కవిత్వం – గతితార్కికత – అధిభౌతిక వైయక్తికత

( జె.సి (జగన్మోహనాచారి) కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సాహితీ రంగాన్ని ప్రభావితం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు బోధించారు. గతాన్ని వర్తమానంతో అనుసంధానిస్తూ యువతరంలో కొత్త ఆలోచనలు రేకెత్తించారు. విమర్శలో విశేష కృషి చేసిన జేసీ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. సృజన జూన్ 1991 లో ప్రచురితమైన జేసీ రాసిన ఈ వ్యాసం ‘కొలిమి’ పాఠకుల కోసం… )

బూర్జువా కవిత్వం ప్రధానంగా ఆత్మాశ్రయమైంది. పశ్చిమ దేశాల్లో ఉదారవాద యధార్థవాదం నుండి మొదలుకొని అధివాస్తవోద్యమం వరకు వైయక్తికానుభవం ఆధారంగా హేత్వాభాస (apparent rationalism) నుండి హేత్వాభావం (negation of rationalism) వరకు ఎన్నో దశలు సాహిత్యాన్ని, కవిత్వాన్ని ప్రభావితం చేశాయి. వీటన్నిట్లో సామాన్య లక్షణం అధిభౌతిక వైయక్తికత. వైయక్తిక చైతన్య ప్రత్యయాలన్నిట్నీ సరుకులుగా విరూపకం (reify) చేసి వాటి మధ్య సంబంధాన్ని నైరూప్యం చేసే ఈ అధిభౌతిక ప్రక్రియకు సరుకుల మాయ అత్యంత ప్రచ్ఛన్న రూపం. ఈ ప్రచ్ఛన్నతలో భాగమే మనిషి చైతన్యంలోని మానసిక చేతన అచేతనలు, ప్రకృతిలోని దృశ్యాద్రశ్య రూపాలు. ఈ ద్వంద్వాల్లో ఒకదానిలో ఇంకొకటి ద్యోతకం కావటం, ఒకదాన్ని ఇంకొకటి అభావంచేసి వాస్తవికతనే ఒక భ్రాంతిపూర్వక (paranoic) ఐంద్రజాలిక (magical) విశేషంగా మార్చడం దీని ప్రత్యేకత. ఈ ప్రక్రియ స్థలకాలాలతో నిమిత్తం లేనిదిగా భ్రాంతి గొలిపే ప్రక్రియ. అందువల్ల అది అత్యంతాకర్షకమైన మార్మికమైన సౌందర్య తత్త్వంగా కన్పిస్తుంది. ఈ గుణం యధార్థ వాదాన్ని పూర్వపక్షం చేసిన అన్ని రకాల ఆధునిక సాహిత్య ధోరణుల్లో ముఖ్యంగా అధివాస్తవిక చిత్ర కళలో కవిత్వంలో కన్పిస్తుంది.

అధివాస్తవిక చిత్ర కళాకారుల్లో అగ్రగణ్యుడయిన సాల్వడార్ డాలీ గురించి శ్రీశ్రీ చెప్పిన మాటల్లో అధివాస్తవిక ధోరణి గురించి ఆయనకున్న ఆకళింపు సమగ్రంగా కన్పిస్తుంది :

పాత గోడల మీద మరకలనూ, ఆకాశంలోని మబ్బులనూ తదేక దీక్షతో చూడడం ఇతనికిష్టం. మేఘాలలోంచి నా యిష్టం వచ్చిన బొమ్మను ఏరుకోగలనన్నారు. డాలీ చిత్రాలు పూర్తిగా మనశ్శాస్త్రం మీద ఆధారపడి వుంటాయి. Psychoanalysis ఇతనిని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. ఇతని రచనలో స్వాప్నిక జగత్తు స్పష్టరూపం ధరిస్తుంది. తన బొమ్మలు “Hand painted dream photographs.”… “ఉన్మాదికి నాకూ ఒకటే భేదం – నేను ఉన్మాదిని కాకపోవడం,” అంటాడు డాలీ. సరికదా … to cretinise the masses” (ప్రజల్ని వెర్రెత్తించడం) తన ఆశయమంటాడు. (శ్రీశ్రీ వ్యాసాలు, విరసం ప్రచురణ, 1990: పే. 106-107)

శ్రీశ్రీ ఈ పుటల్లో చెప్పిన గుణాలన్నీ సరిగ్గా అధివాస్తవిక కవితలో కూడా ఉంటాయి. ఉదాహరణకు “కరిగిపోయే చేప” అన్న ప్రతీకలోని వాస్తవికత ఐంద్రజాలిక విశేషంగా మారిపోతుంది. సాధారణంగా అధివాస్తవిక కవులు వచన కవిత్వాన్నే రాస్తారు. కాని దానిలో సారూప్యత లేని (asymmetric) ఛందస్సొగసులు లేని ఒడిదొడుకుల లయకే ప్రాధాన్యత నిస్తారు.

కవిత్వం ప్రచురణలు ప్రకటించిన కొంతమంది కవుల సంకలనాల్లో సాల్వడార్ డాలీ పై కవితలున్నాయి. దాన్నిబట్టి వారి కవిత్వంపై డాలీ ప్రభావం కొద్దో గొప్పొ ఉందని అనుకోడానికి ఆస్కారం ఉంది. అయితే ఆ కవితల్ని పక్కకుపెట్టి వేరే కవితల్ని ముఖ్యంగా త్రిపురనేని శ్రీనివాస్ రహస్యోద్యమంలోని కవితల్ని ప్రథమంగా పరిశీలిద్దాం.

“కవిత్వం కావాలి కవిత్వం” అన్న శీర్షికన గల కవితనాసాంతంగా చదివితే మనకర్థమయ్యేది ఒక విషయం : ‘కవిత్వ’మనేది ఒక అపురూపమయిన పదార్థం, సామగ్రి అన్న ఆలోచన కవికున్నదని. “అక్షరం నిండా జలజల లాడిపోయే కవిత్వం,” “అక్షరం నిండా జివజివలాడిపోయే కవిత్వం.” “తుప్పల్ తెప్పల్ మాటల్” కాని కవిత్వం, “కాగితం మీంచి కన్నులోకి (వెన్నులోకి గన్నులోకి) దూసుకుపోయే కవిత్వం,” ప్రజల మీద రాయాల్సిన కవిత్వం, ప్రజల మీద కాక పాలకుల మీద రాయాల్సిన కవిత్వం – ఇలా ఎన్నో రకాల కవిత్వాలున్నట్లున్నాయి ఈ కవికి. ఈ రకమయిన దృష్టి మౌలికంగా యాంత్రిక భౌతికవాద దృష్టి. చలనం పదార్థ చైతన్యాలకు ఏకైక జీవలక్షణం అన్నది గతితార్కిక దృష్టి. గతితార్కికంగా సామాన్య చైతన్య రూపమయిన కవిత్వంలో శ్రమశక్తిలోని సృజనాత్మకత, శ్రామిక జన చైతన్యం వస్తువులో లయలో సహజంగా ప్రస్ఫుటిస్తుందన్న విషయం మనం వివరంగా తెలుసుకున్నాం.

వర్గ సమాజంలో ఈ సహజ పరిణామం వికటించి యాంత్రిక నైరూప్య అసమాన అధిభౌతిక లక్షణాలు పదార్థ, చైతన్య రూపాలన్నిటికి తటస్థిస్తాయి. కవిత్వం ఒక పదార్థమవుతుంది. అలాగే చైతన్య రూపంలో ఒక సాధనం అవుతుంది. కాని మానపుడు ప్రకృతి, సమాజంతో తనకు గల సంబంధాన్ని శ్రమశక్తిగా, తనలోనే భాగమయిన చేతుల్ని ఉపయోగించుకొని ఏ విధంగానయితే మార్చుకుంటాడో అలాగే భాషనుపయోగించుకొని కవిత్వంగా మార్చుకుంటాడు. (అలాగని చేతులు, భాష మనిషి శ్రమశక్తిలో భాగం కాకుండా సాధనాలు కావు) ఈ గతితార్కిక దృష్టిని తెలిసో తెలియకో కాదని కవిత్వాన్ని ఒక ప్రత్యేక పదార్థంగా, సాధనంగా అనుకొని ఆ పదార్థం తన చేతిలో పుష్కలంగా ఉందని లేక సాధనాన్ని తన ప్రత్యేక నైపుణ్యంతో వాడగల కవిననుకుంటే అది అలౌకిక వాదానికి, శిల్ప వాదానికి తప్పక దారి తీస్తుంది. త్రిపురనేని శ్రీనివాస్ విషయంలో గూడ సరిగ్గా ఇదే జరిగిందని “సంధ్యార్ణవం” అన్న కవితలోని ఈ క్రింది పాదాల్ని గమనిస్తే తెలుస్తుంది.

“అందరికి అర్థంకాని భాషకోసం అన్వేషిస్తున్నాను.
ముఖ్యంగా శవాలకు
రేపు నేను రాయబోయే కవితలో శిల్పం ఒక్కటే జిగేలుమంటుంది.
ఆ శిల్పానికి తనదైన భాష ఉన్నదని నేనెవరికీ చెప్పను…”

కవి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం నిరాశ, నిస్పృహల వల్లనే అన్నది ఈ సంకలనంలోని కవితల్ని చదివితే స్పష్టంగా తెలుస్తుంది. నిరాశ, నిస్పృహ అన్నది బూర్జువా చైతన్యంలో సరుకుల మాయ మనిషిని ఆచరణ శీలత్వం నుండి పరాయీకరింపబడిన అస్తిత్వంగా దిగజార్చడం వల్ల కలిగే అవస్థగా అంటే తననుండి తాను పరాయీకరణ చెందిన మనిషి ఉద్రేకంగా చెప్పవచ్చు. త్రిపురనేని శ్రీనివాస్ లో కలిగిన ఈ నిరాశ తన చుట్టూ సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, దోపిడీ అనబడే వ్యతిక్రమంలో నిక్షిప్తమై ఉన్న కార్యకారణ క్రమానికి తన అస్తిత్వానికి మధ్య వైరుధ్యం ఏర్పడ్డం వల్లనే అనుకుంటాను. ఒకప్పుడు విప్లవ కవిగా గతితార్కిక భౌతికవాదాన్ని అంగీకరించి కవిత్వం రాసిన ఈ కవి తన చుట్టూ సమాజంలో జరిగే వ్యవస్థాపరమైన అన్యాయాల విషయంలో సామాజిక బాధ్యతను గుర్తించిన కవి. కాని తరువాత తరువాత ఒక విప్లవ కవిగా తనకున్న పాత్ర యెడల ఆయనకేర్పడ్డ అధిభౌతిక భావ ధోరణి వల్ల చైతన్యవంతమైన ఆచరణకు తన అస్తిత్వానికి మధ్య ఏర్పడ్డ పరాయీకరణ ఆ నిర్వేద భావాన్ని అతనిలో కల్గించింది అని అనుకోవాల్సి వస్తున్నది. వైయక్తిక అస్తిత్వానికి సామాజిక ఆచరణ ప్రాతిపదికైతే అది సజీవంగా విప్లవాత్మకంగా ఉంటుంది. కాని వ్యక్తిగత ఊహల్లోని నిరాకారత ప్రాతిపదికైతే ఆ ఊహల నైసర్గిక ప్రాతిపదిక, వర్గ సమాజంలో కూరుకుని ఉంటే ఆ వ్యక్తి అస్తిత్వం సమష్టి ఆచరణలో సంపూర్ణంగా అభావం చెందితే తప్ప సామాజిక చైతన్యంతో మమేకం కాదు. అందుకవసరమైన సంపూర్ణ విప్లవాచరణ ఈ కవి భావాల్లో భాగం కాలేదనే అన్పిస్తున్నది. 1986లో చిత్తూరు జిల్లా విరసం యూనిట్ ప్రచురించిన ఈయన కవితా సంకలనం ‘గోదావరీ ప్రవహించు’లోని ఒక కవిత, “నేను నాలోకి”ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

ఊహల్లో నిరాకారత
ఆకారం కోసం వెదుకుతున్న వేళ,
నేనెవరో నేనేమిటో నాకే తెలియదు
నేను నాలో నాతో విడిది చేసినప్పుడు
నేను నాలో నాతో సదస్సు నిర్వహిస్తున్నపుడు
నాలో నాకు తెలియని నేను వికసిస్తున్నపుడు
ఊహల్లో నిరాకారత
ఆకారాన్ని చేరుకుంటున్న వేళ
నేను నాలో
లీనమై విలీనమై సంలీనమయ్యే
సంగ్రామ ఘట్టానికి తుదిరోజుల్లో
నా అరచేయి ధరిత్రిలో వేళ్ళ రోజాలు
ఎరుపెక్కడం చూసాను
రోడ్లమీద నా సంచారాలలోని
అగ్ని కీలలకి నిఘంటువు దొరికింది
మాట వెనుక మరో మనిషిని నగ్నం చేసే
భాషలో పునీతమయ్యాను
బహిష్కృతుడి భావావేశం
బంధం సృష్టించలేదని తెలుసుకున్నాను

తనలో వైయక్తిక చైతన్యానికి, వ్యక్తిగత ఊహలకు మధ్య ఒకప్పుడు జరిగిన నిరాకార మథనం: “సంగ్రామ ఘట్టం” తుది రోజుల్లో ఆయనకు విప్లవం ఎడల అధివాస్తవికంగా ఆత్మాశ్రయ నిబద్ధత ఏర్పడింది అని చెప్పుకుంటున్నాడు కవి. “నా అరచేయి ధరిత్రి”, “వేళ్ళ రోజాలు ఎరుపెక్కడం”, “రోడ్లమీద నా సంచారాలలోని అగ్ని కీలలకి నిఘంటువు దొరికింది” – ఈ మాటల్లోని ప్రతీకలు అన్నీ హేత్వాభావ ప్రతీకలే. అతనిలో చెలరేగిన నిరాకార మానసిక సంఘర్షణ, రోడ్డు మీద సంచారాల వంటి నిరర్థక వెతుకులాటలో అతనిలో పెల్లుబికిన ఆత్మాశ్రయ ఉద్రేకాల “అగ్ని కీలలకు” లభించిన “నిఘంటువు” ఒక అధివాస్తవిక నిఘంటువే. దానిలోని పదాలకున్న అర్థాలు అన్నీ సాల్వడార్ దాలీ చిత్రాల్లో ఉన్నట్లు “బహుముఖ సమర్థనం” (శ్రీశ్రీ వ్యాసాలు, పే. 107) కింద వచ్చే అర్థాలే. ఆ నిఘంటువుననుసరించే త్రిపురనేని శ్రీనివాస్ కవిత్వం విప్లవోద్యమం లక్షణాన్ని అధివాస్తవీకరించుకుని రహస్యోద్యమంగా మారినట్లనిపిస్తున్నది.

అధివాస్తవీకరణ ముఖ్యంగా ప్రత్యేక ప్రతీకల్లో తన అస్తిత్వాన్ని ప్రకటించుకుంటుంది:

‘‘కన్నుల్లో వెలుగుతున్న లాంతరు చీకట్లోకి ఎగిరిపోయింది
గుండెల్లో తిరుగుతున్న తోపుడు బండి చిత్రంగా
గుండెకాయనే మోసుకెళ్లి పోయింది
మూలమీద నిలబెట్టిన కిళ్లీ బడ్డీ అటు మలుపు తిరిగి
ఎవరితోనో నడిచిపోయింది
చొక్కాలు గాలిలో తేలుతూ కనిపించిన మనిషిని తొడుక్కున్నాయి
తరతరాల అస్తిత్వ వేదన తారతమ్యం చూపనిది
ఇక్కడే నగరం కొత్త ముఖం అతికించుకునేది ఇప్పుడే… ’’

ఈ ప్రతీకలన్నీ నగరంలో జరిగే దారుణ మారణకాండకు ప్రతీకలని అనుకోవాలి. భ్రమా భాజనమైన ఇటువంటి అధివాస్తవిక ప్రతీకలు జీవితంలోని అస్తవ్యస్తాలను చాలా బలంగా చిత్రీకరించడానికి పనికి వస్తాయి. కాని అవే పరమావధి అయితే కవిత్వానికి జీవితానికి మధ్య గల గతితార్కిక సంబంధాన్ని సంకుచితపరుస్తాయి. ఉదాహరణకు రహస్యోద్యమం మకుటంగా మలిచిన కవితను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది :

‘‘అక్షరానికి పాలు తాపి పదం చేయాలి
పదానికి అన్నం పెట్టి వాక్యం చేయాలి
వాక్యానికి శిక్షణ ఇచ్చి కవిత్వం చేయాలి
కవిత్వానికి జీవితాన్నిచ్చి ఆయుధం చేయాలి… ’’ అంటాడు కవి. బాగానే ఉంది. కాని మూడవ పాదంలో చెప్పినట్లు “వాక్యానికి శిక్షణ” యిస్తే మంచి వచనమౌతుంది తప్ప కవిత్వం కాదు. అలాగే కవిత్వానికి జీవితాన్నియ్యడమంటే అది ఆత్మాశ్రయ ధోరణిలో భాగమైన త్యాగమౌతుంది. దాని వల్ల మంచి కవిత్వం వచ్చే నన్ముకం లేదు. నిజానికి సామాజిక చైతన్య రూపమయిన కవిత్వానికి జీవితానికి మధ్య పరిణామశీలమైన ఆచరణాత్మక సంబంధం ఉంటుంది. ఆ గతితార్కిక సంబంధాన్ని సూచించడానికి ఈ మకుటాన్ని ఈ కింది విధంగా మారిస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం!

‘‘అక్షరానికి పాలు తాపి పదం చేయాలి
పదానికి అన్నం పెట్టి వాక్యం చేయాలి
వాక్యానికి శిక్షణ ఇచ్చి ఆయుధం చేయాలి
జీవితానికి ఆయుధాన్నిచ్చి కవిత్వం చేయాలి
కవిత్వానికి జీవితాన్నిచ్చి సాయుధం చేయాలి..’’

కవిత్వం ప్రచురణలు- 7వ సంకలసం గుడిహాళం రఘునాథం కవిత్వం ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. “రియలిజం, సర్రియలిజం తన్నుకునే స్నేహం”లో ఉద్భవించింది. అంటే రియలిజమ్ సర్రియలిజమ్ ల మధ్య వైరుధ్యం సడలి ఐక్యతగా మారే అధి భౌతిక సరుకుల మాయలో పుట్టిన కవిత్వమే కుహనా శాస్త్రీయత, హేత్వాభావం, సమాజ జీవితంలోని మురికివాడల్లోని కుళ్ళు కంపుల్ని చిత్రీకరించడంలో మొత్తం మీద డాక్యుమెంటరీ పద్ధతిని అవలంబించే ధోరణి, కార్మిక వర్గం వర్గపోరాట కార్మికుల స్త్రీ, పురుషుల్ని యజమానులు చేసే దోపిడి, దానికి వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటుల విషయంలో అంటే పారిశ్రామిక అభివృద్ధి నేపథ్యం లోని బీభత్సాన్ని ఆశ్రయ ధోరణిలో అర్థం చేసుకునే రీతిలో యధార్థ వాదం ఇరువయవ శతాబ్దంలో వాస్తవికతా వాదంగా (nationalism) గా మారింది. అమ్మకపు విలువ ప్రత్యేక వ్యక్తుల్ని, వ్యక్తుల మధ్య సంబంధాల్ని, వ్యక్తికి సమాజానికి మధ్య సంబంధాన్ని, వర్గాల మధ్య సంబంధాన్నే కాక నీతి, అవినీతులవంటి అమూర్త విలువల్ని కూడా పరిమాణాత్మక (quantitative) ప్రత్యయాలుగా మార్చే ఆధునిక ధోరణి వాస్తవిక వాదం. దీనికి అధి వాస్తవికతకూ మధ్య ఉన్న వైరుధ్యం అధి భౌతిక యధార్థానికి భ్రమకూ మధ్య ఉన్న వైరుధ్యం వంటిదే.

‘ఫోర్త్ పర్సన్ సింగ్యులర్’ అనే ఈ సంకలనంలోని మొదటి కవిత “అంకితం”లోని ఈ క్రింది పాదాల్ని పరిశీలిద్దాం :

అందాల కోసం
రంగు రంగుల దృశ్యాల కోసం
నీ ఎదుటి గోడలో
లలిత లలితంగా కదిలే తటాకాల కోసం
కెరటాల మధ్య పరిగెత్తే గుర్రాల కోసం
తొక్కిసలాడే కన్ను ! ?
ఇంకా ఎంతకాల మెంతకాలం జ్వాల కాలేని బతుకు ?
మందు బూట్లతో చలికాలం నడుస్తున్నప్పుడూ
వేయి కళ్ళతో – వర్షం –
కిటికీలోంచి తొంగిచూస్తూ, జారుతూ, తొంగి చూస్తూన్నప్పుడూ
సెగల పాముల్తో ఎండకాలం నర్తిస్తున్నప్పుడూ
బ్రాందీనీ, విస్కీని, బీరు బుడ్లని
హాయిగా, సుందర స్వప్నంలా ఊగే మత్తు చెట్లై
ఇంకా ఎంతకాల మెంతకాలం ?
రా, అన్నా, రా !
ఇల్లొదిలి, బారొదిలి
తడితడి వెన్నెలల చంద్రబింబాల్నొదిలి
ఆశల భ్రమల్నొదిలి
సాయంత్రాల్ని కార్చుకునే ఆదివారాల్నొదిలి
మురికి మురికి ఆకాశాల్నొదిలి
విరిగి విరిగి పడుతున్న వచన కవిత్వాల్నొదిలి
రా, భాయీ రా !!
మన సముద్రంలో కలుద్దాం …’’

వాస్తవిక వాద ప్రతీకలకు ఇదమిద్ధమైన అర్థ ప్రతిపత్తి ఉంటుంది. ఈ కవితలో మాదిరిగా. “అందం” అంటే ఎంత ఆకర్షణో జీవితంలో వికారాలంటే కూడా అంతే ఆకర్షణ వాస్తవికతావాద కవికి. కోపం, పగ, పశ్చాత్తాపం, జనాల్లో అల్లుకున్న గహనాటపులు’’ఇలాగే అన్ని రకాల వాస్తవికతలకు ఇదమిద్ధమైన సమాన ప్రతిపత్తి ఉంటుంది. ఒక వాస్తవికత నుండి ఇంకో వాస్తవికతకు మధ్య చలనం కూడా ఇదమిద్దంగానే ఉంటుంది. కవి చేయాల్సింది, పాఠకుని చేయమని ప్రోత్సహిస్తున్నది ఒక వాస్తవికతను విసర్జించి ఇంకో వాస్తవికతను ఎన్నుకోమనే.

ఆ సంకలనంలోని అయిదో పేజీ నుండి పందొమ్మిదవ పేజీ వరకున్న కవితలన్నీ స్థూలంగా, వాస్తవికతవాద కవిత. కానీ అక్కడక్కడ ఆ కవితల్లో అధివాస్తవికవాద లక్షణాల్లోకి క్రమించే ప్రతీకలు కూడా కన్పిస్తాయి. ఉదాహరణకు : “నా చేతుల్లోకెత్తుకున్న గీతం జారిపడి ముక్కలు ముక్కలౌతుందన్న భయం లేదు” (“వికసించే గీతం”, పే. 16) అన్న ప్రతీక. ఇక ముందుకు పోతే “మిడిల్ క్లాసు యౌవనం” (బస్సుందరి స్పర్శతో, బస్సే చిగురించి నట్టవట వూఁ), “నగరం” (నినాదాలు/ గోడలకు వేలాడుతున్నా యెర్రగా), “పురుషాటవి” (నేనో భయంకర, అభద్ర, అటవినై విస్తరిస్తూంటే) మొదలగు కవితల్లో వాస్తవికవాదాన్ని పూర్వపక్షం చేసి అధివాస్తవికత విస్తరించింది.

ఈ విధంగా గుడిహాళం రఘునాథం కవితలు కూడా ఆత్మాశ్రయ ధోరణి ప్రధానంగా గల ఆధునిక కవిత్వమే. ఈ ధోరణి వల్లనే తన సంకలనానికిచ్చిన టైటిలు, ఫోర్త్ పర్సన్ సింగ్యులర్, సూచించినట్లు ఆయన కవిత్వంలో చరిత్ర కాకుండా తన స్వగతమే అంతర్గత అస్తిత్వమే చతుర్ధ నామవాచకం ఏక వచనమై ప్రవర్తిస్తుంది.

ఆ సాహిత్యంలో వాస్తవికతావాదం ప్రపంచంలో ప్రతి వస్తువును, స్థల కాలాల్ని మనిషి చైతన్యాన్ని, ప్రవృతుల్ని, చివరికి వర్గాల్ని, వర్గ స్పృహను కూడా అధిభౌతిక ప్రత్యయాల్నిగానే పరిగణిస్తుంది. వర్గదృష్టి, వర్గస్పృహ ఉన్నా సమకాలీన సమాజంలోని విపత్తులన్నింటికి చరిత్రలో మానవుడు చేసిన తప్పిదాలే కారణమని నమ్ముతుంది. సమాజానికి ఏది మంచి, ఏది చెడు అన్న విషయంలోను, వ్యక్తి చైతన్యంలో ఉండాల్సిన గుణాలేవి, ఉండకూడని గుణాలేవి అన్న విషయంలోనూ అలాగే ఆదర్శం, ఆచరణల విషయంలోనూ, నిర్దిష్ట నీతిపరమైన యాంత్రిక ధోరణినే పదిలపరుస్తుంది. నీతిపరమైన ఈ ధోరణి వల్లనే సరుకుల స్థాయికి దిగజారిన అన్ని అధి భౌతిక ప్రత్యయాల వల్లనే మానవ చైతన్యం నేర భూయిష్టమైన ప్రతిపత్తిని ఆపాదించుకుంటుంది.

ఆదర్శం, ఆచరణలు గతితార్కికంగా మనిషి ప్రవర్తనలో వృద్ధి చెందుతాయన్న అవగాహన ఈ వాదాన్ని బలపరిచేవారిలో ఉండదు. ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలోని అర్థ వలస, ఆర్థ భూస్వామ్య భావజాలంలో సులభంగా ఇమిడిపోయే ధోరణి. ఈ ధోరణే తరువాత అధి వాస్తవిక ధోరణిలోకి మారిపోయినట్లు ఇదివరకే చెప్పుకొన్నాం. సరిగ్గా ఈ ప్రక్రియలోని మార్మికతే స్మైల్ కవిత్వంలో కన్పిస్తుంది.

“తూనీగ” అనే కవిత (ముఖడే, స్మైల్ కవితలు కొన్ని, కవిత్వం ప్రచురణలు – 4)లో కవి చిన్న పిల్ల వాడుగా ఉన్నప్పుడు తూనీగల్ని పట్టి ఆనందించేవాడు. పెద్దయింతర్వాత ఆ సంతోషం అతడి నుండి ఎగిరిపోయి తూనీగ నురాగానికి పశ్చాత్తాపం చోటుచేసుకున్నది. ఈ కవితలో కవి మానవ చరిత్రలో మాదిరిగానే అమాయకత్వం నుండి నేరంలోకి ఎదుగుతాడు.

వేళ్ళు కొండలై పోయేవి తూనీగ దొరికేదాకా
తూనీగ తోక పట్టుకున్నప్పుడు
రంగు లోకాల నీడ నున్నటి అద్దాల కళ్ళలో మిలమిలా మేరిసేది
చూసేస్తున్నానని, కాబోలు
నా అరచేతిని కరచేది తూనీగ
మెత్తటి కసి దవడలో
వొదిలే వాణ్ణి కాదు
వొదిల్తే
నే మనసుతో తపు ఎగరలేని ఎత్తులకి
మళ్ళా గాలిలో రెక్కల చేపల్లే ఎక్కడికో యీదుకు పోతుందని
తోకకి దారం కట్టి వొదిలేసే వాణ్ణి…

చిన్న పిల్లవాడి సంతోషంలోని క్రౌర్యాన్ని సూచించే వర్ణనలో అక్కడక్కడ వచ్చే”కసి దవడలు”, “రెక్కల చేప”ల వంటి అధివాస్తవికత ప్రతీకలు తప్పిస్తే వాస్తవికతా ధోరణే ఈ కవితలో ప్రధానంగా వుంది.

కాని చివరలో “తుమ్మ ముల్లుకు తూనీగని సిలువ” వేసిన తర్వాత అది చచ్చిపోయి మిగలనీ (“ముల్లు మాత్రం అలాగే వుంది. మొన మీద గుచ్చుకున్న గుండెతో/ నా గుండెతో నా గుండెతో, నా గుండెతో”/ ముల్లు మీద శిలువ వేయబడ్డ తూనీగ గుండెను కవి తన గుండెతో అధివాస్తవికంగా విరూపకం చేసుకుంటాడు.

“డాలీ నుంచి ఓ కాస్త గాలి” అన్నకవితో “జ్ఞాపకం వస్తావు డాలీ / గడియారం – కరిగి ప్రవహిస్తూ – ఓ తుమ్మముల్లు శూన్యంలోకి కలుక్కున దిగబడినట్లు/ నిటారుగా నిలుస్తుంది” అని స్మైల్ డాలీవి బాధాకరమైన జ్ఞాపకంగానే జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఈ అధి వాస్తవిక ప్రతీకల్లో ఆధునికుడైన మనిషి ముఖ్యంగా పెటీ బూర్జువా, మనస్సులోని కాలాతీత నిర్లిప్తత, నైరూప్య నేర భావం కల్గించే తపన యాదృచ్చిక మైన మనిషి అస్తిత్వం, నైరూప్య చారిత్రకావసరం మధ్య, చేతనా చేతనల మధ్య గల నోమాన్స్ లాండ్ లో మాదిరిగా ప్రకటితమౌతాయి :

“డాలీ
నీకు నేనేం అవను! అర్థమవనే అవను-
నువ్వూ నాకు నీలానే, అర్థం అయీ అవకు,
జీవితంలాగే శాశ్వతంగా జీవితంలాగే,
శాశ్వతం లాగే” అన్నట్లు అయితే, ఈ పాదాల చివర “కవిత్వంలో లాగే” అన్న మాటల్ని చేరిస్తే ఈ పాదాలు సరిగ్గా అధివాస్తవికతావాద కవిత్వానికి నిర్వచనమౌతాయి.

ఇదే వరుసన ఖాదర్ మొహియుద్దీన్ కవితా సంకలనం ‘పుట్టుమచ్చ’ (కవిత్వం ప్రచురణలు- 11) ను కూడ విచారించాల్సిన అవసరం ఉంది. కవి పేరును కనుక పుస్తకం ముందు అట్టల పై ముద్రించకపోతే, అలాగే టైటిల్ కవిత అయిన “పుట్టుమచ్చ”లో ఆయన అస్తిత్వ వేదనను కనుక గమనించకపోతే- కేవలం ఆయన కవిత్వాన్నే పరిగణనలోనికి తీసుకుంటే ఈయన కవిత్వం అర్థ వలన, అర్థ భూస్వామ్య భావజాలం పరిధిలో సరుకుల మాయ, సాంప్రదాయకతల మేళవింపుకు అనుగుణమైన వాస్తవికతావాద అధివాస్తవికతల అధి భౌతిక తత్వమే మనకు కన్పిస్తుంది. ఉదాహరణకు…

పాడు మనసు తాను పడుకోదూ
నన్ను పడుకోనీయదూ (“తప్పదిక”)

ప్రపంచం బరువుతో
జీసస్ శిరస్సులా వేలాడుతున్న తాళం (“సిగరెట్టు నీడ”)

చచ్చిపోతున్న చిరునవ్వు (“సిగరెట్టు నీడ”)

నా శరీరం పేరు మానవుడు
నేను చదువుతూన్న కాగితం పేరు మానవుడు (“సిగరెట్టు నీడ”)

మృత్యువును కాదు ఎంత ఘోరంగా వున్నా –
బతుకునే ప్రేమించిన మనిషి (“ఆత్మహత్యాగ్రహం”)… ఈ లైన్లలోని ప్రతీకల్లో నైరూప్య నేర నిరాశావహ మానవతల వంటి ప్రత్యేక ప్రత్యయాల ప్రసక్తే కన్పిస్తుంది.

ముఖ్యంగా కవి తనకో ప్రత్యేక ప్రతిపత్తిని ప్రయత్నపూర్వకంగా ఆపాదించుకొనే ప్రయత్నం చేస్తాడు. టైటిల్ కవితలో సరుకుల ప్రపంచంలో ప్రతి సరుకూ మిగతా వాటికంటే ప్రత్యేకమైందని, విశిష్టమైందని చెప్పే ధోరణే ఇది :

‘‘ఒక కట్టుకథ నన్ను కాటేసింది
ఒక వక్రీకరణ నన్ను వంచించింది
ఒక అపనింద నన్ను అల్లరి పాల్జేసింది…’’ అని చెపుతూ
‘‘నేను పుట్టకముందే
దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు
నా అస్తిత్వం చుట్టూ
అనుమానాల వలయాన్ని విస్తరిస్తుంది వర్తమానం…’’ అంటూ తన అస్తిత్వాన్ని చరిత్రలోని పాక్షిక సత్యంలో ముడిబెట్టుకుంటారు.

1947లో “హిందీ – హిందూ – హిందూస్థాన్/ ముస్లీం జావో పాకిస్తాన్” “ముసల్మాన్ కే దోహీస్థాన్ / పాకిస్తాన్ యా ఖబరస్థాన్” లన్న నినాదాలు అప్పటి దేశవిభజనలో జిన్నా, నెహ్రూ, పటేల్ ల వంటి కంప్రడార్ బూర్జువాల రాజకీయాల ఫలితంగా హిందూ మహాసభ వంటి మతోన్మాద సంస్థలు లేవదీసిన నినాదాలు. అప్పటి దేశరాజకీయాల్లోని అధి భౌతిక యాంత్రిక దృష్టి వలసవాద రాజకీయాలు పన్నిన “విభజించి, పాలించు” అన్న కుట్ర, దానితో కుమ్మక్కైన పాలకవర్గాల కుట్రల మధ్య కార్యకారణ సంబంధముండి హిందూ మతోన్మాదానికి సమంగా ముస్లిమ్ మతోన్మాదం కూడా అప్పుడు పెచ్చు రేగిందన్న విషయం అందరికీ తెలుసు.

భారత దేశంలోని సంస్థానాలన్నింటిని ఇండియన్ యూనియన్ లో విలీనం చెయ్యాలని పటేల్ తలపెట్టినపుడు నైజాం రాష్ట్రంలో రాచరికపు దన్నుతో తలెత్తిన మతోన్మాదశక్తి కాశిం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు. ఈ రజాకార్లు చాలా వరకు పట్టణాల్లో ఉండే ఆస్తిపరులైన ముస్లిములు లేదా పల్లెల్లో ఉంటూ కూడా వ్యవసాయోత్పత్తిలో శ్రమించని పరాన్న జీవులైన మతవాదులే. తరతరాలుగా నైజాము రాజ్యంలో ముఖ్యంగా తెలంగాణాలోని వెనుకబడ్డ రైతుల్ని పీల్చి పిప్పిచేస్తున్న జమీందారుల్తో కుమ్మక్కై నరమాంసం రుచి మరిగిన పులుల వంటివారు. నైజాం గద్దె దిగేలోగా తెలంగాణాలోని రైతుల్ని, స్త్రీలను, పిల్లల్ని ఊచకోత కోస్తూ వాళ్ళ జీవనాధారాల్ని ముఖ్యంగా జీవితాంతం కష్టపడి చేయించుకున్న ముక్కుపుడకో చెవికమ్మలో పుస్తె తాళ్లో ఉంటే వాటిని కొల్లగొడుతూ ఉడాయిద్దామని ప్లాను వేసుకుని మరీ తమ ఘాతుకాల్ని సాగించారు. హైద్రాబాదు నగరంలో ఈ రజాకార్ల దౌర్జన్యం నుండి రక్షించుకోడానికి అంతకంటే ముందురోజు వరకు ముస్లిమ్ తో భాయీ- భాయీ అని తిరిగిన ఉదార హిందూవాదులైన ఆర్య సమాజీయులు కూడా మిలిటెంట్ రక్షణ వ్యూహాల్ని రచించుకోవాల్సి వచ్చింది.

అయితే గ్రామాల్లో రైతుకూలీల్లో భాగమయిన ముస్లిం సోదరుల్లో మాత్రం “బందగీ” వంటి వారు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ వున్నారు. – మతోన్మాదులైన ముస్లిం రజాకార్ల నుండి గ్రామాల్లోని రైతులకు, స్త్రీలకు, పిల్లలకు రక్షణ కల్పించే విషయంలో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర వహించారు. ఈ చారిత్రక నేపథ్యంలోనే శ్రీశ్రీ ‘కసాయి’ ‘సాయిబు’ అన్న పదాల్ని కలిపి ‘కసాయిబు’ లన్న కొత్త మాటను సృష్టించాడు. సుద్దాల హనుమంతు పాటలో ‘తురకల’ నరకమని ఉన్నాఆ పాట ఆయన స్వయంగా కట్టినా కట్టకపోయినా రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణా రైతు కూలీల ప్రతిఘటనలోంచి తన్నుకు వచ్చిన పాటగానే దాన్ని పరిగణించాల్సి వస్తుంది. కాని దానికి మత తత్వాన్ని అంటగట్టాల్సిన అవసరం లేదు.

మత ధోరణి ఎప్పుడైనా ఎక్కడైనా అధి భౌతిక యాంత్రిక ధోరణే. భారతదేశం వంటి అర్థ వలస, అర్ధ భూస్వామ్య సమాజాల్లో మతం పాత్ర ప్రధానంగా పాక్షిక, విచ్ఛిన్నకర విరోధ లక్షణాల్నే కల్గి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు వీధిలో పడి పశుత్వంగా మారినపుడు వాటి ప్రస్తుత లక్షణాల్ని వర్ణించడం జీవిత వాస్తవికతను తన కార్య వస్తువుగావించుకున్న కవి యొక్క బాధ్యత అవుతుంది. అలా చేయకపోవడం మత సామరస్యం, మైనారిటీ మతస్తుల హక్కుల సంరక్షణ అనే ఆచరణాత్మక అవసరాల్ని ఆదర్శవాదం అనే నీతితో యాంత్రికంగా ముడి బెట్టడం లేక రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు కోసం ముఖస్తుతి చేయడమే అవుతుంది. కాని వాస్తవంలో మన దేశంలో కాంగ్రెసు పార్టీ చేసినట్లు ఒక వైపు మైనారిటీ మతస్తుల అహాన్ని ఊదరగొడుతూనే ఇంకోవైపు మత కల్లోలాల్లోకి వారిని నెట్టివేయడం జరుగుతుంది.

‘‘క్షమించండి, నా స్నేహితుల్లారా!
వక్రీకరణకు వత్తాసుగా
పదబంధాన్ని సృష్టించి
నన్ను వెక్కిరించడానికి వెనుదీయని
మహా కవిని నేను మన్నించలేను !
మన్నించండి, నా మిత్రులారా!
రాజుకీ, పేదకీ మధ్య లో భేదాన్నే చూడలేని
ప్రజాకవి ఉద్రేకానికి నేను ఊర్రూత లూగలేను…’’ బాగానే ఉంది. కానీ శ్రీశ్రీ చేసింది వక్రీకరణకు వత్తాసు కాదు. గతితార్కిక చారిత్రక పద బంధం మాత్రమే. ఆ పద బంధానికర్థం రజాకార్ల అరాచకత్వానికి పరిమితమైందే దాన్ని ముస్లిములందరి పై వ్యాఖ్య అనుకోవడం యాంత్రిక ధోరణి కిందకు వస్తుంది. అలాగే తన అస్తిత్వాన్ని ముస్లింల నైరూప్య అచారిత్రక అస్తిత్వంలో ముడిబెట్టుకోవడం యాంత్రిక ఆత్మాశ్రయ ధోరణే.

అదే విధంగా “రాజుకి పేదకీ మధ్య భేదాన్నే చూడలేని ప్రజాకవి” సుద్దాల హనుమంతు అని ఏ భౌతిక పరిస్థితుల్లో ఆ మాటలన్నాడో అర్థం చేసుకోకుండా అంటే అది అచారిత్రక వాదానికి, పిడివాదానికి మచ్చుతునక అవుతుంది.

చరిత్రను ఉత్పత్తి శక్తులకు ఉత్పత్తి సంబంధాలకు మధ్య జరిగే పోరాటం నుండి పుట్టే సామాజిక సంబంధాల చిత్రీకరణ పాలక వర్గాల అవకాశవాదానికి వత్తాసుగా పనికొచ్చే అది భౌతిక వాస్తవిక కళావాద చిత్రణగా అర్థం చేసుకుంటే ఈ విధంగానే జరుగుతుంది. కవిత్వాన్ని వాస్తవికతావాద, అధి వాస్తవికవాద ప్రత్యయంగా వాడుకునే ‘పెటీ బూర్జువా చైతన్యానికి ఈ రకమయిన చారిత్రక అంధత్వం సాధారణమయిందే.

ఖాదర్ మొహియుద్దీన్ లో అణచి వేతకు గురైన నిజమయిన మైనారిటీ చైతన్యం కనుక ఉంటే అది అర్థ వలస, అర్ధ భూస్వామ్య అధి భౌతిక భావజాలంతో పుట్టు మునక లేస్తున్నట్లు సులభంగానే అర్థమవుతున్నది. “తప్పదిక”, “సిగరెట్టునీడ”, “ఒక నిర్లిప్త పాటు”, “చెప్పుల్తొడుక్కున్న శవం” వంటి కవితల్ని నిశితంగా పరిశీలిస్తే… కవిత్వం ప్రచురణల మొట్ట మొదటి సంకలనం ‘క్రితం తర్వాత’ (1980) అఫ్సర్, కె. నరసింహాచారి, కృష్ణుడు, నీలిమాగోపీచంద్, ప్రసేన్, త్రిపురనేని శ్రీనివాస్ లనే ఆర్గురు కవుల సంయుక్త అధివాస్తవిక కవిత. ఈ కవితలో కవిత్వం ప్రచురణల పేరుమీద వచ్చిన కవుల కవిత్వం (రావిశాస్త్రి, ఎన్నెలో ఎన్నెల తప్పించి)లో ఉన్న గందరగోళమంతా ఉంది. ఉదాహరణకు:

సిద్ధాంతాలు ఏవైనా, సంస్థాగతాలు ఏవైనా, కొత్త పూల మొక్కని సృష్టించడమే సృజనాత్మకత, నాడీ మండలంలో కొత్త ప్రకంపనాలను కదిలించడమే విప్లవీకరణ… అన్న సిద్ధాంత ప్రతిపాదనలు చేశారు. సృజనాత్మక విప్లవీకరణల గురించి. కాని పూల మొక్క పదార్థ చైతన్యం నుంచి పుట్టుకొస్తుంది. గతితార్కికంగా కాని ఒక పూల మొక్కను కొత్త పూలు పూసే మొక్కగా హైబ్రిడైజ్ చేస్తే అది కొత్త పూల మొక్కను సృష్టించే సృజనాత్మకత కాదు. అలాగే నాడీ మండలంలో కొత్త ప్రకంపనాలను కదిలించేది విప్లవీకరణ కాజాలదు. అది ఆధునిక మత్తు పదార్థాలు కలిగించే తాత్కాలిక భౌతిక సంచలనమే. మనిషి సామాజిక చైతన్యంలో సృజనాత్మకతతో పాటే విప్లవీకరణ అనేది అతని ఆచరణలో సంపూర్ణంగా శ్రామిక వర్గ చైతన్యంగా ఎదిగే క్రియ. కాని ఈ కవులందరికీ సృజనాత్మకత, విప్లవీకరణ అంటే ఉన్న అభిప్రాయాలన్నీ యాంత్రికమూ, అసహజమైనవి గానే కన్పిస్తున్నాయి.

” స్వేచ్చంటే ‘పెరట్లో తులసి మొక్క కాదు
తల్లి గొంతులో పెగలని స్వరం స్వేచ్ఛ
కమ్యూనిజం అనుభవించిన పరాజయాల్ని, ఘాతుకాల్ని కమ్యూనిజానికంట గట్టాల్సిన అవసరం లేదు. పెడదారి తొక్కిన తన కొడుకుల్ని చూసి దుఃఖంతో పెగలని స్వరంతో బాధపడే తల్లి వంటిది కమ్యూనిజం. కొడుకుల తప్పుల్ని కాచుకోవడం తల్లి ప్రేమకెలా కొంత మేరకు అవసరమో వాళ్ళ తప్పుల్ని అవసరం మేరకు శిక్షించడం కూడా అంతే విధాయకం. రుమేనియాలోనైతే ప్రజలు తిరుగుబాటే చేశారు.

తప్పులు చేసినా వాటిని సరైన పాఠాలు నేర్చుకోడానికి ఉపయోగించుకోవడం గతి తార్కిక లక్షణం. అలాగే కమ్యూనిస్టు దేశాల్లో పొరపాట్లు జరిగితే నిరాశ చెందకుండా వాటివల్ల గుణపాఠం నేర్చుకొని ఆచరణలో ఇంకా ఉన్నతమయిన సమాజ దశకు చేరుకొనే ప్రయత్నం చేయడమన్నది వ్యక్తుల సమాజాల గతి తార్కిక కర్తవ్యం. ఒక వేళ పొరపాటు సరిదిద్దుకోలేక యాంత్రిక భావవాద ధోరణిలో తిరోగమిస్తే అది ఆయా వ్యక్తుల, దేశాలలోని లోపాలే కారణం అని అవి గతి తార్కిక భౌతికవాదం లోపాలు కావు. దాన్ని స్వంతం చేసుకున్న వారికి అవి దారి దివిటీలు.

విప్లవాచరణకు విప్లవ సిద్ధాంతాన్ని, చైతన్యాన్ని మరింతగా ఒంటబట్టించుకొని ఇంకా ఉన్నతమైన ప్రాతిపదికపై నిలబెట్టుకొనే బదులు నిరాశ నిస్పృహల పాలబడి పాలక వర్గాల భాష కాలమైన ఆధునిక అధి భౌతిక ప్రత్యయాలపై మోహంతో తిరోగమించడం కవిత్వం – ప్రచురణలు వెలువరించిన కవులందరిలో సామాన్య లక్షణంగా కన్పిస్తున్నది.

ఈ తిరోగమనంలో భాగంగానే రూపం, వస్తువుల మధ్యగల గతితార్కిక సంబంధం గురించిన అవగాహన లేక శిల్పాన్ని మాత్రమే కవిత్వమనుకునే కవులు ఆత్మాశ్రయ వైయక్తిక ధోరణి నుండి ఎప్పుడూ బయటపడ లేరు. అటువంటి కవి పాలక వర్గాల భావజాలాన్ని స్వంతం చేసుకొని వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడటానికి కంకణం కట్టుకున్న అధికార కవుల కంటే కళాహీనమైన కవే. అయితే వర్గ సమాజంలో సామాజికత, సమానత్వం అన్న వాస్తవికతల గురించి అసలు పట్టించుకోని ఏ కవైనా ఈ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. సామాజిక చైతన్యం పదార్థ చైతన్య గతితార్కిక రూపమే అయినప్పటికీ దాన్ని అనుక్షణ, పరాయీకరణకు గురిచేస్తూ అభావం చేసే పాలక వర్గాల కుట్రనుండి బయట పడాలంటే గతితర్కాన్ని చదువుకోవాల్సిన అవసరమేమీ లేదు.

(ఇంకా వుంది…)

వరంగల్. కవి, రచయిత, అధ్యాపకుడు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. 'సృజన' ఆధునిక సాహిత్య వేదికను నిర్వహించే 'సాహితీ మిత్రుల'తో కలసి పనిచేశారు. 1969లోనే 'ఫ్రీ - ఫ్రాంక్ వర్స్ - ఆధునికత', 'ఆధునికత - తెలుగు వచన కవిత' లాంటి లోతైన విమర్శ వ్యాసాలు రాశారు. 'జేసీ' పేరుతో 1980లలో అద్బుతమైన కవిత్వ విమర్శ వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలన్నీ 1991లో 'కవిత్వం - గతితార్కికత' పేరుతో ప్రచురించారు. సునిశిత విమర్శతో మూడు దశాబ్దాల పాటు యువతరాన్ని ప్రభావితం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ఫ్రొఫెసర్ గా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం రిటైరయ్యారు. అనంతరం అమెరికా వెళ్లారు. 30 మే, 2021న బ్రాంకైటిస్ తో అక్కడే చనిపోయారు.

One thought on “కవిత్వం – గతితార్కికత – అధిభౌతిక వైయక్తికత

  1. చాలా ఆలోచనలు రేకేత్తించే వ్యాసం. ఏ విషయాన్నైనా అంచనా వేయడానికి గతితర్కం ఒక్కటే సరైనా సాధనం అని నిరూపించే వ్యాసం.

Leave a Reply