!” అన్నడు దిగులుగ.
“అవునే నాయనా! బరువుగనే వున్నది నా బతుకు. గుండెల రగిలే కష్టాల కుంపటి భగభగకి గా ఈ కొంచెం బంగారం సుత కరిగిపోతది గదనే నాయనా? గందుకే నీ దగ్గర దాసవెడదమని వొచ్చిన అన్నది నవ్వుతూ జీర బోయిన గొంతుతోటి.
పుస్తె, మిగిలిన ఎండి అమ్మంగ వొచ్చిన పైసలు జూసి మస్తు సంబురపడ్డది యాదమ్మ. అంజయ్య నాయన ప్రేమతోటి కొన్ని ఎక్కువిచ్చిండు గావచ్చు. ఎన్ని దినాలైందో కంటినిండ గన్ని పైసలు జూశి.
ఇంటికి రాంగ తొవ్వల కిరాణా దుకాణంల కావలసిన పుట్నాలూ, బియ్యం,శెెక్కెరా ఇంకొన్ని సరుకులుగొనిదెచ్చింది. ఇంట్లకి రాంగనే సందుగ దెరిచి దాంట్లె దాచిన పెండ్లి శీరలు దీసి వొకసారి తడిమి జూసుకుంది.
బిడ్డలదంతా సంబరంగా జూశి “ఏందవ్వా ” అంటే…
“రేపు మనింట్ల పండగ బిడ్డా! పెద్దోల్ల ఇండ్లల్ల పండుగ రాక మునుపే మన ఇంట్లనే మొదాలు ‘కొత్త పండగ’ శురూజేద్దం, వారం దినాల పండగ జేసుకుందాం సరేనా!” అంటా “రేపటి తొలి రోజుకి పూలు దెద్దం పాండ్రి” అంటా ఊరిశివరున్న శిన్నడవిల పూసిన తంగేడు పూలు, గునుగు పూలు, గడ్డిచామంతులూగోసి దెచ్చుకున్నరు. కంటికందంగా గనిపించే ఏ గడ్డి మొక్కా, పువ్వూ వదలకుండా, చిక్కుడాకులూ, గుమ్మడాకులు గూడా తెంపిదెచ్చిండ్రు యాదమ్మా, ఆమె బిడ్డలు. పక్కింట్ల నుండి మైదాకు తెంపిదెచ్చి బిఢ్డల శేతులకుబెట్టి ఆమె సుత బెట్టుకుంది.
శీకట్లనే లేశి, పెండదెచ్చి ఇల్లూ, వాకిిలలికి ముగ్గులువెట్టింది. గుమ్మానికి బంతి పూల దండేసి మామిడాకుల పచ్చని తోరణం గట్టింది. కడపకి పసుపు రాసి, కుంకుమ బొట్లువెట్టింది. మామిడి పిందెలతోటి పెద్దంచున్న పెండ్లి శీరను రెండుగా శింపి, బిడ్డలకు శెరొకటి వోణి లెక్క సుట్టింది. రంగు రంగుల మట్టిగాజులుదెచ్చి శేతుల నిండా దొడిగింది. నుదుట కుంకుమ బొట్టువెెట్టి, కాళ్లకి పసుపు రాసి ఇద్దరినీ కండ్లనిండా జూసుకొని మురిసింది.
యాదమ్మకి అప్పటికే ఇంట్ల తెలియని వెలుగేదో పర్సుకున్నట్లనిపించె. పిల్లలు అవ్వ జేసే ఈ కొత్త పండుగను కనులార జూశుకుంట తూనిగల్లెక్క తిరుగుతున్నరు. అగ్గువకి దొరికే పప్పు దినుసులుదెచ్చిన యాదమ్మ వాటిలో శెక్కెర గలిపి పొడిలెక్క దంచి, ఇండ్ల పంటున్నోళ్లందరికీ నోరుతీపిజేసింది.
పసుపు ముద్దని జేసి గౌరమ్మగాదలసి దండం బెట్టి, బొట్టుబెట్టి, అక్షింతలు జల్లింది. బిడ్డల్ని సుత మోకాళ్ళ మీద కూసొని దండం బెెట్టుకోమన్జెప్పి, కనపడని ఆ దేవత బదులుగా తనే బిడ్డలను సల్లంగ “బతుకమ్మా” అంటా దీవెనలిచ్చింది. ఈతసాప పరిచి పీటపై పల్లెంబెట్టి అందుల గుమ్మడాకును పేర్చి దానిపై గౌరమ్మనుంచి, తెంపి దెచ్చిన పూలను రాశిగా పోసింది.
కాసే పూసే చెట్లనిదలచి కన్నీటితో “అమాసనాడు గీ పండుగ షురూ జేసిన, మా బతుకుల్ల యెలుగు నింపి, మమ్మల్ని సల్లగ జూడమ్మా అంటా ‘అడవితల్లికి’ దండం బెట్టి…
” తీరొక్క పువ్వునూ ఉయ్యాలో …
తీరుగాదెస్తినీ ఉయ్యాలో…
పుడమితల్లిచ్చిన పూలన్నీ ఉయ్యాలో
ఇయ్యాలా పూజలందుకున్నాయి ఉయ్యాలో..
కన్నీరొలికిన మా కళ్ళు ఉయ్యాలో
నేడు సుక్కలై మెరిసేనే ఉయ్యాలో…
కష్టం జేశే చెతులుయ్యాలో…
సప్పట్లుగొట్టెనే ఉయ్యాలో …
గౌరమ్మ తల్లీ ఉయ్యాలో
కరుణించి కాపాడు ఉయ్యాలో..”
అంటా ఆటలాడి, పాడినంకా, పూజలు జేసిన పూలను ఎవరూ తొక్కనిసోట, పారే యేట్లె ఒదిలి “నా కష్టాలనుగూడా నీతో దూరంగా తీస్కపో ” అని కన్నీరు పెట్టి సాగనంపి కుదుటబడ్డ మనసులతో ఇంటికొచ్చిండ్రు.
శానా యేండ్ల తరువాత ఆ నాడు కంటినిండ నిద్రబోయింది యాదమ్మ.
***
“లెట్స్ గో… రామ రామ రామ హే రామ రామ అరుణ్ డీ.. జే…. రామ రామ ఉయ్యాలో డిజే డిజే జే జే…” అనుకుంట వినిపిచ్చే ఆ కఠోర శబ్దాలకు అరుగు మీద పండగ జూద్దమని ఆశగ కూసున్న ఎనభై అయిదేండ్ల లచ్చవ్వ గుండెల దడ దడగాబట్టె. పోరగాండ్లు పెట్టే ఆ శబ్దాలు చెవుల్లనే పెట్టినట్టు ఆగమాగమయ్ పాడుబడబట్టె .
వొక్క పాటసుత సక్కగ రెండు ముక్కలు రాకమునుపే ఇంకో పాట రాబట్టే. మా కాలంల బతుకమ్మ పాటలంటే కష్టాలూ, సుఖాలు, పురాణాలూ! ఎంత మంచిగ పాడేటోళ్లం? కైకిలుబొయ్యెచ్చి గూడా కాళ్లుగుంజే దాక ఆడేటోల్లం.
మా ‘అమ్మమ్మ యాదమ్మ’ బతికున్నప్పుడు షురూ జేసిన గీ అందమైన పండుగ గిపుడు ఈ అర్ధంగాని పాటలూ, కేకల్ల, అరుపులల్ల కాటగల్సింది.
ఆడంబరాలు సూపే కట్టూ, బొట్లూ… పట్టు చీరల రెప రెపల నడిమిట్ల బతుకమ్మలు నలిగి వెలవెలబోతున్నట్లు గనిపిస్తుంది లచ్చవ్వకి . ఎవ్వరూ వొక్క పాట సక్కగ పాడింది లేదు. వొక్క తీర్గ అందరూగలిసి ఆడింది లేదు. కులానికొక తీరుగ జట్టు గట్టి ఆడబట్టిరి.
అడవి తల్లి ప్రసాదించిన ఆ పూల్లేవాయె. ఎవ్వరి మొగంల జూసినా మనసారా నవ్వే నవ్వులూ లేవాయె. ఎక్కడ జూసినా అన్నీ సువాసన లేని, రంగులు యెలిసిపోయే కాయితపు పూలే. రంగులు మార్చే ఊసరవెల్లి బతుకులే. ఏం పండగ పాడుబడ్డదనుకుంట లచ్చవ్వ అక్కన్నించి లేశి నిరాశగ యెళ్లిపోవుడు జూసి బిక్కమొగమేస్కొని చూస్తుండిపోయినయి, నిలువెత్తు కాగితం పూల బతుకమ్మలు.
దిగువ మధ్యతరగతి కుటుంబాలలో దీనావస్థలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.. తెలంగాణ మాండలికంలో విలక్షణమైన రచన చేశారు…
చక్కటి సందేశం .ప్రజల దీన స్థితిని తెలియచేసారు .ధన్యవాదములు
థాంక్స్ అండీ
కథ బాగుందండీ.వెలవెలబోతున్న పండగ సంబరాల్ని సాంస్కృతిక, సంప్రదాయాల పతనావస్థని కళ్ళకి కట్టినట్టు అక్షరీకరించారు .