చరిత్రకారులు వ్యక్తుల గుణగణాల మీద, వారి వ్యక్తిత్వాల మీద ఆధారపడి చరిత్రను అంచనా వెయ్యరు. ఆ వ్యక్తుల స్థల, కాలాలను వాటిని ప్రభావితం చేసే రాజకీయార్థిక, సామాజిక అంశాలను విశ్లేషించి ఒక అవగాహనకు వస్తారు. అయితే చరిత్ర నిర్మాణంలో గానీ, విధ్వంసంలో గానీ వ్యవస్థలు, వాటిని నడిపే రాజకీయాలు ముఖ్యమైనప్పటికీ వ్యక్తుల పాత్ర కూడా విస్మరించరానిదని సామాజిక, మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అమలులోకి వచ్చిన ఒక సామాజిక స్థితికి కేవలం వ్యక్తులనే కారణంగా చూపే పద్ధతి కాకుండా, ఆయా వ్యక్తుల తయారీకి వ్యవస్థకు ఉండే గతితార్కిక సంబంధాన్ని అర్థం చేసుకోవాలని అంటారు. ఫాసిస్టు సందర్భంలో “నూతన ఫాసిస్టు మానవుడిని” అర్థం చేసుకోవడానికి ఇది చాలా అవసరం.
ఎర్ర సైన్యం చేతుల్లో తన ఓటమి తప్పదని గ్రహించిన హిట్లర్ 30 ఏప్రిల్, 1945న తన బంకర్ లో తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఆ తర్వాత వారం రోజులకే (7 మే, 1945న) నాజీ జెర్మనీ ఓటమిని ఒప్పుకోని సంకీర్ణ సేనల (సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్) ముందు లొంగిపోయింది. ఆ వెనువెంటనే సంకీర్ణ సైన్యం నాజీ నేరస్తులను వివిధ జైళ్లలో బంధిందించింది. నాజీ ముఖ్య నాయకత్వంలో ఉండి ఘోరమైన నేరాలు చేసిన, ఉసిగొల్పిన వారినందరినీ జర్మనీలోని న్యూరెంబర్గ్ జైళ్ళో ఖైదీలుగా ఉంచారు.
ఆ తర్వాత వాళ్ళందరిపై విచారణ జరపాలనే “లండన్ అగ్రిమెంట్” ద్వారా “ఇంటెర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్”ను ఆ గష్టు, 1945న ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ దాదాపు ఒక సంవత్సరం (20 నవంబర్, 1945 నుండి 1 అక్టోబర్, 1946 వరకు) విచారణ జరిపింది. ఆ విచారణ జరుగుతున్న కాలంలోనే సంకీర్ణ ప్రభుత్వాలు నాజీలు స్వభావ రీత్యానే కౄరమైన మనుషులా? లేక వాళ్ళు కేవలం పై నుండి వచ్చే ఆజ్ణలు అమలు చేయడం మూలంగా నేరస్తులయ్యారా? అనే విషయాన్ని పరిశోధన చెయ్యడానికి ఒక సైకాలజిస్టు (మానసిక శాస్త్రంలో పిఎచ్ డి పొందిన శాస్త్రవేత్త) గుస్తావె గిల్బర్ట్ ను, ఒక సైకియాట్రిస్ట్ (మానసిక రోగ నిర్ధారణ, చికిత్సలో ఎం. డి. చేసిన వైద్యుడు) డగ్లస్ కెల్లీని నియమించారు. వీళ్లిద్దరూ అమెరికన్స్.
ఈ ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు ఆ నాజీ ఖైదీలందరి మీద వివిధ రకాల మానసిక పరీక్షలుచేశారు. విడివిడిగా తమ డేటాను విశ్లేషించి, విడిగానే రెండు పుస్తకాలు రాశారు. గిల్బర్ట్ 1950లో “The Psychology of Dictatorship” అనే పుస్తకాన్ని రాశాడు. అందులో నాజీల మానసిక రుగ్మతలను (psychopathic personality disorders) మూడు రకాలుగా విభజించి విశ్లేషించాడు.
అందులో మొదటిది Narcissistic Personality Disorder. ఈ మానసిక వ్యాధికి గురైన వాళ్ళు తమకు తామే గొప్పనుకొని, తమను మించినోళ్ళే లేరనే భావనలో (భ్రమలో) ఉంటారు. మాట మాటకూ తమ పేరునే ప్రస్తావించుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ (self-admiration) మాట్లాడుతారు. లోకమంతా తమ చుట్టే తిరగాలనీ, తమని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలని కోరుకుంటారు. వీళ్ళకు ఎదుటివారి మనోభావాలతో సంబంధం లేదు. తమ ప్రయోజనాల కోసం ఎవ్వరి మనుస్సులనైనా గాయపరుస్తారు. తమకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏదైనా తమే ఉన్నత మర్యాదలు, అవకాశాలు పొందటానికి అర్హులం అని భావిస్తుంటారు. తాము ఎప్పుడూ శాసించే స్థాయిలో ఉండటం కోసం ఎదుటివాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతారు. వాళ్ళ దుర్భలత్వాన్ని (vulnerabilities) ఆసరాగా వాడుకొని తమ పెత్తనాన్ని మరింత బలపర్చుకుంటారు. వీరిలో ఉండే అహంకారానికి ఆకాశమే హద్దు. తమ తలబిరుసుతో తమ వాళ్ళు కాదనుకునే వాళ్ళను చిన్న చూపుతో చూస్తారు. ఈసడించుకుంటారు. ఇన్ని దృఢమైన లక్షణాలు ప్రదర్శించే వీరికి చిన్న విమర్శను కూడా తట్టుకునే మానసిక శక్తి వుండదు. చిన్న విమర్షకే భయకంపితులవుతారు. ఆ భయం నుండి బయటపడేందుకే ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతారు.
ఇక రెండోది Paranoid Personality Disorder. ఈ కేటగిరీలో ఉండే వాళ్ళకు అపనమ్మకం ఎక్కువ. అందరినీ అనుమానిస్తుంటారు. ఎదుటి వాళ్ళు చేసే ప్రతి చిన్నదాని వెనకాల ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని భయపడుతుంటారు. తమకు సంబంధించిన విషయాలేవీ ఎవ్వరికీ స్పష్టంగా చెప్పరు. ఎందుకంటే వాటినే తమకు వ్యతిరేకంగా వాడుతారేమోననే భయం. ఆ భయం, అనుమానంతోనే ఎదుటి వాళ్ళమీద పగ పెంచుకుంటారు. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వీళ్ళు ఎదుటివారి మామూలు మాటల్లో సైతం మహా నేరాలను, ఘోరాలను ఊహించుకొని బెంబేలెత్తుతారు.
మూడో కేటగిరి Schizoid Personality Disorder. వీళ్ళు ఎప్పుడూ సామాజిక అభద్రతతో ఉంటూ మనుషులతో, సమూహాలతో కలిసిపోవడానికి ఇష్టపడరు. సాధారణ మనుషుల మాదిరిగా భావోద్వేగాలను కలిగి వుండరు. ఉన్నా వాటిని ప్రకటించలేరు. ఈ గడ్డకట్టుకుపోయిన తనం మూలంగా వీళ్ళలో సృజనకారులు ఉండటం తక్కువ.
గిల్బర్ట్ విశ్లేషణ ప్రకారం నాజీలు ఈ మూడు కేటగిరీలో ఏదో ఒకటి, అంతకన్న ఎక్కువ మానసిక రోగాలను కలిగివున్నారు. ఈ రోగాలు పుట్టుకతో వచ్చినవి కావు. నాజీ సంస్కృతిలో పుట్టి పెరగడం మూలంగా వచ్చినవి అంటాడు గిల్బర్ట్. నాజీ మానసిక స్థితిలో హేతువు, ఉద్వేగం అన్నీ కూడా అధికారం కోసమే. ఏదైనా అధికారం తర్వాతే. అధికారం కోసం ఎంతకైన దిగజారుతారు. ఎంతటి ఘోరాలైనా చేస్తారు.
కెల్లీ 1947లోనే తన పుస్తకాన్ని (Twenty-two Cells in Nuremberg) ప్రచురించాడు. అయితే తాను చేసిన పరిశీలనలు గిల్బర్ట్ కంటే భిన్నంగా వున్నాయి. అతని దృష్టిలో నాజీలు మానసిక రోగులు కాదు. నాజీలు నిర్మాణం చేసిన సామాజిక, సాంస్కృతిక వాతావరణం రోగగ్రస్తమయినది. అలాంటి “సామాజిక-సాంస్కృతిక రోగం” (socio-cultural disease) సోకితే అమెరికా సైతం నాజీమయమవుతుంది అంటాడు.
ఈ రచనలు వచ్చి దాదాపు 75 ఏండ్లు అయినా నాజీ వ్యక్తిత్వ పరిశోధన ఇంకా కొనసాగుతూనే వుంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నయా నాజీల ప్రభావ సందర్భంలో ఈ పరిశోధనల అవసరం పెరుగుతావుంది.
భారతదేశంలో పెరుగుతున్న ఫాసిజానికి రాజకీయార్థిక పునాదులు ఉన్నట్లుగానే దానికి సమ్మతిని కూడగట్టే ఒక సాంస్కృతిక, మానసిక పక్రియ కూడా కొనసాగుతున్నది. నాజీ సామాజిక-సాంస్కృతిక రోగం బ్రాహ్మణీయత రూపంలో వేల ఏండ్లుగా వున్నా, అది ఇప్పుడు సర్వవ్యాప్తం అయ్యే పనిలో ఉంది. ఆ రోగానికే “విశ్వగురువు” అనే గంభీరమైన పేరు పెట్టుకొని విశ్వజనీనం కావాలని చూస్తున్నది. అది సమాజంలో ఒక చెదలు మాదిరిగా, వ్యక్తులలో విచ్ఛిన్నకర మానసిక స్థితిగా మారుతున్నది. ఇదంతా హిందుత్వ రాజ్య నిర్మాణం కోసమే జరుగుతున్నది. హింస, పీడన, ఆధిపత్యం ఆధారంగా సమాజాన్ని కంట్రోల్ చెయ్యాలని ఫాసిస్టు శక్తులు పనిచేస్తున్నాయి.
ఇక ఎన్నికల కాలంలో ఆ సామాజిక-సాంస్కృతిక రోగం ఎంతగా ముదిరిపోయిందో స్పష్టంగా అర్థమవుతున్నది. ఎప్పటి మాదిరిగానే మోడీ తన “భూచీ” సిద్దాంతం వల్లించడం మొదలు పెట్టాడు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలిగిపోవాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా అన్నవాళ్ళను కూడా “అర్బన్ మావోయిస్టులు” అంటున్నడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు కొల్లగొట్టి ముస్లింలకు ఇస్తరని హిందువులలో ఒక అభద్రతను, భయాన్ని తయారు చేస్తుండు. ఈ సారి రాముడి చెట్టుకు ఓటు పిందెలు కాసేలా లేవని తేలిపోయిందేమో. మొత్తం దృష్టంతా మావోయిస్టుల, ముస్లింల మీద కేంద్రీకరించారు. గత నాలుగు నెలల్లోనే 92 మంది ఆదివాసులను, మావోయిస్టులను “ఎంకౌంటర్ల” పేరిట హత్య చేశారు. ఈ హత్యలు .తమకేమీ పట్టవన్నట్లు ఉండే సమాజాన్ని తయారు చేశారు. ఆ హత్యలు అడవులకే పరిమితం కావు మొలకెత్తే ప్రశ్నలను వెతుక్కుంటూ మైదానంలోకి వస్తాయనే సోయి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్యలు కేవలం వనరుల దోపిడీలో భాగంగా దానికి అడ్డుతగులుతున్న ఆదివాసీ-మావోయిస్టులను వేటాడి చంపడం మాత్రమే కాదు. ఈ హత్యలు సంఘ్ పరివార్ శక్తులు తాము నిర్మాణం చెయ్యదలుచుకున్న హిందుత్వ రాజ్యానికి ఒక పూర్తి ప్రత్యామ్నాయ రాజకీయార్థిక, సామాజిక-సాంస్కృతిక వ్యవస్థను మావోయిస్టులు ప్రతిపాదిస్తున్నందుకు జరుగుతున్నవి.
ఏప్రిల్ 16న కాంకేర్ అడవుల్లో జరిగిన హత్యాకాండలో 29 మంది ఆదివాసులను, మావోయిస్టులను చంపివేసిన తర్వాత ఆ శవాల ముందే నిలబడి ఆ జిల్లా పోలీస్ అధికారి “ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు… మావోయిస్టులు యువతను తప్పు దారి పట్టిస్తున్నారు…” అని అనడం ఆశ్చర్యపరుస్తుంది. నెత్తుటి మరకలు ఇంకా ఆరనే లేదు, అప్పుడే శాంతి ప్రవచనాలు చెబుతున్నాడు. హింసకు తావులేదంటూనే అంత మందిని చంపేశారు. వాస్తవానికి అవేవీ “ఎదురుకాల్పులు” కావు. కేవలం కనిపిస్తే కాల్చివేతలు. ఈ మాట పౌరహక్కుల సంఘాల వాళ్ళు అంటున్న మాట కాదు. టీవీ9 ప్రతినిధి హత్యాస్థలికి వెళ్లి, అక్కడున్న ఒక జవాన్ ను అడిగాడు, “మీరు మావోయిస్టులను ఎలా గుర్తిస్తారు, వాళ్ళను లొంగిపొమ్మని ఏమైనా చెప్తారా?” అని. దానికి బదులుగా అతను అమాయకంగా “మావోయిస్టులు కనిపిస్తే కాల్చేస్తాం అంతే” అని చెప్పాడు.
ఇక ఆ పోలీస్ అధికారి చెబుతున్న ప్రజాస్వామ్యానికి, యువత దారి తప్పడానికి వాళ్ళ డిక్షనరీలో ఎలాంటి అర్థాలు ఉన్నాయో తెలిసిపోతుంది. ఆయన మాటలను బట్టి అర్థమయ్యేదేమంటే హింస పాలక వర్గాలకు, వారి కాపలాదారులకు మాత్రమే ఉన్న హక్కు. దానిని ప్రశ్నిస్తే అదే హింసకు మరో రూపంలో గురికావాల్సి వస్తుందనే ఒక హెచ్చరిక జారీచేస్తున్నట్లుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అర్బన్ మావోయిస్టుల జాబితాలో చేరిపోయింది కదా. మరి మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఎలా నిర్మాణం చేస్తారు? రేపు రేపు కాంకేర్ వంటి కనిపిస్తే కాల్చివేతలు కాంగ్రెస్ కార్యాలయాల దాకా జరుగుతాయా?
నాజీల విషయంలో గిల్బర్ట్, కెల్లీ చెప్పినట్లు అధికారం కోసం ఫాసిస్టులు ఎంతటి ఘోరమైన హింసకైనా దిగుతారు. ఎన్ని కట్టుకథలనైనా అల్లుతారు. నిత్యజీవిత వెతలు అజెండా మీదికి రాకుండా ఎన్ని దుర్మార్గపు పనులయినా చేస్తారు. కానీ, ఈ ఎన్నికల్లో తమకు ఎదురుగాలి వీస్తుందని తెలుసుకున్న పాలకులకు భయం పట్టుకుంది. ఆ భయంతోనే రాజ్యాంగాన్ని మార్చమని, రిజర్వేషన్ల జోలికి పోమని స్వయంగా మోడీ ప్రకటిస్తున్నాడు. ఇది రాజ్యాంగవాదులకు కొంత ఊరట ఇవ్వొచ్చేమో గానీ, సంఘ్ పరివార్ వాగ్దానం భారతంలో “అశ్వత్థామ హతః కుంజరః” వంటిదే!
సంఘ్ శక్తులు అధికారం పోతదేమో అని భయపడుతుంటే కొంతమంది రాజకీయ వాఖ్యాతలు “వాళ్ళు మళ్ళీ గెలిస్తే…” అంటూ ఎన్నో భయాలను వెల్లడిస్తున్నారు. ఈ భయాలన్నీ కొన్ని దశాబ్దాలుగా ప్రజలు చేస్తున్న పోరాటాలు అర్థం కాకపోవడం, వాటిలో భాగం కాకపోవడం మూలంగా కలిగేవి మాత్రమే. అలాంటి నిరాశ అవసరం లేనిది. వాళ్ళు మళ్ళీ వస్తే భూమి ఏమి బద్ధలు కాదు. ఒకవేళ అయితే, ‘‘ఇదంతా మాకెందుకులే… మాదాకా వస్తారా… వచ్చినప్పుడు చూద్దాంలే’’ అని అనుకునే మధ్యతరగతి భద్రజీవుల భ్రమలు బద్ధలవుతాయి. మొత్తం సమాజం ఒక కుదుపునకు గురి కావొచ్చు. అది ఎంత నష్టం చేస్తుందో, సమాజాన్ని అంత చలనంలోకి తెస్తుంది. అనివార్యంగా కొత్త పోరాట రూపాలు వస్తాయి. ఫాసిస్టుల బలం ప్రజల భయంలో ఉంది. ప్రజలు కన్నెర్ర చేస్తే, ఆ కాగితపు పులి కాలిపోతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
సామాజిక కోణంలో మంచి వ్యాసం
మంచి వ్యాసం
సమకాలీన పరుస్థితుల్లో చాలా మంచి వ్యాసం
A very informative and analytical article. Superb presentation of events, chronologically, and the impending depiction of future…
విశ్లేషాత్మకమైన. మంచి వ్యాసం .అభినందనలు
వామపక్షాలు నడిపే పత్రికలలో ఇలాంటి వ్యాసాలే వస్తాయి కాబట్టి ఆశ్చర్యం లేదు. ఇన్ఫార్మర్ అని పిలిచి ఎవరినైనా అతి క్రూరంగా చంపే మానవహక్కు మాత్రం మావోయిస్టులు స్వతం అంటారు. వాళ్ళు తమకు నచ్చిని వాళ్ళని హేపీగా ఇన్ఫార్మర్ అనవచ్చును కాని విచక్షణ లేకుండా చంపుకుంటూపోయే ఈ మావోయిస్టులను పోలీసులు మాత్రం సంఘవిద్రోహులు అనకూడదా? ఇక సో కాల్డ్ పౌరహక్కుల సంఘాలు అన్నీ కేవలం మావోయిస్టు హక్కుల సంఘాలే ఆని చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఈ తుపాకీ ఉన్మాదులకు సపోర్టుగా ఇలాంటి దిక్కుమాలిన పత్రికలు చేసే హంగామా ఒకటి. భలే.
శ్యామల గారు, పత్రికను “దిక్కుమాలినది” అని అంటూనే మా పత్రికను వెతికి చదివినందుకు దన్యవాదాలు. మీరన్నట్లు మాది దిక్కుమాలిన పత్రిక కాదు. వీలయినంత వరకు దోపిడీ, పీడనలకు గురవుతున్న వర్గాల, కులాల, జాతుల, లింగాల, మత మైనారిటీల హక్కుల గొంతు వింపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి మానవీయమైన కృషి మీకు అర్థం కాకపోవడానికి చింతిస్తున్నాము. వ్యాసాన్ని ముక్కలు చేసి చదవకుండ మొదటి నుండి చివరి వరకు ఉన్న విషయాలను కలుపుకోని అర్థం చేసుకోండి. మా పత్రికను చదివినందుకు మీకు మరో సారి థాంక్స్!