కడలి

బయట ఎన్నెల చల్లంగ కురుస్తున్నది.

లోన మన్ను గోడలింట్ల, గ్యాసు నూనె బుడ్డి ఎలుగుల తలుక్కున మెరిసే ఫోటో దిక్కుజూస్తూ బావకిష్టమని బొమ్మెల (చేపల) పులుసండుతుంది కడలి. సుతిల్కి కట్టిన తన బావ ఫోటో ఉండుండి సల్లగాలికూగుతున్నది. అదచ్చం ఊగిసలాడే తన మనసోలె గొడుతున్నది.

బావను తల్సుకుంటూ… తొలినాళ్ళలోనే తనను “బావ” అని పిలవమన్నడు. అట్ల పిలుస్తుంటే ఏదో దగ్గరితనముంటదంట. మనసు పురిప్పిన నెమలైతదంట.

తన బావ “సూదంటు సూపులతోనే… ఎన్నెన్నో మౌనాల ముచ్చట్లుజెప్పెటోడు. గుండెకి గుండెని ఆన్చి సగం పాణమొంపెటోడు. తన గలగల నవ్వుల ఎలుగులతో చీకటి గుబులును తుడిసెటోడు. తానుగన్న కలలను గూడా కాకెంగిలిజేసి పంచెటోడు. సిన్నబుచ్చుకున్న మోమును మరిమరీ ముద్దాడెటోడు. వెదురు ముక్కకు సుత సలుపుతున్న తన గాయాలనద్ది వేణువుగా మలిసెటోడు. నిప్పుల కొలిమి గుండెల దాసి, పైకి ఎన్నెల తాగినట్లు సల్లగుండేవాడు”.

ఎందుకో గీ దినం కండ్లలోనే మసులుతున్నడు. బావను సూసి గపుడే ‘ముప్పైఆరు దినాలు’ గావచ్చే.

***

మొదాల్సందీ లగ్గమొద్దనే బావ, పెద్దల బలిమీటితో నన్ను సూడొచ్చిండట. అసల్కి నా పేరినే మనసువఢ్డడట. నన్ను జుసినంక నాతోని మనసిప్పి ముచ్చెట్లాడిండు. “తన మనుగడ ఎప్పటి వరకో తెల్వదన్నడు. తన పాణం భూమి కోసమన్నడు. తనని జేసుకుంటే జీవితంల సంతోషమిస్తనో, ఈయలేనో అన్నడు”.

ఏం జెప్తున్నడో ఏం సమజ్ఙాకున్నా గా కండ్లనిండా నిజాయితీకి కరిగిపోయిన. నాకూ నచ్చిండు. నీతోనే నా జీవితమన్నా. ఎన్నడూ నీ దారికడ్డుగానన్నా. బావకి నచ్చినట్లే నిరాడంబరంగా పెద్దల ముంగిట ఇద్దరం జంటైనం… అందరికీ కన్నుల పంటైనం.

ఆ తొలి రేయి తర్వాత నాలో ఆడతనం కండ్లుదెరిసింది. మలిరేయి గుండెపై వాలి “బావా నువ్ ఎక్కడికీయెళ్ళకు. నాతోనే వుండే” అన్న ఏదో ఆశగా.

బావ నవ్వూతూ జుట్టు సవరిస్తూ… “పిసదాన! నీలో కూడా ‘నా’ అన్న స్వార్థం షురూ అయిందానే” అన్నడు.

“నేను ఆడపిల్లను బావ! తర్వాతే నీ పెండ్లాన్ని” అన్న రోషంగా.

“కడలీ…! గీ పేరు మీ అవ్వయ్యా ఎందుకు పెట్టిండ్రో తెలవదుగానీ… గా సముద్రమంత బడబానలం ఇగ నీ గుండెలోనే దాసుకోవే. పైకి కనబడని బాధలన్నీ నీలోనే అదిమి, సుసేటోల్లకి సల్లంగ గనవడాలె. సంతోషం నింపాలె. చైతన్యం పంచాలె. ఎరికైనదా!” అన్నడు.

“నాకు గీ పేరు మా అవ్వయ్యా పెట్టలేదు బావా! మా అవ్వ, అడవిల ఇప్పపువ్వు, కుంకుడుగాయలూ ఏరనీకీ బోయ్యేదంటా. ఓ రోజు సోపతెవరూ లేకుంట నేను కడుపుల వున్నప్పుడు, నిండు నెలలైనంకగూడా అట్లనే ఒక్కతే అడవికెళ్లిందంటా.. గప్పుడే అనుకోకుంటా నొప్పులు షురూ అయితే గా నట్టడివిల అవస్థ పడే అవ్వని, అటేపెళ్తున్న అన్నల దళం జూసి, అక్కున జేర్చుకుని పురుడు పోసిందంట. దానికి మా అవ్వ శేతులు జోడించి “ప్రాణం పోసిన మీరే నా బిడ్డకు పేరు సుత పెట్టుండ్రం”టే… ఆ దళంల ఓ అక్క నాకు గీ పేరు పెట్టిందంట. మా అమ్మ ఊకె గీ ముచ్చట జెప్పేది.

సరేగానీ బావా! ఇట్ల పోరాటం జేయ నీవేగావన్నా? గింత మందున్నరు మన గూడెంల” అన్న.

“కడలీ… అందరూ అట్లనుకుంటే ఎట్ల?? పెద్దలు జెప్పుడు ఇండ్లే నువ్?? ఏట్ల ఉన్నదంతా ఉస్కెనే… కానీ అస్త్రకారు జేయన్నంటే జల్లెడ పట్టన్నే!” ఎందరున్నా ఎక్కడో ఒకరం (పాణాల మీద తీపి లేనోళ్లం) మాలాంటి వాళ్ళమైనా నమ్ముకున్న భూమి కోసం, మార్పు కోసం పోరాటం చేయాలన్నడు. అణిచివేతకి ఎదురు తిరగాలన్నడు. ఈ పోరాటం జేయకపోతే… ముందు ముందు పచ్చని చెట్లులుండవు, పక్షుల కిల కిలలుండవు, వాగుల గలగలుండవు కడలీ… ఓ పంట శేతికి రాకుంటే ఆశతో మల్లో పంటేయొచ్చు. ఓ తాన తవ్వితే నీళ్ళు బడకుంటే మరో తాన బాయి తవ్వొచ్చు. అసలు మన్నే లేకుంట జేస్తే ఎట్లనే. నీళ్ళె అడుగంటి పోతెట్లనే… గిరిపుత్రుడనైయుండీ, రాబోయే అనేక సమస్యలు తెలిసీ నేను సుత శేతులు ముడుసుకుని కూర్చోమంటవానే” అన్నడు.

“దీనితో మనకు మాత్రం వొరిగేదేంది బావా? అందరి లెక్క మనం, బతికుంటే బల్సాకుతిని ఉందా”మన్న.

“కడలీ! చివరికి గా ఆకులూ, అలములు గూడా లేకుంటజేస్తరటా. ఎప్పుడూ ఆశించి పనిజేయద్దే. మన తల్లికో, బిడ్డల కోసమో ఐతే అట్లనే ఆశించి పనిజేస్తమా? మన కోసం మనం బతకడం ఓ బతుకేనా? అందరి లెక్క బతకడం రాదేనాకు. నా పాణముండంగా ఆ యురేనియం భూతాన్ని బయటికి రానియ్య. భూమిని పొక్కిలిగానియ్య. గా అధికారులను అడవిల అడుగుపెట్టనియ్యను. సర్వేలని ఆ అధికారులూ, యంత్రాలొచ్చేది గీ పచ్చని భూమిని మాయం జేసి మన పాణాలను తీసెతందుకు. ఆ యురేనియాన్ని బయటికిదీస్తే వందల మంది కాదే కొన్నివేల మంది సచ్చిపోతరంటా. ముందు ముందు మూగ ప్రాణులు సుత అంతరించి పోతయంట. పంటలు పండవట. ఎక్కడో భూమిలో వున్న చల్లని గంగమ్మను గూడా నిప్పులు చిమ్మే విషం జేస్తరట. గీ విషయం గూడెంల, పక్కూళ్ళల అందరికీ అర్ధమయ్యేటట్టుజెప్పాలె కడలి.”

“బావా! వున్నదున్నట్లంటే ఊళ్లోనే వున్డొద్దంటరు. అసుంటిది సముద్రానికి ఎదురీదినట్లు గింత పోరాటం జేసుడంటె…?? అసలే అన్నిట్ల నువ్వే ముందుకుంటవ్” అన్న భయంగా!

బావ నా మాట పూర్తిగాకముందే అందుకుని “భూమ్మీదుండద్దంటరు గంతే కదే ” అన్నడు నిమ్మళంగ. గుండెలపై నా చెతులు ఆనించుకుని ఆకాశంకెళ్ళిజూస్తూ.

“నీకేమన్నయితే” అన్న… బెదురుతూ.

“ఎప్పుడేమైన ఔద్ది కడలీ… పోరాటంజేసే నా చేయినందుకున్ననువ్ ధైర్యంగా వుండాలె. నువ్ గూడా ఎన్ని కష్టాలొచ్చినా ఎదురు తిరిగి నిలబడాలె. అన్నిటికి సిద్ధపడాలె” అన్నడు.

“అవ్వన్నీ నాతో అయ్యే పనిగాదు బావా. నాకు నువ్ ముఖ్యం అంతే! ఐనా గిన్ని తెలిసినోడివి నన్నెందుకు జేసుకునుడ”న్న వచ్చే ఏడుపునాపుకుంటూ. బావ నాకు అన్నీ ముందే జెప్పిన ముచ్చెట మరిచిన. ప్రేమ తొలకరి అన్నిటినీ యాదిమరిపిస్తది. అందులనే స్వార్థం మొలకేస్తది.

బావ వొక క్షణం మౌనం తర్వాత… “నా పోరాటం నాతోనే ఆగిపోనిస్తవా పిల్లా! నా ఊపిరి తిరిగి నీలో పెరగనియ్యవా ” అన్నడు కండ్ల నీళ్ళతో నవ్వుతూ. “కడలీ… నాలోని ఆఖరి వొక్క రక్తపు బొట్టు ఆవిరయ్యేలోపు నన్ను నన్నుగా అర్ధం జేసుకున్న నీలో నా ప్రతిరూపం పెరగనియ్యే” అన్నడు నా కండ్ల నీరుదుడుస్తూ.

ఇగ గప్పటి సందీ… బావ అడుగులో అడుగునైనా. తన ఆశయంలో ఆజ్యంగాకున్నా… ప్రేమపాశంతో యెనక్కి గుంజాలనుకోలే. బావ జేసే పోరాటాలనీ… ఆ పోరాటంలలో న్యాయం జూసీ, పోరాటం జేయకుంటే వచ్చే ఎన్నో రకాల కష్ట, నష్టాల గురించి దెల్సుకుని కొద్ది నెలల్లనే ఎన్నో విధాల నేనూ గూడా ఆ పోరాటంల ఓ భాగమైనా. బావతోనే వెళ్ళిపోదమనుకున్నా, కానీ అమాయకమైన గూడెంల ఆడోళ్ళనొదిలి వెళ్తే ఎట్ల. కొద్దిగా నైనా వాళ్లకి పరిస్థితుల పట్ల అవగాహన గల్పించి, వాళ్ళందరిన్నీ ఓ దగ్గర జేసి చైతన్యంజేస్తున్నా. ఆలోచన విధానంలో మార్పులు దెచ్చిన. ఏ అధికారులు మా నల్లమలల అడుగుపెట్టిన మేమంతా ఏకమై ఎదురుదిరిగి నిలుస్తున్నాం.

***

ఆలోశనలో నుండీ బయటవడి, రోజులెక్కనే ఈ రేయయినా వస్తడని ఆశగా ఎదురుజూస్తన్న. మస్లిన చాపల పులుసు దించి, బావ కోసమని నిప్పుల మీద, నీళ్లసర్వ పెట్టిన. రేపు మా పెండ్లి రోజు. కండ్లుగాయలు గాసేలా ఎదురుజూశే తనకోసమైనా వస్తడని లోలోన ఆశ. ఓ పక్కకేమో బగ్గుమనే జ్వరం. అసలే మూడు రోజుల సంధి ముద్ద సైయిస్తలేదు. నీరసంతో ఓపిక లేక… గుండెనీ, సూపులనీ దర్వాజాకి తగిలిచ్చి, ఈతాకు సాపపర్సి, పక్కపంటి బావకి చోటుంచి, అట్లనే అలసిన పానంతో కండ్లు మూసిన.

ఎప్పుడు పొద్దూకిందో. ఎప్పుడు తెల్లారిందో. గూడెంలో ఎదో అలజడికి కండ్లు దెర్సి, దిగ్గున లేచి బయటకురికిన.

రాజ్యం పంపిన మనుషుల మధ్య చెతులు కట్టుకుని బెదిరిన పిట్టల్లా మా గూడెం జనం. చిందర వందరగా గుడిసెలు. బయటకిసీరేసిన బాసండ్లు. ఒలికిపోయిన తిండిగింజలు. చిరిగిన జాకెట్టు బట్టలతో పాణం అరచేతిల పట్టుకుని ఆడవాళ్లు. చుస్తుండలేక పోయిన.. రక్తం మరిగింది. బావ నాలో నింపిన ధైర్యం యాదికొచ్చింది.

ఎదురు తిరిగి, ధిక్కరించిన… నా పెడ రెక్కలిరిచి “ఇది వాని పెండ్లామే కదూ! ఇట్లనే ఎదురు తిరిగిన నీ మగని గతి ఏమైందో సూడు. అసలు వాడు నీ వాడేనా గుర్తుపట్ట” మంటూ నన్ను జుట్టువట్టి గుంజక పోయిన్రు.

***

అడవి మధ్యలో నీటి మడుగు దగ్గర, నెత్తుటి ముద్దగా బోర్లాపడి వున్న తన “బావ”. తన రక్తపుధారలతో భూదేవికి లాలపోస్తున్నట్టు… గాయాలు శరీరాన్ని జల్లెడ చేసినా పెదవులపై నవ్వును చెరగనివ్వని తన బావ… కళ్ళార్పకుండా తననే చూస్తున్నట్లూ.

దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్వబోయిన తనకు కడుపుల ఏదో కదిలినట్లయ్, సముదాయిచ్చినట్లనిపించే… కడుపును తడుముకుంటూ పెదవంచున దుఃఖమాపిన. అంతలో “బావ చెప్పిన మాట యాదికొచ్చింది.

“కడలీ… పోరాటంలో ఓడిపోయి వెనుతిరిగేవారుండరు. అంతా భూమాత పొత్తిళ్ళలో నెత్తుటి ముద్దయి ఒరిగిపోయే వారే! ఇష్టంగా మన్నులో కరిగిపోయే వారే!! అని.

గూడంలల్లా, ఊళ్లల్లా రాజ్యవ నిఘా బెట్టి, ఎదురుతిరిగే నాయకులను పట్టి, మళ్ళా ఈ నల్లమలల అంతరించినయనుకున్న నక్సలైటు దళాలు వచ్చినై అంటూ అసత్య ప్రచారం జేసి, శాంతి భద్రతలంటూ బూటకపు ఎన్కౌంటర్ జేస్తున్నరు. మరి కొందరిని ఎర్ర చందనం దొంగలంటూ, స్మగ్లర్లంటూ ఎదురు తిరిగినరంటూ నా బావలాంటి ఎందరో ఎదురు నిలిచే వీరులను పొట్టన బెట్టుకున్నరు. అసలు ఆ దళాలు అన్నిచోట్లా లేకనేగదా వీళ్ల పన్నాగాలూ, వీళ్ల మోసాలు. పెద్ద పులుల్లెక్క వాళ్లే ఈ అడవుల్ల ఉంటే ఈ దినం ఈ యురేనియం తవ్వకాలంటూ, వజ్రాలంటూ గింత నిబ్బరంగా అడుగువెట్టేవాళ్ళా? అడవిలకు వెల్లన్నంటే అడ్డుగావున్న చెట్లని నరికినట్లు, గా నాడే పథకం పన్ని వాళ్లని అడ్డు తొలగించి తొవ్వ జేసుకున్నరు.

***

“ఊ!! బాగా చూసి చెప్పు. నీ వాడెనా? గుర్తుపట్టమన్న గర్జన”కి ఉలిక్కిపడిన.

కండ్లనిండా నీటి పొర అడ్డుపడుతుంటే… “కాదు ఈయనెవరో. నా బావ కాదు. నా బావ అమరుడ”న్న. నా బావని సంపినమన్న సంతోషం సుత దక్కనియ్య వాళ్లకి అని మనుసుల అనుకుంట… ఓ సారి కడ సూపుగా బావని కండ్ల నిండా చూసుకుందామని వెన్నక్కి మర్లిన. అపుడే ఓ పెద్ద మనిషి బూటు కాలితో బావని వెల్లికిలా దొర్లిచ్చిండు. అప్పుడు కనవఢ్డది… బావ గుండెకి ఆనించుకున్న పిడికిలిలో నాగేటి గడ్డ పూలతీగలతో చుట్టిన నాకిష్టమైన “మోదుగు పువ్వుల గుచ్ఛం”. అచ్చం నా బావ లాగే నెత్తుటి ముద్దలా వాడిపోయి.

జ‌న‌నం: త‌ల్లాడ‌, ఖ‌మ్మం జిల్లా. ర‌చ‌యిత్రి. క‌డ‌ప జిల్లా బ్ర‌హ్మంగారి మ‌ఠంలో పెరిగారు. అక్క‌డే బీఏ వ‌ర‌కు చ‌దివారు. 1997 నుంచి క‌విత్వం, క‌థ‌లు రాస్తున్నారు. వివిధ ప‌త్రిక‌ల్లో క‌థ‌లు, క‌విత‌లు ప్ర‌చురిత‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో ఉంటున్నారు.

7 thoughts on “కడలి

  1. గుండెల్ని మెలిపెట్టిందక్కా మీ కథ….. 😢😢💕💕💕

  2. చాలా బాగుంది, రాజ్యం మీద తిరుగుబాటు.

Leave a Reply