రాతకెక్కిన అక్షరానికి ఉండే విలువను చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ రాతకు ఎక్కిందంతా నిజం కాదని తెలియడానికి చాలాకాలం పడుతుంది. నిజాన్ని రాతకు ఎక్కించడం తేలిక కాదని చాలా శ్రమతో కూడిరది మాత్రమే కాక అందుకు ధైర్యం అవసరమని తెలియడానికి మరి ఎంతో సమయం పడుతుంది.
కవులు, రచయితలు నిజానిజాలు రాస్తూ సమాజంతో తమ సంభాషణ కొనసాగిస్తారని సమాజం వారికి అదనపు గౌరవాన్ని ఇస్తుంది. రాతకు ఎక్కిందంతా నిజం కాదని తెలిసే కొద్దీ నిజాలు రాసిన రచయితల పట్ల సమాజం భిన్నంగా ప్రతిస్పందిస్తుంది. ఆ ఫలితాన్ని కవులు రచయితలు అనుభవిస్తుంటారు. అసలు నిజం అంటే ఏమిటి.. నిజా నిజాలను ఇద్దరు సమ స్థాయి గల వ్యక్తుల మధ్యన పరిశీలిస్తామా.. బలా బలాల వ్యత్యాసాల వ్యక్తుల మధ్య పరిశీలిస్తామా.. ప్రజలకు వ్యవస్థకి ఎదురయ్యే వైరుధ్యాలలో ఆచరణలో నిజానిజాలు పరిశీలిస్తామా.. ఏ ఫలితం ఎవరికి ఎలా పరిణమిస్తుందో, ఆ ఫలితాలలో నుంచి పరిశీలిస్తామా.. అనేది నిజానిజాల పరిశీలనలో చాలా కీలకమైన విషయమైపోతుంది. మరీ ముఖ్యంగా మనం ఎలాంటి వ్యవస్థలో, ఎలాంటి అజమాయిషిలో, ఏ ఏ ఆటుపోట్ల నడుమ ఎట్లా జీవిస్తున్నాం అనేది కీలకమవుతుంది.
నిజానికి మనం ఏ వ్యవస్థలో జీవిస్తున్నాం అని అడిగితే అనేకుల నుండి మనకు వినిపించే సమాధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో అని. పాలక వర్గాల నుంచి కూడా మనది ప్రజాస్వామ్య వ్యవస్థ అని వింటాం. ప్రభుత్వం అంటే మనమేనని వింటాం. ఇది నిజమేనా అంటే కాదని చరిత్ర చెబుతుంది. బ్రిటిష్ రూల్ మనది కాదన్నాం. రాష్ట్రంలో ఆంధ్రా రూల్ కూడా మనది కాదన్నాం. బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనపోయిన తర్వాత పాలకులు వేరు ప్రజలు వేరు అని అర్థం చేసుకుంటున్నాం. పాలకులు తాము చెబుతున్న ప్రజాస్వామ్యాన్ని ఎంతగా నెంబర్ గేమ్ కిందికి మార్చారో అంతగా వ్యక్తి స్వామ్యంగా, మూక స్వామ్యంగా, ప్రైవేటు స్వామ్యంగా మార్చేశారు. మహాశ్వేతాదేవి చాలా సూటిగా ఈ ప్రజాస్వామ్యాన్ని డెమొనోక్రసీ అన్నారు. అంటే ఇది విధ్వంసక స్వామ్యం అన్నమాట.
ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరిగింది. వనరులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కేంద్రీకృతమయ్యాయి. వనరులు ఎవరి చేతికి పోయాయో వారి చేతిలో అధికారం కేంద్రీకృతమయ్యింది. అన్ని వ్యవస్థలు వాటిని నడిపే సంస్థలన్ని అధికారం చేతిలో ఆయుధాలయ్యాయి. మానవ శ్రమ బందీ అయింది. ఈ ప్రజాస్వామ్యం చేతిలో హింస పడుతున్నది. నిజాన్ని మాటగా చెప్పడం వేరు. కళా సాహిత్య రూపంలో చెప్పడం వేరు.
ఉదయమిత్ర నాలుగు దశాబ్దాలకు పైబడిన ఈ కాలమంతా చాలా సూక్ష్మ రూపంలో జీవితాన్ని కమ్మేసిన హింసను వేరువేరు సాహిత్య రూపాల్లో వ్యక్తీకరిస్తున్నాడు
ఈ హింసాస్వామ్యానికి ఎదురు నిలిచి కవిత, కథ, నాటిక, పాట, అనువాదం ఏ ప్రక్రియా మినహాయింపు కాకుండా రాస్తున్నాడు. ఎద విప్పితే గుప్పుమనే దీని హింసాత్మను నగ్నంగా ప్రదర్శిస్తున్నాడు. నమ్మిన సత్యం నిలపటానికి పోరాడుతున్న జనాల వైపు నుంచి అతను ఈ పని చేస్తున్నాడు. కొండచిలువ కథలో ఆయన ఇలా అంటాడు. ‘‘ఒక భీకర ప్రాణితో ఒక బక్క పల్చని ఆదివాసి యుద్ధం చేశాడు.. గెలుపు ఓటమి తర్వాత.. యుద్ధం చేయాలనుకోవడం నిలవడం, కలబడడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం చాలా ముఖ్యం.. ఈ మాటలు ఉదయమిత్రకు కూడా వర్తిస్తాయి. చెట్టు నుండి రాలి పడుతున్న ఆకుల కోసం కొత్తగా చిగురించిన ఆకుల వసంతగీతం వింటాడాయన. కవి అన్నట్లు పోరాటం దానికదే విలువైనది.
ఉదయమిత్ర ఇప్పటికీ అమ్మని చూడాలి, ఆఖరి కుందేలు, దోసెడు పల్లీలు పేరున మూడు కథా సంపుటులు ప్రచురించాడు.. అలివివలలో 12 కథలున్నాయి.. అన్ని కలిపి 64 కథలు రాసిన రచయిత జిల్లాలో మరొకరు లేరు. నెంబర్ సమస్య కాదు.. ఇంత లోతుగా అనేక కోణాల నుండి జీవన విధ్వంసం చూపిన వారు ఇక్కడ మరొకరు లేదని చెప్పడానికే. ఈ అలివివల కథలు ప్రజలపై వ్యవస్థ మోపిన భారాన్ని మన ముందు విప్పుతాయి. ప్రజాస్వామ్యపు ముసుగు ఎంతగా తొలగిపోతున్నది అనే ఫ్రేములో కథలను నేను పరిశీలించాను. కానీ ఈ కథల కాన్వాసు చాలా విస్తారమైంది.
చిన్న వయసులో విన్న బాలనాగమ్మ కథలో బాలనాగమ్మను ప్రజాస్వామ్యానికి ప్రతీకగా మాయల ఫకీరును పాలకవర్గానికి ప్రత్యేకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాణ్ణి.. గూగి రచన, వివి అనువాదం మట్టి కాళ్ళ మహా రాక్షసి.. చదివింతర్వాత నా అవగాహనకు మరింత స్పష్టత వచ్చింది.. ఉదయమిత్ర ఈ కథల్లో కొండచిలువ కథనే గాక వేరు వేరు కథలలో కొండచిలువ ప్రస్తావన తెచ్చాడు. దినదిన గండంగా బతుకుతున్న ప్రజలకు ఈ సంస్థలు ఈ ప్రభుత్వాలు చిన్న పెద్ద కొండచిలువలే అనిపిస్తే ‘‘నేరం నాది కాదు ఆకలిది’’ అన్నట్టు నేరం ఇలా పరిణమించిన ప్రజాస్వామ్యానిదే అవుతుంది. కఠినమే అయినా రచయిత నిజం చెప్పాడు
ఈ కథలు… వాగు నడుగొద్దు.. కథతో మొదలవుతాయి. కృష్ణవేణి ఆదిలాబాద్ జిల్లాలో టీచరవుతుంది. అధికారానికి అగచాట్లు పడుతుంది. స్త్రీ కనుక అగచాట్లు పడుతుంది.. ఉద్యోగం కోసం సుఖప్రద జీవితం కోసం కష్టపడుతుంది. ఏ అభివృద్ధి మాయ పొరలతో పాలకులు ఈ వ్యవస్థను నడుపుతున్నారో, ఆ అభివృద్ధి రాహిత్యం చెరువులు తెగి పొంగిపొర్లిన వాగు రూపంలో ఆమె భర్తను బలి తీసుకుంటుంది ఉద్యోగం కోసం ఆమె భర్తకు దూరంగా ఉండడం కాదు, స్త్రీల పట్ల, స్త్రీల ప్రత్యేక సమస్యల పట్ల.. మానవీయ స్పందన లేని స్వభావాలు, విధానాలు, అభివృద్ధి రాహిత్యం ఆమెను శాశ్వతంగా భర్తకు దూరం చేశాయి కారణం వాగును అడగవద్దని ఎవరిని అడగాలో చెప్పకుండానే చెబుతాడు రచయిత.
ప్రాణ భాష కథ.. మాతృభాష ప్రాధాన్యతను, విద్యా వ్యాపార కేంద్రీకరణను చర్చిస్తుంది. మాతృభాష గెలుపును చూపుతుంది. మనం మాతృభాష ద్వేషులం ఎందుకవుతున్నాం. వేరువేరు అస్తిత్వ ప్రాధాన్యతలను ఎత్తిపడుతూ సంఘటితమవుతూ పోరాడుతున్న మనం, భాషాపరమైన అస్తిత్వంలో ఎందుకు అహేతుక సంవాదంలో తేలిపోతున్నాం.. ఒక కొత్త భాష పెత్తనానికి వస్తుంది.. కొన్ని భాషలు ఎదిరిస్తాయి.. తెలుగు భాష ఎందుకు బేలగా లొంగిపోతున్నది. ప్రాణభాష ఏదైనా ప్రాణభాషనే కదా.
చాప ముల్లు.. కథలో నాయిక చాంద్‌బీ విరసం సభను, ప్రతీఘాత భావజాలంతో దెబ్బ తీయాలన్న పోలీసుల ప్రయత్నాన్ని, విరసం లక్ష్యాలను, పోరాటాల అవసరాన్ని తన జీవితానుభవం నుండి తెలుసుకొని, పోలీసులు ఆ పట్టణంలో కట్టిన బ్యానర్లను తన దారిలో కనిపించిన అన్నింటిని
చించి, మురికి కాలువలో పడేస్తుంది.. ఆ బ్యానర్లు చివరికి మురికి కాలువ కూడా చాపముల్లు అనిపిస్తాయి.
ఓ పెండ్లి ఆగిపోయింది.. కథలో పెండ్లి మావల్లనే ఆగిపోయింది. అది పాత విశ్వాసాల మీద, బాల్య వివాహాల మీద ఓ బలమైన దెబ్బ వేసిన సందర్భం.. ఈ ప్రజాస్వామ్యం ఎంత భూస్వామ్య విలువలతో సగం జనాభాను దెబ్బ తీస్తున్నదో ఎంత సదవగాహన అవసరమో చర్చించవలసిన అవసరం చెప్పిన కథ.. మెసేజ్. సహజ వనరుల దోపిడీ ప్రైవేట్‌స్వామ్యాన్ని ఎట్లా నిలబెడుతున్నదో చూపడంతో పాటు ప్రజల ప్రతిఘటనను చూపింది. సర్పయాగం కూడా ఈ కోవకు చెందినదే శ్యామ్‌రావుబస్తీ జనం చేసిన ప్రత్యక్ష తిరుగుబాటు కథ ఇది.
ప్రభుత్వం వైద్య రంగం ఎంతో ప్రగతిలో ఉన్నదంటుంది.. దేశంలో మూడవ స్థానంలో ఉన్నదంటుంది.. కానీ ప్రజలకు విశ్వాసం కల్పించే వైద్యం మాత్రం అందదు. ప్రైవేటు వైద్యానికి పోలేక, చాలినంత మంది వైద్యులు,ఇతర సిబ్బంది, వసతులు లేని ప్రభుత్వ దవాఖానాలలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఎంత హీనస్థాయిలో ఉన్నాయో చూపిన కథ.. వాయిదాల డెలివరీ.. తలకు ఒకచోట మొండానికి మరోచోట డెలివరీ చేసిన కథ.. పిల్లలు కాలేదని అబార్షన్లు అవుతున్నాయని, ప్రభుత్వాన్ని నమ్ముకున్న అభాగ్యుల కడుపుకోత ఈ కథ. సిగ్గులేని మన వైద్య వ్యవస్థకు ప్రతిబింబం.
ఉదయమిత్ర సాహిత్యంలో ఆదివాసులకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. అచ్చంపేట అడవులలో ఏర్పర్చిన టైగర్ ప్రాజెక్ట్ నిజనిర్ధారణ కాలం నుండి ఆయన ఆదివాసీలతో కనెక్ట్ అయ్యాడు.. దేశమంతటా ఆదివాసీలు కంపెనీల సర్కార్లతో చేస్తున్న జీవన్మరణ పోరాటాలతో కనెక్ట్ అవుతున్నాడు.. ఇదివరలో దోసెడు పల్లీలు లాగా ఇప్పుడు కూడా ఈ కథా సంపుటికి ఆదివాసి జీవితంతో ముడివడిన అలివివల.. అనే పేరే ఎంచుకున్నాడు. ఈ సంపుటిలో మడకం లక్ష్మి, కొండచిలువ, అలివివల, హమ్ సబ్ యాద్ రఖేంగే అనే నాలుగు కథలు ఆదివాసీ జీవితాన్నిబ్రతుకు పోరాటాన్ని ప్రతిఘటనను ఎత్తి పట్టిన కథలు.
దేశంలో స్వతంత్ర పాలన మొదలై 75 ఏండ్లు అవుతున్నది.. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. రాజ్యాంగం ప్రాధాన్యత, రాజ్యాంగ వాదం ఒక వైపు నుంచి.. అసలు రాజ్యాంగాన్ని మార్చివేయాలని మరొకవైపు నుంచి తీవ్ర వాదాలు జలదేగుతున్నాయి… పనిలో పనిగా, స్థిరంగా జెండాలు ఇంటింటా పంపిణీ చేస్తున్నారు. ఇండ్ల మీద ఎగురవేయమంటున్నారు. మడకం లక్ష్మికి అలాగే జెండా ఇచ్చారు. ఆ జెండా ఆమె బిడ్డల ప్రాణాలు కాపాడ లేకపోయింది. రక్షణ ఇవ్వని జెండా తనకెందుకని చాలా కోపంతో ఆజెండాను మడకం లక్ష్మి తిరిగి తనకు ఇచ్చిన వారికి ఇచ్చేస్తుంది.
రేణుక, శ్రావణి అక్క చెల్లెల్లు.. చదువులో చేరిన చెంచు బిడ్డలు.. నాగయ్య బయ్యమ్మల ముద్దుబిడ్డలు. అడవి లోతట్టుకు వెళ్లి రాత్రి తిరిగి రాలేకపోయారు. శ్రావణి కొండచిలువ బారిన పడిరది, నాగయ్య ప్రతీకారం తీసుకున్నాడు. ప్రాణాలకు తెగించి కొండచిలువను చంపేశాడు. నల్లమల అడవులలో ఒక ఘోరం జరగడం లేదు నిజాం ప్రయత్నాలు ఏమైనాయో.. హేమన్ డార్ఫ్ సూచనలు ఏమైనాయో…
స్వతంత్ర పాలనలో ముఖ్యంగా తెలంగాణ పాలనలో చెంచులకు కలిగిన మేలేమి లేదు.. చెంచుల న్యాయం కోసం పోరాడిన ఎందరో చెంచు నాయకులు మరణించారు. విప్లవోద్యమంలో చేరి పోరాడిన వాళ్ళని చంపేశారు. చదువు, పని, నివాసం, ఆరోగ్యం తాగునీరు, సాగునీరు, కరెంటు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. చేయకపోగా అడవిలో పులులు తెచ్చి వదిలారు. కొండచిలువలను తెచ్చి వదిలారు. వజ్రాల వేటకు డీబీర్స్‌ను దింపారు. అది కాదని ఏకంగా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. అడుగడుగునా పోరాటంలో చెంచులు అంతరిస్తున్న జాతిగా మారిపోతున్నారు. చెంచు నాగయ్య సాహసం చెంచులకు విశ్వాసం ఇచ్చింది. అడవి మాదేనని ప్రకటించుకున్నారు. ఇది నిజం చేయడం సమాజం బాధ్యత.
మరొక కథ అలివివల.. ఇది శ్రీశైలం ప్రాజెక్టులో చేపలు పట్టడానికి తెచ్చిన వల. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలోని 67 గ్రామాలు 1981 నాటి జనాభా లెక్కల మేరకు లక్ష జనాభ లక్ష ఎకరాల భూమీ కోల్పోయిన రైతులను కాదని, అటు కర్నూలు జిల్లాలోనూ, ఈ స్థాయిలోనే భూమీ కోల్పోయిన రైతులను కాదని, నిర్వాసితులకు హక్కుగా దక్కవలసిన ఏ హక్కును కాదని కనీసం చేపలు పట్టుకొనే హక్కు దక్కకుండా ఎక్కడెక్కడి కాంట్రాక్టర్లనో దళారీలనో దించి శ్రీశైలం ప్రాజెక్టులోకి పాలకులు అలివివలలను దించారు. రైతుల ఆగ్రహానికి నల్లమల విప్లవోద్యమం జతకలిసి ఒకసారి అలివివలను కాల్చేసారు. అది నెల రోజులు కాలినట్టు అక్కడ జనం చెబుతారు. శ్రీశైలం ప్రాజెక్టులో నష్టపోయిన అందరిలోకి ఎక్కువ నష్టపోయింది చెంచులే. ఆ చెంచుల నుంచే అనుమతి పొంది కట్టిన శ్రీశైలం ప్రాజెక్టులో వారి జీవితాలనే ముంచింది కాక వారిపై అలివివలల నీడను పరిచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నిర్వాసిత రైతుల మీద చెంచుల మీద అలివివలల దాడులు పోలేదు. ఆ నీడలు పెరుగుతున్నాయి.
ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర పాలకవర్గం కలిసి అలాయి బలాయి తీసుకుంటున్న కాలంలోకి ప్రవేశించాం.. అమరగిరి చెంచులకు అడవిలో బతుకుదెరువు లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో చేపలు పట్టే అవకాశం లేదు. వాళ్లు తిరగబడ్డారు. బతుకు అర్థమైన పసి పిల్లగాడు గజ్జన్న నేతృత్వంలో తిరగబడ్డారు.
మడకం లక్ష్మి, కొండచిలువ, అలివివల ఈ కథలు అడవి మీద రాజ్యం సృష్టించిన విధ్వంసం విప్పి చూపిన కథలు. ఉదయమిత్ర ఇలా అంటాడు ‘‘అడవిలోకి మైదానం జొరబడ్డాక ఇంట్లోకి పాము జొరబడ్డట్టు అయింది’’ అని. వాళ్ల పరిస్థితి పెంక మీద మండుతున్న బతుకులా ఉందని. కవి గనుక అనేకసార్లు వ్యధాభరితమైన ఆదివాసి జీవితం, పోరాడుతున్న వాళ్ల కళ్ళను ఎవరైనా చదివితే బాగుంటుంది అని ఆరాటపడతాడు.. కళ్ళు చదవాలంటే కళ్ళలోకి చూడాలి.. ఈ ప్రభుత్వాలకి ఆదివాసీలకు నిజం చెప్పే శక్తి ఉందా.. సూటిగా చూసే చేవ ఉందా..
హమ్ సబ్ యాద్ రఖేంగే.. కథ ఆదివాసీలు ఛత్తీస్‌ఘడ్ నుంచి రెక్కలు కట్టుకొని పని కోసం బెంగుళూరు వలస వచ్చిన కథ.. పాలకులు వలసలు ఆగిపోయాయి అంటారు.. సేద్యం చితికిపోయిన రైతులు, బతుకులు కూలిపోయిన ప్రజలు, అడవిని కంపెనీలు ఆక్రమిస్తుంటే, ప్రభుత్వాలు విచ్చలవిడిగా హింసను ప్రయోగిస్తుంటే, చెదిరిపోయిన ఆదివాసులు ఎక్కడ బతుకును వెళ్ళదీస్తున్నారు? కరోనా కాలం ఈ దేశం కడుపులో ఎంత వలస నిప్పు రాజుకుంటున్నదో, ప్రజలు ఎంతగా కనలిపోయారో, వారెంత శాంతులో ప్రపంచానికి నగ్నంగా చూపెట్టింది ఈ కథ.. లింగారాం వంటి వలస జీవులకు నగరం ఎంత కానిదైంది.. వారి రక్త మాంసాలను నగరం ఎంతగా పీల్చుకు తింటుందో రచయిత కళ్ళకు కట్టాడు.
మడకం లక్ష్మి, నాగయ్య, గజ్జన్న, లింగారాం ఒక్కొక్కరు మహాయోధులు.. వాళ్లు చరిత్రను అర్థవంతమైన చలనం వైపు నడిపిస్తున్నారు.. ఉదయమిత్రకు వాళ్ల చలనంలో విశ్వాసం ఉంది. కొనసాగుతున్న హింస మీద ధైర్యం ఊపిరిగా పోరాడుతున్న వీళ్ళ తెగింపు మీద విశ్వాసం ఉంది.. రేపటి శాంతిలో అతనికి ఆశలు ఉన్నాయి.
ఈ కథలు చాలావరకు మేము కలిసి అనుభవించినవి.. పలువరించినవి.. కలబోసుకున్నవి.. ఈ పాత్రలు మా కళ్ళ ముందు రాటు దేలాయి.. వీటిని, మేము హృదయంలోకి తీసుకున్నాం.. ఉదయమిత్ర తన అక్షరాలతో వాటికి ప్రాణం పోశాడు.
పాలమూరు అధ్యయన వేదిక, ప్రరవే మిత్రులతో కలిసి నల్లమలలో యురేనియం తవ్వొద్దని రెండు రోజుల ప్రచారం చేసింది. నాలుగు పేజీల కరపత్రం వేసి యురేనియం సర్కారుతో పోరాడుదామని అక్కడి ప్రజలతో గొంతు కలిపింది. కొండచిలువ మింగిన శ్రావణి కథ శ్రావణిని కోల్పోయిన బయ్యమ్మ కడుపుకోత అడవిలోనే ఉదయమిత్రకు అంది వచ్చింది.
ఇలాగే చాలా కథలు సమాజ పరివర్తనను గాఢంగా కోరే వ్యక్తులు, కార్యకర్తలు నాయకులైతే ఎట్లా ప్రజల కోసం పరితపిస్తారో, ఆ మనుషుల అవసరం తెలిసిన వారు, ఎంతగా వారితో మమేకమవుతారో, మనిషికి నిజమైన నిర్వచనం అవుతారో చెప్పిన కథ.. వెలుతురు పిట్టలు.
ఈ కథలకు సాహిత్య ప్రయోజనం ఏ స్థాయిలో ఉండగలదో సామాజిక ప్రయోజనం అంతే స్థాయిలో ఉండగలదు.. అసలు సామాజిక ప్రయోజనం లేని పరివర్తన శీలం కానీ చలనాన్ని, దాని రూప సారాలలోంచి గ్రహింపులోకి తేలేని సాహిత్యం కలిగి ఉండే ప్రయోజనం శూన్యం అని చెప్పక తప్పదు..
మొన్న 30 నాడు రాత్రి ఫోన్ చేసి ఆ రాత్రే చదివి ముందు మాట రాయమని ఆదేశించాడు మారు మాటకుఅవకాశం లేని ఆదేశం.. తర్వాతి రెండు రోజులు తీవ్ర అనారోగ్యమైనా కథలని చదివాను. ఈ కథలే ఈ మాటలు రాయించాయి. అంతకన్నా ప్రజాస్వామ్యం పేరు మీద విషం చిమ్ముతున్న వ్యవస్థ మీద, ఈ కొండచిలువ మీద, ఈ అలివి వల మీద, అణచివేస్తున్న ఈ వ్యవస్థ మీద జరుగుతున్న పోరాటం ఈ మాటలు రాయించింది. ఉదయమిత్రకు ధన్యవాదాలు.
నేను ఈ కథలకే పరిమితమై మాట్లాడాను.. శైలి, భాష, నాయిక, నాయక, ప్రతినాయిక, ప్రతినాయక, పాత్ర చిత్రణ, సన్నివేశాల కల్పన వంటి కథానిర్మాణ విషయాలపై పాఠకులు స్పందిస్తారని ఆశిస్తున్నాను…