ఏది ‘కుట్ర’?!

కాళీపట్నం రామారావు — ‘‘కుట్ర’ కథ

భూషణం మాస్టారు శ్రీకాకుళ ఉద్యమ పుట్టుపూర్వోత్తరాల గురించీ, పోరాటం గురించీ, ప్రజల తెగువ గురించీ — నిప్పులా రగిలిన అప్పటి చరిత్రని — ‘అడివంటుకుంది’, ‘కొండగాలి’ వంటి రచనల ద్వారా సాహిత్యంలో నిక్షిప్తం చేసేరు.

మాస్టారి సహచరుడు కాళీపట్నం రామారావు (కారా) గారు కూడా తమ కథల్లో అప్పటి చరిత్రని కథల్లో పట్టుకునే ప్రయత్నం చేసేరు. అలాంటి కథల్లో ‘కుట్ర’ ఒకటి.

తొంబై ఆరు సంవత్సరాల కారా గారు ఏభై ఏళ్ల క్రితం (1972) లో రాసిన కథ యిది. శ్రీకాకుళం ఉద్యమ ప్రస్థానం గురించి, విస్తరిస్తున్న ఉద్యమాన్ని చూసి భయపడ్డ ప్రభుత్వం ప్రజల్ని అణచివేయడానికి ఎలా కదులుతున్నదో భూషణం మాస్టారు తన కథల్లో రాస్తే, ‘కుట్ర’ కథలో ఉద్యమం సెట్ బ్యాక్ కు గురైన తర్వాత ప్రభుత్వం పెట్టిన కుట్రపూరితమైన , హాస్యాస్పదమైన ‘కుట్ర’ కేసు గురించి రాసేరు.

‘పార్వతీపురం’ కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. వందలమంది సాక్షుల సమక్షంలో ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణ చేసింది.

ఏభై ఏళ్ల తర్వాత పరిస్థితి మరింత దిగజారి ఊరూరా ‘కుట్ర’ కేసుల రచన జరుగుతూంది విస్తారంగా.

అసలు ‘కుట్ర’ అంటే ఏమిటి? రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకుని, చట్టాల్లోని లొసుగులని అడ్డం పెట్టుకుని కొందరు పారిశ్రామికవేత్తలు దోపిడీ యంత్రరచన ను ఎలా తయారుచేసేరు ఈ దేశంలో అని వివరిస్తారు కారా మాస్టారు.

ఏభై ఏళ్ల క్రితం రాసిన ఈ కథకి అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ ప్రాసంగికత వున్నదని ఈ కథ చదివితే మనకి బోధపడుతుంది. ఊరి ఊరికీ కనీసం ఒకో దేశద్రోహం కేసు పెడుతున్న సందర్భంలో ‘కుట్ర’ నైజాన్ని సునిశితంగా వివరించే ఈ పుస్తకం మీలాటి వాళ్ళు చదవాలి.

***

కథాకాలం శ్రీకాకుళ ఉద్యమం సెట్ బ్యాక్ కు గురైన సందర్భం.

ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. — “పట్నంలో ఏదో కేసోకుతుందట ఇన్నావా?” అని అడుగుతారొకరు.

“దగ్గిర దగ్గిర నూట యాభై మంది ముద్దాయిలూ, వెయ్యిమంది సాక్షులూ”

ఆదివాసులు, కొండప్రాంత ప్రజలు నడిపిన స్ఫూర్తిదాయకమైన ఉద్యమాన్ని దుర్మార్గంగా, క్రూరంగా అణచివేసిన ప్రభుత్వం ఆ ఉద్యమానికి సహకరించిన వారిపై, బాసటగా నిలిచిన వారిపై ‘కుట్ర’ కేసు పెడుతుంది. ఆ ‘కుట్ర’కు సాక్షులుగా వెయ్యిమందిని చూపిస్తుంది.

అందరికీ తెలుసు — ఇది ఒక దొంగ కేసని.

కుట్ర అంటే ఎవరికీ తెలీకుండా చేసేది కదా!? మరి ఇంత మంది చూస్తుండగా, వింటుండగా జరిగితే అది కుట్ర ఎందుకవుతుంది? పబ్లిగ్గా జరిగిందన్నమాట. అందుచేత, దాన్ని తిరుగుబాటు అనాలంటాడు రచయిత.

ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే, కుట్ర కేసు గురించి, శ్రీకాకుళ ఉద్యమం గురించి ఇంత కంటే ఎక్కువ ప్రస్తావన ఉండదు. ఈ మాత్రం చెప్పి — దాదాపు ఒకమోనోలోగ్ ఉంటుంది. స్వాతంత్రం రావడానికి కొంచెం ముందు, వచ్చిన తర్వాత స్వదేశీ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు ఎలాటి ఎత్తుగడలు వేసేరు, తమకు అనుకూలమైన వారికోసం పాలసీలను ఎలా అనుకూలంగా రాసుకుని అమలుపరుచుకున్నారు, ప్రజలధనాన్ని చట్టాలను అడ్డంపెట్టుకుని, చట్టాల సహాయంతో ఎలా దోచుకున్నారు — అన్న విషయాలను వివరిస్తారు.

1947 కీ – మన్యంలో ఉద్యమం రాజుకున్న 1967 కీ మధ్య — అంటే స్వతంత్రం వచ్చిన ఇరవై ఏళ్ల కాలంలో ఆర్థిక దోపిడీ ఎలా జరిగిందో, అసలు కుట్ర అది ఎందుకయ్యిందో చారిత్రిక వివరాలతో చెప్తారు కథ.

“ఏ రూల్సూ లేప్పోతే నీకిబ్బందై, ఏ రూల్సు పెడితే నీక్కాబోయే ప్రత్యర్దులకి కాళ్ళూ చేతులూ ఆడవో అలాటి రూల్సే అన్నీ ఎతికెతికి రాస్తావు,” అంటాడు.

కథాంశం క్లిష్టమైనది. ఆర్థికపరమైన అంశాలను చెప్పడం వ్యాసంలో వీలవుతుందేమో కానీ కథలో నేరుగా చెప్పడం కష్టం. అందుకే, దాదాపు మోనోలోగ్ లా సాగిన కథలో ప్రభుత్వ వనరులు డబ్బున్నవాళ్ళకోసం ఉపయోగపడేలా చట్టాలు, విధానాలు ఎలా రూపొందుతాయో వివరిస్తారు.

కథనం కారా మాస్టారి మార్కు పద్దతిలో — అంటే మైదాన ప్రాంతంలో ప్రవహించే నదిలా లేదా ఉపాధ్యాయుడు నింపాదిగా పాఠం చెప్పే పద్ధతిలో — సాగుతుంది.

కొత్తగా దేశం ఏర్పడి దిశా నిర్దేశం చేసుకుంటున్న దశలో ప్రభుత్వంలో దూరిన — లేదా దూర్చబడ్డ — పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వున్న మేధావులు విచ్చలవిడి దోపిడీకి అవకాశం కల్పించే well-oiled machine ని ఎలా తయారుచేసుకున్నారో వివరిస్తారు.

“అలాగ కోట్లకొద్దీ జనాల్ని దగా చేసేసి, నొర్లేని ఆ జనం కరవూ, కాటకాలూ, నిరుద్యోగంతో దిక్కుతోచక అల్లాడుతుంటే ఉన్న కోట్లు చాలక ఇంకా ఇంకా కోట్లమీద కోట్లు కూడేసే వారందరూ క్షేమంగానే వున్నారు. ఎంచేతా? వాళ్ళు చేసే ఘోరాలూ, దగాలూ అన్నీ లాఫుల్ గానే జరుగుతుండి ఉండాలి,” అంటారు.

ఈ విచ్చలవిడి దోపిడీ చట్టబద్ధమైపోయి, ఈ దోపిడీని ప్రశ్నించిన వారిది చట్టవ్యతిరేకమై పోతుంది.

ఈ దోపిడీని ప్రశ్నించాలా వద్దా అన్నది ఇష్టాయిష్టాలకి సంబంధించిన విషయం కాదు. ప్రశ్నించక, నిలదీయక తప్పని పరిస్థితి కొందరిది. ఎందుకంటే నిలదీయకుండా, దానికి వ్యతిరేకంగా పోరాడకుండా మనలేని పరిస్థితి.

“ఇదంతా మనకి బాగానే ఉండొచ్చు. ఎందుకంటే మనకి దానివల్ల నష్టం లేదు కాబట్టి. నష్టపోయిన వాళ్లకు మాత్రం దాన్ని మార్చాలనుంటుంది. అది మారాలంటే నువ్వు మారనీవు. నిన్ను మార్చబోతే మార్చబోయిన వాళ్ళని దేశద్రోహులంటావు.”

— ఇది ఇప్పుడు కూడా జరుగుతున్నది కదా?!

అలా నిలబడి ప్రశ్నించినందుకు కదా అప్పుడు పార్వతీపురం, సికింద్రాబాదు కుట్ర కేసులు పెట్టింది?

అలా నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నందుకు కదా ఇప్పుడు కూడా వందలాదిమంది మీద కుట్ర కేసులు బనాయిస్తున్నది?

అసలు కుట్ర ఏది? ఎవరు చేస్తున్నారు?

నమ్మిన జనసామ్యాన్ని నాయకులో, పవర్లో వున్న పార్టీయో, పార్టీలో మనుషులో దగా చేస్తే — అది దేశద్రోహం కాదా?

వాళ్ళు ఎవరైనా కానీ — ఆ చేసే దగాని బైటపెట్టడం, ఎదుర్కోమనడం — ఇదా దేశ ద్రోహం?

ఇది చరిత్ర.

నడుస్తున్న చరిత్ర కూడా.

రచయిత, జర్నలిస్టు.

One thought on “ఏది ‘కుట్ర’?!

Leave a Reply