ఉగ్ర నరసింహుడు కాళోజీ

కాళోజీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవాడు. గాంధీ అన్నా ఆయన సిద్ధాంతాలన్నా అభిమానం. కానీ దేశంలో సమాజంలో రాజకీయ నాయకుల నక్కజిత్తులు కుట్రలు కుతంత్రాలను చూసి కేవలం గాంధీయిజం వల్ల సమస్య పరిష్కారం కాదని అర్థం చేసుకున్నాడు. అంటే హింసకు ప్రతిహింస తప్పు కాదని నిర్ధారించుకున్నాడు. ఆదర్శంగా తన భజన చేయనందుకు కొడుకును అష్టకష్టాల పాల్జేసిన హిరణ్యకశిపుణ్ణి చంపిన ఉగ్ర నర్సింహుణ్ణి చెప్పుకొచ్చిండు. తనకు కలిసిన ప్రతి వ్యక్తితో ఉగ్రనరసింహుణ్ణి గురించి చెప్పి తీరిండు.

మా తాత కాళోజీ నరసింహుడు
మా నాయన
లక్ష్మీనరసింహ రంగరాయ నామశోభితుండు

ఆయనకు అచ్చంగా నీ కోపమే” అంటాడు కాళోజీ. బహుశా ఆ కోపం ఆ ఉగ్రత వంశపారంపర్యమేమో అందుకే కాళోజీ ప్రతి అన్యాయాన్ని గమనించిండు, స్పందించిడు. పరిష్కారానికై తపించడం. ప్రహ్లాదుని రక్షింపవచ్చిన నరసింహుడికి….

వేయి యుగంబులు గడిచిన
యపుడు గాని రాకూడని కోపమేదో నీకొచ్చెను
….. దితిపుత్రుని చీల్చి చెండాడిననూ
నీ కోపం పోదయ్యెను ఆనాడు
లక్ష్మీ సైతము తడబడి నీ చెంతకు చేరవెరిచె

అంటూ నరసింహుడి ఆగ్రహాన్ని యాది చేస్తున్నడు. ఆ యాదిలో ఆగ్రహం అవసరమున్నదని నొక్కి చెప్పిండు. ఆ ఉగ్రనరసింహుణ్ణి లక్ష్మీదేవి కూడా చేరవెరచిందట. కానీ ప్రహ్లాదుడు చేరి మ్రొక్క ఆ కోపం పటాపంచలైందట. అతని కోపం పోవటమే కాదు. అతని దగ్గరకు పోవడానికి భయపడ్డ లక్ష్మీదేవి ఏకంగా ఆయన తొడమీద హాయిగా కూర్చున్నదట. అంతవరకు బాగానే ఉన్నది. కానీ నరసింహుని కోపం చల్లారడం వల్ల ‘మా కొంపలు ఆరెను’ అంటాడు. ఎందుకంటే ప్రహ్లాదుని లక్షణాలు లేనివారు నరసింహుణ్ణి కీర్తిస్తూ లబ్ది పొందుతూ తాపత్రయపడుతున్నారని ఆ ప్రహ్లాదులు మాత్రం అంటే ‘ఈనాటి దితి పుత్రులు అతి చతురులు’ అంటూ వాళ్ళు –

నీ నామసంకీర్తన చేయుటకు వెనుకాడరు
నీ ఉనికిని సవాల్ చేస్తూ తద్దినాన్ని కొరుక్కోరు
ప్రహ్లాదుడు భక్తితోడ పరవశుడై పాడుచుండ
పక్క తాళమేస్తారు, నిన్ను నమ్మిస్తారు’
అంటూ

‘మా కొంపలు ఆరటంలో అంతరార్థాన్ని విడమరిచి చెప్తాడు. అన్యాయాన్ని అంతమొందించే ఆ రూపం – మటుమాయమైనందుకు తపిస్తాడు. మళ్ళీ ఆ రూపం దాల్చి వస్తే-

– ఈనాడు
నరవృక నరజంబుకాల
సమూహాల ముఠా బంది బలగాల
బానిసలై అమాయకులు పడుచుండిన
అగచాట్లు కనపడేనని”
ఆవేదన చెందుతాడు.

న్యాయంగా నరసింహుడు ఉగ్రనరసింహుడై దుర్మార్గుణ్ణి అంతమొందించిండు. ఆ నరుడి తల సింహం కాగా నరసింహుడైనాడు. కానీ ఈ రోజుల్లో సింహాలు బోనుల్లో బంధించబడి వేటను, కోపాన్ని మరిచిపోయి సర్కసు వాళ్ళిచ్చే చెత్త తిండి తింటున్నాయని ‘సర్కసులో కుక్కలట్లు తోక ముడిచి ఉన్నవని ఆక్రోశిస్తాడు. ఆ ఆక్రోశంలో అవతార పురుషుడు.

నరసింహుడే కాదు ప్రశ్నించే గొంతుకల స్థితిగతులను యాజేస్తున్నడు. అవి తిరగబడాల్సిన అవసరమున్నదనీ చెప్తున్నడు. సాధారణ జనానికి భగవంతుడు ఆపదలో ఆదుకుంటాడనే నమ్మకం. అదుకే కనపడ్డ ప్రతి రాయికీ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం నీవేమో బండబారిపడియున్నావు.
కానీ జనం ఉగ్రరూపాన్ని కోల్పోయి…

“నిన్నే ఆ దొరవనుకొని
చేరివచ్చి ముడుపుకట్టి ‘కావు కావు’ మనుచున్నది
బావురుమని నోరు తెరిచి బోరు బోరున ఏడుస్తున్నది.
గుండె పగిలిపోవునట్లు బండ కరిగి పోవునట్లు
కరుణించి పారునట్లు కరుడు గట్టుకొని పోయిన
నరసింహుడ నీవేమొ అరయకుండ ఉన్నావు”
అంటూ కుములిపోతాడు.

జనం బాధలను ఈడేర్చక దుర్మార్గాలు రాను రాను పెచ్చరిల్లటం కారణంగానే హేతువాదులంతా దేవుడు లేడని నాస్తిక మార్గం పట్టారంటూ-

‘గోరా సురమౌళులు నిను లేవు లేవు అనుచుండిరి’ అంటూ నాస్తికులు మార్గం ముందుకు రావడానికి భగవంతుని స్పందన లేకపోవడమే కారణమని తేల్చి చెప్తాడు.

కాళోజీ తపన ‘యాదగిరి యాది’ కవితకే ముగింపు పెట్టలేదు. చాలా కవితల్లో దుర్మార్గాన్ని అంతమొందించుటకు ప్రజలు తిరగబడాల్సిన అవసరమున్నదని గుర్తు చేసిండు.

తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో ఒక బ్రాహ్మడి భూమిని కౌలు చేసుకుంటున్న ఐలమ్మ భూమిపై విసునూరి రాంచంద్రారెడ్డి కన్నేసి కబ్జా చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిండు. రౌడీ మూకలతో ఆమె పండించుకొన్న పంటను ధ్వంసం చేయించిండు. ఐలమ్మ సంఘనాయకుల సహకారంతో పంటను ఇంటికి చేర్చుకొంది. ఈ విషయంగా ఐలమ్మకు అండగా ఉండాలని ఐలమ్మతో పాటు జనగామ వస్తున్న లక్ష్మీనరసింహారెడ్డి (ఆరుట్ల)ని విపరీతంగా గాయపరిచిత్రు. ఆయన బండని విరుగగొట్టి బురదలో వేసి తొక్కిన్రు. ఆ విషయాల యాదిలో –

“హింస పాపమని ఎంచు దేశమున
హిట్లరత్వమింకెన్నాళ్ళు
పగటి దోపిడీదారులనాపగ లేని
ప్రభుత్వముండే దెన్నాళ్ళు”
అంటూ వాపోయాడు.

హిట్లర్ నియంతనే కాదు క్రూరుడు కూడా. తెలంగాణలో దొంతరలవారి భూస్వామ్య వ్యవస్థ పగడ్బందీగా అమలౌతున్నా, పెత్తందారీలు పైకి న్యాయాన్నే అఘోరిస్తూనే ప్రజలను పీల్చిపిప్పి చేసిన్రు. వాళ్ళ హిట్లరత్వంతో కానసాగే ప్రభుత్వం ఇంకెన్నాళ్ళుంటుదని, ఆ వ్యవస్థ నుండి ప్రజలకు మోక్షం దొరకాలని ఆరాటపడ్డాడు కాళోజీ.

ఆకునూరు మాచిరెడ్డిపల్లెల్లో అత్యాచారాలు 1948లో ప్రజాద్రోహులైన రజాకార్లు బైరాన్‌పల్లి గ్రామం ప్రజలపై మూకుమ్మడి దాడి జరిపినప్పుడు గుల్బర్గా జైల్లో ఉన్న కాళోజీ ఎంతో ఆవేదన చెంది –

“మన కొంపలార్చిన మన స్త్రీల చెరిచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరిచి పోకుండగ గురుతుంచుకోవాలె
తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె
కొంగులాగిన వ్రేళ్ళ కొలిమిలో పెట్టాలె
కన్నుగీటిన కళ్ళ కారాలు చల్లాలే
తన్నినా కాళ్ళనుడాకలిగ వాడాలె
కండకండగ చేసి కాకులకు వేయాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”
అంటూ ఉక్రోశాన్ని వెళ్ళగక్కిండు.

ఆ ఉక్రోషం ఆ కసి ఏదో నామమాత్రమైనది కాదు. ప్రతీకార చర్యగా నాలుక్కి నాలుక, వేళ్ళకు వ్రేళ్ళు, కాళ్ళకు కాళ్ళు అన్న ధోరణితో చెప్పడంతో కాళోజీ ప్రతి హింసను మనం అర్థం చేసుకోవచ్చు.

1949లో స్వాతంత్ర్యం వచ్చినా సంఘం చేసిన సాయుధపోరాటం కారణంగా సర్దార్ పటేల్ నిజాంతో గతంలో చేసుకొన్న యథాతథపు ఒడంబడికను బేఖాతరు చేస్తూ పారామిలటరీ బలగాల కారణంగా నిజాం లొంగిపోవడం, సంఘం 1951 వరకూ చేసిన పోరాటాన్ని ఆపి ఆయుధాలను కింద పెట్టి 1952లో ఎన్నికలు 1956లో భాషాపర రాష్ట్రాలు ఏర్పడటం వంటివి జరిగిపోయాయి. కానీ ఓ పదేండ్లలో నాయకుల జిమ్మిక్కులతో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందని కాళోజీ ఆవేదన చెందాడు.

స్వాతంత్ర్యం వచ్చిన మాట వాస్తవమే. ప్రజాస్వామ్య దేశమన్నది అంతకన్నా వాస్తవం. కానీ అదే ప్రజాస్వామ్యంలో జనం చైతన్యవిహీనులై, గుండాలే ఎన్నికల్ని తమ కబంధహస్తాల్లో చిక్కించుకోవడం జనం జవాల్ని నీరు కార్చడం భరించలేకపోయారు ఆయన. ఆ విధంగా రాజ్యం అన్యాయమార్గంగా ఉండటానికి నీలం సంజీవరెడ్డి, కామరాజు మొదలైన వారంతా కారణమంటూ –

“గుండె పగిలిపోతుంటే
కడుపు మండిపోతుంటే
కండ కరిగిపోతుంటె
ఎముక విరిగిపోతుంటే
బ్రతుకు చితికిపోతుంటె
గుండా లీడరౌతుంటె
జెండా దిగజారుతుంటె
జనము జడమౌతుంటె
ఎన్నిక ఇగిలిస్తుంటే
శాంతి శాంతట శాంతి”

జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించకుండా దుర్మార్గుల దమనకాండను సహించటం సరికాదని వేదాంత ధోరణులలో పీడితులకు శాంతి ప్రబోధించటం ఏ మాత్రం తగదని తిరగబడటం తప్పనిసరి అంటాడు కాళన్న. స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవాలన్న తపనతో ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనల్ని అక్షరాల్లో ఉంచి ప్రజా సమూహాన్ని మేల్కొల్పుటకై ప్రయత్నించిండు. అదే భావంతో-

‘నలభై ఏడులో వచ్చింది
అరవై ఏడులా వూడేట్టుంది
ఈనాడు పులుల మొగాలపై లేళ్ళ తోళ్ళు
ఈనాడు హంతకులె కాపలాదార్లు’
అంటాడు కాళోజీ.

స్వాతంత్ర్యం మళ్ళీ పోతుందన్న బాధను వ్యక్తం చేస్తూ అట్లా స్వాతంత్ర్యం మాయం కావడానికి క్రూరాత్ములైన నాయకులు అమాయకంగా సాధుస్వభావంతో తేళ్ళలా నటిస్తూ ప్రజలను కడగండ్ల పాలు చేస్తున్నారని వాపోతున్నాడు. అయితే చేతులు ముడుచుకొని వాపోవడం వరకే సరిపెట్టుకోవడం సరియైంది కాదని అందుకు

“మళ్ళీ అనలేదనకండి
కాళోజీ మాట వినండి
మళ్ళీ దూరంగా లేవండి
మళ్ళీ ఒక ఉప్పెనలా దూకండి
మళ్ళీ ఒక తిరుగుబాటు చేయండి”
అంటూ మేల్కొల్పుతాడు. ‘మళ్ళీ విప్లవం రావాలె’ అనే కవితలో. మళ్ళీ అని అనడంలో స్వాతంత్రోద్యమాన్ని గుర్తు చేస్తున్నాడు.

బి.జె.పి. అధికారంలోకి వచ్చినంక ఒకే దేశం, ఒకే జాతి అన్న స్లోగన్ కు చాలా ప్రచారమొచ్చింది. వచ్చింది అనడం కన్నా తీసుకువచ్చారని చెప్పాలె. భారతదేశం హిందూదేశమని, ప్రజలంతా హిందువులనే ప్రచారం ముమ్మరమైంది. అటే హిందూ మతేతరుల పట్ల ఓ విముఖతను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ సిద్ధాంం 1968లోనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగిపోయిన్రు. అందువల్ల ప్రతిఘటనతో విప్లవపంథాలో నడవాల్సిన అవసరమున్నట్లు నిర్ణయానికి వచ్చిరు. ఆ సందర్భంగానే –

“తల వూడినను నేను – తలను తాకట్టుపెట్ట
మెడకురిబడినను – గళమును తాకట్టుపెట్ట
నా చేతులు నరికినను – నా కలమును తాకట్టుపెట్ట”
అని అనగల మనుషులదే బ్రతుకని నిర్ధారిస్తూ-

దోపిడీ దౌర్జన్యానికి కారకులగు
వరిష్టుల దొంగల ముఠాల
రక్షించెడి అధినేతల
అసహ్యించి కసి దూసి
గుంపు కూరెకచ ధీమాతో

కలచినట్టి మనిషి బ్రతుకు తిరుగుబాటుండెడు కాళోజీ. అందుకే తిరగడబడమంటే తప్పా? అని ప్రశ్నిస్తూ, సమాజంలో అంతా అవినీతి అన్యాయాలే రాజ్యమేలుతున్నాయని గుర్తు తెస్తూ –

దోపిడీ వర్గాల నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు
బ్లాకు మార్కెటు దారుల నల్లబజారు కుబేరుల
నువ్వు ఉరితీయలేనపుడు
ప్రజానీకాన్ని కసిదీర్చుకొమ్మనడం తప్పా?
కలితీగత్తర పిశాచాల నువ్వు చితపలేనప్పుడు
కూలీ లేని సుత్తెల ఆ పని కాస్తా చెయ్యమనవడం తప్పా?
అంటాడు.

అంటే అన్యాయాన్ని అంతరింపచేసే క్రమంలో తిరుగుబాటు తప్పు కాదని చెప్పడానికి –

‘హిరణ్యకశ్యపుని పొట్టచీల్చి
నరసింహుడు చేసిందే ప్రతి హింస’
అంటూ జ్ఞాపకం చేసి –

‘నువ్వు చేస్తున్నది
హిరణ్యకశ్యపుని అధికృత హింస
నాది అక్షరాధికారం’
అంటూ హెచ్చరిస్తాడు.

అన్యాయాలను సింహావలోకనం చేసుకుంటూ ఇదే ధోరణితో ఏకంగా రాష్ట్రపతినే –

అది చేస్తా నిది చేస్తానని
ఓట్లను పొంది గెలిచి
ఇప్పుడేమి లేదంటే
చెప్పుతో కొట్టాల్నా వద్దా!
అంటాడు. కాళోజీకి బేషజాలు లేవు. ప్రధానమంత్రి, దేశ ప్రధాన పౌరుడో పనిచేసే జీతగాడో ఎవ్వరైనా ప్రశ్నించటంలో నిలదీయటంలో తేడాల్లేవు. ప్రశ్నించదలచుకున్నది చెప్పదలచుకున్నది అవసరమైతే ఆయనకు మొహమాటాల్లేవు. ఎదుటివాడు ఏమనుకుంటాడో అన్న భేషజాల్లేవు. అందుకే కదా! “చెప్పుతో కొట్టాల్నా వద్దా! ప్రాణం తియ్యాల్నా వద్దా” అన్న పదాలు.

పైన చెప్పినట్లు పక్కనున్నోడి అన్యాయాన్ని ప్రశ్నించినట్లే ప్రధానమంత్రినైనా ప్రశ్నిస్తాడు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి “పొదుపు చేయండి” అన్న నినాదం ఇస్తే కాళోజీ ఒళ్ళు మండిపోయింది ఒకవైపు అన్యాయంతో ఉన్నోడు బలుస్తుంటే, లేనోడు లేని పరిస్థితుల్లో ఈ పొదుపు నినాదం ఆయనను ఉగ్ర నరసింహుణ్ణి చేసింది. అందుకే –

“ఓయీ భారత ప్రధాని
కొవ్వు బలిసినోరికి చెప్పు
నెయ్యి మానెయ్యమని
ధనం దాచినోనికి చెప్పు
పాతర్లు తియ్యమని”
“ముప్పూట మెక్కే బొర్రలకు చెప్పు – పస్తుండమని
మిన్నంటిన ధర దారులకు చెప్పు – మన్నంట దిగమని
జల్సారాయుళ్ళకు చెప్పు – రమ్మీ విస్కీలు మానమని”
అంటూ హెచ్చరించిడు.

ఇట్లా అనేక విషయాలకు స్పందిస్తూ –

“అన్యాయాన్నెదిరిస్తే
నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తె
నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు
నాకు ఆరాధ్యుడు”
అంటూ చివరి శ్వాస వరకూ తన మనోభావాలను కొనసాగించినోడు కాళోజీ. ఏమైనా ఇటీవల ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశత్వం కొనసాగుతున్నది. మానవత్వం నశించింది. దుర్మార్గులకే చెల్లుచీటి అవుతున్నది. ఇట్టి కాలంలో కాళోజీ వంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది.

ఆయన జయ ప్రకాశ్ నారాయణ నుద్దేశించి –

“పుటుక నీది
చావు నీది
బతుకంతా దేశానిది”
అనుకునే నాయకుల అవసరం దేశానికున్నది.

అనంత ప‌ద్మ‌నాభ(డిగ్రీ) క‌ళాశాల‌లో తెలుగు అధ్యాప‌కురాలిగా 34ఏళ్ల అనుభ‌వం. ప్రిన్సిప‌ల్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. 'తెలంగాణ విమోచ‌నోద్య‌మ న‌వ‌ల‌ల్లో స్త్రీచైత‌న్యం'పై ప‌రిశోధ‌న‌. ఇటీవ‌ల 'బ‌తుక‌మ్మ పాట‌ల్లో స్త్రీల మ‌నోభావాలు - పాట‌ల ప‌రిణామ క్ర‌మం' పుస్త‌కం ప్ర‌చురించారు. ప‌లు సంక‌ల‌నాల్లో వ్యాసాలు, క‌విత‌లు, క‌థ‌లు ప్ర‌చురిత‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' తెలంగాణ శాఖ అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply