ఒక ప్రపంచ దిమ్మరి గురించి!

ప్రొఫెసర్ మాచవరపు ఆదినారాయణ గారు కేవలం యాత్రికుడే కాదు. యాత్రా సాహిత్యవేత్త కూడా. ఈ భూమ్మీద ఆయన అడుగులు ఎన్ని పడుంటాయో ఆయన కలం నుండి అన్ని అక్షరాలు జాలువారి వుంటాయి. ఆయన ప్రతి అడుగు ఒక అక్షరంగా ప్రాణం పోసుకుంది. తేయాకు తోటలో స్త్రీ కార్మికులు ఒక్కో ఆకుని తెంపి అలవోకగా వీపుకి తగిలించుకున్న వెదురు బుట్టలోకి ఆకుల్ని విసిరినట్లు ఈయన తన ప్రతి అడుగుని ఒక అక్షరంలా జ్ఞాపకాల వెదురు బుట్టలోకి విసిరారు. అలా ఆయన విస్తృతమైన యాత్రా సాహిత్యాన్ని సృష్టించారు ఇంతకుమునుపే. ఇప్పటికే ఆయన 1. భ్రమణ కాంక్ష, 2. డెకరేటీవ్ ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ టెంపుల్స్, 3. జిప్సీలు (ప్రపంచ వ్యాప్త సంచారుల జీవితాలు), 4. స్త్రీ యాత్రికులు, 5. మహా యాత్రికులు, 6. తెలుగువారి ప్రయాణాలు, 7. భూభ్రమణ కాంక్ష, 8. ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర పుస్తకాలు రాసారు. ఆయన ఒక ఎక్స్‌క్లూజివ్ యాత్రా సాహితీవేత్త. నాకు తెలిసి ఆయన కవిత్వం కానీ మరే ఇతర ఫిక్షన్ కానీ రాయలేదు. తిరగటానికి కాళ్ళను, రాయటానికి చేతుల్ని విస్తృతంగా ఉపయోగించే ఆయన పుస్తకాలు అన్నీ చదవలేదు నేను. సుమారు రెండేళ్ళ క్రితం ఆయన రాసిన ఆరుఖండాల్లోని 14 దేశాల్లోని ప్రయాణాల సోదాహరణ యాత్రా కథనం “భూభ్రమణ కాంక్ష”కి ఫిదా అయ్యాను. “భూభ్రమణ కాంక్ష” చదివిన తరువాత నాకది పుస్తకంలో దాచుకునే నెమలి కన్నులా జ్ఞాపకంలా వుండిపోగలదనిపించింది. అందుకే ఈ నెల “నెమలీక” శీర్షికన “భూ భ్రమణ కాంక్ష”ని పరిచయం చేయదలుచుకున్నా.

“తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది!” ఇది మాచవరపు ఆదినారాయణగారి జీవిత తాత్వికత. దేశాలు పట్టుకు తిరిగే తుమ్మెదలాంటి ఆదినారాయణగారికి ఆనందమనే తేనె దొరుకుతుంది. ఆయన ప్రయాణాల రైతు. బోలెడు అనుభవాల పంటలు పండిస్తాడు. “మా తాతయ్య వైకుంఠ పెరుమాళ్ళు మాదిరిగా పాటలు పాడుకుంటూ, ప్రకృతిని పూజించుకుంటూ పూర్తి స్థాయి దేశ దిమ్మరిగా మారిపోదాం అని డిగ్రీ చదివే రోజుల్లోనే అనుకునే వాడిని” అని తన “ముందుమాట”లో రాసుకున్నారంటే ఆయనకి ప్రయాణాలనేవి పక్షికి ఎగరటం లాంటిదన్న మాట. సంసార జీవితానికి కాక సంచార జీవితానికి మాత్రమే తాను పనికొస్తాననే ఇంటర్ చదివే కాలం నాటి అవగాహన ఆయనది. సంచారం ఆయన సహజాతం. అందుకనేమో వాళ్ళ అమ్మమ్మ “ఒరే చిన్న గాలోడా!” అనేదంట. (పెద్ద గాలోడు వాళ్ళ తాతయ్యన్న మాట) జీవితం గడపటంలో ఒక మూసలో ఒదగనితనం, ఒక నమూనాలో కుదురుకోనితనం ఆయనలో దండిగా వుండటం వల్లనే ఆయన సంచారి కాగలిగారు. అలాగని ఆయనేమీ అరాచకుడు కాదు. ఆయన ఓ సంచారి. అంతే. సంచారులందరూ అనుభవ సంపన్నులు. వాళ్ళకి ఇల్లు, కుటుంబమూ, మిగులు ఆస్తుల జీవన ఆరాటాలు వుండవు. సంచారులు ఎంతో క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడుపుతారు. సంచారం అనేది ఓ తాత్విక దృక్పథం. ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయిన మాచవరపు ఆదినారాయణగారు కూడా ఓ బలమైన క్రమశిక్షణాయుత సంచార జీవి. జీవిత గమనానికి తన కాళ్ళని ఇంతలా నమ్ముకున్న వాళ్ళు అరుదు. ఈ ‘ప్రయాణాల ప్రవక్త’ భార్య పిల్లలు లేని ఒంటరి. ఒంటరి వాడికి అందరూ స్నేహితులే. ఒంటరి వాడెప్పుడూ ఓ విశ్వమానవుడే.

“సముద్రం జ్ఞానమైతే ఒక వెన్నెల రాత్రి పడవ మీద ప్రయాణించగలగటం ఒక మధురానుభూతి. జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి.” అనే ఆదినారాయణగారు నాకు రెండు రకాలుగా అబ్బురంగా అనిపిస్తారు. ఒకటి ఆయన ప్రయాణానుభవాలు. రెండు ఆయన మైండ్ సెట్. రెండింటికీ ఒక అవినాభావ సంబంధముంది. “కదిలే పంజరం లాంటి ఈ శరీరంలో స్థిరంగా వుండలేక, బంధాల్ని తెగ్గొట్టుకొని బయటికి వచ్చిన ప్రయాణాల పక్షిని నేను.”అన్న ఈ స్వీయ ఎరుకే, ఆ మనో సంపదే కదా ఆయన్ని మన నుండి వేరు చేసింది. ప్రవృత్తి దృష్ట్యా ఆయన మన నుండి వేరుగా వుంటాడేమో కానీ దూరంగా వుండలేడు. ఈ పుస్తకం నిండా ప్రకృతి గురించి, తన జీవితావగహన గురించి తాత్వికమైన కవితాత్మక వాక్యాలుంటాయి. అకడమిక్ గా కూడా కళాశాస్త్రంలో ఆచార్యుడు అయినందువల్లనేమో ఆయన వాక్యం కూడా కళాత్మకంగా వుంటుంది.

“భూ భ్రమణ కాంక్ష”లో ఈ ప్రయాణాల గండభేరుండం విహరించిన ఆసియా ఖండంలోని నేపాల్ (2009), భూటాన్ (2010), ఇరాన్ (2011), చైనా (2013), ఐరోపా లోని స్వీడన్ (2012), నార్వే (2014), ఫ్రాన్స్ (2014), ఇటలీ (2014), బ్రిటన్ (2015), స్కాట్లాండ్ (2015), ఉత్తర అమెరిక లోని మెక్సికొ (2014), దక్షిణ అమెరికా లోని బ్రెజిల్ (2016), ఆఫ్రికాలోని నైజీరియా (2013), ఆస్ట్రేలియాలోని తాస్మానియా (2015) యాత్రా కథనాలున్నాయి.

నాబోటోడు కూడా ఎంతో కొంత దాచుకునో, బాంక్ లోన్ తీసో సంవత్సరానికోసారి విదేశాలకెళ్ళి రావొచ్చు. నేను ప్రధానంగా సందర్శకుడిని. ఆయన యాత్రికుడు. మాలాంటోళ్ళం ఇండియన్ ఫుడ్, ఇంగ్లీష్ గైడ్ తో సహా ఏర్పాట్లు చేసే ఏదో ట్రావెల్ ఏజెంట్ తో ఒక 5, 7, 9 రోజుల ఏదో పాకేజి మాట్లాడుకొని, వాడు చూపించే ఒకట్రెండు నగరాలు, జస్ట్ కాసింత గ్రామీణ ప్రాంతం, కొన్ని చారిత్రిక ప్రదేశాలు, నిర్మాణాలు, వీధులు, వాహనాలు, మ్యూజియాలు చూసి, కొంచెం షాపింగ్ చేసేసి తిరిగి వస్తాం. తక్కువ డబ్బులో మంచి హోటల్, వాహనం, గైడ్ పాకేజి దొరుకుతుందా లేదా అని చూసుకుంటాం. (ఓ దానికే తెగ ఇదై పోయి ఒక సంవత్సరం పాటు సోషల్ మీడియాలో మా టైంలైన్లలో ఆ ఫోటోలతో ఓ మోత మోగించేస్తాం. మరి మాకు అదే గొప్ప కదా!) మేం దేశాలు చూస్తాం. ఆయన లోకం చుడతాడు. ఒకే ప్రాంతాన్ని చేరుకునే లక్ష్యంలో తేడా వుంటుంది.

“ఎగుడు దిగుడు కాలిబాటలు నా స్వర్గద్వారాలు” అంటూ తన జీవిత మేనిఫెస్టోని ప్రకటించిన ఈ నడక నారాయణ ఏ టూరిస్టు పేకేజీని నమ్ముకోకుండా ఓ పరాయి దేశంలో ఓ మిత్రుడిని వెతుక్కుంటాడు. ఆ మిత్రుడి ఇంట్లో ఆశ్రయం తీసుకుంటాడు. (నేపాల్లో ఒక కొండ గ్రామంలో పశువుల పాక మీద వేసిన గదిలో కాలక్షేపం చేసారట) ఒకే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ మిత్రుల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ వున్న ఆ నాలుగు రోజులు వాళ్ళింట్లో కుటుంబ సభ్యుడౌతారు. వాళ్ళతో కలిసి భోజనాల బల్ల మీద ఉల్లాస కాలక్షేపం చేస్తారు. వారి ఆహారాన్ని పంచుకుంటారు. వారి మంచాల మీదనే నిద్ర పోతారు. వారితో కలిసి సైకిళ్ళేసుకొని ఊరి బైటకి వ్యాహ్యాళి వెళతారు. “ఎన్ని దేశాలు తిరిగినా కొత్త ప్రదేశం అని ఏదీ అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా వున్న స్వదేశాలే అన్నీ. ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం!” అంటారు ఆయన. ఇప్పుడు చెప్పండి ఈ నాలుగు పొట్టి వాక్యాల్లో మీకేం కనిపించింది? ఒక విశ్వమానవీయత కనిపించదూ! అందుకే ప్రపంచం మొత్తానికి పక్కా లోకల్ అనిపిస్తాడు ఈ మెరుపు గడ్డపు యాత్రా సన్యాసి! స్వయంగా శిల్పి, చిత్రకారుడు, మంచి హోదాలో రిటైర్ అయిన కారణంగానూ ప్రపంచ వ్యాప్తంగా స్నేహితుల్ని ఏర్పరుచుకోగలిగారు. విదేశాలలోని తనలాంటి యాత్రాభిలాషులకు ఆయన ఇక్కడ ఆశ్రయమిస్తారు. తాను అక్కడికెళ్ళినప్పుడు ఆశ్రయం తీసుకుంటారు. హోటళ్ళలో దిగరు. ఎందుకంటే దేశాన్ని చూడటమంటే ఆ సమాజాన్ని చూడటం కదా మరి.

దేశాన్ని చూడటమంటే ఏమిటి? నగరాల రోడ్లు మాత్రమే కాక వాగులు, వంకలు, గుట్టలు, కొండలు, పర్వతాలు…వాటిని అధిరోహించటం, ఆ లోయల్లో ప్రయాణించటం, గ్రామీణ జీవితం, వనరులు వంటి భౌగోళిక విశేషాలతో పాటుగా, మతం, సంస్కృతి, కళ, సారస్వతం, ఆహారం, ఆహార్యం, ఇళ్ళ నిర్మాణం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ నిర్మాణం, జీవన శైలి, వృత్తులు, విరామ సమయాల కాలక్షేపం….ఇలా మనిషికి సంబంధించిన ఏ చిన్నది వదలకుండా పరిశీలించటం! స్థానిక సంక్షోభాల్ని పరిశీలించటం, అర్ధం చేసుకోవటం కూడా యాత్రలో భాగమే ఈ యాత్రా మేధావికి! ప్రతి దేశానికి దాని ముఖ్య లక్షణమైన ఒక టాగ్ లైన్ వేస్తారు ఈయన. ఉదాహరణకి భూటాన్ గురించి చెబుతూ “ఆదాయం కంటే ఆనందం ముద్దు”, ఇరాన్ గురించి వర్ణిస్తూ “కవులూ – గులాబీలు కలిసిన స్వర్గం” అంటారు.

మానవజాతి విలసిల్లిన ప్రతి చోట కవులుంటారు, కళాకారులుంటారు, శిల్పులుంటారు, నిర్మాణాలుంటాయి. అందుకే ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంత భౌగోళిక, కళాత్మక, సారస్వత విశేషాలు పరిశీలిస్తాడాయన. ఉదాహరణకి నేపాల్లోని బౌద్ధనాధ్ ఆలయంలో బుద్ధుని విగ్రహంలో ముక్కు ఉండాల్సిన చోట “ఒకటి” (1) అంకె వేసుంటుంది. దానిక్కారణం చెబుతారు “బుద్ధుని దృష్టిలో అందరూ ఒక్కటే. అందరూ సమానమే అనే బౌద్ధ తత్వానికి ఇది మార్మిక ప్రతీక అంటారు. “కాష్టమండప్” అనే పేరు కాలక్రమంలో “ఖాట్మండ్”గా మారిపోయిందని విశదీకరిస్తారు ఈ స్కాలర్ జిప్సీ.

స్వీడన్ సమాజం గురించి చెబుతూ అక్కడి ప్రజలు చర్చి కి వెళ్ళటమైనా మానేస్తారేమో కానీ ఇంట్లో వున్న చెత్తని తీసుకెళ్ళి రీసైక్లింగ్ సెంటర్లో ఇవ్వటం మాత్రం మరిచిపోరట. స్వీడన్ సమాజ జీవితం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే నేపాల్ సమాజంలో నిత్య అస్తిమితం వల్ల అక్కడి ప్రజలు విదేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుందామనుకుంటారట. ఒక యువతి తాను ఏదో ఒక పేపర్ మేరేజి చేసుకొని అమెరికా వెళ్ళి ఆ తరువాత తన జీవితం తాను గడుపుతానంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. కానీ మీరు స్వయంగా చదవటమే హృద్యంగా వుంటుంది.

గొప్ప కవిత్వ పరిమళంతో కూడిన వాక్య విన్యాసంతో సుమారు నాలుగు వందల పుటల ఈ పుస్తకంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఆరు ఖండాలకు చెందిన పధ్నాలుగు దేశాలకు చెందిన సమాజాల, అందలి ప్రజల జీవితాన్ని మనకు పరిచయం చేస్తూ మిమ్మల్ని హత్తుకుంటుంది.

చప్పట్లు. ఆలింగనాలు కూడా మాచవరపు ఆదినారాయణ గారూ!

(“భూభ్రమణ కాంక్ష” రచన మాచవరపు ఆదినారాయణ (9849883570), పేజీలు 403. ప్రచురణ “బాటసారి బుక్స్”)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

2 thoughts on “ఒక ప్రపంచ దిమ్మరి గురించి!

  1. చాలా మంచి వ్యాసం

Leave a Reply