నగరమంటే ఏమిటి? నగరమంటే మనుషులు యంత్రాలై మసలే జీవన వేదిక. నగరమంటే హృదయాల్ని, కోరికల్ని తొక్కుకుంటూ, తొక్కేసుకుంటూ పరుగులెత్తే క్రిక్కిరిసిన మనుషుల వర్తమాన చరిత్రని లిఖిస్తున్న నల్లబల్ల. నగరమంటే ఇరుకిరుకుతనం. చాలీచాలనితనం. ఎపుడూ దిగులుగా ఏదో పోగొట్టుకున్నతనం. ఒకరినొకరు రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతూ కూడా మనిషిని మనిషి మిస్ అవుతుండే ఏకాకితనం! కాసేపు ఏ సిటీ బస్సెక్కి తిరిగినా, నాలుగు వీధులు నడిచినా, “స్లో డెత్” కి గురవుతున్నఏ ఇరానీ చాయ్ హోటల్లో కూర్చున్నా నగరానికీ-నాగరీకతకీ సంబంధం లేదని నిరూపించే నగర నగ్న విహారం కనబడుతుంది. జాగ్రత్తగా పరికిస్తే నగరంలో ప్రతి మనిషి గాయపడివుంటాడు. లేదా ఎవరినో గాయ పరిచే వుంటాడు. తనని తాను సంబాళించుకోలేక గుక్క పెడుతూ వుంటాడు. లేదా క్రోధిస్తూ వుంటాడు. అప్పుడప్పుడూ ధిక్కారంగా గర్జిస్తూ వుంటాడు. ఆ మనిషి స్త్రీ అయితే ఆ కన్నీళ్ళు, క్రోధం మరింత చిక్కగా వుంటాయి. సరిగ్గా ఆ జీవితాన్నే కతలు కతలుగా చెప్పాడు మహమ్మద్ ఖదీర్ బాబు. ఒక మనిషిని చూస్తే ఆ మనిషి కనబడే తీరుని బట్టి అతని కతేంటో చెప్పగల ముఖ సాముద్రికుడు ఖదీర్ బాబు. సంఘటనల నుండి జీవితాన్ని తన కథల్లోకి ఒడుపుగా దింపగల చేయి తిరిగిన కథల సముద్రీకుడు ఖదీర్ బాబు. కథలు రాయటంలో ఖదీర్ చేయి తిరిగిన వాడే కాదు, జీవితాన్ని తిరిగిన వాడు కూడా. ఆయన తాజా పుస్తకం “మెట్రో కథలు” అందుకు ఓ టెస్టిమొనీ!
ఈ కథల సందర్భంలో మెట్రో అంటే హైదరాబాద్ మహానగరం. మహమ్మద్ ఖదీర్ బాబు నగరం మొత్తం మనిషి వెంట తిరిగాడు. మెట్రో రైలెక్కాడు. మెట్రో మాల్స్ లోకి వెళ్ళాడు. మల్టీప్లెక్సుల్లోకి తొంగిచూసాడు. అపార్ట్మెంట్స్ జీవన విధానాన్ని, నిప్పుల మీదున్నట్లున్న దంపతీ సంబంధాల్ని పరిశీలించాడు. నరాల్ని కుంగతీసే ప్రైవేట్ ఉద్యోగాల తొడ తొక్కిసలాటల్ని అర్ధం చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ పంజాని, సాఫ్ట్ వేర్ బూం ని అంచనా వేసాడు. మధ్య తరగతి ఆశల్ని, ఆశాభంగాల్ని పరిశీలించాడు. వెక్కిళ్ళని విన్నాడు. కన్నీళ్ళని ముట్టుకున్నాడు. మనుషులకీ మనుషులకీ మధ్య, అలాగే మనుషులకీ వారి ఆకాంక్షలకీ మధ్య దూరాన్ని కొలిచాడు. ఒకటనేమిటి నగరం నలుమూలలా మనిషిని వెంబడించాడు. ఆటోలు, క్యాబులు, బైకులు, సిటీ బస్సులెక్కి… అలా వెంబడించీ వెంబడించీ మెట్రో కథల్ని రాసాడు.
“మెట్రో కథలు” నిజానికి ఒక దిన పత్రిక శీర్షిక కోసం రాసినవి. అప్పటికప్పుడు రాసినవే. అందుకేనేమో “ఇవి తెల్ల కాగితాల మీద పుట్టిన కథలు. తెల్ల కాగితాల పైనే తుదీ, మొదలును వెతుక్కున్న కథలు” అని ప్రకటించారు. అవి హైదరాబద్ గురించిన చారిత్రిక కతలు కాదు. ఈ మహానగరంలో జీవిస్తున్న వారి వర్తమాన చరిత్రకి సంబంధించిన కథలు. ఈ వర్తమానానికి ఒక స్పష్టమైన నేపధ్యం వుంది. హైదరాబాద్ ప్రపంచం వెంటపడి పోతున్న నగరం. “విశ్వనగరం” అని కొత్తగా తెచ్చుకున్నపేరుని నిలబెట్టుకోడానికి నానా హైరాన పడుతున్న నగరం. “పెట్టుబడి” ప్రభావానికి తన సాంస్కృతిక అస్తిత్వాన్ని కోల్పోతున్న నగరం. ఎక్కడ జనం చేరతారో అక్కడ పెట్టుబడి చేరుతుంది లేదా ఎక్కడ పెట్టుబడి వచ్చి కూర్చుంటుందో దాని చుట్టూ అవకాశాల కోసం జనం ఎక్కడెక్కడి నుండో వలస వచ్చి చేరతారు. నగరీకరణకి, పెట్టుబడికి అవినాభావ సంబంధముంది. మునుపెన్నడూ లేనంత ఇబ్బడి ముబ్బడిగా సమస్త వస్తు, సేవా, ఆధ్యాత్మిక రంగాల్లో మార్కెట్ ప్రవేశించి మెరుగుల, జిలుగుల మెట్రోగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ నగరంలో బతుకు వెతలే ఈ కతలు. ఇవన్నీ వర్తమాన కథలు. నిజానికి కథలు కాదు. చిన్న చిన్న నిత్య జీవన వీచికలు. ప్రత్యేకంగా రాసిన ఒక ఐదారు కథలు మినహాయించి ఏ కథలోనూ ఒక ప్లాట్ అంటూ వుండదు. ఒక సంఘటన మాత్రమే వుంటుంది. ఆ సంఘటన జీవన ప్రతిబింబంగా వుంటుంది. అది ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానంగా వుంటుంది. ఈ కథల్లో పాత్రలకి పేర్లుండవు. ఆ పాత్రలు అనామికలు కావొచ్చేమో కానీ అవాస్తవికలు కాదు. పేరు పెట్టకపోవటం ద్వారా మెట్రో స్వభావానికి సంబంధించిన ఒక సార్వజనీనతను సాధించటం రచయిత ఉద్దేశ్యం కావచ్చు.
ఎక్కువ కథల్లో భార్యా భర్తల మధ్యన ఉన్న మానసిక దూరమే ప్రధానాంశం. అవును హడావిడి జీవితంలో మనుషులు ఒకరినొకరు, ఒకరి మనసుల్ని మరొకరు తేరిపారా చూసే సమయమెక్కడుంటుంది? ఐడియలాజికల్గా పితృస్వామ్యం సృష్టించే దూరం ఎలానూ వుంటుంది. దానికి అదనంగా స్త్రీలకి విశ్రాంతి రాహిత్యం, వారి అవసరాల్నిపట్టించుకోని తనం. ఏమవుతుంది, దూరాలు పెరగక? ‘సెల్ఫీ’, ‘రొటీన్’, ‘రూటర్’, ‘డిస్టేన్స్’, ‘నిద్రా సమయం’, ‘మెట్రో’, ‘టేస్ట్’ వంటి కథలన్నింటికీ దంపతీ సంబంధంలోని దూరమే ప్లాట్. సంఘటనలే వేరు. దాదాపు అన్ని కథలు స్త్రీ కోణం నుండి రాసినవే. స్త్రీ ఆవేదనని, తన నుండి తాను పొందే పరాయీకరణ, తనను తాను తిరిగి పొందటానికి చేసే ప్రయత్నాల మీదనే కథకుడు ఫోకస్ చేసాడు. ఈ కథల్లో స్త్రీ పిల్లల పెంపక బాధ్యతలకి, తన ఆకాంక్షలకీ మధ్య ఘర్షణ పడుతుంటుంది. ఇవే కాక మిగతా జీవ జాతుల ఆవాసాల్ని ఆక్రమించేసి, వాటికి బతకటానికి స్థలం లేకుండా చేసిన నాగరికుడి స్వార్ధం గురించి కూడా “మీటింగ్” “సుకీ” అనే రెండు మంచి కథలున్నాయి. అపార్ట్మెంట్ జీవితాలు అనుభవాల్ని, అనుభూతుల్ని ఎలా కత్తిరించేస్తాయో కూడా ఈ కథలు చెబుతాయి.
ఈ సంపుటిలోని కథల్లో నిజంగానే కొన్ని గొప్ప కథలున్నాయి. పితృస్వామ్యపు జెండర్ ఇన్సెన్సిటివిటీ కారణంగా స్త్రీల టాయిలెట్ సమస్యల పట్ల సామాజిక నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే “షీ”, ఆర్ధిక దారిద్ర్యం ధ్వంసం చేసే మానవ సంబంధాల్ని కళ్ళకి కట్టినట్లు వివరించే “నల్ల కాలర్”, ఋతువుల ప్రతాపం నుండి తమని తాము రక్షించుకోలేని నిస్సహాయ నిరుపేద వర్గాల జీవితాల్లోని విషాదం, ఏదైనా విపత్తు జరిగాక అతిగా స్పందించే మీడియా, నాగరీకుల హిపోక్రాటిక్ మూక మనస్తత్వంని ఎత్తి పొడిచే “సలి కోటు”, నిత్య జీవన సమరంలో కిందా మీద పడుతూ అయినా సరే జీవితం మీద ఆశని కోల్పోని అల్పాదాయ వర్గాల వారి ధీరోదాత్త జీవన చిత్రణ చేసే “జీరో బ్లడ్”, మెజారిటేరియనిజం కలగచేసే హింసాత్మక భయభ్రాంతుల మీద రాసిన “వుడ్ వర్క్”…ఈ కథలు అద్భుతమైనవి. ఇలా వాస్తవానికి దర్పణం పడుతూ కలచివేసే కథలే కాకుండా ముందు చూపుతో స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక ప్రో ఆక్టీవ్ దృక్పథంతో ఆలోచించి రాసిన కౌన్సెలింగ్ వంటి ఫీల్ గుడ్ ఫాక్టర్ గా పనిచేసే “ప్రపోజల్”, “థ్యాంక్యూ” వంటి కథలు కూడా వున్నాయి. అయితే కథనం తీరు వల్ల కావొచ్చు “పెన్సిల్ బాక్స్” “తేగలు” కథలు తొందరగా ఎక్కవు.
ఇంతకు ముందే చెప్పినట్లు ఈ కథలన్నీ స్త్రీ కోణం నుండి రాసినవే. స్త్రీ కోణంలో, స్త్రీల గురించి కథలు రాసినంత మాత్రాన అవి స్త్రీల కోసం రాసినట్లు కాదు. స్త్రీలని చైతన్య పరచటానికి ఒక పురుషుడు సాహిత్యం సృష్టించాల్సిన అవసరం లేదు. స్త్రీ పురుష సంబంధాల్లో పురుషుడిని ఎడ్యుకేట్ చేయటానిక్కూడా స్త్రీ కోణంలో రాసే సాహిత్యం అవసరం. ఎందుకంటే పురుషుడు ఇప్పటికే స్త్రీని చాలా పోగొట్టుకున్నాడు. ఖదీర్ బాబు రాసిన “మెట్రో కథలు” స్త్రీ కోణంలో పురుషుల కోసం రాసిన కథల్లా అనిపించాయి నాకు.
ఖదీర్ బాబుకి అభినందనల కరచాలనం!
(“మెట్రో కథలు” 25 కథల సంపుటి. రచన మహమ్మద్ ఖదీర్ బాబు. వెల 171 రూపాయలు, కాంటాక్ట్ నంబర్: 9701332807)
Thank you Aranya krishna garu
Welcome Khadeer Babu garu!
యువరచయితల్లో ఖదీర్ బాబు నాకు చాలా యిష్టమైనరచయిత. అతని దర్గామెట్ట కధలు దగ్గరనుంచి వానకధలు, (సంకలనం), బియాండ్ కాఫీ వరకూ చివరకు మెట్రోకధలు కూడా కొన్ని చదివవాను ఈ పుస్తకం కొరకు గత యేడాదికి బుక్ ఫెయిర్ లో యెంతో వెదికాను.Thanks. మా విశ్లేషణ నా యిష్టన్ని మరింత పెంచింది.
ధన్యవాదాలు మేడం!
చక్కటి విశ్లేషణ సార్