ఆకాశంలో సగం
అవనిలో సగం
అంతరిక్షంలో మనం..
ఎన్ని వందల వేలసార్లు వినుంటాం ఈ మాటల్ని! అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం మొదలు పెట్టి ఈ ఏడాదికి 111 ఏళ్ళు. సాధికారత దిశగా వందేళ్ళకు పై బడిన ప్రయాణంలో ఎక్కడ ఉన్నామా అని ఆలోచిస్తే ఇప్పుడు అంతర్జాతీయంగా Choose To Challenge అంటూ సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న పిలుపు మనమేదో కొంత సాధించామా అన్న ఆశని కల్పిస్తోంది.
అనేకనేక సామీప్య దూరాలు మెదడుని తొలుస్తున్నాయ్. జెండర్ స్వేచ్ఛా సమానత్వాల గురించి స్త్రీల మౌలిక హక్కుల గురించి స్త్రీలపై అమలయ్యే పితృస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా గొంతు విప్పే మధ్య తరగతి ఉన్నత వర్గాల స్త్రీలు ఒక వైపు, దుర్భరమైన పేదరికంలో కొట్టు మిట్టాడుతూ ఇంటిల్లిపాదికీ ఆహార భద్రత కల్పించే భారాన్ని నెత్తిన మోస్తూ శ్రమ దోపిడీకి తోడు లైంగిక దోపిడీకి గురవుతూ అసలు తమకి హక్కులనేవి ఉంటాయనే తెలీని, శ్రామిక మహిళలు మరో వైపు.. ఎప్పటికీ తెగని ఈ సాగాలో ” Let Me Speak” అంటూ దొమితిలా చుంగారా ఉద్వేగం గా చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తొస్తుంటాయి.
అసలు మనం ఎంతదూరం నడచి వచ్చామో… ఎక్కడ ఆగిపోయామో చూసుకుంటే ఇకపై మనం ఏం చేయాలో తెలుస్తుంది.
మనదేశంలో…
సతీసహగమన నిషేధం ఓ సంస్కరణ
బాల్యవివాహ నిరోధం మరో సంస్కరణ
విధవా వివాహం ఇంకో సంస్కరణ
కన్యాశుల్కాన్ని పారద్రోలటం ఒకటి
వరకట్నాన్ని నిర్మూలన చట్టమొకటి
కుటుంబ హింస వ్యతిరేక చట్టం మరొకటి
విద్యాఉద్యోగాల్లో, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు ఇంకొకటి
గత వందేళ్లల్లో స్త్రీల గురించి ఎన్నిసంస్కరణలో కదా? స్త్రీల పట్ల సమాజపు దృష్టి మారుతున్నట్టే అనిపిస్తుంది. కానీ ప్రయాణంలో ఇవన్నీ తొలి అడుగులే. నడవాల్సింది చాలా ఉంది. వరకట్నం నిషేధించారు సరే, ఇప్పటికీ ‘‘ఇంతకీ ఎంతిస్తున్నారేంటి’’ అని వినిపిస్తూనే ఉంటుంది. బాహాటంగానే… చట్టంలో నేరమే. కానీ సమాజంలో కాదు.
కుటుంబ హింస చట్టం కాగితాల వరకూ మంచి చట్టమే. కానీ సామాజికంగా మాత్రం కాదు. అతని పెళ్లాన్ని అతను కొడుతుంటే నీకేంటి అని అక్కడక్కడైనా వినిపిస్తూనే ఉంటుంది. మన అద్దాల గదుల్లోకి తొంగి చూస్తే, ఆ గదుల్లో కూడా ఉండే హింస ఉంటుంది. రూపాల్లో తేడాలు. కాస్త సాఫిస్టికేషన్లు అంతే.
బోలెడంత స్వాతంత్య్రం వచ్చింది అనేసుకుంటూనే ఉంటామా, ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ‘‘ అమ్మాయిని
ఏ వూరికిచ్చారు’’ అని. ఇవ్వడమేంటి అదేదో వస్తువులా జంతువులా అని మనకిప్పటికీ అనిపించడం లేదు. అసలు ఒక అడల్ట్ మనిషిని మరొకరు మరెవరికో ఇవ్వడమేంటనే ఎరుక పూర్తి స్థాయిలో రావడానికి ఇంకా చాలా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉంటుంది.
పెద్ద సిద్ధాంతాల గురించి మాట్లాడబోవడం లేదు. కళ్లు తెరిచి చూస్తే మన చుట్టూతా ఎంతుందో కనిపిస్తుంది. నిజాయితీగా చూసుకుంటే మన చుట్టూతా ఆవరించి ఉన్నది కనిపిస్తుంది. నేరాలు రెండు విధాలు. సామాజిక ఆమోదమున్న నేరాలు, ఆమోదము లేని నేరాలు. చట్టం వేరు, సివిల్ సొసైటీ వేరు. చట్టం చేసినంత మాత్రాన అయిపోదు, సివిల్ సొసైటీ లోనికి ఆ చైతన్యం సింక్ అయితేనే పూర్తి ఫలితం.
కట్నానికి భార్యను కొట్టడానికి ఇంకా ఆమోదమున్నది. స్వేచ్ఛకు లేదు. విధవా వివాహానికి కూడా పూర్థిస్థాయిలో లేదు. స్త్రీలు పునర్వివాహం చేసుకోవానికి లేదు. తన దారి తాను ఎంచుకోవడానికి లేదు. నా జీవితం నా ఇష్టం అనే మాటకు లేదు. శరీరమూ, మెదడూ , హృదయం అని చలం చెపుతాడే అలాంటి విషయాలకు లేదు.
కొందరు పురుష సెలబ్రిటీలు నాలుగైదు సహజీవనాలో వివాహాలో చేసుకున్నా అతను ఇబ్బందిపడాల్సిన స్థితి రావట్లేదు కానీ ఒక విమెన్ సెలబ్రిటీ కళాకారిణి రెండో వివాహం చేసుకుంటే ఎంత ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందో ఇటీవలే చూశాం. మన సోషల్ ప్లాట్ఫాంస్ అనబడే బావుల నుంచి బయటికి వచ్చి చూస్తే మనం వచ్చిందనుకునే మార్పు ఎంత స్వల్పమైనదో ప్రయాణించాల్సిన దూరం ఎంత సుదీర్ఘమైనదో అర్థం అవుతుంది. వాళ్లకు కేటాయించిన సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం అనే దగ్గరే ఉంది. కూర్చోనిద్దాం ఏంట్రా తింగరి గాడిదా అనేట్టు లేదు. పైగా 80 శాతం నువ్వు రిజర్వ్ చేసుకుని అందులో ఎవరైనా ఆడపిల్ల కూర్చుంటే మీ సీట్లు ముందర అని చూపించి ఎవరికి రిజర్వేషన్ ఎవరు అమలు చేసుకుంటున్నట్టు అనే సోయి లేకుండా. చాలా ఉంది. దూరం చాలా ఉంది.
స్త్రీలు విద్య, ఉద్యోగాల్లోకి పెద్ద యెత్తున ప్రవేశించేలా చేసిన సంస్కరణలు మహిళల వివక్షను కొంతవరకూ సడలించాయి. ఆర్థిక స్వాతంత్ర్యం, పదిమందితో కలిసి చేసే ప్రయాణం కొంతవరకు స్వేచ్ఛ వైపు ప్రయాణానికి బాటలు వేశాయి. అదే సమయంలో టెక్నాలజీలో వచ్చినమార్పులు ఇంటి శ్రమను సరళతరం చేశాయి. ముఖ్యంగా మధ్యతరగతిలో. కానీ ఇప్పటికి పనిలో జెండర్ విభజన అలాగే ఉంది. ఇంటిపనిలో చాలా వరకూ బయటి పనిలో కొంతవరకూ . ఇది మగవాడి పని ఇది ఆడవాళ్ల పని అనే విభజన పోనంత వరకూ జెండర్ వివక్ష పోయినట్టు కాదు. మన దైనందిన జీవితాల్లో మన ఆచార వ్యవహారాల్లో ఈ ఆడమగ విభజన గడ్డగట్టుకుపోయి ఉంది. అదింకా స్ర్తీలకు గుదిబండగానే ఉంది.
స్త్రీ శరీరంపై మనసుపై ఆమె హక్కు గురించి మాట్లాడనే అక్కర్లేదు. దళిత స్త్రీలపై వివక్ష తక్కవని పేదల్లో తక్కువని కొందరు సూత్రీకరణలు చేస్తూ ఉంటారు గానీ అవి శుద్ధ తప్పు. జెండర్ విషయంలో ఎంత కిందికి పోతే అంత పచ్చిగా వివక్షా రూపాలు కనిపిస్తూ ఉంటాయి… ఆదివాసీ తెగల్లాంటి కొన్ని మినహాయింపులతో. ఇదొక అంగీకరించకతప్పని కఠిన వాస్తవం. అందుకు కారణాలు వేరే కావచ్చు. కానీ మన కోరికల మేరకు వాస్తవాలను టైలరింగ్ చేసుకుంటామంటే కుదరదు.
ఒక మనిషి బేసిక్ గా కోరుకునేది తనకు నచ్చినవారిని ఎంచుకునే స్వేచ్ఛని, కలిసి బతికే స్వేచ్ఛని. ఇవే ఎవరి జీవితంలో అయినా అత్యంత ప్రాధాన్యమైన విషయాలు. ఈ విషయంలో మహిళలకు ఎన్ని ఆంక్షలో ఎంత దుర్మార్గమైన ఒత్తిడిలో చెప్పనలవి కాదు. ఉదాహరణలు చెప్పనక్కర్లేదు. ప్రతి వాళ్లకు వాళ్ల జీవితాల్లోనే చుట్టుపక్కలో కనిపించే అంశాలే. పరువు హత్యల పేరుతో జరిగే దుర్మార్గపు హత్యలు దీని పతాక రూపాలు. తల్లిదండ్రులు విలన్లుగా మారే ఈ సన్నివేశాల్లో దుర్మార్గాన్ని కేవలం వారికి మాత్రమే అంటగట్టలేం. సామాజిక ఒత్తిడి, దాని వెనుక పనిచేసే కులాంహకారం అన్నీ కారణాలే. నువ్వు బతికే స్థలం ఎంత చిన్నదైతే ఈ దుర్మార్గం అంత తీవ్రమైన స్థాయిలో ఉండే అవకాశముంది.
స్త్రీ పురుషుడి యొక్క హక్కు అనే భావన జీర్ణించుకుపోయి ఉంది. కుటుంబ గౌరవం ఆమె శీలంతో ముడిపెట్టి చూడడంలో ఉంది. ఇందులో పురుషుల అభద్రత, దుర్మార్గమైన భావనఉన్నాయి. స్త్రీనీ ఆమె గౌరవాన్ని కేవలం ఒక అంగానికి ముడిపెట్టి చూడడంలో నే దుర్మార్గం దాగి ఉంది. బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యాల్లో ఆమె ఎవరెవరి ఆధీనంలో ఉండాలో శాస్త్రాలు రాసి పెట్టి శాసనాలు చేసి ఉన్నారు. నస్త్రీ స్వాతంత్ర మర్హతి అని చెప్పి ఉన్నారు. భోజ్యేషు మాతా అంటూ ఎపుడెపుడు ఏఏ పాత్రల్లో ఉండాలో రాసి పెట్టి ఉన్నారు. ఆడపిల్ల పుట్టింది మొదలు చనిపోయే దాకా ఎవరో ఒక మగవాడి రిలేషన్లో అంటే కూతురు, చెల్లి, భార్య, తల్లి పాత్రలలో తప్ప సొంతంగా అస్తిత్వం లేకుండా చేసే కుట్ర మన నరనరాల్లో జీర్ణించుకు పోయి ఉంది. ఎన్ని మార్పులొచ్చినా పోరాడి ఎన్ని చట్టాలు తెచ్చుకున్నా ఈ భావజాలంలో మాత్రం తగినంత మార్పు రావడం లేదు. స్త్రీ తనకు తాను సొంతంగా సొంత అస్తిత్వంతో నిలబడితే పూర్తిస్థాయిలో జీర్ణించుకునే స్థితి ఇంకా రాలేదు.
అసలే మార్పూ లేదంటే అది సత్యం కాబోదు. మార్పు ఉన్నది కానీ అది చాలా చిన్న చిన్న సమూహాలకు పరిమితమై ఉన్నది. స్ర్తీ శరీరమే రాజకీయ కేంద్రంగా ఉన్నది కాబట్టి అదే పురుషుడి గౌరవనీయమైన ఆస్తిగా భావించే స్థితి ఉంది. కాబట్టి అనివార్యంగా ఎదురీదే రాజకీయం కూడా శరీరం పై దృష్టిపెట్టక తప్పదు. సెక్స్ గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడక తప్పదు. అంతిమంగా తమ శరీరాలమీద తాము స్వేచ్ఛ సంపాదించడం గురించి తమ ఉనికి మీద తమ చేతల మీద తాము పట్టు సాధించడం గురించి మాట్లాడకతప్పదు . పోట్లాడక తప్పదు. ఎవరేమనుకున్నా, ఎన్ని ముద్రలేసినా, ఒక్క అంగానికే పరిమితం చేయబడ్డ నా అస్తిత్వాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఆ అంగానికి ఆపాదించిన నాన్సెన్స్ ని వదిలించుకోవడానికి పోరాడక తప్పదు.
ఎవరేమనుకున్నా సరే, ఎన్ని ముద్రలేసినా సరే. పురుష సమాజం మోపిన వివక్షాపూరితమైన ఈ నైతికత చెత్తను వదిలించుకోకుండా మన మస్తిష్కాల నుంచి తరిమేయకుండా మేం సంకెళ్లనుంచి బయటపడలేమని తెలుసుకున్నాం. ఏది నైతికతో ఏది కాదో హేతుబద్ధంగా సమానత్వం ప్రాతిపదికన మేం నిర్ణయించుకుంటాం. తీరం చాలా దూరం ఉంది. ఈదాల్సింది చాల ఉంది.
స్టిల్ ఐ రైజ్ అని ఎప్పటికప్పుడు ఎదురీదాల్సిన స్థితే. అది సహజంగా మారలే. మామూలు కాలే. ఎవరైనా స్ర్తీ సొంతంగా ఏదైనా సాధిస్తే అది ప్రత్యేకంగ చెప్పుకునే అంశంలాగానే ఉంది అంటే అది మామూలు ఎంత మాత్రం కాలేదని అర్థం. ఈ సందర్భంగా ఈ మాత్రం మార్పు రావడానికి దారి తీసిన ఆర్థిక సంబంధాల మార్పుతో పాటు ఎందరో రచయితలను తల్చుకోవాలి. సైమన్ దబావర్ దగ్గర్నుంచి మన చలం, రంగనాయకమ్మ, ఓల్గా, సత్యవతి దాకా ఎంతో మంది ఎదురొడ్డి చేసిన కృషి ఉన్నది. దుర్గంధం మధ్య నిలబడి తమకు చేతనైనంత ఆక్సిజన్ వ్యాపింపచేసేందుకు చేసిన ఎదురీత ఉన్నది.
దూరం చాలా ఉంది. ఇవ్వాల్టిదాకా వచ్చిన మార్పులను తక్కువ చేయట్లేదు. ఈ మాత్రం మనం మాట్లాడగలగడమన్నది ఒకనాడు అసాధ్యమైన పని. మారుతున్నాం. మారుస్తున్నాం. ఇంకా చేస్తాం. చాలా చేస్తాం. అధికారంలో కాదు, సమానత్వంలో ఆనందం ఉంది అని భావించే సహచరులతో కలిసి కూడా ప్రయాణం చేస్తాం జెండర్తో నిమిత్తం లేకుండా. కాకపోతే ఇక్కడ మేమే నాయికలం. పురుషులుగా మీరు చేయూత నిచ్చేవాళ్ళు మాత్రమే. మేం మహిళలం మాకేం కావాలో నిర్ణయించుకుంటాం. మా రాతల్ని మాటల్ని చేతల్ని నిర్ణయించుకుంటాం. మీరు కలసి రాగలిగతే చేయూతనివ్వండి. ముద్రలు, తీర్పులు వదిలేద్దాం.
స్టిల్ వుయ్ రైజ్.
Very well written