మిషనరీలతో కలిసి ఎనిమిది మంది కంచు రంగు మొఖాల పిల్లలం తూర్పువైపు బయల్దేరాం. మా గుంపులో ముగ్గురు యువ వీరులూ, ఇద్దరు పెద్ద అమ్మాయిలూ, ముగ్గురం చిన్న అమ్మాయిలం – నేనూ, జుడేవిన్, థోవిన్ – ఉన్నాం.
ఎర్ర ఆపిళ్ళున్న దేశానికి ఎప్పుడెప్పుడు బయల్దేరుతామా అని ఆతృత పడ్డాం. ఆ దేశం ఎంతో దూరంలో లేదనీ, పశ్చిమ ప్రెయిరీ మైదానాలకావాలే ఉందనీ మాకు చెప్పారు. డకోటా మైదానాల్లో మబ్బుల నీడల్ని వేటాడినట్లే గులాబీ రంగు ఆపిళ్ళున్న ఆకాశం కింద కూడా స్వేఛ్చగా సంతోషంగా ఉంటామని కలలు కన్నాము. ఇనుపగుర్రం మీద ప్రయాణం భలే బాగుంటుందని అనుకున్నాం కానీ, మమ్మల్ని ఎగాదిగా చూస్తున్న ఎన్నో తెల్లమొఖాలను చూసి మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.
చిన్నపిల్లలను ఎత్తుకుని ఆటూఇటూ సందడిగా తిరుగుతున్న తెల్ల అమ్మలు హఠాత్తుగా ఆగిపోయి అమ్మలు తోడుగా లేని మమ్మల్ని విచిత్రంగా చూశారు. బరువైన సంచులు పట్టుకునున్న తెల్ల మగవాళ్ళు కొందరు, గాజులాంటి నీలికళ్లతో మమ్మల్ని చూస్తూ నిల్చున్నారు.
ఎవరైనా నన్ను పట్టిపట్టి చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నా సీటులో ఒక మూలకు ముడుచుకుని కూర్చున్నాను. నా అంత వయసున్న ఇద్దరు పిల్లలు నా ఎదురుగ్గ సీటులో వెనక్కి వాలి, భయంలేని తెల్లమొఖాలతో నన్ను చూడడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు నోట్లో నుంచి వేళ్ళు తీసి నా పాదరక్షలవైపు చూపించారు. వాళ్ళ అమ్మ అమర్యాదగా ప్రవర్తిస్తున్న వాళ్ళను కోప్పడకపోగా, తానే నన్ను పట్టిపట్టి చూసింది. దాంతో ఆ పిల్లలు నా దుప్పటివైపు కూడా వేలెత్తి చూపడం మొదలుపెట్టారు. అదంతా నన్ను కలవరపెట్టి, ప్రయాణం చేస్తున్నంతసేపూ నాకు కళ్లల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి.
అప్పుడప్పుడు మాత్రమే తలెత్తి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ, చాలావరకు నేలకేసి చూస్తూ కదలకుండా కూర్చున్నాను. ఒకసారి తలెత్తి నాపక్కనున్న కిటికీలోంచి బయటకు చూస్తే నాకు సూపరిచితమైన వస్తువు ఒకటి కనిపించి ఊపిరాడనట్లు ఉక్కిరిబిక్కిరయ్యాను. అదే ఒకదానికోకదాని మధ్య కొంచెం ఎడంగా నిలబెట్టబడిన టెలిగ్రాఫ్ స్తంభాలు. మా ఇంటికి దగ్గర్లోనే, రోడ్డును అనుకుని వత్తుగా పెరిగిన అడవి సూర్యకాంతం పువ్వుల మధ్య తెల్లవాళ్ళు కొన్ని టెలిగ్రాఫ్ స్తంభాలు పాతారు. ఆ రోడ్డు పక్కగా వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు అక్కడ ఆగి, ఒక స్తంభానికి నా చెవి ఆనించి వినేదాన్ని. ఆ స్తంభంలో నుంచి మూలుగు వినిపించేది. దానికి అంత నొప్పెయ్యడానికి తెల్లవాడు దాన్ని ఏం చేశాడా అని బాధపడేదాన్ని. ఇప్పుడేమో వెనక్కి వెళ్లిపోతున్న స్తంభాలను ఒక్కోదాన్ని చూస్తూ, ఇక అదే చివారిదేమో అని అనుకుంటూ కూర్చున్నాను.
అలా ఇబ్బందికరంగా ఉన్న పరిసరాలను మర్చిపోయాను. అప్పుడే మా గుంపులోని ఒకరు నన్ను పేరు పెట్టి పిలిచారు. మా మధ్యకు మిఠాయిలు విసురుతున్న మిషనరీని చూశాను. ఎవరెక్కువ మిఠాయిలు పట్టుకుంటారో అని కాసేపు ఆడుకున్నాం.
మా ప్రయాణం కొన్నిరోజులపాటు సాగినా మధ్యాహ్న భోజనం గురించి ఒక్క విషయం కూడా గుర్తులేదు.
బడి దగ్గరకు వెళ్లేసరికి చీకటి పడింది. పెద్ద బిల్డింగులకున్న కిటికీలలోనుంచి దీపాల వెలుతురు మంచు వల్ల గడ్డకట్టిన చెట్లమీద పడుతూ కనిపించింది. మమ్మల్ని ఒక పెద్ద వాకిలిగుండా లోపలికి తీసుకెళ్లారు. దారికడ్డంగా, ప్రకాశవంతంగా వెలుగుతున్న లైట్ల కింద ఉత్సాహంగా నిలబడ్డ ఎంతోమంది తెల్లవాళ్లను చూసి, అప్పటిదాకా మంచులో నడిచివచ్చిన దానికంటే ఎక్కువగా నా శరీరం వణికిపోయింది.
ఆ పెద్ద ఇంట్లోకి వెళ్ళాక నేను గోడకు అనుకుని నిలబడ్డాను. తెల్లరంగు గోడలమీద దేదీప్యమానంగా ప్రతిఫలిస్తున్న వెలుతురు నా కళ్ళకు మెరుపుల్లా అనిపించాయి. చెక్క నేలమీద బూట్ల చప్పుళ్లు నా చెవుల్లో హోరుకు తొడయ్యాయి. గోడకు ఆనుకుని నిలబడడమే సురక్షితంగా అనిపించింది. ఆ గందరగోళం నుంచి ఎటువైపు పారిపోదామా అని వెతుక్కుంటున్నప్పుడే రెండు వెచ్చని చేతులు నన్ను గట్టిగా పట్టేసుకుని ఒక్కసారిగా గాల్లోకి ఎగరేసాయి. గులాబీ రంగు బుగ్గలున్న ఒక తెల్లామె నన్ను పట్టుకుంది. ఆ అలసత్వం నన్ను భయపెట్టడమే కాకుండా అవమానంగా అనిపించింది. ఇక నన్ను నా కాళ్ళమీద నన్ను నిలబడనిస్తుందేమో అని ఆమె కళ్ళలోకి చూసాను. కానీ ఆమె మరింత ఉత్సాహంగా నన్ను ఇంకొన్నిసార్లు గాల్లోకి ఎగరేసి పట్టుకుంది. మా అమ్మ తన చిన్ని కూతుర్ని ఇలా ఎప్పుడూ ఆటబొమ్మని చెయ్యలేదు. అది గుర్తొచ్చి నేను గట్టిగా ఏడ్చాను.
నా ఏడుపును వాళ్లు తప్పుగా అర్థం చేసుకుని తిండి పదార్థాలతో నిండుగా ఉన్న భోజనం బల్లమీద కూర్చోబెట్టారు. మా గుంపు అందరం మళ్లీ అక్కడ కలుసుకున్నాం. నేను ఎంతకీ ఏడుపు ఆపకపోయేసరికి అక్కడున్న ఒక అమ్మాయి, “రాత్రి ఒక్కదానివే ఉండేదాక ఆగు.” అని అంది.
నా ఏడుపు దిగమింగుకోవడం తప్ప ఆరోజు సాయంత్రం నేను ఎక్కవ ఏమీ తినలేదు.
“నాకు మా అమ్మా, అన్న దావీ కావాలి. మా అత్త దగ్గరికి వెళ్లిపోతాను.” అని అడుక్కున్నాను. కానీ ఆ తెల్లవాళ్ళ చెవులకు నా మాటలు వినిపించలేదు.
భోజనం తరువాత చెక్కబాక్సులమీద మమ్మల్ని పైకి తీసుకెళ్లారు. వాటిని మెట్లు అని అంటారని తరువాత తెలిసింది. పైన సన్నటి వెలుగులో నిశ్శబ్దంగా ఉన్న ఒక పెద్ద హాలులోకి మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ హాలు పొడుగునా అటూఇటూ ఇనుపమంచాలు ఉన్నాయి. ఆ మంచాల్లో మెడదాక దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్న గోధుమరంగు మొఖాలు మమ్మల్ని చూశాయి. నాతో మా భాషలో మాట్లాడి నన్ను సముదాయించినట్లు కనిపించిన ఒక పెద్ద అమ్మాయి పక్కన నన్ను ఒక మంచంలో పడుకోబెట్టారు.
వాళ్ళు, అద్భుతమైన ఆపిల్ పళ్ళున్న లోకంలోకి నన్ను తీసుకువచ్చారు. ఇక్కడికి వచ్చాక సంతోషంగా ఉంటానని అనుకున్నాను కానీ, సంతోషంగా లేను. ఆ సుదూర ప్రయాణం, దారిలో ఎదురైనా అనుభవాలు నన్ను కలవరపరిచాయి. అలసిపోయి, వెక్కిళ్ళు పెడుతూ నిద్రలోకి జారుకున్నాను. నా కన్నీళ్లు నా బుగ్గలమీదే చారాలుగా ఎండిపోయాయి. నా కన్నీళ్లు తుడిచే మా అమ్మగానీ, మా అత్తగానీ ఇక్కడలేరు మరి.
ix: నా పొడవాటి జుట్టును కత్తిరించడం
నేలంతా మంచుతో కప్పపడిపోయి, మోడువారిన చెట్లున్న ఎర్ర ఆపిల్ పళ్ల దేశంలోని మొదటిరోజు గడ్డకట్టుకుపోయే చలితో మొదలయ్యింది. ఉదయపు పలహారంకోసం మోగించిన గంట మా చెవుల్లో కర్ణకఠోరంగా మోగింది. చెక్కనేల మీద హడావిడిగా పరిగెత్తుతున బూట్ల చప్పుడుతో ఇంకా అశాంతిగా అనిపించింది. సద్దుమనగని కఠోరమైన శబ్దాలు, వేరు వేరు భాషల్లో వినిపిస్తున్న మాటలతో కలిసి నన్ను దిగ్బంధం చేసినట్లు అనిపించింది. నేను చేజార్చుకున్న స్వేచ్ఛకోసం నా ఆత్మ కొట్టుకులాండింది కానీ, ఇక నేను చెయ్యగలిగిందేమీ లేదు.
తెల్లజుట్టున్న ఒక తెల్లామె మా దగ్గరికి వచ్చింది. భోజనాల గదికి వెళ్తున్న అమ్మాయిల లైన్లో మమ్మల్ని నిలబెట్టింది. ఆ అమ్మాయిలందరూ ఇండియన్లే. వాళ్ళంతా బిగుతైన బట్టలూ, బిరుసైన బూట్లూ వేసుకుని ఉన్నారు. చిన్న అమ్మాయిలేమో ఎప్రాన్ లు వేసుకుని, కురుచగా కత్తిరించిన జుట్టుతో ఉన్నారు. భుజాలమీద కప్పుకునే నా దుప్పటిని లాగేసుకున్నందుకు సిగ్గుతో నేలలో కుంచించుకుపోతున్నట్లనిపించింది. బిగుతుగా ఉన్న బట్టలేసుకున్నందుకు సిగ్గుపడకుండా మసులుతున్న అమ్మాయిలను తీక్షణంగా చూశాను. భోజనాల గదిలోకి వెళ్ళగానే, మరోవైపు నుంచి మగపిల్లలు లోపలికి వచ్చారు. మాతో పాటు ప్రయాణం చేసిన ముగ్గురు యువవీరులకోసం ఆ మగపిల్లల గుంపులో వెతికి,. గుంపు చివర్లో ఉన్నవాళ్ళను చూశాను. వాళ్ళకు కూడా నాకులాగే ఇదంతా ఇబ్బందిగా ఉన్నట్లు కనిపించారు.
ఎవరో ఒక చిన్నబెల్లుతో ఒక గంట మోగించారు. పిల్లలంతా భోజనం బల్ల కింద ఉన్న కుర్చీలను బయటకు లాగారు. నేను కూడా కుర్చీని బయటకు జరిపి ఇక కూర్చోవచ్చని త్వరగా నా కుర్చీ ఎక్కి కూర్చున్నాను. కానీ తలా తిప్పిచూస్తే నేను ఒక్కదాన్నే కూర్చుని ఉన్నాను. మిగతా అందరూ నిలబడే ఉన్నారు. సిగ్గుపడుతూ కుర్చీని ఎలా ఉపయోగించాలో అని చుట్టూ చూస్తూ నిలబడగానే రెండోగంట మోగించారు. అప్పుడు అందరూ కూర్చున్నారు. నేను మళ్ళీ నా కుర్చీలోకి ఎక్కాల్సి వచ్చింది. ఆ హాలు చివరి నుంచి ఎవరిదో మగ గొంతు వినిపించగానే అటువైపు తలతిప్పి చూశాను. మిగతా అందరూ తమ ముందున్న పళ్లేల మీదుగా తలలు వంచి నిశ్శబ్దంగా కూర్చున్నారు. హాలలో వరసగా వేసిన భోజనం బల్లలను చూస్తూన్న నామీద ఒక తెల్లామె దృష్టినిలపడం చూశాను. ఆ అపరిచితురాలు నన్ను అంత తీక్షణంగా ఎందుకో చూస్తోందో అర్థం కాక నా కళ్ళు దించేసుకున్నాను. హాలుచివర అతను గొణుగుడు ఆపగానే మూడో బెల్లు మోగింది. అందరూ తమ పళ్లేల పక్కనున్న కత్తీ, ఫోర్కులతో తినడం మొదలుపెట్టారు. నేనేమో ఇన్ని తప్పులు చేశాక ఇంకా ఏం తప్పులు చేస్తానో అని భయంతో ఏడవడం మొదలుపెట్టాను.
కానీ తిండి తినడానికి ముందు జరిగిన ప్రహసనం ఆరోజులోకి అతికష్టమైన విపత్తు కాదని త్వరలోనే అర్థమయింది. ఆ ఉదయం గడిచిపోతున్న సమయంలో జడేవిన్ నాకో భయంకరమైన హెచ్చరిక చేసింది. జడేవిన్ కు కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుసు. ఎవరో ఒక తెల్లామే మా ఒత్తైన పొడవాటి జుట్లను కత్తిరించడం గురించి మాట్లాడుతుండడం విన్నది. యుద్దాల్లో శత్రువుకు పట్టుబడినవారికీ కురచజుట్లు ఉంటాయని మా అమ్మలు మాకు నేర్పించారు. మా తెగ జనాల్లో, దగ్గరి బంధువుల చనిపోయి శోకంలో ఉన్నవాళ్లు పోట్టి జుట్లతో, పిరికివాళ్ళు కురుచజుట్లతో ఉంటారు.
మా పరిస్థితి ఏమవుతుందో అని కాసేపు చర్చించుకున్నాక, “మనమేం చెయ్యలేం. వాళ్ళు చెప్పినట్లు చెయ్యాలసిందే.” అని అన్నది. నేను ఎదురుతిరిగాను.
“నేను వాళ్ళు చెప్పినట్లు చెయ్యను. ముందు వాళ్ళతో కొట్లాడతాను.” అని గట్టిగా చెప్పాను.
ఎవరూ చూడకుండా ఉన్నప్పుడు నేను మాయమైపోయాను. నా మెత్తని పాదరక్షలు పడేసి బిరుసుగా, కీచుకంటున్న బూట్లు ఇచ్చారు నాకు. వాటితో ఎంత చప్పుడు చెయ్యకుండా నడవగలనో అంత మెల్లగా మెట్లెక్కి పైకి నడిచాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలీకుండానే గది తరువాత గదిని దాటుకుంటూ వెళ్లాను. ఒక పక్కగా ఉన్న గదిలోకి వెళ్ళాను. అందులో మూడు తెల్ల మంచాలు మాత్రమే ఉన్నాయి. ముదురాకు పచ్చని కర్టెన్లు ఆ గది కిటికీలను కప్పి ఉంచడంతో గది కొంచెం చీకటిగా ఉంది. ఆ గదిలో ఎవరూ లేకపోవడం మంచిదయిందని అనుకుంటూ గది చివరమూలకు వెళ్లి, ఒక మంచం కిందకి చేతులూ మోకాళ్ళమీద పాకుతూ వెళ్లి చీకట్లో ముడుచుకుని కూర్చున్నాను.
దాక్కున్న చోటునుంచి తొంగిచూస్తూ, దగ్గరగా అడుగుల శబ్దం వినిపించి భయపడుతూ కూర్చున్నాను. నన్ను వెతుకుతూ హాలులో గట్టిగా నా పేరు పిలవడం వినిపించింది. జడేవిన్ కూడా నన్ను వెతుకుతొందని తెలిసినా నోరు తెరవకుండా కూర్చున్నాను. త్వరలోనే అడుగుల శబ్దాలు ఎక్కువై, అరుపులు కూడా ఎక్కువయ్యాయి. ఆ శబ్దాలన్నీ నాకు దగ్గరవసాగాయి. కొంతమంది ఆడపిల్లలూ, ఆడవాళ్ళూ గదిలోకి వచ్చారు. నేను ఊపిరిబిగబట్టి కూర్చుని, అమ్మాయిలు అల్మారాల్లో, పెద్ద ట్రంకుల వెనక వెతకడం చూశాను. ఎవరో కర్టెన్లను పక్కకు లాగేసరికి, హఠాత్తుగా గదంతా వెలుతురుతో నిండిపోయింది. వంగి మంచంకింద చూడాలని వాళ్లకు ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. నేను కాళ్లతో ఎంత తన్నినా, పిచ్చిపట్టినట్లు గోళ్ళతో గీరినా వాళ్లు నన్ను బయటకు పడలాగేశారు. నేను ఎంత గింజుకున్నా వాళ్లు నన్ను కిందకు లాక్కెళ్లి ఒక కుర్చీలో కట్టేశారు.
కత్తెర చల్లగా నా మెడకు తగిలి, ఒక జడను కొంచెం కొంచెం కత్తిరించడం మొదలుపెట్టేంతవరకు నా తలా అటూఇటూ తిప్పుతూ గట్టిగా ఏడ్చాను. ఆ తరువాత నానుంచి నా ఆత్మ వెళ్లిపోయినట్లు అనిపించింది. మా అమ్మ నుంచి నన్ను దూరం చేసిన రోజు నుంచి ఎన్నో అవమానాలను చవిచూశాను. అపరిచితులు నన్ను తేరిపార చూశారు. చెక్కబొమ్మలా నన్ను గాలిలోకి ఎగరేసి ఆడారు. ఇక ఇప్పుడు పొడవాటి నాజుట్టును పిరికివాళ్లకు కత్తిరించినట్లు కురుచగా కత్తిరించారు. ఆ బాధలో అమ్మకోసం ఏడ్చాను. కానీ నన్ను సముదాయించడానికి ఎవరూ రాలేదు. మా అమ్మ చేసినట్లు ఒక్కరు కూడా నాకు నచ్చచెప్పడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడిక కాపరి అదిలించే పిల్లల్లో నేనూ ఒకదాన్ని అంతే.