ప్రజాస్వామిక పోరాటాలను, నిజాయితీగా గొంతు విప్పి అన్యాయాన్ని నిలదీసే బుద్దజీవులను,
ఆలోచనాపరులను, సంస్థలను, సంఘాలను ప్రభుత్వాలు ఎప్పుడూ అణచివేయాలనే చూస్తాయి.
ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు సామాన్యుల గురించి ఉద్ధరింపు మాటలు మాట్లాడి ప్రభుత్వంగా పీఠమెక్కినాక అదే సామాన్య ప్రజల హక్కులను కాలరాయడం ఆధునిక రాజ్యాల అసలు స్వరూపం.
కనుకనే ఇటీవల మన దేశంలో అత్యంత ప్రజాస్వామికంగా, నిబద్ధతతో జరిగిన రైతు ఉద్యమాలను అణచి వేయాలని పాలకులు అనేక ఎత్తులు వేశారు. ఎన్నో పేర్లు పెట్టారు. నిందలు వేశారు. రైతులు ఉద్యమ బాట పట్టిన దారిలో మేకులు గుచ్చారు. స్వతంత్ర దేశంలో పౌరులు నడిచే దారిలో కందకాలు తవ్వినారు. అత్యంత దారుణంగా ట్రాక్టర్ల కింద తొక్కించి ప్రాణాల్ని, బతుకుల్ని చిదిమినారు. అయినా అలుపెరగని,
వెనకడుగు వేయని రైతుల పోరాటపటిమకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
తమ ఆవేదనలో, తమ ఆక్రోశంలో న్యాయం ఉందని నమ్మిన భూమీపుత్రులు నిర్భయంగా ముందుకు నడిచిన తీరుకి ప్రపంచం ముక్కుమీద వేలేసుకుంది. తాము నిత్యం పొలంలో పిడికెటబట్టి దున్నే నాగలిని భుజాన పెట్టుకుని ఆయుధంగా ఎక్కుపెట్టారు. తామెత్తిన పిడికెళ్లలో నిజం వుందని ప్రపంచానికి చెప్పారు. తాత్కాలికంగానైనా నిరంకుశపు నిర్ణయాలకు కళ్లెం వేశారు. కంకి, కొడవలి సుత్తి తోపాటు ఇపుడు నాగలి కూడా ప్రజా ఉద్యమాల ప్రతీక అయింది. డెబ్భై ఐదేళ్ళ అమృతోత్సవాలు జరుపుకుంటున్న స్వాతంత్ర్య దేశంలో దేశానికి అన్నం పెట్టే హాలికులు రోడ్లపైకి వచ్చి తమ ఉనికికై మరో మహా పోరాటాన్ని మహోన్నతంగా జరిపిన సంధర్భంలో మనం జీవించాం. కొన్ని విషాదాల్ని చవి చూశాం.
ప్రగతిశీల ఆలోచనలెప్పుడూ మడికట్టుకుని నిల్చోవు. పడికట్టు పదాల్లో బంధీకావు.
పోరాటం, ఉద్యమం అనే మాటలు ఎప్పటినుంచో వింటున్నవే అయినా అవి కాలిక స్పృహతో ఎప్పటికప్పుడు నూతన వ్యక్తీకరణలను,నూతన పదబంధాలను, ఆలోచనలను నిర్మించుకుంటాయి.
సామాజిక అభ్యుదయానికి, అభివృద్ధికి దోహదపడుతూ ఉంటాయి.శ్రామికుల పక్షం,కార్మికుల పక్షం,రైతుల పక్షం నిలబడి వారి హక్కులకై, వారి అభ్యున్నతికై ప్రజాస్వామిక ఉద్యమాలు,ఉద్యమ సంస్థలు తమ బాధ్యతల్ని శక్తివంతంగా నిర్వహిస్తూ వుంటాయి.ఆ క్రమంలోనే పురుడుపోసుకుంది కవి కొమ్మవరవు విల్సన్ రావు గారి నాగలి కూడా ఆయుధమే అనే కవిత. (ఈ సంపుటిలోనే ఇదే శీర్షికతో మరో కవిత కూడా వుంది) తరువాత సమకాలీన సామాజిక వాస్తవికతకు అద్దం పడుతూ ,మానవీయ విలువల్ని కూడగడుతూ ఈ పేరుతోనే కవితా సంపుటిని వెలువరించారు. కవి యొక్క సామాజిక బాధ్యతకు,నిబద్ధతకు అద్దంపట్టే కవిత ఇది.ఈ కాలంలో జరిగిన గొప్ప పోరాటానికి గుర్తుగా ఆ కవితా సంపుటికి “నాగలి కూడా ఆయుధమే”అనే పేరునే పెట్టి ఔచిత్యం పాటించారు. ఔన్నత్యాన్ని ప్రదర్శించిన కవి విల్సన్ రావు అభినందనీయులు.
“మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్న
నా అంతర్భాగాలపై యుద్ధం ప్రకటిస్తూ
సారవంతమైన నేలకు మొక్కుతూ
భూమి గుండెకు ఊపిరినై నిత్యం జ్వలిస్తాను..” అంటూ ‘అనివార్యం’గా చైతన్యపు దివిటీని సమాజం చేతికందిస్తున్న కవి చేతులకు నమస్కరిస్తూ, వర్తమానకాలం గుండె చప్పున్ని వింటాం!
తామెన్నుకున్న ప్రభుత్వాలే తమ పాలిట అన్యాయానికి ఒడిగడుతూ,కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే చర్యను ఖండిస్తూ రైతులు చేసిన ఉద్యమ నేపథ్యాలను, రైతుల తెగువను నేల గుండెలోకి వొంపిన మట్టి మనుషుల స్ఫూర్తిని పులుముకునేందుకు కవితలోని పాదాల వెంట ప్రయాణించండి. “ఔను…నాగలి కూడా ఆయుధమే” అని నిటారుగా నిలబడి మాట్లాడుతాం.
*నాగలి కూడా ఆయుధమే.!*
సంఘర్షణ మాకేమీ కొత్త కాదు
శ్రమకు ప్రతిఫలంగా
కలలే మిగులుతున్నప్పుడు
కలగనటమే ఒక దుశ్చర్య ఐనప్పుడు
నిత్యం మట్టికి మొక్కడమొక
సహజాతం మాకు.
భూమికీ ఒక గుండె ఉందని
ఆ గుండెలో కొంత తడి ఉందని తెలిసాక
దాని ఊపిరితో ఊపిరి కలిపి
ఒక జ్వలనచేతనలో
నాలుగు చెమట చుక్కలు
ధారపోయకుండా ఉండలేము.
అలసటెరుగని దుక్కిటెద్దులు
నెమరేతకూ దూరమై
భద్రత లేని సాగుతో
అభద్ర జీవితం గడుపుతున్న
నిత్య దుఃఖిత సందర్భాలు!
ఆకలి డొక్కలు నింపే
చట్టాలు చేయాల్సిన చట్టసభలు
భూమి గుండెకు ఊపిరి పోయడం
ఒక మానవోద్వేగమని తెలియక
నాగలిని నిలువునా చీల్చేస్తున్నప్పుడు
అభివృద్ధి ఎరుగని చట్టాలన్నీ
దారం తెగిన పతంగుల నాట్య విన్యాసాలే!
ఇప్పుడు
నాగలి ఒంటరి కాదు
నాగలి ఒక సమూహం
నాగలి ఈ దేశపు జీవితం
నాగలి ఉత్పత్తికి జీవం
నాగలే మా సర్వస్వం
ఇప్పుడు నాగలే మా ఆయుధం..!