చిన్నపాటి శబ్దాలు సునిశితంగా వినిపిస్తున్నట్టూ కలలో కనిపిస్తున్న ప్రతిదీ నిజజీవితంలో తారసపడుతున్నట్టూ అనిపిస్తుంది.
రోహికి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మెదడు కదలమని సూచిస్తోంది. నిద్ర విదిలించుకుని లేవమంటోంది. శరీరం మొరాయిస్తోంది. చిటికినవేలునూ కదపలేకపోతోంది.
సరిగ్గా ఆ స్థితిలో…
“మనుషుల్లో మగాళ్లుంటారు. మగాళ్లందరూ మనుషులు కాదే పిచ్చిదానా… నమ్మకంగా కనిపించేవారినీ దగ్గరవారినీ అస్సలు నమ్మకు” చెవికి అతి దగ్గరగా చేరి చెబుతున్నట్టనిపించింది.
చిన్నప్పుడెప్పడో విన్న మాటలు. అమ్మ అన్న మాటలు. రోజులు దొర్లాయి. రుతువులు మారాయి. అమ్మ దాటిపోయింది. కాలం స్థంభించినట్టుగా తనకు అనిపించినా అది ముందుకు పరిగెడుతూనే ఉంది. అడుగులు జాడలయ్యాయి. నిజాలు జ్ఞాపకాలయ్యాయి. గురుతులు నెమ్మదిగా మెదడులోంచి గుండెలోకి జారిపోతున్నాయి. అలాంటప్పుడు… ఆ అర్థరాత్రి… అకస్మాత్తుగా చీకటిని చీల్చుకుని వచ్చినట్టుగా వినిపించాయి అమ్మ మాటలు. ఆ స్వరం చెవుల్లో నుంచి మస్తిష్కంలోకి చేరినట్టు లేదు. మస్తిష్కమే చెవిలో చేరి చెప్పినట్టుగా అనిపించింది.
ఎవరో చెళ్లున చరిచినట్టు కళ్లు తెరిచింది రోహి. అప్రయత్నంగా తన చేయి పక్కనే పడుకున్న బాబును చుట్టేసింది. తలతిప్పి ఇంకోవైపు పడుకున్న పాప నుదుటిని సున్నితంగా ముద్దాడింది. తుడిచిపెట్టేసినట్టు నిద్ర ఒక్కసారిగా మాయమైంది. భర్త ఇంకా ప్రోజెక్టు పనిమీద చెన్నైలోనే ఉన్నందుకు నిదర్శనంగా ఆ పక్కన స్థలం ఖాళీగా బోసిపోయింది. మాటల్లో చెప్పలేనంత వెలితిగా అనిపించింది రోహికి.
మనసు అంతకు ముందు సంఘటనలు మననం చేసుకుంది.
ఏ పనైనా పద్దతిగా చేయాలని తాపత్రయ పడుతుంది రోహి. మనసు పని వేర్వేరు కాదంటుంది. పనిపైన మనసు పెట్టి చేస్తుంది. ఆ రోజుకూడా, దీక్షగా వార్డ్రోబ్ సర్దుతోంది. కాలింగ్ బెల్ మోగింది. తన ఉలికిపాటుకు తనకే చిరాకేసింది. చేతులో ఉన్న ఒక్క షర్టూ మడతబెట్టేద్దామనుకుంది. అలా అనుకుందో లేదో మళ్లీ మోగింది. ఈ సారి స్కూలు బెల్ కొట్టినట్టుగా. ఈ కరోనా టైంలో ఎవరొచ్చుంటారబ్బా అనుకుంటూ గుమ్మం వైపు అడుగులేసింది. యథాలాపంగా ముందుకు నడుస్తోంది. అతిమామూలుగా పక్కకు చూసింది. తమ్ముడు సోఫాలో కూర్చొన్నాడు. పాప వాడి ఒళ్లో ఉంది. దాని ఫ్రాక్ మోకాళ్ల పైకి జరిగింది. ఆ పై వాడి చేతులు… ఆ పక్కనే కౌచ్లో పడుకుని తమ్ముడి మొబైల్లో గేమ్ ఆడుతున్న నాలుగేళ్ల సాకేత్. అది ఇంట్లో అతి మామూలుగా కనిపించే ఒక సాధారణ సన్నివేశమే!
కానీ ఆ రోజు, రోహి కళ్లు దాన్ని చూసీచూడనట్టుగా వదిలేయలేదు. మెదడుకు సంకేతాలిచ్చాయి. మనసును హెచ్చరించాయి. అందుకే ఆమె ఆ చేతుల్నీ, ఆ మొహాన్నీ, లాలీపాప్ తింటున్న ఆ పసిపాపను అలాగే చూస్తూ గుమ్మం వైపు నడిచింది. డోర్ తీసి కొరియర్ పార్సిల్ అందుకుంది. డిజిన్ఫెక్ట్ చేసి పక్కనే ఉన్న అల్మారాలో పెట్టింది. చల్లటి సానిటైజర్ వెచ్చని అరచేతుల్లో వంపుకునే ముందోసారి, దాన్ని చేతుల్లోంచి మోచేతుల వరకూ పులుముతూ మరోసారి అదే పనిగా వాడిని గమనించింది. వాడు రోహినే చూస్తున్నాడు. చేతుల్ని మాత్రం తీయలేదు. గదిలోకెళుతూ ఎందుకో వెనక్కుతిరిగి మళ్లీ చూసింది కళ్లు చికిలించి మరీ, అతి జాగ్రత్తగా. చేతులు ఇంకా అక్కడే ఉన్నాయి. చూపులు తనవైపే. తొణకూబెణుకూ లేకుండా… అత్యంత స్థిరంగా.
తప్పు చేయనప్పుడు తొట్రుపడరంటారు. అది నిజమనిపించడానికా?
అయినా వాడలా ఎందుకు చేస్తాడులే. సర్ధిచెప్పుకుంది. అలా సరిపుచ్చుకున్నా వాడి కళ్లూ చేతులూ రోహిని వెంటాడుతూనే ఉన్నాయి. మనసంతా వికారంగా అనిపించింది. మిగిలిన బట్టలను ఖాళీ షెల్ఫులో పడేసి డోర్ క్లోజ్ చేస్తూ కళ్లు మూసుకుని వాడి కళ్లను యధాతథంగా గుర్తుచేసుకుంది. అవి పలికే భావాలు అర్థం చేసుకోడానికి. ఆ చూపుల్లో తన నిస్సహాయత ప్రతిబింబించినట్టుగా అనిపించింది.
రోజులో చాలాసేపు పిల్లలను తనే చూసుకుంటుంది. వంటపనికో, స్నానానికో, గదులు శుభ్రం చేసేప్పుడో పిల్లల్ని వాడికి అప్పగించడం తప్పట్లేదు. అదే అదనుగా వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. సాకేత్కి గేమ్స్ ఇవ్వొద్దని చాలా సార్లు చెప్పింది. తను లేనప్పుడు అక్కడేం జరుగుతుందో కొడుకైనా చెప్పగలుగుతాడనే ఆశతో. తమ్ముడు తలూపుతాడు. వినిపించుకోడు.
‘ఒళ్లో కూర్చోబెట్టుకుంటే తొడలపై చేతులుంచాలా?’ అని సూటిగా అడగలేకపోయింది. “పాపను కిందొదిలెయ్యరా… నడక ప్రాక్టీసవుతుంది” లేని నవ్వు పెదవులపై అంటించుకుని అందోసారి.
“సాకేత్ గాడు కొడుతున్నాడక్కా…” ఎప్పటినుంచో దాచుకున్న సమాధానం గబుక్కున పెదాలనుంచి వదిలాడు.
పాపను దించలేదు. బాబుకు ఫోన్ ఇవ్వడం ఆపలేదు. వాడి ప్రవర్తన మారలేదు. తనే వదిలేసింది. ‘అయినా ఏం ఆలోచిస్తోంది?. వాడు ఎవరో కాదు కదా సొంత తమ్ముడే. అలా ఎందుకు చేస్తాడు’.
కొన్నాళ్ల కిందట ‘తాతయ్య దగ్గరికి వెళ్లన’ని సాకేత్ మొరాయిస్తున్నప్పుడూ ఇలాగే అనుమానించింది. నిరూపించడానికి ప్రయత్నించింది. ఫలితం… కుటుంబ తిరస్కారం. వెలివేత! ఎంత ఆపదలో ఉన్నా అందరూ ‘ఛీ’ కొట్టే పరిస్థితికి దిగజారిపోయింది.
రెండేళ్ల కిందటి విషయమది.
ఆ రోజు, తను చూసిన దాన్ని వినోద్ కళ్లముందుంచినట్టుగా వివరించింది రోహి.
“అలా ఎందుకు చేస్తాడు? నాన్న కదా” చిరాకు అపనమ్మకం కలగలిపిన స్వరంతో అన్నాడు వినోద్.
“లేదు వినోద్. నేను వెనుక నుంచి చూసాను. బాబు స్నాక్సు తింటున్నాడు. ఆయన చేతులున్న యాంగిల్ చూస్తే వాడి డైపర్ ఏరియా దగ్గరే ఉన్నట్టనిపించింది”. మళ్లీ చెప్పింది.
“పదేపదే చెప్పకు. నువ్వు వెనుకనుంచి చూసావు కదా. మరీ అంత సీరియస్ గా తీసుకోకు”.
“సరే. మరి నా అలికిడి విని ఆయన వెంటనే తన రూములోకి ఎందుకు వెళ్లాడు. ఆ సమయంలో మీ మదర్ కూడా అక్కడే ఉన్నారు. నవ్వుతూ”.
“ఓవర్ డ్రమెటిక్గా మాట్లాడకు. నువ్వేం చెబుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను నిన్ను పెళ్లాడడం ఆయనకు ఇష్టం లేదని ఇలా లేనిపోనివి కల్పిస్తున్నావా?”
“దీనికీ మన మ్యారేజీకి ఏంటి రిలేషన్. మీ వాళ్లు వచ్చినప్పటినుంచి గమనిస్తున్నాను. వీడు నాపీ ఛేంజ్ చేయబోతే చాలు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. కావాలంటే నువ్వే చూడు…”
డైపర్ మార్చడానికి ప్రయత్నిస్తున్న రోహి చేతులు పట్టుకుని, దిక్కులు చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు సాకేత్. లివింగ్రూంలో టీవీ చూస్తున్న అత్తామామలు పరిగెత్తుకొచ్చారు. వారిని చూడగానే గొంతు నరాలు చిట్లిపోతాయా అన్నట్టుగా మరింత గట్టిగా ఏడవసాగాడు.
రోహి కళ్లవెంబడి ధారాపాతంగా కన్నీరు.
“ఏమైంది రా… ఇద్దరూ ఇక్కడే ఉండి పిల్లగాడిని అలా ఏడిపిస్తున్నారు”. ఒకింత మందలింపుగా అడిగాడు వినోద్ తండ్రి.
“కొంచెం చిరాగ్గా ఉన్నాడు డాడీ. నేను మానేజ్ చేస్తాను. ప్లీజ్… కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి” సాధ్యమైనంత మృదువుగా అనునయంగా అన్నాడు వినోద్.
వారిద్దరూ అటు వెళ్లగానే, “సరే… నీ మాటే నిజమనుకుందాం. ఇక ఆ విషయం వదిలెయ్. ప్రశాంతంగా ఉండు. ఏదోక సొల్యూషన్ ఆలోచిస్తాను” అన్నాడే గానీ రోహిని శిక్షించాలని కసిగా అనుకున్నాడు వినోద్. నెల తిరక్కుండానే ప్రోజెక్టు పనిమీద చెన్నైకి వెళ్లాడు. ఫ్యామిలీ షిఫ్టు చేయాలి అంటూనే రెండేళ్లు గడిపాడు. ప్రెగ్నెన్సీలోనూ రోహిని ఒంటరిగా వదిలేసాడు. అత్తమామలు కూడా రాలేదు. డెలివరీ అయిన వారం లోపే మళ్లీ చెన్నై ప్రయాణమయ్యాడు.
“డేస్ బేబీని వదిలేసి వెళ్తున్నావ్. ఇక్కడికి షిప్టవచ్చుకదా” తన స్వరం తనకే బలహీనంగా వినిపించింది రోహికి.
“అవ్వొచ్చు. అది మెయిన్ బ్రాంచ్. ఇక్కడ పనిచేస్తే అంత అప్రిషియేషన్ ఉండదు”. లాప్టాప్ బ్యాగ్ లో పెడుతూ కాజువల్గా అన్నాడు వినోద్.
మౌనంగా ఉన్న రోహిని చూస్తే అనిపించిందతనికి తను వేస్తున్నది సరైన శిక్ష అని. “మీ బ్రదర్ హెల్పు తీసుకో. ఎందుకైన మంచిది పిల్లలను నీ దగ్గరే ఉంచుకో వీలైనంత ఎక్కువ సేపు. నీకు అనుమానపు రోగం కదా”. హుషారుగా చురకంటించాడు.
మనసంతా మొద్దుబారిపోయినట్టుగా ఉంది. చూస్తూ ఉండిపోయింది.
మామయ్య ప్రవర్తన గురించి చెప్పినందుకే వినోద్ ఇలా ప్రవర్తిస్తున్నాడని చూచాయగా తెలిసినా అతణ్ని నిలదీసి అడిగే ధైర్యం చేయలేదు రోహి. మౌనంగానే పిల్లల్నీ ఇంటినీ మానేజ్ చేసింది. కొన్నాళ్లకి, ఓపిక నశించి తమ్ముడితో తన బాధను పంచుకుందో రోజు.
“మీ బావ కూడా నమ్మట్లేదు రా…” రోహి స్వరంలో ఆవేదన.
“వదిలెయ్ అక్కా… కొందరు అలా ఉంటారు. ఏం చేస్తాం అయినా నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు…” తమ్ముడి గొంతులో ఆతృత.
“ఒరేయ్ నేను అమ్మను రా. అన్ని రకాల దృష్టి కోణాలూ నా కళ్లు చూడగలవు.” స్థిరంగా అంది.
“సరే తల్లీ… మరి ఇప్పుడు ఏం చేద్దామని నీ ఉద్దేశ్యం”.
“నీ కోర్సు పూర్తయింది కదా. జాబ్ కోసం ఎలాగూ సిటీకి రావాలి. హాస్టలుకు వెళ్లకు. ఇంటికొచ్చెయ్. నాక్కూడ సాయంగా ఉంటావ్. అమ్మ ఉంటే బాగుండేది. ఈ పరిస్థితి వచ్చేదే కాదేమో…”
“హ సరే… అయినా ఆయన అలా చేసాడని ఎలా చెబుతున్నావు” కుతూహలం ఆపుకోలేక అడిగాడు.
“చూస్తే అర్థం కాదా. దొంగ కళ్లు దొంగ మొహాలు. కళ్లు నిజం చెప్తాయిరా…”
తమ్ముడితో తన సంభాషణ గుర్తొచ్చి చివుక్కుమంది రోహి మనసు. ‘మావయ్య ప్రవర్తన గురించి వాడితో చెప్పకపోయినా బాగుండేదేమో…’ అని లోలోపల మథనపడసాగింది.
ఏడాదిగా వాడు ఇంట్లో ఉంటున్నాడు. ఈ మధ్యే వాడి ప్రవర్తనలో వింత మార్పు. ఆలోచిస్తుంటే మనసంతా ఏదోలా ఉంది. వినోద్ తో మాట్లాడాలనిపించింది. కరోనా వల్ల నాలుగు నెలలనుండి చెన్నైలోనే ఉండిపోయాడు. ఫోన్ పట్టుకోగానే ‘సులు’ అన్న పేరు స్క్రీన్ మీద రావడం రింగవకుండానే ఫోన్ లిఫ్ట్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
“చాలా ఫ్రీగా ఉన్నట్టున్నావ్. అంత త్వరగా లిఫ్టు చేసావ్. పిల్లల్ని పార్సిల్ చేసి ఊరికి పంపావా ఏంటి” సరదాగా అడిగింది రోహి స్నేహితురాలు సులు.
“లేదే. వినోద్ కి డయల్ చేద్దామని ఫోన్ తీసాను, నువ్ చేసావ్. ఏంటి న్యూస్?”.
“ఏమైంది చాలా వీక్ గా మాట్లాడుతున్నావ్?. అంతా ఓకేనా?”
దిగులు దింపుకుంది రోహి
“చాలా రోజుల కిందట మా కజిన్ వల్ల ఇలాంటి సంఘటనే ఫేస్ చేసాను. లాప్టాప్ కొన్నప్పటినుంచీ వాడిలో మార్పు వచ్చింది. పాపను దగ్గరికి రానివ్వలేదు. వారం కిందట అది వాడి గదిలో నుంచి ఏడుస్తూ వచ్చింది. తీరా చూస్తే చెంపపై వేళ్లు తేలాయి. ఏరా అని అడిగితే ముఖ్యమైన పనిలో ఉండగా ఇది వెళ్లి డిస్ట్రబ్ చేసిందని చెప్పాడు.
ఏదేమైనా మన పనులు మనమే చూసుకోవాలే. ఎందుకైనా మంచిది ఓ సారి క్రాస్చెక్ చేసుకో…
ఫోన్ పెట్టేసినా స్నేహితురాలి మాటలే మదిలో మెదులుతున్నాయి రోహికి.
డిన్నర్ పూర్తయ్యే సరికి పాపను ఎత్తుకుని బాల్కనీలో నిల్చున్నాడు తమ్ముడు. వాడి భుజం మీద నిద్రపోతున్న పాపను జాగ్రత్తగా బెడ్రూంకి తీసుకొచ్చింది. పడుకోబెడుతూ దగ్గరకు తీసుకుంది. బుగ్గపై ముద్దు పెడుతుంటే పాప రోహి వైపు తిరిగింది. ఏదో వెదుకులాడే ప్రయత్నం. ఏం చేస్తుందా అని అలాగే ఉండిపోయింది. పాప తల్లి పెదాలను ముద్దాడేందుకు ప్రయత్నించసాగింది. మనసులో భయం తనువంతా ముసురుకున్నట్టనిపించింది.
టీవీలో వార్తలు… పేపర్లో చదివిన సంఘటనలు అన్నీ గుర్తొచ్చాయి. పాపను పడుకోబెట్టి హాల్లోకి నడిచింది. టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోతున్న బాబును గదిలోకి తీసుకొచ్చింది. ‘ఎందుకిలా పదేపదే జరుగుతోంది?’ అన్న ఆలోచన రోహిని కలచివేస్తోంది.
వాడి కళ్లలో భయమే లేదు. ఇంతకు ముందు జరిగిన విషయాలు షేర్ చేయకుండా ఉండాల్సింది. అది వాడు ఎడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడేమో… వాటిని దృష్టిలో ఉంచుకుని అప్ గ్రేడ్ అయ్యాడేమో… ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైంది. మరింత ముభావంగా ఉండసాగింది. ఆమె ప్రవర్తనలోని మార్పును పసిగట్టాడు తమ్ముడు.
ఓ రోజు పొద్దున లేవగానే “బావ ఫోన్ చేసాడు. వస్తున్నాడటగా. చెప్పనేలేదు. సర్లే… ఇక్కడే ఉండి ఇంకా మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని లేదు. ఈ సాయంత్రమే ఫ్రెండ్ రూముకు షిఫ్టవుతున్నా” రోహి చూపులనే స్కాన్ చేస్తూ నెమ్మదిగా అన్నాడు. తన విషయం బయటికి రాకముందే బయల్దేరితే మంచిదనే అభిప్రాయం అతడిది.
మౌనంగా తలూపింది. తమ్ముడి వ్యవహారం గురించి కొంచెం మందలిద్దామనుకున్నా ఇంట్లో ఒంటరిగా ఉండడం, పిల్లలు చిన్నవారవడం ఆమెను అసహాయురాలిగా మార్చేసాయి.
నిలదీస్తుందేమో అని భయపడ్డ అతను రోహి మౌనంగా ఉండడంతో తృప్తిగా అక్కడినుంచి వెళ్లిపోయాడు.
చెన్నై నుంచి వచ్చిన వినోద్ కొద్ది రోజులు క్వారెటైన్ లో ఉండి ఆ తర్వాత ఇంటినుంచే పనిచేయసాగాడు. ఇన్నాళ్లూ ఒంటరితనాన్ని అనుభవించిన రోహి చాలా సంబరపడింది. అతనికి తన పట్ల ఉన్న అనాదరణకూడా మరిచి పోయి ఆనందంగా ఉండడానికి విఫల ప్రయత్నం చేయసాగింది.
రోజులు మామూలుగా గడపడానికి ప్రయత్నిస్తుండగా ఓ ఫోన్ కాల్ మళ్లీ రోహి మనసులో అలజడి సృష్టించింది,
“వాడు దేవుడే. వాడే లేకపోతే ఈ కరోనా టైంలో పిల్లలను మానేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. పాప పనులన్నీ చేస్తున్నాడు. పనివారు కూడా లేరు కదే. చాలా సాయంగా ఉంటున్నాడు. చదువుకున్నాడన్న గర్వమే లేదు. డైపర్ కూడా మార్చేస్తాడు…” చెప్పుకొచ్చేస్తోంది సుమ. రోహికి చెల్లి వరసేగానీ నెలల తేడాతో ఇద్దరిదీ ఒకే వయసు.
“ఏంటీ… ఎవరిగురించి మాట్లాడుతున్నావ్” వణుకుతున్న కంఠంతో ప్రశ్నించింది రోహి
అటునుంచి వచ్చిన సమాధానం విని వెన్నులో వణుకు పుట్టింది. వాడు అక్కడికెలా వెళ్లాడు. ఎందుకు.
“వాడితో కాస్త జాగ్రత్త…”
“ఏమైందక్కా… ఎందుకలా అంటున్నావే”
“కొంచెం సేపాగి మాట్లాడనా…” మాటలు వినిపిస్తున్నా ఫోన్ పెట్టేసింది.
సాయంత్రం ఆరు గంటలైంది. శరీరం మొద్దుబారిపోతున్నట్టుగా అనిపించింది రోహికి. ఓసారి వర్కు రూం కెళ్లి భర్తను చూసింది. పని చేస్తున్నాడు. చెబ్దామనుకుంది. వద్దనిపించింది. టీవీ ఆన్ చేసి పిల్లలను కార్టూన్ ముందు కూర్చోబెట్టింది. గీజర్ ఆన్ చేసి కిచెన్ వైపు నడిచింది. లివింగ్రూం కిచెన్ల మధ్య కలియదిరుగుతూ వంట పూర్తి చేసింది. పిల్లలకు స్నానాలు చేయించడం… డైనింగ్ టేబిల్పై పదార్థాలు సర్దడం… రొటీన్ పనులన్నీ అలవాటుగా చేసుకుపోతోంది. మనస్సుమాత్రం సుమ మాటల్నే వల్లె వేస్తోంది.
అప్పట్లో, మావయ్య ప్రవర్తన గురించి తెలిసిన వాళ్లందరికీ చెప్పింది. కనీసం వాళ్లైనా జాగ్రత్త పడతారు కదాని. వాళ్లు తాను చెప్పిన సంగతులన్నీ ఆయన చెవిన వేసారు. ఆయనతోపాటూ భర్త తరపు కుటుంబీకులంతా దూరమయ్యారు. భర్తకూడా ప్రతీకార ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. పోనీలే కనీసం తన వాళ్లయినా తోడున్నారు కదా అనుకుంది. ఇప్పుడు తమ్ముడి ప్రవర్తన గురించి సుమకు చెబితే. తమ చుట్టాలందరికీ తెలుస్తుంది. పుట్టింటి వాళ్లూ దూరమవుతారు. అందరికీ తనో శత్రువులా మారిపోతుంది. బాధగా అనిపించింది రోహికి.
కానీ చూస్తూ చూస్తూ తనకేమీ తెలియనట్లు ఉండలేకపోయింది. వాళ్లు తనను నమ్మకపోయినా వాడినికూడా గుడ్డిగా నమ్మరుకదా అనుకుంది.
“సొంత తమ్ముడి గురించి ఇలా చెప్తున్నావ్ సిగ్గుగా లేదూ. అయినా నువ్వు మీ మామయ్య పైకూడా ఇలాంటి పుకార్లే పుట్టించావటగా. ఎందుకైనా మంచిది ఓసారి సైక్రయాట్రిస్టు దగ్గరికెళ్లు. గతాన్ని ఎలాగూ సరిచేయలేవు. భవిష్యత్తైనా బాగుచేసుకోవడానికి ప్రయత్నించు.” అనాలనుకున్న మాటలన్నీ అనేసింది సుమ.
అంతే! తర్వాత పుట్టింటి బంధువులెవరూ ఫోన్ చేయలేదు.
తప్పెవరిదో అర్థం కావట్లేదు రోహికి. తను ఎందుకు శత్రువులా మార్చబడుతుందో కూడా తెలియట్లేదు. నిజంగానే తనకేదైనా సైకలాజికల్ ప్రోబ్లం ఉందేమో అన్న అనుమానం బలపడసాగింది. రోజులు దొర్లుతున్నాయి.
పిల్లలను కాపాడుకోవడమే ధ్యేయంగా రోజులు గడుపుతోంది రోహి. అన్ని జాగ్రత్తలూ నేర్పిస్తోంది. మనుషులను తాకడం దగ్గర్నించి ఎలా ఎప్పుడు ఎక్కడ తాకకూడదో నేర్పిస్తుంటే రోహి మనసులో ఏదో చెప్పలేని బాధ. పాపకు జరగకూడనిదేమైనా జరుగుతుందేమో అన్న ఊహతో తల్లడిల్లుతోంది.
ఓ రోజు…మధ్యాహ్నం… ల్యాండ్లైన్ అదే పనిగా మోగుతోంది.
“హలో… రోహీ వదిన… నీ నెంబరు మిస్సయింది. అన్నయ్య ఫోన్ తీయట్లేదు. అందుకే ఇలా చేసాను అని సంజాయిషీగా అంటూనే… మావయ్య గురించి నువ్వు ముందుగా అలర్టు చేసినందుకు చాలా మేలైంది. మొన్న బాబును తీసుకుని అక్కడికెళ్లాం. వారం రోజులు ఉండాల్సొచ్చింది. నువ్వన్నట్టు ఆయన నా ముందు ఒకలా మనోజ్ ఉన్నప్పుడు మరోలా ఉన్నాడు. ప్రవర్తన కొంచెం విచిత్రంగానే ఉంది. విషయం తెలుసు గనుక జాగ్రత్తలు తీసుకున్నాం…” ఇంకా ఏదో మాట్లాడుతోంది రిధిమ. రోహికి అవేమీ వినిపించడం లేదు. అంటే తను చూసింది నిజమే. వీళ్లంతా అంటున్నట్టు తనకే మానసిక సమస్యలు లేవు. హమ్మయ్య! వినోద్ కు చెబుదామని బెడ్రూంకి పరుగుతీసింది రోహి. పిల్లిద్దరూ వినోద్ కి చెరోవైపు పడుకున్నారు.
“ఫోన్ చేసింది ఎవరో తెలుసా… మీ రిధిమ. మీ ఇంటికి వెళ్లారట…” వాక్యం ఇంకా పూర్తి చేయనేలేదు….
“డాడీ నువ్వు నాకు బాడ్ కిస్ ఇచ్చావ్…” రెండేళ్లపాప వచ్చీరాని మాటలు రోహి చెవులను శూలాల్లా తాకాయి.
“ఏమ్మాట్లాడుతున్నావే… బాడ్ కిస్సేంటి?” కంగారుగా అన్నాడు వినోద్.
“అవును… బాడ్ టచ్ కూడా చేసావ్ డాడా…” ఇంకా ఏదేదో చెబుతోంది పాప.
“బాడ్ కిస్సేంటి… బాడ్ టచ్చేంటి. ఏమ్మాట్లాడుతోంది ఇది. దీనికివన్నీ ఎవరు నేర్పించారు…” వెలిసిన నవ్వు ముఖంపై పులుముకోవడానికి ప్రయత్నించాడు. అతి సహజంగా అతని మనస్సులోంచి లిప్తపాటుగా తొంగిచూసిన మంచితనాన్ని పితృస్వామ్య వ్యవస్థ ప్రొడక్టుగా మారిన అతని మెదడు స్వాగతించలేకపోయింది. అతనిలో పేరుకుపోయిన పురుషాధిక్యత, కూతురిలో కలుగుతున్న సున్నితమైన అవగాహనను అర్థం చేసుకోనే అవకాశం ఇవ్వలేదు. ఉన్నట్టుండి వినోద్ పట్టరాని కోపంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. భార్యను చిన్నబుచ్చడంలోనే భర్తగా తన గొప్పతనం రెట్టింపవుతుందని ఉగ్గుపాలతో నేర్చుకున్న అతను ఎరుపెక్కి, తిరస్కారం హేళన నిండిన కళ్లతో ఆమె వైపు చూసాడు. ఆ చూపులు ఎడతెరిపిలేకుండా అసహ్యాన్ని కురిపిస్తున్నాయి.
“నీ బుద్దులే వచ్చినట్టున్నాయ్. లేనిపోనివి చెప్పి మా నాన్నని అవమానించావ్. సొంత తమ్ముడినీ అనుమానంతో వెల్లగొట్టావ్. నీ ప్రవర్తన గురించి మొత్తం చెప్పాడు. వాడి లాప్టాప్ కూడా చెక్ చేసావటగా… ఇప్పుడిది నన్నే టార్గెట్ చేస్తోంది. తల్లికి తగిన కూతురు. అందరూ చెప్పినా వినకుండా నిన్ను ఉద్దరిద్దామనుకున్నాను… నాదీ బుద్ధి తక్కువ. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టిన అంటారు చూడు అలా… నా ఖర్మ… ఎక్కడికిపోతాయ్ హీనపు బుద్ధులు… నరకంలో బతుకుతున్నట్టుగా ఉందీ ఇంట్లో…” అని విసురుగా గదిలోంచి బయటికి నడిచాడు వినోద్.
కాళ్ల కిందున్న వెచ్చటి కార్పెట్ ఒక్కసారిగా కార్చిచ్చులా మారి తనను దావానలంలా దహించివేస్తున్నట్టుగా అల్లాడిపోయింది రోహి.
ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కచచ్చిపోయి మంచం మీద కూర్చున్న పిల్లల్ని చూడగానే మనసంతా బాధతో పిండినట్టయింది. ఒక్క అంగలో వారిదగ్గరకు చేరుకుంది. ఇద్దరినీ అక్కున చేర్చుకుంది.
కొన్ని నిముషాలు అలా తల్లి ఒడిలో ఒదిగిపోయారు పిల్లలిద్దరూ. “మమ్మా… నీకు తెలుసా మామ కూడా చెల్లికి బాడ్ కిస్ ఇచ్చాడు. చాలాసార్లు బాడ్ టచ్ చేసాడు. నువ్వు కిచెన్లో ఉన్నావ్. నేను నో అని చెబితే గేమ్స్ ఇవ్వనని అన్నాడు. చాక్లెట్లు కొనివ్వనని బెదిరించాడు. కొన్నిసార్లు ఇక్కడ గట్టిగా గిచ్చాడు” తన తొడను చూపించసాగాడు సాకేత్.
తాను ఆప్తులుగా భావించే వారే ఒక అంటువ్యాధిలా మారుతూ కలవరపెట్టినా సున్నితమైన విషయాల పట్ల పిల్లలిద్దరిలో వస్తున్న అవగాహనే వారిని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుందని సంతోషపడింది రోహి. సంతృప్తిగా పిల్లలవైపు చూసింది. అరుణార్ణవమైన ఆ సాయంకాలపు సూర్యకిరణాల వెలుగులో వారి ముఖవర్చస్సు దేదీప్యమానంగా వెలిగింది.