కథ రాసే సమయాలు

“లోకం చూసి నేర్చుకో… పుస్తకాలు చదివి కాదు. పుస్తకాలూ అపద్దాలు.”

“ఎందుకు తొందర పడతావు? చాలా సమయం వుంది కదా. ఇప్పుడేమైంది? ”

“అసలు రాయమని నీకు నేను చెప్పానా? లేదు కదా. నాకు ఇష్టం లేకపోయినా నువ్వు రాస్తావా?”

“ముందుగా ఏదో ఒకటి రాసేసి ఇబ్బంది పడొద్దు. నీకు స్వీయ నియంత్రణ లేదు!”

“పరిస్థితులు బాగా లేవు. రాసేవాళ్ళందరూ బంధించబడతారు… నా మాట వినండి…”

“అక్షరాలను, మాటల్ని నిషేదించి చాలా కాలం అవుతోంది. అందరికీ అర్థం అయ్యింది, మీకే ఇంకా అర్థం కావడం లేదు…”

“నేను భయపెట్టడం లేదు… భయాన్ని మర్చిపోవద్దంటున్నాను… భయాన్ని గుర్తు చేసే వాళ్ళే నీ శ్రేయోభిలాషులు.”

“మనుషులు కలవని, కలవకూడని సమయాల్లో నీకు ఇదేం పొయ్యే కాలం చెప్పు?”

“గుట్టుగా… వున్నామా లేదా అన్నట్లు బతకాలి కానీ… నీ ఉనికి అందరికీ తెలిసేలా బ్రతుకుతాను అంటే ఎలా? ”

“కలలు మరణాలు మనుషులు అదృశ్యం కావడాలు కలవరపెడతాయని అంటే ఎవరు ఒప్పుకుంటారు?”

“నీకు కనపడేంత స్వేచ్ఛాయుత ప్రపంచం కాదు ఇది. ఆలోచనల పైనా నిషేధాలు వున్నాయి… మనుషులు పరిమితంగానే బ్రతకాలి. ఏం జరిగినా ఇంట్లోపల ఉండిపోవడమంత మంచి పని ఇంకొకటి లేదు. నా మాట వినండి.”

“ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు. ఇక్కడ ఎవరూ ఏమీ మాట్లాడరు.”

“మీడియా గురించి నీకు ఎందుకు? చాలా పత్రికలూ, ఛానల్స్ జనాల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి అని నువ్వెలా అంటావు? జనాలకి అన్నీ తెలుసు. నెపం మీడియా పైన వేస్తారంతే! ఎవరి వాయిస్ వాళ్ళది.”

“నియంత్రణ, నిషేధం, నిర్భంధమే ప్రపంచం! నువ్వు అధికారానికి సహకరించక పోతే అదృశ్యం అవతావు…”

“అస్సలు నిన్ను పుస్తకాలు చదవొద్దని, ఇంటర్నెట్ చూడొద్దని, ఆందోళన వద్దని చెప్పాను. ఎవరినీ కలవొద్దనీ, కలవరపడొద్దని చెప్పినాను. ఏమీ మాట్లాడవద్దని భంగపడొద్దని చెప్పినాను. సర్దుకుపోవడం, రాజీ పడటం, గుట్టుగా బ్రతకడం మానవ లక్షణాలు. ఇంతగా భయ పెడుతున్నా, హెచ్చరిస్తున్నా… వినకుండా కథ రాస్తాను అంటే అసలు నువ్వు? మనిషివేనా?”

“అస్సలు సమస్య ఏమిటంటే … నీ జీవితాన్ని నువ్వు జీవిస్తే చాలు. అది వదిలి ఎవరి జీవితాలో కాలిపోతే నీకు ఎందుకు గుండెల్లో మంట? ”

“హృదయం, మేధ నిన్ను ఎప్పటికైనా చంపేస్తాయని చెపుతూనే వున్నాను. అయినా నువ్వు వినడం లేదు. ”

“చివరిగా ఒక మాట… మనసులో వున్న ఒక్క మాట చెపుతున్నా విను. నిన్ను నువ్వు కోల్పోలేదంటే నిన్ను మేం కోల్పోతాం.”

“గిరిజన కాలనీలో నీకేం పని? ఎవరు చదువుకుంటే నేకు ఏం? ఎవరి సంక ఎవరు నాకితే నీకేం? నిమ్మళంగా వుండలేవా? చదువు మధ్యలో మానేసినవాళ్ళ గురించి నీకెందుకు దిగులు? నీ ఉద్యోగానికి నువ్వు చేసే పనులకి అస్సలు సంబంధం వుందా? హాయిగా నువ్వేమో నీ ఇల్లేమో నీ బ్యాంకు ఆఫీసరు ఉద్యోగమేమో అనుకోకుండా, ఈ ఎండల్లో తిరగటాలు, చదువు మానేసిన పిల్లల్ని బడిలో చేర్పించడాలు ఏంది? నువ్వు టీచర్వీ కావు, యంయిఓ వీ కావు. కేవలం బ్యాంకు గుమాస్తాకి నీకిదంతా ఎందుకు?”

***

సాయంత్రం నాలుగు దాటింది సమయం. ఆదివారం స్కూటర్ వాడను. నా పాత సైకిల్ నాతోనే వుంది, మరవని గతానికి గుర్తుగా నేను మిగుల్చుకున్న వాటిల్లో సైకిల్ ఒకటి. ఎన్ని పనులున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆదివారం నా ప్రయాణం సైకిల్ పైనే.

యస్టీ కాలనీ లో గుండు బావి పక్కలో కుర్రాళ్ళు సిద్దంగావున్నారు. కొందరి చేతుల్లో ఏవో కాగితాలు, పుస్తకాలు, ఫైళ్లు, నోట్ బుక్స్. ఇద్దరు ముగ్గురు మాత్రం ఉత్త చేతులతో వున్నారు. ఏవేమో మాటలతో, అరుపులతో సందడిగా వుంది అక్కడి వాతావరణం.

నేను సైకిల్ దిగి, స్టాండు వేసి అక్కడ జంఖనా పైన కూర్చున్నాక, సద్దు మణిగింది. అందరూ ప్రసన్నంగా చూస్తూ నవ్వుతూ పలకరించారు. పలకరింపులయ్యాక నేరుగా ఆదివారం కార్యక్రమం మొదలయ్యింది.

“సార్ మనం ప్రతి ఆదివారం ఇక్కడ కలుస్తున్నాం. ఏం చేసామో, ఇంకా ఏమేం చెయ్యాలో మాట్లాడుకుంటున్నాం. సోమవారం గవర్మెంటు ఆఫీసుల్లోవాళ్ళని కలసి సమస్యలపైన అడుగుతున్నాం. మనం ఎంత చేస్తున్నా ఇంకా కాలనీలో సొసైటీలో మార్పు రావడం లేదు. ఈ స్పీడ్ చాలదు సార్…”

ఆ మాట అంటున్న కుర్రాడి పేరు యువరాజు. మాటల మధ్యలో రెండు సార్లు అతడి చూపులు నా సైకిల్ వైపు మరలడాన్ని గమనిస్తూనే ఉన్నాను. డిగ్రీ డ్రాప్ ఔట్. ఈ మధ్యే మెడికల్ సరిఫికేట్ ఇప్పించి, ప్రిన్సిపాల్ తో మాట్లాడి, మళ్ళీ కాలేజి లో చేర్పించాను. ఇంకో ఇద్దరు అతడి మాటలకూ నొచ్చుకుని అడ్డు రాబోతుంటే కళ్ళతోనే వాళ్ళను వారించాను.

“ఇంకా రాజూ… చెప్పు? మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటావు? ఏం చెయ్యాలంటావు?”

“అదంతా నాకు తెలియదు సార్. అభివృద్ది, మార్పు అనేది రావడానికి ఇంకా ఎన్నేళ్ళు వెయిట్ చెయ్యాలి సార్. ఇంకెంత కాలం పడుతుంది సార్? రిజర్వేషన్లున్నాయి. మీకేమప్పా దేవుడి బిడ్డలు అంటారు. ఏం సార్. మా జాతిలో చదువుకున్నోల్లందరికీ యాడన్నా ఉద్యోగాలు వచ్చి ఊర్లు యాలతా ఉండామా? వాళ్ళ కడుపు మంట తట్టుకోలేకుండా పోతాఉండాం సార్. కాలేజిలో మమ్మల్నిచూస్తేనే వాళ్లకి కాకుండా వుండాది.”

“ఏమైంది రాజూ ” అతడి బాధని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అనునయంగా అడిగాను. యువరాజు మాట్లాడలేదు. తల తిప్పి అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఇంకో కుర్రాడు చెప్పుకొచ్చాడు.

“కాలేజీలో మా వోల్లపైన టార్గెట్ ఎక్కువైంది సార్. మానసికంగా వేధిస్తుంటారు. ఎవరైనా లెక్చరర్లు మాకు మంచి చెపితే, మిగతా లెక్చరర్లు ఆ సారోల్లని కామెంట్లు చేస్తావుంటారు. రాజు మళ్ళీ కాలేజిలో చేరినంక వాళ్ళ నాయన కొత్త సెల్ కొనిచ్చినాడు సార్. దాన్ని చూసి కొందరు పిల్లోల్లు హర్టింగా అనేసారు సార్. ” అని ఆగి, రాజు మొహం వైపు చూసాడు. ఇక నువ్వు చెప్పు అన్నట్లు.

రాజు గొంతు లో వణుకు తెలుస్తా వుంది. లోపలనుండి దుఖం వద్దామా వద్దా అని పడుతున్న యాతన తెలుస్తోంది.

“సార్. మేం ఎప్పుడూ ఎవరి సొత్తుకు పోము సార్. ఉండేది తిని లేకపోతే ఒక పూట పస్తయినా వుంటాం, కానీ తప్పుడు పనులు చస్తే చెయ్యం సార్… మా నాయన అమ్మ ఇద్దరూ మా కోసమే రాత్రి పగలూ కష్టపడతారు సార్ . అట్లాంటిది… ఆ నాయాండ్లు…”

ఇక మాట్లాడలేకపోయాడు. ఆవేశం, కోపం, లజ్జ అన్ని కలగలసిపోయాయి ఆ గొంతులో. “…యాడకొట్టుకోస్తివిరా ఇంత మంచి ఫోను… అంటారు సార్ ఎదవ నా కొడుకులు… దొంగ అంటారు సార్. ఏం సార్… ఎరికిలోల్లంతా దొంగలని ఎవరు సర్ చెప్పింది. కులం పేరు చెప్పి… తక్కువ చూస్తావుండారు సార్… ఏదో ఒకటి చెయ్యల్ల సార్.”

కాలని లోని పెద్దోళ్ళు కొందరు అంతకు ముందే అక్కడికి చేరుకున్నారు. ప్రతి ఆదివారం నేను ఇక్కడికి రావడం, యస్.టీ ల అభివృద్ది కి ఏం చెయ్యల అని వాళ్ళకు చెప్పడం, నోట్ బుక్స్, ఇవ్వడం పాలిటెక్నిక్, యంసెట్, గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరిక్షలు, పోటీ పరిక్షలు రాసే వాళ్ళ కోసం పుస్తకాలు ఇస్తూ వుండటం, పంచాయతి కార్యదర్శిని ప్రత్యేకం గా పిలిపించి ఇంకా పెన్షన్ రాని వాళ్లకి పించన్ దరఖాస్తులు ఆన్ లైన్ చేపించడం, యేండ్ల తరబడి ప్రమాదకరంగా వున్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ చేతికి అందేంత తక్కువ ఎత్తులో వుందని కరెంట్ డిపార్ట్మెంటు వాళ్ళతో మాట్లాడి, చుట్టూ ఫెన్సింగ్ వేయించడం, వాళ్ళు కట్టుకున్న అమ్మ వారి గుడి ఆవరణలో రేకుల షెడ్ వేయించి, ప్రతి రెండో శనివారం నాకు తెలిసిన ఇంగ్లీష్ మాస్టర్లను ఒప్పించి ఉచితంగా ఇంగ్లీష్ పాఠాలు చెప్పించడం, పరిక్షల కోసం పుస్తకాలు వ్యకిత్వ వికాస పుస్తకాలు అందించటం వాళ్ళ గుడిలో ఒక బడిని, గ్రంధాలయాన్ని స్టార్ట్ చేయించడం, స్థానిక అధికారులతో మాట్లాడి నాలుగు నెలలకోమారు మెడికల్ క్యాంపు పెట్టించడం, మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి నెలకో సారి స్పెషల్ శానిటేషన్ నిర్వహించడం, గత తొమ్మిది నెలల కాలం లో ఇవీ అక్కడ జరుగుతున్నకార్యక్రమలు.

“సరి ఇప్పుడు ఏమి చేద్దాం?” నింపాదిగా అడిగాను. అతడు మొదట సందేహం గా నా వైపు చూసాడు, మల్లీ సర్దుకుని గొంతు సవరించుకున్నాడు.

“ముందు కాలనీ పేరు మార్చాలి. ఎరుకల కాలనీ అనే పేరే వద్దు. ఏకలవ్య కాలనీ అని పెట్టాలి. అందుకు మున్సిపాలిటీ లో తీర్మానం చేయించాలి.”

ఉన్నట్లుండి అక్కడ కలకలం రేగింది. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడటం మొదలయ్యే సరికి అక్కడున్న వాతావరణం మారిపోయింది. పెద్ద వాళ్ళు కొందరు పచ్చిగానే తిట్టి పోశారు.” మీకు ఇదేమి పోయే కాలం. కులం పేరు చెప్పుకోవడం తక్కువేమీ కాదు. ఏ కులమోల్లకు ఆ కులం గొప్ప.” అనేసారు.

కుర్రాల్లకేమో రాజు చెప్పింది నచ్చింది. వాళ్ళు పేరు మార్చాల్సిందే అనీ పట్టుబట్టేసారు. కొందరేమో ఎట్లాగు మారుస్తున్నప్పుడు మళ్ళీ ఏకలవ్య అనే పేరు ఎందుకు… ఇంకేదైనా జబర్దస్త్ పేరు పెట్టాలని కొందరు వాదించారు.

“మీరందరూ కలసి ఒక నిర్ణయం తీసుకోండి. కొంతమంది కానీ, ఏ ఒక్కడు కానీ చప్పున నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యం కాదు కదా” అని వాల్లకు సర్ది చెప్పి అందరూ కలసి ఒక నిర్ణయానికి రావలసిందిగా చెప్పి ఆ కాలేజి కి వచ్చే వారం వీలు చూసుకుని కులనిర్మూలన కమిటీ వాళ్ళతో కలసి వెళ్లి రావటానికి నిర్ణయం తీసుకున్నాము. ముందుగా కొన్ని కులాలపట్ల లెక్చరర్స్, విద్యార్థుల్లో రావాల్సిన మార్పుల గురించి, అక్కడున్న సమస్య గురించి మాట్లాడి రావాలని అనుకున్నాక, వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుండి బయలు దేరాను.

ఈ వారం పేపర్లో వచ్చిన ఉద్యోగ ప్రకటనల క్లిప్పింగ్స్ గుడిలో అంటించమని చెప్పినప్పుడు ఒక ముసలతడికి ఉన్నట్లుంది కోపం ముంచుకొచ్చేసింది.

“ఏం నాయన అది గుడి అనుకున్నవా ఇంకేమైనా అనుకున్నావా?. నువ్వు గుడిని పాడు చేస్తే మేం ఒప్పుకోము ”

నేను ఏమీ జవాబు ఇవ్వకుండా లేచి నిలబడ్డాను. ఆ ముసలతను నా ముందుకొచ్చి అడ్డంగా నిలబడ్డాడు. కుర్రాళ్ళు ముందుకు వస్తుంటే వారించాను.

“పెద్దాయనా… ఇప్పుడు దేశంలో మనుషులకి ముఖ్యంగా మనలాంటోల్లకి కావలసింది గుళ్ళు కావు. స్కూళ్ళు, ఆసుపత్రులు, ఉపాది కేంద్రాలు.”

***

“ఏమైంది నాన్నా?”

పాప అడుగుతున్నా విననట్లు మొహం తిప్పుకుని ఇంటి ముందుకు వచ్చేసాను. ఆ పాప చాల షార్ప్ గా ఉంటుంది. నేను ఏమి చెప్పక పోయినా నా ఆకలి ఆ పాపకి తెలిసిపోతుంది. నేను ఏమి చెప్పక పోయినా, నా బాధ, కన్నీళ్ళు , అవమానాలు, ఒత్తిడి, అన్నీ ఆ అమ్మాయికి తెలిసి పోతాయి.

వీధి సందడిగా వుంది, ఎవర్ని ఎవరూ పట్టించుకోకుండా, ఎవరిలోకం లో వాళ్ళు, హడావిడిగా, ఉరుకులు పరుగులతో…

“ఏం నాన్నా అలా వున్నావు? నాకు చెప్పవా …” నా వెనుకే వచ్చి నిలుచుంది పాప.

“ఏం నాన్నా ఆఫీసులో ఎవరైనా నిన్ను హర్టు చేసారా?” కనిపెట్టేసింది…

అన్నీ ఈ పాపకి యెట్లా తెలిసిపోతాయో?… అనుకుంటూ… “చూడమ్మా…అందరూ యెట్లా పరుగేట్టుతున్నారో చూడు. ఎవ్వరూ నడవడం లేదు. గమనించావా? నడవడం మరచిపోయి అందరూ పరుగెత్తే కాలం వచ్చేసింది.”

“నాన్నా ఇది పాతమాటే. ఇప్పుడు కొత్తగా చెప్పకు. మాట మార్చకు. ఏమైందో చెప్పు.”

తప్పదు.అసలు విషయం చెప్పేంత వరకూ ఈ పిల్ల వదలదు. ఇంట్లో అన్నీ మాట్లాడుకోవడం మామూలే. ఎక్కడా దాపరికాలు, మొహమాటాలు వుండవు.

శ్రీమతి వర్ష గొంతు ఇంట్లోపల నుండి వీధిలోకి వినపడింది. “ఏమండీ టీ కావాలండి. అర్జెంట్ స్పెషల్ చాయ్… ప్లీజ్”.

“వస్తున్నా…” అంటూ పాప చేయి పట్టుకొని ఇద్దరం కిచెన్ లోకి నడిచాం. సింక్ వద్ద చేతులు కడుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించాను.

“నేను పెట్టనా చాయ్… ” అడిగింది పాప నా వైపు తదేకంగా చూస్తూ.
“వద్దమ్మా… అమ్మ చెప్పింది నాకు కదా. నేనే పెడతాను. నో ప్రాబ్లం…”

అల్లం యాలకులు బిర్యానీ ఆకు లవంగాలు పట్టా వేసి వేడి నీళ్ళల్లో బాగా ఉడికించి కొంచెం బెల్లం వేసి స్టీలు క్లాసులో తీసుకెళ్లి వర్షకు అందించాను.

ఆ తర్వాత నేను పాప పాలు వేసి టీ పెట్టుకుని కప్పుల్లో నింపుకొని ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నాం.

పూల మొక్కలు గాలికి మెల్లగా అటూ ఇటూ కదులుతున్నాయి. కాంపౌండ్ వాల్ ఇంటికి మధ్య పచ్చగడ్డి అల్లుకుని ఉంది. రకరకాల పూల మొక్కలు కూరగాయలు ఆకుకూరలు… ఇల్లు ఒక పొలం లా ఉంది.

వర్ష పెయింటింగ్ వర్క్ లో బిజీగా ఉంది. నెలకు ఒక పెయింటింగ్ అయినా వెయ్యాలని తన పుట్టిన రోజు సందర్భంగా నిర్ణయం తీసుకుంది. నన్ను, పాపను కూర్చోబెట్టుకుని తన మనసులో మాట తన పుట్టిన రోజప్పుడు చెప్పింది.

“ఇట్లాగే చూస్తూ ఉంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆఫీసు పనులు ఇంట్లో పనులతో నేను అనుకున్న పనులు నేను చెయ్యలేకపోతున్నాను. నా జీవితాన్ని నేను బ్రతకాలి. రాజీ పడలేను. మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటాను. ఇంటిపని లో ఖచ్చితంగా మీరిద్దరూ సహాయం చేయాల్సిందే. ఇదే మీరిద్దరూ నాకు ఇచ్చే నిజమైన నా పుట్టినరోజు కానుక.”

పది నెలలుగా ఆమె చెప్పిన విధంగానే నేను పాప ఇద్దరం ఇంటి పనుల్లో చురుగ్గా ఉన్నాం. ఆమె ఎప్పుడు అడిగినా మా వంతు సహాయం చేస్తూనే ఉన్నాం. ఈమధ్య అందుకే తను బాగా చదువుకోగలుగుతుంతోంది. కథలు కవిత్వం రాయగలుగుతోంది. ఇష్టంగా పెయింటింగ్స్ వేసుకుంటోంది.

***

“నాన్నా… మొత్తం ఇరవై మంది ఆడపిల్లలకి ముప్పై మంది మగ పిల్లలకు డ్రెస్సులు రెడీగా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేశాను. ఈ ఆదివారం వెళ్దామంటే నీకు కుదరలేదు. ఈ రెండో శనివారం సాయంత్రం వెళదామా? కొత్తపేట దగ్గరే కదా వెళ్లి వచ్చేద్దాం. నీకు కుదురుతుందా నాన్నా…” మెల్లగా అనునయంగా ఏదో నన్ను బుజ్జగిస్తున్నట్లుగా అడుగుతోంది సుప్రజ.

ఆ అమ్మాయిలో నాకు బాగా నచ్చేది అదే. చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంది చాలా పెద్దరికం తో మాట్లాడుతుంది. నాన్న తో మాట్లాడినట్టు ఉండదు. ఒక్కోసారి మా అమ్మ నాతో మాట్లాడినట్లు గానే ఉంటుంది. నేను వర్ష ఎంత హడావిడి లో ఉన్నా ముభావంగా ఉన్నా ఏమి గమనించనట్లు ఉంటుంది కానీ అన్నీ గమనిస్తుంది. ఏ హడావిడి చెయ్యదు, దేనికి తొందర పెట్టదు, టీ కాఫీలు తీసుకు వస్తుంది. అవసరమైతే ఏదైనా టిఫిన్ కూడా చేసి పెట్టేస్తుంది. జీవితం పట్ల మనుషుల పట్ల ఇంత శ్రద్ధ, ఇష్టం, ఓపిక ఉన్న పిల్లలు ఈ కాలం చాలా అరుదు.

“ఓకే అమ్మా. ఆదివారం ఉదయం సైకిల్ లో వెళ్లి వద్దాం దగ్గరే కదా. ఓకేనా. నీ పని పూర్తయిన తర్వాత నేను ఏకలవ్య కాలనీ కి వెళ్లి వస్తాను” సమ్మతంగా తలాడించింది.

“అదేమిటి నాన్నా ఎస్టీ కాలనీ కదా. ఎరుకల కాలనీ కదా. పేరు మార్చుకున్నారా వాళ్ళు?” అంత షార్పుగా అమ్మాయి విషయాన్ని గ్రహిస్తుందని నేను ఊహించలేదు. అవునన్నట్లు తల ఊపాను.

“సరే నాన్నా… ఇప్పుడు నా హోం వర్క్ అయ్యాక, అమ్మ పెయింటింగ్ వర్క్ పూర్తి అయితే చూద్దాం. లేదంటే నేను ఏదో ఒక టిఫన్ చేస్తాను. నీకు అన్నం కావాలా ఏదైనా టిఫిన్ ఓకేనా రాత్రికి?”

ఈసారి సమ్మతంగా నేనే తలాడించాను.

“నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను ఏం చేయాలో నీ హోంవర్క్ అయ్యాక, నాకు పని చెప్పండి మాస్టారు” అన్నాను నవ్వుతూ.
ప్రసన్నంగా నవ్వేసి తన గదిలోకి వెళ్లి పుస్తకాలు ముందేసుకుంది సుప్రజ.

ఎనిమిదో తరగతి చదివే సుప్రజకు ఇంట్లో పని చేయడం అంటే చాలా ఇష్టం. శ్రద్ధతో ఓపికతో అమ్మ కైనా నాన్న కైనా అన్ని పనులు తనకు చేతనైనంత సహాయపడుతుంది.

వర్ష కి వుండే చాలా అభిరుచులు పాపకు వచ్చాయి. తనకి ప్రత్యేకంగా లైబ్రరీ ఉంది. తను కవిత్వం రాస్తుంది . బ్లాగు మెయింటైన్ చేస్తోంది. కొత్త వంటలు నేర్చుకుంటుంది. కొత్త ప్రదేశాలు చూడటం అంటే చాలా ఇష్టం. నగరంలో మురికివాడల అభివృద్ధి పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. నెలలో ఒక రోజు మురికివాడల్లోని పిల్లల కోసం తను తన స్నేహితులు కలిసి సేకరించిన పుస్తకాలు పెన్నులు చిన్న చిన్న బహుమతులు నన్ను కానీ, వాళ్ళ అమ్మను గాని తోడుగా తీసుకొని వెళ్లి పంచి వస్తుంటుంది.

మురికివాడల్లో పిల్లలకు ఎవరికి ఎప్పుడు ఏం కావాలో వాళ్ళ అవసరాలు ఏమిటో కనుక్కుంటుంది. పుస్తకం పెట్టి లిస్టు రాసుకుంటుంది ఫేస్బుక్లో సెపరేట్ గా కరుణ గ్రూప్ ఉంది. తన పుట్టిన రోజుకి, పండుగలకి ఖరీదైన బట్టలు గత మూడు సంవత్సరాల్లో కొనింది లేదు. డబ్బు దుబారా చెయ్యదు. అనవసర ఆడంబరాలు ఉండవు.

ఇంటి లోపలికి వెళ్లి చూశాను. వర్ష పెయింటింగ్ లో మునిగిపోయి ఉంది. డిస్టర్బ్ చేయకుండా మేడ మీదకి నడిచాను.

***

చేతుల్లో ఏవేవో గీతలు, కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. ఎప్పుడూ నా చేతుల్ని చూసుకుంటూ వుంటాను. అదో పెద్ద అలవాటు నాకు. నా చేతుల్లో అమ్మా కనపడుతుంది. నాన్న కనపడతాడు. నా జీవితం, గతం కనపడుతుంది.

“అడవిలోకి పోవడానికి ఎవడిచ్చాడురా పర్మిషన్? ఎన్నిసార్లు చెప్పినా మీ దోవ మీది గానే వుంది గానీ, గవర్మెంటోడి మాటంటే లెక్కా జమా లేకుండా వుండాది. ఒకతూరి ఊచలు లెక్కపెట్టిస్తే మల్లింకా ఈ పక్క రాకుండా వుంటారు. అసలే ఆ ముండ ఏనుగులతో రాత్రి పగలూ తిండీ నిద్రా లేకుండా చస్తా ఉండాం. మధ్యలో ఎరికిలోల్లతో మాకు చావు వస్తుంది.”

వాళ్ళిద్దరూ నేలపైన మొకాల్లపైన గడ్డం పెట్టుకుని భయం భయం గా కుర్చుని వున్నారు. వాళ్ళల్లో ఒకాయన మా నాయన. ఇంకొకాయన వాల్ల అన్న. వాళ్ళ ఒంటి నిండా రక్త గాయాలు. అడవిలోకి వెళ్ళినందుకు అధికారుల జరిమానా అది ఆ దెబ్బలతో మూడు రోజుల తరువాత ఉచ్చ పోసుకొని చనిపోయారు వాళ్ళు.

ఆ దృశ్యాలు, ఆ మనుషులు అన్నం తినే వేళల్లో కలవరానికి వస్తారు. నాలుగు ముద్దలు తినేసరికి కళ్ళలోంచి ఎందుకో చెప్పకుండానే కన్నీళ్ళు రాలిపోతాయి. అరచేతులు చూసుకుంటాను. బండబారి, మొరటుగా కనిపిస్తాయి. ఇవి వెదురు దబ్బలు చీల్చిన చేతులు, వెదురు బుట్టలు, తట్టలు చేసిన చేతులు, గాడిదల్ని చాకిన చేతులు, పందుల్ని మేపిన చేతులు, ముగ్గుపిండి యెర్ర మన్ను ఇల్లిల్లు తిరిగి తిరిగి అమ్మిన చేతులు, కొండల్లో గుట్టల్లో నెల ఇస్తే బండరాళ్ళు కొట్టి, కొండని తొలచి, ముండ్లచెట్లను పెకిలించి, చమట రక్తం తో పంటలు పండించిన తాతల చేతులు ఇవి, ఇంకా కరువు కాలం లో గెనుసు గడ్డలకోసం, నేలను తవ్విన చేతులు, గంజి మాత్రమే దొరికిన రోజుల్లో, అమ్మ, నాయన తాగకుండా వాళ్ళ వాటా కూడా ఇచ్చేస్తే, ఆకలి తట్టుకోలేక ఆవురావురమని వాళ్ళ గంజి నింపుకున్న చేతులు, కుల వృత్తులు చేయడం పిల్లలకు నామోషి అని, సొంత జీవనోపాదుల్ని, మూలాల్ని వదిలి ఇంటి పని, పాచి పని, తోట పని చేసిన అమ్మ చేతులు ఇవి. హోటల్లో పనికి చేరి, కడుపాత్రం నామోషి అనుకోకుండా మా కోసం ఆకులు ఎత్తేసిన మా అమ్మ చేతులివి. గుండె నిండా దుఖంతో, కళ్ళనిండా దిగులతోనే అన్నం పెట్టిన అమ్మచేతులు ఇవి.

కలవరింతలతో సతమతమవుతుంటే… సెల్ రింగ్ అయింది. రమణ! చాలా కాలానికి ఫోన్ చేసాడు. దిగుల్లోంచి ఒక్క క్షణం ఆ పేరు తలచుకోగానే నెమ్మది అనిపించింది.

రమణ చిన్ననాటి మిత్రుడు, అలా అనుకోవడం లోనే ఏదో నమ్మకం, చిన్నతనం లో ఉన్నంత స్నేహం, నమ్మకం ప్రేమ, దగ్గరితనం ఇంకెక్కడా, ఎవరివద్దా దొరకడంలేదు. అదీ ఇదీ మాట్లాడినంక రమణతో అసలు సమస్య చెప్పినాక అతడు మెల్లగా నవ్వినాడు.

“ఇప్పుడే మనుషులకు వాళ్ళేమిటో చెప్పే రచనలు కావాలి. ఇంకేమి తెలుసుకోక పోయినా పర్వాలేదు. లోపల మనకింత కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు, ప్రలోభాలు, ఉత్తుత్తి మర్యాదలు, మమకారాలు వున్నాయని, అందరూ అందరితో కలవలేమని, కొన్నే ఇష్టపడతామని, కొందరితోనే దగ్గరగా ఉంటామని తెలుసుకోవాలి. నువ్వు కథ రాయి. రాయకుండా వుండకు. చదవడం, రాయడం అంటే జీవించడం. చదవకుండా, రాయకుండా వుండటం అంటే మృత్యువు… మరణం…” అని అన్నాడు.

“ఇష్టంగా ఒక పుస్తకం చదవకపోతే అన్నం ఎలా సహిస్తుంది? నిద్ర ఎలా పడుతుంది? ఏమీ చదవని రోజు నాకు ఏమీ తినాలని అనిపించదు.” అన్నాను మెల్లగా .

“చదువుకోవడం, రాసుకోవడం, ఆచరణ దిశగా సాహిత్యం అదే కదా జీవితం”

“బ్రతకడానికి ఇప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనుషుల్ని లోబరచుకోవడానికైనా, లేకుండా చేయటానికైనా మందుగుండు, మారణాయుధాలు అవసరం లేదు. నిమ్మళంగా గుట్టుగా బ్రతకడానికైనా, ఇంకొకర్ని లేకుండా చేయటానికైనా మారణాయుధాల్ని మించిన ఆయుధం ఒకటుంది. ఒక్క మాట చాలు. చంపేది, బ్రతికించేదీ మాటలే… మనుషులు మాటలతో నిర్వీర్యం చేస్తున్నారు, చంపేస్తున్నారు మాటలతో… స్పోకెన్ ఇంగ్లీష్ కాదు కావలసింది మనుషులతో మాట్లాడే బాష నేర్చుకోవాలి. బ్రతికించే మాటలే కావాలి…” అని నా వాదన వినిపించే ప్రయత్నం చేశాను కానీ, రమణ వినిపించుకోలేదు.

“ఎందుకైనా ఎలాగైనా మనుషులు కలవడం ముఖ్యం. నువ్వు కలవాల్సిన వాళ్ళని కలవడానికి కారణాలు అవసరం లేదు. నువ్వు మళ్ళీ యస్టీ కాలనీకి వెళ్ళాల్సిందే. నీ పని నువ్వు చెయ్యాల్సిందే. ఉండుండు… మళ్ళీ చేస్తాను మా బాస్ లైన్ లోకి వచ్చాడు.” ఫోన్ కట్ అయ్యింది.

ఇది నేను అస్సలు వూహించ లేదు. అసంతృప్తిగా అనిపించింది. అసహజంగా అని కూడా అనిపించింది.

ఈ లోగా మేడ పైకి వచ్చింది పాప. “నాన్నా… ఉప్మా రెడీ” అంది.

ఎందుకో తెలియదు తనలోని ఆ జీవనోత్సహాన్ని చూసాక, దిగులు పోయి, హాయిగా అనిపించింది.

స్నేహం గా తన వైపు చూసి నిర్మలంగా నవ్వాను.

పుట్టిన ఊరినే ఇంటి పేరుగా మార్చుకుని 1991 నుంచి కథ‌, కవిత్వం, నవల, విమర్శ రంగాల్లో రచనలు చేస్తున్నారు. మూడు కథా సంపుటాలు- 'గది లోపలి గోడ', 'చిగురించే మనుషులు', 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు', రెండు కవితా సంపుటాలు- 'మాటల్లేని వేళ', 'ఇద్దరి మధ్య', ఒక నవల- 'నేల నవ్వింది' వెలువరించారు. ఆంగ్ల భాషలోనూ కవిత్వం అచ్చయ్యింది. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య వ్యవస్థాపక కన్వీనర్.

23 thoughts on “కథ రాసే సమయాలు

  1. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి says:

    ఏకలవ్య కాలనీలోంచీ కంట్లోకి ఒంట్లోకీ ఇంట్లోకి తేనీట్లోకి..,
    అలాగే గూట్లోకి గుండెల్లోకి మనుషులలోకి మనసులలోకి రచనల్లోకి బంధాల్లోకీ బంధనాల్లోకీ..,
    సందుల్లోకీ సమూహాల్లోకీ సమాజాల లోతుల్లోకీ..,
    ఆపు లేకుండా అలుపు లేకుండా ప్రయాణం చేస్తూ ఉండటమే రచన అని ఎంతో ఆర్ద్రంగా చెప్పారు. చాలా బాగుంది

  2. మంచి కథ.మన ఆశయాల్ని ,ఆచరణల్ని నీర్వీర్యం చేసే లక్షణాలు వ్యపస్తాగతంగా రూపొందాయి. దానికితోడు ఒక భయవాతావరణాన్ని చుట్టూ చూడొచ్చు. ఇక మానవీయతకు,సహకార భావానికీస్థానం ఎక్కడ?ఈ స్థితిని కథ చక్కగా చెప్పింది. అమానవీయతాధుష్పలితాలు కింది వర్గాలనే అధికంగా బాధిస్థాయనడం పేద పదే నిరూపితమయ్యే సంగతే.

  3. కథ కథనం మాటలు బావున్నాయి.కథ కొత్తగా చెప్పటం నచ్చింది.కవులు రాసే కధలు బావుంటాయి.గతంలో కొలిమిలో వచ్చిన బాలాజీ గారి కధ ఇంకా కళ్లెదుటే వుంది.మంచి కథ ..

  4. ఈ కథలో అభివ్యక్తి ,వేదన ,సమాజ నైజం,
    ఆశయం వ్యక్తిగత అవగాహన ఆచరణ లకు
    ఛాయా చిత్రంగా సాగిన కథనం!!!
    బాలాజీ మనకు మరొక కథను బహూకరించాడు!
    కథా సమయం పూర్తయింది!ఇక కలవడం టీ సమయంలోనే!!! షట్ డౌన్ ముగిసాకా!!!

    డి.కుమారస్వామి రెడ్డి పలమనేరు

  5. పలమనేరు బాలాజీ గారి కథ వినూత్నంగా ఉంది .ఒక కొత్త శిల్పంతో కథ చదవడం గమ్మత్తయిన అనుభవం.కవి కథకుడిగా విమర్శకుడిగా పలమనేరు బాలాజీ గారి ప్రస్థానం అభినందనీయం .ఎరుకల జీవితంపైనా ఇదివరకే అయన చాలా కథలు రాశారు. మరొక గిరిజన కథను అందించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు.వారికి తెలిసి ఇంకా వెలుగులోకి రావలసిన చాలా గిరిజన, ఎరుకల కథల్ని వారి కలం నుండి ఆశిస్తున్నాను.అరుణతార విరసం పత్రికలో వారు రాస్తున్న కథావరణం శీర్షిక ,కవి సంగమంలో వారు రాస్తున్న కవితావరణ౦ శీర్షిక ,ఇప్పుడు కొలిమిలోని ఈ కథ ,గతంలో కొలిమిలో వారు రాసిన కథ వారి యొక్క నిశిత దృష్టికి సాహిత్య కృషికి ఉదాహరణలు వారికి ప్రత్యేకంగా అభినందనలు .

  6. ఎప్పుడైనా ,ఎక్కడైనా సంఘర్షణ నుంచి సంస్కరణ మొదలవుతుంది .అది సంస్కృతి గా పరిణమిస్తుంది. అయితే సంఘర్షణ సామాజిక మైనప్పుడు దాని ఫలితాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి .అదే సంఘర్షణ వ్యక్తిగతం అయినప్పుడు ఫలితాలు చుట్టూఉన్న పరిస్థితులను బట్టి మెల్లగా వస్తాయి .దేనికైనా స్పందన అవసరం .ఈ సంఘర్షణ ఎప్పుడు మొదలవుతుంది? ఎందుకు మొదలవుతుంది? ఎవరి దగ్గర నుంచి మొదలవుతుంది? మనిషి ఔన్నత్యాన్ని ,గౌరవాన్ని, కనీసం మానవత్వాన్ని కోరుకుంటాడు. అది జరగనప్పుడు కూడా కొన్ని తరాలు భరిస్తాడు. అప్పటికీ మారకపోతే మెల్ల మెల్లగా సంఘర్షణ మొదలవుతుంది. ఈ సంఘర్షణ సంస్కరణ కు దారితీస్తుంది . ఎప్పుడో నాలుగు తరాల తరువాత మొదలయ్యే సంఘర్షణను ఇప్పుడే అనుభూతి చెందేవాడు రచయిత. ఆ సంఘర్షణ లో నుంచి రచనలు వెలువడతాయి. కొన్ని సూచనలు, కొన్ని ఆకాంక్షలు కొంత దార్శనికత్వం , కొంత మార్మికత, రచనల్లో కనిపిస్తూ ఉంటుంది .ఆ కనిపించేది కూడా రచయిత సామాజిక నిబద్ధత, దార్శనికత, పరిపక్వ మానసిక సున్నితత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడే కథ రాయాలని, కవిత్వం చెప్పాలని రచయిత మనసులో సంకల్పం కలుగుతుంది. కాలక్షేపం కోసం సామాజిక ,వ్యక్తిగత, సామూహిక భావోద్వేగాలను పరామర్శించే కథలు వెలువడేది కథాసమయం కాదు . వాటిని అధిగమించి భవిష్యత్తును సుందరతరం చేసే ఆలోచనలు వికసించడమే కథాసమయం .అప్పుడే కథలు రాయాలి. అదే రచయితకు ఉండాల్సిన నిబద్ధత. సరిగ్గా ఈ చట్రంలో ఇమిడిపోయే రచయిత పలమనేరు బాలాజీ. ఇప్పుడు వారు రాసిన కథ కూడా అలాంటిదే. ఎన్నో సామాజిక ,సాంఘిక వైరుధ్యాలు మనిషిని అల్లకల్లోలం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒంటరితనాన్ని అనుభవించే మనిషికి దారి దీపం ఈ కథ .తన కుటుంబాన్ని ,తన భార్యను, తన పిల్లలను కూడా ప్రేమించలేని అనాగరిక రచయితలు విశ్వ ప్రేమను గూర్చి వల్లెవేసే దుర్మార్గపు సందర్భాలు లేకపోలేదు. అటువంటి వారు గుర్తించాల్సింది ప్రాథమికంగా కుటుంబం సమాజంలో మొదటి విభాగం అని. కుటుంబాలు ప్రేమ రాహిత్యంతో కల్లోలం అయితే సమాజం కూడా ప్రేమ రహితస్థితిని పొందుతుంది.తన చుట్టూ ఉన్న సమాజాన్ని తన వలె గుర్తించలేనప్పుడు ,గౌరవించ లేనప్పుడు కులాలు ,వర్గాల హెచ్చుతగ్గులు పుట్టుకొస్తాయి. ఇదివరకే ఉన్నవి మాసి పోకుండా అనేక రాజకీయ కారణాలతో రాజు కుంటూనే ఉంటాయి. కుల నిర్మూలన ఒక దార్శనికత .దానికంటే ముందు సామాజిక వక్రస్థితి పోవడం, ఆర్థిక ఫలాలను అందుకోవడం అభివృద్ధి మార్గాలను అన్వేషించడం , అక్షరాస్యత చాలా ముఖ్యం. ప్రాథమిక మైన విద్య ,ఆరోగ్యం, నివాసం, కట్టుబట్టలు కూడా అందని దుర్మార్గపు స్థితి సమాజానికి శాపం వంటిది. దాన్ని పునరవలోకనం చేసి సంస్కరించే ఆలోచనే ఈ కథ. రాబోయే తరాల్లో ఈ ఆలోచనలన్నింటినీ బీజావాపనం చేసి మహావృక్షాలు గా ఎదగ నిచ్చే ఆలోచనలకు సరి అయినదే కథ రాసే సమయం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసిన పలమనేరు బాలాజీ గారికి శుభాకాంక్షలు.
    …..ఆముదాల మురళి, తిరుపతి.

  7. కవి/రచయిత గుండెల్లో ఏముందో తన కలం రాతల్లో తెలుస్తుంది. కుటుంబం పట్లా, సమాజం పట్లా బాలాజీ గారికి ఉన్న ఆత్మీయతా, వాటి ఉన్నతికి తన వంతు చేయాల్సింది చేసి తీరాలన్న తపనా, ఆ నిబద్ధతా, జీవిత వైరుధ్యాల మధ్య ఇమిడున్న సారూప్యతల్ని సంబధాల్ని పసిగట్ట గల శక్తి, వాటిని సామాజిక చైతన్యాన్ని తీసుకురాగల సాహితీవస్తువులుగా మలచగలిగే ప్రతిభా ఈ కథ కొట్టొచ్చినట్టు చూపిస్తున్నది. జీవిత శకలాల్లో ఒక శకలం నుండి ఇంకొక శకలానికి కృతకంగా కాకుండా సహజంగా సంబధం తెగకుండా గెంతిన టెక్నిక్ చాలా బాగుంది. కవితశ్రీ(డా,, డి. శ్రీనివాసులు)

  8. ఏ క లవ్య పేరు పెట్టడం, కుటుంబం
    ఆదర్శంగా ఉండడం , అణగారిన వర్గాల మేలు కోసం కృషి చేయడం; ఇలా ‘కథ రాసే సమయాలు ‘ ఒక ఆదర్శాల తో హాయిగా సాగింది.

  9. తెరవెనుక మనిషి జీవితానికి అద్దం పట్టింది రచయిత తండ్రి జీవితం తేవద్దన్నాడు రాజు.
    బండి కి ఉండే రెండు చక్రాలు సమానంగా, సహకారంతో తిరిగినప్పడే గమ్యం చేరగలుగుతామని తెలుపుతుంది వర్ష.
    ఇంట్లో పని చెయ్యడం నామోషీ అని మడతనలగని డ్రెస్ లతో రెస్టారెంట్ లచుట్టూ తిరిగే నవతరానికి సుప్రజ వెలుగు చూపింది.
    మాటల యుద్ధాలతో మారణహోమం కాదు సృష్టించవలసింది మనిషి ని మనిషిగా బ్రతకనివ్వడానికి కావలసిన పరిస్థితి ని కల్పించే దే ప్రజాస్వామ్యం. రచయిత ల , కవుల కలాలకు స్వతంత్రాన్నిచ్చి సద్వమర్శలకు తావిచ్చి మనుషులను స్వేచ్ఛ గా ఉండనిచ్చే నాయకుడే అసలయిన నాయకుడు.
    ఈ అన్ని ఘటనలూ రచయితను కథలు వ్రాయడానికి ప్రేరేపించే వేనని అద్భుతంగా చూపుతారు మన సోదరుడు పలమనేరు బాలాజీ గారు. వారి కలంనుంచి మరిన్ని చక్కటి ఆలోచింపజేసే కథలు వస్తాయని ఆసిస్తాను.

  10. కథను కవితలా చెప్పారు.
    మీ పని అయిపోయింది.
    చదివిన మేము నిలువెల్లా తడిచిపోయాం.
    కథ వెంటాడుతోంది
    లోపలికీ లాగేస్తోంది.. నమస్సులతో …

  11. ఒక్క మాట చాలు
    చంపేదీ ,బతికించేదీ మాటే…

    సైన్స్ అభివృద్ధి చెందినంతగా మనిషి, లోపలి మనసు అభివృద్ధి చెందలేదు.చేతీకి సెల్ఫోన్ వచ్చింది కానీ తోటి మనుషుల చేతలలో , దృష్టిలో మార్పు రాలేదు ంం

    పనిచేసే చేతులే ,వాటి చేతలే మనుగడకు మూలాధారం..
    ఆ చేతుల చేతలను వర్గీకరించి సమాజానికి దూరం చేసారు.

    ఆ ఆవేదన ఆక్రందన మనసులో గుచ్చుకున్న ఫీలింగు..
    అడవి పుత్రులను అడవికి దూరం చేసారు… సమాజానికి దగ్గరవుదామంటే.. భరించలేని నాగరికులు..

    పెళ్ళాం అడిగితే టీ తయారు చేసే పురుషపుంగవులు మనలో ఎంతమంది ఉన్నారు, కథలో అయినా, కలలో అయినా.
    ఒప్పుకుంటుందా మన పురుషాధిక్య సమాజం…

    రచనలోని కథకుడు ఆశావహుడు… తనతోటి బాధిత వర్గానికోసం తను చేయూత ఇవ్వడమేకాక తన తరువాతి తరానికి అందించేందుకు తన కూతురి ద్వారా చర్యలకు శ్రీకారం చుట్టారు….
    కథరాసే సమయాలు కాదు….ఇది మనిషి మనిషని గుర్తు చేసుకోవలసిన సమయం, మనసొకటుందని గమనించ వలసిన సమయం…. మనుషులు మనిషిగా మసలవలసిన సమయం అని తెలిపిన బాలిజీకి ధన్యవాదాలు…

    ఏమీ చదవని రోజు, ఏమీ తినాలనిపించదు…అని చెబుతున్నా.. బాలాజీ కి నిజాని ఏమీ “రాయని”రోజు ఏమీ తినడనుకుంటా…

    విలక్షణ కథనం తో సమాజ రుగ్మతను తనదైన శైలిలో ఆవిష్కరించారు మా పలమనేరు బాలాజీ….ఈ రోజు తప్పక తినేసి వుంటాడనుకుంటా…

    యుగంధర్ బాబు

  12. వర్తమాన , భూత , భవిష్యత్ కాలాలలోకి మనిషి మనసు చేసే ప్రయాణ సందర్భాలలో ఆ మనిషి మనసు పడే సంఘర్షణలు, బాధలు , సంతోషాలే మనిషి వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని నడిపించే సాధనమని కథకుడు (మీరు)మలిచిన కథ బాగుంది బాలాజి.

    ఈ కథ “హృదయం,సందేశం “ఈ క్రింది సంభాషణ లోని మాటలు:

    “నువ్వు కథ రాయి. రాయకుండా వుండకు. చదవడం, రాయడం అంటే జీవించడం. చదవకుండా, రాయకుండా వుండటం అంటే మృత్యువు… మరణం…” అని అన్నాడు.

    “మారణాయుధాల్ని మించిన ఆయుధం ఒకటుంది. ఒక్క మాట చాలు. చంపేది, బ్రతికించేదీ మాటలే… మనుషులు మాటలతో నిర్వీర్యం చేస్తున్నారు, చంపేస్తున్నారు మాటలతో… స్పోకెన్ ఇంగ్లీష్ కాదు కావలసింది మనుషులతో మాట్లాడే బాష నేర్చుకోవాలి. బ్రతికించే మాటలే కావాలి…” అని నా వాదన వినిపించే ప్రయత్నం చేశాను కానీ, రమణ వినిపించుకోలేదు.

    “ఎందుకైనా ఎలాగైనా మనుషులు కలవడం ముఖ్యం. నువ్వు కలవాల్సిన వాళ్ళని కలవడానికి కారణాలు అవసరం లేదు. “

    “కొలిమి”లో మీ కథ లింకు పంపినందుకు ధన్యవాదాలు . ఎవరి కథ ఏ మాగజైన్లో ప్రచురించారో పరస్పరం తెలయకుండావుంది .

  13. మంచి మనసు, ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి చెయ్యి తిరిగిన రచయిత కూడా అయితే అతని కలం నుండి వచ్చిన కథ అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని నిరూపిస్తుంది ఈ కథ. చదివించే కథ, చదివాక ఆలోచింపజేసే కథ. మిత్రుడు పలమనేరు బాలాజి కి అభినందనలు…

  14. ఇఇన్నేళ్ల తరువాత కూడా సమాజంలో కొన్ని వర్గాలు అభివృద్ధికి Dదూరంగా JKజీవించడానికి దోహదపడే పరిస్థితులు Cచెప్పడంలో కథకుడి ప్రతిభ Dద్యోతకమౌతోంది YOTHAKAMAUTHONDIఇఇన్నేళ్ల తరువాత కూడా సమాజంలో కొన్ని వర్గాలు అభివృద్ధికి Dదూరంగా JKజీవించడానికి దోహదపడే పరిస్థితులు Cచెప్పడంలో కథకుడి ప్రతిభ ద్యోతకమౌతోంది ALAAGE MAARPU ABHIVRUDDHI KANKSHINCHE YUVATHARAM SAAMPRADAYABADDAMAINA ALOCHAMALA PARIDHI MAARCHULOLENI PAATHACTHARAALA MADHYA SANGARSHANA CHAKKAGAA CHITRINCHAARU GIRJANULA VYADALU SAAHITHYAMLONPRATHIPIMBINCHAALANNA SREYOBHILAASHULA KANKSHAVYENNADAGINADE. KATHAKUDI KUMARTHE ATHANI ALOCHANAASARALIKI SAHAKRINCHADAM KAARYACHARANAKU SANNADUNIDI CHEYADAM MUDAVAHAM MANCHIBKATHA CHADIVANANNAVTRUPTHI RACHAYITHAKU ABHINANDANALU.

  15. కథలో ఒక కొత్తదన౦!
    రచయిత మనసులోని ఒక సంఘర్షణ, జీవితం పట్ల ఒక అవగాహన,
    గతం మరవని వైనం, కొందరి బతుకుల్లో వెలుగు నింపాలన్న తపన. ఆచరణ పై శ్రద్ధ,
    అది సామాజిక బాధ్యత అన్న భావనల మధ్య అందమైన, ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణం!
    కథలో అన్నీ శాశ్వత విలువలు తెలిపే జీవిత సత్యాలే.
    కథా ప్రక్రియలో ఒక ప్రయోగం అవసరమనిపించే సమయంలో “కథలు రాసే సమయాలు “అంటూ మనముందుకు ఈ కథను తెచ్చిన కవి, విమర్శకుడు,అనువాదకుడు, కథకుడూ అయిన పలమనేరు బాలాజీకి అభినందనలు.

    డా. లక్ష్మి రాఘవ

  16. ఎలాంటి సున్నితమైన పరిస్థితులనైనా అక్షరాలుగా మార్చేయడం పలమనేరు బాలాజీ గారి ప్రత్యేకత. దాచేసుకున్న మనసును స్టెతస్కోప్ పెట్టి వినిపిస్తారు. సమాజాన్ని నిందించరు, నిదానంగా తెలియపరుస్తారు“ఇప్పుడు దేశంలో మనుషులకి ముఖ్యంగా మనలాంటోల్లకి కావలసింది గుళ్ళు కావు. స్కూళ్ళు, ఆసుపత్రులు, ఉపాది కేంద్రాలు.” ఈవిధంగా.
    తన కథలు చదివితే ఒక సంఘటన చూసినట్టుంటుంది. మంచి కథలు అందించే మా గురువుగారికి ధన్యవాదాలు
    – రెడ్డిప్రకాష్ అశోక్.

  17. చదువుకోవడం, రాసుకోవడం, ఆచరణ దిశగా సాహిత్యం అదే కదా జీవితం.

    చదవడం, రాయడం అంటే జీవించడం.
    చదవకుండా, రాయకుండా వుండటం అంటే మృత్యువు… మరణం.

    ఈ రెండు వాక్యాల్లో సాహిత్యం గురించి సూటిగా చెప్పేశారు బాలాజీ గారు.

    బడుగుల జీవితాల్ని సునిశిత దృష్టి తో కళ్ళకు కట్టినట్లు చూపించడం లో వీరు అందె వేసిన చేయి. తన శిల్పంతో పాఠకులను ఎక్కడికో తీసుకెళ్లిపోయి మనసు తలుపులను ఆర్డ్రం గా తడుతారు.

    కానాలబాలు

  18. మనసును కదిలించే దృగ్విషయాలను ఆర్ద్రతతో కూడిన సన్నివేశాలను, బడుగు, బలహీన వర్గాలు మనుగడ కోసం పోరాడే దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించడం, రాయడం, చదవడం లేకపోతే మృత్యువు అని ,చదువు పట్ల ఉత్సుకతను పెంచడం మరియు మనుషులను మనుషుల్లోని కి తీసుకొని వెళ్ళడం పలమనేరు బాలాజీ గారికి బెల్లం పాయసం తిన్న అంత తేలిక
    నా హృదయపూర్వక అభినందనలు
    డాక్టర్ మల్లిచెట్ల దేవేంద్ర

  19. మంచి కథనం..సమాజం లో అసమానతల పట్ల మీ ఆవేదన..ఆదర్శ కుటుంబం ఎలా ఉండాలో చెప్పే మీ దార్శనికత.. అద్భుతం సర్…చాలా రోజుల తర్వాత మంచి కథ చదివిన ఆనందం…అభినందనలు సర్

  20. ఆర్.విశాలాక్షి,రామాపురం,వి.కోట. says:

    ఆర్.విశాలాక్షి, వి.కోట says
    April 13,2020 at 8:40 pm
    మంచి కథ సార్. సమాజంలోని రుగ్మతలను కళ్ళకు కట్టినట్టు చూపించారు.మంచి,చెడు జీవితమనే బండి చక్రానికి రెండు చక్రాలు లాంటివని మరొక్క సారీ నిరూపించారు.కథ హృదయాంతరాలంలో నుండి పుట్టుకొచ్చి,అనుభవాలను ఙ్ఙప్తి చేస్తుంది.ధన్యవాదాలు సార్. మీ కథను చదువుతున్నంత సేపు ఇంకా చదవాలనే ఉత్సాహం కలుగుతుది.అభినందనలు సార్.

Leave a Reply