ఓ దుఃఖనది వ్యతిరిక్త ప్రవాహం

పాదం కింద కాలం. ఇది పాదం ఆక్రమించిన కాలం కథ కాదు. ఒకానొక కాలం మింగిన పాదాల కథ. నడుస్తున్న పాదాల కింద మంచులా కదిలిపోయి, పాదాల దేహాలకు కాకుండా పోయిన కాలం కథ. ఇది.. మూడడుగుల నేలడిగి; ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఖగోళాన్ని ఆక్రమించి మూడో అడుగు బలి చక్రవర్తి తల పై మోపిన వామనుడి విజయ గాథా గానం కాదు. అది చక్రవర్తి తలపై స్థానం పొందిన పాదం అయితే ఇది చక్రవర్తుల హస్తాల్లో నలిగిన పాదం. జానెడు పొట్ట నింపుకునేందుకు కన్న ఊరు విడిచి పని వెతుక్కుంటూ పది పదుల దేశాలైనా‌ దాటే దిమ్మరికి, చివరికి ఎక్కడా ఆరడుగుల నేల దక్కని వ్యదార్థ దుఃఖ గీతం ఇది.

ఈ గీతం రాసేందుకు కవి తానే ఓ దుఃఖనది గా మారి, కాలంలోకి వెనక్కి వ్యతిరిక్తమై ప్రవహించి ఆ నది పుట్టిన మూలాల్ని స్పృశించి వర్తమాన కాలంలోకి పోటెత్తాడు. ఇందుకు కవి లోలోపల ఎంత తండ్లాడి ఉంటాడో. లేదంటే క్రీస్తు పూర్వం లోకి ప్రయాణించి.. అలనాటి ఈడెన్ గార్డెన్ లో రెండు దేహాల పలాయనం నుంచి మొదలేసి, ‘తిరగబడ్డ జీవితేచ్ఛ పాదాలు తొడుక్కుని పాదాలకు దేహాలను తొడుక్కుని పరుగులు తీసిన వలస కావ్యం’ రాస్తాడూ!! ఈ రెండు సంఘటనల మధ్య భూమి భ్రమణం చిత్రిస్తాడు. భూమ్మీది మనుషుల చక్రభ్రమణం దృశ్యమానం చేస్తాడు. అనాదిగా వలస అనివార్యమైన వాస్తవాలు చరిత్ర చూపుతుంటే, ఈనాటి వలసదుఃఖం అలుసెట్లైందన్నది కవిని నిలువనీయని ప్రశ్న. దానికి సమాధానం అన్వేషిస్తూ సాగిన తవ్వకాల్లో బయటపడ్డ పురావాస్తవాల చిట్టా ఈ దీర్ఘకవిత.

‘దేహానికీ ఆత్మకీ మధ్య
కాలం శిథిలాలు కాలుతున్న వాసన’
ఎన్నిసార్లు తన మనోలోకంలో, కాలాలు దాటి దేశాలు చుట్టి శోధించి ఉంటాడో కవి. ఎన్నెన్ని వలసలు, ఎన్నో శిథిలమైన బతుకులు. మరి ఇప్పటి ఈ దుఃఖం విశేషం ఏమిటి!?
ఇది కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన సమయం గురించని మనకు తెలుసు. ప్రపంచమంతా గుక్క పట్టి ఏడ్చిన సందర్భం‌. ఈ కవి కూడా అలా శోకించిన వాడే. మన దేశం కాస్త ప్రత్యేక దుఃఖం లో మునిగిపోయింది. వందలాది వలసజీవులు సొంత ఇళ్ళకు చేరుకోవాలని ఆశపడ్డారు. కనీసం కన్నవారిని, ఉన్న ఊరిని కావలించుకుని, ఆకలిని మరిచి పొట్టలో కాళ్ళు ముడుచుకొనైనా కాలం దాటేయచ్చని కాంక్షించి; కిరాణా, రవాణా స్తంభించిన సమయంలో గత్యంతరం లేక కాలినడకన వేల మైళ్ళ ప్రయాణం ప్రారంభించారు. గమ్యం చేరినవారు అతికొద్దిమంది. గమ్యానికి ముందే కాలంలో కలిసిపోయినవారు, మధ్యలోనే వంచించబడినవారు అనేకం. ఆ అనేకుల విషాదానికి సామాన్య ప్రేక్షకునిలా సాక్షీభూతమైన కవి తన లోపలి సంఘర్షణను ఒకింత తీవ్రంగానే వినిపించాడు.
‘ఇది చేతుల పాచికలాటలో
పాదాలు ఓడిన మహాభారతం
అయినా పాదాలు బతికే ఉంటాయి
పాదాలకు చెవులుంటాయి కళ్ళు ఉంటాయి
అంతిమ పర్వాన్ని పాదాలే రాస్తాయి’

ఏ దేశమైనా విపత్తులు విపరీతాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ దేశ పాలకులు వాటిని ఎలా నిర్వహించారు అనేది ముఖ్య భూమిక వహిస్తుంది. ఇక్కడే పాదాలు పావులైంది.
‘నికరాగువా నుంచి మా ఊరు నిడమర్రు దాకా
ఊపిరి బిగబట్టిన ఉన్మత్త నిరీక్షణ’
ఇక్కడ కవి అనేక వలసలచే బహు భాషలు, సంస్కృతులు; పలు ఆధిపత్యాల పాలనల కింద వివిధ ఘర్షణలు పోరాటాల ఫలితంగా స్వతంత్ర దేశమై నిలిచిన నికరాగువా దేశ ప్రస్థానం మన గమనింపుకు తెస్తున్నాడు. ఇక్కడ కవి చెప్పాలనుకున్న అంశానికి నికరాగువా గొప్ప ప్రతీక గా నిలిచింది. కవిలో జరిగిన అంతఃఘర్షణ, కవిత్వంలో దీర్ఘంగా సాగిన సంవేదన అనేక ప్రశ్నలను తొలుచుకుంటూ వెళ్ళింది. అసలీ వలస ఏనాటిది? ఎక్కడిది? ఎందుకోసం?
‘వెలుగు కోసం తిండి కోసం
వలసే వలస’

తిరుగులేని ఈ కారణాలను ఏ విధంగా తోసిపుచ్చగలం. ఈ వలస ప్రయాణం లక్షల సంవత్సరాలది అంటూనే కవి.
‘అప్పుడే కాదు ఎప్పుడూ
ఆకలే నన్ను నడిపించింది
నా ఆకలి నుంచే
నగరాలు పుట్టాయి
నా ఆకలి నుంచే దేశాలు పుట్టాయి
నా ఆకలి నుంచే యుద్ధాలు పుట్టాయి
నా ఆకలి నిర్మించింది ధ్వంసించింది
ఇప్పుడూ నా ఆకలే నన్ను తరుముతోంది
అప్పుడు ఆకలి నాకు పుట్టింది
ఇప్పుడు ఆకలికి నేను పుట్టాను’
ఇలా ఈ మొత్తం విషాదానికి మూలాన్ని తడిమారు. ఇక్కడి వరకూ ఇలాంటి తార్కికత చదువరి మెదడులో ఆలోచనలు రగిలిస్తుండగానే, తర్వాతి వాక్యాల్లో ‘ఆకలి పాదాల ఆఖరి నడక’ అన్నచోట ‘గుట్టలుగా పడి ఉన్నరాతి పేగులు పిగిలిపోవటమే’ కాక చదువుతున్న పాఠకుని మనసు కెరలిపోతుంది.

‘చరిత్రలో ఇప్పుడు
మీరే యుగంలో ఉన్నారో కానీ
నేనింకా
ఆహార సేకరణ కాలంలోనే ఉన్నాను’
అన్నప్పుడు ఒక అపరాధ భావనేదో గుచ్చిపోతుంది.
‘ఏ దేశం నీదంటారా.. నువ్వెటుపోతున్నావంటారా..
మీకు అర్థం కాని వ్యర్థ అవయవాన్ని
ఏ దేశం రమ్మంటే అదే నా దేశం
ఏ దేశం పొమ్మంటే అదే నా దేశం’
ఈ కాంట్రడిక్టరీ స్టేట్మెంటే వాళ్ళ హోమ్లెస్ స్థితిని గట్టిగా చెప్తుంది.
‘ఆధార్ కార్డ్ లేని నిరాధార పాదాలతో
భూమి చుట్టూ
ఇంత భూమి కోసం పరుగులు’
ప్రాణమున్న మనుషుల జాబితాలో కూడా నమోదు కాని జీవులు వీళ్ళు అని దృష్టికి తెస్తారిక్కడ. రామాయణ ఖండికల్ని, మహాభారతంలో చిన్న కథల్నుంచి మొదలుపెట్టి; సింధు, నైలు నాగరికతల ఆనవాళ్ళని జమిలిగా తలుస్తూ ‘బలవంతులు బలహీనుల్ని చేసిన కుటిల కుట్రల్ని బద్దలు కొట్టాలి’ అని కర్తవ్యం ముందుంచుతారు.

‘సంస్కృతం నేను గ్రీకు నేను లాటిన్ నేను
రుగ్వేదం విప్పండి
వృతాసురుడి వాసన కొడుతోంది’
ఇతిహాసాల వృత్తాంతాలు, సూక్తాలు ఉపనిషత్ ల ప్రస్తావన చేస్తూ హేతువులు ఆధారాల సహితంగా బలంగా చర్చకు పెట్టారు‌ కవి. యుగాలుగా నిజాలపై పేర్చిన నిప్పుల్ని కడిగే ప్రయత్నం చేశారు. ఈ పది పన్నెండు పేజీల పాటు ఈ దీర్ఘకవితను మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేయిస్తుంది.

‘ఇప్పుడు నేను నా దేశం గురించి మాట్లాడతాను’ అని మొదలెట్టాక పేజీలన్నీ శ్రమజీవుని చెమట, కన్నీళ్ళతో తడిసిన వాక్యాల వర్షం. ఈ వాన కవి గుండెల్లో కురిసి మన కళ్ళల్లో వెలుస్తుంది‌.
‘పేజీలు పేజీలుగా చిట్లిపోయి కుమిలిపోతున్న
రంగు రంగుల రాజ్యాంగ స్వప్న కావ్యం’ ఆవిష్కృతమవుతుంది.
మొత్తం వలస ప్రస్థానానికి ‘ఒక అందమైన ఆంగ్ల అనువాదం చేస్తా’నంటాడు కవి ఒక చోట. Exodus. కొన్ని సమూహాల నిత్యచలన జీవితాలకు అందమైన పేరు.
‘చలికాలం నా చర్మం మీద
కోరలు నూరిన జాడలు
మండే ఎండ నా గుండెల మీద
నిప్పులు చెరిగిన సెగలు
నా కళ్ళల్లో కురిసిన తర్వాతే
వాన ఈ నగరాన్ని తడిపింది’

తన కవితా శక్తినంతా ధారపోసి రాశాడా కవి అనిపించేలా చేసిన రచన ఇది.

‘ఇంటికి పోవడం దేశద్రోహం కాదు’
*
‘ఇళ్ళంటే ఇళ్ళే
అక్కడేమీ విస్తళ్ళలో
జీవితం పొగలు కక్కదు
అక్కడ కూడా చెంపల మీద
చీకటినే తుడుచుకోవాలి
చీకటి పొట్టలో మోకాళ్ళు పెట్టుకు ముడుచుకోవాలి
అయినా నేను ఇంటికే పోవాలి
ఆకలితో చచ్చినా
అక్కడ కనీసం శవాలను గుర్తుపట్టే
మరికొన్ని శవాలుంటాయి’
హృదయం ద్రవించే వాక్యాల మధ్య కరోనా కాలంలో వలస కూలీలను ట్రీట్ చేసిన చర్యలన్నీ వరుసగా గుర్తొస్తాయి. దారి పొడుగునా ఆహారం, నీళ్లు అందిస్తున్న సహాయ సంస్థల వద్ద క్యూ లు గుర్తొస్తాయి. వాళ్ళ నడకను నివారించేందుకు వరుసగా కూర్చోబెట్టి నీళ్ళ పిచికారీ చేసిన అమానుషం గుర్తొస్తుంది. ఎండిన రొట్టెల పక్కన పట్టాలపై పడి ఉన్న శవం గుర్తొస్తుంది. ఇంకా ఇంకా…

‘మీరు మనుషుల్ని కలిస్తే జబ్బు పడతారు
నా నుంచి విడిపోతే నగరం జబ్బుపడుతుంది’
వాళ్ళకు గుర్తింపే ఇవ్వని చోట వాళ్ళ ఉనికికెంత ఆవశ్యకత ఉందో ఈ వాక్యం తేల్చేస్తుంది.
‘నేనేమీ చచ్చిపోను
కొన ఊపిరితోనైనా బతికే ఉంటాను
నా కోసమో నా పిల్లల కోసమో కాదు
మీ కోసం.. మీ నగర దీప కాంతులు కోసం’ అని తృణప్రాయంగా ధిక్కరించటం ముల్లులా పొడుస్తది
కరోనా కొన్ని సత్యాల్ని బయల్పరించిందేమో కానీ,
‘ఇది నిరంతర లాక్ డౌన్
నాది అనంత వలస’ అని ముగిస్తారు.
కవిత్వంలో సహజంగా వస్తువు గురించో శిల్పం గురించో మాట్లాడతారు. ఈ దీర్ఘ కవిత లో కథనం విశిష్టమైనది అంటాను. అదే శిల్పాన్ని ప్రత్యేకంగా నిలిపింది. వస్తువును పటిష్టంగా ప్రకటించింది. ఈ కవితను ఓన్ చేసుకున్న పాఠకురాలిగా ఎగ్జాక్ట్ గా అనిపించింది ప్రతిక్రియగా చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ గా సాగుతుందేమో. బహుశా చెప్పాల్సిందెంతో ఉందని కవి బలంగా భావించడం వల్లే ఇది దీర్ఘకవిత రూపంలో అమిరిందనుకుంటాను.

నా ఊహ ప్రకారం తానింకా చెప్పవలిసింది మిగిలే ఉందని కవి తండ్లాడుతునే ఉన్నాడేమో! దుఃఖనది ప్రవహిస్తునే ఉందేమో! కవిలోని మథనం ఇంకా అంతం కాలేదేమో!

( ఫిబ్రవరి 12 ఆదివారం సాయంత్రం విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో విడుదల కానున్న ‘పాదం కింద కాలం’ దీర్ఘ కవితకు రాసిన ముందుమాట)

ఖమ్మం వాసి. చదవడం ఇష్టం. కవిత్వం, కథలు, విశ్లేషణ వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో 'కవితాంశ' కాలమ్ నిర్వహిస్తున్నారు. తెలుగు తో పాటు వివిధ భాషల కవిత్వం పరిచయం చేస్తున్నారు.

Leave a Reply