గత ఏడాదిన్నర కాలంగా కరోనా మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. మాస్క్ లేకుండా బయటకు వెళ్ళటం మర్చిపోయాం. శానిటైజర్ స్పృహ కూడా మనలో ఒక ఛానల్‌గా ఉంటూనే ఉంది. భౌతికమైన ఈ అంశాలే కాదు…కంటికి కనిపించని ఈ మహమ్మారి మొత్తంగా సమాజ గమనరీతి పై తీవ్ర ప్రభావం వేసింది. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక ఒకటేమిటి అన్ని కోణాలు, అనేక పార్శ్వాలు, పలు పొరల్లో కోవిడ్-19 చొచ్చుకుపోయింది. జీవితాలను అతలాకుతలం చేసింది. కలలు సమాధి చేసింది. బంధాలను తెంచి వికట్టహాసం చేసింది. కడసారి చూపుకు నోచుకోని వారు, కుప్పలుగా పోగుబడిన శవాల గుట్టలు, తినటానికి ఇంత ముద్ద దొరక్క ప్రాణాలొదిలివ వారు, హాస్పటల్ బిల్లులకు ఆస్థులు అమ్ముకున్నవారు, అప్పుల పాలైన కుటుంబాలు…ఎన్నో గాథలు, వ్యథలు. వీటన్నింటి పై కవులు, కథకులు, కళాకారులు తమదైన శైలిలో స్పందించారు. అక్షరాల్లో వ్యక్తీకరించారు.
సమాజాన్ని సాహిత్యం అద్దం పడుతుంది. సాహిత్యంలో నుంచి చూస్తే సమాజం కనిపిస్తుంది. బహుశా అందుకే కదులుతున్న జీవితాన్ని ఒక్క కుదుపు కుదిపిన కరోనా కాలాన్ని ఒడిసి పట్టాలని సంకల్పించింది సంపాదక బృందం. కరోనా కాలం కథలు పేరుతో ఈ బృహత్కార్యానికి రూపం ఇచ్చారు. ప్రముఖ రచయిత్రులు తిరునగరి దేవకీ దేవి, అనిశెట్టి రజిత, డా. కొమర్రాజు రామలక్ష్మి, డా. బండారి సుజాత, డా.మురాడి శ్యామల, తమ్మెర రాధిక సంపాదకత్వం వహించి ఈ పుస్తకం తీసుకుని రావటంలో విశేషంగా కృషి చేశారు. కరోనా కాలాన్ని ముఖ్యంగా తెలుగు సమాజం, భారత దేశంలో ఎదురైన, ఎదుర్కొన్న పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం ఒక రిఫరెన్స్ లాగా పని చేస్తుంది అని చెప్పటం అతిశయోక్తి కాదు. పుస్తకంలోని కథలు,కథనాల్లోకి వెళ్లే ముందు నాకు బాగా స్ఫూర్తిని ఇచ్చిన అంశం 630 పేజీల ఈ పుస్తకాన్ని తీసుకురావటంలో కర్త, కర్మ, క్రియ మొత్తంగా మహిళలే. ఆలోచన నుంచి కార్యాచరణ వరకు, కవర్ అట్ట డిజైన్ నుంచి కంటెంట్ వరకు వీరే బాధ్యతను భుజాన కెత్తుకుని కరోనా కాలాన్ని రికార్డ్ చేశారు.
ఇక పుస్తకంలో కాస్త లోతుగా వెళితే ఔటర్ లైన్‌గా లేదా నేపథ్యంగా కరోనా ఉన్నా…అనేక పార్శవాల్లో ఏ అంశం ఎక్కువగా రచయిత్రులను కదిలించింది అనేది చూస్తే…110 వరకు ఉన్న కథలు, కథనాల్లో 90 శాతం మంది వలస కార్మికులు, పని మనుషుల అంశాన్నే కథా వస్తువుగా ఎంచుకున్నారు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, విధానాల్లో లోపాల వల్ల లక్షలాది మంది వలస కార్మికుల బతుకులు ఏ విధంగా రోడ్డున పడ్డాయో వివరిస్తూనే, అదే సమయంలో వారిని ఆదుకోవటానికి, అంత అన్నం పెట్టి గమ్యస్థానాల వరకు చేర్చటానికి ముందుకు వచ్చిన సహృదయులకు కథల్లో చోటు దక్కింది. ఇక ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా తమ జీవితాలను పణంగా పెట్టి సేవలందించిన వారి గురించి కొన్ని కథలు స్పృశించాయి. కరోనా మహమ్మారి కలిగించిన విపరీత ఆవేదన కనీసం ఆత్మీయుల కడచూపులకు నోచుకోనివ్వకపోవటం ఒకటి. మరణం నా వరకు వస్తుందేమో అన్న ఆందోళన కూడా మనం చూశాం. ఈ ఆందోళనను కూడా రచయిత్రులు తమ అక్షరాల్లో పొందుపరిచారు. కరోనా మానవ జీవితంలో ఎంత విధ్వంసం సృష్టించినా ఒకరకంగా మనలోకి
మనం తొంగి చూసుకునే అవకాశం కూడా కల్పించింది. డా. అమృత లత రాసిన ‘మనఃసాక్షి’ కథ దీనికి ఉదాహరణ. స్నేహితుడు నమ్మి ఇచ్చిన బంగారు నగలను తాను ఎదగటానికి వాడుకున్న కరుణాకర్… కందున్ జ్యూలరీ షాపుకు యజమానిగా మారిన వైనం, అదే సమయంలో తనకు దొరికిన వజ్రాల నెక్లెస్ విషయాన్ని నిజాయితీ కరుణాకర్‌కు చెప్పిన బండి పై చెరుకు రసం అమ్ముకునే ప్రకాశ్ రావు వ్యక్తిత్వాలను కథలో పక్క పక్కనే పేర్చారు రచయిత్రి. ఇద్దరూ కరోనా బారిన పడి పక్క పక్క బెడ్ల పైనే చికిత్స తీసుకునే
సందర్భం కథలో ఉంటుంది. ఇక డా. తాళ్ళపల్లి యాకమ్మ రాసిన రాసిన ‘దుఖఃనది’ కథ కడుపు చేత పట్టుకుని బొంబాయి వలస వెళ్లిన శాంతమ్మ, నాగన్నల కథ. పని చేయించుకున్న యజమాని పైసలు ఇవ్వకుండా అన్యాయం చేస్తే …ఉన్నపళంగా పెట్టిన లాక్‌డౌన్ వల్ల ఈ ఇద్దరి జీవితాలు ఏ రకంగా తలకిందులు అయ్యాయో ఈ కథ వివరిస్తుంది. వలస కార్మికుల ఆకలి చావులను ఈ కథ కళ్ళకు కట్టింది.
వాస్తవంగా వీటిలో చాలా కథలు అప్పుడు జరిగిన యధార్ధ ఘటనల ఆధారంగా రాసినవే అని అర్థం అవుతుంది. కరోనా లాక్‌డౌన్ వల్ల దిక్కుతోచని స్థితిలో చేతిలో డబ్బుల్లేక గాయపడిన తండ్రిని సాహసోపేతంగా సైకిల్ పై ఇంటికి చేర్చిన అమ్మాయి గాధ పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది. ఢిల్లీ నుంచి బీహార్‌లోని దర్భాంగకు అంటే సుమారు 1200 కిలోమీటర్లు తండ్రిని సైకిల్ పై ఎక్కించుకుని వారం రోజుల పాటు సైకిల్ తొక్కింది పదిహేనేళ్ళ జ్యోతి కుమారి. ఈ ఘటన స్ఫూర్తిగా ‘ఆత్మస్థైర్యం’, ‘తీరం చేరిన లక్ష్యం’ కథలు రూపుదిద్దుకున్నాయి. ఇక లాక్‌డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ సంస్కృతి ఒకటి కొత్తగా వచ్చింది. దీని వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు పడింది మహిళలే. వర్కింగ్ ఉమెన్ అయితే ఇంటి పనులు చూసుకుని ఇంట్లో నుంచే ఆఫీసు పని కూడా చేయాలి. ఇంట్లో ఉన్నావ్ కదా…కాస్త కాఫీ పెట్టు, తినటానికి స్నాక్స్ ఇవ్వు లాంటి ఇంటిల్లపాది కోరికలు తీర్చలేక మహిళలు సతమతమయ్యారు. ఇంట్లోనే ఉన్నారు కదా…అని ఆఫీసు వాళ్లు కూడా అర్థరాత్రి, అప రాత్రి అని లేకుండా పనులు, టార్గెట్ పెట్టడం కూడా మనం చూసిన దృశ్యాలే. కరోనా భయం వల్ల పని వాళ్ళనూ రానివ్వకపోవటంతో ఇంటిపని, వంట పని మొదలు స్కూళ్ళు లేక ఇంట్లో ఉన్న పిల్లల ఆలనా పాలన అన్నీ ఆడవాళ్ళే భరించాల్సి వచ్చింది. ‘వర్క్
ఫ్రమ్ హోమ్’, ‘నడిచే యంత్రం’, ‘నాక్కొంచెం రెస్ట్ కావాలి’, ‘ఆదరువు లేని బతుకులు’ …కథలు ఈ కథాంశాలతో రూపుదిద్దుకున్నాయి.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కథలే కాకుండా ఈ పుస్తకంలో 24 కథనాలు కూడా ఉన్నాయి. వాస్తవ పరిస్థితిని గణాంకాలతో సహా ఈ కథనాల్లో వివరించారు. ఒక ముక్కలో చెప్పాలంటే ‘కరోనా కాలం కథలు’ పుస్తకం ఈ కాలంలో జరిగిన ప్రతి పరిణామాన్ని, రేగిన ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి అంశాన్ని 360 డిగ్రీల్లో ఒడిసి పట్టింది.
మంచి విశ్లేషణ
బాగుందమ్మ రెహానా మీ విశ్లేషణ