ఒక శరదృతువు రాత్రి

ఇంగ్లీష్ అనువాదం – ఎమిలీ జాకలెఫ్ & డోరా బి.మాంటెఫియోర్
తెలుగు అనుసృజన – శివలక్ష్మి

(జారిస్టు రష్యా చివరి కాలంలో అట్టడుగు రైతుల, పేదల, మహిళల జీవితాల గురించి మాక్సిం గోర్కీ అద్భుతంగా రాసిన అందమైన కథ “ఒక శరదృతువు రాత్రి” (An Autumn Night (ఏప్రిల్ 1902)) అని విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ కాలంలో మహిళలపట్ల సమాజ వైఖరిని గోర్కీ చిత్రించడం ఈ కథలో చూస్తాం. అన్ని సమాజాల్లోనూ మహిళలపట్ల ఈ తీరు ఇప్పటికీ మారలేదు. ఇందులో ఒక 18 సంవత్సారల యువకుడు మాస్కోలో ఒక గడ్డకట్టుకుపోయే చలిరాత్రిలో, దహించుకుపోయే ఆకలితో ఆహారంకోసం తీవ్రంగా వెతుకుతున్నప్పుడు తనలాగే ఆకలితో నకనకలాడుతున్న ఒక యువతిని చూస్తాడు. జారిస్టు సమాజంలోని అంచులకు నెట్టివేయబడిన మహిళల ధైర్యం, ప్రేమలకు ఒక శక్తివంతమైన ప్రకటనతో యువకుడి పాత్ర ద్వారా నివాళి అర్పిస్తాడు గోర్కీ!)

ఒక శరత్కాలపు చలిరాత్రి నా పరిస్థితి చాలా అసౌకర్యంగా పరమ ఘోరంగా ఉంది. నేను అప్పుడప్పుడే ఒక పట్టణం చేరుకున్నాను. అక్కడ నాకు తెలిసిన ఒక్క మానవమాత్రుడు కూడా లేడు. నా జేబులో ఒక్క పైసా లేదు. కనీసం నా చెయ్యి ఆనించుకునే చిన్న చోటైనా లేదు ఆ ఊరిలో.

ఒకటి రెండు రోజులు నాదగ్గరున్న బట్టలలో మరీ తప్పనిసరిగా అవసరం అనుకున్నవి తప్ప తక్కినవన్నీ అమ్ముకుంటూ బతికాను. నా బట్టలన్నీ ఐపోయాక ‘అవుస్ట్యా’ అనే చోట రేవులు, డాక్ యార్డ్ లున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళి పని చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. తీరా నేనక్కడికి చేరేసరికి అది అప్పటికే అక్టోబర్ చివరి వారం కావడంతో పని సందడి, ఆర్భాటమేమీ లేకుండా నిర్మానుష్యంగా ఉంది.

తడి మట్టిని కాళ్ళతో అటూ ఇటూ బాగా తొక్కుతూ, నా కాళ్ళకింది నేలను ఎవరైనా పారేసిన ఆహారం ఎంత చెత్తదైనా సరే దొరుకుకుతుందేమోనన్న ఆశతో స్కాన్ చేసి పారేశాను. అసలేమీ తిననందున నా పరిస్థితి ఎంగిలి ఆహారంకోసం ఆబగా చూసే స్థితికి దిగజారింది.

కడుపు దహించుకుపోతున్నప్పుడు తట్టుకోలేక నేనంత హీనమైన స్థితికి దిగజారాను. జీవితంలో ఈ ఒక్కసారికి నా ఆకలి బాధ తీరితే ఈ జన్మకదే మహదానందం అనుకుంటూ నిర్మానుష్యంగా ఉన్న గుడిసెలవైపూ, చిల్లర కొట్లవైపూ దొంగ నక్కలాగా పొంచి పొంచి చూశాను. ఇప్పుడున్న సాంఘిక పరిస్థితుల్లో మానసికమైన ఆకలి తీరే పరిస్థితులున్నాయి కానీ దేహార్తినీ, ఆకలిదప్పుల్ని తీర్చుకునే దారి లేదు గాక లేదు!

బ్రహ్మాండంగా అలంకరించబడిన భవనాల ముందునుంచి దేశదిమ్మరిగా వీధుల వెంట తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఆ ధనవంతులు బయటికి ఎంత విలాసవంతంగా కనిపిస్తున్నారో లోపల జీవితం కూడా అంతే అనుకుంటారు. ఆర్కిటెక్చర్, పారిశుధ్యం, ఎలివేషన్, కళలు మొదలైన నిర్మాణ రంగాల్లో సైన్స్ సాధిస్తున్న అద్భుతమైన ప్రగతి చనిపోవాలనుకుంటున్న వానికి కూడా విజయగర్వంతో కూడిన ఒక నిర్దిష్ట ఆలోచనలు రేకెత్తిస్తాయి! మంచి బట్టలు, డబ్బూ – దర్పం గలవారిని లోకం సముచితంగా సత్కరిస్తుంది, మా లాంటి పూటకు గతిలేని, చింకి బట్టలవారిని తెలివితేటలున్నప్పటికీ చీదరించుకుంటుంది. కాని పేదవారి మనసుల్లో ఉండే తేజస్సు గొప్పవారికుండదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొన్నిసార్లు హాస్యపూరితమైన పోలికలు వాళ్ళ కనుకూలంగా చేసుకునే అవకాశాలొస్తాయి.

సాయంత్రమైంది. భోరున, కుండపోతగా కురిసే వర్షం చెత్తనీ, బురదనీ, మురికినంతటినీ శుభ్రపరిచింది. ఉత్తరం వైపునుండి ఉధృతమైన గాలిదుమారం మహోద్రేకంతో చెలరేగింది. ఆ గాలి చేస్తున్న చప్పుళ్ళు చెవులు చిల్లులు పడే శబ్దాలతో ఖాళీగా ఉన్న చిన్న చిన్న దుకాణాలు, గుడిసెలు దద్దరిల్లి కంపిస్తున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న ఓడ్కా షాపుల కిటికీల తలుపులు గడగడా ధన ధనా కొట్టుకుంటున్నాయి.

ప్రచండంగా భీకరంగా వీచే గాలులకు అలలు పెద్ద ఎత్తున వాటి తెల్లని నురగల్ని నింగికి తాకిస్తున్నాయా అన్నట్లు ఎగిరెగిరి పడుతూ తీరాన్ని తాకుతున్నాయి. మళ్ళీ ఉధృతమైన ఆ నదీతరంగాలు ఆత్రంగా ఎదో ముంచుకుపోతున్నట్లు వెనక్కి తిరిగి బయలుదేరిన చోటికి వచ్చి ఒకదానినొకటి ఒరుసుకుంటూ ఆఘమేఘాలమీద దూకిపడుతున్నాయి.

శీతాకాలం అతి సమీపంలో అదేరోజు వచ్చేస్తుందేమోననడానికి సంకేతంగా భయానకంగా వీచే గాలుల నుండి, మంచు దుప్పటిని తప్పించుకోవడానికా అన్నట్లు సముద్రం విఫలయత్నం చేస్తుంది. ఆకాశం నల్లగా మేఘావృతమైంది. చల్లని తుంపర తగిలిన చోట కోసుకుపోతుందేమోనన్నట్లుగా మొదలైంది. కొంచెం సేపట్లో చినుకులు కనిపించాయి.

అసలే నిరాశా, నిస్పృహలతో నేనుంటే, నాకు చుట్టూ ఉన్న భూభాగం వికారంగా ఉన్న దుంగలతోనూ, విచ్చిన్నమై కొట్టుకొచ్చిన చెట్టు మొదళ్లతోనూ, ఆ చెట్టు వేళ్ళదగ్గర ఆగిపోయి విరిగి పడున్న ఒక పడవతో ఇంకా విషాదంగా కనిపించింది. విరిగి ముక్కలైన పడవ, గడ్డ కట్టే చలికి ఆకులన్నీ రాలిపోయిన రెండు పెద్ద వృక్షాలు కనిపించాయి. వాతావరణం పరమ భీభత్సంగా, నిర్మానుష్యంగా ఉండి ఏదీ పనికిరాకుండా పోయే దిక్కుమాలిన స్థితి దాపురించింది. ఈ విషాదానికి తుది మెరుగులద్దుతున్నట్లు ఆకాశం అంతులేకుండా రోదిస్తున్నట్లు జోరుగా వర్షిస్తుంది.

నన్నావరించిన ఈ భీతావహ వాతావరణం చూసి ఈ ప్రపంచంలోని ప్రతిదీ సర్వనాశనమైపోయి నేనొక్కణ్ణే జీవంతో మిగులుతానేమోనని పించింది. నా అంతం కూడా ఎంతో దూరం లేదు. మంచుకి గడ్డకట్టిపోయే పరిస్థితి పొంచి ఉందని, నాకు చావు ఖాయంగా అతి దగ్గరలో ఉందనిపించింది.

తేమగా చిత్తడి చిత్తడిగా ఉన్న నేల మీద నడుస్తున్నాను. నా దంతాలు ఆకలి బాధకీ, చలి వణుకుడుకీ ఒకశ్రుతిలో పట పట శబ్దాలు చేస్తుంటే, అవి నా ఆలోచనల కనుగుణంగా వంత పాడుతున్నట్లుంది. అకస్మాత్తుగా ఒక దుకాణం మూలవైపుకి నా చుపులు చురుగ్గా ప్రసరించాయి. ఒక మహిళ దుస్తుల్లో ఉన్న ఒక ఆకారం వంగి ఉండడం గమనించాను. ఆమె బట్టలు పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి. నేనక్కడ ఆగిపోయి ఆమె ఏం చేస్తుందో చూడాలని ప్రయత్నించాను. మార్కెట్ లోని ఒక దుకాణంలో ఆమె తన చేతుల్తో, గోళ్ళతో తడిమట్టిలో గీరుతూ గొయ్యి తవ్వాలని ప్రయత్నిస్తుందని తెలిసింది.

ఆమె పక్కన కూర్చుంటూ “ఎందుకలా చేస్తున్నారు?” అని అడిగాను. మూలుగు లాంటి ఏడుపుతో ఒక్క ఉదుటున లేచింది. ఆమె నా ఎదురుగా నిలబడింది. ఆమె పెద్ద పెద్ద బూడిద రంగు కళ్ళల్లో విపరీతమైన భయం స్పష్టంగా కనిపించింది. బహు సుందరంగా, అందమైన ముఖంతో ఉన్న ఆమె కూడా దాదాపు నా వయసుదేనని గమనించాను. కానీ గోళ్ళతో రక్కినట్లున్న మూడు నఖక్షతాలతో వికృతం చేయబడ్డ ముఖాన్ని చూసి నిరాశ, బాధ కలిగాయి. ఈ గాయాలు పచ్చిగా ఆమె అందాన్ని చెడగొడుతూ అడ్డంగా ఉన్నాయి. ఒక గాయమైతె సూటిగా ముక్కు బ్రిడ్జ్ కి పైబాగాన ఉంది. మిగిలిన రెండూ రెండు నల్లటి కళ్ళలాగా ఉన్నాయి. ప్రజల రూపురేఖల్ని మార్చగలిగిన ఒక చిత్రకారుడి చేతినుంచి సృజించబడినట్లు అన్నీ ఒకే సైజు లో ఉన్నాయి. ఆ అమ్మాయి నన్ను అదే పనిగా చూస్తూ నిలబడింది. నెమ్మదిగా కళ్ళలో ఇంతకు ముందున్న భయం మాయమైపోయింది. చేతులకున్న ఇసుకను దులిపేసుకుంది. చేతిలోని జేబుగుడ్డను శుభ్రం చేసుకుని చిన్నగా వణుకుతున్న గొంతుతో “మీరు కూడా ఆకలిగా ఉండి ఉంటారు. అలాగయితే కొంచెం ఇటొచ్చి కాసేపు ఈ నేలను తవ్వి మట్టిని తియ్యండి. నా చేతులు నొప్పి పుడుతున్నాయి. అటు చూడండి,” అంటూ ఆమె సంభాషణని పొడిగిస్తూ తాను తవ్వడానికి ప్రయత్నిస్తున్న దుకాణం వైపుకి తలను తిప్పి చూపిస్తూ, “ఆ దుకాణాన్ని ఇంకా పూర్తిగా మూసివెయ్యలేదు కాబట్టి కొంచెం బ్రెడ్ కొంచెం సాస్ మనకు ఖచ్చితంగా దొరుకుతాయి”. అని అంది

నేను తవ్వడం మొదలెట్టాను. కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ నన్ను గమనించింది. తర్వాత నా పక్కనే చతికిలబడి గొంతుక్కూర్చుని తనూ తవ్వడం మొదలుపెట్టింది.

ఈ నిశ్శబ్ద సమయంలో నా మనసులో చెలరేగే ఆలోచనల్ని చెప్పడం చాలా కష్టం. సభ్య సమాజం విధించిన న్యాయ నిబంధనలు, నైతిక సూత్రాలు, ఆస్థి హక్కులు, పౌర హక్కులు మొదలైన తెలివిమంతులు చెప్పే సమస్యాత్మక విషాయాలేవీ మా బుర్రల్లో లేవు. కానీ గందరగోళపు ఆలోచనలన్నీ కలవరపెడుతున్నాయి. నిజం చెప్పాలంటే కడుపు దహించుకు పోతున్నప్పుడు ఎప్పుడెప్పుడు నాకష్టానికి, శ్రమకీ ఫలితం దొరుకుతుందా అని ఆకలి మనసంతా ఆక్రమించి అది తీరే మార్గం తప్పించి వేరే ఏ ఏవిషయం గురించీ పట్టడం లేదు. త్వరగా సాయంత్రమైంది. చుట్టూ సంజె చీకట్లు, దిగులు, కాలు కదిపితే జారిపోతామేమో ననిపించే బురద, జివ్వుమని వీచే చలిగాలులు, గడ్డ కట్టుకుపోయే చలి – క్షణ క్షణనికీ ఇవన్నిటి సాంద్రత ఇంకా ఇంకా పెరిగిపోతూ చిక్కని చీకట్లు ముసురుకున్నాయి. అలల శబ్దం దూరంగా వినబడుతుంది కానీ వర్షం దడ దడా ఫెళ ఫెళా దుకాణాపు అంచుల్ని కంపింపజేస్తుంది. మరీ దూరం నుంచి కాకుండా కొంచెం దగ్గరగా మేము వాచ్ మేన్ విజిల్ విన్నాం.

“దుకాణానికి ఫ్లోరింగు ఉందా లేదా?” నాతోడుగా ఉన్నమ్మాయి గొంతు తగ్గించి అడిగింది.

నాకు సరిగా అర్ధం కాక జవాబివ్వలేదు.

“అసలు ఈ దుకాణానికి ఫ్లోరింగు ఉందా లేదా అని నేను నిన్నడుగుతున్నాను. ఎందుకంటే గచ్చు గనక ఉంటే మనం ఎంత తవ్వినా ఉపయోగముండదు. మనకి మందమైన గచ్చు అడ్డమొస్తే ఏంచేయగలం? దానికంటే తాళాలు బద్దలు కొట్టడం వల్ల కాస్త ప్రయోజనముంటుంది కదా” అని అంది.

కాంతివంతమైన ఆలోచనలు ఆడవాళ్ళకు తరచుగా వస్తుంటాయి. కానీ ఇలాంటి “సంతోషకరమైన ఆలోచనలు” వాళ్ళ మనసుల్లోకి చాలా అరుదుగా వస్తుంటాయి. నాకు వాటి పట్ల చాలా గౌరవముంది. ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాను.

నేను ఆమె చెప్పినట్లే తాళం పగలగొట్టడానికి రెంచ్ తో తాళాన్ని, మిగిలిన భాగాన్ని తోశాను. నా సహాపరాధి వెంటనే కిందికి వంగి, పాములాగా మరీ నేలమీదికి జారిపోయి దుకాణం కప్పుని పైకి ఎత్తేసింది. ఆశ్చర్యానందానాలతో చిన్న కేకపెట్టింది. “వెల్ డన్ మై బ్రేవ్ బాయ్!”

ఒక గొప్ప వాగ్ధాటి గల పురుషుడు కీర్తించడం కన్నా ఒక యువతి చిన్న పదంతో పొగిడినా చాలు కదా. కానీ ఇప్పుడున్నంత హాయిగా సరసంగా నేనప్పుడు లేనందువల్ల పట్టించుకోలేదు. ఆ అమ్మాయి ఆశ్చర్యంగానూ కాస్త అసహనంతోనూ అడిగాను: “నీకక్కడ ఏం కనిపించింది?”

జవాబు చెప్పడానికి బదులు ఒక యాంత్రికమైన స్వరంతో రకరకాలైన వస్తువులను వివరిస్తూ పోయింది. “ఒక పెద్ద గంప లో ఖాళీ సీసాలు, ఖాళీ సంచులు, ఒక గొడుగు, ఒక ఇనప కడవ.”

ఈ వస్తువులేవీ తినడానికి పనికిరావు. వాళ్ళ ఆశలన్నీ అడుగంటిపోతున్నాయి. సడెన్ గా ఆమె ఆనందంతో పెద్ద కేక వేసింది. “చివరికి దొరికాయి!”

“ఏం దొరికాయి?”

“తడితో బూజుతో ఉన్న చిన్న రొట్టె ముక్క. ఇదిగో, పట్టుకో!”

ఆ క్షణం లోనే రెండు రొట్టెలు దొర్లుతూ నా కాళ్ళదగ్గర కొచ్చాయి: వెంటనే ధైర్యశాలియైన నా చిన్నారి స్నేహితురాలు నా పక్కకొచ్చి నిలబడింది.

ఈ లోపల నేను పెద్ద లావాటి ముక్కను తుంచి గబ గబా ఆశపోతు లాగా నోట్లో కుక్కుకున్నాను.

“వచ్చెయ్యండి, నాక్కూడా చిన్న ముక్క పెట్టండి. మనం ఇక్కణ్ణుంచి తొందరగా బయట పడాలి. తర్వాత ఎక్కడుంటే బాగుంటుంది?” ఆమె చురుకైన చూపులు చిమ్మ చీకటిని చీల్చుకుంటూ నలుదిక్కులా వెదుకుతున్నాయి.

“అక్కడొక పాత పడవ తలక్రిందులుగా పడిఉంది. మనం దానికిందకి వెళదాం.”

“అలాగే; వచ్చెయ్యండి!”

రొట్టెను తుంచుకుంటూ, ఆ ముక్కల్ని నోట్లో కుక్కుకుంటూ నడిచి పడవ దగ్గరికి చేరుకున్నాం. భారీగా వర్షం పడుతుంది. నది పెద్దగా భీకరంగా గర్జిస్తుంది. దీర్ఘమైన నిస్పృహ కలిగించే అరుపులు వినిపిస్తున్నాయి. దేనికైనా చివరికి ప్రాణానికి తెగించిన వారికి – ఈ భుమ్మీద ఈ దిక్కుమాలిన శీతాకాలపురాత్రి జరుగుతున్న ఈ దౌర్భాగ్యపు భీభత్సంలో మా ఇద్దర్నీ చూసి, మీరో పెద్ద హీరోలా అని ప్రకృతి ఎగతాళి చేస్తుందా అన్నట్లుంది. కీచు కీచుమని భయానకంగా వినిపించే ప్రతి కూతకూ మా గుండెలు అదిరిపోతున్నాయి. కానీ ఇవేవీ నేను నా రొట్టెను ఆత్రంగా ఆబగా తినడాన్ని ఆపలేకపోయాయి; నా పక్కనున్న అమ్మాయి పరిస్థితి కూడా అదే!

“మీ పేరేమిటి?” నేను అస్పష్టంగా ఆరా తీశాను.

“నటాషా,” అని చటుక్కున చెప్పి శబ్దం చేసుకుంటూ రొట్టెముక్కను నములుతుంది.

నేను ఆమె వైపు చూశాను. నా హృదయం బాధతో విలవిలలాడింది. నేను నా చూపుని దట్టంగా అమావాస్య చీకటిలా కనిపిస్తున్న వైపుకి మరల్చాను. సమస్యాత్మకంగా, గతిలేకుండా, దిక్కులేకుండా ఉన్న నా బతుకుని చూసి ఆ చిమ్మచీకటి వెక్కిరింపుగా హేళనగా నవ్వుతుందా అనిపించింది.

తెరపనేదే లేకుండా, నిరంతరం పడుతున్న వాన చినుకులకి అసలే పాత డొక్కులా ఉన్న పడవ చేస్తున్న చెవులు చిల్లులు పడే ధ్వని తోడైంది. అత్యంత విషాదమైన దుఃఖపు ఆలోచనలు మనసులో ఈగల్లా ముసురుకుంటున్నాయి. ప్రచండంగా ఉధృతంగా వీస్తున్న గాలి పడవ మాను పగుళ్ళలోకి ప్రవేశించి కీకారణ్యంలో కుక్కలూ, నక్కలూ కౄరంగా అరుస్తున్నట్లు వస్తున్న శబ్దాలకి వాతావరణం భయానకంగా ఉంది. పడవలోని ఒక చెక్కముక్క వదులుగా ఉండి బడబడమంటూ కంపించిపోతూ చనిపోయినవారికి విచారంతోనూ, విషాదంతోనూ పాడే పాటలా వినిపించి ఒకవిధమైన ఆరాటాన్నీ, ఆత్రుతనీ రేపుతుంది. నదీ తీరాన్ని ఉధృతంగా తాకుతున్న ఆ అలల శబ్దం యాంత్రికంగా చాలా నిరాశాజనకంగా ఉంది. నది కొందర్ని మింగేస్తుందేమో, కొందర్ని, అణచివేతకు గురి చేస్తూ దమన క్రియ జరప బోతుందేమో, మానవ మాత్రులు సహించరాని క్రౌర్యానికి బలి చేస్తుందేమో అని రకరకాల భయాలతో అలసిపోయిన వాళ్ళకు ఈ భారాన్నంతా పంచుకోవడానికి మనసులో మాట చెప్పుకోవడానికీ ఎవరో ఒకరు తోడుండాలి.

జోరుగా కురిసే వర్షపు శబ్దం-నురగలు కక్కుకుంటూ ఎగిసిపడే అలల శబ్దం రెండూ కలగలిసిపోయి సుదీర్ఘంగా ఎడతెగకుండా, గంభీరంగా భీతి గొల్పే విధంగా గాలిలో శబ్దాలు వినబడుతున్నాయి. భయంకరమైన వేడీతో కాల్చేసే వేసవి కాలాలతోనూ ఆ తర్వాత శీతాకాలం తెచ్చే చిత్తడి నేల, వణికించే చలితో నిర్మానుష్యంగా ఉన్న మార్పులేని ఈ వాతావరణంతో అలసి, డస్సిపోయిన భూమి నిట్టూరుస్తుందా అన్నట్లుంది. నిర్జనంగా ఉన్న ఆ తీరంలో దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ గాలి ఊళలు అక్కడున్న చెత్త చెదారం మొత్తాన్నీ ఊడ్చి వేయసాగాయి. నురగలు కక్కే నది ఎప్పటిలాగే ఏ మార్పూ లేకుండా అశుభ శకునాన్ని సూచిస్తూ మొత్తుకుంటుంది. పడవలో మేం తల దాచుకున్న స్థలం ఏ రకమైన ఆధారం లేకుండా ఉంది. గతిలేక పడుండటమే గాని ఏ మాత్రం సౌకర్యంగా లేదు. అది సన్నగా ఉండి పూర్తి బురదతో ఉంది. మంచులా చల్లగా పడే వర్షపు చినుకులు, ఉండుండి కెరటాలు కెరటాలుగా వీచే ఈదురుగాలులు- ఇవన్నీ మేమున్న కొయ్య చెక్కలలోంచి చీల్చుకుని వస్తున్నాయి. మేమిద్దరం చలికి వణికిపోతూ నిశ్శబ్దంగా కూర్చున్నాం. నాకు నిద్ర వస్తున్నట్లుంది. నటాషా ఒక బాల్ లాగా ముడుచుకుపోయి వీపుని పడవకానించి, చేతుల్ని మోకాళ్ళమీద ఆనించి వాటిమీద తల పెట్టుకుంది. స్థిరంగా ఆమె నది వైపు తన చూపులు నిలిపింది. విశాలంగా విచ్చుకున్న ఆమె కళ్ళు ఒక తేజస్సుతొ వెలిగిపోతున్నాయి. కళ్ళకింద ఉన్న చారలు కూడా కనబడకుండా పత్తికాయల్లా విచ్చుకుంటున్నాయి. ఆమె నోరిప్పలేదు. కదలలేదు. నిశ్శబ్దంగా నిశ్చలంగా చిత్తరువులా ఉన్న ఆమె పట్ల నాకు గౌరవప్రదమైన స్ఫూర్తి, విస్మయం కలిగాయి. ఏదైనా మాట్లాడాలనిపించింది కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియలేదు. చివరికామే నిశ్శబ్దాన్ని ఛేదించింది.

“మన జీవితాలెంత దౌర్భాగ్యంగా, అధమంగా ఉన్నాయి!” తన ప్రతి మాటనూ స్పష్టంగా స్థిరంగా గొప్ప నమ్మకంతో వత్తి పలికింది. అదొక ఫిర్యాదులా కాకుండా ఆమె గొంతులో సంయమనం ధ్వనించింది. నాకు చూస్తున్నప్పుడు తన గత జీవితాన్ని తనే ఒకసారి బయటికి నెమరు వేసుకుంటున్నట్లు అనిపించింది. చాతనయినంతవరకూ మాటల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ చివరికి ఒక నిశ్చయానికొచ్చినట్లు ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నాం అని అన్నది. నా మనస్సాక్షిగా ఆలోచిస్తే నా బతుక్కూడా అలాగే పరమ నీచంగా ఉన్నందున నేను ఆమెతో తర్కించదలచుకోలేదు. అంగీకారపూర్వకంగా మౌనంగా ఉండ దలచుకున్నాను. నా స్పందన ని గమనించకుండానే ఆమె మళ్ళీ కదలకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది.

“ఎంత పిచ్చిగా నేను కప్పకూతల్లాగా మూల్గినప్పటికీ ప్రయోజనమేమిటి,” అని అంతులేని బాధ ధ్వనించే గొంతుతో గొణుక్కుంటుంది. అయినా ఆ స్వరంలో ఏ రకమైన కంప్లైంట్ లేదు. మళ్ళీ ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఈ బతుకునిలాగే కొనసాగించడం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, వంచన, మోసం, హాస్యాస్పదంగా ఉన్న జీవితానికి “చావు” తప్ప వేరే శరణ్యం లేదు అనే దృఢ నిశ్చయానికొచ్చినట్లు చెప్పింది.

ఆమె స్థిర సంకల్పం నన్ను మరీ కదిలించి హృదయాన్ని మెలి తిప్పింది. ఏదో ఒకటి మాట్లాడాలి. లేకపోతే కడుపుతీరా ఏడ్చేసెయ్యాలి. ఒక అమ్మాయి ముందు అందులోనూ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చని ఆ అమ్మాయి ముందు ఏడవడం అవమానమనిపించింది.

చివరికి ఎలాగోలా గొంతు పెగుల్చుకున్నాను. “ఇప్పుడు నిన్ను ఎవరు చనిపోమంటున్నారు?” అని అడిగాను. ఆమె సూచించిన పరిష్కారానికి ఏ విధంగా అనునయించి చెప్పాలో తెలియలేదు నాకు.

“ఎందుకు లేరు? అఫ్ కోర్స్ పాష్కా”

“అతనెవరు?”

“నా ప్రియుడు. ఒక బేకర్.”

“అతను తరచుగా అలా ప్రవర్తిస్తాడా?”

“అవును, చాలా తరచుగా. దాదాపు ప్రతిరోజూ తాగి దురుసుగా ప్రవర్తిస్తాడు.”

నటాషా నా వైపుకి తిరిగి తనకు పాష్కా తో ఉన్న సంబంధం గురించి చెప్పటం మొదలెట్టింది. ఆమె “పట్టణంలో ఉండే ఒక అమ్మాయి” అతను, గోధుమ రంగులో మెరిసే మీసాలతో రొట్టెలు కాలుస్తూ జీవించేవాడు; హార్మొనీని పోలిన ఒక సంగీత వాద్యాన్ని అమోఘంగా వాయించేవాడు. అతడు ఆమెను “ఎస్టాబ్లిష్ మెంట్” అనే ఒక ఏర్పాటు మందిరంలో కలిశాడు. అతని చురుకైన, మర్యాదపూర్వకమైన ప్రవర్తన, ఉన్నత తరగతికి చెందిన ధనికులు వేసుకునే పాలిష్ తో మెరిసే బూట్లు, అద్భుతంగా, అందంగా ఉన్న బట్టలు ఆమె నాకర్షించాయి. 15 రూబుళ్ళ ఖరీదైన కోట్ ధరించాడు! ఈ గుణ గణాలన్నీ చూసి ఆమె అతని ప్రేమలో పడి తనకు తానుగా అతని “అధీనం” లోకి వెళ్ళింది. తన దగ్గర రూబుళ్ళు అయిపోవడంతో ఆమె ఇతర “సందర్శకుల” నుండి సంపాదించిన రూబుళ్ళను లాక్కునేవాడు. తప్పతాగేవాడు. అలా తాగినప్పుడు ఎలాంటి కరుణా, దయా లేకుండా విపరీతంగా చావబాదేవాడు. ఇదంతా తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు కానీ తన కళ్లు గప్పి సిగ్గులేకుండా వేరే అమ్మాయిలతో తిరగడం గురించి చాలా బాధ పడింది.

“ఈ విషయం నన్ను ఎక్కువగా గాయపరిచింది! ఆ రాస్కెల్ నాతో ఆటలాడుకుంటున్నాడని అనిపించింది. ఆ అమ్మాయిల ముందు నా పరిస్థితి దారుణంగా ఉంది! నిన్న గాక మొన్న నా యజమానురాలి దగ్గర బయటికి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాను. నేరుగా పాష్కా ఉండే చోటుకి వెళ్ళి చూస్తే అక్కడ డౌనజా అనే ఆమెతో ఉన్నాడు; ఆమె ఫూటుగా తాగి ఉంది. అతనూ ఆమె కంటే ఎక్కువ మోతాదులో తాగి ఉన్నాడు. నేనతనికోసం వెళ్ళాను. కాబట్టి కోపంగా “యూ రాస్కెల్, యూ డాగ్!” అని పెద్దగా అరిచాను. ఇక మొదలైంది రభస. నన్ను పడగొట్టాడు. జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చు కొచ్చాడు, చెప్పలేని బూతులు నోటికొచ్చినట్లు వాగాడు. ఇంతవరకైతే ఫరవాలేదు. కానీ ఇంకా ఘోరమైన సంగతేమిటంటే నా డ్రెస్ మొత్తాన్నీ చింపేసి పైన వేసుకునే జాకెట్ ని ముక్కలు ముక్కలుగా చింపి పోగులు పెట్టాడు. ఆ పరిస్థితిలో నాకేంచెయ్యాలో దిక్కుతోచలేదు! ఆ చింపిరి గుడ్డలతో మా యజమానురాలి దగ్గరకెళ్ళే ధైర్యం లేదు. నేను నా జాకెట్ 5 రూబుళ్ళతో కొనుక్కున్నాను. దేవుడా! నేనిప్పుడేంచెయ్యాలి?”

చివరి రెండు మాటలు దుఃఖంతో మొరబెట్టుకుంటున్నట్లు వణుకుతున్నగా మాట్లాడింది. గాలి అరుపులు-చలి అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. నా పళ్ళు చలికి గజ గజ వణుకుతున్నాయి. ఆ అమ్మాయి వణుకుతూ నన్నల్లుకుపోసాగింది. ఎంత దగ్గరగా వచ్చేసిందంటే ఆమె మెరుస్తున్న కళ్ళను అంత దట్టమైన చీకటిలోకూడా నేను చూడగలుగుతున్నాను. “మీ పురుషులెంత మృగాలు! అందర్నీ నా కాళ్ళకిందేసి తొక్కాలనుంది! నాకే గనక శక్తి ఉంటే అందర్నీ వికృతంగా కురూపుల్ని చేసి పారేస్తాను. మురికి కూపంలో మోరీల్లో పడి ఎవడైనా ఛస్తుంటే రవ్వంత కూడా జాలి లేకుండా ముఖం మీద ఉమ్మి అక్కడే వదిలేస్తాను. మీరంతా అతి నికృష్టమైన దుష్టులు, దుర్మార్గులు! మీరు మా దగ్గర కొచ్చేటప్పుడు నక్కవినయాలు పోతూ నీచమైన కుక్కల్లాగా చేరతారు. తర్వాత వెర్రి మూర్ఖపు పిల్ల ఎవత్తైనా దొరికితే, ఇక అంతే అంతా ఐపోతుంది. డర్టీ రాస్కెల్స్! వెక్కిరిస్తూ కాలితో తన్ని తిరస్కరిస్తారు!”

ఆమె తిట్ల పురాణం అంతూపొతూ లేకుండా అదే ఆమెకున్న మూలధనంలా నటాషా అంటే తిట్టడమే ఆమె సార్ధక నామంలా అనిపించింది. కానీ ఒక్క తిట్టు కూడా ఆవేశంగా లేదు. ఆ తిట్లలో “డర్టీ రాస్కెల్స్” పట్ల కోపంగానీ ద్వేషంగానీ వినిపించలేదు.

ఆమె స్వరానికీ-మాట్లాడే మాటలకూ ఏమాత్రం పొందిక లేదు; అంతకు ముందువరకూ నేను విన్న గొప్ప మాటల్లోని వాక్చాతుర్యం, మంచి సామర్ధ్యంతో కూడిన శక్తివంతమైన ఉపన్యాసాలు, గొప్ప ఆశలు, నిరాశా నిస్పృహలు కలిగించిన పుస్తకాల్లోని వాదోపవాదాలు మొదలైనవన్నీ ఆ రాత్రితో కొట్టుకుపోయాయి. ఆమె చెప్పిన విషయాలు నాలో చాలా గాఢమైన ముద్ర వేశాయి. ఏ పుస్తకమూ, ఏ ఉపన్యాసమూ ఎంత నిష్ణాతులైనా వర్ణించలేని చావు వేదన కలిగించే దుఃఖం ఎంత తీక్షణంగా ఉంటుందో, ఎంత ప్రకృతి సహజమైందో తెలిసిందని మాత్రం చెప్పగలను!

చాలా హింసగా వళ్ళంతా పోట్లు, నొప్పులుగా ఉంది. నేను పడుతున్న నరకయాతనకు కారణం గడ్డ కట్టే చలివల్లో లేక నా తోడున్న అమ్మాయి మాటలవల్లో నాకు తెలియలేదు. ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. సన్నని మూలుగుతో నా పళ్ళు పట పట లాడాయి. అదే క్షణంలో గజ గజ వణికే – రెండు చిన్నారి చేతులు నాకు దగ్గరగా వచ్చాయి. ఒకచేతిని నా మెడ మీదా, ఇంకో చేతిని బుగ్గమీదా వేసి మృదువుగా లాలిస్తున్నట్లుగా ఆప్యాయంగా నిమురుతూ సానుభూతి ధ్వనించే కంఠంతో అడిగింది, “నువ్వెవరో నాకు చెప్పవా?”

నాకు ఒక్క క్షణం అక్కడ నాతోపాటు ఇంకెవరో ఉన్నట్లనిపించింది. చెప్పాలంటే కొన్ని నిమిషాలకు ముందే నటాషా మగ లోకాన్ని తన దూషణ తిరస్కారాలతో దుమ్మెత్తిపోసింది. ఈ అమ్మాయి ఆమేనా అని నాలో నేనే తెగ ఆశ్చర్యపోయాను. మళ్ళీ వెంటనే మారిపోయి, నేనూ మగవాణ్ణనే విషయం మర్చిపోయి ఆత్రంగా, ఆర్ధ్రంగా తోటి మనిషిపట్ల ప్రేమ కురిపిస్తుంది.

“ఏమైంది నీకు? చలిగా ఉందా? గడ్డ కట్టుకు పోతున్నావా? అయ్యో! పూర్ ఫెలో! నాకెందుకు చెప్పలేదు? ఇంత చలితో బాధ పడుతున్నట్లు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇటొచ్చి పడుకో. నా దగ్గరకొచ్చి కాళ్ళు చాచి పడుకుంటే నేను కూడా పడుకుంటాను. నీ చేతులు నా చుట్టూ వేసి, ఇంకా దగ్గరకు రా. అప్పుడు నీకు కొంచెం వెచ్చగా హాయిగా ఉంటుంది. తర్వాత వీపులు ఆనించుకుని పడుకుంటే మన వీపులు కూడా వెచ్చబడతాయి. ఎలాగోలా ఈ రాత్రి నిభాయించుకుని గడిపేద్దాం. ఎందుకింత వేదన పడుతూ, అనాధ లాగా ఉన్నావ్? తాగుతున్నావా? లేకపోతే చేస్తున్న పనిలోంచి తీసేశారా? పోనీలే, ఏదైతే అదవుతుంది! అదే తల్చుకుంటూ కుమిలిపోకు.”

ఈ అమ్మాయి నన్ను కాస్త సౌకర్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. నిజం చెప్పాలంటే నా నిస్త్రాణస్థితి నుంచి బయట పడేయడానికి ఎన్నో రకాలుగా ధైర్యం చెప్పి ఉత్తేజపరచడానికి పూనుకుంది.

ఏమిటిదంతా! జీవితంలో ఎంత భయంకరమైన పరిహాసం దాగుంది, ఊపిరిసలపని పనుల్లో నిరంతరం నన్ను నేను బిజీగా ఉంచుకుంటూ న్యాయంగా, మనస్ఫూర్తిగా పూట గడవని మానవజాతి విధిని మార్చడానికి కొన్ని పనుల్ని చెయ్యాలనుకున్నాను. సామాజిక క్రమాన్ని సంఘ సంస్కరణల ద్వారా సరిదిద్దాలని కలలుకన్నాను. రాజకీయ విప్లవాల గురించి దీర్ఘాలోచనలు చేశాను. వివేకాన్నీ విజ్ఞానాన్నీ ఇస్తాయనుకున్న గొప్ప పుస్తకాలు – వాటి అర్ధాలుగాని, అవి అక్కరకు వస్తాయో రావో, ఆ రాసిన విషయాలు సంభవిస్తాయో లేదోనని స్పష్టంగా అవి రాసిన రచయితలకు కూడా తెలియని పరిస్థితుల్లో ఎదైనా మేలు జరుగుతుందేమోనని చదవాలనుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ప్రముఖ సామాజిక క్రియాశీల శక్తిగా, నన్ను నేను అన్ని విధాలుగా విశిష్టమైన, చురుకైన, సత్తాకలిగిన వ్యక్తిగా మలచుకుని నా పనుల్లో అధిక భాగం నెరవేర్చినప్పుడు నాకు అనివార్యంగా జీవించే హక్కు ఉంటుందని భావించాను. నేననుకున్న వాటిలో కనీసం కొన్నైనా పూర్తిచేసి చనిపోతే చరిత్ర పేదల బాగుకోసం కృషి చేసిన ఒక ప్రముఖ వ్యక్తి విజయం సాధించి చనిపోయాడని గుర్తిస్తుందని ఆశపడ్డాను – అలాంటి గొప్ప ఆలోచనలు చేసే నేను, ఒక శీతాకాలపు రాత్రి శరీరానికి కావలసిన వెచ్చదనం కోసం ఒక పతితురాలైన, దౌర్భాగ్యమైన, శిధిలమైన, పురుష లోకపు వేధింపులు ఎదుర్కొన్న ఒక జీవి – ఈలోకంలో ఏ రకమైన దిక్కూ లేకుండా అన్ని విధాలుగా వెలివేయబడిన ఒక మానవ ప్రాణి శరీరాన్ని అవసరానికి ఉపయోగించుకుంటున్నాను. ఇలాంటి వారికోసం ఈ విశాల ప్రపంచంలో రవ్వంత జాగా లేదు! ఒక మహిళ పట్ల నేనే బాధ్యతతో రక్షించి పట్టించుకోవలసింది పోయి ఆమే నన్ను ఓదారుస్తూ, ధైర్యం చెప్తూ, సౌకర్యంగా ఉంచడానికి తాపత్రయపడుతూ సేవలు చేస్తుంటే చక్కగా చేయించుకున్నాను. ఆమె పట్ల నాక్కూడా కొంత బాధ్యత, జాగ్రత్త తీసుకోవడం లాంటివి ఉంటాయి-ఉండాలనేదే నా బుర్రకెక్కలేదు. నాలో పశ్చాత్తాపం మొదలై, నా నేరాంగీకారాన్ని ఎలా తెలియజెయ్యాలో తోచలేదు. ఇదంతా ఒక కలగా, నిశి రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు భయంతో వచ్చే ఒక అర్ధంలేని అసంబద్ధమైన పీడకలగా నన్ను నేను నమ్మించుకోవాలని విఫలయత్నం చేశాను.

కానీ, అయ్యో! మంచులాంటి అతి శీతలంగా ఉన్న వర్షపు చినుకులు నా మీద పడుతున్నాయి. వెచ్చని ఊపిరులూదే ఆమె రొమ్ములు నన్ను గట్తిగా వత్తుకుంటున్నాయి. ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలనుంచి నీరసంగా ఉన్న నాకు వోడ్కా సుగంధ పరిమళం గుబాళించి, మహాద్భుతంగా స్వస్థత పరుస్తూ నన్ను ఈ లోకంలో పడేసింది. నా ఇష్టానికి వ్యతిరేకంగా నేను కల గనడం లేదనీ అది పరమ సత్యమనీ రుజువైపోయింది. గాలి ఉధృతంగా వీస్తూ భీకరమైన శబ్దాలు చేస్తుంది. వాన జోరు అంతకంతకూ పెరుగుతుండడంతో పడవ ఊగిసలాడుతుంది. కెరటాలు పగ బట్టినట్లు బుసకొడుతున్నాయి. ఇక మేము మా బిగి కౌగిలిలో చలికి వణికి పోతున్నాం. ఇది నవ్వాలో ఏడవాలో తెలియని ఒక కౄరమైన వాస్తవం. ఎంత పాపిష్టిదైనా, ఎంత భరింపశక్యం గాని వికృతమైనదైనా, జీవించేవరెవరికీ రాకూడని మనుషుల్ని పీల్చి పిప్పిచేసే ఉపద్రవమైనప్పటికీ ఇది కల కాదు యదార్ధం అనే దృఢ నిశ్చయానికొచ్చాను. నటాషా మాత్రం మృదువుగా, దయగా, ప్రేమగా, ఓదార్పుగా మాట్లాడుతూనే ఉంది, ఈ ప్రపంచంలో ఒక్క స్త్రీ తప్ప అలాంటి సమయంలో అంతటి ఉపశమనాన్ని ఏ నర మానవుడూ కలిగించలేడు.

ఆమె నిష్కల్మషమైన, శాంతినిచ్చే ఓదార్పు మాటలు నా హృదయాన్ని ఉత్తేజపరుస్తున్నాయి. మనసు ఆర్ధ్రతతో ద్రవీభూతమవుతుంది. ఈ భయంకరమైన కాళ రాత్రి సమయంలో నాలో పేరుకుపోయిన నా కోపం, నా దుఃఖం, నా గర్వం, నా స్వీయ దర్పం, నా దుష్టబుద్ధి – ఇవన్నీ నా బుగ్గలమీద నుంచి వరదలా కారుతున్న కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపొయాయి. మళ్ళీ నటాషా నన్ను శాంతింపజేయడానికి కృషి చేసింది.

“అలా ఏడవ కూడదు డియర్. ముందు నీ దుఃఖాన్నించి బయటపడి ప్రశాంతంగా ఉండు. దేవుని దయవల్ల ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. నీకొక మంచి స్థావరం దొరుకుతుంది. త్వరలోనే నీకంతా శుభం కలుగుతుంది” అంటూ లాలనగా, ఓదార్పుగా మాట్లాడుతూ ఆ మాటలతో పాటు తన సరసాన్ని జోడిస్తూ కమ్మగా వెచ్చదనాన్ని కలిగిస్తూ ముద్దులతో ముంచెత్తింది.

ఒక స్త్రీ నుంచి ముద్దుల రుచి అనేది నాకదే మొట్టమొదలు. అద్భుతం. ఆ అమోఘమైన మొదటి ముద్దు వెల కట్టలేనిది.

“రా, ఇంకా దగ్గరకు రా! విషాదమైన నిట్టూర్పులు ఆపు; పరాయి చోటునుంచి వచ్చినప్పటికీ నీకేం భయం లేదు. రేపే నేను నీకు వేరే ఏదైనా పని చూసి పెడతాను.”

లలితంగా, మృదువుగా, అనునయంగా మనసు ద్రవించేలా చెవిలో చెప్పే గుస గుసలు కలలో వినిపించి మేఘాల్లో తేలిపోతున్నట్లనిపించింది. అలా మేమిద్దరం సూర్యోదయం వరకూ ఒకరిచేతుల్లో ఇంకొకరం ఇమిడిపోయి ఉన్నాం. తెల్లవారగానే పడవ అడుగు భాగం నుంచి పాక్కుంటూ పైకొచ్చి పట్టణం వైపుకి నడక సాగించాం.

ఒకచోట ఇద్దరం ఒకరికొకరం హృదయపూర్వకమైన వీడ్కోలు చెప్పుకుని మళ్ళీ ఎప్పటికీ కలుసుకోకూడదనుకుంటూ విడిపోయాం. అయినప్పటికీ ఆరునెలలకి పైగా ఆ పట్టణం లోని మురికివాడలన్నీ – ఒక శరధృతువు రాత్రి నాతో గడిపిన ఆ మనోహరమైన అమ్మాయి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని గాలించాను.

ఒకవేళ ఆ అమ్మాయి ఇప్పటికే చనిపోయి ఉంటే ఆమె ఆత్మకు శాంతి కలగాలి! బతికే ఉంటే ఆమె తాను పతితననీ, భ్రష్టురాలిననీ ఎప్పటికీ గుర్తించకుండా దేవుడు ఆమెను అనుగ్రహించాలి; ఎందుకంటే అలాంటి కౄరమైన, నిరర్ధకమైన వేదన, నరక యాతన ఈ భూ ప్రపంచాని కేమీ మేలు చెయ్యదు.

Leave a Reply