ఎదురీత

అది- వెంపటి గ్రామం. సూర్యాపేటకు యాభై కిలోమీటర్ల దూరంలోని మారుమూల పల్లె.
ఉదయం పదకొండు. జూన్‌ నెలకావడంతో ఎడతెగక కురిసే వానలు.

పల్లె వెలుగు బస్సు దిగగానే, ఊరిబయట రెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న మర్రిచెట్టుకు బ్యానర్‌లు. రంగురంగుల యూనిటీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

ఓ పెద్ద ఫ్లెక్సీపై ‘విజయ గాధలు’ ప్రోగ్రామ్‌కు వస్తున్న అందరికీ స్వాగతం’ అని పెద్ద అక్షరాలతో ఉన్నది. దానికింద కొందరు విజేతల ఫొటోలున్నాయి. వాళ్లంతా ఇదే పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరినవాళ్లు.

ఇక్కడే చదువుకొని వివిధ రంగాల్లో ప్రసిద్ధులైనవాళ్లంతా ఈ ప్రోగ్రామ్‌కు వస్తున్నట్టు అర్థమైంది. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు ఇలాంటి ప్రోగ్రామ్‌ పెట్టినట్టు చెప్పింది, నాతోపాటే బస్సు దిగిన ఉపాధ్యాయురాలు. ఆమె అదే స్కూల్‌లో సోషల్‌ స్టడీస్‌ టీచర్‌. తమ విజయ గాధల్ని చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో అనేకమంది వస్తున్నట్టు చెప్పింది. పూర్వ విద్యార్థులంతా బస్సుల్లో, కార్లలో, వివిధ వాహనాల్లో వస్తున్నారు.

ఆ మర్రి చెట్టుకు ఉత్తరం దిక్కు ఉన్నది, ఆ బడి. నాకూ ఆ వేడుకల్ని చూడాలనిపించింది. ఆ టీచర్‌తో పాటే నడుచుకుంటూ వెళ్లి ఆ మర్రి నీడలో నిలబడ్డ. చుట్టూ ఎత్తైన కొండలు. పచ్చని చేలు. కొద్ది దూరంలోనే పారే ఏరు. మైదానంలో వానకు తడిచి నవ్వుతున్న గడ్డిపూలు. గరిక పూలపై మెరుస్తున్న వాన చినుకులు. కాలిబాటల్లో నీరెండలో మెరిసే పలుగురాళ్లు. రివ్వున ఎగిరే రింగన్నలు. తుమ్మెదలు. తుమ్మిశ్కెలు. సీతాకోక చిలుకలు. ఆ ఎత్తైన కొండలపై ఇంకా కురుస్తున్న వాన. ఆ వాతావరణమంతా ఆహ్లాదంగా ఉన్నది. హాయిగొలుపుతున్నది. మనసునంతా తేలికపరిచినట్లయింది.

ఆ మర్రిచెట్టు నీడలో పరుపు బండపై కాసేపు అడ్డం ఒరిగిన. ఇంతలో వాహనాల హారన్‌ల మోతతో దిగ్గున లేచిన. చుట్టుపక్క గ్రామాల నుంచి స్కూలు పిల్లలు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులంతా అక్కడి చేరుకుంటున్నరు. ఇంకాసేపట్లో ప్రోగ్రామ్‌ ప్రారంభమవుతుందని మైక్‌లో అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తున్నది. అక్కడే డొంక దారిలోంచి కల్లు కుండలు తగిలించుకొని, సైకిల్‌పై ఓ యాభై ఏళ్ల గౌడన్న పోతున్నడు. అప్పటికే ఆకాశం నిండా మబ్బులు. ఒక్కసారిగా వాన అందుకుంది. ఆ దారెంట పోయే రైతులు, కూలీలు వాన నుంచి తప్పించుకోవడానికి ఈ మర్రికిందికే వచ్చిండ్రు. కల్లు కుండలపై పాలనురుగులా పొంగుతున్నది.

ఆ పరుపు బండకు అటువైపు ఓ ముసలమ్మ ఈతాకుతో చాపలల్లుతున్నది. ఇంకొక పెద్దమనిషి ఈత బరిగెలతో తట్టలు, బుట్టలు, గంపలు అల్లుతున్నడు. కొద్దిదూరంలో ఈత వనం ఉన్నది. ఓ ముతక దోతీ బిగకట్టుకున్న ఓ యువకుడు ఈత బరిగెలు నరుకుతున్నడు. చెలిగే ఈతాకునంతా అతని భార్య గోనె బస్తాలో నింపుకుంటున్నది. పక్కనే జిట్టీత చెట్ల పొదల్లోంచి ఓ బుర్క పిట్ట తుర్రుమన్నది. అక్కడికి కొద్దిదూరంలో నల్ల గొంగడి కప్పుకొని ముగ్గురు గొల్లలు గొర్లు మేపుతున్నరు. కురిసే చినుకుల్లో తడిచే పాట గాలిలో అలలు అలలుగా హోరెత్తుతున్నది. ఓ గొల్లాయినె పాటందుకున్నడు. అది భూమికీ, మనుషులకూ, ఆకాశానికీ సంబంధాన్ని చెప్పే పాట. ఇంకో ఇద్దరు వంతపాడుతున్నరు. ఆ పాటను వానలో తడిచే గొర్లూ తలపైకెత్తి వింటున్నయి. నాలోనూ ఆ పాట ప్రవహిస్తున్నది. అప్రయత్నంగానే నా పెదాల్లోంచి పల్లవిస్తున్నదా పాట. ఆ పాటలో లీనమయిన. ఆ పాటలో సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, పారే ఏరూ, కురిసే వానా, మెరిసే నీరెండ. నవ్వే పూలూ, పాడే పక్షులూ.

ఆ బడి బయట పిల్లల తుళ్లింతలు, కేరింతలు, చప్పట్లు. పూర్వ విద్యార్థుల కరచాలనాలు, ఆలింగనాలు. ఆ బడి పిల్లల కళ్లల్లో వెలుగులు. కొందరు వానలో తడుస్తున్నరు. కొందరు ఎగురుతున్నరు. వాన చినుకుల్ని దోసిళ్లలో పట్టుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటున్నరు. ఎన్నో ఏళ్లుగా దూరమైన మనుషులంతా కలుస్తున్న వేడుక ఇది. అపూర్వ సమ్మేళనం ఇది.

ఇంతలో విజయ గాధల ప్రోగ్రామ్‌ మొదలైంది. అందరూ లోపలికి వెళ్లిండ్రు. నేనూ వెళ్లి ఆ టెంట్‌ కింద చివరలో కూర్చున్న. నా పక్కనే ఓ నడిఈడు మహిళ కూర్చున్నది. పెద్ద బొట్టు, కాళ్లకు వెండి కడియాలు, దండ కడియం, గదమపై పచ్చబొట్టు. పెద్ద అంచున్న చేనేత పూలచీర కట్టుకున్నది. ఆ చీరపై శెనిగె పూలు, తంగేడు పూలు మెరుస్తున్నట్టుగా ఉంది.

ఆ టెంట్ల కింద చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చిన వేలాది మంది జనం ఉన్నరు. వేదికపైకి ఒక్కరూ వచ్చి తమ విజయ గాధల్ని చెప్తున్నరు. తమ జీవితంలో నవ్వూ ఏడుపూ కలగలిసిన అపూర్వ క్షణాల గురించి చెప్తున్నరు. బడి పిల్లల కళ్లల్లో వెలుగు నిండిరది. ఇంతలో ‘కూతాటి లక్ష్మి’ గారు వేదికపైకి రావాలంటూ అనౌన్స్‌ చేశారు. చేనేత చీర కట్టుకున్న ఓ ముప్పై ఐదేళ్ల మహిళ నా పక్క నుంచే నడుచుకుంటూ వేదికపైకి వెళ్లింది. రెండు చేతులూ జోడిరచి, అందరికీ అభివాదం చేసింది. మెరుస్తున్న మేని. వెలుగుతున్న కళ్లు. ఆరడుగుల ఎత్తుతో ధీరలా నిలబడి అందరికీ నమస్కరించింది. మైక్‌ అందుకున్నది.

‘‘నేను లక్ష్మి. కూతాటి ఎల్లమ్మ, చంద్రయ్యల బిడ్డని. నాది ఇదే ఊరు. చిన్నప్పుడు ఇదే బడిల అక్షరాలు దిద్దిన. పాఠాలు చదివిన. ఆటలాడిన. పాటలు పాడిన. ఇదే వాగు వంకల్లో తిరిగిన. వానల్లో తడిచిన. ఈ కొండా కోనా, చెట్టూ చేమా అన్నిటికీ నేను తెలుసు. నాకు చనుబాలిచ్చిన మాల కాంతమ్మ, నన్ను కనని తల్లి. పాలిచ్చి నా ప్రాణం కాపాడిన అమ్మ. మీ అందరి ముందూ ఈ వేదికపై నిలబడి మాట్లాడేందుకు నా దోసిళ్లలో అక్షరాలు పోసిన సోమన్న సారుకు నేను గుర్తుండే వుంటాను. ఇరవై ఐదేండ్ల తర్వాత నన్ను ఈ ఊరికి ఆహ్వానించిన ఈ బడికి నేనెప్పుడూ బిడ్డనే. ఈ బడి నా రెండో అమ్మ. మా అమ్మ ప్రాణం పోస్తే, ఈ బడి వెలుగునిచ్చింది’’.

మాటల మధ్యలో ఆమె ఉద్వేగానికి లోనవుతున్నది. ఉబికి వచ్చే కన్నీళ్లను దిగమింగుతున్నది. పెదాలు వణుకుతున్నాయి. గొంతులో కన్నీటి తాలూకు జీర.
‘‘ఏమని చెప్పను! నా విజయ గాధను. ఎంతని చెప్పను! నా కన్నీళ్లను. ఎట్లా చెప్పను! నేను నడిచి వచ్చిన దారిని. నన్ను ఆదుకున్న దరిని’’ మత్తడై దుంకుతున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నది.
‘‘నా విజయ గాధను చెప్పమని పిలిచిండ్రు కదా! ఇదేమంత విజయం అనుకోను. ఐతే, నేను నడిచి వచ్చిన దారి గురించి చెప్పాలనివుంది. ఆ దారిలో ఎదురైన అవమానాలను చెప్పాలనివుంది. వివక్షల్నీ, వెలివేతల్నీ మీ అందరికీ పంచుకోవాలని వుంది.’’ అంటూ పైట కొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నది.

బడి పిల్లలూ, జనమంతా నిశ్శబ్దంగ ఉన్నరు. ఆసక్తితో వింటున్నరు. ఏం చెప్తుందో విందామని ఆసక్తితో ఎదురుచూస్తున్నరు.

‘‘నా గెలుపు దారిలో నీడలా వెంటవుండి, నన్నిక్కడికి నడిపించిన నా తల్లి చెప్తది, మీరంటున్న విజయగాధని. దయచేసి మీరు అనుమతి ఇస్తే అమ్మను పిలుస్తాను’’ అని అభ్యర్థించింది.
‘‘ఎస్‌. ప్లీజ్‌’’ నిర్వహకుడు.
‘‘తాయీ… స్టేజి మీనాకి వా…’’ (అమ్మా… స్టేజీ మీదకు రా…) అని పిలిచింది.
నా పక్కన కూర్చున్న పూలచీర మహిళ లేచి వెళ్తున్నది. అప్పుడర్థమైంది, ఈమే ఆమె తల్లి అని. అంతమంది జనంలో తడబడుతూ నడుస్తున్నది. పులుల మందలో లేడి పిల్లలా నడుస్తూ వేదిక మీదికి వెళ్లింది.

లక్ష్మి తల్లికి మైకు అందించింది. వణికే చేతులతో మైకు పట్టుకున్నది. చుట్టూ కలియజూసింది. ఆ బెదురు చూపులు, ఆమె ఎన్నడూ స్టేజీ ఎక్కలేదని చెప్తున్నట్టు అనిపించినై. తడబడే గొంతులో మాట్లాడుతున్నది.

చేతులు జోడించి, ‘‘మీ అందరికీ దండాలు. ఏమని శెప్పాలె బిడ్డా… మా గోసని. మాది ఇదే ఎంపటి. ఆ శెరువొడ్డునే మా గుడిసెలు. మేం ఎరుకలోల్లం. పందులు మేపుకొని బతికెటోల్లం. పందుల గుడిసెలూ మా ఇంటికి ఆనుకొనే వుండె. అయీ మేవూ కలిసే బతికినం. అయి లేకుంటె మాకు జివునమే లేదు.

మేం ఐదుగురం అక్కచెల్లెల్లం. నేనే పెద్ద పిల్లని. ఇంటిల్లిపాదీ రెక్కాడితెనే డొక్కాడే బతుకు. అమ్మ తట్టలు, బుట్టలు, గంపలు, ఈతాకు సాపలు అల్లేది. మా అయ్య గుమ్ములు అల్లేది. ఈత బరిగెలూ, వాయిల్‌ బరిగెల కోసం అడివికి పోయెటోడు. అప్పుడప్పుడూ శికారికి సుత పోయేది. ఉచ్చులకు శిక్కిన అడవి పందులు తెచ్చెటోడు. శెరువారకు వాటినిక మంటల్ల కాల్షి కోసి పోగులేసి అమ్మేది. ఈ ఊర్లె శానమంది తినేటోల్లు. సాటుంగ కొందరు, నేటుంగ కొందరు.

మా చెల్లెండ్లతోటి కల్సి పందుల తోలుకొని శెరువు పొంటి, కాల్వల పొంటి మేపేది. నాలెక్క చెల్లెండ్లు సుత పందులు కాసే బతుకు ఒద్దని ఆల్లను బడికి పంపాలనుకున్నం. ఒకనాడు బల్లెకు తీస్కపోయి పేరెక్కిచ్చినం. బట్టలు, పలక, బలపాలు సుత ఇచ్చిండ్రు. ఐదార్రోజులకే బడికి పోమని సతాయించిర్రు. ఎంత కొట్టిన ఇనలేదు. ఓ రోజు ఆల్లకు పులుగం బువ్వొండిపెట్టిన. ‘బడికెందుకు పోతలేరే?’ అని అడిగిన.

చిన్నది చెప్పింది, ‘‘అక్కా… మన ఎరుకలోల్లమట. బల్లె ఎవ్వలూ మమ్ముల ఆల్లతోటి కూసోనియ్యలేదు. ‘అసుంట జరిగి కూసేవే. ఎరుకలోల్లని ముట్టుకోవద్దని మా అమ్మ చెప్పింది’ అన్నది, ఆ ఒడ్ల పాపయ్య బిడ్డ. ఎవ్వలి దగ్గెర కూసున్నా గట్లనే అన్నరు. దోస్తులెవ్వల్లేరు. చెప్రాసి సుత ఎదడు బరిగె తోటి కొట్టెటోడు. ఇగ మాకు బడికి పోబుద్దికాలేదు’’ అని చెప్పింది. అది శెప్తాంటెనే ఏడుపొచ్చింది. ఎంత నచ్చజెప్పినా ఇన్లేదు. బడికి పోలేదు. ఇగ నాతోటే పందుల మేపుతానికి ఒచ్చేది.

పొద్దున లేవంగనె గటుక ఒండుకొని, గంజిల కలుపుకొని తాగేది. పందుల తోలుకొని శెరువు కట్టమీంచి ఏటి ఒడ్డుకు పొయెటోల్లం. ఎప్పుడో పొద్దు గూట్లె పడ్డంక ఒచ్చేది. రోజూ ఇదే పని.

ఒగనాడు కొన్ని పందులు పక్కన ఉన్న జొన్న చేన్లకు పొయినై. జొన్న కర్రలు ఇరిగినై. చేన్ల పందులు ముట్టెలతోటి గుద్దినై. అది ఆ చేను పటేల్‌ సూశిండు. ముల్లుగర్ర పట్టుకొని కోపంగ ఉరికొచ్చిండు, ఆడికి.

‘‘అసే… ఎరుకల్లంజలార. పందులు చేనంత నాశినం జేస్తున్నై. కండ్లల్లం ఏం బెట్టుకున్నరే? పందులు చేనంత ఆగం జేస్తంటె ఏం పీకుతున్నరే? ఈ చేను మీ అయ్య జాగీరా? మీ తాత జాగీరే? మీ అమ్మల కుక్కల్‌ దెం…’’ అని ఎగిరి తన్నిండు. జొన్నచేను గట్టుమీద అంతదూరం ఎగిరిపడ్డ. తుంటి మీద బలంగ తన్నిండు. పానం బొయినంత పనైంది. నన్ను లేపుతానికి మా చెల్లె ఉరికొచ్చింది. దాన్ని సుత జాడిచ్చి తన్నిండు. అది బొక్కబోర్ల పడ్డది. మూతీ ముక్కూ అంతా నెత్తురే.

చేతులకు, కాల్లకు దెబ్బలు తగిలినై. ఒల్లంత రడం రడమైంది. చెల్లె లేశి, గుంటగలగరాకు పసరు పిండి, గాయాలమీద పోసింది. నడుసుడు వశపల్లేదు. శిన్నగ పందుల తోలుకొని ఏటి ఒడ్డుకు పొయినం. పొద్దుగూకిందాక ఆన్నే వుండి, ఇంటికి తోలుకొచ్చినం.

ఇంటికొచ్చినంక చెల్లె అక్కడ జరిగిందంత మా అమ్మకు పూసగుచ్చినట్టు చెప్పింది. మా ఒంటి మీది దెబ్బలు సూశి మా అమ్మ గొల్లున ఏడ్షింది. కొన్ని రోజుల తర్వాత పందుల తోలుకొని ఊరికి చివర ఉన్న పొలాల దగ్గెరికి పొయిన. ఒడ్లు దంచే పని వుండి, అయాల చెల్లెండ్లు నాతోటి రాలేదు. ఇంటికాన్నే ఉన్నరు. తొవ్వ పొంటి పందులు మేస్తున్నై. ఆడికి కొద్ది దూరంల కొందరు పడుసు పోరగాల్లు నిలబడి ఉన్నరు.

ఆల్లు నన్నుజూసి, దగ్గెరికొచ్చిండ్రు. నేను ఒక్కదాన్నే ఉన్న. నా కాల్లు చేతులు ఆడ్తలెవ్వు. ఆల్లను జూడంగనె ఒల్లంత శెమటలు బట్టినై. ఒకడు రానే ఒచ్చిండు.

‘‘ఏ… అంజీ! నిన్ను సూస్తాంటె మతి పోతాంది. ఏం అందమే నీది? ఏ దేవుడు చేసిండే నిన్ను?’’ అనుకుంట ఇంకా దగ్గెరికొచ్చిండు. పైట కొంగు గుంజిండు. ఇంకొకడు భుజం మీద చెయ్యేసిండు. ఒకడు నడుం పట్టుకున్నడు. పులికి శిక్కిన మేకపిల్ల లెక్క అయింది నాకు. అప్పుడే ఆ దారిన పొయ్యే నీరటి నాగయ్య తాత ఆల్లను మందలించిండు. తిట్టి ఎల్లగొట్టిండు.

ఆల్లు ‘ముసల్నా కొడకా… నీ సంగతి చెప్తం’ అనుకుంట ఆన్నించి ఊరిదిక్కు పొయిండ్రు.

‘‘బిడ్డా… ఎప్పుడూ మీ ఎంట కొడవలి ఉంచుకోవాలె. ఎప్పుడన్న అవుసరం ఒస్తది. అది మీ పానాల కాపాడుతది. పానాలుదీసె జంతువులొత్తె దీంతోటి నరుకొచ్చు’’ అని దైర్నం చెప్పిండు. నాగయ్య తాతతోటి మాట్లాడుకుంట ఇంటికి ఒచ్చిన.

ఇంటికొచ్చినంక ఒకటే బాధ. ఏడుపు ఆగలేదు. చెల్లెండ్లను కావలించుకొని ఏడ్షిన. ఎరుకలోల్లంటె గింత అలుసా ఈల్లకు? మేం మనుసులం కాదా? మాకు రేషం లేదా? మేం అందరికీ లొంగి బతుకాల్నా? మా బతుకంతా గింతేనా? దెబ్బలు, దెంగులేనా? అని ఎంత ఏడ్షిన్నో!

కొద్దిరోజుల తర్వాత అమ్మా నాయినలు నాకు పెండ్లి చేయాలనుకున్నరు.

‘‘అంజమ్మను మా అక్క కొడుకు ఎల్లిగానికి పెండ్లి చేద్దం’’ అన్నడు, నాయిన.
మా అమ్మకేమొ ఆల్లంటె అస్సల్కే ఇష్టం లేదు. నాకు సుత పావురం లేదు. అది తాగుబోతు సంగుటమని తెల్సు. ఆడు తాగుబోతు. తిరుగుబోతు. ఏ సోయీ లేనోడు. ఐనా, మా అయ్య మాటకు తలొంచ తప్పలే. మా మేన బావతోటి పెండ్లి చేసిండ్రు.

ఒడిబియ్యం మల్లినంక అత్తగారింటికి పొయిన. నా మొగడు రోజూ తాగుడే. అస్సలు పట్టించుకోడు. కొట్టుడు, తిట్టుడు. అనుమానం. ఎవ్వల్తోటి మాట్లాడినా రంకు అంటగడుతడు. మా అత్త సుత ఇంతే. కొడుకు మాటే ఇంటది. నన్ను పశువు లెక్క సూస్తరు.

మా అత్త శానా నోరుగద్దరిది. ప్రతిదానికీ తిడతనే వుంటది. ఆల్ల తిట్టుడు, కొట్టుడు, పరాయి మొగోల్లతోటి రంకు అంటగట్టుడు… అన్నీ భరించిన.

అట్లా నా బతుకు ఆగమైంది. ఒకనాడు గటుక పిండి ఇసుకొత్తానికి అవతలి బజారుకు పొయిన. తిరిగి ఒచ్చేసరికి మా మేనత్త పందులు తడక సందుల్నించి ఇంట్లె జొరబడ్డై. సామాన్లన్నీ ఆగమాగం చేసినై. అప్పుడొచ్చింది, మా అత్త. ఒచ్చుడుతోటే ఒంటికాలు మీద గయ్యిన లేశింది.

‘‘లంజముండా… బజారుదాన. పందులు ఇంట్లె జొరబడితె సూడకుంట, ఎవ్వనితోని పండబొయినవే రంకుదాన’’ అని తిట్టుకుంట జుట్టు పట్టుకొని బయటికి గుంజుకొచ్చింది. పందులు కుడితి తాగే తొట్లకాడి బురదల పొర్లిచ్చి కొట్టింది. ఆమె ఎంత కొడుతున్నా నా మొగడు, మేనమామ ఎవ్వలూ అడ్డం రాలేదు. ఆల్లకూ భయమే ఆమంటె. మా పాలోల్ల యారాలు ఒచ్చి ఇడిపిచ్చింది.

ఏడాది ఐనంక కడుపయింది. ఐనా ఎవ్వలికీ కనికరం లేదు. నీళ్లాడుతానికి ఐదురోజుల ముందు దాకా పందులు మేపుతానికి పొయిన. ఇంటి పనులు, ఒండి పెట్టే పనులు… అన్నీ నేనే.

నెలలు నిండినంక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని నా మొగడు ఒకటే కొట్టుడు. గొడ్డును బాదినట్టు బాదేటోడు. మా అత్త పంది మీద, కుక్కమీద, కూన మీద పెట్టి సూటిపోటి మాటలనేది. కుమిలిపోయే మాటలనేది. శానాసార్లు సచ్చిపోతె మంచిగుండు అనిపించింది. కానీ, పాప గుర్తొచ్చి ఆగిన. దానికోసం అన్నీ ఓర్సుకున్న. నా బిడ్డను కంటిపాపలెక్క కాపాడుకున్న. అదే నా లోకమైంది.
ఒకనాడు నా పసిబిడ్డను వీపుమీద జోలె కట్టుకొని పందుల తోలుకొని శెరువు ఒడ్డుకు పొయిన. అక్కన్నే మా ఊరి దొర మామిడి తోటనించి బయిటికి ఒచ్చిండు.

‘‘అంజమ్మా… ఇటోపాలి రావే’’ అని పిలిశిండు. ఏందో దొర పిలుస్తున్నడని ఎనుగు దగ్గెరికి పొయిన. కంపదీసి తోట లోపలికి పిలిశిండు. పొయిన.

‘‘అంజీ… ఇందాక పేద్ద సుడిగాలి ఒచ్చింది. కంట్లె దుమ్ము పడ్డది. మంట లేస్తాంది. గరగరమంటాంది. కాస్త నీ చనుబాలు పిండి నా కంట్లె పొయ్యి. కంట్లె ఉన్న దుమ్ము దూళి ఆ పాలతోటి కలిసి బయిటికొస్తది. జర ఈ ఒక్కపని చెయ్యి. నీకు పున్నెముంటది’’ అని అడిగిండు.

అట్ల చేసుడు నా మనుసు ఒప్పుకోలేదు. బతిమిలాడిరడు. దండం పెడతా అన్నడు.

పాపం… దొరగారికి ఎంతబాదయితాందో అనుకున్న. ఒక మోదుగాకు డొప్పల పాలు పిండి దొర కంట్లె పోసిన.

‘‘అయ్యో… అంజమ్మా.. అట్లగాదే. అట్ల పోస్తె నలుసు బయిటికి రాట్లేదు. నువ్వే కంటి దగ్గర రొమ్ము పెట్టి పాలను కంట్లెకు చిమ్ము. ఆ వేగానికి నలుసు బయిటికి ఒస్తది’’ అని రెండు చేతులూ జోడించిండు. దండం పెట్టిండు.

నా వీపుపై జోలెల ఉన్న బిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నది. దానికి ఆకలైందేమో!

‘‘అంజీ… నీ రొమ్ము నా కంటి దగ్గర పెట్టు. నా చేత్తోనే నీ చనుమొన పట్టుకొని కంట్లెకు పాలు పిండుకుంట’’ అని రెప్పపాటుల్నే నా రొమ్ము పట్టుకొని కంట్లె పాలు పిండుకున్నడు. చను మొనల్ని పిసికిండు.

‘‘అంజీ… నీ బాకిన వడ్డ. నీ రుణం ఎప్పటికీ ఉంచుకోనే’’ అని ఒంగి, నా పాదాలు పట్టుకున్నడు.

చెరువు కట్టమీదికి ఒచ్చి బిడ్డకు పాలిచ్చిన. పందులు కట్టకింద మేస్తున్నయి. కట్టకు అవతలి వైపున దొర ఎడ్ల కొట్టంల నించి ఎవరియో మాటలు ఇనపడ్డయి. పందులు ఆటే పొయినయి. వాటిని అల్లిస్తానికి అటుదిక్కు పొయిన. ఆల్ల మాటలు దగ్గరగ ఇన్పిస్తున్నయి. ఆ గొంతు దొరదే. ఇంకో దొరతోని మాట్లాడుతున్నడు.

‘‘ఏం సంగతి బావా! పందెంల ఓడిపోయినవు. నువు రాసిస్తనన్న ఎకరం భూమి ఎప్పుడు రాసిస్తవు?’’

‘‘అబ్బా… ఏం అదృష్టం బావా నీది! అంత అందగత్తె సండ్లు పిసికిన మొనగానివి’’, ఇంకో దొర.

‘‘ఏమనుకున్నవ్‌ బావా! నేను కన్నేస్తే ఎవ్వతీ తప్పించుకోలేదు. ఎంత అందగత్తె ఐనా నా పక్కలకు రావాల్సిందే’’

ఆల్ల మాటలు ఇని నా కాల్ల కింది భూమి పర్రున నిలువునా చీలినట్టయింది. నా మనసు ఇరిగింది. ఒక్కలు చెక్కలైంది.

ఇద్దరు దొరలు నన్ను తాకడం కోసం నా మీద పందెం కాసుకున్నరు. ఆల్లిద్దరిల ఒకరు నా ‘చనుమొనలు పట్టుకుంటే, ఇంకో దొర అతనికి ఎకరం భూమి రాసియ్యాలె. పట్టుకోకపోతే ఈ దొర, ఆ దొరకు ఎకరం భూమి రాసి య్యాలె’ అని పందెం కాసుకుని, ఒక భూస్వామి వచ్చి నా దగ్గర ఆ నాటకం ఆడిరడు అని ఆల్ల మాటలు బట్టి అర్థమైంది.

ఒక ఆడదాన్ని తాకడానికి ఈ దొరలింత దిగజారిండ్రా? ఊరంచు వాడలల్ల ఉండే ఎరుకలి ఆడోల్లంటె ఈల్లకు ఇంత శిన్నసూపా? మేం మనుసులం కాదా? అని నాలోపట ఎంత బాదయిందో!

ఈ సంగతి నా మొగనికి శెప్తె ఇంకేం రంకు అంటగడతడో అని చెప్పలేదు. నా మనుసులనే దాసుకున్న.

కొన్ని రోజులకు మా ఊర్లె శానామందికి ఇష జెరాలు, కక్కుడు, ఏరుగుడు మొదలైనై. గవుర్మెంటోల్లు ఊర్లె కాంపులు బెట్టిండ్రు. మందు గోలీలు, తానీకెలు, సూదులు ఇచ్చిర్రు. గులుకోజు సీసాలు ఎక్కిచ్చిర్రు.

కల్కెటేరు, ఆర్డీఓ ఆపీసరు, ఆరోగ్గె ఆపీసర్లు, మా ఊరి సర్పంచి అందరూ కల్సి మాట్లాడుకున్నరు. పందులతోటే ఇష జెరాలు ఒస్తున్నయని తేల్చిచెప్పిర్రు. పందుల పట్టుకొని చంపిర్రు. ఆపీసర్ల కాల్లమీద పడ్డా ఇనలేదు. పందులన్ని డీసీఎం ఎక్కిచ్చి ఊరికి దూరంగ ఉన్న శెరువు దెగ్గర పెద్ద గుంట దీసి, పానమున్న పందులను పూడ్చిపెట్టిర్రు. వాటిమీన మన్నుబోస్తాంటె అయి, ‘‘గుర్ర్‌… గుర్ర్‌…ర్‌..ర్‌..ఱ్‌…ఱ్‌…’’ అని మొత్తుకున్నయి. ఆటి గోస సూస్తంటె ఏడుపు ఆగలేదు. కన్నబిడ్డల్ని బొందపెట్టినట్టయింది. మా బాద ఎవలికి శెప్పినా అర్దం కాలే. మా ఎరుకలోల్ల బతుకుల మన్నుబోసిర్రు. మా బతుకులు ఆగంజేసిర్రు. దిక్కులేని పచ్చులమైనం. పానంగ సాదుకున్న పందుల్ని నాశినం జేసిర్రు. మా బువ్వల మన్ను బోసిర్రు. గింత అన్యాలం యాన్నన్న ఉంటదా? నోరులేని మనుసుల మీద గింత కువ్వారమా?

పడావుబడ్డ ఎకురం బూమిల ఎవుసం చేసుడు మొదలు బెట్టినం. కానీ, అప్పటికే ఆ బూమిని మా వూరి దొరలు అన్యాలంగ ఆక్రమించుకున్నరు. మా బూమి మాది కాకుంటయింది. మా కుటింబమంత రోడ్డున పడ్డది. మా అత్త మమ్ముల్ని పట్టించుకునుడే లేదు. నా మొగడు ఏడ తాగి, ఏడ పంటున్నడో తెల్వదు. ఈ పసికందును ఎట్లా బతికించుకోవాల్నో ఎరుకయితలేదు. ఒక పూట తింటె, ఇంకో పూట ఉపాసమే. కలో, గంజో తాగి బతుకుతాన్న.

కొన్నాల్లకు మా గోసజూసిన ఒక పెద్దామె హైదరాబాద్‌కు తీస్కపొయింది. ఆమెది మా ఊరే. ఆమె రామచంద్రారెడ్డి భార్య.

అక్కడికి పొయినంక, ఎట్లా బతకాలె? ఏం పనిచేసి బతకాలె? నా బిడ్డను ఎట్లా బతికించుకోవాలె? ఇట్లాంటి ఆలోచనతోటి ఆగమాగమైన.

ఆమె నన్నొక ఇంట్ల పనిమనిషిగ ఉండటానికి మాట్లాడిరది. అటా ఒకటి, రెండు, మూడు… ఎనిమిది ఇండ్లల్ల పనిచేస్తున్న.
ఒకనాడు నా బిడ్డను ఎంటబెట్టుకొని గోపాల్‌ టీచర్‌ ఇంటికి పనికి పొయిన. అప్పుడు ఆ సారు, ‘‘పాపా.. నువ్వేం చదువుతున్నవ్‌?’’ అని నా బిడ్డను అడిగిండు.
నా బిడ్డ ఏమీ మాట్లాడలేదు.

‘‘ఏం అంజమ్మా… నీ బిడ్డకు మాటలు రావా? ఏం మాట్లాడట్లేదు?’’ అన్నడు.
అప్పుడు నేను, ‘‘సారూ… నా బిడ్డ మా ఊర్లె రొండో తరగతి దాక సదివింది. పట్నం ఒచ్చినంక బడికి పోవుడు బందయింది సారూ. నాతోనే పనికి ఒస్తది. నేను అంట్లు కడిగితె అది ఇల్లు తుడుస్తది. నేను బట్టలుతికితె అది ఆరేత్తది’’ అని చెప్పిన.

‘‘ఒద్దు అంజమ్మా… నీ బిడ్డ బతుకు ఆగం జెయ్యకు. నీ లెక్కనే నీ బిడ్డను చెయ్యకు.ఈ పని మాన్పించు. ఏదైనా స్కూలనలో చేర్పించు. ఆమె బతుకు బాగుపడతది. ఏనాటికైనా ప్రయోజకురాలైతది. చదువు మనిషికి చాలా ముఖ్యం. అది జీవితాన్ని మార్చేస్తది. నేనే ఏదైనా హాస్టలనలో చేర్పిస్త, రెండు మూడు రోజుల్లో’’ అన్నడు.

‘‘సారూ… గీ ఒక్క పనిచేయున్రి, మీకు పున్నెముంటది. ఊర్లె బతకలేకనే ఇక్కడికొచ్చిన సారూ. రెక్కలు తప్ప ఏ ఆస్తీ లేనోల్లం. ఊర్లె బతుకు ఆగమైంది. ఉన్న ఎకురం బూమి దొంగలపాలైంది. నా బూమి నాక్కాకుంట పొయింది. అన్యాలంగ గుంజుకున్నరు. ఎవ్వలూ మాకు నాయం చెయ్యలేదు సారూ… ఎవలికి చెప్పుకోవాలె మా బాద! ఎవలు కాపాడుతరు మమ్ముల. అసలే ఊరవతల ఉండెటోల్లమాయె. గీ సట్టాలు, లాయరనలు మాకు ఎరుకలేదు. అందికెనే ఈడికొచ్చి బతుకుతున్నం సారూ’’ అని నా బాదలు చెప్పిన.

అప్పుడు గోపాల్‌ సారు తెలిసిన పెద్ద సార్లతోటి మాట్లాడిరడు. నా బిడ్డను గిరిజన బడిల చేర్పిచ్చిండు. అక్కన్నే ఆస్టర్ల ఉండి సదువుకొనుడు. గోపాల్‌ సారే లేకుంటె నా బిడ్డకు సదువు అందకపొయేది.

నా బిడ్డ శానా తెలివైంది. ఆమెకు నా కష్టం సుకం అన్నీ తెలుసు. ఆమె చదువు, చేతిరాత చూసి గోపాల్‌ సారు ఆశీరపొయేటోడు. నా బిడ్డను సుత ఆయినె బిడ్డలతోటి సమానంగ సూశేది. బొక్కులు, చెప్పులు, బట్టలు కొనిచ్చేది. ఏం బొక్కు కావాల్నని అడిగినా కొనిచ్చేది. ఆయినెకు మంచిగ సదివే పిల్లలంటె పావురం.

నేను పనిచేసే యజమానుల పిల్లలు పాత బట్టలు నా బిడ్డకు ఇచ్చేటోల్లు. గవే బట్టలు ఏసుకొని బడికి పొయేది. ఎన్నడూ కొత్త బట్టలు కొనియ్యమని అడిగేది కాదు. నా సంగతి ఆమెకు తెలుసు. అర్దం చేసుకుంటది. రెండుమూడు జతల బట్టలతోనే పదో తరగతి పూర్తి చేసింది.
ఆ బడిల కొంతమంది టీచరమ్మలు, టీచర్‌ల సాయంతోటి పన్నెండో తరగతి దాక సదివింది.

నా బిడ్డ తెలివి, సదువు సూశిన గిరిజన బడి టీచరమ్మల సాయంతోటి ఐద్రాబాదుల గవుర్మెంటు డిగ్రీ కాలేజీల చేరింది. బీఏ కోర్సు తీసుకున్నది. చాలీ చాలని బట్టలు, చినిగిన బట్టలు, అరిగిన చెప్పులతోటే కాలేజికి పొయేది. ఆ మూడేండ్లూ మంచిగ సదివింది.

బీఏ పూర్తయినంక ఎంఏ కోసం దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసింది. మంచి మార్కులొచ్చినయ్‌. మొదటి రాంకు ఒచ్చింది. ఎంఏల చేరింది. యూనివర్సిటిలనే ఆస్టల్‌ సుత ఉన్నది. నా బిడ్డ అండ్లనే సదివింది. రోజూ కాలేజీ, లేబ్రేరి తప్ప ఇంకో లోకం తెల్వదు. కష్టపడి సదివింది.

పదో తరగతి అప్పట్నించే అనేది, ‘‘అమ్మా… నేను ఎప్పటికైన గవర్నమెంటు ఉజ్జోగం తెచ్చుకుంట. నిన్ను మంచిగ జూసుకుంట. మన ఊర్లె మన ఎరుకలోల్ల పిల్లల్ని బళ్లల్ల చేర్పిచ్చి మంచిగ సదివిస్త’’ అనేది.

ఉస్మానియల చేరినంక ఇంకా మంచిగ సదివింది. పొద్దస్తమానం సదువు మీదనే వుండేది. స్కాలర్‌షిప్‌ వచ్చినపుడో, పరీక్ష ఫీజు కట్టేటపుడో అందరి పేర్లూ నోటీసు బోర్డుమీద పెట్టెటోల్లట. ఆ బోర్డు మీద నా బిడ్డపేరుకు ఎదురుగ ‘ఎస్టీ’`ఎరుకల’ అని వున్నదట. తోటి పిల్లలంతా, ‘‘ఓ… మీరు ఎరుకలోల్లా…! అయితే రిజర్వేషన్‌ల ఒచ్చినవన్నమాట. ఇగ నీకేం సదువొస్తది? నీకేం శాస్త్రమొస్తది? మీరంతా గవర్నమెంట్‌ బిడ్డలు’’ అని ఎతేశ్కం చేసేటోల్లట. నా బిడ్డ ఆస్టర్లకొచ్చి ఒక్కతే ఏడ్చేదట.

పెద్ద కులాల పిల్లలు నా బిడ్డను కులం పేరుబెట్టి సూటిపోటి మాటలనేటోల్లు.
‘‘ఎరుకలోల్లు పందులు మేపుకుంటరు. పంది మాంసం అమ్ముకొని బతుకుతరు. పంది గొద్దెలు ఏరుకొని, అమ్ముకొని బతుకుతరు. తట్టలు బుట్టలు సాపలు అల్లుకొని బతుకుతరు. నువ్వు కూడా పందులు మేపుకొని బతుకొచ్చుగా! నీకు సదువు అవుసరమా? ఈ సోది అవసరమా నీకు?’’ అని ఎగతాళి చేసేటోల్లు.
ఐనా, నా బిడ్డ ఎవ్వల్నీ ఏమీ అనలేదు. సదువే లోకంగ బతికింది’’ అంటూ పైటకొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది.

ఇంతలో నా వెనక వరుస నుంచి ఓ ఇద్దరు మహిళలు గుసగుస మాట్లాడుకుంటున్నరు. అవి నా దాకా విన్పిస్తున్నై.

‘‘ఏదో విజయ గాధలు విందామని వస్తే, గీ ఎరుకల్ది ‘సోది’ చెప్తాంది. గీ సోది వినడానికే వచ్చినమా? ఇంతదూరం!’’ అంటున్నది ఓ మహిళ.

‘‘ఈ కులం తక్కువోల్లకు ఉద్యోగాలొస్తే, బాగా అతి చేస్తరు. బలుపుతోటి ఉంటరు. చేతిల ఆగరు. మా అంత గొప్పోల్లే లేరనుకుంటరు. వీళ్లంతా ఇంతే వదినా…’’, బదులిచ్చింది పక్కనామె.

వాళ్ల మాటలు వింటుంటే నాకు అసహ్యం వేసింది. వాళ్లవైపు తిరిగి కోపంగ చూసిన. వాళ్లకు అర్థమైనట్టుంది, వెంటనే గుసగుసలు గప్‌చుప్‌.
మైకులో అంజమ్మ మాట్లాడుతూనే వున్నది. తన బతుకు గాయాల గురించి. తన బిడ్డ చదువు కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నదో చెప్తోంది.

‘‘యూనివర్సిటీ ఆస్టర్ల సుత నా బిడ్డ శానా అవమానాలు పడ్డది. అయినా ఎక్కడా గుండె దైర్నం చెడలేదు. రేత్రీ పగలూ సదివి పెద్ద పెద్ద పరీక్షలు రాసింది. మంచి రాంకు తెచ్చుకొని, ఆర్డీవో ఐంది. ఆమెతోటి కలిసి సదువుకున్న దోస్తులంత కలిసి పెద్ద పండుగ చేసినంత పనిజేసిర్రు. డప్పుల చప్పుల్లతోటి లేడీస్‌ ఆస్టల్‌ నుంచి యూనివర్సిటీ కాలేజీ దాకా ఊరేగింపు తీసిర్రు. పూలదండలేసి అంగామ చేసిర్రు. కొందరు అమ్మాయిలయితె నా బిడ్డను బుజాల మీద కూసబెట్టుకొని యూనివర్సిటి అంతా ఊరేగింపు తీసిర్రు. నా బిడ్డ గురించి అవ్మానంగ మాట్లాడిన పిల్లలు సుత ఒచ్చిర్రు, ఆ ఊరేగింపుకు. ఆల్లంత ఎనుక వరుసల ఒస్తున్నరు. ఉబికి వచ్చే కన్నీళ్ల మజ్జనే నా బిడ్డ అందర్నీ కావాలించుకొని ఏడ్చింది. ఇన్నాళ్లకు కష్టాలు తీరే దారి దొరికిందని లోలోపల ఆనందపడుతున్నది.

అక్కన్నించి ఆమెకు పుస్తకాలు కొనిచ్చిన టీచరమ్మలు, సార్లను కలిసింది. తనకు పాతబట్టలిచ్చినవాళ్లను, కొత్త బట్టలు, చెప్పులు కొనిచ్చినవాళ్లను… ఇట్లా తన సదువుకు సాయం చేసిన మనుసులందర్నీ కలిసింది. చేతులెత్తి మొక్కింది.

ఆర్డీవోగ చేరినంక, మా ఊర్లె కబ్జా ఐన బూములన్నీ కలెక్టర్‌ సాయంతోటి సర్వే చేయించింది. వాటి నిజమైన అక్కుదారులకు ఆ బూములన్నీ ఒచ్చేటట్టు చేసింది.
ఆ బూముల సొంతదారులకు పట్టాలు ఇప్పించింది. కబ్జాదారులపై కేసులు పెట్టించింది. జైలుకు పోయేటట్టు చేసింది. ఎరుకలోల్ల పిల్లలందరినీ కలిసి ఆల్లను బడికి పంపే ఏర్పాటు చేసింది. ఆల్ల కోసం ప్రత్యేకంగ ఓ బడిని కట్టించింది’’ ఆమె చెప్తూనే ఉన్నది, తన బిడ్డ గురించి. తన గుండె గాయాల గురించి. ఎతల గురించి. తనకూ, బిడ్డకూ ఎదురైన అవమానాలు, వివక్షల గురించి. అన్నిటినీ ఎదుర్కొని వాళ్లు నిలబడ్డ తీరు గురించి వింటుంటే ప్రతి ఒక్కరిలోనూ ఉత్తేజం నిండిరది.

ఇంతలో నా వెనక వరుసలోంచి ఇద్దరు మహిళలు ఏదో గుసగుసా మాట్లాడుకుంటున్నరు. ఒకామె బయిటికే అన్నది, ‘‘ఈ ఎరుకలోల్ల సోది ఇంటానికే అంతదూరం నిండి ఈడిదాక ఒచ్చినమా? మనకేం పనీపాటా లేదానే’’ పక్క మహిళతో అంటున్నది.

ఎనక్కి తిరిగి చూసిన. వాళ్లిద్దరూ పట్టు చీరలతో, ఖరీదైన బంగారు గాజులు, ఆభరణాలతో ఉన్నరు. చూస్తుంటేనే అర్థమవుతున్నది, వాళ్లు ధనవంతులని. వాళ్ల మాటల్ని బట్టే అర్థమైంది, వాళ్లది ఏ కులమనేది. వాళ్లు కింది కులాల మనుషుల పట్ల చులకనతో మాట్లాడే మాటల్ని బట్టే తెలిసింది, వాళ్లది ఏ వర్గమనేది.

అంజమ్మ మాట్లాడుతూనే వున్నది. ‘‘ఇదీ మా బతుకు. ఇంతకు మించి ఇంకేమీ లేదు. మీ పిల్లలందరూ ఆల్ల బతుకును గెలువాలె. ఇదే నీనూ, నా బిడ్డా కోరుకొనేది. మీ అందరికీ దండాలు’’ అని మైకు తన బిడ్డకు ఇచ్చింది.
లక్ష్మి మైకు తీసుకున్నది.

‘‘నా గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. మా అమ్మ చెప్పింది అంతా విన్నర కదా! అదే నా జీవితం. ఆటుపోట్ల జీవితంలో నా ఎదురీత అది. ప్రతీ మనిషికీ జీవితంలో ఎన్నెన్నో అవమానాలూ, వివక్షలూ, వెలివేతలూ ఎదురవుతూనే ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కరికీ ఒక్కో రూపంలో ఉంటాయి. కానీ, సారంలో మాత్రం ఒక్కటే. అది ఈ సమాజ లక్షణం. మీ పిల్లల్ని ప్రోత్సహించండి. మార్కుల వెంట తరమొద్దు. మార్కులు సంపాదించే యంత్రాలుగా మార్చొద్దు. మార్కులే మనిషి జ్ఞానానికి కొలమానం కాదు. మీ పిల్లలకు ఏ విషయంలో ఆసక్తి వుందో గమనించి, దాన్ని ప్రోత్సహించండి. చేయూతనివ్వండి. వాళ్ల ఆసక్తుల్ని చంపకండి. వాళ్ల సృజనాత్మక ఆలోచనల్ని వికసించనీయండి.

ప్రియమైన విద్యార్థులారా… బాగా చదవండి. పాఠాలు అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల శ్రమను గౌరవించండి. తోటి మనుషుల పట్ల దయతో ఉండండి. మనుషులంతా సమానమే అనే సత్యాన్ని తెలుసుకోండి. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా తల వంచొద్దు. తలెత్తే నిలబడాలి. ఓటమినే ఓడిరచాలి. విజేతల విజయ గాథలే కాకుండా, గెలుపోటముల్ని కూడా తెలుసుకోండి. పరాజితుల గాధల్నీ వినండి. గెలుపు కెరటాలై హోరెత్తండి. అంతిమ గమ్యాన్ని చేరుకోండి.
చివరగా ఒక మాట.. మీకు ఎక్కడైనా మీరనుకొనే కడజాతి మనుషులు కనిపిస్తే కనీసం వాళ్లను మనుషులుగా చూడండి.’’ అంటూ అందరికీ అభివాదం చేసి ముగించింది.
ఒక్కసారిగా పాఠశాల ప్రాంగణమంతా వేలాది చప్పట్లతో మార్మోగింది.
లక్ష్మి ఎదురీత అందరికీ వెలుగుదారిలా కనిపించింది.

**

పరిశోధకుడు, సాహిత్య విద్యార్థి. పుట్టింది సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, రామన్నగూడెం తండ. తెలుగు సాహిత్యం, ఆదివాసీ సంస్కృతీ సాహిత్యాల గురించి అధ్యయనం చేయడం ఇష్టం. ఇటీవలే కథా రచనలోకి వచ్చాడు.

One thought on “ఎదురీత

  1. “మీరనుకొనే కడజాతి మనుషులు కనిపిస్తే కనీసం వాళ్లను మనుషులుగా చూడండి.’’ కధ బాగుంది.

    వి. కృష్ణ మోహన్
    జాతీయ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ)
    కార్యదర్శి, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా) 9182189533, 9440668281 హైదరాబాద్ kmdrdo@gmail.com

Leave a Reply