(అజాజ్ అష్రఫ్ Bhima Koregaon: Challenging Caste – Brahmanism’s Wrath against Dreamers of Equality కోసం హేమలతతో చేసిన ఇంటర్వ్యూ తెలుగు మూలం.)
1964 డిసెంబర్ 25న మా వివాహం అయింది. అది ఆయన నుంచి వచ్చిన ప్రతిపాదననే. అది కొంచెం సంచలనమే. ఆయన మా అమ్మకు తమ్ముడు. తెలంగాణలో అక్క కూతురును చేసుకునే సంప్రదాయం లేదు. ఆయన కుటుంబం వ్యతిరేకించిన్రు. మా బాపుబుద్ధిమంతుడు, విద్యావంతుడు అయిన అల్లుడు కావాలని కోరుకున్నాడు కనుక వ్యతిరేకించడానికి కారణం కనిపించలేదు. శాస్త్రప్రకారంగా చేయవచ్చునా అని తను నమ్మిన శాస్త్ర పెద్దలను విచారించిండు. అట్లా ఒక సంవత్సరం గడిచిన తర్వాత సంతృప్తి చెంది మా పెళ్లి చేసిన్రు. ఆయన ఎంఎ పూర్తి చేసి కొత్తగా ఉద్యోగంలో చేరాడు. సాహిత్యంలో అభ్యుదయ భావాలున్న కవిగా పేరుపొందాడు. ప్రేమ కవిత్వం కూడా చాలా రాశాడు. మల్లెపూలు, హేమంత స్వప్నాలు అని ఆయన నా గురించి రాసిన ప్రేమ కవిత్వం. ఇప్పటికీ అవి అప్రచురితంగానే వున్నవి.
ఆయన కుటుంబం కాంగ్రెస్ కుటుంబం. ఆయన పెద్దన్నయ్యలు ఇద్దరు నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నవారు. ఆ విధంగా ఆ కుటుంబంలో అప్పటికి ఆయనకు ఈ రాజకీయాలు లేవు.
వైవాహిక జీవితం ఆయన ఢిల్లీ డిఎవిపి ఉద్యోగంతో ప్రారంభమయింది. అయితే ఆయనకు తెలుగులో సాహిత్య పత్రిక నడపాలనే బలమైన ఆకాంక్ష ఉండేది. అట్లా జడ్చర్లలో తెలుగు లెక్చరర్ ఉద్యోగం వస్తే తిరిగి వచ్చిన ఏడాదికే 66 నవంబర్‌లో సాహితీ మిత్రులతో కలిసి ‘సృజన’ త్రై మాసిక సాహిత్య పత్రిక ప్రారంభించాడు. అట్లా నా జీవితంలోకి ఒక పాపతో పాటు సృజన పత్రిక కూడా వచ్చింది. సృజనతో పాటే ఆయనలో మార్పు వచ్చింది. ఆ మార్పు మేము వరంగల్‌కు మారిన తర్వాత సృజనలో ప్రతిఫలించింది. 1970లో విరసం ఏర్పడ్డది. ఆ క్రమంలోనే సృజనలో మార్పు వచ్చింది. సికెఎం కాలేజీలో లెక్చరర్‌గా వరంగల్‌లో విద్యార్థుల మీద ఆయన భావాల ప్రభావం పడుతున్నట్లుగా అర్థమయింది. అప్పుడే ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాలేజీలోనూ విప్లవ భావాలు కల విద్యార్థులతోను కలిసి పాల్గొనడం నేను చూశాను. అలాంటి వాతావరణం లో 1973 అక్టోబర్ లో ఆయన మొదటిసారి అరెస్టు అయ్యారు. అప్పుడు నాకు అరెస్ట్ ఆందోళననే కలిగించింది కానీ మా అమ్మ బాపు కుటుంబం నుంచి వచ్చిన సపోర్టు వల్ల స్థిమితపడ్డాను. ముఖ్యంగా ఆయన జైల్లో ఉన్న 36 రోజులు ములాఖాత్‌కి వెళ్ళి వచ్చినప్పుడు నేను పొందిన గౌరవం, ఆయన అప్పటికే సికేఎం కాలేజీ ప్రిన్సిపాల్ గా కూడా చేసిన అందువల్ల ఆయన పట్ల జైలు సిబ్బంది చూపిన గౌరవం వల్ల కూడా నేను నిర్బంధాన్ని సహజంగానే స్వీకరించాను. ఆయన విడుదలైనప్పుడు కూడా ఆయన వెంబడి విద్యార్థులంతా ఊరేగింపుగా నినాదాలు ఇస్తూ ఇంటి వరకు తీసుకురావడం గర్వంగా ఫీల్ అయ్యాను. అయితే ఆ నెల రోజులలోనే తన అరెస్టు వల్ల సృజన ఆగిపోకూడదని కుటుంబ మిత్రులు డాక్టర్ రామనాథం గారు, అట్లూరి రంగారావు గారు, కలెక్టర్ కాలేజీ కమిటీ చైర్మన్ అయిన మాధవరావు గారు నన్ను ఆ బాధ్యత తీసుకోమని సూచించారు నేను ఒక నైతిక బాధ్యతగా తీసుకున్నాను తప్ప నాకేం రాజకీయాలు లేవు. ఇది నేను చేయవలసిన ఒక బాధ్యత అనుకున్నాను.
అందువల్ల ఎన్ని కష్టాలు వచ్చినా 92 మే నెలలో 200 సంచిక వచ్చి సృజన ఆగిపోయే వరకు నేను సృజన ప్రింటర్, పబ్లిషర్,ఎడిటర్ గా కొనసాగాను.
1974 మే 18న వివిని రెండవ సారి సికింద్రాబాద్ కుట్ర కేసులో అరెస్టు చేసినప్పుడు మా మూడవ పాపను కని, తీవ్రమైన జ్వరంతో ఉన్నాను. అందువల్ల అప్పటి నా ఆరోగ్య పరిస్థితి ఆయనను ఎందుకు అరెస్టు చేస్తున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు అని ఆలోచించే స్థితిలో కూడా లేదు. మొదట అవి రైల్వే సమ్మె రోజులు గనుక అందుకే చేశారనుకున్నాను. ఆయనను కోర్టులో హాజరు పరిచినట్లు పత్రికలో చదివినాక కానీ ఆయనను ఈ కేసులో అరెస్టు చేసి సికింద్రాబాద్ జైలుకు పంపుతున్నట్టు అర్థమైంది. అప్పుడు ఇంకా మొదటి నెలలోపలి పాపనే మా అమ్మ దగ్గర వదిలి పెద్ద పిల్లలు ఇద్దరినీ తీసుకొని సికింద్రాబాద్‌కు ములాఖాత్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో తనతో పాటు జైలులో ఉన్న వాళ్ళ కుటుంబాలతో స్నేహాలు ఏర్పడ్డాయి. నాతో పాటు పిల్లలు మా బాపువచ్చేవాళ్ళు. కొంతమంది విద్యార్థులు కూడా వచ్చేవారు. ఆ సమయంలో కాలేజీ సహధ్యాయులు, విద్యార్థులు అండగా ఉన్నారు. ఈ రెండవ అరెస్టుతో మేము ఉన్న ఇల్లు ఓనర్స్ తక్షణం ఖాళీ చేయమన్నారు అట్లా నేను ముగ్గురు చిన్న పిల్లలు 8, 5, నెల వయస్సు, మా అమ్మ, బాపు, మా చెల్లెళ్ళు, తమ్ముళ్లు అందరం
తక్షణం ఒక స్నేహితురాలింటికి మారి అట్ల ఇల్లు వెతుక్కొని ఏడిండ్ల పిల్లి కూనలా మారుతున్న స్థితిలో కుమార్‌పల్లిలో ఇల్లు దొరకడం నా జీవితంలో ఒక మార్పుకు కారణమయింది. దాన్ని ఒక పరిణతి కూడా అనొచ్చు. ఆ ఇంట్లో 1990 దాకా 16 సంవత్సరాలు కిరాయికి ఉన్నాం. ఎన్ని నిర్బంధాలు, మృత్యునీడల్లో కూడా ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపినట్టుగా ఇప్పటికి కూడా అనుకుంటాను. మొదటి కారణం వివి లేని కాలంలో సృజన నిర్వహణ ఎంత సాహితీ మిత్రులు నిర్వహించినా బాధ్యురాల్ని నేను. ఆ క్రమంలో కొందరు సాహితీ మిత్రులులోని రచయితలు, విద్యార్థులు చాలా సన్నిహితులయ్యారు. విద్యార్థులు కుమార్‌పల్లిలో ఉండే యువకులు, ప్రజలంతా నన్ను నా పిల్లలను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. అక్కడ చిన్న, పెద్ద అందరూ అక్కయ్య అని పిలిచేవారు. ఈ కేసుకు ఎమర్జెన్సీకి మధ్య ఆయన వరంగల్‌లో ఒక నెల ఉన్నాడో లేదో ఇంతలో ఎమర్జెన్సీ వచ్చింది. జిల్లాలో అతనే మొదటి అరెస్టు. ఎమర్జెన్సీ అంటే ఏమిటో, అది ఎప్పటి దాకా ఉండబోతుందో ఏమీ ఊహించలేని స్థితి. కానీ మొదట కొన్నాళ్లు వరంగల్ జైల్లోనే ఉన్నందున ఆయనకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, ఎందరో సన్నిహితులు కూడా ఉన్నందువల్ల లోపల ఆయన, బయట తమ వాళ్ళ కోసం వచ్చే కుటుంబాలతో ఏర్పడ్డ పరిచయాలు కొంత ఊరటనిచ్చినా ఎమర్జెన్సీ కోర్టుకు పోవడానికి వీలులేని, ఎంత కాలమో తెలియని నిర్బంధము అని చాలా ఆందోళనకరంగా వుండేది ఆ రోజుల్లో.
మా కుటుంబంలో మా అమ్మ బాపు, బయట కాళోజీ, రామకోటి శాస్త్రిలాంటి పెద్ద మనుషులు తప్ప ఇంటికి మా బంధువులు కూడా రాలేని పరిస్థితి. నేను విని ఉన్న చాలా మంది ప్రముఖులైన రాజకీయ నాయకులు కూడా జైళ్ళలో ఉన్నందువల్ల ఈ స్థితి మారిఅందరూ బయటకు వస్తారని ఆశ ఉండేది. అయితే ఎమర్జెన్సీ ఎత్తివేసినాక అందరూ విడుదలయినా కానీ వివిని హైదరాబాద్ జైల్లోనే ఉంచి మళ్ళీ మీసా కింద అరెస్టు చేసారు. విడుదలైన విరసం కార్యదర్శి కె.వి.ఆర్ తను కావలి వెళుతూ నన్ను కాజీపేట స్టేషన్‌లోకలుసుకోమని చెప్పంపారు. నన్ను ఆ ట్రైన్‌లోనే కాజీపేటలో ఎక్కి వరంగల్ వరకు ప్రయాణం చేయమని చెప్పారు. నన్ను చూడగానే కెవిఆర్ భోరున ఏడ్చాడు. నేను ఏడుస్తానని నన్ను ఎట్లా ఫేస్ చేయాలని ఆయన భయంతో ఊహించుకున్నాడట. నేను నవ్వుతూ పలకరిస్తే ఆయన ఆశ్చర్యపోయి ఈ విషయం చెప్పాడు. అప్పటివరకు నేను ఇటువంటి వివి నిర్బంధాలకు, అందువల్ల మాకు వచ్చే కష్టనష్టాలకు,వ్యయప్రయాసలకు మాత్రమే అలవాటు పడి ఉన్నాను.
వివి సహచర్యంతో పాటు బాధ్యత వల్ల సృజనతో ఏర్పడిన నా అనుబంధం ఎమర్జెన్సీలో సృజన పబ్లిషర్‌గా నన్ను కూడా అరెస్టు చేసే స్థితికి కారణమయింది. ఎమర్జెన్సీలో వివిని అరెస్టు చేసినప్పుడు సృజన పబ్లిషర్‌గా ఉన్న నన్ను కూడా అరెస్టు చేయాలని మిసా వారెంట్‌పై సంతకం చేయాలని జిల్లా కలెక్టర్ బాలరాజును ఎస్పీ కోరాడట. పత్రికల పట్ల ప్రభుత్వ పాలసీ వల్ల సృజన ఎట్లాగూ రాదు కనుక ఆయన అందుకు నిరాకరించాడట. కానీ రాజద్రోహ నేరం కింద 74 మే సంచిక నిషేధానికి గురయింది కనుక నన్ను ఎమర్జెన్సీలో అరెస్టు చేసి బెయిల్ మీద విడుదల చేశారు. ఈ నిషేధంపై మేమంతకుముందే హైకోర్టులో వేసి ఉన్నాము. హైకోర్టు ధర్మాసనం నిషేధం చెల్లుతుందన్నది. అది పోలీసులకు కలిసొచ్చింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత కేసు ట్రయల్ జరిగింది. ఆ సమయంలో నేను మూడేళ్ల చిన్న పాపను తీసుకుని కోర్టుకు వెళ్లేదాన్ని. కోర్టు బంట్రోతు ‘హాజర్ హై’ అంటే మా పాప కూడా ‘హాజర్ హై’ అనేది. నిశ్శబ్దంగా ఉన్న కోర్టులో ఆ మాట ప్రతిధ్వనించేది. జడ్జి కూడా ముసిముసి నవ్వులు నవ్వేవాడు. వాదనలు పూర్తయి తీర్పు వినిపించడానికి ముందు మీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు. చెప్పాను. ముగ్గురు పిల్లల తల్లి అయి కూడా విచారణ కాలమంతా నీలో పశ్చాత్తాప భావం కనిపించలేదని రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేసి నన్ను వరంగల్ జైలుకు పంపాడు.
నేను పాపను కూడా జైల్లో ఉంచుకొని అప్పుడప్పుడు బయటికి పంపేదాన్ని. ఈ తీర్పుపై ‘జైళ్ళు రైళ్ళను నడిపితే, సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తే పశ్చాత్తాపం ప్రకటిస్తాను మిలార్డ్- అండర్ టేకింగ్ అనే పేరుతో వివి ఒక కవిత రాశాడు. 74 మే సంచిక రైల్వే సమ్మెలో పాల్గొన్న ఒక రైల్వే కార్మికుడు పోలీసు నిర్బంధంపై ‘జైళ్ళు రైళ్ళను నడపగలవా’ అని ఒక కవిత సృజనకు పంపాడు. ఆ కవిత సృజన వెనుక కవర్‌పై ప్రచురించి అదే శీర్షికతో సంపాదకీయం కూడా వేసాం. విచారణ జరుగుతున్న రోజుల్లో అప్పటికి కేంద్రంలో జనతా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ హైద్రాబాద్ వచ్చినప్పుడు పత్రికా విలేకర్లు రైల్వే సమ్మెను నడిపిన మీరు కేంద్రంలో మంత్రి అయ్యారు, తమ పత్రికలో బలపర్చిన సంపాదకురాలుకు శిక్ష పడి జైల్లో వున్నది అని అడిగితే, ఆయన దానినే ‘డ్రామా ఆఫ్ అబ్సర్డ్’అన్నాడు.
హైకోర్టులో కన్నబీరన్‌గారు బెయిల్ వేయగా వచ్చింది. పత్రిక మే సంచిక వెలువడవలసిన ఏప్రిల్ 26నాడే వరంగల్ప్రభుత్వాసుపత్రిలో నాకు మూడో పాప పుట్టింది కనుక ఆ సంచిక నిర్వహణ నేను చూసి ఉండననే ఆయన వాదనతో ఏకీభవించి జస్టిస్జయచంద్రారెడ్డి ఆ తర్వాత కేసు కొట్టివేశారు.
మళ్లీ 1884లో ఒకసారి నిర్బంధం రాజ్య హింసపై వచ్చిన సృజన సంచికను ప్రభుత్వం నిషేధించింది. ఆ విషయం మాకు తెలియక ముందే పోలీసులు వరంగల్‌లో ప్రింటింగ్ ప్రెస్ మీద దాడి చేసి హన్మకొండలో నన్ను అరెస్టు చేయడానికి వచ్చారు. వివి ఇంట్లో లేడు. ఆడబిడ్డను రాత్రి లాకప్‌లో పెడతారా అని మా బాపు వాళ్ళతో వాదించి నాతోపాటు వచ్చి రాత్రంతా లాకప్ ముందు పడుకున్నాడు. మర్నాడు కోర్టు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. అట్లా ఈ నిర్బంధాలకు 40, 45 ఏళ్ల కిందనే అలవాటు పడ్డాను.
కానీ 85 నాటికి పరిస్థితులు మరీ విషమించి వివి ప్రాణాపాయానికి కూడా భయపడే స్థితి వచ్చింది. అది డా. రామనాథం గారి హత్యతో ఒక యదార్థ స్థితి అయింది. అంతకు క్రితం రోజు ఎస్ ఐ యాదగిరి రెడ్డి హత్యతో ఊరంతా ఒక భయ వాతావరణం ఏర్పడ్డది. వివి, బాలగోపాల్‌ల మీద దాడి చేసి ప్రతీకారం
తీర్చుకుంటారని పుకార్లు, హెచ్చరికలు మేం విన్నాం. డాక్టర్ గారి హత్యవల్ల మా కుటుంబమే కాదు, వరంగల్ ప్రజలంతా ఒక పెద్ద షాక్‌కు గురయ్యారు. ఆ స్థితిలో మేమందరమూ వివి, బాలగోపాల్‌లను సురక్షితంగా అక్కడినుండి బయటపడెయ్యగలం అనే ఆందోళనతోనే గడపాల్సి వచ్చింది. అప్పుడు మాత్రం అనిపించింది ఆ ఎస్ ఐ చేసిన దౌర్జన్యాలు విని వున్నా. కానీ అతన్ని చంపి పార్టీ డాక్టర్‌గారి లాంటి విలువైన వారి ప్రాణం పోవడానికి కారణమయింది కదా అని అనిపించింది. ఇప్పుడు రాస్తున్నాను కానీ సికింద్రాబాదు కుట్ర కేసులో బెయిల్ రద్దు చేసుకొని జైలుకు పోయేదాకా నేను నా పిల్లలు ఎంతమంది స్నేహితుల ఇళ్ళలో తలదాచుకోవాల్సివచ్చిందో. ఆటా, మాట, పాట బందయిన అటువంటి స్థితిలో ఆయన జైలుకుపోయిన అయిదు నెలలకు ఆయన మీద రాంనగర్ కుట్ర కేసు కూడా మోపబడింది. అది టాడా కేసు కనుక అదే సికింద్రాబాద్ జైల్లో నేను కలవడానికి వెళ్లినప్పుడు నాకు పిల్లలకు తప్ప ఎవరికీ అనుమతి లేదు. ఆయనకు మాకు మధ్య స్థానిక, రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు సివిల్ డ్రెస్‌లో వుంటారు. ఆ రోజుల్లో వివి భవిష్యత్ చిత్రపటం నిషేధించబడ్డపుడు బాలగోపాల్ ఇపిడబ్ల్యూలో వరంగల్ స్థితిని లాటిన్ అమెరికా నియంతృత్వ పాలనతో పోలుస్తూ రాశాడు. అది నేను, నా మైనర్ ఆడపిల్లలు అనుభవించాం. మా ఇంటికి ఎవ్వరి రాకపోకలు లేని ఆ రోజుల్లో ఒక అర్ధ రాత్రి ఎవరో ఆగంతకులు వచ్చి మా ఇంటి తలుపులు గొడ్డళ్ళతో పగులగొట్టారు. అంత నిర్భంధంలోనూ నిశ్శబ్దంగా మమ్మల్ని
మా ఇంటిని కనిపెట్టుకునివున్న కుమార్ పల్లి ప్రజలు మర్నాడు అది పోలీసుల పని అని చెప్పారు.
ఇట్లా జైలుకు పోయే ప్రతి సందర్భంలోనూ ఆయన కాలేజీ ఉద్యోగంలో సస్పెండ్ కావడం, ఆ కాలంలో సస్పెన్షన్ అలవెన్స్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాం. వచ్చినా అది పూర్తిగా రాకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. అదనంగా ఈ ప్రయాణాల ఖర్చులు. అయినా సరే మిత్రులు సహాయం చేస్తానన్నా నా ఆత్మాభిమానం వల్ల ఎవరి దగ్గరా తీసుకోలేదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మా పెద్దమ్మాయి సహజ ఉద్యోగం చేయాలనే తలంపుతో బిఎస్‌సి పూర్తి కాకుండానే డిప్లమా చేస్తూ హైద్రాబాద్‌లో ఒక స్నేహితురాలింట్లో వుండేది. అప్పుడు “అమ్మా ఇన్‌లాండ్ లెటర్ రాయడానికి కూడా డబ్బులు లేవమ్మా” అని లెటర్ ఒకరి చేతికిచ్చి పంపింది. అప్పుడు నాకు చాలా దు:ఖం వచ్చింది.
ఇటువంటి 25 కేసులు ఎదుర్కొని నిర్దోషిగా విడుదలయ్యే క్రమంలో 2006 వరకు స్థానిక న్యాయవాదులు మొదలు 73 నుంచి చివరి దాకా మా న్యాయవాదిగా చెప్పుకొని గర్వించే కన్నబీరన్ గారితో అనుబంధం కుటుంబ స్నేహబంధంగా మారింది.
1990లో హైద్రాబాద్ మారినం. పదవీ విరమణ చేసిన తరువాత 98 నుంచి స్థిరమైన పెన్షన్ వల్ల ఒక స్థిరమైన జీవితం ఏర్పడింది. నాకు పెద్ద కోరికలు లేవు. పిల్లలను చదివించడం, స్వంత ఇల్లు కూర్చుకోవడమనేదే వుండేది. అట్లా వరంగల్‌లో ప్రయత్నించి నిర్భంధం వల్ల కోల్పోయి మళ్ళీ హైద్రాబాదులో స్వంత ఇంటి కల నెరవేర్చుకొని ఈ వయసులో ప్రశాంతంగా వుందామని సమకూర్చుకునే సమయంలో భీమా కోరేగావ్ కేసు పిడుగుపాటు వలె వచ్చింది. అప్పటికి ఆయన వయసు 78. నాకు 69. ఆయన
నలభై ఐదుఏళ్ల పాటు పోరాడిన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడి అప్పటికి నాలుగేళ్లయింది. ఒక నాలుగేళ్లు మాత్రమే నేను కోరుకున్న ఆ ఇంట్లో, నేను కోరుకున్న ప్రశాంతత అనుభవించాను. కానీ వివి మాత్రం సభలకని, సమావేశాలకని ఇంటిపట్టున ఉండకుండా తిరుగుతూనే ఉన్నాడు. అది నేను చాలా అసంతృప్తిగా ఫీల్ అయ్యాను. అటువంటి ఒక ఉదయం 6 గంటలకే పూనే పోలీసులు వచ్చిన్రు. తలుపు తీయగానే బిలబిల 20 మంది వచ్చి చేతుల్లో ఫోన్‌లు గుంజుకుని టివి పెట్టనీయకుండా, సోదా పేరుతో ఇల్లంతా చిందరవందరగా ఏకి పెట్టిన్రు. పక్కనే అపార్ట్‌మెంట్లో ఉన్న నా బిడ్డను పిలుస్తా అంటే కూడా ఒప్పుకోలేదు. అయితే సాయంత్రానికి తెలిసిన దారుణమేందంటే మా రెండో అమ్మాయి (అనల) మూడో అమ్మాయి (పవన) ఇళ్లల్లో కూడా ఇంతకుమించిన సోదాలు, బొట్టు తాళి వంటి విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్నలు, మానసిక వేధింపులు జరిగినవి. ఫోన్లు మాత్రమే కాకుండా పిల్లలు ఆడుకునే, చదువుకునే కిండిల్స్ కూడా ఎత్తుకపోయారు. అట్లానే మా ఇంటికొచ్చే ఒక యువ రచయిత ఇంటి మీద కూడా దాడి చేశారు. వాళ్ల తల్లిని మానసికంగా బాధపెట్టారు. అతన్ని తిట్టి కొట్టి కూడా హింసించారు.
ఈ షాక్ నుంచి తేరుకుంటుండగానే హౌజ్ అరెస్ట్ వార్త తెల్లవారి సాయంత్రానికి తెలిసింది. నిజంగా నేను నా పిల్లల పరంగా చెప్పాలంటే ఒక రెండున్నర నెలలు నవంబర్ 17 వరకు ఇంటిపట్టున వున్న నాతోని, పిల్లలతోని గడిపిన అనుభవం అరుదైన కాలం ఆయన 50 ఏళ్ల ఉద్యమ జీవితంలో అదే.
ఇంక నవంబర్ 17 తర్వాత మా పూనా ప్రయాణాలు మొదలయినాయి. ఆయనను అరెస్టు చేసి తీసుకుపోయిన రాత్రి ఆయన రాసినట్టు దేశం కాని దేశంలో, భాష కాని భాష మాట్లాడాల్సి రావడం ఎట్లా ఉంటుంది ఊహించాలె. అయితే సాయంత్రం హైద్రాబాద్‌లో బయలుదేరి తెల్లవారి పూనాలో దిగి ముందు జైలుకు వెళ్లి కలిసి మధ్యాహ్నం కోర్టులో కలిసి సాయంత్రం ట్రైన్ ఎక్కి తెల్లవారి హైద్రాబాద్ చేరే పద్ధతికి మేము అలవాటు పడుతుండగానే ఈ కేసును ఎన్‌ఐఎ తీసుకొని ముంబయికి మార్చినట్లు తెలిసి ఒకసారి మాత్రమే ఫిబ్రవరి28న ఎన్‌ఐఎ కోర్టులో కలవగలిగాను. మార్చ్‌లో కరోనా వచ్చింది. మార్చ్ 1న ఆర్థర్ రోడ్ జైల్లో నాకు పర్మిషన్ ఇవ్వలేదు.
అయితే 2006 వరకు ఆంధ్రప్రదేశ్ జైలు లోపలికి వెళ్లి పక్కన కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉండేది. అటువంటిది పూనానుంచే అద్దాల కిటికీల ములాఖాత్‌లు, ఫోన్ ములాఖాత్‌లు అలవాటు కావడానికి ఎంతో కాలం పట్టింది. నాతోపాటు నా బిడ్డలు ఇంటిపేరు మారనందువల్లనే కలవగలిగారు. నా మనవడు, మనవరాళ్ళకు కూడా అనుమతి లేదు. భాష కూడా మాకు వచ్చే హిందీ కాదు. మరాఠీ ఏమీ అర్థం కాదు. అదంతా గందరగోళంగా ఉండేది. ఎప్పుడూ జైలు ములాఖత్ తృప్తిగా ఉండేది కాదు. చాలా చికాకు కల్గించేది.
మార్చి 15 నుంచి కరోనా వచ్చింది. ములాఖత్‌లు బందయినవి. ఫోన్ వస్తేనే నేను మాట్లాడాలి. ఫోన్ ఎప్పుడొస్తదో తెలియదు. వారంకు ఒకేసారి అన్నారు కానీ 15 రోజులు ఎదురు చూస్తూ ఉండాలి. అది మొదట రెండు నిమిషాలు. తర్వాత ఐదు నిమిషాలు. జూన్ 2న
కోర్టు వాయిదా ఉంటే అక్కడ కలవచ్చని వెళ్లాను. అక్కడ తెలిసింది ఆయనకు ఆరోగ్యం బాగోలేక జెజె హాస్పిటల్లో చేర్చారని. కలిసొచ్చిన లాయరు చెప్పాడు. నేను నా మనుమరాలు ఉరుకులు, పరుగుల మీద జెజె హాస్పిటల్‌కి పోతే డిశ్చార్జ్ చేశారని చెప్పారు. తర్వాత ఫోన్ కాల్స్‌లో ఆయన మాట్లాడే ధోరణి పొంతన లేకుండా ఉన్నది. హిందీలో మాట్లాడేవాడు. నాతోనే ఎందుకట్లా మాట్లాడుతున్నావంటే “మా అమ్మ బాపు చనిపోయారు. నువ్వు ఫ్యునరల్‌కు పోయినవా” అని అడిగాడు. వాళ్ళ తండ్రి ఆయనకు 8ఏళ్లప్పుడే చనిపోయాడు. వాళ్ళ అమ్మ చనిపోయి 40 ఏళ్ళయింది. అటువంటి సందర్భంలో నా చేతిలో నుండి నా బిడ్డ ఫోన్ తీసుకొని,ఆయనతో పాటు ఉన్న, ఆయన సహాయకుడిగా జైలు ఆసుపత్రిలో ఉన్న వర్నన్ ఫోన్‌లో ఆయన ఆరోగ్యం అస్సలు బాగులేదని జెజెహాస్పిటల్‌లో మంచం మీంచి పడిపోయి మూడు కుట్లు పడ్డా పట్టించుకోలేదని, ఎప్పుడూ నేల మీద, గోడలమీద, గాలిలో రాస్తూ తనకు తానే మాట్లాడుకుంటాడని, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే పైపు వేసి మూడు నెలలైనా తొలగించలేదని చెప్పారు. తొందరగా హాస్పిటల్‌లో చేర్పించకపోతే ప్రమాదం జరగవచ్చు అని కూడా చెప్పారు.
అప్పుడు నేను, నా బిడ్డలు, మా తమ్ముడు వేణుగోపాల్ ఆన్‌లైన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. దానికి చాలా స్పందన వచ్చింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్పందన వచ్చింది. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ద్వారా ‘హాస్పిటల్‌లో చేర్చాము రమ్మని’ తెలియజేశారు. నేను, నా కూతుళ్ళు, తమ్ముడు వేణు వెళ్ళాము. అది మళ్ళీ జెజె హాస్పిటలే. కరోనా టైం. ఎక్కడ ఏమి లేదు.
ప్రయాణం చేయడం కూడా కష్టమే. మేము బొంబాయి జెజె ఆసుపత్రికి పోతే ఆయనను కలవడానికి తలోజా జైలు నుంచి పర్మిషన్ తెచ్చుకోమన్నారు. అదంతా చాలా పెద్ద ప్రాసెస్. బోరున వర్షం. ఉండడానికి ఏమీ లేదు. ఇదంతా జరిగిపోయి వెతికి చూసేవరకు ఆసుపత్రి వార్డులో ఓ మూలకు గుర్తు పట్టని విధంగా ఆ మనిషి మంచంలో ఓ మూలకు ముడుచుకొని పడుకుని వున్నాడు. మంచంలో తడి ఉచ్చ మడుగులో పడుకొని పిచ్చిచూపులు చూస్తున్నాడు. పిల్లలు తండ్రిని పట్టుకొని బోరున ఏడుస్తున్నారు. నన్ను చూసి నువ్వున్నావా అని అడుగుతున్నాడు. అట్లా మానసిక విభ్రాంత స్థితి వచ్చిందని అర్థం అయింది. నేను లేనని, చనిపోయానని అనుకుంటున్నాడు ఆయన మనసుకు. వర్నన్ చెప్తే అర్థమయింది. అక్కడ మేము, మా తమ్ముడు ఏడుస్తూ ఆ ఉచ్చబట్టలు మార్చి అన్ని సరిచేసి ఓ గంట వరకు వున్న తర్వాత ఒక పోలీసు వచ్చి వెళ్లిపొమ్మన్నాడు. మర్నాడు మళ్లీ చూడడానికి వెళ్తే కరోనా వచ్చిందని చూడడానికి లేదని వెళ్ళగొట్టారు. ఏడుస్తూనే హైదరాబాదు తిరిగి వచ్చాం. ఎన్‌హెచ్‌ఆర్‌సి, హైకోర్టు జోక్యం వల్ల ఆయనను నానావతి హాస్పిటల్‌కు మార్చినారని తెలిసింది. జులై 18 నుండి ఆగస్టు 28 వరకు ఆయనకు రెండుసార్లు కరోనా వచ్చిందని ఇతర న్యూరో, యూరిన్ సమస్యలు వచ్చినాయని రిపోర్ట్‌లను బట్టి తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో కూడా జైలుకు తిరిగి పంపారు. జైలు హాస్పిటల్‌లో డైపర్లు మార్చడం, ముఖం కడగడంలాంటి అవసరాలన్నీ ఒక చంటి పాపను తల్లి చూసుకున్నట్టు వర్నన్, అరుణ్ చూసుకున్నారు. అక్టోబర్లో జైలుకు వచ్చిన స్టాన్ స్వామి అదే జైలు ఆసుపత్రిలో
తనకన్నా వివి ఆరోగ్యం బాగోలేదని బయట వాళ్లకు తెలుపుతూ ఎంతో స్వాంతన చేకూర్చాడు. తోటి ఖైదీల ఈ తోడ్పాటు లేకుంటే వివి బతికేవాడు కాదు. ప్రపంచవ్యాప్త ఆందోళన కూడా ఇందుకు సహకరించింది. హైకోర్టు ఉత్తర్వులపై నవంబర్ 18న ఆయనను మళ్లీ నానావతి హాస్పిటల్‌లో చేర్చారు. ఇంత అనారోగ్యంగా ఉన్నాడు, మళ్ళీ జైలుకు పంపిస్తే అదే స్థితికి వస్తాడు కనుక బెయిల్ ఇవ్వమనిసుప్రీంకోర్టుకు అర్జీ పెట్టుకున్న. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్ పిటిషన్ త్వరగా విచారించమని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఆనంద్ గ్రోవర్ వాదించి మెడికల్ బెయిలు తెచ్చారు. అట్లా మార్చి 5న విడుదలయ్యాడు. కానీ అనేక షరతులతో పాటు బొంబాయిలోనే వుండాలని షరతులు విధించింది. అట్లా ఈ బొంబాయి ప్రవాస జీవితం మొదలైంది. మేము వరంగల్ నుంచి హైదరాబాద్ మారినప్పుడే అది ప్రవాస జీవితం అనుకున్నాము. ప్రాణభయంతో కూడా2002-2004 మధ్య ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. కానీ అప్పుడు జిటిబి ఎన్‌క్లేవ్‌లో విద్యార్థి యువకుల మధ్యన మేము మళ్ళీ వరంగల్ జీవితాన్ని ఫీల్ అయ్యాము. ఇప్పుడు మనుషులతో కలవలేని ఈ మహానగర జీవితం మాత్రం ఒంటరి ద్వీపం లాగున్నది.
విప్లవ హింస గురించి మీరడిగారు.
అయితే నేను కలిసిన మనుషుల గురించి చెప్తాను. 74 లో వివి జైల్లో ఉన్నప్పుడు పదకొండు నెలలు చాలా తరచుగా ఇద్దరు ట్రైనింగ్ టీచర్లు మా ఇంటికి వచ్చి పిల్లలను ఆడించి, చదువు చెప్పి, నా కష్ట సుఖాల్లో పాలుపంచుకొని, నాకు తమ్ముళ్లలాగా ఉండేవాళ్ళు – ఒకరు ముప్పాళ లక్ష్మణ్ రావు, రెండు రవీందర్ రెడ్డి. ఆ ఇద్దరి సహాయ సహకారాల గురించి నేనే వివికి జైల్లో చెప్పేదాన్ని. ముప్పాళ లక్ష్మణరావును ఆ తర్వాత నేనెప్పుడూ చూడలేదు. తరువాత ఆయన పెద్ద నాయకుడయిండని, ఆయనే ‘గణపతి’ అని తెలిసింది. కానీ నా మనసులో మాత్రం ఆనాటి బక్క పలుచటి రూపమే ఉన్నది. రవీందర్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడయిండు. తర్వాత చాలా సార్లు కలిసిండు. ఇప్పుడు అనారోగ్యం వల్ల మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. కలిసినప్పుడు చేతులు పట్టుకొని కళ్ళ నీళ్లు తీసుకుంటాడు.బాగున్నావా అక్కయ్యా అని అన్నట్టు ప్రేమగా ఉంటాడు.
1974-78లలో సృజనను కరీంనగర్, గోదావరిఖనిలకు తీసుకుపోవడానికి మేము అప్పుడు కోటి అని పిలిచే కోటేశ్వరరావు,రాజిరెడ్డి వచ్చేవారు. అప్పుడు సృజన ఖరీదు ఒక రూపాయి. సృజనలు అమ్మి పైసలు తెచ్చిచ్చేవారు. ఆ క్రమంలో నన్ను అక్కయ్య అని పిలిచి ఏ సమయంలో వచ్చినా అన్నం తిని వెళ్ళేవాళ్ళు. వాళ్లు ప్రేమపడి నా నుంచి కూడా ప్రేమ పొందే వాళ్ళు. అట్లా బెంగాల్‌లో ఎన్కౌంటర్ అయిన ‘కిషన్‌జీ’ ఆయనే అని తెలిసినప్పుడు బాధపడ్డాను.
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత వివి దగ్గరికి చాలామంది విద్యార్థులు, యువకులు వచ్చేవాళ్ళు. వాళ్లలో జన్ను చిన్నాలు మా ఇంట్లో మనిషయిండు. రెండు సంవత్సరాల లోనే జిల్లా విప్లవోద్యమ నాయకుడని ఆయనను పట్టు పగలు రోడ్డు మీద చంపేశారు. ఆ దృశ్యం చూసినపుడు ఇంత మంచి వాళ్ళను ఎట్లా చంపేశారని కడుపు తరుక్కపోయింది. నర్సుగా పనిచేసే నా బిడ్డలతో పాటు పెద్ద బిడ్డగా చూసుకున్న భాగ్య, తమ్ముడు ప్రకాష్, సహచరుడు పులి అంజయ్య ద్వారా విప్లవోద్యమంలోనికి వెళ్లి ఎన్‌కౌంటర్లో మరణించినప్పుడు కన్నపేగు కదిలినట్టయింది. వివికి విద్యార్థి మా ఇంటి ఎదురుగా ఉండే లింగమూర్తి నా చిన్న బిడ్డను ఎత్తుకొని తిరిగేవాడు. మా ఇంట్లో ఏం చేసుకున్నా చిన్న పాప తీసుకుపోయి ఇచ్చేది. ఎమ్‌ఎలో గోల్డ్ మెడల్ తెచ్చుకొని ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్లి రాష్ట్ర నాయకుడై కృష్ణలో పుట్టి ప్రమాదంలో మునిగి చనిపోయాడని తెలిసినప్పుడు ఎంతో ఆవేదన చెందాను. అట్లాగే హైద్రాబాద్‌లో మాకు అనుబంధాలేర్పడి సీను అని పిలిచే ఎమ్‌ఎస్‌ఆర్, వీరన్న, వివేక్‌లాంటి వాళ్ళు ఎన్‌కౌంటర్లో చనిపోయినప్పుడు కూడా ఎంతో దు:ఖంకలిగింది. విడుదలై బహిరంగ జీవితంలో ఉన్న ఎందరో నాయకులు మా ఇంటికి వచ్చేవారు. చాలా సన్నిహితులయిన్రు. వాళ్ళలో గంటిప్రసాదం గారి హత్య మా హృదయాలను కలచి వేసింది. ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన వాళ్లందరితో నాకు పరిచయమయింది. చాలా మంచి వాళ్ళు, న్యాయం కోసం నిలబడ్డవాళ్ళనిపించింది.
ఎన్.టి.ఆర్ పాలనలో చాలా ‘మిస్సింగ్’ హత్యలు జరిగి దానిమీద న్యాయవిచారణ కూడా జరిగింది. అప్పుడు బాలగోపాల్ సూచనతో నేను ఆయన సహచరి వసంత లక్ష్మి కొందరి తల్లులు, భార్యల దగ్గరకు కూడా వెళ్లి వాళ్ళ ఆవేదన, వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్లను ఓదార్చాము.
అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళు కలిసినప్పుడు ఎన్‌కౌంటర్ అయిన వాళ్ళ బంధువులను పలకరించేదాన్ని. ఇట్లాంటి వాళ్ళు సుభాష్ నగర్ అమరుల స్థూపం దగ్గర లేదా వేరే మీటింగ్‌లలో కలిసినప్పుడు ‘అమ్మా, అక్కా’ అని దగ్గరకు వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంటే నాకు కళ్ళ నీళ్లు వచ్చేవి. ఇటువంటి వాళ్లంతా సామాన్యులు కదా అనిపించేది. తెలుగు నేల మీద ఎంతోమంది ఇటువంటి వాళ్లంతా నన్ను ‘అమ్మా, అక్కా ‘ అని పిలుస్తుంటే నాకెంతో తృప్తిగా గర్వంగా ఉంటుంది.
వివి ఎప్పుడూ విప్లవాన్ని హింస-అహింస దృష్టితో కాకుండా న్యాయాన్యాయాల దృష్టితో చూడాలనే వాడు. మేజోళ్ళు అల్లడమయినా విప్లవానికి దోహదం చేసేదే అనుకుంటే వివి తన మాటయినా, రాతయినా విప్లవానికి ఉత్తేజం కలిగించేది కావాలనుకున్నాడు. ఆయన ఒక కవితలో “నక్సల్బరీ నా ఊపిరి, విప్లవం నా గురి” అని రాసుకున్నాడు. భీమా కోరేగావ్ కేసుతో ఆయనేమీభయపడలేదు. “కలం కే సిపాయి” అయిన తన వంటి వాళ్లను చూసి రాజ్యమే భయపడిందనుకొన్నాడు.
Nice interview Ajaaj.ji—-I know SIR &HIS FAMILY
HE IS MY FRIEND —-i am so proud to say
History always RECOGNIZES him—all the times