ఎరుకల కాంభోజి రాగం

ఏది నేరం – యెవరు నేరస్థులు? నిర్వచించేదెవరు – నిర్ధారించేదెవరు? ఈ దేశానికి యెక్కడినుంచో దోచుకోడానికి వచ్చినవారు స్థానికంగా యీ నేలకి చెందిన వందలాది జాతుల్ని నేర జాతులుగా కొన్ని కోట్ల మంది ప్రజల్ని నేరస్థులుగా ముద్ర వేశారు. ఒక్క కలం పోటుతో అమానవీయమైన చట్టాన్ని పౌరసమాజం మీద రుద్దారు (క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ : 1871 ). తాము కూడగట్టుకున్న సంపదలు కాపాడుకోడానికి భద్రజీవులు యిటువంటి అమానవీయ చట్టాల్ని సంతోషంగా ఆమోదిస్తారు. సుఖంగా నిద్రిస్తారు. వారికి నిద్రా భంగం కాకుండా మొత్తం రాజ్య యంత్రాంగం విధినిర్వహణకు అంకితమౌతుంది. అప్పుడు మనుషులు మనుషుల్ని వేటాడతారు. వేట చట్టబద్ధమౌతుంది. ఒక జాతి మనుషుల్ని వంచించి వేటాడి ముకుమ్మడిగా హత్య చేసిన వారు ధరాధిపులై ‘రావు బహదూర్’ బిరుదులు పొంది చారిత్రిక పురుషులుగా ‘వాసి’కెక్కుతారు. ఘాతుక రాజుల శౌర్య పరాక్రమాలు వారి వంశావళి వందిమాగధులకు స్తోత్ర పాఠాలవుతాయి. కొండొకచో కొన్ని తరాలకు పసిపిల్లలకు పాఠ్యాంశాలౌతాయి. రాజ్యాల యేర్పాటు వెనక నేల పొరల్లో యింకిన నెత్తురు గురించి మాట్లాడేవాళ్ళే వుండరు. అజ్ఞానపుటంధ యుగంలో కనిపించని తీవ్ర శక్తులేవో నడిపిస్తే నడిచిన మనుషులు యెవరో యెప్పుడో తెలిసో తెలీకో చేసిన చేయని నేరాలకే కాదు చేయబోయే నేరాలకు కూడా శిక్షలనుభవిస్తూనే వున్నారు. అందుకు కారణాలు స్పష్టమే. వారిలో యెక్కువ భాగం వ్యవసాయం చేయరు. కులాధిపత్యాలకు లొంగరు. చట్టాలకు తలవొగ్గరు. అడవిలో వేటకో ఆహారసేకరణకో పరిమితమై తమవైన జీవన వ్యవస్థల్ని నిర్మించుకున్న యీ జాతుల్ని నాగరిక సమాజం వూరికి దూరం వుంచింది. డి నోటిఫికేషన్ చట్టాలెన్ని వచ్చినా నేరస్తులుగా వూరి బయటి అంచుల్లోనో వారికోసం నిర్మించిన బహిరంగ చెరసాలాల్లాంటి సెటిల్మెంట్లలోనో జీవిస్తున్న జాతుల్లో ఎరుకల జాతి కూడా వొకటి.

ఎరుకలు అటు ప్రిమిటీవ్ ట్రైబల్స్ లా అడవికీ చెందరు. ఇటు వూరూ వీరిని దగ్గరకు తీయదు. అడివి నుంచి వెదురు కొట్టుకువస్తారు. ఈత మెల్లె , ఈతాకూ కోసుకొస్తారు. మెల్లెతో తట్టలు, చిన్న చిన్న గుల్లలు, గంపలు అల్లుతారు. ఈతాకుతో చాపలు అల్లుతారు. చీపురుకట్టలు కడతారు. వెదురుతో వ్యవసాయదారులకు బుట్టలు ధాన్యపు గాదెలు యిళ్ళు కట్టుకోడానికి వుపయోగపడే తడికెలు వంటివి తయారుచేస్తారు. వాటిని చుట్టుపక్కలున్న సంతల్లో వూళ్ళల్లో తిరిగి అమ్ముకుంటారు. గాడిదల్నీ పందుల్నీ పెంచుతారు. అమ్ముతారు. రైతులకు పంది పెంటని పొలాలకు యెరువుగా అందజేస్తారు. ఊరికి పెడగా గుడిసెల్లో పందులతోనే సహజీవనం చేస్తారు. ఊరికి వెలిగా దూరంగా పందుల్లో పందుల్లా బతికినంతకాలం వూరి పెత్తందార్లకి పట్టింపులేదు. ఊరికి దగ్గరయ్యే క్రమంలోనే ఘర్షణ. కూలి పనులకు వెళ్తారు కానీ వారికి వూరు యెప్పుడూ అంటరానిదే; యెప్పటికీ కలుపుకోదు. సంచార జాతి అర సంచార జాతి వంటి అకడమిక్ పరిభాషలకు అందని జీవితం వారిది. సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యవసాయం చేసుకోడానికి ప్రభుత్వం నుంచి యే వొకరిద్దరికో భూమి లభిస్తే దాన్నుంచీ బేదఖలు చేసి ఆక్రమించుకోడానికి మోతుబరి కులాల పెత్తందార్లు గోతికాడ నక్కల్లా కాసుకు కూర్చుంటారు. ఒక స్థిర నివాసంకోసం, నిలవ నీడకోసం, సేద్యానికి చారెడు నేలకోసం, నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకొని మంచి బట్ట కట్టుకొని తలెత్తుకొని హుందాగా బతకడం కోసం, సామాజిక భద్రత కోసం, మెరుగైన జీవిక కోసం, ఆత్మ గౌరవంతో స్వతంత్రంగా జీవించడం కోసం నిరంతరం పెనుగులాడుతూనే వుంటారు. అది కూడా నేరమైంది. వారి యెదుగుదల ఆధిపత్య కులాల వారికి కన్నెర్ర అయింది. ఈ జీవన సంఘర్షణకి ప్రత్యక్ష సాక్షి బాలాజీ. కథకుడిగా అతని దృష్టి తన జాతి జనుల గత వర్తమానాల మధ్య సాపేక్షంగా లోలకంలా కదులుతూ వుంటుంది. అతని కథా స్థలం ఏకలవ్య ఎస్టీ కాలనీ. అది యెన్నో వైవిధ్యాల వైరుధ్యాల పుట్ట. ‘ఎరికిలోల్లకి వూరి మధ్యలో, అదీ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళే రోడ్డులో స్థలం కేటాయించడమే గొప్ప అని, ముందు ముందు ఆ స్థలానికి విలువ బాగా పెరుగుతుందని, గుడిసెల్లో, ఎర్రమట్టి ఇండ్లల్లో వుండేవాళ్ళు వాళ్ళ బిడ్డలకోసమైనా పక్కా ఇండ్లు కట్టుకోవాలని’ శతవిధాలా పోరాడితే యేర్పడిన కాలనీలో ఆధునిక జీవితపు పోకడల్ని అందుకోడానికి సంఘర్షించేవాళ్లూ వున్నారు. ఇంకా జీవిక కోసం పాత అలవాట్లు, వుపాధులు వదులుకోలేని వాళ్ళూ వున్నారు.

అందుకే కొత్తగా యేర్పడ్డ కాలనీల్లో సైతం యిప్పటికీ పందులు మేపే వాళ్ళున్నారు (మెదడు వాపు వ్యాధికి కారణమవుతున్నారు అన్న నెపం మోపి పందుల పెంపకం మీద అప్రకటిత నిషేధాలు అమలు చేసినప్పటికీ). బాతులు మేపే వాళ్ళు వున్నారు. ఎర్రమన్ను ముగ్గుపిండి అమ్మే వాళ్ళున్నారు. వెదురు దబ్బలు చీల్చి చేటలు గంపలు తట్టలు బుట్టలు అల్లిక చేసి అమ్మే వాళ్ళున్నారు. యెరుకల మహిళల్లో పల్లెల్లో సోది చెప్పేవాళ్ళు యిప్పటికీ కాలనీల్లో వున్నారు. నగరాల్లో సోది చెప్పడం ఫ్యాన్సీ డ్రెస్ ప్రదర్శన అవడం గొప్ప పారడాక్స్; కళాభాస.

వాస్తవానికి ఎరుకల వారంటే ఎఱుక గలవారు. ఎరుక (సోదె) చెప్పేవారు. భూత భవిష్యద్ వర్తమానాల్ని చూడగలిగినవారు. చూపగలిగినవారు. కానీ వారికి తమ సొంత గతం అందదు. వర్తమానం అనుకూలించదు. భవిష్యత్తు గోచరించదు. బతుకంతా దినదిన గండం. కాలంతో ప్రమేయం లేని కష్టాలే. అలుపెరుగని పోరాటమే. నిత్య నిరంతర సంఘర్షణే. ఆ సంఘర్షణకి అక్షర రూపమే పలమనేరు బాలాజీ ఇటీవలి కాలంలో వసంతమేఘం వెబ్ మ్యాగజైన్ లో రాసిన ‘ఎరుకల కథలు’.

ఎరుకల జీవితం వస్తువుగా వెలువడ్డ సాహిత్యం మనకు చాలా తక్కువ. ఎరుకల కుటుంబాల్లో సాంస్కృతిక జీవన వైవిధ్యాన్నీ స్త్రీ పురుష సంబంధాల్నీ ఆవిష్కరించిన అరుణ ‘ఎల్లి’, ‘నీలి’ నవలలు (1992 – 1996), ఆర్థికంగా యెదిగి తద్వారా సామాజికంగా సైతం upward mobility సాధించడానికి వొక ఎరుకల కుటుంబం చేసిన జీవన సమరాన్ని చిత్రించిన శిరంశెట్టి కాంతారావు ‘వాళ్ళు గెలవాలి’ నవల (2019), సెటిల్మెంట్ చెరనుంచి, నేరస్థ ముద్ర నుంచి బయటపడి గౌరవప్రదమైన జీవితం కోసం తపించే అభద్ర జీవుల బతుకు ఆరాటాన్ని అక్షరీకరించిన సలీం ‘లోహముద్ర’ (2024) .. యిలా అతి తక్కువ రచనలు కనిపిస్తాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమా యెరుకల జీవిత చిత్రణ మీద కంటే అతని నేరమయ జీవితం మీదే యెక్కువ ఫోకస్ చేసింది. అందులో వ్యాపార విలువల మాటున జీవిత విలువలు మాయమైపోయాయి. ఇటీవలే కొలిమి ‘ఎరుక’ పేరుతో ఎరుకల జీవన వైవిధ్యాన్ని వారిపై అమలయ్యే సామాజిక ఆర్థిక లైంగిక దోపిడీని నేపథ్యం చేసుకొని అల్లిన కథల్ని సంకలనంచేసి ప్రకటించింది. ఇది ఎరుకల కథల సమగ్ర సంకలనం. కానీ అందులోని రచయితలందరూ ఎరుకల సముదాయానికి బయటివారే. ఒక్క పలమనేరు బాలాజీ మాత్రమే ఇన్ సైడర్. తెలుగు సాహిత్యంలో యిటువంటి ఖాళీలెన్నో. ఖాళీలు పూరించడానికి ప ర్ స్పె క్టి వ్స్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ‘ఏకలవ్య కాలనీ – ఎరుకల జీవనగాథలు’.

ఏకలవ్య కాలనీ ఎరుకల కుటుంబాల్లో ‘ఒక్కొక్కరిదీ ఒక్కో కత. అన్ని కతలూ ఒకేలా వుండవు, ఎన్నో మలుపులు, ఎన్నో చిత్ర విచిత్రాలు, మరెన్నో విషాదాలూ సంతోషాలూ…’ వాటిలో కొన్ని పలమనేరు బాలాజీ గొంతులో కథల కాంభోజి రాగాలై పలికాయి. ఈ కథల్లో ఎస్టీ కాలనీలోని యెరుకల కుటుంబాలు సముదాయంగా, వ్యక్తులుగా యెదుర్కొన్న అనేక సమస్యలు చర్చకు వచ్చాయి. అనేక అవమానాల మధ్య అవహేళనల మధ్య అణచివేతల మధ్య కాలనీలో బతికేవాళ్ళు సామాజికంగా తమకొక గుర్తింపు కోరుకున్నారు. గౌరవ పూర్వకమైన ఆర్థిక ప్రతిపత్తి కోసం ఆరాటపడ్డారు.

ఎక్కడ ఎక్కడో విసిరేసినట్లు దూరదూరంగా వుండే వాళ్ళు, రకరకాల పనులు చేసే వాళ్ళు, అడవిలో కట్టెలు తెచ్చి అమ్ముకునే వాళ్ళు, తేనే , మూలికలు, ఆకు పసర్లు అమ్ముకునే వాళ్ళు, పందులు బాతులు మేపే వాళ్ళు, వెదురు పని చేసే వాళ్ళు … ఇట్లా రకరకాల మనుషులు ఒక్క చోటికి వచ్చి, కాయ కష్టం చేసి, తినీ తినక, కూలి నాలి చేసి, ఒకరి ఇంటి పనుల్లో మరొకళ్ళు వంతుల వారిగా పని చేసుకుంటూ ఒకరికొకరుగా నెలల తరబడి అహోరాత్రులు శ్రమ పడితేనే ఎరుకల కాలనీ యేర్పడింది. అది ఎస్టీ కాలనీగా ‘ఏకలవ్య కాలనీ’గా రూపొందే సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిణామ క్రమమే బాలాజీ నాలుకపై కథలుగా పరిణమించింది.

ఇందులోని తొలి కథలు బాలాజీ స్వీయచరిత్రాత్మకమైన ఆత్మకథనాలు. వాటిలో కనికరపు గుండెగల అతని అమ్మానాన్నలున్నారు. ప్రేమతో ప్రతి గుమ్మానికీ ‘మనిషి వాసన’ మోసుకుపోయే ‘అమరజీవి’ కాంతమ్మత్త లాంటి ఆత్మ బంధువులున్నారు. వాళ్ళు బోధించిన ఆచరించి చూపిన జీవన విలువలున్నాయి. అడవి నుండి ఎండుకట్టెలు గాడిదల పైన తీసుకొని వచ్చి, వూర్లో అమ్మడం బాలాజీ నాయన వాళ్ళ నాయన వృత్తి. ఆయనకు పందుల వ్యాపారం కూడా ఉండేది. తాత ‘గాడిదల పైన ఉప్పు అమ్మే కాడ్నుంచి, నాయన ఉద్యోగస్తుడు ఎట్లా అయినాడో’ చెబుతూ బాలాజీ తన నుంచి – తన కూతురు వరకూ నాలుగు తరాల పాటు మారుతోన్న జీవన పరిస్థితుల్ని మనముందు కుప్పవోశాడు. దానినుంచి అపురూపమైన సామాజిక చరిత్రని మనకు అందించాడు. ఆ క్రమంలోనే తన చుట్టూ వున్న సొంత సముదాయాల్లో వ్యక్తుల జీవన వైవిధ్యాన్ని నలుపు తెలుపుల్లో కాకుండా కుంచె బూడిద రంగులో ముంచి బొమ్మ కట్టించాడు. జీవన వాస్తవికతని మించిన కాల్పనికత లేదని తన కథనాల్లో నిరూపించాడు. ‘ఊహించినవో, కల్పించినవో అయితే కథలు రచయిత చెప్పినట్లే ఉంటాయి. కానీ ‘ఇవి కల్పితాలు కాదు. యథార్థ జీవితాలు. మనం కోరుకున్నట్టు అవి ఉండవు’. కథల్లో బాలాజీ ఎరుకల జీవితాలు యెట్లా వున్నాయో యెట్లా కొనసాగాయో చెప్పి వూరుకోక అవి యెట్లా వుండాలని తాను అనుకుంటున్నాడో చెప్పడం వల్ల కథల్లో యెన్నో మానవీయ కోణాలు ఆవిష్కారమయ్యాయి. అవమానించడానికి కారణమయ్యేవాటినే, బాధని అణచిపెట్టి, ఆత్మగౌరవ ప్రతీకలుగా ప్రకటించాడు. ఈ మాటలు చూడండి:

“మా ఎరికిలోల్లల్లో పందులు మేపినా, గాడిదలు కాసినా, ఉప్పు అమ్మినా, వెదురు బుట్టలు దబ్బలు, తడికలు అమ్మినా, అడివిలోకిపోయి ఎండుకట్టెలు తెచ్చి వూర్లో అమ్మినా, ఎండలో ఇల్లిల్లు తిరిగి ఎర్రమన్ను, ముగ్గు పిండి అమ్మినా , పెద్దోల్ల ఇండ్లల్లో ఇంటి పని చేసినా, కూలికి పోయినా, ఏం చేసినా మా కడుపాత్రం మా బ్రతుకేదో మేం బ్రతకడమే మాకు తెలుసు. కష్టపడి సంపాదించడమే తెలుసు. అంతే కానీ, ఎవురి సొత్తుకు పోవడం కానీ, ఇంకొకళ్ళ సొత్తు వూరికే ఆశించడం కానీ మాకు తెలియదు. గాడిదలు కాసినా, పందులు మేపినా ఆ జీవాల్ని ఎంత గొప్పగా, గౌరవంగా, ఇష్టంగా మా ఇండ్లల్లో మనుషుల మాదిరే అన్నతమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళ మాదిరే చూస్తాం తప్ప, అవేవో జంతువులని కానీ , మనుషుల కంటే చాలా తక్కువని కానీ మాకు ఎప్పుడూ అనిపించదు ఎందుకంటే మాకు పంది పిల్లలతో ఆడుకోవడం తెలుసు. గాడిద పిల్లల్ని సాకడమూ తెలుసు. మా పెద్దోళ్ళు మమల్ని సాకినంత మురిపంగానే , ముద్దుగానే ఆ జీవాల్ని కూడా పెంచుతారు.”

బ్రిటిష్ కాలంనాటి స్టూవర్టుపురం లాంటి సెటిల్మెంట్లు యెక్కడ దొంగతనాలు జరిగినా ‘పోలీసోల్లు ముందు ఎరికిలోల్లని ఎత్తి లోపలెయ్యడాని’కి, తప్పుడు కేసులు బనాయించి నేరాలు వొప్పించడానికి రెడీమేడ్ దొంగల్ని కోర్టుల్లో హాజరు పరచడానికి చాలా అనుకూలంగా వుండేవి. సెటిల్మెంట్లే యిప్పడు ఎస్టీ కాలనీలుగా మారాయి. రాజ్యం, దాని యంత్రాంగాల స్వరూపం మారలేదు, స్వభావమూ మారలేదు. పునాదిలో మార్పు తీసుకురాని సంస్కరణలు గానీ సంక్షేమాలు గానీ యిచ్చే అసంబద్ధ ఫలితాలకు నమూనాలు యెరుకల జీవితాలు.

“అయ్యా ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిందని మొత్తం కులాన్ని తప్పు పడితే యెట్లా ? గతాన్ని సాకుగా చూపి మొత్తం మా కులాన్నే తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. ఎక్కడ దొంగతనాలు జరిగినా ముందు మీరు మా ఇండ్లకాడికే వచ్చి వయసు మొగోల్లని, ముసిలోల్లని కూడా కుల్లబొడుస్తారు. ముసిలోళ్ళనయినా ఇడిసి పెట్టండి సారూ అని మేం అడుక్కుంటే ముసిలోల్లకే అనుభవం ఎక్కువ, నేర్పరితనం, పనితనం ఎక్కువ అంటారు. మేం చెప్పే ఒక్క మాటైనా వినకుండా మమ్మల్ని అనుమానాలతో అవమానాలతో సంపేస్తావుంటే, మేం యాడికి పోవల్ల సామీ? … ఎరికిల కులంలో పుట్టడమే మా తప్పా సామీ?” అని పోలీసుల భయంతో వూరొదిలి పారిపోయిన కొడుకుకోసం కళ్ళు కాయలు కట్టేదాకా యెదురు చూసే వొంటి కంటి నారాయణప్ప (మా తప్పు ఏంది సామీ), ‘భూమ్మీద బతికేదానికీ సస్తే మన్నులో మన్నుగా కలిపేదానికీ మా కులం అడ్డమేనా’ అని అడవికి దూరమై చారెడు నేల కొనుక్కొని సేద్యం చేసి బతుకుదామనుకున్న కట్టెలామె – ఆదెమ్మ (ఏనుగుల రాజ్యంలో..) అడిగే ప్రశ్నలకి తరాలు గడిచినా కులాధిపత్య నాగరిక సమాజం నుంచి సమాధానం లభించదు.

సంపాదించుకున్న పైసలతో ఒక పూట తిని ఒక పూట తినక అర్ధాకలితో ‘సరస్వతీ నిలయా’ల మెట్లెక్కి చదువు నేర్చుకోవడం, నేర్చి వుపాధి సమకూర్చుకోవడం వొక భీకర యుద్ధమే. పందులు కాసుకొనే వారికి చదువెందుకు సేద్యం ఎందుకు అనే అవహేళనలు, వాటిని తట్టుకొని యే వుపాధినో వెతుక్కుందామంటే దొంగలు అన్న ముద్రతో పొందే అవమానాలు యెంతగా కుంగదీస్తాయో వాటిని స్వయంగా అనుభవిస్తేనే గానీ తెలీదు. కనపడని యీ అట్రాసిటీని బాలాజీ యీ కథల్లో సున్నితంగా కళ్ళకు కట్టాడు. అందుబాటులోకి వచ్చిన కొద్దిపాటి చదువులు చదువుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పటికీ యేదో విధంగా చిన్నగా కుదురుకున్నప్పటికీ సామాజికంగా డిగ్నిటీ పొందలేకపోవడం యిప్పటి యెరుకల యువత ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. దాన్ని అధిగమించడంలో యెదురయ్యే అదృశ్య హింసకు బాలాజీ యీ కథల్లో అక్షరరూపం యిచ్చాడు. తన అక్షరాలకు ఆత్మగౌరవ స్వరాన్నిచ్చాడు. ‘మనోళ్ళు అందరూ పేరు చివర ఎరుకల అని పెట్టుకోవాలి. నా పేరు అడిగితే నాగరాజు ఎరుకల అనే చెపుతా’. కొత్త తరం ఆలోచనా స్రవంతి కథల్లో యేదో రూపంలో అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది. ఆధిపత్య కులాల ఆర్థిక లైంగిక దౌర్జన్యానికి యెదురు నిల్చిన మంజుల (గురి), నీలమ్మ (వెదుర్లు), కులం పేరు చెప్పుకోడానికి కించపడక ఆత్మాభిమానాన్ని ప్రకటించిన వంట మాస్టర్ ‘కబాబ్ కపాలి’, కన్న కలను సాకారం చేసుకోవాలంటే ‘దేనికీ భయపడొద్దు’ అని హెచ్చరించే పోలీసు మునిరత్నం, కొట్లాడందే దేన్నీ సాధించలేం అని జీవితపాఠాన్ని బోధించే ‘ఉడుకోడు’ అనే ఎరుకల (మేనపాటి) నరసింహులు, ఆత్మగౌరవ పోరాటానికి నిలువెత్తు రూపమైన యువరాజు, పార్వతి, భూమిక యెరుకల మెరుగైన భవిష్యత్తుకి దిక్సూచీల్లా గొప్ప ధీమాతో కనిపిస్తారు. భరోసానిస్తారు.

‘ఎరికిలోడు సేద్యం ఒక్కటే నేర్చుకుంటే సాలదు మామా, పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల, బతకాలంటే కరువుతోనే కాదు మొండి మేఘాలతోనే కాదు మొండి మనుషులతో పెద్ద కులమోళ్ళతో పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల. బతకాలంటే నెత్తురు ఉడుగ్గానే ఉండల్ల’ (ఉడుకోడు). ఇది యీ కాలపు ‘యెరుక’.

ఏకలవ్య కాలనీల్లో అంకుర ప్రాయంగా వున్న యీ చైతన్యం సరైన సామాజిక ఆచరణ దిశగా సాగాలనే రచయిత ఆశంస యీ కథల్లో బలంగా వ్యక్తమైంది. అయితే ఎరుకల జీవన పార్శ్వాలకు చెందిన అనేక అంశాలు బాలాజీ చెప్పిన వాటికంటే చెప్పాల్సినవే యెక్కువ వున్నాయి. తన సముదాయపు సాంస్కృతిక ఆవరణ లోతుల్లోకి వెళ్లి అతను మాత్రమే రాయగల కతలు అతని గుండె అరల్లో యింకా మిగిలే వున్నాయి. బొటనవేలు కోసి విద్యకు దూరం చేసిన ఆచార్యుల వారసులు ఏకలవ్యుని పేరు చెప్పి కాలనీల్లోకి చొరబడే మతవాద రాజకీయాల పట్ల అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు కథల్లోకి యెక్కవలసే వున్నాయి. వాటన్నిటినీ మనతో పంచుకునేందుకు బాలాజీకి ‘కథ రాసే సమయాలు’ మరిన్ని లభించాలని కోరుకుందాం. అభినందనలతో…

ఎ. కె. ప్రభాకర్
సంపాదకుడు (టీమ్ ప ర్ స్పె క్టి వ్స్)

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply