హిమాలయ సానువుల్లో గల ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీన కొండచరియలు, హిమనినద విస్ఫోటనంతో జరిగిన ఘోరమైన విపత్తు కారణంగా ఇప్పటికే 36 మంది మరణించగా, మరో 200 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఫిబ్రవరి 20 నాటికి సహాయక బృందాలు 68 మృత దేహాలను కనుగొన్నాయి. ఇంకా 168 మంది ఆచూకీ లభ్యం కాలేదు. చనిపోయిన వారిలో ఎక్కువమంది జల విద్యుత్ ప్రాజెక్టులు, వివిధ మౌలిక సదుపాయాల వద్ద పనిచేస్తున్న కార్మికులే కావడం విచారకరం. రైని గ్రామ సమీపంలో రిషిగంగ నదిపై నిర్మిస్తున్న చిన్న 13.2 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం కాగా, ఆ సమీపంలోనే ధౌలిగంగపై నిర్మిస్తున్న అతి పెద్ద 520 మెగావాట్ల తపోవన్ పవర్ ప్లాంట్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ పనిచేసే కార్మికులు చాలా మంది బురద ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ సంఖ్యలో జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు వంద వరకు డ్యామ్‌లు ఉన్నాయి. ఇంకా మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో చాలావరకు రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులే. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి కొంతమేరకు నీటిని నిల్వ చేసుకునేవిగానే ఉన్నాయి. 450కి పైగా జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా ఉంది.
2013లో సంభవించిన పెను విపత్తులో కేదార్నాథ్ పట్టణం దారుణంగా దెబ్బతింది. చుట్టుపక్కల పర్యావరణం గురించి కనీసపు ఆలోచన కూడా చేయకుండా, మళ్లీ ఇలాంటి ఆకస్మిక వరదలకు కారణమవుతామనే భయం కూడా లేకుండా ఈ పట్టణాన్ని పునర్నిర్మించారు. ఇటువంటి సున్నితమైన ప్రాంతంలో పట్టణాలు, ఆవాసాలు నిర్మిస్తే వాటికి తట్టుకునే సామర్థ్యం ఉందా లేదా అని కూడా కాస్తంత ఆలోచన చేయలేకపోయారు. ఆలయానికి వచ్చే యాత్రికుల రద్దీని నియంత్రించడంతో పాటు కింది స్థాయిలో నివాస సదుపాయాలను నిర్మించడం వంటి ప్రత్యామ్నాయ సూచనలను కొట్టి పారేశారు. ఈ ప్రాంతంలో అత్యంత తీవ్రంగా ఉండే వాతావరణ మార్పులు, కొండచరియలు విరిగిపడడం, ఏటవాలు ప్రాంతాలు, గ్లేసియర్ మార్పులు వంటి వాటిని నిరంతరంగా పర్యవేక్షించడమనేది లేకుండా పోయింది. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి భద్రత, పర్యావరణ సమీక్ష నిష్పాక్షికంగా జరగాల్సి ఉంది.
పర్యావరణ విధ్వంసానికి ప్రకృతి ప్రతీకారం :
ఉత్తరాఖండ్ విపత్తును మానవుడు చేసే అభివృద్ధి కార్యకలాపాల అవశేషంగా చూడాల్సి ఉంటుంది. అన్ని హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ, పర్యవసానాలు గురించి అస్సలు పట్టించుకోకుండా ఈ అభివృద్ధి చర్యలు చేపడుతున్నారు. పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ హిమాలయాల్లో ఇటువంటి పరిస్థితులకు ప్రధానంగా కారణమయ్యే, లేదా దోహదపడే అంశాలు రెండు ఉన్నాయి. అవేమంటే వాతావరణ మార్పులు, ఆలోచనారహితంగా ఈ ప్రాంతంలో చేపట్టే మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం. మానవ చర్యల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వేగంగా హిమనీనదాలు, ధృవప్రాంతపు మంచు దిబ్బలు కరిగిపోవడానికి దారి తీస్తున్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇటీవల భారత్‌లోనూ, అంతర్జాతీయంగా జరిగిన అధ్యయనాలు చూసినట్లెతే గత దశాబ్దాల్లో కన్నా ప్రస్తుతం ఈ మంచు కరిగిపోయే రేటు ఎక్కువగా ఉందని వెల్లడవుతోంది. భారత్‌లో చూసినట్లెతే తూర్పు హిమాలయాల కన్నా పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో గ్లేసియర్ (హిమానీ నదం) కరిగిపోవడం వల్ల పెద్ద మొత్తంలో సరస్సుల్లాంటివి ఏర్పడుతున్నాయి. ఒక్కోసారి వీటి కట్టలు తెగిపోయి పెద్ద మొత్తంలో నీరు కిందకు ప్రవహించడంతో ఆకస్మాత్తుగా వరదల్లాంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత విపత్తులో ముందుగా ఊహించిన కారణం అదే. పశ్చిమ హిమాలయాల్లో ఇటువంటి క్రమం చాలా వేగంగా చోటు చేసుకుంటుండడం వల్ల అస్థిరతకు, ఆకస్మిక వరదలు పెరిగే అవకాశాలకు దారి తీస్తోంది.
ఈ ప్రాంతంలో బాధ్యతారహితంగా రోడ్లు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు పెరుగుతుండడంతో ఈ సమస్య కూడా తీవ్రతరమవుతోంది. అత్యంత సాధారణ పరిస్థితుల్లో కూడా తరచుగా కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు, ఫలితంగా టన్నుల కొద్దీ రాళ్లు, ఇతర శిథిలాలు పడడం వంటివి హిమాలయ పర్వత సానువుల్లో చాలా సర్వసాధారణమని మనకు తెలుసు. కొండ ప్రాంతాల్లో ఆవాసాల విస్తరణ వల్ల ఇప్పటికే ప్రాంతీయ పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతోంది. అంటే రహదారులు నిర్మించడం, జలవనరులు తరిగిపోవడం, చెట్లను నరికివేయడం వంటి చర్యల వల్ల ఆ ప్రాంతంలో నేల గుల్లబారుతోంది. కొండచరియలు విరిగిపడడం వల్ల పడే రాళ్ళు రప్పలతో నీటి ప్రవాహానికి అవరోధం ఏర్పడి స్థానిక కాలవలు, నదుల్లో ఒక్కసారిగా ఆకస్మిక వరదలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాగుతున్న నిర్మాణ ప్రాజెక్టుల వల్ల ఈ విధ్వంసం మరింత ప్రమాదకరమైన స్థాయిలకు వెళ్ళింది.
2016లో రూ.14 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన చార్‌థామ్ ప్రాజెక్టు కింద ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రధాన యాత్రా స్థలాలను కలుపుతూ 800 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. చార్‌థామ్ మహా మార్గగ్ హైవే, హోటళ్ళు, ఇతర మౌలిక సదుపాయాలు వీటిలో ఉన్నాయి. వంద కిలోమీటర్ల దూరం పరిధిలో 53 ప్రాజెక్టులుగా అసలు ప్రాజెక్టును విభజిస్తున్నట్లు మభ్యపెట్టి మరీ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారు. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు ఏర్పడిన కమిటీ రోడ్డు వెడల్పును 10 మీటర్లకు పెంచింది. దీంతో కొండను 24 మీటర్ల మేరా తొలిచారు. అంతకన్నా ఆందోళన కలిగించే అంశమేమంటే రోడ్డును కట్ చేయడం, కొండ ప్రాంతాన్ని తొలచడమనేది చాలా నాటుగా, ప్రమాదకరమైన పద్ధతిలో చేపట్టారు. డైనమైట్లు పెట్టి పేల్చడం వంటి చర్యలు అందులోవే. వీటివల్ల కొండ నిట్టనిలువునా చీలిపోవడంతో కొండ చరియలు విరిగిపడే అవకాశాలు పెరిగాయి. కొత్తగా చెట్లు పెంచడం వంటి చర్యలేమైనా చేపడితే అవి కనీసం ఇటువంటి పరిస్థితులను కొంతమేరకు నిలువరించడానికైనా వీలు ఉండేది. మరింత లాభాలు ఆర్జించాలన్న కంపెనీల తాపత్రయం, వేగం తప్ప ప్రజల భద్రత, రక్షణ అనేది వారికి ప్రాధాన్యతాంశంగా లేకుండా పోవడం విషాదం.
అభివృద్ధి కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం :
దాదాపు 200 సంవత్సరాలుగా జరుగుతున్న పారిశ్రామీకరణ, జీవన విధానం పర్యావరణ కాలుష్యానికి దారితీస్తున్నాయి. 1824లో వాతావరణ శాస్త్రవేత్త జోసెఫ్ పొరియర్ పెరుగుతున్న కాలుష్యం, భూతాపంపై జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఎన్ని ప్రకృతి విపత్తులు, ఆరోగ్య విపత్తులు సంభవిస్తున్న పాలకులు తాత్కాలిక చర్యలతో సరిపుచ్చుతున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు. వాతావరణ పరిరక్షణ విషయంలో భారత ప్రభుత్వం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరాఖండ్ చమోలి జిల్లా రిషిగంగ నదికి ఫిబ్రవరి 7న వచ్చిన ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టించాయి. వరదలు 13 గ్రామాలను ముంచెత్తాయి. ప్రాణహాని, సంపద నష్టం అపారంగా ఉంది. హిమాలయాల్లో వేగంగా మంచు పలకాలు కరిగిపోవడం వరదలు, ఇతర విపత్తులకు కారణమవుతున్నదని పర్యావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఒకసారి పెను విపత్తు జరిగాక మళ్లీ అలాంటివి జరగకుండా నిరోధించే చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి.
అభివృద్ధి పేరుతో అమలుచేస్తున్న విధానాలను ఇప్పటికైనా సమీక్షించుకోవాలి. అడవులను విచ్చలవిడిగా నరికివేయడం పర్వతశ్రేణుల్లో విపత్తులకు ప్రధానంగా కారణమవుతోంది. అడవులను అక్రమంగా ఆక్రమించుకుని చెట్లను నరికివేయడం అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతోంది. నరికివేసిన చెట్లకు బదులుగా వనాలు పెంచుతామని పాలకులు చెప్పుతున్నట్లుగా జరగడం లేదు. 2019 నాటికి 12,81,397 హెక్టార్ల అటవీభూమి అక్రమార్కుల కబంధహస్తాల్లో ఉందని ఆర్టీఐ చట్టం కింద అడిగిన ప్రశ్నకు అధికారిక సమాచారం లభించింది. మనకు ప్రాణ వాయువును అందించే చెట్లు లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్రమార్కుల అధీనంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 5.34 లక్షల హెక్టార్లు ఉంది. అటవీ ప్రాంతాలను కార్పొరేట్లకు విక్రయించే ప్రతిపాదనను వాతావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్ ట్రిబ్యునల్‌కు పంపించిందన్నది తాజా సమాచారం.
వాతావరణ కాలుష్యాన్ని, భూతాపాన్ని తగ్గించి మానవాళిని విపత్తు నుండి కాపాడేందుకు పాలకులు ప్రథమ ప్రాధాన్యత నివ్వాలనే శాస్త్రవేత్తల సూచనలు ఆలకించకపోతే రాగల ప్రకృతి విలయాలు మరింతగా పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి అభివృద్ధి నమూనా వస్తువినియోగాన్ని అపారంగా పెంచింది. ఆయా దేశాలపై దాడిచేస్తున్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి వాతావరణ స్పృహ ఉండదు. ఆర్థిక అభివృద్ధి సాధించిన అనేక సంపన్న దేశాలు వాతావరణ కాలుష్యాన్ని, భూతాపాన్ని గుర్తించ నిరాకరిస్తున్నాయి. అలాంటి వాటిల్లో అగ్రదేశం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ముందున్నారు. ఇక బ్రెజిల్, ఇజ్రాయిల్ నేతలు ట్రంప్ బాటనే అనుసరించారు. సంపన్న దేశాలు ఇలా ఉంటే, స్కాండినేవియా దేశాలు, కొన్ని ఐరోపా దేశాలు వాతావరణం పరిరక్షణ విషయంలో ముందున్నాయి. ఇదే సమయంలో భారతదేశం వాతావరణ సమస్యలపై కపట విన్యాసాలు చేస్తోంది. వాతావరణ పరిరక్షణపై తీపి మాటలు చెప్తూ అదే సమయంలో హానికరమైన కార్యాచరణను చేపడుతోంది. ఒకవైపు కరోనా మహామ్మారి ప్రజలను కకావికలం చేస్తున్న సమయంలోనూ మోడీ ప్రభుత్వం 14 బొగ్గు గనుల తవ్వకం కాంట్రాక్టులను వేలం ద్వారా బడా లాభార్జనా పరులకు అప్పగించింది. ఇది కాలుష్యం పెంచే చర్య.
మనకు అటవీ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్స్, చిత్తడి నేలలు పరిరక్షణ సంస్థలు, కోస్తాతీరం రక్షణ ఏజెన్సీలు, వాతావరణ ప్రభావం అంచనా నియమాలు, కాలుష్య నియంత్రణ మండళ్లు అత్యధిక వ్యయం చేసే గంగప్రక్షాళనకు నమామిగంగ పథకాలున్నాయి. వాతావరణ కాలుష్యం పెరుగుతున్న ప్రాంతాల్లో కాలుష్యం కలిగించే నిర్మాణాలు అనుమతించిరాదన్న నియమ నిబంధనలున్నప్పటికీ వాటిని విస్మరిస్తున్నారు. అనేక ప్రాజెక్టులు వాతావరణ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండానే నిర్మించడం కొనసాగుతోంది. ప్రజల ఆరోగ్యం, సమాజహితం గల నాణ్యమైన వైద్యం, తక్కువ స్థాయిలో ఆర్థిక సామాజిక అసమానతలున్నప్పుడే అభివృద్ధిగా ప్రకటించుకోవాలి. అలాకాకుండా రోజురోజుకీ అసమానతలు, పేదరికం, నిరుద్యోగం పెరుగుతూ, వ్యవసాయదారులు, చేతివృత్తుల వారు తదితర అనేక తరగతులు ప్రజలు దీనస్థితిలో ఉంటే, ఒక శాతం సంపన్నుల చేతుల్లో 58 శాతం సంపద మూలుగుతున్న దేశం అభివృద్ధి చెందినట్టా? అన్ని దేశాల పాలకులు ప్రధానంగా కాలుష్యం పెంచుతున్న అమెరికా, చైనా, భారతదేశం, ఇతర జి-7 దేశాలు ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు మార్చుకోవాలి. వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న విపత్తులపై ప్రజలు చైతన్యమైతే పాలకులనే మార్చుకుంటారు.
ప్రస్తుత విపత్తు వెనుక గల అసలు కారణాలు, పరిస్థితులు ఇంకా బయటపడాల్సి ఉంది. తొలుత ఊహించినట్లుగా హిమానీనదం వల్ల ఏర్పడిన సరస్సు ఒక్కసారిగా కట్టలు తెంచుకుందనే భావన నిజం కానట్లుగా కనిపిస్తోంది. భారత్, విదేశాల్లోని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా జరిపిన అధ్యయనాలు చూసినట్లెతే, భారత నిపుణుల బృందాల ప్రాథమిక పరిశీలన ప్రకారం పెద్ద కొండచరియ విరిగిపడడం, దానికితోడు ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో మంచు, రాళ్ళతో ఏర్పడిన మంచు పెళ్ళలు విరిగిపడడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అసలే అస్థిరంగా ఉన్న రాళ్ళతో కూడిన మంచుపెళ్ళపై గ్లేసియర్‌లో ఒక భాగం విరిగిపడడం వల్ల వరుసగా ఈ సంఘనలన్నీ చోటు చేసుకుని ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఇటువంటి నిర్లక్ష్యపూరితమైన అభివృద్ధికర కార్యకలాపాలే ఇటువంటి విపత్తులకు ప్రథమ కారణాలుగా నిలవకపోయినా, అటువంటి విపత్తులకు పెద్దఎత్తున దోహదపడడం విచారకరం.
1965లో అమెరికా అమర్చిన సాధనం వల్లే :
దిగ్గజ పర్వతారోహకుడు కెప్టెన్ ఎం.ఎస్.కోహ్లి ఒక ఆసక్తికరమైన వాదనను తెరపైకి తెచ్చారు. 1965లో ఆ హిమానీసదంపై ఉంచిన ఒక రేడియోధార్మిక పరికరం ఇందుకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. 1964లో చైనా… షిన్ జియాంగ్ ప్రావిన్స్‌లో ఒక అణు బాంబును పరీక్షించింది. ఇది అప్పట్లో పశ్చిమ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే.. చైనాకు ఈ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం లేదని ఆ దేశాలు భావించాయి. దీంతో చైనా మరిన్ని అణు పరీక్షలు నిర్వహిస్తే పసిగట్టడానికి వీలుగా 1965లో అమెరికా గూఢచర్య సంస్థ ‘సిఐఎ’, భారత ఇంటిలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎన్ఎఫ్ఎఫ్)తో కూడిన బృందం నందా దేవి హిమానీసదంపై ఒక రేడియో ధార్మిక పరికరాన్ని ఉంచింది. ఈ పరికరానికి ఫ్లుటోనియం క్యాప్సూళ్ల నుంచి శక్తి అందుతుంది. అవి దాదాపు వందేళ్ల పాటు శక్తిని వెలువరిస్తాయి. నాడు ఈ పరికరాన్ని ఉంచిన బృందంలో ఎం.ఎస్.కోహ్లి కూడా ఉన్నారు. తాజా ఘటనకు ఈ పరికరం కారణమై ఉండొచ్చని ఆయన ‘ఈటీవీ భారత్’తో చెప్పారు. ‘‘దాన్ని మనం కొట్టిపారేయలేం. అది దిగువ భాగానికి చేరి ఉంటుంది. దాన్ని వెతికేందుకు సీనియర్ శాస్త్రవేత్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. గాలింపు కోసం ఆధునిక మెటల్ డిటెక్టర్లను ఉపయోగించాలి’’ అని తెలిపారు.
1964లో 25 వేల అడుగుల ఎత్తులో ఉన్న నందా దేవి శిఖరాగ్రానికీ ఆ పరికరాన్ని తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో వాతావరణం ప్రమాదకరంగా మారిపోయిందని కోహ్లి చెప్పారు. ‘‘గాలులు ఉధృతమయ్యాయి. మేం ముందడుగు వేయలేకపోయాం. ఆ పరికరాన్ని కిందకు ఈడ్చుకొచ్చే పరిస్థితి కూడా లేదు. దాన్ని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నాం. మంచులో ఒక గుంత తవ్వి, అందులో ఈ సాధనాన్ని ఉంచాం. తర్వాత మళ్లీ అక్కడికి వచ్చి.. దాన్ని నందాదేవి శిఖరం పైకి చేర్చాలనుకున్నాం. 1966లో తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లాం. అయితే ఆ పరికరంలోని అణుశక్తి జనరేటర్ సాధనం గల్లంతైంది. యాంటెన్నా, ఇతర భాగాలు మాత్రమే ఉన్నాయి. ఇది తీవ్ర కలవరం సృష్టించింది. ఎందుకంటే ఆ జనరేటర్లో ఏడు అణుశక్తి క్యాప్సూళ్లు ఉన్నాయి. హిరోషిమాపై వేసిన అణుబాంబు సామర్థ్యంలోని సగం శక్తితో ఇవి సమానం. జనరేటర్‌ను కనుగొనేందుకు మూడేళ్లు శ్రమించినా.. ఫలితం లేదు. చాలా వేడిగా ఉన్న ఆ జనరేటర్ హిమానీసద మంచును కరిగించుకుంటూ కిందకు జారిపోయి ఉంటుంది. అక్కడికి చేరి ఉంటే అది రుషి గంగ నదికి ప్రదాన నీటిని అందించే భాగంలోకి జారిపోయి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 25 వేల అడుగుల ఎత్తులో ఆ పరికరాన్ని పెట్టాలన్న సిఐఎ నిర్ణయం తప్పని కొహ్లి చెప్పానన్నారు. 22 వేల అడుగుల ఎత్తులోని నందా కాటో డోమ్ వద్ద అమరిస్తే సరిపోతుందని తాను వాదించినట్లు తెలిపారు. 1967లో లడ్డాఖ్‌లోని ఖర్దుంగ్లా పాస్‌లోని 18,300 అడుగుల ఎత్తులో మరో పరికరాన్ని ఉంచాం. అది చైనా అణు సంకేతాలను అద్భుతంగా పసిగట్టింది అని చెప్పారు.
గత మూడు దశాబ్దాల్లో …
పర్యావరణ సమతౌల్యం దెబ్బ తింటే ఎటువంటి విపత్తులొస్తాయో ప్రస్తుత ఉత్తరాఖండ్ అనుభవం మరోసారి పాలకుల కండ్ల ముందుంచింది. అవిభాజ్య ఉత్తరప్రదేశ్‌లో 1991 అక్టోబర్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇందులో 768 మంది మృతువాత పడ్డారు. వేలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. మాల్ఫా కొండ చరియలు ఆగష్టు 1998లో పితోరా గఢ్ జిల్లాల్లో విరిగి పడడంతో మాల్ఫా గ్రామంలో దాదాపు 250 మంది మరణించారు. వీరిలో 55 మంది కైలాస్ మానస సరోవర యాత్రికులు కూడ ఉన్నారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా రాళ్ళు శారదా నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. చమోలీ జిల్లాలో మరోసారి భూకంపం మార్చి 1999లో 6.8 తీవ్రతతో ఏర్పడిన కారణంగా 100 మందికి పైగా మృతి చెందారు. పొరుగునే ఉన్న రుద్ర ప్రయోగ జిల్లా కూడ తీవ్రంగా ప్రభావితమైంది.
భూకంపం కారణంగా నేలలో మార్పులు సంభవించాయి. నీటి ప్రవాహంలో మార్పులు కూడ సంభవించాయి. నేలపై రోడ్లపై పగుళ్ళు కూడ కనిపించాయి. ఉత్తర భారతదేశంలో 2013 జూన్‌లో ఉత్తరాఖండ్‌లో కొన్ని రోజుల పాటు మేఘాలు వర్షించడంతో భారీగా వరదలు పోటేత్తాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో 5,700 లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. 4550 గ్రామాలు వరదల ప్రమాదానికి గురయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యాణా, ఢిల్లీ,్త తరప్రదేశ్ రాష్ట్రాలు కూడ ఈ వరదల ప్రభావానికి నష్టపోయాయి. రోడ్లు ధ్వంసమవ్వడంతో చార్దామ్ యాత్రకు దారితీసే లోయల్లో 3 లక్షలకు పైగా ప్రజలు కొన్ని రోజుల పాటు చిక్కుకుపోయారు.2004 సునామీ భీభత్సం తర్వాత వచ్చిన ప్రమాదకరమైన వరదలు అని ప్రజలు చెబుకుంటారు.
భూగోళం ఉష్ణోగ్రత పెరగడంతో హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయని, 21వ శతాబ్దంలో మంచు కరగడం రెండింతలైందని, 40 ఏళ్లుగా ఉపగ్రహాలు అందించిన సమాచారం ఆధారంగా చేసిన ఆధ్యయన వివరాలు ‘జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్’ 2019 జూన్ సంచికలో ప్రచురించింది. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లో నిలువుగా ఏటా అడుగున్నరమేర మంచు కరుగుతున్నట్టు గుర్తించారు. 1975-2000 కాలంతో పోలిస్తే 2000 నుంచి 2016 వరకు రెట్టింపు మంచు కరుగుతున్నదని తేల్చారు. ఈ కాలంలో సగటున ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు అంచనా. పడమర నుంచి తూర్పు వరకు 2000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 650 హిమ పర్వతాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ నిర్ధారణకొచ్చారు. ఈ అధ్యయనం కోసం అమెరికా నిఘా ఉపగ్రహాలు అందించిన త్రీడి చిత్రాలను కూడా విశ్లేషించారు.
గత మూడు దశాబ్దాల్లోనే హిమాలయాల్లోని పావు వంతు మంచు కరిగి ఉంటుందని ఈ అధ్యయనంలో భాగస్వామి అయిన కొలంబియా యూనివర్సిటీ పరిశోధకుడు జోషువా మౌరన్ అంచనా వేశారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన హిమాలయాల్లో అభివృద్ధి పేరుతో మానవ కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఈ కారణంగా నష్టం ఎక్కువగా జరుగుతున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. హిమాలయాల్లో భారీ నిర్మాణాలు ఆపాలని గ్రీన్‌పీస్ ఇండియా సంస్థకు చెందిన పర్యావరణవేత్త అవినాశ్ చంచల్ అన్నారు. పర్యావరణపరంగా మనం వెనక్కు తిరిగిరాలేని స్థితికి వెళ్తున్నామన్న ఆందోళన వ్యక్తం చేస్తూ అంజల్ ప్రకాశ్ ఆ పర్యావరణానికి నష్టం కలగకుండా హిమాలయాల్లో నిఘా పెంచాలన్నారు.
ముగింపు :
ఇటీవలి సంవత్సరాల్లో హిమాలయ ప్రాంతంలో అనేక తీవ్రమైన విపత్తులు సంభవించాయి. వాటిలో వేలాది మంది కార్మికులు మరణించారు. వీటిలో ఎక్కువ భాగం జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం జరిగే సందర్భంలో లేక అయిపోయిన తర్వాత కూడా జరిగినవి. కార్మికులు పనిచేసే, నివసించే పరిస్థితులు అత్యంత ప్రమాదకరమైనవి కావడమే అందుకు కారణం. వాటికి తోడు వాతావరణ మార్పుల వలన చోటు చేసుకున్న విపత్తులు వారి కష్టాలను అధికం చేస్తున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో పొంది ఉన్న ప్రమాదాల దృష్ట్యా, వివిధ కమిటీల రిపోర్టుల, పర్యావరణవేత్తల హెచ్చరికల ఆధారంగా ఇకముందు ఈ ప్రాంతంలో జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్తును అభివృద్ధి చేయాలి. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఖర్చు కూడా చాలా తక్కువే ఉంటుంది. సారాంశంలో ఉత్తరాఖండ్ విపత్తును ప్రకృతి విపత్తు అనేకంటే మానవ కల్పిత విపత్తు అనడమే సబబుగా ఉంటుంది.