కళ్యాణి కథ – రంగనాయకమ్మ

‘తప్పు’ని గ్రహించగలిగితే, అది అభ్యుదయం ‘తప్పు’ని పూర్తిగా ‘ఒప్పు’గా మార్చగలిగితే అది ‘విప్లవం’ అంటారు నవలా రచయిత్రి రంగనాయకమ్మ గారు. అటువంటు అభ్యుదయాన్ని చూపుతూ, విప్లవాన్ని ఆశిస్తూ వారు రాసిన నవల “కళ్యాణి కథ”.

పాఠకులు చెప్పిన విషయాల్ని, కథ పేరుతో యధాతధంగా ఎక్కించెయ్యడం కాదు, నేను చేసేది. ఆ వాస్తవాలు తప్పులుగా వుంటే, అవి ఎలా మారాలని నేను అనుకుంటానో, ఎలా మారడం న్యాయమైన పరిష్కారంగా నేను నేర్చుకున్నానో, అలాంటి మార్పులు నేను రాసే పుస్తకంలో వుండాలనుకుంటాను” అని చెప్తారు రంగనాయకమ్మగారు “కళ్యాణి కథ” నవల ముందు మాటలో. తనకు తెలిసిన ఓ పాఠకురాలి కథకు తాను నమ్మిన పరిష్కారంతో ఈ నవల రాసారని అర్ధం అవుతుంది. అయితే ఈ నవలలో మూల కథతో పాటు కొంత అదనపు సమాచారాన్ని కూడా రచయిత్రి ఇవ్వాలనుకోవడం వలన వీరి పాత నవలల శైలిలో పోలిస్తే ఈ నవల కొంత భిన్నంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో కథనం కొంత సాగతీతగా కూడా అనిపించింది.

ఇది కళ్యాణి అనే ఓ స్త్రీ కథ. ఓ మధ్యతరగతి దంపతులకు రెండవ కూతురుగా పుట్టిన కళ్యాణి పట్ల మొదటి నుండి ఆమె తల్లి తండ్రులు పక్షపాత ధోరణీతోనే వ్యవహరించే వాళ్లు. కళ్యాణి అక్క లావణ్య అందమైనది. అసలు ఆమె తల్లి రెండవ కాన్పు వద్దనుకున్న సమయంలో కళ్యాణి కడుపున పడింది. వద్దు వద్దు అనుకుంటూనే కన్న ఆ బిడ్డ నల్లగా పుట్టడంతో తల్లి తండ్రులకు ఆమె పట్ల మొదటి నుండి ఓ తక్కువ దృష్టే ఉండేది. చిన్నప్పటి నుండి పెద్ద బిడ్డకు లేని గొప్ప గుణాలను అంటగడుతూ చిన్న పిల్లను చులకనగా చూడడం పది మందిలో ఆమెను తక్కువ చేసి మాట్లాడడం వలన లోకం దృష్టిలో లావణ్య మంచి ఆడపిల్లగా, కళ్యాణి పెంకి ఘటంగా పేరు పడ్డారు. దీనికి తల్లి తండ్రుల ప్రవర్తన మొదటి కారణం అయితే ప్రశ్నించే కళ్యాణి ధోరణీ ఆమెను నలుగురిలో పలుచన చేసేవి. కాని అదే గుణం కళ్యాణి వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడింది. లావణ్య అందం చూసి ఆమె మేనత్త కోరి ఆమెను కోడలిగా చేసుకుంటుంది. కాని లావణ్య పెళ్ళిని లాభ నష్టాల దృష్టిలోనే చూసే వ్యక్తి కావడం వలన, తాను లాభపడి చుట్టూ ఉన్న వారిని నష్టపరచడం తన నైజంగా మార్చుకుంటుంది.

ఆ ఇంట్లో అందరికన్నా విభిన్నంగా ఆలోచించే కళ్యాణి ఎవరి ప్రోత్సాహం లేకుండానే కష్టపడి చదివి బ్యాంకు ఉద్యోగం సంపాదించుకుని ఇంటికి దూరంగా వెళ్లిపోతుంది. ఆ కుటుంబంతో స్నేహం ఉన్న శంకరరావు ఆమెకు ఫోన్ చేయడం మొదలెడతాడు. కళ్యాణి అతను చెప్పే మాటలను నమ్మి అదే ప్రేమ అనుకుని అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. తమ ఇద్దరి కులాల్లో ఏవో పెద్దా చిన్నా తేడాలున్నాయని అమె తల్లి తండ్రులు ఈ పెళ్ళి ఇష్టపడకపోయినా, శంకరరావుకు శారీరిక సమస్య ఉందని తెలిసినా అమె అతన్నే పెళ్ళి చేసుకుంటుంది. పేళ్లి తరువాత మొదటి రెండు రోజులలోనే ఆమె చూసిన అనుభవాలు ఆ జీవితం పట్ల ఆమెలో విరక్తిని పెంచుతాయి. ఆ పెళ్లి నుండి పారిపోయి వచ్చిన కళ్యాణికి తాను తల్లిని కాబోతున్నానని తెలుస్తుంది. చాలా ఆలోచించి ఆమె ఆ బిడ్డను కనాలనుకుంటుంది. బిడ్డను కన్నందుకు ఆ బిడ్డను చట్టపరంగా తన దగ్గర ఉంచుకోవడం కోసం భర్తని చాలా కాలం భరిస్తుంది. అతని చేతిలో శారీరిక హింసకు గురి అవుతుంది. అయినా బిడ్డ కోసం ఎన్నో ఇష్టం లేనివి సహిస్తుంది. చివరకు ఆ వివాహం నుండి ఆమె ఎలా బైటపడింది అన్నదే ఈ “కళ్యాణి కథ”.

ఈ నవలలో కళ్యాణి, లావణ్య అనే ఇద్దరు స్త్రీల వ్యక్తిత్వాలను పరిచయం చేస్తారు రచయిత్రి. లావణ్యకు పెళ్లి అంటే తాను ఆడంబరంగా, సామాజిక భద్రతతో జీవించడానికి ఉపయోగపడే వ్యవ్యస్థ మాత్రమే. అందుకే భర్తను తన చేతిలో కీలుబొమ్మను చేస్తుంది. ఆస్తి, నగలపై తన ఆధిపత్యం సంపాదించుకుంటుంది. అత్తకు నరకం చూపిస్తుంది. చివరకు ఆమె ఒంటరి మరణానికి కారణం అవుతుంది. ఇంత చేసినా సమాజంలో గౌరవప్రదమైన స్త్రీగా స్థానం సంపాదించుకుంటుంది. ఆమె చుట్టూ ఉన్న వారు ఆమెను అసహ్యించుకుంటున్నా ఆమె భర్త ఆమె చెప్పుచేతలలో ఉండడం వలన ఏమీ చేయలేక నిస్సహాయంగా ఆమెను భరిస్తూ ఉంటారు.

కళ్యాణి ఉన్నతమైన ఆదర్శాలు, భావలతో జీవిస్తూ ఉంటుంది. కాని ఆమె భర్త చేతిలో మోసపోతుంది. అతని అహానికి, దర్పానికి బలి అవుతుంది. కన్న బిడ్డ కోసం ఇష్టం లేని చాలా విషయాలను భరిస్తుంది, సహిస్తుంది. మనుష్యుల మధ్య ఉండే బంధాలలో అమె నిజాయితీని కోరుకుంటుంది. కాని తల్లి తండ్రుల నుంచి, చుట్టూ ఉన్న చాలా మంది వ్యక్తుల దాకా అమె ఓ రకమైన హిపోక్రసీనే గమనిస్తుంది. అటువంటి వాతావరణంలో ఆమె ఇమడలేకపోతుంది. అందుకనే చాలా ఇబ్బంది పడుతుంది. చాలా మంది స్త్ర్రీలు సహజంగా తీసుసునే విషయాలని ఆమె ప్రశ్నిస్తూ తన మనసుకు అనుగుణంగా నడుచుకోవాలని తాపత్రయపడుతుంది. అదృష్టవశాత్తు ఆమెకు అర్ధం చేసుకునే స్నేహితురాళ్లు, ఆమెను అభిమానించే వ్యక్తులు తారసపడతారు. వీరి సహాయంతో ఆమె తన భర్త పెట్టే హింస నుండి బైటపడుతుంది.

వివాహం అనే వ్యవ్యస్థలో స్త్రీ కాని పురుషుడు కాని కేవలం తమ లాభం కోసం ఇతరుల పై అజమాయిషీ, అధికారం చెలాయించి జీవించాలనుకుంటే అది దోపిడి అవుతుంది. లావణ్య తన భర్తతో ప్రవర్తించే విధానం, శంకర్రావు కళ్యాణీతో ప్రవర్తించే విధానం ఇంచుమించు ఒకే పద్దతిలో ఉంటాయి. అందుకే చివర్లో కళ్యాణి తన భర్తతో పాటు అక్కతో కూడా శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటుంది. మనం అసహ్యించుకోవలసింది, వ్యక్తులను కాదు వారి ఆధిపత్య భావజాలాన్ని అని రచయిత్రి చాలా సందర్భాలలో చెప్పే ప్రయత్నం చేసారు. స్త్రీ కాని, పురుషుడు కాని వివాహం పేరుతో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తే అది ఇద్దరి విషయంలోనూ తప్పే అవుతుంది. శంకర్రావు, లావణ్యలిద్దరూ కూడా తమ జీవిత భాగస్వాములను తమ ఆధిపత్యాంతో బంధించాలనుకుంటే కళ్యాణీ ఎదురు తిరిగి ఆ బంధం నుండి బైట పడుతుంది. కాని లావణ్య భర్త మాత్రం లొంగిపోయి తన చుట్టూ ఉన్నవారెవ్వరికీ పనికిరాక ఓ కీలుబొమ్మలా వ్యక్తిత్వాన్ని కోల్పోయి బ్రతుకుతూ ఉంటాడు.

వీరే కాక మరో ముఖ్యమైన పాత్రను ఈ నవలలో గమనించాలి. అతనే కళ్యాణి ఆడబడుచు భర్త నారాయణ. అత్తగారి తరుపు వాళ్ళు తనకు నచ్చకపోయినా, వారి పద్దతులను ఒప్పుకోలేకపోయినా, భార్యతో రాజీ పడి జీవిస్తూనే తన ఇష్టాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ తనకు న్యాయం అనిపించినది చేసుకుంటూ పోయే వ్యక్తి ఇతను. కళ్యాణికి ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చే సోదరుడు. అటు శంకర్రావు కుటుంబాన్ని తనపై అధికారం చేయనివ్వకుండా నిలవరించుకుంటూ, తాను మంచి అనుకున్నదాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిత్వం ఉన్న విశిష్టమైన వ్యక్తి నారాయణ. పురుషుడు తలచుకుంటే సహకరించే స్త్రీ భార్యగా రాకపోయినా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కొంత వరకన్నా ముందుకు సాగగలడేమో కాని స్త్రీ విషయంలో అది దాదాపుగా అసాధ్యం. కళ్యాణీ స్నేహితుల జీవితాలను పరిశీలీంచినా ఇది అర్ధం అవుతుంది.

ఈ నవలలో నరేషన్ చాలా ఎక్కువగా కనిపించి పాత్రలు ఓ ధోరణిగా మాట్లాడుతున్నట్లు కొన్ని సందర్భాలలో అనిపిస్తాయి. ముఖ్యంగా కళ్యాణి జరిపే సంభాషణలు కొన్ని సందర్భాలలో చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి. కళ్యాణి ఆలోచనలు, జ్యోతితో ఆమె చేసే చర్చలు, ఇవన్నీ సాగతీతగా అనిపించే సందర్భాలు అనేకం. కళ్యాణి స్నేహితురాళ్లకి ఫోన్ చేసి జరిపే సంభాషణలలో కూడా కొంత సాగతీత, నాటకీయత, చెప్పిందే మళ్ళి మళ్ళి చెపుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ నవలలో రంగనాయకమ్మగారి శైలిలో రిపిటీషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కళ్యాణి పని చేసే బ్యాంకు వివరాలు చాలా విపులంగా ఇస్తూ వెళ్ళారు రచయిత్రి. కొన్ని సార్లు ఈ కథనానికి ఇంత డీటయిలింగ్ అవసరమా అనిపించింది కూడా.

శంకర్రావు పాత్ర స్వభావం, అలవాట్లు చాలా మంది సగటు మగాళ్లను పరచయం చేస్తాయి. కళ్యాణి దేవున్ని నమ్మకపోవడం గురించి ప్రస్తావిస్తూ రచయిత్రి ఈ పాయింట్ ను చాలా ఉన్నతంగా చూపించే ప్రయత్నం చేసారు. శంకర్రావు గుడ్డి భక్తిలోని మూర్ఖత్వం చూపిస్తూనే దేవున్ని నమ్మకపోవడం కళ్యాణీ విచక్షణగా చూపించే ప్రయత్నం చేస్తూ వెళ్ళారు. తన నమ్మకాలకు అనుగుణంగా కళ్యాణీ జీవిత ప్రయాణాన్ని సూచించడం రచయిత్రి ముఖ్య ఉద్దేశంగా ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది. దీని కోసం సంభషణలను రచయిత్రి అంత విస్తారంగా రాసారేమో మరి. దీని వలన పాత్రల మధ్య సంభాషణలు సహజంగా జరుగుతున్నట్లు అనిపించకపోవడం ఈ నవలలో పెద్ద లోపం. కొన్ని నవలలు కొన్ని సందర్భాలలో కుదిరినట్లు మరో సారి కుదరవు. “కళ్యాణి కథ” “జానకి విముక్తి”, “స్వీట్ హోం” స్థాయి రచన కాదు. ఇందులో రచయిత్రి కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదు. పైగా ఆమె శైలిలో విస్తారమైన సంభాషణలు చొచ్చుకువచ్చి నవలలోని కథనం పట్ల పాఠకుల ఆసక్తి మందగించే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ నవలలో కళ్యాణి చుట్టూ ఓ గొప్ప స్నేహ వాతావరణం ఉండడం కనిపిస్తుంది. స్త్రీలు ఒకరికొకరు తోడుగా అండగా ఉండి జీవించగలిగితే వారి జీవితంలో చాలా విషయాలను ఎదుర్కునే శక్తిని సంపాదించుకోగలుగుతారు. ఇది ఖచ్చితంగా నిజం. కాని చాలా సందర్భాలలో స్త్రీలకు ఆ తోడ్పాటు తోటి స్త్రీలనుండి అందదు. ఈ కథలో కళ్యాణి మాత్రం చక్కని స్నేహితురాళ్లను సంపాదించుకోగలుగుతుంది. అదే ఆమె జీవితానికి బలం అవుతుంది. పరస్పరం ఒకరికొకరు తోడుగా అండగా నిలిచే ఆమె స్నేహితురాళ్లిచ్చిన నైతిక ఆసరా నిజ జీవితంలో చాలా మంది స్త్రీలు అందుకోవాలనుకున్నా అందనిది. ఈ నవల స్త్రీలలో ఆ పరస్పర తోడ్పాటు పట్ల ఆలొచన రేకెత్తిస్తే బావుంటుందనిపిస్తుంది.

ఓ సమస్యను చూపించి దానికి పరిష్కారం దిశగా సాహిత్యాన్ని సృష్టించే దిశగా నవలలను తెలుగు పాఠకులకు అందిస్తున్న అతి తక్కువ మందిలో రంగనయకమ్మగరు అగ్రశ్రేణీలో నిలుస్తారని ఈ నవల మరో సారి రుజువు చేస్తుంది.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply