“రచయిత సమాజానికి బద్దుడు. రాయాలంటే ఈ యుద్ధరంగం గురించి రాయాలి. రచయితకు తిండి బట్ట అన్నీ ప్రజలు యిచ్చినవి. కనుక ప్రజల రుణం మనం తీర్చకోవాలి. తప్పకుండా మనపట్ల శత్రువుకు విప్లవోద్యమంపట్ల ఉన్నంత కోపం ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది కూడా.”
నాకర్థమయ్యింది. గుబగుబ కన్నీళ్లు ఉబికాయి. నేను చాలాసేపు మాట్లాడలేదు.
మాస్టారు ఒక దొరను చూడాలన్నారు. తెల్లారి మమ్ములను లైన్ మన్ రాములు ఒక గ్రామానికి తీసుకపోయారు. అక్కడ దొర కల్సిండు. ధోవతి కట్టుకున్న అరువైదాటిన మాస్టారు. మేమందరం… మమ్ముల్ని అంచనా వేయలేక పోయాడు.
దొర ఆరడుగుల పైన్నే ఉన్నాడు. బట్టతల, ధోవతి కట్టుకున్నాడు. ఆయన ముఖంలో అనేక భావాలు, భయాలు. కొండగట్టులోని పిచ్చివాళ్లలాగున్నాడు.
1982 నాటికి దొరల్లో పై స్థాయివారు పూర్తిగా పట్నాలల్లో స్థిర పడ్డారు. వాళ్ల భూములు బీడుపడ్డాయి. గడులు పాడుబడ్డాయి. డబ్బు, బంగారంతో పట్నాలల్లో రియల్ ఎస్టేట్, విద్య, వైద్య రంగాలల్లో పెట్టుబడులు పెట్టారు.
రెండోస్థాయివారు మరీ పెద్ద పట్నాలు కాకుండా చిన్నచిన్న పట్నాలల్లో స్థిరపడి గ్రామాలల్లో ఉన్న ఆస్తులు, వ్యవసాయం అరకొరగా నడుపుకుంటున్నారు. బాగా ఒత్తిడివస్తే పూర్తిగా చిన్న పట్నాలల్లో స్థిర పడాలని సంకల్పం. విప్లవోద్యమాలతో బాగున్నట్టుగా నటిస్తూ అందులో కొందరిని ముఖ్యంగా బీసీ కులాలను దళిత కులాలకు వ్యతిరేకంగా మలచడంలో ఉన్నారు.
అగ్ర కులస్తులే అయినా వెలమ, రెడ్డి, బ్రాహ్మణ ధనిక మధ్యతరగతి రైతులుగా, ఉద్యోగస్తులుగా ఉన్నవారు గ్రామాల్లోనే ఉండి ప్రజల్లో చీలికలు తెచ్చి ఎప్పటికైనా పూర్వవైభవం, దొరలుగా ఎదగలేమా అని కలలు కంటున్నవాళ్లున్నారు. అగ్రకులాల్లో కూడా తీవ్రమైన అధికార కొట్లాటలున్నాయి. రెడ్డి, వెలమల మధ్య అతి పురాతన ఆధిపత్యపోరు వలన ఒకే గ్రామంలో రెండు కులాలు ఉండటం అరుదు. కొన్ని ప్రాంతాలలో విడివిడిగా ఉన్నారు.
ఆయన రెండోస్థాయి వెలమదొర. ఆయనను ఆర్థిక విషయాలతో పాటు భూస్వామిక జిత్తులమారి టక్కుటమారాలు చుట్టుకున్నాయి. అన్న కొడుకు భార్య (కోడలు) మీద కన్నుబడి ఆయనను చంపించాడు. చదువుకున్న అమ్మాయిని చెరబట్టాడు. కనుక వెంటనే పట్నానికి మారితే ఈ పిల్ల పారిపోతుందేమోనని భయం. రాములు ఆ తరువాత దొరకు, ప్రజలకు జరిగిన అనేక ఘర్షణల గురించి చాలా విషయాలు చెప్పాడు. మాస్టారు ప్రజలు చెప్పుకునే కథలు, పాడుకునే పాటల గురించి అడిగిన సందర్భంలో బుడగ జంగాలు ఇదే ఊరిలో, ఖిలావనపర్తిలో ఫిబ్రవరి 23, 1982 నాడు పోలిసులు కాల్చి చంపిన దేవేందర్ రెడ్డి కథ చెప్పినట్లుగా చెప్పాడు. ప్రజా కళాకారులు నాకన్నా ముందున్నారు. అక్కడి నుండి వెంకన్న ఊరు ‘సిరిసిల్లా’ వాళ్లమ్మను చూసి వేములవాడ వెళ్లి మాస్టారు హైదరాబాదు వెళ్లిపోయారు.
ఇదిగో ఇలాంటి మానసిక స్థితిలో ఉన్న నన్ను కాళీపట్నం రామారావు మాష్టారు రాక ఓదార్చింది. అనేక రకాలుగా ఈ యుద్ధ భీభత్స పోరాట ప్రాంతంలో అనేక చావుల మధ్య, పోలీసు క్యాంపుల మధ్య, నిత్యం నిర్బంధం మధ్య, నిలదొక్కుకొని తరతరాల మధ్యయుగాల దుర్మార్గమైన భూస్వామ్యాన్ని మా తరం ఎదుర్కొన్నారు. దాని పునాదులు కదిలించారు.
అనేక దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు మూలమైన భూమి, అక్రమంగా సంపాదించిన వారి సంపాదన, స్వంత ఆస్తి. అవి ప్రజలవని, ప్రజలకే చెందాలని, భూమి, నీరు అన్ని ప్రకృతి వనరులను ప్రజలు వినియోగించుకొని అభివృద్ది చేయాలని, వాటిని అక్రమంగా ఆక్రమించిన దొరల ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టారు. గ్రామీణ రైతాంగాన్ని, రైతు కూలీలను సమీకరించారు. పల్లెల మీద పాతుకపోయిన దొరల పెత్తనాన్ని తొలిగించారు. భూస్వాముల పక్షాన ప్రభుత్వం, చట్టాలు రంగప్రవేశం చేశాయి. అయినా ఇప్పటికీ గ్రామాలు ఒదిలిన దొరలు పల్లెల్లో అడుగు పెట్టలేదు. ఈ ప్రయోగం, పోరాటం, పదేండ్లుగా నిలదొక్కుకోవడమేకాదు తెలంగాణలోని అన్ని జిల్లాలకు, తిరిగి శ్రీకాకుళంలోనికి, రాయలసీమకు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్ అడవులగుండా ఆదివాసీ ప్రాంతాలకు, పక్కనే ఉన్న కార్మిక ప్రాంతాలైన సింగరేణికి విస్తరించాయి. భారతదేశ వ్యవస్థను గతితార్కికంగా, చారిత్రకంగా ఆచరణ ద్వారా అర్థం చేసుకున్నారు.
ఈ పదేండ్లు దేవేందర్ రెడ్డిలాంటి వాళ్లు కాలినడకన పల్లెపల్లె తిరిగారు. వందలాది పోరాటాలకు నాయకత్వం వహించి అనేక వైరుధ్యాలను పరిష్కరిస్తూ చావుకు మిల్లీ మీటర్ల దూరంలో సంచరించారు. ప్రజలల్లో కలిసిపోయారు. ఇది మామూలు విషయం కాదు. ఊరూరికో కథ వేనవేల కథలు…
మార్చి నెలంతా దేవేందర్ రెడ్డి ఎన్ కౌంటర్, ఆయన పోరాటాలు నిలబడ్డా, కూర్చున్నా నిద్రలో విన్పించేవి కన్పించేవి. ఆయనతో కలిసి చీకటి రాత్రులు. పట్నం తుమ్మ ముండ్లలో, ఆ ఊళ్లల్లో భయంభయంగా తిరిగిన కలలు. గోదావరి తీరప్రాంతంలో పెరిగిన రెల్లుగడ్డిలో రైతులతో మీటింగులు. ఒకటా రెండా? మాయింట్లో చదువుకునే రోజుల్లో గడిపిన రోజులు, మంచెల మీద, కోడారిలో, నెగల్లకాడ కలిసి తిన్న తిండి ఎన్నెన్నో…
మాస్టారుతో తిరిగిన జగిత్యాల, సిరిసిల్లా ఊళ్లు. గ్రామంలో మిగిలిపోయిన ఆఖరి దొర. ( ఆ తరువాత ప్రజల చేతుల్లో చనిపోయాడని విన్నాను.) కూలిపోతున్న భూస్వామ్యపు విషాదం. అతని ముఖంలో మేము చూసే నాటికే మృత్యువు ఛాయలు. ఆగమాగంగా ఉండేది. అనేక విషయాలు, విషాదాలు. మెదడు పచ్చిపుండు. కదిలిస్తే పటపట కన్నీళ్లు కారేవి… ఆ దు:ఖానికి అర్థమేమిటో తెలిసేదికాదు.
అయితే చనిపోయిన వీళ్ల గురిచి వేరుగా కథలు రాయాలన్పించేది కాదు. ఒక్క వాక్యము రాయవచ్చేది కాదు. ఇప్పటికి కూడా…
అదిగో అలాంటి సందర్భంలో బుడగ జంగాలు పెద వీరయ్య, చినవీరయ్య( కథలో దమ్మయ్యగా రాశాను) కన్పించారు. వెన్నంపెల్లిలో పెదవీరయ్య, చినవీరయ్య మా బాల్యంలో భాగం. బహుశా పెదవీరయ్య నాలోపల ఇంకి పోకపోతే ప్రపంచాన్ని ఇట్లా చూసేవాన్ని కాదు. రాసేవాన్ని కాదు. అమ్మోరు మచ్చలముఖం కాకపోతే అచ్చంగా నాలాగే ఉండేవారు. కథలు చెప్పేటప్పుడు తప్ప దాదాపుగా మౌనంగా, విషాదంగా. తల్లి, దండ్రి లేకుండా అమ్మమ్మ దగ్గర పెరిగారు. చిన్నోడు నలుపుగాని, ప్రతి విషాదాన్ని మా వీరన్నలాగా పరిహాసంగా తీసుకునేవారు. వాళ్లిద్దరన్నదమ్ములు వందలాది గ్రామాలల్లో లోలోపల సుళ్లు తిరిగే అనేక దు:ఖాలను, చిత్తడైన బతుకులను మహాద్భుతమైన కంఠ స్వరంతో (భుపేన్ హజారికా లాగా) గానం చేశారు. ఆ పాటలు రాసినవి కావు. నేను తెల్లారేదాకా కంటిమీద రెప్పేయకుండా వాళ్ల కథలు బలుగురు కొండయ్య, ఆరె మరాఠీలు, బాలనాగమ్మ కథ వెక్కివెక్కి ఏడుస్తూ వినేవాన్ని…
వాళ్లిద్దరి ద్రుష్టికోణలోంచి, దేవేందర్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన స్థితిని ‘కథ’ ఏప్రిల్ రాశాను.
నిజానికి ఇవి మూడు కథలు.
చిట్టచివరి విషాద నిష్క్రమణలోని దొర కథ – భూసామ్యం కూలిపోవడం.
ఒక విరోచిత పోరాటాన్ని, ఉత్పత్తి వనరులను పంచి, ఉత్పత్తి శక్తులను విప్లవీకరించే నూతన ప్రజాస్వామిక విప్లవంలో మొట్లమొదటి సారిగా పదేండ్లు (1972-82) ( తెలంగాణ సాయుధ పోరాటం మూడేండ్లు 1948-1952) నిలబెట్టి నక్సల్పరీ, శ్రీకాకుళ పోరాటాలకు ఒక ప్రజా పునాదిని, పటిష్టమైన పునాదిని తన సహచరులతో నిర్మించిన తొలి తరపు రైతాంగ నాయకుడు దేవేందర్ రెడ్డి కథ. కొత్త ప్రపంచపు నిర్మాణ పరంపర.
ఈ యుద్ధరంగంలో మాదిగల ఉపకులంలో పుట్టిన జానపద కళాకారుడు బుడుగ జంగాల వీరయ్యలు అర్థం చేసుకున్న తీరు దాన్ని విప్లవకళగా, ప్రజాకళగా మలిచిన తీరు.
ఇవి మూడు కథలు ఒకే స్థలకాలల్లో తీవ్రమైన సంఘర్షణ.
ఇప్పటికి ఆ గ్రామాలలో దేవేందర్ రెడ్డి జ్ణాపకాలు, పోరాటాలు అనేక కథలుగా చెప్పుకుంటారు. దేవేందర్ తో విప్లవోద్యమాలల్లోకి వెళ్లినవాళ్లు అనేక మంది దేశవ్యాపితంగా ఆ స్ఫూర్తిని తీసుకెళ్లారు. ఆయనతో గడిపిన ప్రజలు ఆయనను పదిలంగా గుండెల్లో దాచుకున్నారు. అనేక ఆటుపోట్లల్లో అదే స్ఫూర్తితో బతుకుతున్నారు. వాళ్లు వాళ్ల పిల్లలకు దేవేందర్ కథలు చెప్పారు. కుక్కల గూడరు, పాలెం, ఇసంపేట- బసంతగర్ లాంటి గ్రామాలల్లో దేవేందర్ రెడ్డి ఇప్పటికీ అమరుడే. మూడు తరాల వాళ్లకు తెలుసు.
తొలిదశ ప్రతిఘటనోద్యమాల రూపకల్పన, నిర్వహణ, కొనసాగింపు, విస్తరణలో దేవేందర్ రెడ్డి తన సహచరులతో కలిసి చేసిన ప్రయోగాలు, వేసిన బాటలు భారతదేశ నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమంలో ఒకపాఠం. అధ్యయనం చెయ్యాల్సిన గుణపాఠాలు తీసుకోవాల్సిన చారిత్రక ఉద్యమం అది.
భారతదేశ రైతాంగా విప్లవోద్యమాలల్లో బయ్యపు దేవేందర్ రెడ్డి నాయకత్వంలో జరిగిన పోరాటం ఒక అధ్యాయం. విముక్తి పోరాటాలు గతితార్కికంగానూ, చారిత్రికంగాను అధ్యయనం చేయవల్సిన చైనా యేనాన్ పోరాటం లాంటి పాఠం.
(26.11.2019)
కొలిమినలా రగిలించే మాటలివి..థాంక్యూ..