తొలికోడి కూస్తానే మెలకువచ్చేసింది. లేసి ఈదిలేకొచ్చి సూస్తే, పరంట పక్క ఆకాశింలో సందమామ సల్లని ఎన్నిల కురిపిస్తా ఉండాడు. ఊరంతా ఆ సల్లని ఎన్నిల్లో తడిసి ముద్దవతా ఉంది.
మల్లా పొయి పడుకున్నాను గాని నిద్ర పట్టలేదు. కోళ్ళు వొకదానెనకొకటి పందెమేసుకొని కూస్తానే ఉండాయి. నేను నిద్ర పట్టకుండా అట్టా ఇట్ట పొల్లతానే ఉండాను. ఇంతలో బళ్ళని తెల్లారింది లేసి ఈదిలేకొచ్చి సూసినాను. ఆడోళ్ళంతా కళ్ళాపు సల్లతా ఉండారు. కొంతమంది ముగ్గులేస్తా ఉండారు.
కట్టకిందూరి రెడ్లు ఆవూరి బుడ్డబ్బరెడ్డిని ఎలేస్తే ఆయన మవూరికెలిగా వొచ్చి వొక జోబిడీ ఏసుకున్నాడని తెల్సింది. పొయ్యి మాటాడొద్దామని ఎలబారినాను. తూరుపు దిక్కులో ఆకాశిం ఎర్రబారి కొంచేపుటికంతా పొద్దుపుట్టి బారడెక్కింది. సూస్తే పైన ఆకాశిం, కింద భూమి, సుట్టూ కోట గోడలు మాదిరిగా కొండలూ గుట్టలు.
కొండల మద్దెలో ఇరవై ఊళ్ళు. అంతా ఎగువ కులపోళ్ళే. ఆ వూర్నించి ఎలేసినట్డు మా వూరు దర్మాసెర్వు మాలపల్లి. మా వూర్నించి ఎలేసినట్టు తంగేళ్ళ మిట్ట మాదిగ పల్లి.
మా రొండూర్ల సుట్టూ యారాళమైన భూములుండాయి. అయ్యన్నీ మాయిగావు గ్రామున్సీపువే. తెల్లార్తో లేసి మేం ఉచ్చబొయ్యాలన్నా, ఆయని భూమల్లో పొయ్యాల్సిందే.
గ్రామున్సీపంటే సెయ్యెత్తు మనిసి ఈ ఇరవై ఊర్లకూ ఆయనే మొగుదారి. వాళ్ళమ్మ పేరు రెడ్డమ్మ కట్టెల్లో కంపల్లో కాలని తల్లి. ఆయన బారీ పేరు. సుగుణమ్మ పేరుకు తగినట్టే శానా మంచిది. కొడుకొకడుండాడు పేరు దొరబాబు. ఇత్తొకటేస్తే సెట్టొకటి మొలిస్తిందా? ఆవు సేను మేస్తే దూడ గెనిం మేస్తిందా? అట్ట అబ్బకు తగిన కొడుకాయన.
వొకప్పుడు ఇందరా గాంధీ అయాంలో మా మాలా మాదిగలకని యాపై ఎకరాల భూమిచ్చింది. గ్రామున్సీపు తాయారైనాక మామ్మల్ని యామార్సి, తలా నూరూ యాపై మా సేతిలో బెట్టి మొత్తం లాగేసుకున్నాడు. ఇప్పుడు మాకీ భూమ్మింద అరిసెయ్యంత నేలలేదు.
నేను పోయేకొద్దికి బుడ్డారెడ్డి గుడిసెముందు కూసోనుండాడు. ఆయన బారీయ్యి పాపమ్మ కావిలోళ్ళ గుంట కాణ్ణించి నీళ్ళు తెచ్చుకుంటా ఉంది. ఆయని పిలకాయలు మట్టిలో కూసోని వొతొత్తి సూరొత్తి ఆడతా ఉండారు. గుడిసె పైకెగ జూస్తే తెంకాయ కీతుల్తో కప్పుండారు. అది ఎండకు తప్ప వానకు పనికొచ్చేటిగా లేదు. కప్పులోనించి ఎండ నేలమింద సుక్కలు సుక్కలుగా పడతా ఉంది.
నన్ను సూసి బుడ్డారెడ్డి “కూసో సెంగల్రాయా” అన్నాడు.
నేను పై గుడ్డ కిందేసి కూసోని “ఏం జరిగింది బుడ్డారెడ్డా ఊరొదిలి వొచ్చినావంటనే” అని అడిగినాను.
ఆయన “ఏవీ లేదు ఎంగల్రాయా! మా ఊర్లో గంగి, మొగుడు సచ్చిపొయినాక, ఎవుర్తోనో లేసి పొయ్యిందనే సంగతి నీకు తెల్సిందే. ఏం జరిగిందో ఏమో ఇప్పుడు మల్లా తిరిగొచ్చింది. అందుకని దాన్ని ఊర్లో ఎలికట్టేసి నారు.
ఎలేసేదంటే తెల్సిందే ఎవురూ మాట్లాడరు. మంచీ సెడ్డకు రానియ్యరు. బాయికి నీళ్ళకు రానీరు. సాకలోళ్ళను మంగలోళ్ళను లేకుండా జేస్తారు. అది పస్తు సస్తావుందని మా ఇంట్లోది అన్ని సద్ది నీళ్ళేమో పోసిందంట. దానికి మమ్మల్నీ గూడా ఎలేసినారు. నేను ఏస్తే ఏసుకోండి ఈడుండే దాన్నికన్నా ఆ మాలపల్లిలో ఉంటానని వొచ్చేసినా” అన్నాడు.
దానికి నేను “బయపడొద్దు రెడ్డీ! నీకు మేవుండామ”ని దయిర్నం జెప్పి వొస్తావుంటే, రచ్చబండ కాడ మా సుక్లాచేరి మావ కూసోనుండాడు. ఆయని కంట్లో పడితే సామాన్నెంగా వొదలడు. పోతే ఏవేవో కతలన్నీ కైగట్టి ఎప్పతా ఉంటాడు. వొక్కొక్క సారి ఆయన సెప్పే కతలన్నీ నిజమేనని నమ్మాల్సి వొస్తాది. వొక్కొక్క సారి అయ్యన్నీ కాలచ్చేపానికి సెప్పే కతలనిపిస్తాయి.
ఆయనికి కనబడకుండా పోవాలనుకున్నాను గాని కుదర్లేదు. పిల్సేకొద్దికి “ఏం మావా” అంటా పొయినాను.
ఆయన “యాడికి పొయ్యుంటివి రా! సెంగల్రాయా” అని అడిగినాడు.
నేను తలగీరుకొంటా “అదే మావా! కట్టకిందూరి రెడ్లు బుడ్డబ్బ రెడ్డిని ఆ వూర్నించి ఎలేసినారంట. ఆయన మనూరి పక్కనే వొచ్చి గుడిసేసుకున్నాడు. పొయి ఇసారించి వొస్తా ఉండా” అన్నాను.
దానికాయన “నేను సెప్పేది గూడా అదే సెంగల్రాయా! మనమంతా వొకప్పుడు అగ్రకుల పోళ్ళమే మాలా మాదిగలు కాదు. తరువాత తరువాత ఊళ్ళల్లో కొంతమంది పెత్తందార్లు తయారై, ఊర్లల్లో పంచాయితీలు బెట్టి ఎలేస్తే అట్ట ఎలిగా వొచ్చి గుడిసెలేసుకున్నోళ్ళమే మనం.
ఈ పల్లెలో పంచాయితీలు యట్టుంటాయంటే, బలముండేవోడి మాట సెల్లుబాటైనట్టు మన మాట సెల్లుబాటు కాదు. వాళ్ళకు కావాల్సినోళ్ళు తప్పుజేస్తే దండిస్తారు వొదిలేస్తారు, లేకపోతే సూసి సూడనట్టుంటారు. మనబోటోళ్ళు తప్పుజేస్తే తప్పులేస్తారు కట్టలేదంటే ఎలేస్తారు. అన్నాడు.
అయితే సుక్లాచ్చేరి మావ సెప్పిందాంట్లో నాకు నమ్మకమే కుదర్లేదు. అందుకే అడిగినాను “మావా! సుట్టు పక్కల ఊర్లనించి ఎలేస్తే మన మాల పల్లెలు తయారైనాయి. మరి మాదిగ పల్లెలెట్టొచ్చినాయి” అని అడిగినాను.
దానికాయన “సుట్టు పక్కల ఊర్లల్లో తయారైనట్టే పెత్తం దార్లు మన మాల పల్లెల్లోనూ తయారైనారు. వాళ్ళ మాట ఇనకుండా దిక్కరించి నోళ్ళను. ఆడోళ్ళైతే అందంగా ఉండి లొంగి వాళ్ళకు కొంగు పర్సనోళ్ళను. ఎలేసుకుంటా పోతే వాళ్ళు మన మాల పల్లెలకు దూరంగా పొయి గుడిసెలేసుకొని మాదిగ పల్లెలని పేరుబెట్టుకున్నారు. పైగా వాళ్ళూ మనం ఇడిపోయే దానికి కొంచిం గూడా కారణ” మన్నాడు.
ఆ మాటతో నేను మల్లా అడిగినాను “మావా! మనమే గొప్పని మనమంటాం వాళ్ళే గొప్పని వళ్ళు చెప్పుకుంటారు మన్లల్లో ఎవురు గొప్ప ఎవురు కీత సెప్పు” అని అడిగినాను.
ఆయన “మన్లల్లో ఎవురూ తక్కవ గాదు ఎవురూ ఎక్కవగాదు. అంతా వొకటే ఇద్దురు కొట్లాడు కొంటే మూడో వోడు లాభ పడినట్టు మనం మేం గొప్పా మేం గొప్పని కొట్లాడు కొంటే పై కులపోళ్ళు లాభ పడతా ఉండారు” అన్నాడు.
ఆయన ఇన్ని రకాలుగా సెప్పినా నా సందేహం తీరలేదు. అందుకే మల్లా అడిగినాను “నువ్వేమో వాళ్ళు ఎలేస్తే మనం మనం ఎలేస్తే వాళ్ళంటావుండావు మరి పెద్దోళ్ళు ఇంగొకరకంగా సెప్పినారే, ఈ కొలాలు మతాలు ఈ పొద్దు కొత్తగా వొచ్చినవి కావు. మడిసి ఈ భూమ్మింద పుట్టినప్పట్నించీ ఉండాయి. దేవుడు పుట్టించి నప్పుడే ఎవురెవుర్ని యాడ బెట్టాల్నో పెట్టినాడు అంటారే” అన్నాను.
దానికాయన ఆ మాట సెప్పిందెవురు? సెంగల్రాయా! పై కులపోళ్ళే గదా! నెపం దేవుడిమింద నెట్టేసి వాళ్ళ మింద పడిన మచ్చ సెరిపేసుకొనే దానికి అట్టా మాయ మాటలు జెప్పకుండా ఇంగెట్ట చెప్పతారు. త్రేతా యుగంలో జరిగిందని జెప్పుకొనే రామాయణంలోనూ. దోపరయుగంలో జరిగిందని జెప్పుకొనే భారతంలోనూ. మాలా మాదిగలని పేరు లేనేలేదు.
కాకపోతే అందిర్నీ కలిపి నాలుగు వర్నాలుగా ఇడగొట్టినారు. బాపనోళ్ళని, రాజులని, కోమటోళ్ళని, మిగిల్న అందిర్నీ కలిపి సూద్రలన్నారు. అట్టజూసుకొన్నా మనం సూద్రల కిందికొస్తాము.గాని ఆడగూడా మనకు గవురం దక్కలేదు. కడజాతోళ్ళని మాలా మాదిగలని పేరుబెట్టి ఏరుజేసినారు.
ఇంగొక రకంగా సెప్పేవోళ్ళు గూడా లేక పోలేదు. ఈ కొలాలు మనకు మనం ఏరుపాటు జేసుకున్నివే దాంట్లో వొకటి సంపద వుపిర్తి జేసేవోళ్ళని రొండు వాళ్ళకు సేవకం జేసేవోళ్ళని భూములు నేలలు గలిగిన రెడ్లు నాయుళ్ళు కాపులు కమ్మలు యవసాయం జేసి పంటలు పండించి ఎగువ కొలాలుగా చెలామణి అవతా ఉండాయి.
వాళ్ళకు సేవకం జేసే సాకలా, మంగలా, కుమ్మరి, కమ్మరి, ఇర్ల, యానాది, కింది కొలాలుగా మారిపొయినాయి.
అగ్రకులపోళ్ళ ఇండ్లకు పొయి ఈళ్ళల్లో ఎవురడిగినా గళాసుతో నీళ్ళిస్తారు తాగమని. మనం జేసుకొన్న పాపమేందో తెల్దుగాని తాగేదానికి నీళ్ళడిగితే దోసిళ్ళు పట్టమని పోస్తారు. లేదా సూర్లో టెంకాయ సిప్ప దోపుంటారు దాన్ని పట్టమని పోస్తారు” ఇట్ట ఆయని మనుస్సులో గూడుకట్టుకొన్న యాదనంతా నా ముందు ఎళ్ళగక్కినాడు.
ఆయన ఇన్ని రకాలుగా సెప్పినా నేనాయన్ను వొదల్లేదు. “మావా! నువ్వేమో అందురూ వొకటేనంటావు. నేను పొయ్యి ఇదే మాట వాళ్ళతో సెప్పినాననుకో. అయ్యన్ని కట్టుకతలని కొట్టి పారేస్తారు.
మీరు నల్లగా ఉండారు, మేం తెల్లగా ఉండాము మీరు మేవూ వొకటైతే ఈ తేడాలెందుకుండాయంటారు. వాళ్ళకు నేనేంజెప్పాల” అని అడిగినాను.
దానికాయన “ఆదారాలు రుజువులు కావాలంటే ఎన్నైనా జెప్పతాను. తిని నీడపాట్న కూసొంటే మనం వాళ్ళకంటే తెల్లగా ఎర్రగా బుర్రగా ఉంటాము” అన్నాడు.
ఆయన సెప్పిందంతా ఇన్నాక “మన పేర్లు గూడా అట్టనే ఉండాయి గదా మావా! వాళ్ళ పేర్లకు ఎనకా ముందు ఏదో వొక తోకుంటాది మనకు లేదే. మన పేర్లంతా ఎంగిటిగోడు, గుండుగోడు, బొజ్జిగోడు, దున్నగోడు, కొరవడు, నీలాలగోడు, కుందడు, అమాసగోడని ఎందుకుండాయని” అడిగినాను.
ఆయన “సెంగల్రాయా! మనం పెట్టుకొనేటప్పుడేమో మంచి పేర్లే సూసి పెట్టుకుంటాం. కాని పెద్దోళ్ళు మనల్నట్టా పిలిసేదానికి వొప్పుకోరు. పోనీ మనమన్నా బాగ పిల్సుకుంటామంటే పిల్సుకోము.
మనం ఎంగటేసయ్యా అని పెట్టుకుంటాం, వాళ్ళు ఎంగిటి గోడని పిలుస్తారు. మనం కిష్ణయ్య అని పెట్టుకుంటాం, వాళ్ళు కిట్టిగోడని పిలుస్తారు. మనం నాగయ్యని పెట్టుకుంటాం, వాళ్ళు నాకడని పిలస్తారు. మనం సెంగయ్యని పెట్టుకొంటే వాళ్ళు వొరే సెంగా! అని పిలుస్తారు,
ఇదే పేర్లను రెడ్లయితే, ఎంగట్రెడ్డి, కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, సెంగారెడ్డని పిల్సుకుంటారు నాయుళ్ళయితే ఎంగటేశులునాయుడని, కిష్ణమనాయుడని, నాగమనాయుడని, సెంగమనాయుడని, పిల్సుకుంటారు.
పైన జెప్పినవన్నీ ఏదో వొక దేవుడి పేరైతే మనం అర్దం పర్దం లేని పేర్లెన్నో పెట్టుకుంటాం. దున్నగోడని, పూరేడుగోడని, టిక్కోడని, గుండుగోడని, వాతాలుగోడని, కొరవడని, ఇట్ట పెట్టుకుంటా ఉంటాం. అట్టగాకుండా పెట్టుకొనేటప్పుడే మంచి పేర్లు సూసి పెట్టుకోని, పిల్సుకొనేటప్పుడూ అదే పేర్లు పెట్టి పిల్సుకోవాల. ఏరేవోళ్ళెవురైనా మనల్ని పేరు మార్సి పిలిస్తే, మంచిగానే అయా! నాపేరది గాదని సెప్పి పిలిపించుకోవాల.
ఇయ్యన్నీ నీకెందుకు సెప్పతా ఉండానంటే ఈ ఇరవై ఊళ్ళకూ నువు కాబోయే తోటోడివి. ఇట్టా మంచీ సెడ్డా తెల్సుకొంటే మంచిదని సెప్పతా ఉండాను” అంటే, నేను “అట్టనే మావా” అంటా వొచ్చేసినాను.