కరోనా కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలామంది అనాథలుగా మారారు, అంతటి క్లిష్ట సమయంలోనూ ఒక వెలుగు వెలిగింది ఐటీ రంగం మాత్రమే. ఈ సమయంలో ఐటీ రంగం ఎన్నో కొత్త నియామకాలు చేపట్టి దేశంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించింది. ప్రాంగణ నియామకాలతోనూ కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంతటి ప్రగతి సాధించిన ఐటీ రంగం నేడు తీవ్ర సంక్షోభంతో అతలాకుతలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఏ రోజు ఏ కంపెనీ ‘పింక్ స్లిప్’ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నేడు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఆ ప్రభావం ఇతర దేశాలపై చూపిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నవన్నీ ఉత్పత్తి ఆధారిత కంపెనీలే. సేవల ఆధారిత కంపెనీల్లో… అందునా భారతదేశానికి చెందిన సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో కోతలు తక్కువ. ఉత్పత్తి ఆధారిత సేవలందించే అమెరికన్ కంపెనీల్లో టాప్-5.. ఫేస్బుక్ (మెటా), యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ఈ ఐదింటినీ కలిపి ‘ఫాంగ్ (ఎఫ్ఎఎఎన్జి)’ కంపెనీలుగా పిలుస్తారు. అలాగే మనదేశం నుంచి సేవలు అందించే ఐదు సర్వీస్ బేస్డ్ కంపెనీలు… హెచ్‌సిఎల్, విప్రో, ఇన్ఫోసిస్, టిసిఎస్, కాగ్నిజెంట్. అయితే, కాగ్నిజెంట్ ఒక్కటే అమెరికన్ బహుళజాతి కంపెనీ. అందుకే, ఆ ఒక్క సంస్థే ఇటీవలి కాలంలో.. బ్యాక్‌గ్రౌండ్ చెక్ సరిగా లేదన్న నెపంతో, ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించారన్న కారణంతో భారతదేశంలోని 12 వేల మంది ఉద్యోగులను తీసేసింది. ఇలా ఫేస్బుక్, అమెజాన్, ట్విటర్ వంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉద్వాసనకు గురైనవారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. వారి నుంచి భారతదేశానికి వచ్చే రెమిషన్స్ తగ్గుతున్నాయి. ఫలితంగా వారి కుటుంబాలపైన, వారి వ్యయసామర్థ్యంపైనా.. పరోక్షంగా దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం పడుతోంది.
ప్రపంచానికి మెడ మీద కత్తిలా వేలాడుతున్న మాంద్యం, యుద్ధం భయపెడుతున్న వేళ అంతర్జాతీయ, జాతీయ టెక్ సంస్థలు ఒత్తిడిలోకి జారుకుంటున్నాయి. అమెరికన్ టెక్ సంస్థలు అనేకం ఉద్యోగుల్ని తగ్గించుకొనే పనిలో పడడంతో వేలాది మంది వీధిన పడనున్నారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఎక్కువగా భారతీయులు. హెచ్-1బి వీసాలపై వచ్చిన కొలువు పోతే పరిస్థితి కష్టమే. అరవై రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోకుంటే ఇంటికే. భారత ఆర్థిక వ్యవస్థపైనా ఉద్వాసనల పరోక్ష ప్రభావం పడనుంది. సదరు సంస్థల భారతీయ శాఖల్లో పనిచేస్తున్న మనవాళ్లమీద అనివార్యంగా ఆ ప్రభావం పడుతోంది. ఉద్యోగులను తీసివేసే ప్రణాళికలతో పాటు కొత్త నియామకాలపై ఐటీ కంపెనీలు అచీతూచీ వ్యవహారిస్తున్నాయి. అవి ఇప్పుడు పొదుపు మంత్రాన్ని జపిస్తోన్నాయి. అమెరికాతో పాటు పలు దేశాల్లో సహా అనేక పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా మారిన నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఆవరిస్తుందన్న భయం పెరిగింది. ఆ సంకేతాలు రోజు రోజుకు ఉధృతమవుతూ వస్తున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే మున్ముందు ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా టెక్ కంపెనీల్లో సంక్షోభం :
ఐటీ రంగం కుదేలవ్వడానికి ప్రధాన కారణం అధిక ద్రవ్యోల్బణం. దీనిని అదుపు చేసేందుకు, ద్రవ్య చలామణిని అరికట్టేందుకు అన్ని దేశాలు పూనుకుంటున్నాయి. సంక్షోభం నుండి గట్టెక్కడానికి అమెరికా ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్ల పెంపు ప్రయత్నాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఇతర దేశాలు అనుసరిస్తున్నాయి. మన రిజర్వు బ్యాంకు సైతం వడ్డీ రేట్లను పెంచింది. ఐటీ కంపెనీలు శ్రామికశక్తి పునర్మూల్యాంకనంతో ఈ ఏడాది ఇప్పటివరకు 850కి పైగా టెక్ కంపెనీల్లో లక్షా 37 వేల వైట్ కాలర్ ఉద్యోగాలు ఇంటి బాట పట్టాల్సి వచ్చిందని ఓ అంతర్జాతీయ అంచనా. లిఫ్ట్, స్ట్రైప్, కాయిన్‌బేస్, షాపిఫై, నెటిఫ్లిక్స్, శ్నాప్, రాబిన్‌హుడ్, చైమ్, టెస్లా వంటి అనేక దిగ్గజ సస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా కేంద్రంగా నడుస్తున్న భారీ సంస్థలు ఒక్క గత నెలలోనే 33,843 ఉద్యోగాలకు మంగళం పలికాయి. ఉద్యోగాల కోత సుమారు 13 శాతానికి ఎగబాకింది.
గత ఆరు మాసాలుగా గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్, మైక్రోసాఫ్ట్‌ల పనితీరు, అమ్మకాలు మందగించాయి. మరోవైపు ఆ టెక్ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్ నిపుణల అంచనాలను చేరలేకపోయాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు నేల చూపులు చూశాయి. గూగుల్ షేర్ విలువ ఆరు శాతం మేర పడిపోయింది. వ్యయాలు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్ తన తదుపరి తరం పిక్సల్ బుక్ ల్యాప్‌ట్యాప్ ప్రణాళికను రద్దు చేసింది. ‘ఏరియా 120’ పేరిట గూగుల్ ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇంక్యుబేటర్‌కు ఇచ్చే నిధుల్లోనూ కోత పెట్టింది. ఇప్పటికే డిజిటల్ గేమింగ్ సర్వీస్ స్టూడియోను మూసివేస్తున్నట్టు గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఖర్చు తగ్గించుకొనే పేరిట రాత్రికి రాత్రి వేలాది ఉద్యోగాలు తీసిపారేస్తున్న పాడుకాలం ఆరంభమైంది. ముందుముందు మరింత భయానకమైన ‘టెక్ వింటర్’ ఉన్నదంటూ హెచ్చరికలూ వినిపిస్తున్నాయి.
2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ (జిఎఫ్‌సి) వచ్చినప్పుడు వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుమీద పడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పులి మీద పుట్రలా గూగుల్ సైతం ఉద్వాసనల బాట పట్టింది. లక్షా 87 మందితో టెక్ రంగంలో అతి పెద్ద ఉద్యోగ సంస్థ అయిన గూగుల్ సంస్థలో గణనీయమైన వాటాతో యాజమాన్య నిర్ణయాలను ప్రభావితం చేసే ‘యాక్టివిస్ట్ హెడ్జ్ ఫండ్’ నుంచి ఒత్తిడి ఉంది. పని తీరులో రేటింగు అతి తక్కువగా ఉన్నవారినే తొలగిస్తామన్నది గూగుల్ చెబుతున్న మాట. మరోవైపు ఉద్యోగ స్థానాల్లో గణనీయంగా ఊపందుకున్న ఆటోమేషన్ ప్రభావం సరేసరి. వెన్నాడుతున్న ఆర్థిక మాంద్యానికి విక్రయాలు తగ్గాయి.
మాంద్యం తీవ్రత 2023 చివరి వరకు ఉంటుందని ప్రపంచ దేశాల సిఇఒలు సైతం హెచ్చరిస్తున్న క్రమంలో రానున్న రోజుల్లో టెక్ దిగ్గజాలు ఉద్యోగుల నియామకాల్ని తగ్గిస్తున్నట్టు వెల్లడించాయి. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో గూగుల్, యూట్యూబ్ అమ్మకాలు 6 శాతం మాత్రమే పెరిగాయి. కొవిడ్ తర్వాత ఇవే అత్యంత నిరాశకర ఫలితాలు కావడం గమనార్హం. ప్రకటనల మీద చేసే ఖర్చులను ఏకంగా 69 బిలియన్ డాలర్లు తగ్గించుకున్నట్టు గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ పేర్కొన్నారు. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ సంస్థకు చెందిన కంప్యూటర్లు, ఇతర టెక్నాలజీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందని పేర్కొంది. గడిచిన ఐదేండ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఉత్పత్తుల విక్రయాలు 50 బిలియన్ డాలర్లకు పరిమితమయినట్టు పేర్కొంది. ఇదివరకుతో పోల్చితే 2022 డిసెంబర్ త్రైమాసికంలో నియామకాలను సగానికంటే తక్కువగా ఉంటాయి.
తొలుత మూన్‌లైటింగ్, ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, ప్రస్తుతం కాస్ట్ కటింగ్.. ఇలా కారణం ఏదైతేనేమి ఐటీ రంగంలో ఉద్యోగాల కోతల కాలం నడుస్తోంది. తాజాగా మరో దిగ్గజ ఐటీ కంపెనీ కూడా ఇదే బాటలో వెళ్లాలని నిర్ణయించింది. అమెరికా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన సిస్కో భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధపడినట్లు తెలిసింది. ఒకేసారి 4,100 ఉద్యోగులను ఉన్న పళంగా తీసేయాలని సిస్కో నిర్ణయించినట్లు సమాచారం. కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బిజినెస్ జర్నల్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సిస్కోలో మొత్తం 83,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ‘రీబ్యాలెన్సింగ్’ యాక్ట్ ఫర్ ‘రైట్‌సైజింగ్ ద బిజినెస్’ పేరుతో 4 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిస్కో నిర్ణయించినట్లు జర్నల్‌లో చెప్పుకొచ్చారు. అయితే.. ఉద్యోగాలను తీసివేయాలనుకోవడానికి కారణం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలనో, కాస్ట్ సేవింగ్స్‌లో భాగంగానో కాదని సిస్కో ముఖ్య అధికారి స్కాట్ హెరెన్ చేప్పారు.
సిస్కోలో ఉద్వాసన నిర్ణయాన్ని కేవలం ‘రీబ్యాలెన్సింగ్’ గా మాత్రమే చూడాలని కుంటిసాకులు చెబుతున్నారు. ఈ ఉద్యోగాల తీసివేత నిర్ణయం కారణంగా ఇప్పటికే ఈ చర్యకు పాల్పడిన మెటా, ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్, అమెజాన్ వంటి టెక్ కంపెనీల జాబితాలో సిస్కో కూడా నిలిచింది. ఇదిలా ఉండగా… అమెజాన్‌లో ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాదీ కొనసాగనున్నాయి. కంపెనీ సిఇఒ ఆండీ జెస్సీ ఈ విషయం ప్రకటించారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేదంటూ అమెజాన్ కొద్ది రోజుల క్రితమే 11,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ బహిరంగంగానే మాంద్యంపై భయం వ్యక్తం చేశారు. ఎడాపెడా అప్పులు చేసి చేతులు కాల్చుకోవద్దని అమెరికా కంపెనీలు, వినియోగదారులకు హితవు చెప్పాయి. సిఇఒ తాజా ప్రకటనతో అమెజాన్‌లో ఇంకా మిగిలి ఉన్న ఉద్యోగులకూ తీసివేతల భయం పట్టుకుంది.
ప్రస్తుతం లే ఆఫ్‌ల కాలం నడుస్తోంది. ట్విట్టర్‌తో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత మెటాకు, ఇతర సంస్థలకు పాకింది. ఇప్పుడు అమెజాన్ ఇండియా వంతు వచ్చింది. సంస్థను స్వచ్చంధంగా విడిచి వెళ్లిపోవాలని కోరుతూ ఉద్యోగులకు ‘వాలంటరీ సెపరేషన్’ ఆఫర్ ప్రకటించింది. ఈ వాలంటరీ సెపరేషన్ ప్రొగ్రాంలో భాగంగా 22 వారాలకు సమానమైన బేసిక్ వేతనాన్ని ఒకేసారి చెల్లిస్తారు. అంటే తమ సర్వీసులో ప్రతి ఆరు నెలలకు ఒక వారం చొప్పున గరిష్టంగా 20 వారాలకు బేస్ వేతనాన్ని చెల్లిస్తారు. ఈ మేరకు ఉద్యోగులకు నోటీసు అందిస్తారు. నోటీసు కాలపరిమితి ముగిసే వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. లేదంటే తక్షణం కంపెనీ ఆఫర్ చేస్తున్న మొత్తాన్ని తీసుకుని సంస్థలను వదిలి వెళ్లిపోవచ్చు. ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛను ఉద్యోగులకే వదిలేసింది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో 10వేల మంది ఉద్యోగాలకు లే ఆఫ్ ఇవ్వాలని అమెజాన్ నిర్ణయించింది. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం అమెజాన్ చరిత్రలోనే ఇది తొలిసారి.
మాంద్యం చాయలతో ఐటీ కంపెనీల్లో గందరగోళం చేసుకోవడంతో దిగ్గజ సంస్థలు ఇచ్చిన నియామక లేఖలపై వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. కొన్ని సంస్థలు నియామకాల్లో వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నాయి. ఆఫర్ లేటర్లు పొందిన అభ్యర్తులకు చేరికలపై స్పష్టత నివ్వకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ముందు అన్ని అర్హతలు చూసి ఆఫర్ లేటర్లు ఇచ్చిన వారి నుంచి తప్పించుకోవడానికి సూక్ష్మలోపాలు వెతికి వాటిని కారణంగా చూపుతున్నాయి. హెచ్చు వేతనాలు తీసుకునే నిపుణుల వేతనాలలో సైతం కోతలు మొదలు పెట్టారు. ఉద్యోగులకు ఇచ్చే వేతనాల పెంపు వాయిదా వేయడం లేదా తక్కువ పెంపుతో సరిపెట్టే చర్యల ద్వారా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రమోషన్ల సంగతి సరే సరి. ఉద్యోగుల భారాన్ని తొలగించుకోవడానికి కొన్ని కంపెనీలు అయితే మూన్ లైటింగ్ అనేది ఒక సాకుగా చూపించి ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రముఖ చిప్ దిగ్గజ కంపెనీ ఇంటెల్ తమ 1.15 లక్షల మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిని ఇంటికి పంపించాలని భావిస్తోన్నట్టు రిపోర్టులు వచ్చాయి.
సోషల్ మీడియా, ఇ-కామర్స్, ఇ-ఎడ్ తదితర ఇంటర్నెట్ ఆధారిత సంస్థల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు సాఫ్ట్వేర్ రంగంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. వేలాది కొలువులు ఊడుతున్నాయి. పనిగంటలు పెరిగిపోతున్నాయి. అదనపు పని గంటలు పని చేస్తారా? ఇంటికి వెళ్ళిపోతారా? అంటూ టెక్ కంపెనీల అధినేతలు ఉద్యోగులకు హుంకుం జారీ చేసే స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. అందాల ఐటి కలలు ఛిద్రమై బతుకులు కన్నీటి సారలుగా మిగిలిపోతున్నాయి. ఐటీ అనుబంధ రంగాలైన విమానయానం, ఆతిథ్య రంగం, స్థిరాస్తి తదితర రంగాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులను సాకుగా చేసుకొని టెక్ కంపెనీలన్నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పాలకులు చేష్టలుడిగి వాటికే సాగిలపడుతుండటం దారుణం.
లాక్డౌన్ సమయంలో ‘వర్క్ ఫ్రం హోం’ వంటి శ్రమ దోపిడీ ఎత్తుగడలు పన్నిన కంపెనీలు.. ఇప్పుడు పని గంటలు పెంచుతూ ఆ మేరకు సిబ్బందిని కుదించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. టెస్లా అధినేత ఎలన్ మస్క్ మొదలుపెట్టిన ఈ దురాగతాన్ని మెటా (ఫేస్బుక్, వాట్స్‌యాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపు సంస్థ). గూగుల్, అమెజాన్, స్విగ్గీ, ఇతర సంస్థలు కొనసాగిస్తున్నాయి. ఆన్లైన్ స్టార్టప్‌గా పెను సంచలనం సృష్టించిన బైజూస్ సంస్థ ఇప్పుడు మసకబారుతోంది. వేలాది మంది ఉన్నత ఉద్యోగులను ఇంటికి పంపేసింది. అమెరికా, బ్రిటన్ వంటి పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభ సుడిగుండంలో చిక్కుకోవడంతో త్రైమాసిక ఫలితాల్లో వృద్ధి గ్రాఫులన్నీ తిరోగమనం పడుతుండటంతోనే ఐటి కంపెనీలు ‘పొదుపు చర్యల’కు తెగిస్తున్నాయన్నది ఓ విశ్లేషణ. ఇది ప్రారంభం మాత్రమేనని అసలైన ముసుళ్ల పండుగ ముందున్నదని హెచ్చరిస్తున్నారు. జారిపోతున్న ఆర్థికవృద్ధి రేటు అంచనాలు ఆ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి.
భారత్‌కు గడ్డుకాలమే …
మన దేశ ఐటీ రంగానికి రానున్నది గడ్డుకాలమే అంటున్నారు. భారత ఐటీ రంగం దాదాపు విదేశీ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. వారే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తారు. వారి పరిస్థితే సరిగా లేకపోతే ఆర్డర్లు ఎలా ఇస్తారనే ప్రశ్న ఎదురవుతున్నది. మన దేశ ఐటీ కంపెనీ రెవెన్యూలో దాదాపు 80 శాతం ఉత్తర అమెరికా, యూరోపియన్ మార్కెట్ల నుంచే వస్తుంది. ఇప్పుడు వారి కంపెనీలు దెబ్బతింటే ఇక్కడి కంపెనీలు ప్రభావితమవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా దేశీయ కంపెనీలైన టిసిఎస్, విప్రో, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, వంటి కంపెనీలు వివిధ కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నారని చెబుతున్నారు. గత అక్టోబర్‌తో పోలీస్తే 18 శాతం నియామకాలు తగ్గాయని నివేదికలు తెలుపుతున్నాయి.
కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో ఐటీ, ఐటీ అనుబంధ సేవల రంగం 2021 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రత్యక్షంగా 44 లక్షలు, పరోక్షంగా 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. అందులో దాదాపు 37 శాతం మహిళా ఉద్యోగులు. 2022 ప్రథమార్దంలోనూ ఎక్కువ ఉద్యోగాలిచ్చిన రంగాల్లో ఐటీ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా అయిదు లక్షల కొత్త ఉద్యోగాలను ఐటీ రంగం సృష్టించిందని అంచనా. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్, ఈ-కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న సగటు ఉద్యోగితో పోలిస్తే, ఐటీలో ప్రారంభ స్థాయి ఉద్యోగికి రెట్టింపు కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. ఐటీ కొలువులు మెరుగైన జీతమిచ్చేవిగా స్థిరపడ్డాయి.
గత ఎడాదితో పోలిస్తే 18 శాతం నియామకాలు ఐటీ రంగంలో తగ్గాయి. భారత్‌లో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో నూతన నియామకాలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి కారణంగా గడిచిన అక్టోబర్ మాసంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బిపిఎం) విభాగాల్లో కొత్త నియామకాలు 43 శాతం పతనమయ్యాయని సిఐఇఎల్హెచ్ఆర్ సర్వీసెస్ శుక్రవారం ఓ రిపోర్టుతో తెలిపింది. టాప్ 50 ఐటీ, బిపిఎం కంపెనీల నుంచి సేకరించిన సమాచారంతో ఈ రిపోర్టును రూపొందించినట్లు సిఐఇఎల్హెచ్ఆర్ సర్వీసెస్ పేర్కొంది. ఆ వివరాలు.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మాసాల్లోని సగటు నియామకాలతో పోల్చితే 43 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ”భవిష్యత్తు సాఫ్ట్వేర్ తప్పనిసరి అయితే తప్పా కంపెనీలు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలకు తోడు స్టార్టప్‌లకు నిధుల కొరత తదితర అంశాలు కొత్త నియామకాలపై ప్రభావం చూపుతున్నాయి” అని సిఐఇఎల్హెచ్ సర్వీసెస్ సిఇఒ, ఎండి ఆదిత్యా నారాయన్ మిశ్రా పేర్కొన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడుతుంటే.. మరోవైపు కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ రంగంపై ఆశలు పెంచుకున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
బైజూస్‌తో పాటు ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, నోయిడా కేంద్రాలుగా నడుస్తున్న ఓలా, బ్లింక్ఇట్, అన్అకాడమీ వైట్‌హ్యాట్ జూనియర్ సైబర్ టెక్, ఎడ్యూటెక్, గిగ్ సంస్థలూ ఈ ఒక్క ఏడాదిలోనే 16,000 మందిని తొలగించాయి. అక్టోబర్ నెలలోనే 5,000 మంది ఉద్యోగులను సాగనంపారు. తాజాగా జెట్ ఎయిర్వేస్ సంస్థ 60 శాతం మంది ఉద్యోగులను బలవంతపు వేతన రహిత సెలవులకు పంపుతోంది. అంటే ఉద్యోగం పోదు కాని జీతం ఇవ్వరు. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 6.3 శాతానికి మించలేదని రిజర్వుబ్యాంకు పేర్కొంది. ఒకేసారి వేలాది మంది కొలువులు కోల్పోతే ఆ ప్రభావం మిగిలిన రంగాలకు శరవేగంగా విస్తరిస్తుంది. నిరుద్యోగుల మార్కెట్ అమాంతరం పెరిగిపోయి శ్రమదోపిడీకి మార్గం సుగమం అవుతుంది. ఎక్కువ గంటలు పని చేస్తారా? నిష్క్రమిస్తారా? అంటూ టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ చేసిన బరితెగింపు హెచ్చరికలే దీనికి నిదర్శనం.
ఈ నేపథ్యంలో దేశ ప్రజల కొనుగోలు శక్తి మరింతగా తగ్గి ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నది. అయినప్పటికీ ఈ విపత్తు గురించి మన పాలకులకు ఏ మాత్రం పట్టడం లేదు. ఈ పరిస్థితులను కూడా ఉపయోగించుకొని మత రాజకీయాలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తుంది.
నవంబర్‌లో ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులను (12 వేల మందిని), అమెజాన్ 10 వేల మందిని, ఫేస్బుక్ ఆధ్వర్యంలోని మెటా కంపెనీ 11 వేల మందిని తొలగించాయి. ఇంతేకాదు, లక్ష పదిహేను వేల మంది పనిచేస్తున్న ఇంటెల్ 20 శాతం, స్నాప్ 20 శాతం, రాబిన్‌హుడ్ 13 శాతం ఉద్యోగులను, సేల్స్‌ఫోర్స్ 2 వేల మందిని, ఎడ్టెక్ సంస్థ బైజూస్ 2,500 మందిని, మైక్రోసాఫ్ట్ వెయ్యి మంది ఉద్యోగులను, గూగుల్ 10,000 మందిని, నెట్‌ఫ్లిక్స్ 300 మందిని, క్రెడిట్ సూయిజ్ 9,000 మందిని, హెచ్‌పి 6,000 మందిని, సిస్కో 4,100 మందిని, ఉబర్ 6700 మందిని, బుకింగ్ కామ్ 6700 మందిని, బెటర్కామ్ 3000 మందిని, ఫెలోటన్ 2800 మందిని, గ్రూప్అన్ 2800 మందిని, బైజూస్ 2500 మందిని, సీగేట్ 3000 మందిని స్ట్రైవ్ 2,000 మందిని ఇంటికి పంపాయి. వీరు కాకుండా మరో లక్ష మంది లే ఆఫ్‌ల ద్వారా పని, జీతం లేకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వివిధ కంపెనీలు కొత్త నియామకాలకు ఇంటర్వ్యూలు పూర్తి చేసిన ఆఫర్ లెటర్లు ఇచ్చి, జాయినింగ్ లెటర్లు ఇవ్వకుండా సుమారు లక్ష మంది భవిష్యత్తును ఆందోళనలో ఉంచాయి. టిసిఎస్ సంస్థ ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించనున్నదని వార్తలు వస్తున్నాయి.
క్రుంగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ:
ప్రపంచ ఆర్థికాభివృద్ధి 2021లో 6.0 శాతం నుండి 2022లో 2.7 శాతానికి, 2023లో 2.3 శాతానికి తగ్గిపోతున్నట్లు 2022 అక్టోబర్‌లో ఐఎంఎఫ్ ప్రకటించిన ప్రపంచ ఆర్థిక నివేదిక తెలిపింది. గత పది సంవత్సరాల్లో ఇదే అత్యంత బలహీనమైన ప్రపంచ అభివృద్ధి. 2023 అక్టోబర్ నాటికి అమెరికాలో ఆర్థిక మాంద్యం రావడం నూరు శాతం జరగవచ్చునని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2021లో 4.7 శాతం నుండి 2022లో 8.8 శాతానికి పెరుగుతుందని అంచనా. 2008లో ప్రపంచ ఆర్థిక సంస్థలు కుప్పకూలిపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోలేకపోతుంది. ప్రపంచ జిడిపి వృద్ధి 2009లో ప్రపంచ ఆర్థిక సంస్థలు కుప్పకూలిపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోలేకపోతుంది. ప్రపంచ జిడిపి వృద్ధి 2009లో 5.4 శాతం ఉండగా, 2019 నాటికి 2.8 శాతానికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు రావడంతో ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా పతనమయ్యాయి. కరోనా పోయినా ప్రపంచ అభివద్ధి మాత్రం 2.7 శాతం దగ్గరే నిలిచిపోయింది. మనదేశంలో 2019-20లో స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) రూ.71,28,238 కోట్లు ఉంటే, 2021-22 నాటికి రూ. 68,11,471కోట్లకు పడిపోయింది. 2023 నాటికి 8.7 శాతం అభివృద్ధి సాధిస్తామని మార్చిలో రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. నెలలు గడుస్తున్న కొద్దీ ఈ సంఖ్య క్షీణిస్తున్నది. ఏప్రిల్‌లో 7 శాతం, అక్టోబర్‌లో 6.5 శాతానికి తగ్గించుకున్నారు. మార్చి వచ్చే నాటికి ఈ సంఖ్య రూపాయి విలువ లాగా ఎక్కడి వరకు దొర్లుతూ పోతుందో వేచి చూడాలి.
ముగింపు :
కొవిడ్ మహా విపత్తు కంటే ముందు నుంచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుస్తీ చేసిన సంగతి విధితమే. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా తిరిగి కోలుకోలేని సంక్షోభంలోకి జారిపోతోంది. తరుముకొస్తున్న సంక్షోభాన్ని నివారించడానికి పాలకులు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రణాళికలు రచించడం లేదు. మరోవైపు ఐటీ కంపెనీలు వేతనాలు తగ్గించడం, సిబ్బందిని కుదించుకోవడం వంటి ‘పొదుపు చర్యల’కు పరిమితం కావడంతో ఆర్థిక సంక్షోభం మరింతగా కోరలు చాచింది. కొవిడ్ తర్వాత పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది. విపత్తును ఎదుర్కొనే పేరిట ప్రభుత్వాలు ప్రకటించిన ‘ఉద్దీపన’ ప్యాకేజీల్లో కార్పొరేట్లకే అత్యధిక లబ్ధి చేకూరిన మాట వాస్తవం. ఇప్పుడు కార్మిక హక్కులను నీరుగార్చి, ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని అనిశ్చితి, అభద్రత నెలకొంది. అసలే కరోనాలో ఉపాధి పోయి రోజువారీ శ్రామికులు చిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితీ అదే అంటే ఉన్న సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది. కోట్లాది ప్రజల సంపదను అప్పనంగా కాజేసిన ఐటీ సంస్థలకు ప్రజాసంపద దోపిడీపై దాహం ఇప్పటికీ తీరడం లేదు.
ఇవాళ ఐటీ రంగ కొలువుల పరిస్థితి అసంఘటిత రంగ కార్మికులను తలపిస్తుండటం దయనీయం. ఖర్చులు ‘తగ్గించుకోవాలంటే వ్యాపార విస్తరణను తగ్గించుకోవచ్చు. కానీ ఉద్యోగులను ఉన్నఫలంగా ఇంటికి పంపేయడం కార్పొరేట్ కంపెనీల దారుణాలకు నిదర్శనం. మెటా అధినేత జుకెర్‌బర్గ్ వంటి గుత్తాధిపత్య దిగ్గజాలతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి పాలకులకు ఆ సంస్థ వేటుకు బలైపోతున్న సిబ్బందిని పట్టించుకునే తీరిక ఎక్కడిది? బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్ సంస్థళకు భారీ నజరానలతో ఎర్ర తివాచీలు పరిచే పాలకులు ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నా నోరు విప్పడం లేదు. ఉపాధి భద్రతను నీరుగార్చి కార్మిక చట్టాలన్నిటినీ నాలుగు కోడ్లుగా కుదించిన పాలకుల కళ్లకు ఐటి కంపెనీల దారుణాలు కానరావు. ఈ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ఉపాధి భద్రత కోసం ఐటీ నిపుణులు పిడికిలి బిగించాల్సిన తరుణం ఇది. సంక్షోభం ప్రపంచ వ్యాప్తమైనప్పుడు పోరాటాలు ప్రపంచ వ్యాప్తం అవుతాయి. తక్షణ సమస్యలపై పోరాడుతూనే ఆర్థిక సంక్షోభానికి మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చే సంక్షోభం గురించి అధ్యయనం చేసే శక్తులు పెరుగుతున్నాయి. ఈ వ్యవస్థ సమూల మార్పు కోసం అనేక కొత్త తరాలు, కొత్త పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో భాగస్వాములు కావడం అభ్యుదయ శక్తుల కర్తవ్యం.