ఊపిరాడనివ్వని కాలాల గుట్టును బయటపెట్టే వెలుగు

వైష్టవి శ్రీకి జీవితమే కాన్వాసు. ప్రతి పదాన్నీ బతుకులిపిలో చిత్రించుకుంటుంది. దుర్భేద్యమైన వాక్యం కాదు. స్పష్టంగా వినబడే తలా గుండే ఉన్న వాక్యం. తేనె పూసిన రాతలు కావు. నిష్టూరమే ఐనా నిలబడి చెప్పే ధైర్యం. ఈమెది 360 డిగ్రీల చూపు. విశ్వం నలుమూలలకూ విస్తరించిన కన్ను. ఇరాన్ లో హిజాబ్ మంటలకు దగ్ధమైన మెహ్సాను విప్లవ యవ్వనంగా పరిచయం చేసినా, ‘తల్లులు కూలుతున్నవేళ’ అంటూ మణిపూర్ అమానవీయ వివస్త్ర పర్వాన్ని రాసినా అదంతా ఆమె దృష్టి వైశాల్యాన్ని చెబుతుంది. బుల్డోజర్ కింద నలిగే దేశాన్నీ చేనేతకారుడి చెంపల మీంచి జారే కన్నీటినీ ఒకే చేత్తో తడమగలదు. మగ్గం పగులుతున్న చప్పుళ్లను వినిపించగలదు. ప్రపంచ పరిణామాలే కాదు విపరిణామాల గమనింపూ వుంది. ఊపిరాడనివ్వని కాలాల గుట్టును బయటపెట్టే వెలుగు వైష్ణవి శ్రీ కవిత్వం. చిట్లిన గాయాలతో కవిత్వం ఎందుకు రాస్తున్నారనే ప్రశ్నకు కవిత్వంలోనే బదులిస్తుంది: “అసంబద్ధమైన ప్రపంచాన్ని అందమైన అబద్ధంగా చూపడమెందుకని అద్దాన్ని పొడిచి పొడిచి నిరసన తెలుపుతుంటాయి పిచ్చుకలు, నేనూ అందుకే కవిత్వం రాస్తున్నేమో” అని.

భూమి ఎప్పుడో రెండు ప్రపంచాలుగా చీలిపోయింది. స్త్రీగా ఆమె కలగనే సమైక్యతా ప్రపంచం వేరు. కళ్ళముందున్న వాస్తవిక పురుషాధిక్య ప్రపంచం వేరు. రెండు ప్రపంచాలూ కలిసి ఆమెలో సృష్టిస్తున్న సంఘర్షణ అంతా అక్షరాల తేటగా ప్రవహించింది. రానున్న రోజుల్లో మరింత చిక్కగా ప్రవహిస్తుంది. నిజానికి ప్రపంచం ఆమెది. కానీ ఆమెకది దక్కనివ్వరు. పోనీ ఆమె లేకుండా ప్రపంచం ఒక్క అడుగైనా ముందుకు కదులుతుందా అంటే అదీ లేదు. ఆమెలోంచే ఉద్భవించి ఆమె పొత్తిళ్ళలోనే పారాడి ఆమె భుజాల మీదే ఎదిగి తిరిగి ఆమె ఉనికికే నిప్పుపెట్టే పురుష ప్రపంచాన్ని వైష్ణవి శ్రీ కోపగించుకోవాల్సినంతగా కోపగించుకోలేదనే చెప్పాలి. కన్నపేగు మీద ఏ తల్లి మాత్రం కత్తి దూయగలదు.

వాక్యాన్ని ఎలా చెక్కినా ఎక్కడా వస్తునిర్దిష్టత నుండి దూరంగా జరగలేదు.”కళ్ళ కింద నల్లని మబ్బులేవో గూడు కట్టుకున్నాయని చూపుతావు సరే, ఏళ్ళకేళ్ళుగా ఆరిపోయిన గుండెల్ని మోస్తున్న అసమానతల వలయాలు కదూ అవి”. ఎవరెవరు ఎందుకు కవిత్వం రాస్తున్నా ఈమె మాత్రం బాధ్యతతోనే కవిత్వం రాస్తుందనడానికి ఈ వాక్యాల సాక్ష్యం చాలు:
“మొక్కలొకటే కాదుగా ఇక్కడ వుంది
లెక్కించాలని ప్రయత్నిస్తే
చెట్టుని నమ్ముకున్న పక్షులకు నామీద నమ్మకం పోతుంది
పిసరంత స్వార్థమంటనితనం వాటికే ఎలా సాధ్యపడిందో
కాస్తైనా ఆలోచన చెయ్యి”… రాజ్యం ఫాసిస్టు శక్తుల చేతుల్లో ఉన్నప్పుడు వైష్ణవి శ్రీ భయాలన్నీ నిజాలే.

“నిర్మలాకాశాన్ని కలుషితం చేసే వ్యూహాలతో నిండిన వికృత విన్యాసాల్లో హత్య చెయ్యబడని పొద్దు ఒక్కటీ కనిపించదు”. అలాంటప్పుడు బుల్డోజర్ అవతారమెత్తిన కొత్త దేవుడికి విరుగుడు కావాలని ఆమె అడగడంలో తప్పులేదు.
ఆధునిక యుగంలో యుద్ధాలు భూమి గుండెల మీద కనబడని గాయాలన్న సంగతి ఈమెకి తెలుసు కాబట్టే ‘యుద్ధాన్ని ప్రేమించొద్దు’ అని నచ్చజెప్పాలని చూస్తోంది. యుద్ధం నిప్పుల్లోకి ఆజ్యం పోస్తున్నది ఎవరో కూడా ఆమెకు బాగా తెలుసు.
“యుద్ధ ద్వారాలెప్పుడూ తెరిచే ఉంటాయి
లోపలికి జొరబడే ప్రయత్నం ఎవరూ చేయరు
అయినా సరే యుద్ధవ్యాపారి
చెయ్యి పట్టుకుని
చావు అంచుల దాకా లాక్కెళతాడు”. ఈమె లోపల ఒక టీచర్ ఒక కౌన్సిలర్ వున్నారు. ఆమె వాక్యమవుతున్నప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ చేరిపోతారు. ఆమె వాక్యాల్లోని పొందిక.. వాక్యాన్ని విచ్చలవిడిగా ఎటుపడితే అటు విసరలేనితనం అది టీచర్ కావడం వల్ల వచ్చి వుంటుంది. ఆమెలోని టీచర్ – “మా నెత్తుటితో హంతకనీడల్ని హతమార్చే వెలుగుల తాడు పేనాలి ” అని ఉద్భోదిస్తే,” లోలోపల నలిగిపోవడం కాదు, లోలోపలికి ప్రయాణం చెయ్యాలి” అని కౌన్సిలర్ సలహా ఇస్తారు. వీరిద్దరితో పాటు అనేక గాయాల మీదుగా సాగిన ప్రయాణం ఆమెకు నిద్రలోనూ స్పృహలోవుండేతనాన్ని వరమిచ్చింది.

“జీవితం కాళ్ళ కింద నలిగి నలిగి స్వేచ్ఛ ఇప్పుడిప్పుడే పురివిప్పి నాట్యం చేస్తోంది. అది ఏ రాగమైనప్పటికీ ఇప్పుడు నన్ను నేను స్పష్టంగా వింటున్నా” అని అనగలిగారు. ఈ నెత్తుటి మరకలే మళ్ళీ మళ్ళీ ఆమె వాక్యాలలోకి తర్జుమా అవుతున్నాయి.”చచ్చి బతికిన, ప్రతిసారీ సందిగ్ధంలేని కుదురు కూర్చుకున్నా మానని గాయమా నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను”. జర్నలిస్టు అనుభవం ఆమెను కుదురుగా ఉండనివ్వదు. ఆమెలోని జర్నలిస్టు- “ఆమె దేహం వొట్టి దేహమేనా? అది జాతీయపతాకం కాదూ?”అని ప్రశ్నిస్తారు.

వైష్ణవి శ్రీది ఈగల్స్ ఐ. విడివిడి సంఘటలను కలిపి మొత్తంగా చూడగలిగిన నేర్పున్న నేత్రం. మణిపూర్ దుర్ఘటనల పరంపర వెనుక రహ్యస్యాన్ని- “అమ్మలవి పూలగుండెలు కానీ మీరందులో బాక్సైట్ వెతుకుతారు” అనే ఒక్కవాక్యంలో విప్పిన తీరుకు ఆమెను అభినందించి తీరాలి. ప్రస్తుతం నడుస్తున్నది ప్రజాస్వామ్యం రాచరికపు పట్టుపరుపుల మీద యురేనియం చుక్కల్ని స్ఖలిస్తున్న పురుషరుతువని తేల్చిచెప్పగలిగారు. ఈమె వాక్యం అనుభూతుల వెల్లువ కాదు.. సహనానికీ హద్దుంటుందనే హెచ్చరిక. “అమ్మలెప్పుడూ యోధులే ప్రాణంలేని చెట్టులా నేలకొరుగుతూనే నేల నరాలకు ప్రాణవాయువులు ఊదుతారు” అంటారు.’ఒంటరి’తనంలోనూ సామూహికతను దర్శింపజేయగల వాక్యం. ఏ యుగమైనా ముందుగా వేటుపడేది యవ్వనం మెడమీదనే, ఆదిమ అధునాతన అంత్యప్రాసల నడుమ హత్య చేయబడుతున్నదీ అత్యాచారానికి గురవుతున్నదీ మనిషితనమే అనేంత వాస్తవికత.

ఈమె రేపటి దారుల్ని వెతుక్కుంటూ నడుస్తున్నారు. కాదు.. రేపటి దారుల్ని వేసుకుంటూ వెళ్తున్నారు. సంపుటి సంపుటికీ ఆ నమ్మకం బలపడుతోంది. ఒక ఆసక్తికరమైన ఎత్తుగడను కవితగా మార్చే అలవాటు సహజంగా ఆమెకు అబ్బింది. ముగింపులో బలం మరింత పెరగాల్సి వుంది. సత్యం వైపు ప్రయాణం ఎప్పుడూ కష్టతరమైనదే. కవి కేవలం దృక్పథపు చట్రంలోనే ఆగిపోకూడదు. కవిత్వం అనంత ఆకాశాన్ని మునివేళ్ళ ముందుకు తెస్తుంది. కాలాలు ధ్వంసం చేయలేని వాక్యాన్ని నిర్మించడమే కవి పని. ఆ దిశగా సాగిపోతున్న వైష్ణవి శ్రీ నడకని అదే తీరంలో నిలబడి ఆసక్తి నిండిన కళ్ళతో చూస్తున్నాను.

(వైష్ణవి శ్రీ ‘రెండు ప్రపంచాల మధ్య’ కవితా సంపుటికి దాసరి శిరీష జ్ఞాపిక 2024 అందుకుంటున్న సందర్భంగా… )

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply