ఉద్యమ సాహిత్య దిగ్దర్శక ఆణి‘ముత్యం’

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమ సాహిత్య పరిశోధనే జీవితంగా బతికినవాడు ముత్యం. ఉత్తర తెలంగాణకు కళింగాంధ్రను సాంస్కృతికంగా ముడివేసిన పరిశోధకుడతను. తాను పుట్టి పెరిగిన తెలంగాణ గడ్డ కావచ్చు, తన పరిశోధనకు పాదులు కట్టిన ఉత్తరాంధ్ర కావచ్చు; చరిత్రని సంస్కృతిని తవ్వితీయటం దగ్గర ముత్యం ఆగిపోలేదు. వాటిని ప్రజా దృక్పథంతో గతితార్కికంగా విశ్లేషించాడు. గొప్ప వివేచనతో గతాన్ని వర్తమానానికి అన్వయించాడు. మంచి చెడ్డల్ని విమర్శనాత్మకంగా తరచి చూసాడు. చిందు ఎల్లమ్మ వంటి కళాకారుల ఆత్మకథనాన్ని నమోదు చేసినప్పుడు గానీ, బంకుమల్లయ్య శాస్త్రి వంటి సంస్కర్తల దగ్గర నుంచి గంటి రాజేశ్వరరావు, సర్వదేవభట్ల రామనాథం వంటి వెనకటి తరం పోరాటయోధుల మీదుగా పాణిగ్రాహి సుబ్బారావు వరకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వీరుల మహోన్నత చరిత్రని మనకు అందించినప్పుడు గానీ తెలంగాణా జానపద గిరిజన విజ్ఞానానికి చెందిన వివిధ పార్శ్వాలను అధ్యయనం చేసినప్పుడుగానీ, కానూరి వంటి ప్రజా కళాకారుల సాంస్కృతికోద్యమ కృషిని చిత్రిస్తూ డాక్యుమెంటరీలు కట్టినప్పుడుగానీ ముత్యం పరిశోధనకు జీవగర్ర వర్గదృష్టి అని నిస్సంశయంగా చెప్పొచ్చు. అదే అతన్ని తుది శ్వాస వరకూ నడిపించింది. అయితే భిన్న అస్తిత్వ వాదాల పట్ల అతను సానుకూల వైఖరినే కలిగి వున్నాడు. సమస్త పీడిత సమూహాల మధ్య ఐక్యతనే అతను కోరుకున్నాడు.

ఒక వ్యక్తి జీవిత చరిత్రని రచించడమంటే తేదీల వారీగా సంఘటనల్ని నమోదు చేయడం కాదనీ, ఆ వ్యక్తి జీవించి నడయాడిన ప్రాంతానికి చెందిన సామాజిక చరిత్ర నిర్మించడం అనీ, జీవితంలో భిన్న సందర్భాల్లో చోటు చేసుకున్న ఘర్షణలో వ్యక్తమయ్యే వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడం అనీ, తోటి వ్యక్తుల పట్ల, కుటుంబం పట్ల సమాజం పట్ల వారి జీవన దృక్పథాన్ని తెలుసుకోవడం అనీ, తద్వారా ఆనాడు అమల్లో వున్న సామాజిక విలువల్లోని మంచి చెడుల్ని సాపేక్షంగా గుర్తించడం అనీ, సమాజ చలనాన్ని అవగతం చేసుకొని కాలనాడిని పట్టుకొని రాబోయే తరాలకి అందించడం అనీ ముత్యం తన రచనల్లో నిరూపించాడు. జీవిత చరిత్ర రాసే రచయితకి నిష్పాక్షికమైన దృష్టి నిర్దుష్టమైన అవగాహన సత్యాన్వేషణ ఆవిష్కరణ పట్ల నిబద్ధత భిన్నాభిప్రాయాల పట్ల సంయమనం వున్నప్పుడే వొక జీవిత చరిత్ర సమగ్రమౌతుంది. ఆ లక్షణాలు పుష్కలంగా వున్న రచయిత డా. కె.ముత్యం. ఈ గుణాల వల్లే అతని పరిశోధన వ్యాసంగం యితరేతర చరిత్ర రచనల కంటే విలక్షణంగా రూపొందింది. అది పరిశోధన క్షేత్రంలో ‘ముత్యం ముద్ర’గా మిగిలిపోయింది.

పరిశోధకుడిగా తెలంగాణాకి చెందిన డా. ముత్యానికీ ఉత్తరాంధ్రకీ పెనవేసుకుని వున్న బంధం విడదీయరానిది. అది దీర్ఘకాలిక సామాజిక వుద్యమాలతో ముడివడి వుంది. కళింగ నేలపై కదలబారిన ప్రజా సమూహాల వుద్యమ చైతన్యం ఉత్తర తెలంగాణా నాగేటి చాళ్ళలోకి ప్రవహించినట్టే ముత్యం నెత్తుటిలోకి కూడా యెగబాకింది. అందుకే ‘శ్రీకాకుళ వుద్యమ సాహిత్యం’ అతని పరిశోధనాంశమైంది. బనారస్ యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి పొందిన ఆ గ్రంథం అప్పటికీ యిప్పటికీ వుద్యమ సాహిత్య పరిశోధనల్లో తలమానికమై నిలుస్తుంది. పరిశోధన చేసే క్రమంలో వుత్తరాంధ్రతో యేర్పడ్డ సాహిత్య బాంధవ్యాన్ని పురస్కరించుకొని ముత్యం ‘మాకొద్దీ తెల్లదొరతనమూ…’ అని స్వాతంత్ర్య ఉద్యమంలో పాటల పిడుగులు కురిసిన గరిమెళ్ళ సత్యనారాయణ అలభ్య రచనలు సేకరించి ప్రచురించాడు. ‘సునాముది జీవధార’ ద్వారా మందసా కేంద్రంగా వుత్తరాంధ్రలో జరిగిన జమీ వ్యతిరేక రైతాంగ పోరాటాన్ని అక్షరబద్ధం చేశాడు. వీరవనిత గున్నమ్మ సాహస చరిత్రని పునర్నిర్మించాడు. చరిత్ర నిర్మాణానికి జానపద సాహిత్యాన్నీ మౌఖిక ఆకరాల్నీ స్వీకరించి ఆ గ్రంథ రచనలో ముత్యం రూపొందించుకొన్న మెథడాలజీ తర్వాతి తరాలకు మార్గదర్శకమైంది.

జన శ్రుతిలో సజీవంగా వున్న మౌఖిక ఆధారాల్నీ సాహిత్య ప్రసార మాధ్యమాల ద్వారా నమోదైన లిఖిత ఆకరాల్నీ ఆర్కైవ్స్ లో లభించే రికార్డుల్నీ కలిపి తులనాత్మకంగా పరీక్షించి మాత్రమే ముత్యం నిజానిజాల్ని నిర్ధారించేవాడు. గ్రంథ రచనలో ముత్యం పాటించిన యీ పరిశోధన పద్ధతి యెంతో ప్రామాణికమైనది. అది చరిత్ర రచనలో పరిశోధన సంవిధానానికి చక్కని పాఠం అని చెప్తే తప్పు కాదు. జీవిత చరిత్ర నిస్సారమైన చరిత్రగా మారకుండా ఆసక్తికరంగా చదివించేలా చేయడానికి ముత్యం మరో అడుగు ముందుకు వేసి దానికి వుద్వేగ భరితమైన సృజనాత్మకని అద్దాడు. నాటకీయ శైలిని జోడించాడు. పరిశోధన పద్ధతిలో సంవిధానంలో ముత్యం వేసిన దారి అనితర సాధ్యం. తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి వంటి వారి కోవకు చెందిన కృషి ముత్యానిది.

ముత్యం పరిశోధనలో ప్రత్యేకత యేమంటే.. అది వ్యక్తి జీవిత చిత్రణ అయినా, ప్రాంతీయ సాంస్కృతిక పరిశోధన అయినా, ప్రజా వుద్యమాల సామాజిక చరిత్ర అయినా చెప్పాల్సిన విషయమే రంగస్థలం మీదికి వెలుగులోకి వస్తుంది. పరిశోధకుడు మాత్రం దర్శకుడిలా తెర చాటునే వుండిపోతాడు. ఇది తన డిస్కవరీ అన్న అహంభావ ప్రకటనలు అతని రచనలో లేశమాత్రమైనా యెక్కడా కనిపించవు. ఎవరినైనా పూర్వపక్షం చేయాల్సి వచ్చినా మాటలో పారుష్యం వుండదు. ఎవర్నీ నొప్పించడు. అలా అన్జెప్పి నిర్ధారణల్లో యెక్కడా తడబాటు, తటపటాయింపు వుండవు. అతని వ్యక్తిత్వంలోని నిక్కచ్చితనమే ప్రతి అక్షరంలోనూ గోచరిస్తుంది. నిక్కమైన పరిశోధక ముత్యం అతను.

విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా పరిశోధన రంగాన్ని పటిష్టం చేయాల్సిన ముత్యం చాలా కాలం సరైన వుపాధి అవకాశాలు అందిరాక, అతని ప్రతిభను గుర్తించే వ్యవస్థలు లేక (విద్యార్థి దశ నుంచీ అతని ఉద్యమ కార్యాచరణే అందుకు కారణమేమో) చాలా కాలం ఇబ్బంది పడ్డాడు. విద్యాత్మక సమాజం ఆ కారణంగా చాలా నష్టపోయింది. అయినా అతను నిరాశని దరిచేరనీయలేదు. చీకటిని నిందిస్తూ కూర్చోలేదు. నైతిక స్థైర్యం కోల్పోలేదు. నిరంతర అధ్యయనం విడువలేదు. చివరి దశలో అనారోగ్యానికి గురైనా తన పరిశోధన మానలేదు. పరిశోధక మిత్రుల సహాయంతో కడదాకా నూతన ఆవిష్కరణలు చేస్తూనే వున్నాడు.

కొత్త పరిశోధనలకు ద్వారాలు తెరచి వుంచడమే మంచి పరిశోధకుని లక్షణమైతే అది నిండుగా వున్న డా.ముత్యం శిష్యవత్సలుడు. ఆచార్యుడిగా విద్యార్థులని సొంత బిడ్డల్లా చూసుకున్నాడు. అదే సమయంలో వాళ్ళని వొక మిత్రుడిలా ఆదరించి భుజం మీద చెయ్యి వేసి నడిపించాడు. సరైన మార్గదర్శకులే కరువైన విశ్వవిద్యాలయాల్లో తన తోటి పరిశోధకులకూ విద్యార్థులకూ పరిశోధన మార్గంలో కరదీపికై గమ్యాలను నిర్దేశించి దిగ్దర్శనం చేశాడు. ఇందుకు నిదర్శనాలు మన కళ్ళ ముందు యెన్నో వున్నాయి. విశ్వవిద్యాలయంలో విద్యాత్మక సదస్సులెన్నింటినో తన సొంత కెరీర్ నిర్మించుకునేందుకో, స్వీయ ఆధిక్య ప్రదర్శన కోసమో కాకుండా విద్యార్థుల పరిశోధనాభినివేశానికి దోహదం చేసేవిగా అతను నిర్వహించాడు. ఆ రంగంలో ముత్యం లేని లోటు యెప్పటికీ పూడ్చలేనిది.

నూతన ప్రజాస్వామిక దృక్పథంతో సామాజిక నిబద్ధతతో నికార్సయిన విప్లవోద్యమ స్ఫూర్తితో కా. ముత్యం చేసిన సాహిత్య సాంస్కృతిక పరిశోధనలను కొనసాగిస్తూ అతను శ్వాసించిన మానవీయ ఆశయాల సాధనకు కృషి చేయడమే అతనికి మనం అందించగల నిజమైన నివాళి.

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply