ప్రపంచ యుద్ధానంతర స్త్రీవాద ఇంగ్లీషు కవయిత్రి: కరోల్ ఆన్ డఫి

1999 లో ప్రఖ్యాత ఆంగ్ల కవి టెడ్ హ్యూ మరణించినపుడు, అప్పటికి 43 యేళ్ళ వయసున్న కరోల్ డఫి, బ్రిటిష్ రాజ్య ఆస్థాన కవిగా నియమించబడుతుందని కవిగా ఆమెకు వున్న ఆదరణ గురించి తెలిసిన వాళ్ళంతా భావించారు. కానీ స్వలింగ సంపర్కురాలైన కరోల్ డఫి ని ఆస్థాన కవిగా నియమిస్తే బ్రిటన్ లోని ఛాందసవాదులు విమర్శకు దిగుతారన్న జంకుతో ఆనాడు ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది.
ఆనాడు ఆ నియామకం చేజారిపోయినా, తిరిగి పదేళ్ళ తరువాత 2009 లో గ్రేట్ బ్రిటన్ ఆస్థాన కవి పదవి కరోల్ డఫి ని వెతుక్కుంటూ వొచ్చిందంటే, ఆమె ఎంతటి ప్రతిభావంతురాలైన కవయిత్రో అర్థం చేసుకోవొచ్చు. 400 యేళ్ళ చరిత్రలో గ్రేట్ బ్రిటన్ ఆస్థాన కవి పదవిని అధిష్టించిన తొలి మహిళ, తొలి స్కాట్లాండ్ దేశీయురాలు కరోల్ డఫి.

1955 లో గ్లాస్గో లో జన్మించిన కరోల్ డఫి తండ్రి ఐరిష్ దేశీయుడు. తలిదండ్రులకు తొలి సంతానం. కరోల్ డఫి తరువాత నలుగురు తమ్ముళ్ళు. ఆమెకు ఆరేళ్ళ వయసున్నపుడు, కుటుంబం స్టాఫ్ఫోర్డ్ కు మారింది.

ఫిలాసఫీ లో పట్టా పుచ్చుకునే నాటికే కరోల్ డఫి మూడు కవితా సంపుతులు వెలువరించినా, 1985 లో వెలువరించిన ‘స్టాండింగ్ ఫిమేల్ న్యూడ్’ కవితా సంపుటి ఇంగ్లీషు కవిత్వ ప్రపంచంలో ఆమెకు అనేక మంది అభిమానులను సంపాదించి పెట్టింది. సరళమైన భాషతోనే సంక్లిష్ట అంశాలను వర్ణించే కరోల్ డఫి కవిత్వం సున్నితంగా వుంటూనే, స్త్రీల స్థితి మీద, ముఖ్యంగా నగరాలలో నివసించే స్త్రీల స్థితి మీద గరుకైన వ్యాఖ్యలు చేస్తుందని విమర్శకులు ప్రశంసించారు. తదనంతర కాలంలో ‘సెల్లింగ్ మాన్ హట్టన్’, ‘ద అదర్ కంట్రి’ ‘మీన్ టైమ్’, ‘వరల్డ్ వైఫ్’ వంటి అనేక కవిత్వ సంపుటులు వెలువరించింది కరోల్ డఫి. గ్రేట్ బ్రిటన్ లోని అనేక విద్యా సంస్థలలో కరోల్ డఫి కవిత్వం సిలబస్ లో చేర్చబడింది. కవిత్వం మాత్రమే కాకుండా, కొన్ని నాటకాలు, పిల్లల కోసం కొన్ని పుస్తకాలు కూడా రాసింది కరోల్ డఫి.

ప్రేమికుడా

ఎర్రగులాబీ కాదు
సిల్కుగుండె కానుక కూడా కాదు

ఈరోజు ఒక ఉల్లిగడ్డను
బహుమతిగా ఇస్తా నీకు

ఇది గోధుమరంగు కాగితంలో
చుట్టబడిన చందమామ
ఇది వెలుగును ఇస్తుంది
సున్నితంగా ఆచ్చాదనలు
తొలగించబడిన ప్రేమవలె

ప్రేమికురాలి వలె
కన్నీళ్ళతో నిన్నుఅంధుడిని చేస్తుంది
నీ ప్రతిబింబాన్ని
చలించే విషాదచిత్రంగా మలుస్తుంది

ఒక అందమైన కార్డుతోనో, లేక
నా ముద్దుని ముద్రించిన
సందేశంతోనో కాదు

నేను నీ ముందు
నిజాయితీగా వుండడానికి ప్రయత్నిస్తున్నా

ఈరోజు నేను నీకు
ఈ ఉల్లిగడ్డనే ఇస్తాను
దీని గాడచుంబనం
నీ పెదాలపై నిలిచి వుంటుంది…
ఒకరి కౌగిలిలో ఒకరం నమ్మకంగా
ఒదిగి వున్నంతకాలం

స్వీకరించు
నీవు ఇష్టపడితే
దీని శ్వేతవర్ణ రింగుల పొరలు
ప్లాటినం వెడ్డింగ్రింగువలె అమరగలవు

జాగ్రత్త
దీని సువాసన
నీ చేతివేళ్ళకు అంటుకునే వుంటుంది
నీ కత్తి అంచులకు కూడా…

నగ్నంగా నిలబడి వుండే స్త్రీ

నాలుగు రూకల కోసం ఇట్లా ఆరుగంటలు నిలబడాలి
కిటికీ వెలుగులో నాభి చనుమొనలు పిరుదులు
అతడు నాలోని వర్ణాలను హరిస్తాడు

‘కొంచెం కుడి వైపుకు -కాస్త నిలకడగా వుండు’
పెద్ద ప్రదర్శన శాలల్లో ప్రదర్శనకు పెట్టినపుడు
గొప్ప విశ్లేషణలకు అనువుగా నా బొమ్మ కనిపించాలి
డబ్బులున్న ఆసాములు నా చిత్తరువుని చూసి
‘ఆహా – ఓహో’ అని అరుస్తారు
బహుశా, దానిని కళాపోషణ అంటారేమో
పరిమాణం, కొలతల గురించి చిత్రకారుని బెంగ
నాకేమో, నా తదుపరి భోజనం గురించి

‘సన్నబడుతున్నావు – మంచిది కాదు’ అంటాడు
నా రొమ్ములు కొద్దిగా కిందకు వేలాడుతున్నాయి
చిత్రకారుని గది చల్లదనంతో
నా నగ్న శరీరం గడ్డకట్టి వుంది

అతడి పేరు జార్జెస్ – గొప్ప చిత్రకారుడని జనమంటారు
కొన్నిసార్లు అతను ఏకాగ్రతను కోల్పోతాడు
నా వెచ్చని ఊపిరితో బిగదీసుకుపోతాడు
పెయింట్ బ్రష్ ను రంగుల్లో ముంచుతూ
క్యాన్వాస్ మీద నన్ను లొంగదీసుకుంటాడు
ఇద్దరమూ పేదవాళ్ళమే

‘ఎందుకు ఈ బొమ్మలు వేయడం’ అని అడుగుతాను
‘బొమ్మలు వేయడం తప్ప నాకు మరొకటి తెలీదు
కాస్త నిశ్శబ్దంగా వుండగలవా?’
నా నవ్వు అతడిని కలవరపెడుతుంది
ఈ చిత్రకారులు తామేదో గొప్పవాళ్ళమనుకుంటారు
రాత్రి పూట నన్ను నేను మద్యంతో నింపుకుంటాను
బార్లలో విశృంఖలంగా డాన్సులు చేస్తాను

బొమ్మ వెయ్యడం పూర్తయిన తరువాత
అతడు నాకు గర్వంగా చూపించి సిగరెట్ వెలిగిస్తాడు
‘నా డబ్బులు చేతిలో పెట్టు’ అంటూ నా దుస్తులు తీసుకుంటాను
నిజం చెప్పాలంటే, ఆ బొమ్మ నాలాగ లేనే లేదు

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

2 thoughts on “ప్రపంచ యుద్ధానంతర స్త్రీవాద ఇంగ్లీషు కవయిత్రి: కరోల్ ఆన్ డఫి

  1. I am very happy to read this article.My favourite poem standing nude by carl ann duffy beautifully translated by you. One interesting issue is I got Carl ann Duffy poems book as gift from london community magazine for printing my poem Äutumn came . Carl Ann duffy poetry is so simple on outer yet poignant in inner layers.

Leave a Reply