ఢిల్లీ సరిహద్దులోని టిక్రీ వద్ద బలమైన ప్రతిఘటనోద్యమాన్ని నిర్వహిస్తున్న రైతు నాయకురాలు హరీందర్ కౌర్ గురించితెలుసుకుందాం. హరీందర్ కౌర్ మరో పేరు ‘బిందు’. ‘భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహాన్’ (మరో పేరు ‘సుబాఆగు’) యూనియన్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న మహిళలతో కలిసిసమర్ధవంతమైన నాయకత్వంతో పాటు సరుకుల రవాణా- పంపిణీ పనులను చూసుకుంటున్నారు.
మంచు కురుస్తున్న ఒక శీతాకాలపు సాయంత్రం వేళ రొట్టెలకోసం పిండిని పిసుకుతున్న మహిళా నిరసనకారుల బృందంనుంచి హాస్యంతో కూడిన నవ్వుల జల్లులు కురిశాయి. అందుకు కారణం భారత అత్యున్నత న్యాయమూర్తి చేసిన ప్రకటనవారిమధ్య చర్చకు వచ్చింది!
జనవరి 11 న జరిగిన విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డే (SA Bobde) “వృద్ధులు, మహిళలను నిరసనకారులలో ఎందుకుంచారు?” అని అడిగి, వారిని వెంటనే వెనక్కి పంపమని సలహా ఇచ్చారు!
“భారత ప్రధాన న్యాయమూర్తి మా ‘సుబా ఆగు’ బిందును కలిసి, మహిళలందరూ నిరసనల వద్ద “ఉంచబడ్డారా” లేకవారికై వారు చైతన్యంతో తరలి వచ్చారా అనే విషయం తేల్చుకోవాలి” అని టీ చప్పరిస్తున్న హరీందర్ కౌర్ శాంతంగాసమాధానమిస్తూ, నవ్వు కొనసాగించింది. ఈసారి మహిళల నవ్వులు హోరెత్తిస్తూ మరీ బిగ్గరగా వినిపించాయి!
ఆమె తనను తాను, చుట్టూ ఉన్న కష్టజీవులైన మహిళల ప్రపంచాన్నీ బాగా అర్థం చేసుకుంది. 43 సంవత్సరాల హరీందర్కౌర్ ను అందరూ బిందు అని ప్రేమగా పిల్చుకుంటారు. పంజాబ్‌లోని ‘భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహన్’ (సుబా ఆగు) యూనియన్ కు చెందిన రాష్ట్ర నాయకురాలు. అంతే కాదు, ఆమె యూనియన్ అగ్ర నాయకులలో ఒకరైన‘ఝెండా సింగ్ జెతుకే’ దత్తపుత్రిక కూడా!
హరీందర్ కౌర్ ను తన తోటి రైతులు కొందరు సొంత బిడ్డగా, కొందరు అక్కగా, కొందరు చెల్లెలుగా భావిస్తారు. అలాగేపిలుస్తారు. ఆమె టిక్రి వద్ద ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తున్నారు. కొనసాగుతున్న ఉద్యమం గురించి ప్రతిమహిళకూ స్ఫూర్తినిస్తూ, అవసరమైన ప్రతి విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు తగినట్లుఅత్యవసర పరిస్థితులలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, మరీ ముఖ్యంగా ప్రతి మహిళకు సవ్యమైన అవగాహన కలిగించేరీతిలో దిశానిర్దేశం చేసే బాధ్యతల్లో ఉన్నారు.
హరీందర్ కౌర్ ఒక ఒంటరి తల్లి, తన టీనేజ్ కొడుకును తన తమ్ముడి కుటుంబ సంరక్షణలో వదిలి, నిరసన తెలియజేయడానికి టిక్రి వద్దకు వచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్ననిరసనలలో ప్రముఖ నాయకులలో ఒకరైన ఆమె, తన చుట్టూ ఉన్న మహిళలతో కలిసి తన పనిని ఎలా చేస్తుందోచూడటానికి మేము ఆమెతో ఒక రోజు గడిపామని చెప్పారు సృష్టి జైస్వాల్.
తమకు తీరని హాని చేస్తూ, తమ బతుకుల్ని బుగ్గిపాలు చేయడానికి, తమ నోటి దగ్గర కూడుని లాగేసుకోవడానికే
1.నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం
2.రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రాత్సాహక, సులభతర) చట్టం
- రైతుల (సాధికారత,రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం 2020.
దుర్మార్గమైన ఈ మూడు చట్టాల ద్వారా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేయడానికి రూపొందించారని ఆమెతోపాటున్న నిరసనల్లో పాల్గొంటున్న శ్రామిక మహిళా రైతులు బలంగా నొక్కి చెప్పారు! ఇవి తమ పాలిట మరణ శాసనాలుకాబోతున్నాయని ఆగ్రహావేశాలతో బలంగా తమ ఆవేదననూ,ఆక్రోశాన్నీ ప్రదర్శించారు!
ఉదయ వేళల్లో హరీందర్ కౌర్ సమావేశాలు
దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రైతుల సంస్థలలో ఒకటైన ‘భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహాన్’జోరీందర్ సింగ్ నాయకత్వంలో ఒక గోశాలను తమ తాత్కాలిక కార్యాలయంగా ఏర్పాటు చేసుకుంది. అక్కడసమావేశమవడంతో హరీందర్ రోజు ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు, ఆమె తన రోజువారీ యూనియన్ రాష్ట్రకమిటీ సమావేశానికి హాజరవుతుంది. ఆ యూనియన్ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థలో హరీందర్ కౌర్ ఏకైక మహిళాసభ్యురాలు.
“మేము మా రోజువారీ ఎజెండాను రూపొందించుకుని, దానిని అమలు చేస్తాము. మా పోరాటం ఎక్కడ ఇనుమడించినచైతన్యంతో అభివృద్ధి చెందుతుందో, ఎక్కడ లోటుపాట్లతో నిరాశాజనకంగా ఉందో మేము విశ్లేషించుకుంటాం. మావిధానాలు, రాజకీయాల గురించి చర్చించుకుంటాం. ఏరోజు కారోజు, మేము చేయబోయే పనిని నిర్దేశించుకుంటాం, ఎందుకంటే అది ‘ఆనాటి ముఖ్యమైన మా కార్యాచరణను నిర్ణయిస్తుంది’ అని హరీందర్ తమ రోజువారీ సమావేశాలఉద్దేశ్యాన్ని వివరించారు.
“నేను ఉదయం 5 గంటలకు నిద్ర లేచి, అన్ని పేపర్లు చదివి, నోట్స్ రాసుకుని సమావేశానికి సిద్ధంగా ఉంటాను. సమాచారసేకరణలో ఎలాంటి లోపం ఉండటానికి వీల్లేకుండా చూసుకుంటాను”- అని అన్నారామె.
టిక్రి వద్ద, సరుకుల సరఫరా గొలుసును నిర్వహించడం ఆమె ముఖ్య బాధ్యత. “మేము ప్రతిదానికీ కమిటీలు వేశాం, ఆహారం, శీతాకాలపు ఉన్ని దుస్తులు, పరిశుభ్రత కోసం వాడే శానిటరీ వస్తువులు వగైరా ఉత్పత్తులు. తమకు కావాల్సినవస్తువులు ఏమిటో నాకు కమిటీలు తెలియజేస్తాయి, మా యూనియన్ ద్వారా వాటిని సేకరించి, వివిధ సమూహాల మధ్యపంపిణీ చేస్తాం. అంతా మా సుబా ఆగు ప్రతినిధిగా నా నుండి సరఫరా వెళుతుంది, ” అని హరీందర్ కౌర్ చెప్పారు.
1980 వ దశకంలో హరీందర్ కి జనహిత సమూహాలతో మొట్టమొదటగా పరిచయమేర్పడింది. ఆమె 10 సంవత్సరాలవయస్సులో భగత్ సింగ్ స్థాపించిన వామపక్ష సంస్థ ‘నౌ జవాన్ భారత్ సభ’ లకి స్థానిక నాయకుడైన తన తండ్రితో కలిసిహరీందర్ నిరసనలకు హాజరయ్యేవారు. “మా గ్రామంలో నాటకాలు, నిరసనలు, ర్యాలీలు జరిగేవి. అవి నాకు చాలాఆసక్తిగా ఉండేవి. నేను తప్పకుండా అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికీ వెళ్ళి గమనిస్తుండేదాన్ని”- అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఖలీస్తాన్ ఉద్యమం చెలరేగిన తర్వాత పంజాబ్ హింసాత్మకంగా మారిపోయింది. ఆమె తండ్రి పోలీసులనూ, ఖలిస్తానీలనూ రెండు వైపులవారినీ తీవ్రంగా విమర్శించేవారనీ, 1991 లో అతన్ని ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నవారుహత్య చేశారనీ గుర్తు చేసుకున్నారు. “ఆ సమయంలో నాకు 14 ఏళ్లు. ఆయన పోయిన తర్వాత, నేను అతని స్థానంతీసుకొని ప్రజా ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్నాను- ” అని హరీందర్ తన గురించి చెప్పుకొచ్చారు.
మొదట్లో అంటే 1990 లలో ఆమె పంజాబ్ రాష్ట్రంలో జరిగిన వివిధ నిరసన ఉద్యమాలలో పాల్గొన్నారు. “నా యవ్వనకాలంలో నేను బస్సు ఛార్జీల తగ్గింపు కోసం, బాల, బాలికల నిర్బంధ విద్య కోసం, దళితుల, కార్మికుల సమస్యల కోసంపోరాడాను”….“2002 లో భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహాన్లో నేను అధికారికంగా చేరాను. అప్పటి నుండి నిరసనలలో పాల్గొనడానికి నేను మహిళలను సమీకరిస్తున్నాను”- అని హరీందర్ చెప్పారు.
భారతదేశంలో గ్రామీణ మహిళల్లో 75 శాతం మంది వ్యవసాయంలో తమ పూర్తి సమయం వినియోగించి పనిచేస్తున్నారనిఆక్స్ ఫామ్ నివేదిక తెలిపింది. కానీ ఇంకా ఎక్కడ చూచినా వ్యవసాయం పురుషుల పనే అన్నట్లు విస్తృతంగా ప్రచారంజరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ 13 శాతం మంది మహిళలు మాత్రమే తమదైన కొంత సొంత భూమిని కలిగి ఉన్నారు!
కొనసాగుతున్న నిరసనలు ఈ దురభిప్రాయాన్ని కొంతవరకు తొలగించడానికి సహాయపడతాయి. ఒక టిక్రి నిరసనకారులలోనే 40,000 మంది మహిళలున్నారు. సింఘు, పల్వాల్, ఘాజీపూర్, నోయిడా, షాజహాన్‌పూర్, బురారి మైదానం, వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ ప్రతిఘటించే వారితో కలిపి మొత్తంగా లెక్కలు తేలితే పాలకులకుగుండెల్లోహడలెత్తుతుంది! “మహిళా రైతుల శ్రమ పని చేసే క్షేత్రాల్లో ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, కాని మేమునిరసనలలో కనిపిస్తాం. ఢిల్లీ నిరసనలలో వేల సంఖ్యల్లో మహిళలు పాల్గొనడం చాలా స్ఫూర్తినిస్తుంది. ఇది మారుతున్నకాలానికి సంకేతం”- అని హరీందర్ కౌర్ గొప్ప ఆశావహ దృక్పధాన్ని వెలిబుచ్చారు!
హరీందర్ కౌర్, విశ్వజోత్ గ్రేవాల్, బిమలా దేవి, అలంజీత్ కౌర్, మణి గిల్, సహజ్ మీత్, గుర్లీన్, హర్ష్ కౌర్, లైలా, కవిత, కోమల్ ప్రీత్, నవదీప్ కౌర్- ఇంకా ఇంకా పేర్లు తెలియని ఎందరెందరో మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. రకరకాలవిధుల్లో నాయకత్వం వహిస్తున్నారు. అసలు నాయకత్వాల ప్రమేయం లేని అతి సాధారణ మహిళలు వేలల్లో ఉన్నారు!
మహిళల్ని సమీకరించి, అవగాహన కల్పించే విధానం
ఉదయం సమావేశం తరువాత, హరీందర్ ఏర్పాట్ల స్టాక్ తీసుకొని మహిళా నిరసనకారుల సంక్షేమం గురించితెలుసుకుంటారు. “సమావేశం సాధారణంగా ఉదయం 10:30 గంటలకు ఉంటుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాతసుబా ఆగుకు సంబంధించిన అన్ని నగర్లకూ వెళ్ళి సంక్షేమ సమాచారాలు సేకరిస్తాన” న్నారు హరీందర్.
ఢిల్లీ సరిహద్దుల్లో అనేక కిలోమీటర్ల విస్తీర్ణంలోకి విస్తరించిన టిక్రి నిరసనను సులభతరంగా నిర్వహించడం కోసం, నిర్వాహకులు దీనిని పంజాబీ ప్రముఖ వ్యక్తుల పేర్లతో “నగర్లు” గా విభజించారు. కాబట్టి, బాబా బందా సింగ్ నగర్, చాచాఅజిత్ సింగ్ నగర్, బీబీ గాగ్రి-గులాబ్ కౌర్ నగర్, షహీద్ భగత్ సింగ్ నగర్, షహీద్ సాధు సింగ్ తఖ్తుపుర నగర్మొదలైన నగర్లున్నాయి. టిక్రి సరిహద్దులో మహిళా నిరసనకారులు బీబీ గాగ్రి-గులాబ్ కౌర్ నగర్ లో ఉన్నారు. ఇదిహరీందర్ కార్యకలాపాలకు కేంద్రం.
“నేను ఈ మహిళా నిరసనకారుల నగర్లను సందర్శిస్తాను, వారితో మాట్లాడతాను, వారిని దృఢంగా, శక్తివంతంగా, బలంగా ఉండాలని ఉత్తేజ పరుస్తాను. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలని చైతన్యవంతం చేస్తాను. ఇది మా పోరాటంలోఅత్యంత కీలకమైన ఘట్టమని, ఓర్పుతో వ్యవహరించాలని మహిళలకు అవగాహన కలిగిస్తాను. వాళ్ళు కూడా ఈ చట్టాలరద్దు సాధించాలనే గొప్ప దృఢ దీక్షతో ఉన్నారు. నిజంగా చూస్తే నాక్కూడా ఈ పరిస్థితులు చాలా కష్టమనిపిస్తున్నాయి. సరైన స్నానపు గదులు లేవు. మరుగుదొడ్లు లేవు. తీవ్రమైన చలికాలంలో గడ్డ కట్టి బిగుసుకుపోయే సమయాల్లో పీరియడ్స్‌లో ఉన్న మహిళలు పడే బాధలు చెప్పనలవి కాదు. అది గొప్ప సవాలుగా ఉంటుంది. కానీ మేము స్త్రీలుగా ఒకరి నొకరంస్ఫూర్తితో ప్రేరేపించుకుంటున్నాం”- అని హరీందర్ చెప్పారు.
పాటియాలాలోని నియాల్ గ్రామానికి చెందిన 54 ఏళ్ల హర్జిందర్ కౌర్ అనే మహిళ హరీందర్ (బిందు) గురించి, “నేను ఒకనెల క్రితం మాత్రమే ఆమెను కలుసుకున్నాను, కాని బిందు నాకు నా సొంత కూతురు కంటే ఎక్కువైపోయింది. నా కేదిఅవసరమైనా నేను ఆమెకు చెప్తాను. ఆమె ఇక్కడి మహిళల కోసం ఆహారం నుండి శానిటరీ ప్యాడ్ల వరకు అన్నింటినీనిమిషాలమీద ఏర్పాటు చేస్తుంది. ఆమె పోరాడే మహిళలందరికీ గొప్ప నైతిక మద్దతు నిచ్చే శక్తిగా మా మనసుల్లోముద్రించుకు పోయింది. “బిందు ఒక బాంబు, ఇది ఇప్పుడు సమరశీల పోరాటాల బాటలో పేలుతుంది”- అని ఆమెచెప్పారు.
బీబీ గాగ్రి-గులాబ్ కౌర్ నగర్ వద్ద మహిళలకు అవసరమైన పనులు చూసుకున్న తర్వాత, హరీందర్ కౌర్ ప్రధాన నిరసనవేదికకు వెళతారు. “నేను సాంస్కృతిక ప్రదర్శన లివ్వబోతున్న మా కళాకారుల సమూహాలను తనిఖీ చేస్తాను, వారిప్రదర్శనలకు ఏదైనా అవసరమా అని చూస్తాను. మధ్యాహ్నం నుండి 3.30 గంటల వరకు మేము వేదిక పనులనిర్వహణలో ఉంటాం. ఆ తరువాత మేము మీడియా వ్యక్తులను కలుస్తాం” అని ఆమె వారి దినచర్య గురించివివరించారు.
ఆమెకు భోజనానికి కూడా తీరికుండదు. సాయంత్రం పూట మాత్రమే ఒక రొట్టె ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటూకనిపిస్తుంది. సాయంత్రం పాటియాలాకు చెందిన ఒక మహిళల బృందంతో కలిసి ఒక ప్లేట్ ఆహారాన్ని పంచుకుంటూ, “నేను ట్రాలీని నడుపుకుంటూ చూడడానికి వెళ్ళినప్పుడు మావాళ్ళు ప్రేమతో నన్ను వారితో కలిసి తినమని ఆహ్వానిస్తారు. భోజన సమయంలో ఎవరొచ్చినా ప్రేమగా పెట్టడం పంజాబీల సాంప్రదాయం. కొత్తవారైనా సరే భోజనం చెయ్యకుండాఎవరినీ వదలరు”- అని హరీందర్ కౌర్ చెప్పారు.
హరీందర్ కౌర్ తండ్రీ-కొడుకులు
హరీందర్ కౌర్ ‘ఝెండా సింగ్ జెతుకే’ దత్తపుత్రిక. ఆయన భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహాన్ లోఉపనాయకుడు. “మానాన్నా- ఝెండా సింగ్ జెతుకే,ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వారిద్దరూ భారత్ నౌజవాన్ సభలో కలిసిపనిచేశారు. 2010 లో నా విడాకుల తర్వాత, ఝెండా సింగ్ జెతుకే మార్గదర్శకత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తాఉగ్రహాన్ కి అంకితమై పోయి పని చేయడం మొదలు పెట్టాను. మేము కలిసి పని చేస్తున్నప్పుడు గ్రామాల్లో ప్రయాణిస్తున్నక్రమంలో నేను ఆయన్ని ‘పాపా’ అని పిలవడం మొదలుపెట్టాను. ఆయన కూడా నన్ను సొంత బిడ్డలా చూడటంమొదలైంది. అనుకోకుండా మేము ఎప్పుడు ఒక కుటుంబ సభ్యులం అయ్యామో మాకే తెలియకుండా జరిగిపోయింది” అని కిసాన్ యూనియన్ నాయకుడు ‘ఝెండా సింగ్ జెతుకే’ తో తన కేర్పడిన అనుబంధాన్ని తెలిపారు. రక్తసంబంధాలకంటే భావ సారూప్యతల అనుబంధాలు విడదీయలేనంత గాఢంగా ఉంటాయి కదా!
హరీందర్ కౌర్ కి, అదీబ్ అనే 14 సంవత్సరాల కుమారుడున్నాడు. పంజాబ్ లోని ఫరీద్ కోట్ జిల్లాలో ఆమె సోదరుడికుటుంబంతో కలిసి ఉంటాడు. అదీబ్ తన మామ ఇంటి నుండి ఫోన్ లో, “నేను ప్రతి రోజూ అమ్మతో మాట్లాడతాను. ఆమె నాకు చాలా దూరంలో ఉందనిపించదు. అమ్మ ప్రతి క్షణం నా యోగక్షేమాల గురించి తెలుసుకుంటూనే ఉంటుంది. ఈ సంక్షోభ కాలంలో ఏ రైతు అయినా తప్పకుండా చెయ్యాల్సిన పనిని మా అమ్మకూడా చేస్తుంది. నేను ఆమె గురించిచాలా గర్వపడుతున్నాను. ఈ పోరాటం కోసం ఎంతటి త్యాగాని కైనా సిద్ధ పడవలసిన సమయం వచ్చింది” అని చెప్పాడు.
అదీబ్ డిసెంబర్లో వచ్చి టిక్రీ నిరసనలను చూశాడు. ”మళ్ళీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటంగా ఉంది. వేచిఉండలేకపోతున్నా”- అని అన్నాడు. హరీందర్ కౌర్ తన తోటి నిరసనకారుల మీద తనదైన ముద్ర వేయడం మాత్రమేకాదు, ఆమె తన యూనియన్ నాయకులను కూడా స్థిరమైన మనస్తత్వంతో, అలుపు లేని పనితనంతో బాగాఆకట్టుకుంది!
“కోవిడ్ లాక్ డౌన్ ప్రారంభ దినాల్లో, సీనియర్ నాయకులందరూ వయసు రీత్యా గృహనిర్బంధంలో ఉండవలసివచ్చింది. ఆ సమయంలో బిందును యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఆమె చార్జ్ తీసుకుని యువ నాయకులకుబిల్లులు, ఇతర రైతు సమస్యల గురించి వివరించి, ఆ వ్యవసాయ బిల్లులు ఆమోదించడానికి ముందు నుంచే అవగాహనపెంచడం ప్రారంభించింది. మంచి నాయకత్వ నైపుణ్యాలతో ఎవరేమేం చెయ్యాలో నిర్దేశించేది” అని జోగిందర్ సింగ్ఉగ్రహాన్ ఆమెను బహు విధాలుగా ప్రశంసించారు… మళ్ళీ ఆయనే “బిందు తన విధులను చక్కగా నిర్వర్తించి నందువల్ల, ఎక్కువ మంది మహిళలు మా యూనియన్‌లో నాయకులుగా చేరాలని మేము భావించాం. ఇప్పుడు మాకు వివిధప్రాంతాల్లో, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో 10 మందికి పైగా మహిళా నాయకులున్నారు”- అని అన్నారు.
జెతుకే ఇంకా ఇలా అన్నారు, “2020 లో పంజాబ్ లో మా నిరసనోద్యమాలలో పాల్గొనడానికి ఆమె గ్రామీణ మహిళలనుసమీకరించడంతో ఆమె పని తిరిగి ప్రారంభమైంది. ఆమె వల్లనే చాలా మంది మహిళలు మాతో టిక్రిలో చేరారు. ఆమెచిన్నతనం నుంచీ ప్రతిఘటనలో, నిరసనల నాయకత్వ నిర్వహణలో గొప్ప సామర్ధ్యం గలది”- అని అన్నారు.
మా హక్కులను కాల రాసే హక్కెవరికీ లేదు!
భారత ప్రధాన న్యాయమూర్తి బొబ్డే చేసిన వ్యాఖ్య పట్ల హరీందర్ కౌర్ ఎలా ప్రతిస్పందించారు? “భారతదేశపు ప్రధానన్యాయమూర్తి స్త్రీ శక్తికి భయపడుతున్నారు”… అని ఆమె తన దృఢమైన స్వరంతో స్థిరంగా సమాధాన మిచ్చింది. “శాంతియుతంగా నిరసనలు తెలపడానికి, ప్రతిఘటించి పోరాడే మా మహిళా శక్తిని వారు ఆపలేరు! వార్తా పత్రికలూ, పుస్తకాలూ చదివి జ్ఞాన సముపార్జన చేసే పురుషుల పోరాటాలను రకరకాల కుయుక్తులతో వారు ఆపగలరేమో గానీ వారుమహిళలను అధిగమించలేరు! ఎందుకంటే మహిళలకు జీవితానుభవాలనుంచి వచ్చే ఆచరణాత్మకమైన జ్ఞాన బలంచాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బలాన్ని ఎవరూ జయించలేరు!”
కొనసాగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్న పంజాబ్, హర్యానా రైతుల స్త్రీ-పురుషుల సంఖ్యల నిష్పత్తులనుపాలకవర్గంవారు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. 2015 లో నీతి ఆయోగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పంజాబ్ లోప్రతి 1,000 మంది పురుషులకు – 889 మంది మహిళలు, హర్యానాలో ప్రతి 1,000 మంది పురుషులకు – 831 మందిమహిళలు మాత్రమే ఉన్నారని తెలిపింది. ఇది స్త్రీల సంఖ్యలను పురుషుల కంటే తక్కువ చేసి వాస్తవ విరుద్ధంగాచూపడమే గాక దేశ ప్రజలకు ఈ రాష్ట్రాల్లో స్త్రీల నిష్పత్తి చాలా హీనంగా ఉందనే తప్పుడు సంకేతాన్ని పంపుతున్నారు!
“మహిళలుగా మేము మా బిడ్డల్ని సాకడం, కుటుంబ సభ్యుల్ని బాధ్యతగా, ప్రేమానురాగాలతో చూసుకోవడమే కాదు, ఆలోచనా శక్తి, ప్రశ్నించే స్వభావం, పోరాడే శక్తి మాకూ ఉన్నాయి. మావైన స్వంత నిర్ణయాలు తీసుకునే సాధికారం మాకుఉందని నిరూపించి చూపిస్తాం. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మేము ప్రభుత్వం వాటిని తిరిగిఉపసంహరించు కునేంతవరకూ ఇళ్ళకు తిరిగి వెళ్ళబోవడం లేదు!” అని గొప్ప విశ్వాసంతో, నమ్మకంగా అక్కడిమహళలందరి ప్రతినిధిగా అన్నారు హరీందర్.
“మహిళలు వెనక్కి వెళ్లాలని చెప్పడం ద్వారా, నాయకత్వ పదవుల నుండి స్త్రీలు తప్పుకోవాలని సుప్రీంకోర్టు చెబుతోంది”… మేము ఈ దేశ పౌరులుగా మనుషులుగా మాకూ అన్ని హక్కులూ ఉన్నాయి. స్వభావం, పోరాడే శక్తి ఉన్నాయి మేముఎందుకు వెనక్కి వెళ్లాలి?”- అని ధీటుగా ప్రశ్నిస్తున్నారు హరీందర్.
(న్యూస్ లాండ్రీ.కాం పత్రిక కోసం ‘సృష్టి జైస్వాల్’- టిక్రి సరిహద్దులో నిరసనల్లో పాల్గొంటున్న మహిళల గురించి, మొత్తంగాఅక్కడున్న ప్రతిఘటన వాతావరణం గురించి ‘హరీందర్ కౌర్’ ని చేసిన ఇంటర్వ్యూకి నా స్వేచ్ఛానువాదం)
అద్భుతంగా వుంది..