కూకట్ల తిరుపతి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం ఈ కవితల వయ్యి. తంతెలు తంతెలుగా చాలీచాలక బతుకు బండిని ఈడ్చుకొస్తున్న అమాయకపు ఎద్దడి బతుకుల తండ్లాటను తవ్విపోసుకున్న కైతల పొత్తమిది. ఎండి ఎర్రగప్పయిన పల్లె బతుకుల గోసను ఎల్లవోసుకున్నది “ఎర్రగాలు” వచన కవితల సంపుటి. తరతరాల వెట్టి చాకిరి, భూస్వాముల దోపిడీలు, దౌర్జన్యాలు, దాష్టీకాల వల్ల పాలేర్లు, రైతు కూలీలు, రైతులు, కులకస్పోళ్ళు ఏకమొత్తంగా పల్లీయ సబ్బండ వర్ణాలు పడిన బాధలు చెప్పనలవి కానివి. వీళ్ళ పీడనలకు, రోదనలకు ఏగలేక బతుకు దెరువుకు ఏర్పడ్డ వలస బాటల వలపోత కడు దీనాతిదీనం. చెప్పుకోవడానికి దిక్కులేక ధీములేక బిక్కుబిక్కున పుట్టెడు దుక్కంతో పుట్టిన ఊళ్ళను విడిచి వెళ్లిన పల్లె జీవితాలు. దాంతో కూలిపోయిన కొంపలు, పాడువడ్డ పానాదులు, బోసివోయిన కొట్టాలు, బొందల గడ్డగా మారిన పల్లె తల్లులు. ఆ ఏడుపును, ఎతను అందరికి మన్సున వట్టేటట్టు “వలసవోయిన పల్లె” పేరుతో రాసిన కవితలో కవి కూకట్ల తిరుపతన్న వివరంగా విడమరిచి చెప్పిన తీరు ఏకబిగిన చదివిస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. సమాధానం వెతుక్కోమంటుంది.
గడీల దొరల పెత్తనంలో తెలంగాణ బిడ్డలు పేదరికం తో తిండికి ఎల్లక బాకీ కోసం తల తాకట్టు వెట్టేది. చేసిన అప్పులు యేండ్ల పడంత్రంగా అసలుకే తీరకపోయేది. రెక్కలు ముక్కలు జేసుకున్న మిత్తీలకే చాలకపోయేది. “నోరున్నోందే ఊరు. దుడ్డున్నోందే బర్రె” లెక్కన సాగుతున్న తావుల్ల ఏంజేయన్నో తోయక గాళ్ల కాళ్ల కింద వడి సాకిరి సేయడానికి జనం అలవాటు పడేది. ఇంకొందరు ఉన్న భూములన్నీ కుదువవెట్టి, ఇడిపించ్చుకోలేక, చేసే పని లేక బతకవోయిన బడుగు జీవుల బాధలను “ఆదివాసీ ఆణిముత్యం” కవిత ఏకరువు పెడుతుంది. తెలంగాణ రైతాంగ పోరాటాల వల్ల దొరల పాలన నుండి విముక్తి పొందిన తెలంగాణ పల్లెలు మల్ల వలస వాదుల పెత్తనంతో అధోగతి పాలైనాయి.
ఒక ఏడాదిలో వచ్చే ప్రధాన పంట కాలాలను తాబి/ఖరీఫ్ (వాన కాలం పంట), ఆబి/రబీ (వేసవి కాలం పంట) అని పిలుస్తారు. ఎర్రగాలు అనేది ఏసంగి పంటకాలం తర్వాత వానకాలం పంట వేయడానికి ముందు వచ్చే ప్రత్యేకమైన పంటకాలం. “ఎర్రకారు” రూపాంతరమే “ఎర్రగాలు”. కారు అంటే కార్తె అని అర్థం. దీన్నే కొన్ని దక్కల్ల చింతపువ్వు కార్తె అని అంటరు. ఈ పదంల “కా-గా” గా మారుడు గసడదవాదేశం. “రు-లు” గా మారుడు. రలయో రభేదః అనే సూత్ర ప్రకారం “ర-ల”గా మారుతుంది. కాబట్టి “కారు” అనే పదం కాల గమనంలో “గాలు”గా మారుంటుంది. “ఎర్ర” అంటే వానపాము. “ఎర్ర” అంటే ఎరుపు. ఎండను ఎర్రటి ఎండ అనడం తెలంగాణల రివాజు. కాబట్టి ఎర్రగాలు అనగా మండుటెండ కాలంగా, ఎర్రటి ఎండల పంటగా చెప్పుకోవచ్చు. అశ్వనీకార్తెలో ఈ పంట వేసుడు సురువైతది. నీటి ఎద్దడి కాలంలో తక్కువ రోజులలో పండే వరి పంటను ఈ కాలంలో వేసేవారు. తెలంగాణ రైతులు వాడే పదం ఎర్రగాలును కూకట్ల తిరుపతి పుస్తకం పేరుగా పెట్టి, మరుగున పడిపోయిన దేశీపదాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ “ఎర్రగాలు” పుస్తక రచనతో అతను తెలుగు సాహిత్యంలో మరో మెట్టు పైకెదిగినాడని చెప్పొచ్చు. ఎర్రటి ఎండాకాలంలో పండించే ఈ పంటపై కొందరు రైతులు ఆధారపడేవారు. ఎర్రగాలు శీర్షికతో రాసిన కవితలో “ఎర్రగ బుర్రగ ఎర్ర తేలోలె వున్నా/ ఎండి ఎర్రగప్పవుడే/ ఎర్రగాలు దెబ్బకు”… అని వేసవి ఎండల తీవ్రతను తెలుపుతూ, ఆ మండుటెండదెబ్బకు గురయ్యే రైతుల ఎద్దంమద్దెం బతుకుల దీనత్వాన్ని కవిత్వ రూపంలో మన కళ్ల ముందుంచారు కూకట్ల తిరుపతి. ఈ పుస్తకములో ఇలాంటి అనేక పల్లె పదాలను, మరుగున పడిపోతున్న తెలంగాణ పదాలను కవి తన కవిత్వం ద్వారా ఇప్పటి ప్రపంచానికి తెలియజేశాడు. ఆంధ్ర ఏలుబడిల అరవై ఏండ్లు అంగలార్చినం. ఎందరో అమరవీరుల ఆశయాలు ఎదలో ప్రభవించగా ఆధిపత్య ధోరణిని ప్రాణాలతో పాతర పెడతాం ఖబర్దార్ బిడ్డా! అంటూ ఆంధ్ర వలసవాద దోపిడీ పాలను తరిమి కొట్టే వైనాన్ని “రణభేరి మ్రోగింది” అనే శీర్షికతో కూకట్లన్న రాసిన కవితలో చాలా చక్కగా చెప్పారు.
ఈ పుస్తకంలోని మొదటి కవిత “కవిత్వం”. ఇందులో “సామాన్యుని తలలో నాలుక/ గాయపడిన ఉవిదలకు ఓదార్పు/ అణచబడినోడి కరాయుధం/ జన చైతన్యం కవిత్వ పరమార్థం” అని తన కవితా లక్షణాలను సూటిగా తెలియజేశారు. తరతరాలుగా సమాజంలో పేరుకుపోయిన వెట్టి చాకిరిని, కట్టు బానిసత్వాలను నిరసించాడు. ప్రజలను చైతన్య పరిచేదిగా, సమాజంలో అణచబడిన వారికి, చెరచబడినవారికి కవిత్వం ఒక ఆయుధంగా ఉండాలని కవి కాంక్షించాడు. “కష్టజీవికి ఇరువైపుల ఉన్నవాడే కవి” అని మహాకవి శ్రీ శ్రీ చెప్పిన మాటను నేటితరం కవులు నిజం చేయాల్సిన ఆవశ్యకతను మరల గుర్తు చేశారు.
ఇక స్త్రీ జాతి పట్ల కూకట్ల తిరుపతన్న చూపించిన గౌరవానికి, ప్రేమకు వందనాలు.
“ఉగ్గు పాలు పోసి ఊరడించి
భుజానికి ఎత్తుకొని జోకొట్టిన ఔదార్యమూర్తి
హృదయానికి హత్తుకొని
అత్తారు బత్తెంగా సాకిన సహన శిల్పి
మమతానురాగాలు పంచి
ప్రేమానురాగాలు పెంచి
బాల్యోపచాలతో బ్రతుకు సోపానం అయింది”
అంటూ…అమ్మ గొప్పదనం గురించి చెప్పిన వైనం ఆకట్టుకుంటుంది. కన్న తల్లిని దేవతగా భావించడం, అమ్మ చేసిన సేవలను కొనియాడడం, జన్మజన్మలకు తీరని రుణం అమ్మ రుణమని జీవిత సత్యం చెప్పడం సందర్భోచితంగా ఉన్నది. అమ్మ గొప్పదనాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది కదా! “కవిని కన్నతల్లి గర్భంబు ధన్యంబు” – కవికోకిల గుర్రం జాషువా చెప్పినట్టు, ఈ పుస్తక కవిని కన్న కూకట్ల అంకవ్వ గర్భం ధన్యమైనట్లుగా భావించవచ్చు.
తన సహచరి కూకట్ల లక్ష్మికి తిరుపతన్న ఇచ్చే విలువ, గౌరవం గురించి “ఇంటి దీపం” కవితలో వివరించారు. బతుకు బండికి ఆమె రెండో చక్రమై జీవన పయనంలో తనకు తోడూనీడగా వుండే వైనాన్ని, అలవోకగా అవగాహన అయ్యేటట్లు అక్షరాల్లో పొదిగారు.
“శేనుకు సెమట సుక్కలు జల్లుతూ
పంట పరిమళాలను పరిసరాలను పంచుతూ
ఎవుసానికి ఎన్నెముక అయింది…
కంటికి రెప్పలా కుటుంబాన్ని కాపాడుతూ
ఇంటికి దీపమై ఎలిగింది”
ఒక భర్త తన భార్య మీద చూపించే గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి ఈ వాక్యాలు. భార్యాభర్తలు ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటేనే కలతలు దూరమవుతాయనడానికి నిదర్శనం ఈ కవిత్వం.
స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలను “అమీనాలు”,”మొగ్గలపై అగ్గి వాన” శీర్షికతో అల్లిక చేసిన కవిత్వంలో తీవ్రంగా నిరసించారు. మృగాళ్ళ విషయంలో చట్టు బండలవుతున్న చట్టాల తీరును ఏవగించుకుంటారు. అణచివేతకు, చిన్నచూపుకు గురవుతున్న స్త్రీ జాతి పట్ల తనకున్న తండ్లాటకు ఇవి నిదర్శనం.
గొల్ల ,కురుమల జీవన శైలిని “అతారెలు పతారెలు” కవితలో తిరుపతన్న వర్ణించిన తీరును పరిశీలిస్తే…..
“గోసి గొంగడి రుమాలే నిత్య వస్త్రాలు
కర్ర కమ్మకత్తి గొడ్డలే వృత్తి అస్త్రాలు
కవచ కుండలాల్ల దండేగడాలు
భుజం మీద గొంగడి…”
ఆడంబరాలు లేని జీవితం గొల్ల కురుమలది. అడవే ఇల్లు, సెట్టూపుట్టా తోబుట్టువులు. మన్యం పోయిన కాడ ఎండకు, వానకు, చలికి తల దాసుకోనీకి, అక్కున చేర్సుకునేది గొంగడి బొంత.
ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, నగలు ఎయ్యిటి మీద మోజు లేకుండా సచ్చంగా బతికే బతుకు గొల్ల కురుమలది. సేనుశెల్కల్ల తిరిగేటోళ్ళు ఎన్నడు తెలివికత్తరో? రాజ్యాధికారానికి ఎన్నడు ఏకమైతరో! పాలు మరువంగనే పసుల కాపరిగా మారి. నాతిరి బడిలో సదువు. భూమయ్య పంతులు అచ్చరాలు దిద్దిచ్చిన తీరు. ఇగ నాతిరి బల్లె నేర్సిన పాఠాలను అల్లేసు కుంటా… సంకల వయ్యి పెట్టుకొని, సేతుల కట్టెవట్టి, భుజానికి సద్ధి కట్టుకొని గొర్ల కావలి కాడికి పొయ్యి తిరుపతన్న సదువుకున్న తీరును “మేం బాల కార్మికులం” అనే కవిత చెప్పిండు. ఇంట్ల కరంటు బుగ్గ లేకపోతే గుడ్డి దీపం కాడ కూకొని పట్టుదలతో చదువుకోవడం, దాని గొప్పదనాన్ని తెలుసు కున్న తీరు ఆలోచింప చేస్తుంది.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ మండలం, మద్దికుంట గ్రామంలోని నిరక్షరాస్య గొర్రెల కాపరి కుటుంబంలో కూకట్ల తిరుపతి జన్మించారు. నిరుపేదరికంలో కూడా ఎం. ఏ. తెలుగు సాహిత్యంతో తెలుగు పండిత ప్రశిక్షణను ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల, వరంగల్ లో పూర్తిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ తెలుగు భాషోపాధ్యాయులుగా పిల్లలకు మాతృభాషా మాధుర్యాన్ని పంచుతున్నారు. 2005లో వెలువరించిన మేలుకొలుపు కవితా సంపుటి నుండి 2015లో అచ్చేసిన ఆరుద్ర పురుగు వరకు ఐదు పుస్తకాలను తీసుకొచ్చారు. సుమారు పదిహేను పుస్తకాల వరకు సంపాదకత్వం వహించారు. కరీంనగర్ జిల్లా యువజన సంక్షేమ శాఖచే జిల్లా ఉత్తమ యువకవి పురస్కారం – 2006లో అందుకున్నారు. అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం-2021 వరకు దాదాపుగా పది వరకు ప్రసిద్ధమైన అవార్డులను అందుకున్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం నుండి వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ, సాహిత్య కార్యక్రమాలను జరుపుతూ, నేటికీ అందులోనే కొనసాగుతున్నారు.
మా బాపు మంద రాజేశం బాగా సదివిన పెద్ద మనిసి. ఆ కాలంల ఎన్ని సర్కార్ కొలువులు అచ్చినా సెయ్యక, ఎవుసం సేసిన గొప్ప మనిషి. చెత్తెరీ… ఒగని కింద పని సేసుడేందని, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన మనిషి. తన సదువును మాత్రం వృథాగా పోనియ్యలేదు. ఊళ్ళ పొలగాండ్లకు ఉట్టిగనే పాఠాలు సెప్పేది. పెద్దపెద్ద పోరగాండ్లకు గా బస్సు బోర్డు అయిన సదువ రాకుంటే ఎట్లా? ఏ ఊరుకన్న పోతే ఎట్లా పోతరు? అని నాతిరి బడివెట్టి అందరికి అచ్చురాలు నేర్పిండు. ఇగ మా బాపును గాల్లు అయితే దేవుని లెక్కనే సూసేది. మా ఊరికి పోతే నన్ను, మా అన్నను సొంత సెల్లె, తమ్ముడు లెక్కనే జూసుకుంటరు. గిదంత గా సదువు గొప్పదనమే. ఈ పొత్తంలోని “చదువుల పూదోట” అనే కవిత చదువుతుంటే గిదంత యాదికొచ్చింది.
దీంట్లోని కుంరం భీం, బిస్మిల్లా ఖాన్, కాళోజీపై స్మృతి రచనలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఇంకా ఊరచెరువు, మాను మనుగడ, ప్రకృతితో మమేకమైన బాల్యం, తెలంగాణ మలిదశ పోరాటం, మత్తుపదార్థాల నిషేధం, విగ్రహాల విధ్వంసంపై నిరసన, మనువాదంపై మండిపాటు, అవినీతి చీడపీడల నిర్మూలనం, కలాలకు కర్తవ్య బోధ, సామాజిక న్యాయం, సాంఘిక దురాచారాలను, దురలవాట్లను దునుమాడే కవితలున్నాయి. మెరుగైన సమాజ గమనానికి సాయపడేదే నిజమైన సాహిత్యం. ఈ విధంగా ప్రతి అక్షరాన్ని సామాన్యుల పక్షాన నిలుపుతున్న కవి కూకట్ల తిరుపతి గారికి అభినందనలు.
ప్రతులకు: కూకట్ల సాయి భారవి,
ఇ.నం. 8-3-207/2/4/E/1,
వాసుదేవ కాలని, కట్టరాంపూర్,
కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం.
ఎర్రగాలు పుస్తకం గురించి పరిశోధనాత్మక పరిచయం రాసిన సోదరి సరోజకు అభినందనలు.
కొలిమిలో పబ్లిష్ చేసిన ఎడిటర్స్ కి ధన్యవాదాలు.