కవిత్వంలో బహు భావత్వం(ambiguity) గురించి దరిదాపు డెభ్బై ఏళ్ల క్రితం William Empson చర్చించాడు. నలభై, యాభై ఏళ్ల క్రితం పోస్టుమోడర్నిస్టు విమర్శకులు అనేకత్వం (multiplicity) గురించి మాట్లాడారు. వీటిని తెలుగు కవిత్వానికి అప్లై చేస్తూ అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న విశ్లేషణలు జరిగాయి. ఒకే కవితలో విభిన్నమైన వివిధ భావాల నీడలు లభించే అవకాశం వుందిగాబట్టి విమర్శకులు తమ విశ్లేషణ ద్వారా ఈ వివిధత్వాన్నీ, విభిన్నత్వాన్నీ బహిర్గతం చేయాల్సుంటుందనీ, వాచకాన్ని ఏకభావ కోణం నుంచి చూడటం ఏదో ఒక అంశానికే దాన్ని కట్టిపడవేయటం పొరపాటనీ పాల్ డీ మాన్, డిర్రీడా లాంటి వాళ్ళు వాదించారు. కవితలో గానీ కథలో గానీ ఆ మాటకొస్తే ఏ సాహిత్య రూపంలో గానీ , రచనలో గానీ ఇది ఉందీ అది ఉందీ అని నిర్ధారించడానికి పూనుకోకుండా ఒకేసారి ధ్వనించే విభిన్నమైన వివిధ భావాల్ని చూపటానికి ప్రయత్నించటమే విమర్శ లక్ష్యం అని చెప్పి దానినే deconstruction అని పిలిచాడు డెర్రిడా. వాచక విషయమై ఒక స్పష్టమైన నిర్ధారణకు రాకుండా వినిర్ధారణకు వాచకంలో ఉన్న వనరుల్ని బయటికి లాగి చూపించటమే ఈ deconstruction. దీన్నే మనం వినిర్మాణం అనీ విఘటనీకరణ అనీ పిలుస్తున్నాం. వినిర్ధారణ అంటే ఇంకా సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం.
అయితే కవిత్వానికి ఈ భావనల్ని వర్తింపజేసి మాట్లాడేప్పుడు మొత్తంగా అన్నిరకాల కవిత్వానికీ దీన్ని మక్కికి మక్కిగా ఉపయోగించే పొరపాటు పనికి విమర్శకులు పూనుకుంటున్నారు. అనిర్దిష్ట (abstract) కవిత్వానికి ఇవి ఉపయోగపడే మాట వాస్తవమే కానీ నిర్దిష్ట(కాంక్రీట్) కవిత్వానికి ఇవి ఉపయోగపడకపోగా దానికి అన్యాయం చేసే అవకాశం ఉంది. ఒక నిర్దిష్ట సందర్భం నుంచి నిర్దిష్ట వస్తువు నిర్దిష్ట దృక్పథంతో నిర్మితమైన కవితలో అనేకభావాలకోసం వెదకటం హాస్యాస్పదం.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూసి
రూపురేఖా కమనీయ వైఖరుల గాంచి భళీ భళీయన్న వారే
నీదే కులమని ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున కృమ్మినట్లగున్
అన్నాడు జాషువా. తన కవిత్వాన్ని చదివి గొప్పగా ప్రశంసించిన వాళ్లే తన కులం దెలిసి దూరంగా తొలగిపోయే వివక్షా ధోరణి ఎంత బాధ కలిగించిందో చెప్పటమే ఇక్కడ కవి ఉద్దేశం. దీన్ని మించి అనేకత పేరుతో విభిన్నమైన వివిధభావాలు ఇందులో వెదికితే దొరకవు. అదే ఏ బైరాగి కవిత్వంలోనో , మో కవిత్వంలోనో సీతారాం కవిత్వంలోనో కష్టపడి ఒకటికి మించిన భావాల్ని పట్టుకోవచ్చు. కవిత్వ విశ్లేషణలో అనేకతని(multiplicity) సాధించిన సంతృప్తి పొందవచ్చు. కవిత్వంలో బహు భావత్వం( ambiguity) ఉన్న అవకాశాన్ని ఎత్తి చూపవచ్చు. నిర్దిష్ట కవిత్వ విషయంలో ఈ విన్యాసం కుదరదు.
ఇటీవల అఫ్సర్ ఒక విచిత్ర వాదనని ఏకరువు పెట్టాడు. “అనేకత (multiplicity) అనేది ఈ కాలపు సాహిత్య లక్షణం. దాన్ని దృష్టిలో వుంచుకునే మనం ఏ కవితనైనా చదవాలి. అంటే, దళిత కవి అనుకునే కవి రాసిన కవితలో కేవలం దళిత కోణమే కనిపించకపోవచ్చు. అందులో వేరే వేరే ప్రాతినిధ్య కోణాలు కూడా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఆ కవితని కేవలం దళిత కవితగా గుర్తించడం వల్ల ఆ కవితలోని మిగిలిన భావనల్ని మనం చీకట్లో తోసేస్తున్నామన్న మాట.”
దళిత కవిత్వంలో ఏదో ఒక భావాన్ని విశ్లేషించి అందులో మిగిలిన అనేక భావాల్ని తొక్కిపెట్టటం సరైనది కాదు అనే ఈ వాదన వినటానికి బాగానే వుంది. దీని సారాంశం సహేతుకంగా లేదు. తర్కానికి నిలబడేదిగా లేదు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు దళితకవిత్వం ఒక నిర్దిష్ట వస్తువుతో నిర్దిష్ట దృక్పథం నుంచి వచ్చిన కవిత్వం. అందులో అనేకతలూ బహు భావకతలూ దొరికే అవకాశం తక్కువ. ఉదాహరణకు మద్దూరి నగేష్ బాబు రాసిన ‘మీరేముంట్లు’ కవితలో కుల వాస్తవికతకి మించి అఫ్సర్ లాంటి వారు అనేకత్వం ఉందని నిరూపించగలరా? తెరేష్ బాబు రాసిన ‘హిందూ మహాసముద్రం’ లో విభిన్నమైన వివిధ భావాల్ని చూపించటం సాధ్యమేనా? స్వరూప రాణి మంకెన పువ్వు కవితలో దళిత స్త్రీ ప్రత్యేక సమస్యకు అతీతమైన బహుభావాలు బహిర్గతం చేయగలరా? అది కుదిరే పని కాదు. ముస్లింవాద కవిత్వానికీ, స్త్రీవాద కవిత్వానికీ, ప్రాంతీయవాద కవిత్వానికీ, బీసీ వాద కవిత్వానికీ – ఇలా ఆస్తిత్వవాద కవిత్వమని పిలుస్తున్న ఏ కవిత్వానికీ ఈ అనేకతనీ, విభిన్నతనీ వర్తింపచేయలేము. కొన్ని కొత్త పనిముట్లను వాడుతున్నామనే సంతృప్తి పొందటానికి విమర్శకులు వాడితే వాడుకోవచ్చు కానీ వాటివల్ల ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నాలు ద్రాక్షా పందిరికి అరటి గెలలు వేలాడుతున్నాయని చూపించిన చందమే అయ్యే ప్రమాదముంది.
తనలో ఏ పండ్లను వెతకాలనే విషయంలో చెట్టు పరిమితుల్ని విధించినట్లే, తనని ఎన్ని రకాలుగా విశ్లేషించవచ్చు, ఏ భావాలు తనలో అన్వేషించ వచ్చు అనే విషయంలో ఒక కవిత, వాచకం పరిమితుల్ని పెడుతుంది. అందుకే ఏ విమర్శ పనిముట్లను ఏ తరహా వాచకానికి, కవిత్వానికీ ఉపయోగించాలి అనేదే పరిశీలనకు నిలుస్తుంది. ఏ వాచకానికి ఏ విమర్శ ధోరణినయినా ఉపయోగించవచ్చనేది ఆ విమర్శ ధోరణి క్రొత్తదా పాతదా అనేదానితో నిమిత్తం లేకుండానే అర్ధంలేనిదవుతుంది. ఎంత అనేకత్వ ధోరణికి కట్టుబడిన విమర్శకుడైనా విమల ‘వంటిల్లు’ కవితలో పురుషద్వేషాన్ని చూపలేడు. జయప్రభ ‘పైటను తగలెయ్యాలి ‘కవితలో కవి నిర్దేశించిన భావానికి దూరంగా విశ్లేషణ జరపలేడు. ఖాదర్ ‘పుట్టుమచ్చ’ కవితలో ముస్లిం వాస్తవికతకు భిన్నమైన ఇతివృత్తాన్ని చూపలేడు. ముస్లింలు ఈ దేశ మూలవాసులనే ఉద్దేశంతో ఖాజా రాసిన’ రూట్స్’ కవితలో అందుకు భిన్నమైన అతీతమైన భావాన్ని చూపటం కుదిరేపని కాదు. కనుక ప్రతి వాచకమూ అది కవితైనా కధైనా నవలైనా దాన్ని వివరించటానికి సంబంధించిన పరిమితుల్ని విధిస్తుంది. దానికి వర్తింపజేయాల్సిన విమర్శనా ధోరణుల , పనిముట్ల సాధ్యాసాధ్యాల్ని సూచిస్తుంది.
అసలీ అనేకత, బహుభావత, deconstruction లాంటి భావనలు Kafka, James Joyce, Becket,TS Eliot లాంటి వారు రాసిన అనిర్దిష్ట(abstract) వాచకాల విషయంలోనే ఉనికిలోకి వచ్చాయనే వాస్తవం చాలు వీటి అనుగుణ్యతకున్న పరిమితులు తెలుసుకోటానికి. మరో విషయం ఏంటంటే ఈ రచయితలూ, విమర్శకులూ అందరూ వారివారి కాలాల్లోని ఉద్యమాల వ్యతిరేకులే. అందుకే ప్రజాస్వామికంగా కనిపించే ఈ భావనలు సారాంశంలో ప్రజల పక్షాన లేవు. సూత్రీకరణలూ ప్రతిపాదనలు చేసేటప్పుడు పండిత విమర్శకులు వీటిని పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.
వివిధ సందర్భాల్లో వివిధ పాఠకులూ విమర్శకులూ వాచకాన్ని అధ్యయనం చేసే క్రమంలో కలిగే భావాల మార్పులూ చేర్పులూ సాధ్యమే. కానీ అవేవీ రచన సందర్భాన్నీ, రచయిత వుద్దేశ్యాన్నీ, రచన స్వభావాన్నీ తృణీకరించలేవు. అలా తృణీకరించే పక్షంలో ఆయా సాహిత్యాల అసలు లక్ష్యాలు మరుగున పడి అవి ప్రాతినిధ్యం వహించే ఉద్యమాలకీ భావజాలానికీ అన్యాయం జరిగే అవకాశమూ ఉంది.