ఇవి జనం కథలు

ఎవరి చమట చుక్కల వలన ఈ సమాజం కొనసాగుతుందో, ఎవడు లోకానికి పట్టెడు అన్నం పెట్టి తాను మాత్రం ఆకలి చావు చస్తున్నాడో అదిగో అటువంటి అట్టడుగు జనం కథలు ఇవి.

సమస్త సంపదలను సృష్టించేది శ్రమజీవులే. ఈ తలక్రిందుల సమాజాన్ని చక్కదిద్దేది, దోపిడి పీడనలు లేని, నూతన సమాజాన్ని సృష్టించేది వాళ్ళే. అదిగో అటువంటి జనం బాధలను గాధలను వాళ్ళకు జరిగే అన్యాయాలను, దోపిడి అణచివేతలను, ప్రజలు చేసే  పోరాటాలను, త్యాగాలను రచయిత ఒడిసిపట్టి మనముందు ఉంచుతాడు.

చందు రాసిన ఏ కథలు ఉబుసుపోక రాసినవి కావు. కాలక్షేపం కోసం చదివే కథలు అంతకన్నా కావు. జనం పట్ల ప్రేమ, వాళ్ళ పోరాటాల పట్ల సంఫీుభావం ఉన్నప్పుడే ఈ కథలు మనకు అర్థం అవుతాయి. చంద్‌ రచనల్లో ఎటువంటి మోహమాటాలుండవు. శిల్పం వెనుకో, ప్రయోగాల వెనుకో దాక్కోవటం ఉండదు. నగిషీలుండవు. సూటిగా నగ్నంగా సత్యాన్ని బహిర్గతం చేస్తాడు. వాస్తవ సంఘటనలు కథల రూపంలో దర్శనమిస్తాయి.

 పి. చంద్‌ అసలు పేరు వూరుగొండ యాదగిరి. ఆయన వరంగల్‌ పట్టణంలోని ‘ఉర్సు’ ప్రాంతంలో పుట్టాడు. తండ్రి మల్లయ్య, ఆజంజాహి మిల్లు కార్మికుడు. తల్లి వీరమ్మ బీడి కార్మికురాలు. వారి ఐదుగురు సంతానంలో మధ్యవాడు. ఆయనకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. వారు నివసించే ఉర్సు ప్రాంతంలో కార్మికులు, హమాలీలు, రిక్షా కార్మికులు, దుకాణాల్లో గుమస్తాలుగా పనిచేసేవాళ్ళు, కూలీనాలి చేసేవాళ్ళు, వలస వచ్చిన వాళ్ళు నివసించేవాళ్ళు. 

 కార్మిక కుటుంబంలో పుట్టి కష్టజీవుల మధ్య గడిపాడు. వాళ్ళ కష్టాలు సుఖాలు చూసాడు. అనుభవించాడు. దాంతో ఆయనకు కష్టజీవుల పట్ల ప్రేమ, వాళ్ళపై జరిగే దోపిడి అణచివేతల పట్ల ద్వేషం ఏర్పడిరది. నిరంతరం అధ్యయనం చేసే అలవాటు అతనిలో ఆలోచనలను వికసింపచేసి ఉద్యమాల పట్ల ఆకర్షించింది. స్కూల్‌ చదువుల్లో ఉన్నప్పుడే అప్పటి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. వరంగల్‌లోని లాల్‌బహదూర్‌ కళాశాలలో డిగ్రీ చేస్తున్న క్రమంలోనే అప్పుడే మొగ్గతొడిగిన విప్లవ విద్యార్థి ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. ఎమర్జెన్సీలో అరెస్టయి రెండు నెలలు లాకప్‌లో చిత్రహింసల అనంతరం డిఫెన్స్‌ ఇండియన్‌ రూల్స్‌ (డిఐఆర్‌) కింద జైలుకు వెళ్ళాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత కేసులు కొట్టుడుపోయినవి. 

1977 మేలో సింగరేణిలో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది. చందు కార్మిక కుటుంబంలో పుట్టి పెరిగి, ఉద్యోగ రీత్యా బొగ్గుగని కార్మికుల మధ్య బతికిండు. 

ఆయన ఉద్యోగంలో చేరేనాటికి సింగరేణిలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. నిజాం కాలం నాటి ఫ్యూడల్‌ దొరతనాన్ని మరిపించే బాయి దొరల పెత్తనం. కార్మికులకు సేవ చేయాల్సిన కార్మిక సంఘాలు పక్తు పైరవీకారులుగా మారిపోవటం. బొగ్గుబాయిలో దుర్భర పని పరిస్థితులు. తమ లాభాల కోసం కార్మికుల మూల్గుల్ని పీల్చే మేనేజుమెంటు వారికి కనీస సౌకర్యాలు కల్గించలేదు. మ్యాగిజిన్‌ అట్టపెట్టెలు, తడకలతో అల్లుకున్న గుడిసెల్లో నీళ్ళు, కరెంటులేని మురికి కూపాలే వారి నివాసం. కార్మికుల పిల్లలు చదువుకోవటానికి స్కూళ్ళు ఉండేవి కావు. రోగాలు వస్తే కంపిని దావఖానలో మందులుండేవి కావు. వాడవాడకు ప్రభుత్వం ఉదారంగా ఏర్పాటు చేసిన సారా కొట్లు, బ్రాంది షాపులు వాళ్ళ ఇల్లు, వొళ్ళు గుల్ల చేసేవి. దీనికి తోడు కాలరీ ప్రాంతంలో పెచ్చరిల్లిన గుండాయిజానికి స్త్రీలు వీధుల్లోకి రావాలంటే భయపడేవాళ్ళు. ఈ దుర్భర పరిస్థితులే తరువాత కాలంలో సింగరేణిలో ఒక విప్లవ వెల్లువను సృష్టించింది.

భయం భయంగా బతికే కార్మికులను రాడికల్స్‌ బాయి బాయికి గుడిసె గుడిసెకు తిరిగి వారిని చైతన్య పరచి కణకణ మండే అగ్నికణాలను చేసిండ్లు. ఫలితంగా తమపై జరిగే అన్నిరకాల అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించేలా చేసింది. కాలరీ ప్రాంతంలో గుండాయిజాన్ని అంతం చేశారు. కార్మికుల మూల్గుల్ని  పీల్చే సారా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. బావిలో రక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం సమ్మెలు చేశారు. కార్మికుల సమ్మెలను అణచటానికి మేనేజుమెంటు మస్టర్లకోత చట్టం అమలు చేసింది. దీనికి వ్యతిరేకంగా యాభైఆరు రోజులు సుదీర్ఘ సమ్మె చేసి తిప్పికొట్టారు. ఆ సమ్మె కాలంలోనే విప్లవ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య ఆవిర్భవించింది. ఆ తరువాత కాలంలో ‘సికాస’ నాయకత్వంలో అనేక చారిత్రాత్మకమైన పోరాటాలు జరిగాయి. జాతీయ సమస్య అయిన వేజుబోర్డులు సాధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే  తలకిందులుగా నడుస్తున్న సమాజాన్ని సికాస నాయకత్వంలో కార్మికులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే ఈ పోరాటాలు ఏవీ సాఫీగా జరుగలేదు. దాదాపు వందమంది మెరికల్లాంటి పోరాటయోధులు ప్రభుత్వ ఫాసిస్టు హత్యాకాండకు బూటకపు ఎన్‌కౌంటర్లలో బలైనారు. వారు చిందించిన నులివెచ్చని రక్తంతో భారత కార్మికోద్యమంలో నూతన చరిత్ర సృష్టించారు.

కాలరీ ప్రాంతంలో తన కండ్లముందు జరుగుతున్న పరిణామాలను బయటి ప్రపంచానికి తెలియచెప్పాలనే తాపత్రయం చంద్‌ని రచయితను చేసింది. నిజాలను నిర్భయంగా తెలియచేస్తే అటు తాను పనిచేస్తున్న కంపెని కక్ష సాధింపు చర్యలు. మరోవైపు దుర్మార్గమైన దోపిడీ వ్యవస్థ ఎలా వెంటాడి అంతం చేస్తుందో తెలిసిన వ్యక్తి. ప్రజలపై జరిగే దోపిడీ పీడనలు చూసి ఆగ్రహం, ప్రజలు జరిపే పోరాటాలపై సంఫీుభావం ఆయన్ని రాయకుండా ఉండలేని పరిస్థితికి నెట్టింది. ఆ రోజుల్లోనే మొగ్గ తొడుగుతున్న విప్లవ కార్మికోద్యమం గురించి రాయటమన్న, ప్రజాపోరాటాల మీద రాయటమన్న చావును కొనితెచ్చుకోవటమే. తన బలం తెలుసు. బలహీనత తెలుసు. అందుకే ఆయన ప్రజాపోరాటాల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూనే తన రచనలు కొనసాగించాడు. అదే సమయంలో శత్రువు కంట పడకుండా ఉండటానికి రచయితగా అజ్ఞాతవాసం చేశారు. అనేకమారు పేర్లతో తను రచనలు చేశారు.

నాకు తెలిసినంతవరకు పి.చంద్‌ (పి.చంద్‌ కూడా మారు పేరే) కార్మిక, కె. రమాదేవి, ఎ.వెంకటేశ్వర్లు, వినిల్‌ చైతన్య, వి. వీరమల్లు, ఉదయగిరి, శ్రామిక, వి. హరి తదితర పేర్లతోనే కాకుండా స్థానిక పత్రికల్లో ‘లేబరోని గోడు’ ‘తట్టా చమ్మస్‌’ ‘తుపాకి రామన్న కథలు’ శీర్షికలు నిర్వహించాడు. స్థానిక జర్నలిస్టులకు వందలాది వ్యాసాలు రాసి ఇచ్చాడు.

సింగరేణిలో సింగరేణి కార్మిక సమాఖ్య ఆవిర్భావానికి కారణమైన మస్టర్ల కోత చట్టపు సమ్మె ఎలా మొదలైందో చిత్రించే ‘మస్టర్లకోత చట్టం సమ్మె’ కథను 1981 లో మొట్టమొదటిసారిగా ఆయన ‘కార్మిక’ కలం పేరుతో ‘సృజన’ పత్రికలో అచ్చవటంతో ఆయన సాహిత్య ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ‘కార్మిక’  కలం పేరుతో మరికొందరు  రచయితలు కథలు రాసినా, ‘కార్మిక’ పేరు మీద వచ్చిన కథల్లో సింహభాగం చంద్‌ రాసినవే.

 చంద్‌ ఇంతవరకు దాదాపు వందకు పైచిలుకు కథలు రాసారు అందులో ఎక్కువ భాగం సింగరేణి కార్మికుల మీదే ఉన్నాయి. ఆయన దాదాపు పాతిక నవలలు రాసారు.

తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సింగరేణిలో తొలి కార్మిక సంఘం ఎలా ఆవిర్భవించిందో తెలియ చేసే నవల ‘శేషగిరి’. విప్లవ కార్మికోద్యమ నిర్మాణంలో తొలి మహిళా అమరురాలు జిలానక్క త్యాగాన్ని చెప్పే ‘నెత్తుటిధార’ నవల. సింగరేణి విప్లవ కార్మికోద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన నల్ల ఆదిరెడ్డి జీవితం ఆధారంగా రాసిన ‘విప్లవాగ్ని’. పోలీసుల కాల్పుల్లో అమరుడైన ఏఐఎఫ్‌టియు నాయకుడు శ్రీదరి రాయమల్లు మీద ‘శ్రామిక యోధుడు’, సింగరేణిలో అమలైన రాజ్యహింసను తెలియజేస్తూ బాలగోపాల్‌ జీవితం గురించి ‘హక్కుల యోధుడు’. జిడికే 8 ఎ ప్రమాదంలో ఒకేసారి పదిమంది కార్మికులు చనిపోగా బాధిత కుటుంబాల దుఃఖాన్ని ‘ఒక కన్నీరు’ నవలికగా. మాజీ కేంద్రమంత్రి కాంగ్రెసు నాయకుడు జి. వెంకటస్వామి జీవితాన్ని ‘మేరా సఫర్‌’. ప్రముఖ బహుజన నాయకుడు మూడుతరాల ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జీవితాన్ని ‘ధిక్కార కెరటం’గా రచించారు. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని చిత్రించిన ‘తెలంగాణ తల్లి’, ‘సకలజనుల సమ్మె’ నవలలు రచించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు బండ్రు నర్సింహులు జీవితాన్ని ‘బండ్రు నర్సింహులు’, భూ నిర్వాసితుల బాధలను చెప్పే ‘భూదేవి’, ‘మావూరి కథ’. గుట్టల విధ్వంసాన్ని చెప్పే ‘దేవుని గుట్ట’ నవల. విప్లవోద్యమాన్ని చిత్రిక పట్టిన ‘నల్లమల’, ‘శృతి’, ‘బొగ్గులు’ ‘స్ట్రయిక్‌’, ‘దళం’, ‘జీవితకథ’, కె.యల్‌ మహేంద్ర జీవితాన్ని ‘అంతర్జాతీయ శ్రామికయోధుడు’, ప్రముఖ కవి మల్లావరaుల సదాశివుని గురించి ‘తలాపున పారే గోదావరి’ నవలగా సృజించారు. కూలీ జనం జీవితాల మీద ‘కూలీ బతుకులు’ స్త్రీలపై జరుగుతున్న వ్యవస్థీకృత దుర్మార్గాన్ని ‘నేరమే అధికారమైతే’,  ‘అరాచకవాది’ నవలలుగా వచ్చాయి. ఇందులో కొన్ని నవలలు ఇంకా ప్రచురించాల్సి ఉంది. కట్లమల్లేశ్‌ మీద రాసిన ‘విజయ్‌’ నవల, గజ్జెల గంగారం ఉద్యమ గురించి రాసిన పుస్తకం, సారా పోరు మీద రాసిన నవలలు రాజ్యం నిర్బంధం కారణంగా సరిగ్గా భద్రపరచలేకపోవటం వలన పోయినవి. 

కార్మికవర్గ సాహిత్య సృష్టిలో చంద్‌ ఒక మహోన్నత శిఖరం అంటాడు ప్రముఖ రచయిత బి.యస్‌. రాములు. ఇప్పటివరకు ఆయన సింగరేణి కార్మికుల మీద పది నవలలు రాసారు. ఆయన ఎక్కువగా చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రను నవలలుగా రాసారు. ఆయా వ్యక్తుల జీవితంతో పాటు ఆనాటి సమాజం, ఉద్యమాల నేపథ్యం, వాటి తీరుతెన్నులు, ప్రభావాలు కలగలసి ఉంటాయి. మరోమాటలో చెప్పాలంటే సామాజిక చరిత్ర పరిణామాలు సాహిత్య రూపంలో ఉంటాయి. అందుకే ఆయన రచనలు చారిత్రక అంశాలు కల్గిన ఐతిహాసిక రచనలుగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాలం గడిచిన కొలది కాలనాళికల్లా ఉపయోగపడే రచనలుగా చిరస్థాయిగా నిలిచి ఉంటవి.

చంద్‌ కథలు, నవలలే కాకుండా అనేక వ్యాసాలు, వ్యాస సంపుటాలు ప్రచురించారు. నిర్బంధం మూలంగా అవి అన్నీ కూడా వివిధ సంస్థల పేరు మీద, వ్యక్తుల పేరు మీద ప్రచురింపబడ్డాయి.

సికాస తన మొదటి మహాసభల (1981) సందర్భంగా, అప్పటి వరకు జరిగిన కార్మికుల పోరాటాలను తెలియచేస్తూ ‘సింగరేణిలో రగిలిన పోరాటాలు వర్ధిల్లాలి’ అనే పుస్తకం రాశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సింగరేణిలో వనరుల దోపిడీ ఎలా కొనసాగిందో తెలిపే ‘సింగరేణి వ్యాసాలు’, ‘సింగరేణి తెలంగాణ వ్యాసాలు’ పుస్తకాలు వచ్చినవి.

 వేజ్‌బోర్డుల పేరు మీద జరిగే మోసాలను తెలియచేస్తూ ‘బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాలు ` ఒక పరిశీలన’ అనే పుస్తకం వచ్చింది. కంపెనీ నష్టాల్లో ఉంది కంపెనీని మూసేస్తారంటూ మేనేజుమెంటు ఆరంభించిన మానసిక యుద్ధాన్ని పూర్వపక్షం చేస్తూ ‘సింగరేణి ` వాస్తవ పరిస్థితి నివేదిక’ అనే పుస్తకం రాసారు. ఈ పుస్తకాన్ని  హక్కుల నాయకుడు బాలగోపాల్‌ ప్రచురించి తానే సభలు, సమావేశాల్లో అమ్మకాలు చేశాడు.

నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత సింగరేణిలో సంస్కరణల పేర ప్రయివేటీకరణ, కాంట్రాక్టీకరణతో కార్మికులను పెద్దసంఖ్యలో తొలగించింది. వందేండ్ల పైబడి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా మనుగడ సాగించిన సింగరేణిని ఎలా నిర్వీర్యపరిచారో ఒక కేసు స్టడీలా సాగిన ‘సింగరేణి సంస్కరణలు ` ఒక పరిశీలన’  రచన సోకాల్డు సంస్కరణల బండారాన్ని బయటపెట్టింది. ఈ పుస్తకం ప్రచురణ జరిగినప్పుడు మేనేజుమెంటు ఏమీ చెయ్యలేక, పుస్తకం జనంలోకి పోకుండా పెద్దసంఖ్యలో పుస్తకాలు కొని తగులబెట్టింది.

సంస్కరణల నేపథ్యంలో కార్మికులను మరింత అణచివేతకు గురిచేసే విధంగా తెచ్చిన ‘నూతన స్టాడిరగ్‌ ఆర్డర్స్‌ ` ఒక పరిశీలన’ పుస్తకంలో బట్టబయలు చేసాడు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన కోల్‌ ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ జనంలోకి తీసుకెళ్లింది. మలిదశ ఉద్యమ నేపథ్యంలో సింగరేణిలో ‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం’ ఆవిర్భవించింది. పాతుకపోయిన జాతీయ కార్మిక సంఘాలను ఓడిరచి గుర్తింపు సంఘంగా నెగ్గిన సందర్భంగా దాని ‘పదేండ్ల ఉద్యమ ప్రస్థానం’ పుస్తకం వచ్చింది. శ్రీక్రష్ణ కమిటీకి టిబిజికేయస్‌ సమర్పించిన సుదీర్ఘ పత్రాన్ని చంద్‌ రూపొందించారు. ఇవే కాకుండా వివిధ పత్రికలకు నిరంతరం వ్యాసాలు రాసారు. శీర్షికలు నిర్వహించారు. ‘సింగరేణి విప్లవ కార్మికోద్యమ చరిత్ర’ పుస్తకం రాసారు.

చంద్‌ గత నలభైఐదేళ్లుగా ఎలాంటి ఊగిసలాట లేకుండా ప్రజల పక్షం వహించి నిరంతరం రచనలు చేస్తున్నాడు. తన సృజనాత్మక పనులకు సమయం చాలటం లేదని 2009లో తాను చేస్తున్న ఉద్యోగం వదిలేశారు. రచనే వృత్తిగా బతుకుతున్న సృజనశీలి చంద్‌. 

ఈ సందర్భంగా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి కుటుంబ బాధ్యతలు తనపై వేసుకొని చంద్‌ కృషిని ప్రోత్సహించిన శ్రీమతి ‘ఇందిర’ త్యాగాన్ని అభినందించక తప్పదు.

పలు కలం పేర్లతో రాస్తూ అజ్ఞాత రచయితగా ఉన్న చంద్‌ను మొదటిసారిగా ‘భూ నిర్వాసితులు’, ‘గుమ్మన్‌ ఎగ్లాస్‌పూర్‌ గ్రామస్థుడు’ కథల సంపుటాలను ప్రచురించి చంద్‌ను సాహిత్యలోకానికి పరిచయం చేసిన ఘనత ప్రముఖ రచయిత బి.యస్‌. రాములుకే చెందుతుంది. అప్పుడు కాని సాహిత్యలోకానికి ప్రజాఉద్యమాలపై ఇంత విస్తృతంగా రాసిన రచయిత ఒక్కరేనా అని ఆశ్చర్యపోయారు.

చంద్‌ రాసిన ఈ కథలు కేవలం కథలు కావు. కోట్లాది మంది సామాన్య జనం కన్నీటి గాథలు. ఉద్యమించే ప్రజల భవిష్యత్‌ స్వప్నాలు. ఈ కథల్లో జీవితం ఉంది. ప్రజల ఆశలను ఆరాటాలను పోరాటాలను, పాలకవర్గాల అణచివేతను, వాటికి వ్యతిరేకంగా పోరాడే ప్రజల త్యాగాలను ఈ కథలు ఎత్తిపట్టాయి. ఈ కథలు మనకు ప్రజాపోరాటాల పట్ల సానుభూతినే కాదు, వారితో మనం మమేకమయ్యేలా చేస్తాయి.

చంద్‌ కథల్లో ప్రధానంగా సింగరేణి కార్మికులు, భూనిర్వాసితులు, పర్యావరణ సమస్యలు, కూలీ బతుకులు, గిరిజనులు, రాజ్యహింస, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం,  మారుతున్న విలువల వంటి అనేక కోణాలు కన్పిస్తాయి. 

భూమి పొరల్లో వందల అడుగుల లోతున ప్రకృతి విరుద్ధంగా ఊపిరి ఆడని గర్మి స్థలంలో గుక్కెడు గుక్కెడు నీళ్లు తాగుతూ తమ చమట, రక్తాన్ని నీళ్లు చేసుకొని, ప్రాణాలు పణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేసి లోకానికి వెలుగును పంచే బొగ్గుగని కార్మికులు మాత్రం మురికి కూపాల్లాంటి గుడిసెల్లో కనీస అవసరాలకు నోచుకోక చాలీ చాలనీ జీతాలతో దుర్భర జీవితాన్ని గడుపుతారు.

బొగ్గు బాయిలో కార్మికుల నెత్తురు చిమ్మని రోజుండదు. బావిలో ప్రమాదాలు జరిగి మాంసం ముద్దలుగా శవాలు వచ్చినప్పుడు, బాధిత కుటుంబాల రోదనలు, బాధలను ఎలా వర్ణించగలం.

బొగ్గు బావి ప్రమాదాలపై అధ్యయనం చేసిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్‌ సేప్టీవారి (డిజిఎంఎస్‌) తమ నివేదికలో రక్షణ సూత్రాలు సక్రమంగా పాటించేదుంటే నూటికి తొంబై శాతం ప్రమాదాలు నివారించదగినివే అంటూ పేర్కొన్నది. కాని మేనేజుమెంటు ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవటానికి రక్షణ సూత్రాలను తుంగలో తొక్కటం వల్లనే వేలాది మంది కార్మికుల ప్రాణాలు బలైపోతున్నాయి. పని స్థలాల్లో ప్రమాదం పొంచి ఉందని కార్మికులు నెత్తినోరు బాదుకొని మొత్తుకుంటే అదిరించి బెదిరించి పనులు చేయించటం వల్ల, బావుల్లో గ్యాస్‌ వస్తాందంటే ఉల్లిగడ్డల వాసన చూడండని అధికారులు గుడ్లెర్రజేసి బలవంతంగా దించటం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. పొయ్యే ప్రాణాలు మనవి కానప్పుడు, బొగ్గు పెల్ల విలువ చెయ్యని అలగా కార్మిక జనాలవి అయినప్పుడు ఏ అధికారికి మాత్రం భయం ఉంటుంది. ప్రతీ బొగ్గుబాయి ప్రమాదంపై డిజియంయస్‌ వారి మొక్కుబడి విచారణ కొనసాగుతుంది. నూట ముప్పయి సంవత్సరాలపైబడి చరిత్ర కల్గిన సింగరేణిలో ఇప్పటి వరకు వేలాది ప్రమాదాలు జరిగిన అనేక మంది కార్మికులు చనిపోయిండ్లు కానీ ఇంతవరకు వారి విచారణలో ఏ ఒక్క అధికారిని కూడా తప్పు పట్టలేదంటే వారి విచారణలు ఎంత బూటకమో తెలుస్తుంది

అంతెందుకు 2003 లో సింగరేణి చరిత్రలో జరిగిన అతిపెద్ద ప్రమాదాలు రెండు గోదావరిఖని ఏరియాలో జరిగినవి. ఒకటి సెవన్‌ ఎల్‌ఇపి బొగ్గు బాయిలో ప్రమాదం జరిగి పదిహేడు మంది కార్మికులు జలసమాధి అయ్యారు. ఆ ప్రమాదం జరిగిన  నాలుగు నెలలకు జిడికే 8ఎ బొగ్గుబాయిలో పైకప్పు కూలి మరో పదిమంది కార్మికులు చనిపోయారు. సెవన్‌ఎల్‌ఇపి ప్రమాదం బొగ్గు తీయగా ఏర్పడిన ఖాళీలో ఇసుక నింపాల్సిన చోట, ఇసుక నింపే కాంట్రాక్టర్‌తో కుమ్ముకయిన అవినీతి అధికారులు ఇసుక నింపకుండానే నింపినట్టుగా రిపోర్టులు ఇచ్చి డబ్బులు కాజేయటం వలన, ఖాళీ ‘పేస్‌’లో నీరు నిండి ప్రమాదానికి కారణమైంది. జిడికే 8ఎ ప్రమాదంలో కార్మికులు ముందే ప్రమాదాన్ని గుర్తించి మెనేజుమెంటుకు తెలిపారు. ప్రమాదాన్ని నివారించటానికి బదులు బెదిరించి బలవంతంగా పనులు చేయించటం వలన పైకప్పు కూలి పదిమంది కార్మికులు చనిపోయిండ్లు. ఈ ప్రమాదంపై విచారణ చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. ఫలితంగా తప్పనిసరై ప్రభుత్వం ఆ రెండు ప్రమాదాలపై విచారణకు హైకోర్టు న్యాయమూర్తి ‘బిలాల్‌ నక్వి’ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ వేసింది. ఆయన దాదాపు ఏడాది అంతా విచారణ జరిపి తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. రిపోర్టు బయటికి వస్తే వాస్తవాలు తెలుస్తాయని భావించిన ప్రభుత్వం రిపోర్టును తొక్కిపెట్టి బాధ్యులైన అవినీతి అధికారులను కాపాడిరది. మనం ఏదైనా అన్యాయం జరిగితే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరుపాలని డిమాండ్‌ చేస్తాం. కానీ అటువంటి న్యాయమూర్తి ఇచ్చిన రిపోర్టుకే దిక్కుమొక్కు లేకుండా పోతే ఏమనాలి? కార్మికుల ప్రాణాలపట్ల మెనేజుమెంటుకే కాదు, ప్రభుత్వాలకు కూడా ఏ పట్టింపులేదు.

బావి ప్రమాదం జరిగి చనిపోయిన కార్మికుల శవాలు ఒక్కటొకటిగా బయటికి వస్తున్నప్పుడు, కార్మిక నాయకుల, రాజకీయ నాయకుల హడావిడి అంతా ఇంతా కాదు. ప్రమాదంపై న్యాయ విచారణ జరుపాలంటారు. బాధ్యులైన అధికారులకు శిక్షపడే దాక వదిలేది లేదంటారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తూ బోలెడు మొసలి కన్నీరు కారుస్తారు. అటు తరువాత అన్ని మరిచిపోయి మెనేజుమెంటుతో చెట్టాపట్టాలేసుకొని  పైరవీలల్లో మునిగితేలుతారు. ప్రతీ ప్రమాదం సందర్భంగా జరిగే తంతే ఇది. అటు తరువాత అంత ఎప్పటిలాగే అవుతుంది. అందుకే బొగ్గు బావి ప్రమాదాలకు అంతులేకుండా పోతుంది. కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఈ వెతలన్నీ ఈ సంపుటిలో కథలుగా చోటు చేసుకున్నాయి.

బొగ్గుబావి ప్రమాదాలపై ఈ సంపుటిలో నాలుగైదు కథలున్నాయి. ఒక ప్రమాదం కథలో మనసు చెదిరిన మైనింగ్‌ సర్దార్‌ ఒకరు దుఃఖంతో గొంతు పూడుకపోగా చంపేసిండ్లు పీడాత ప్రాణంతీసిండ్లు… అక్కడ ప్రమాదకరంగా ఉందని అధికారులకు చిలక్కి చెప్పినట్టు చెప్పిన కాని లంగ లంజకొడుకులు ఎవ్వరు విన్పించుకోలే.. వాళ్ళకేం పోయింది. వాళ్ళ సుఖాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ బోగాలు వాళ్ళకున్నాయి. లేబరోడు ఎట్లా సచ్చిన వానికేం పోయింది.’ అన్న మాటలు అక్షర సత్యం. బావి ప్రమాదంపై వ్రాసిన కథలన్ని కార్మికుల దుఃఖాన్ని తెలియచేస్తాయి.

ప్రమాదాలేకాదు. ప్రజలపై సాగే హింస అన్ని వేళలా ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. అది సుతిమెత్తగా చాప క్రిందనీరులా ఉండి మన శరీరాలను, మన మెదళ్ళను మొద్దు బారుస్తుంది. మన చేతితోనే ఉరితాళ్లు పేనుకొని, మన మెళ్ళో వేసుకునేలా చేస్తుంది. దేశంలో నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత సంస్కరణ రూపంలో ఈ ప్రమాదం మరింత తీవ్రమైంది.

సింగరేణిలో విప్లవ కార్మిక ఉద్యమం బలంగా ఉండటము వలన సంస్కరణలు అమలు కాస్త ఆలస్యంగా జరిగింది. అప్పటికీ రెండు దశాబ్దాలుగా కార్మికుల్లో పనిచేస్తూ కార్మికుల ప్రీతి పాత్రమైన విప్లవ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్యను నిషేదించి, దాని నాయకులను బూటకపు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపి 1998లో దేశంలో ఎక్కడ ఏ బొగ్గు సంస్థలో లేని విధంగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించింది. అంతవరకు కార్మికులు ఏ జాతీయ సంఘాలనైతే ఛీత్కరించి విప్లవ కార్మిక సంఘం క్రింద సమీకృతులైనారో అటువంటి ‘సికాస’ ను నిషేధించటం వలన ఎన్నికల్లో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గతంలో తాము వ్యతిరేకించిన ఏదో ఒక జాతీయ సంఘంను ఎన్నుకోవలసిన అనివార్యమైన పరిస్థితిని కల్పించింది. ఇట్లా ఎన్నికైన సంఘం కార్మిక సమస్యలు పట్టించుకోకుండా ‘పైరవీ’లల్లో మునిగి తేలుతుంటే మెనేజుమెంటు ఏకపక్షంగా సర్క్‌లర్స్‌ విడుదల చేస్తూ కార్మికుల హక్కులను హరించింది. ఒక వైపు ఉత్పత్తులు ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూ పోయినా, కంపిని నష్టాల్లో ఉంది, బిఐఎఫ్‌ఆర్‌ పరిధిలోకి పోయింది. ఏ క్షణంలోనైనా కంపినిని మూసివేయవచ్చు అంటూ ‘హై`పిచ్‌’ ప్రచార సాధనాలతో కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తూ ‘మానసికదాడి తీవ్రం చేసింది. కంపిని నష్టాలను అధిగమించటానికి ప్రయివేటీకరణ, యాంత్రీకరణ అనివార్యం అంటూ వాటిని వేగవంతం చేసింది వేలాది మంది కార్మికులను మెడికల్‌ అన్‌ఫిట్‌ల పేర, డిస్మిస్‌ల పేర, వాలంటరీ రిటైర్‌మెంటు స్కీంలద్వారా మూడిరట రెండొంతుల మంది కార్మికులను తొలగించింది. వీరి స్థానంలో ఏ హక్కులు లేని, ఏ వసతులు లేని కాంట్రాక్టు కూలీలను తెచ్చింది. ఇదంతా కూడా మారిన ప్రభుత్వ పాలసీల నేపథ్యంలోనే జరిగింది. ఆ ప్రమాదం నేడు మరింత ముంచుకొచ్చింది. పెద్దఎత్తున బొగ్గుగనులను ప్రైవేటు సంస్థల లాభాల కోసం దారాదత్తం చేస్తున్నారు.

వ్యవస్థీకృతమైన ఈ దుర్మార్గం ఎలా అమలు జరిపిందో, కార్మికులను ఎలా కాల్చుకతిందో పొమ్మనలేక పొగపెట్టిందో కనిపించని హింస ఎలా అమలు జరిపిందో తెలియచేసే కథలు ఈ సంపుటిలో ఉన్నాయి.

 మెనేజుమెంటు రకరకాల ఎత్తులతో కార్మికులపై రోజురోజుకు పనిభారం పెంచుతూ ఊపిరి సలుపనివ్వకుండా చేసి, కార్మికులను కొద్దిగ కొద్దిగ చప్పరించి ఎట్లా మింగేస్తుందో ‘హింస’ కథలో చూడవచ్చు. ప్రముఖ నటుడు చార్లీచాప్లిన్‌  ‘మోడరన్‌ టైమ్‌’ సినిమాలో కార్మికుల తిండి తినే సమయాన్ని తగ్గించటం కోసం ఒక యంత్రాన్ని తయారు చేసి అమలు చేస్తారు. ఆ సందర్భంగా చాప్లిన్‌ నటన నవ్వు పుట్టించినా దాని వెనక ఉన్న భయంకర విషాదం హృదయాలను పిండేస్తుంది. సరిగ్గా అటువంటి చర్యలే సింగరేణి మెనేజుమెంటు చేపట్టింది. ఓపెన్‌కాస్టు గనుల్లో కార్మికుల తిండి తినే సమయాన్ని తగ్గించటానికి ‘మొబైల్‌ రెస్టు హౌజ్‌’లను ఏర్పాటు చేసింది. దాన్ని వ్యతిరేకించి ఆందోళనకు దిగిన కార్మికులపై పోలీసులు లాఠీచార్జీ చేస్తారు. లాఠీ చార్జీలో గాయపడిన ‘జార్జ్‌’ అటు తరువాత హాస్పటల్లో చనిపోతాడు.

పర్మినెంటు కార్మికుల స్థానంలో అవుట్‌ సోర్సింగ్‌ కూలీలను తెచ్చి వారికి పనిలేకుండా చేసే దుర్మార్గాన్ని ‘ఔట్‌ సోర్సింగ్‌’ కథ తెలియచేస్తుంది. ఇట్లా పనులు లేకుండా పోయిన కార్మికులను వొకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఊరికే కూచుండ బెట్టి జీతం ఇస్తాం అంటూ ‘సర్‌ప్లస్‌ పూల్స్‌’ను ఏర్పాటు చేస్తుంది. కష్టం చేసి బతికే కష్ట జీవులను ఊరికే కూచుండబెట్టి జీతం ఇస్తామనటం వారిని మానసికంగా హింసించటం, అవమాన పరచటం తప్ప మరోకటికాదు. ఇదంత కూడా పొమ్మనలేక పొగబెట్టడమే.

బొగ్గు బాయి ప్రమాదంలో ‘భర్త’ చనిపోతే, ఆ దుఃఖాన్ని దిగమింగుకొని కడుపుల పుట్టిన బిడ్డలను సాదుకొను సింగరేణి కొలువులోకి వస్తుంది. మానవత్వం మరిచిన మెనేజుమెంటు అటువంటి వారిని తొలగించటానికి ‘కౌన్సిలింగ్‌’ పేర ఎట్లా వేధించారో తెలియచేసే కథ ‘కౌన్సిలింగ్‌’.

సంస్కరణలకు మరో రూపమే అణచివేత. విప్లవ కార్మికోద్యమం కార్మికులకు ప్రశ్నించే చైతన్యాన్ని ఇచ్చింది. ఆ చైతన్యాన్ని అణచివేయటానికి కాలరీ ప్రాంతంలో దేశంలోని సకల సాయుధ బలగాలను దించి నెత్తురుటేర్లు పారించింది. ఈ అణచివేతను పర్మినెంటుగా కొనసాగించటానికి బావుల మీద సి.ఐ.యస్‌.ఎఫ్‌ క్యాంపులను నెలకొల్పింది. ముప్పయి ఏండ్లు బొగ్గుబాయిలో రెక్కలు ముక్కలు చేసుకొని కార్మికులు పనిచేసినా వారికి ఉండటానికి క్వార్టర్స్‌ ఇవ్వని మెనేజుమెంటు అదే సిఐయస్‌ఎఫ్‌ జవాన్లకు ఆగమేఘాల మీద క్వార్టర్స్‌ ఇచ్చింది. వాళ్ళు ఆడుకోవటానికి క్లబ్‌లు, సిమ్మింగ్‌ పూల్స్‌ నిర్మించింది. మెనేజుమెంటు మొదట సిఐయస్‌ఎఫ్‌ క్యాంపులను నెలకొల్పినప్పుడు దొంగతనాలను అరికట్టడం కోసమని చెప్పింది. కాని క్రమంగా కార్మికుల ప్రతీ కదలికలను శాసించే స్థాయికి ఎలా చేరుకున్నారో, కాలరీ ప్రాంతంలలో వీళ్ళు ఎటువంటి అరాచకాలు సృష్టించారో తెలియచేసే కథ ‘కొత్త ఎత్తు’.

ఓపెన్‌కాస్టు గనుల పేరు మీద ఊళ్ళకు ఊళ్ళను స్వాధీనం చేసుకొని జనాలకు బతుకు లేకుండా చేసిందో, ఆకలి చావులకు, వలసలకు కారణమైందో అటువంటి మెనేజుమెంటు తన ఉదారత్వాన్ని చాటుకోవటానికి, సోషల్‌ రెస్పాన్సిబులిటీ పేరిట  నిర్వాసిత గ్రామాల ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలియచేయటానికి ‘మెడికల్‌ క్యాంపులు’ పెట్టేది. కానీ నిర్వాసిత గ్రామాల ప్రజల అసలు రోగం ఆకలి. కాని ఆకలి తీర్చుకోవటానికి అవసరమైన భూములు లేకుండా చేసి మలమల మాడి సచ్చేలా చేసిన దుర్మార్గాన్ని చాలా సున్నితంగా చెప్పిన కథ ‘మెడికల్‌క్యాంప్‌’.

సింగరేణి కార్మికులు ఏదైనా సమస్య మీద సమ్మె చేస్తే కార్మికుల సమ్మె వలన 

ఉత్పత్తికి ఇంత నష్టం, అంత నష్టం అంటూ పత్రికలు కోడై కూస్తాయి. కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ స్వయంగా మంత్రులు చిలుక పలుకులు పలుకుతారు. నిత్యం లంచాలతో, పైరవీలతో మునిగితేలే కార్మిక సంఘాల నాయకులు సమస్య పరిష్కారానికి సమ్మె ఆయుధం కాదంటారు. కార్మికులు సమ్మె ముగించి విధుల్లోకి పోతే తాము మెనేజుమెంటుతో సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కారిస్తామంటారు.

అసలు కార్మికులు ఎందుకు సమ్మెలు చేస్తారు?

ఊపిరి సలుపని గర్మి ప్లేసులో గాలి సప్లయి సరిగా ఉండాలని, గొంతెండి పోతుంటే తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కావాలని, చివరికి పనిచేసేందుకు అవసరమైన తట్టా ` చమ్మాసులు కావాలని, లాడీసుల సప్లయ్‌ సరిగా ఉండాలని, నెత్తి నోరు మొత్తుకున్నా వినకుండా మొద్దు నిదుర వహించే మెనేజుమెంటు మెడలు వంచటానికి కార్మికులకు సమ్మె అనివార్యమైంది. మురికి కూపాల్లాంటి కార్మికవాడల్లో పందులతో, రోగాలతో సహవాసం చెయ్యలేక చస్తున్నామని, రోగమొస్తే కంపెనీ దావఖానలో మందులు సరిగా ఉండాలని, తమ పిల్లలు చదువుకోవటానికి ‘బడులు’ కావాలన్నా ‘సమ్మె’ చెయ్యక తప్పని పరిస్థితి.

మందమర్రి ఏరియాలోని కే.కే. 2 గనిలో బొగ్గు బాయి ప్రమాదం జరిగి కార్మికుని కాలు నుజ్జు నుజ్జయి హాస్పటల్లో పడితే, గాయం మానకముందే ‘ఫిట్‌’ చేసిన డాక్టర్‌ చర్యను వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మె చేస్తారు. మరునాడు మెనేజుమెంటు ముందు నోటీసు ఇవ్వకుండా ఇల్లీగల్‌ సమ్మె చేసారంటూ బ్రిటిష్‌ కాలం నాటి బూజుపట్టిన మస్టర్ల కోత చట్టం అమలు జరిపింది. దాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు మస్టర్ల కోత చట్టం సమ్మె మొదలైంది. ఆ సమ్మెను విఫలం చేయటానికి ప్రభుత్వం అమలు జరిపిన అణచివేత అంత ఇంతకాదు. తీవ్ర నిర్భందాలను ఎదుర్కుంటూనే కార్మికులు యాభైయారు రోజులు సుదీర్ఘ సమ్మె పోరాటం చేసారు. ఆ పోరాటంలో సింగరేణి కార్మిక సమాఖ్య అనే విప్లవ కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఆ తర్వాత కాలంలో  అనేక త్యాగాలతో చారిత్రాత్మకమైన పోరాటాలు నిర్వహించింది. భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఆ సమ్మె ఎలా ఆరంభమైందో తెలియచేసే చారిత్రాత్మకమైన కథనం ‘మస్టర్ల కోత చట్టం సమ్మె’ కథ.

ప్రతీ నాలుగైదేళ్లకోసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు స్థిరీకరణకు ప్రభుత్వం వేజుబోర్డు ఏర్పాటు చేయాలి. వేజుబోర్డు కాలపరిమితి దాటిపోయి ఏండ్లకు ఏండ్లు గడిచిపోయినా కార్మికుల వేజుబోర్డులు పరిష్కరించాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోతే హన్మంతుని తోకలా పెరిగిపోయిన ధరలతో సతమతమయి పోతూ చూసి చూసి వేసారిన కార్మికులు వేజుబోర్డులు పరిష్కరించే వరకు తాము పనులు చెయ్యమని చేతులు ముడుచుకుంటే, ఎంత గగ్గోలు, ఎంత దుష్ప్రచారం తుపాకి మొన మీదనైన కార్మికులతో పని చేయించాలని నిర్భందం. అటువంటి పరిస్థితిని తెలియచెప్పేదే ‘వేజుబోర్డు సమ్మె’, ‘నిర్బంధం`సమ్మె’ కథలు.

కార్మికులు పోరాడి వారసత్వ ఉద్యోగపు హక్కును సాధించుకున్నారు. వారసులకు ఇచ్చే డిపెండెంట్‌ ఉద్యోగాలను మెనేజుమెంటు ఏకపక్షంగా రద్దు చేస్తే దాన్ని కాపాడుకోవటానికి కార్మికులు జరిపిన పోరాటమే ‘డిపెండెంట్‌ ` సమ్మె’ కథ.

సింగరేణి కార్మికోద్యమ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కార్మికులు తమ వ్యక్తిగత డిమాండ్లు ఏవీ కోరకుండా కేవలం సింగరేణి సంస్థను కాపాడుకోవటానికి 2003లో సింగరేణి పరిరక్షణ సమ్మె చేశారు. అప్పటి ముఖ్యమంత్రి తనకు తాను వరల్డ్‌ బ్యాంకు సి.ఇ.వోగా ప్రకటించుకున్న చంద్రబాబునాయుడు ఆ సమ్మెను అణచటానికి చెయ్యని దుర్మార్గం లేదు. కోల్‌ బెల్టు ప్రాంతమంతా పోలీసుమయం చేశారు. సమ్మె చేస్తున్న కార్మికుల అక్రమ అరెస్టులు, చింత్రహింసలు విచ్చలవిడిగా సాగాయి. చివరికి తమ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి పోలీసు పహారాల మధ్య బావుల మీద ప్రచారం సాగించారు. అయినా కార్మికుల పోరాటాన్ని నిలువరించలేకపోయారు. ఆ సమ్మె పోరాటాన్ని చిత్రించిందే ‘సమ్మె`కొన్ని దృశ్యాలు’ కథ.

అది వేజుబోర్డు కోసం జరిగిన సమ్మెనా, సింగరేణి పరిరక్షణ కోసం జరిగిన సమ్మెనా, డిపెండెంటు హక్కు కాపాడుకోవటం కోసం జరిగిన సమ్మెనా లేదా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతూ జరిగిన సమ్మెనా, ఏకపక్షంగా హక్కులు హరిస్తూ విడుదల చేసిన సర్క్‌లర్స్‌ వ్యతిరేక సమ్మె పోరాటమా? అది ఏదైనా కావచ్చు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించటానికి సిద్ధంగా లేని పాలకులు తీవ్ర నిర్బంధం ప్రయోగించడం ద్వారా సమ్మెలను అణచాలని చూశారు. కాలరీ ప్రాంతం మొత్తం పోలీసుమయం చేసి నల్లటి డ్రెస్‌లు, ఆధునిక ఆయుధాలు కలిగిన కమాండో ఫోర్స్‌లతో కార్మికవాడల్లో మార్చింగ్‌ చేయించారు. సమ్మెల సందర్భంగా కార్యకర్తలను అరెస్టు చేసి బహిరంగంగా కాల్చి చంపి భయోత్పాతం సృష్టించారు. రాత్రికి రాత్రి కార్మికుల ఇండ్ల మీద దాడులు చేసి తుపాకి మొనమీద బలవంతంగా పనులు చేయించారు. అరెస్టు, చిత్రహింసలు, దొంగ కేసులు షరామామూలే. 

చంద్‌ రాసిన సమ్మెకథలు చదువుతుంటే మనం ఒక ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా? నియంతల పాలనలో ఉన్నామా? అని అనుమానం కల్గుతుంది.

పరాన్న బుక్కులుగా బతికే బాయి దొరల పెత్తనాన్ని తెలిపే కథ ‘దొరసాని’. బావులు నడిచినప్పుడు బాయి దొర తన ఇష్టా రాజ్యంగా కార్మికులకు మస్టర్లు ఇచ్చి ఇంటికాడ పని చేయటానికి పంపించేవాడు. కాని బావుల మీద సమ్మె మొదలు కావటం వలన బాయి మీదికి కార్మికులు ఎవరు రాకపోవటంతో ‘ఇంటిపనికి పంపించలేకపోతడు. దీంతో ఆఫీసరు భార్య కష్టాలను సున్నితంగా చెప్పిన కథ ‘దొరసాని’.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన దూబగుంట మధ్యపాన నిషేధ పోరాటానికి ముందే సింగరేణిలో కార్మికులు మద్యపానం నిషేధించాలని పోరాటం చేసారు. కార్మికుల జీతంలో సగభాగం, ఇల్లు, వొళ్ళును సారా గుల్ల చేసేది. వాళ్ళ మెదళ్లను మొద్దుబార్చేది. ఆ విషవలయంలో చిక్కి అనేక కుటుంబాలు చితికిపోయ్యేవి. విప్లవ కార్మిక ఉద్యమం మెనేజుమెంటు దోపిడి అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే కాదు కార్మికులను చైతన్య పరిచి వారిని మనుషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. సారాకు వ్యతిరేకంగా 1983లోనే పెంచిన సారా ధరలను తగ్గించాలని మొదలైన మద్యపాన వ్యతిరేక పోరాటం, తొంబై దశకం చివరి నాటికి కోల్‌బెల్టు ప్రాంతంలో సంపూర్ణ మద్యపాన నిషేధంగా ముందుకు వచ్చి మహోద్యమంగా మారింది. అది ఖద్దర్‌ చొక్కాల ప్రభుత్వమా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పసుపు చొక్కాలా లేదా కోరి తెచ్చుకున్న తెలంగాణలో అధికారం వెలగబెడుతున్న గులాబీ నేతలా? ఎవరైతేనేమి తాగుబోతుల శవాల మీద పైసలు ఏరుకొని బతుకుతున్నవాళ్ళే.

సింగరేణిలో మొదలైన సారా వ్యతిరేక పోరాటాన్ని అణచివేయటానికి చెయ్యని అరాచకం లేదు. మద్య నిషేధం కోరుతూ వీధుల్లోకి వచ్చిన స్త్రీలపై లాఠీ చార్జీ చేశారు. యువకులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి దొంగకేసులు బనాయించారు. చివరికి పోలీస్‌ స్టేషన్లే సారాకొట్లుగా మార్చి అమ్మకాలు సాగించారు. అటువంటి సారా వ్యతిరేక పోరాటాన్ని చెప్పే రెండు కథలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి.

తండ్రి సారాకు బానిసై తాగి తాగి ఖార్జాలు తూట్లు పడి చనిపోతే కుటుంబం ఆగమవుతుంది. పలక బలపం పట్టాల్సిన చిట్టి చేతులు పొట్ట కూటి కోసం సారాకొట్లో గ్లాసులు కడిగే నౌకరికి కుదురుతాడు. అనివార్యంగా తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన సారా వ్యతిరేక పోరాటంలో భాగస్వామి అవుతాడు. పోరాటంలో అరెస్టు అయి కోర్టులో దొంగసారా కాసే సారా కాంట్రాక్టర్లు, వాళ్ళకు వంతపాడే ఎక్సయిజ్‌, పోలీసు వ్యవస్థను, వారికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం గుట్టంతా విప్పి చెప్పే కథ ‘మరో సారా కథ’.

ఏసోబు పేద కుటుంబం నుండి వచ్చినవాడు. నానా కష్టాలు పడి చివరికి కానిస్టేబులు ఉద్యోగంలోకి వస్తాడు. ఏ సారా మహమ్మారి అయితే తన అన్నను బలి తీసుకుందో అదే సారా అమ్మకాలను బలవంతంగా అమ్మటానికి పోలీస్టేషన్లే సారాకొట్లుగా మార్చి అమ్మేకాడ రక్షణదారుగా పనిచేయ్యాల్సిన విషాద పరిస్థితిని చిత్రించిన కథ ‘సారా మరకల ఖాకీ అంగీ’.

ఘనత వహించిన భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అపహాస్యంగా జరుగుతున్నయి. డబ్బు, మద్యం ఏరులై పారిస్తూ, కులాల మధ్య చిచ్చుపెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి జనం తన్నుక చస్తుంటే కారిన నెత్తురును ఓటు బ్యాంకుగా మార్చుకొని లంగలు, దొంగలు, మాఫియాలు, హంతకులు ప్రజాప్రతినిధులై రాజ్యాలు ఏలుతున్నారు. అట్లా అధికారంలోకి వచ్చిన నాయకుల మాటలకు, చేతలకు పొంతన ఉండదు. కార్పొరేటు మీడియా అబద్ధాలు హోరేత్తించి ఏది నిజమో ఏది అబద్దమో తెలియకుండా పిచ్చెత్తించి మన మెదళ్లను మొద్దుబారుస్తాయి.

ఎన్నికలకు సంబంధించి ఈ సంపుటిలో ఐదు కథలున్నాయి. అన్నీ కూడా ఎన్నికల బూటకత్వాన్ని తెలిపేవే. ఒకవైపు అన్ని హంగు ఆర్భాటాలతో కుట్రలుకుతంత్రాలతో పార్లమెంటు ఎన్నికల ప్రస్తానం కొనసాగుతుండగానే మరోవైపు బతుకుతెరువు కరువైన ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో దుబ్బగూడెం చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇన్నేండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా సామాన్యుల బతుకు మారని దుస్థితిని తెలియచేసే కథ ‘ఎన్నికలు’.

ప్రజలు ఎప్పుడు ‘ఎడ్డి’ జనంగానే ఉండరు. ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటారు. మీ మోసాలను నిలదీస్తారు. మీ ఆటలు సాగకుండా చేస్తారు. అందులోను చైతన్యయుతమైన కార్మిక వర్గం ముందుంటుంది. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చిన నాయకున్ని బావిమీద కార్మికులు నిలదీసి పారిపోయ్యేలా చేసిన సంఘటన మరో ‘ఎన్నికల’ కథ తెలియచేస్తుంది.

అది జనరల్‌ ఎన్నికలా లేదా కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలా ఏదైతేనేమి ఎన్నికల స్వభావం ఒక్కటే. డబ్బులు పంచటం, తాగ బోయించటం హామీలు గుప్పించటం వంటివి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కూడా ఎలా ప్రాకిపోయిందో తెలిపే కథ ‘యూనియన్‌ ఎన్నికలు’. ఇట్లా గెలిచిన గుర్తింపు సంఘాల నాయకులు కార్మికుల హక్కులను మెనేజుమెంటుకు తాకట్టు పెట్టి ఎట్లా సొమ్ము చేసుకుంటారో, పండుగలు చేసుకుంటారో తెలిపే కథ ‘శత దినోత్సవం’

రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుపటానికి ఒక నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. కాని కొన్ని ఎన్నికలు నాయకుల తల తిక్క వ్యవహారాల వల్ల కూడా మధ్యంతర ఎన్నికలు ప్రజల నెత్తిన రుద్దబడుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అట్లా రుద్దబడిన ఎన్నికల గురించి తెలిపే కథ ‘ఎన్నికలు’. పార్టీలు వేరైనా పాలకవర్గాల స్వభావం ఒక్కటే నని ప్రజలను వంచించటంలో తామంత ఒక్క తాను ముక్కలేనని ‘ఎన్నికల’ కథ రుజువు చేస్తుంది.

నక్సల్‌ ప్రభావిత ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ తుపాకీ మొనమీద ఎంత ‘ఫార్స్‌’ గా జరుగుతాయో తెలియచేసే కథ ‘ప్రజాస్వామ్యం’. ఈ కథ మొదట 1985 ఏప్రిల్‌ నెల సృజన మాసపత్రికలో ప్రచురించారు. ఆ సంచికను ప్రభుత్వం నిషేధించటానికి సూచించిన మూడు కారణాల్లో ‘ప్రజాసామ్యం’ కథ కూడా ఒకటి. 2017లో అమిత్‌ వి. మసుర్కర్‌ దర్శకత్వంలో వచ్చిన హిందీ ‘న్యూటన్‌’ సినిమా, ప్రజాసామ్యం కథ ఒక్క తీరుగానే ఉంటుంది. ఆ సినిమాకు అదే ఏడాది ఉత్తమ హిందీ సినిమాగా ఎంపికౖౖెంది. అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నది. భారతదేశం తరఫున ‘ఆస్కార్‌’కు నామినేట్‌ చేయబడిరది.

అభివృద్ధి పేరిట పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన, గనుల తవ్వకాలు, సాగిస్తున్నారు. భారీ ప్రాజెక్టు నిర్మిస్తూ కోట్లాది మంది జనాలను తాము పుట్టి పెరిగిన నేల నుండి నిర్వాసితులను చేస్తున్నారు. భూములు కోల్పోయి బతుకు కోల్పోయిన నిర్వాసితుల కన్నీటికథలు బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ సంపద ఉంటే అక్కడే గద్దల్లా వాలి రాత్రికి రాత్రి వేలకోట్లు ఆర్జించే కార్పొరేటు దోపిడీ తీవ్రతరమైనది. అటువంటి కార్పొరేటు శక్తులకు వంతపాడుతూ పాలకులు నిర్వాసితులైన ప్రజల మీద సాగిస్తున్న హింసాకాండ రోజు రోజుకు పెరిగిపోతుంది.

అసలు అభివృద్ధి అంటే ఏమిటి? కాకుల కొట్టి గద్దలను మేపే అభివృద్ధి ఎలా అభివృద్ధి అవుతుంది. మూల వాసులను బలిచేసి లక్షల ఏళ్ళనాటి ఖనిజ నిక్షేపాల్ని కొద్దిమంది కార్పొరేటు శక్తుల లాభాల కోసం బలిచేస్తూ పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం చేస్తూ భవిష్యత్‌ తరాలకు ఈ భూమి మీద బతుకు లేకుండా చేసే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు. వీరి లాభాల కోసం శతాబ్దాల తరబడి కొనసాగుతున్న జీవితం నుండి భూమి నుండి, సాంస్కృతిక జీవన విధానం నుండి వెళ్ళగొట్టబడి నిరాశ్రయులై ప్రజలు ఎలా బతకాలి? ఈ విధ్వంసకర అభివృద్ధిని వ్యతిరేకించిన ప్రజల సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చి ప్రజలపై సైన్యాన్ని ఉసిగొల్పి అణచివేస్తున్న పాలకులను ఎట్లా అర్థం చేసుకుందాం.

ఈ కథల సంపుటిలో సింగరేణి ఓపెన్‌ కాస్టు గనుల కింద సిమెంటు ఫ్యాక్టరీల కింద, గుట్టలను విధ్వంసం చేసే గ్రానైట్‌ పరిశ్రమల వలన జరుగుతున్న జీవన విధ్వంసాన్ని పర్యావరణ మార్పులను కళ్ళకు కడుతాయి. నిర్వాసితుల బాధలను ఏకరువు పెడుతాయి. మన కండ్లముందే జరుగుతున్న ఈ విధ్వంసం చూసి నిశ్చేష్ఠులమైపోతాము. ఈ కథలు మనల్ని ప్రశ్నిస్తాయి, హృదయాలను కల్లోల పరుస్తాయి. నిర్వాసితుల సమస్యలపై లోతైన అవగాహన, భూములు నష్టపోయి బతుకు కోల్పోయిన ప్రజల పట్ల సానుభూతి, ప్రేమ ఉంటే తప్ప ఇటువంటి కథలు రాయటం సాధ్యంకాదు. తెలుగు సాహిత్యంలో భూనిర్వాసితుల దయనీయ స్థితిగతుల మీద ఇంత విస్తృతంగా నిబద్ధతతో రాసిన రచయిత మరొకరు కన్పించరు.

‘భూనిర్వాసితులు’ కథ గోదావరిఖని ఓపెన్‌ కాస్టు కింద భూములు కోల్పోయిన మారేడుపాక గ్రామస్థులు కన్నీటి కథ. కంపెనీ భూసేకరణకు వచ్చిన సందర్భంలో తమ భూములు ఇవ్వమని గ్రామస్థులు పెద్ద యుద్ధమే చేస్తారు. ఆ పోరాటంలో ముందు నిలిచిన కొడుకును గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేస్తారు. కోడలు ఆత్మహత్య చేసుకుంటుంది. వయసు ఉడిగిపోయిన ముసలివాడు ఆయన పన్నెండేళ్ల మనమడు బడికి వెళ్లాల్సిన వయస్సులో బతుకు తెరువుకోసం ఓసిపి మట్టి కుప్పల మధ్య చిన్న చాయ్‌ హోటలు పెట్టుకొని పొట్ట పోసుకుంటుంటారు. అభివృద్ధి ఫలితాలు అందుకున్న వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. కాని అభివృద్ధి చీకటి కోణంలో నలిగిపోయిన జీవితాల్లో దారిద్య్రం, దుఃఖం, నిరాశ నిస్పృహలుంటాయి. అది వాళ్ళు తెచ్చి పెట్టుకున్నది కాదు. తమ ప్రమేయం లేకుండా వాళ్ళపై రుద్దబడిరది. అటువంటి నిరాశ నిస్పృహల మధ్య పిల్లవాడు రాజు మదిలో రాజుకున్న ఆవేదన చివరికి ప్రతీకారంగా మారి ఏ రూపం తీసుకున్నదో కడుపులో చల్ల కదలకుండా బతికేవారికి ఆమోదయోగ్యం కాకపోవచ్చు కాని కథ చదివిన తరువాత రాజు ధర్మాగ్రహాన్ని మనం అర్థం చేసుకుంటాం.

‘బొగ్గు దొంగ’ కథలో వాళ్ళ భూముల్లో బొగ్గుసంపద ఉంటే వాళ్ళ బతుకు బాగుపడలేదు. వాళ్ళను నిరాశ్రయులను చేసి బలవంతంగా వాళ్ళ సంపదను కాజేస్తారు. బతుకు లేకుంటా పోయిన ఓ ముసలవ్వ మిగిలిన ఒక మనుమన్ని సాదుకోను ఏరి పారేసిన ‘సేలు’ కుప్పలో బొగ్గు ఏరుకొని వచ్చి అమ్ముకొని బతుకుతుంటే ముసల్ది ‘బొగ్గు దొంగ’ ఎట్లయింది? వాళ్ళ సంపదను కాజేసే వ్యవస్థీకృత దుర్మార్గం దొరతనంగా ఎట్లా మారింది అంటూ తలక్రిందుల విలువలను సూటిగా ప్రశ్నిస్తుంది. ముసల్దాన్ని ‘బొగ్గు దొంగ’ అని బలవంతంగా జైలు పాలు చేస్తుంటే ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ ముసల్ది ‘ఇంటికాడ నా మనుమడు ఒక్కడే ఉన్నాడు. వాడుత్త ఎడ్డిపోరడు. ఆకలైతే ఆగలేడు నన్ను వదిలిపెట్టండీ’ అంటూ ఆక్రోశించే ఆ వృద్ధురాలు అరుపులు మన మనసులో గింగురుమంటూనే ఉంటాయి. బొగ్గుదొంగ కథ చదివిన తరువాత మనం వెంటనే ఇంకో కథలోకి పోలేము.

మైసమ్మకు మేకపోతును బలి ఇచ్చేటప్పుడు ‘జడ్తి’ ఇస్తారు. జడ్తి ఇస్తనే మేకపోతును బలిచేస్తారు. అచ్చం అలాగే సింగరేణి కంపెనీ బొగ్గు గనుల కింద ఊరి భూములు తీసుకున్న కంపెనీ, ఇండ్లకు ఎక్కువ వాల్యుయేషన్‌ చెల్లించాల్సి వస్తుందని వదిలేస్తుంది. దాంతో ఊరి జనం ఇండ్లను వదిలిపోలేక, చేసుకునేందుకు పనులు లేక దూర ప్రాంతాలకు పోయి కూలీనాలి చేసుకుంటూ కొండల్లా పేరుకపోయిన ఓపెన్‌ కాస్టు మట్టి దిబ్బల దుమ్ము దూళీ మధ్య నీళ్ళు లేక, చావలేక బతుకుతుంటారు. ఇదంతా వారిని పొమ్మనలేక పొగబెట్టడమే. మైసమ్మకు మేక పోతును బలిచ్చినట్టు ఇవ్వటమే.

లోతైన ఓపెన్‌ కాస్టు గని వలన బావులు ఎండిపోయి తాగేందుకు గుక్కెడు 

నీళ్ళు దొరకక విధిలేని పరిస్థితిలో ‘మంగళపల్లి’ గ్రామస్థులు కంపెనీ కాలనీకి పోయే నీళ్ళ పైపుకు పొక్కలు కొట్టి ప్రాణాలు నిలుపుకుంటారు. అది నేరమైపోతుంది. ఊరి జనానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావించిన పోలీసులు పోరాటంలో ముందు నిలిచిన వెంకటేశంను చంపి మట్టి దిబ్బలమధ్య గుర్తులేని శవంగా పడవేయటమే ‘నీళ్ళకోసం’ కథ సారాంశం.

‘దొంగ’ కథలో భూములు పోయి బతుకలేకపోయిన ఓ యువకుడు బతకటానికి కంపెనీ వాడిపారేసిన స్క్రాప్‌ను దొంగతనంగా ఎత్తుకొచ్చి అమ్ముకొని బతుకుతుంటాడు. అటువంటి దొంగతనం చేస్తూ ‘శంకర్‌’ అనే యువకుడు సీఐయస్‌ఎఫ్‌ జవాన్లు జరిపిన కాల్పుల్లో చనిపోతాడు. వాళ్ళ సంపదను కాజేసి, వాళ్ళకు బతుకుతెరువు లేకుండా చేసిన వాళ్ళు దొరల్లా చెలామణి అవతుంటారు. 

‘పునరావాసం’ కథలో భూమి కోల్పోయిన రైతు. తన భూమిలో కంపెని కట్టించిన గెస్టు హౌజ్‌లో కూలీగా తోట పని చేస్తుంటాడు. కాని కంపెనీ ఆ పని కూడా లేకుండా చేస్తుంది. దాంతో ఆ రైతు తనకు కూలీ ఇచ్చినా ఇవ్వకున్నా తన భూమిలో తాను పని చెయ్యటానికి అవకాశం కల్పించాలని లీడర్ల చుట్టూ తిరుగుతూ పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. రైతుకు భూమికి ఎటువంటి అనుబంధం ఉంటుందో తెలియచేసే కథ.

ఓపెన్‌ కాస్టు గని క్రింద తడిచెర్ల మండలంలో భూసేకరణ జరుగుతున్నప్పుడు జరిగిన ఒక సమావేశంలో నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, ముసలివాడు, మాదిగ బక్కులు మాట్లాడుతూ ‘అయ్యా ఈ భూమి కోసమే ఆనాడు దొరలకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడినం. ఆ పోరాటంలో సచ్చినోళ్ళు సచ్చిండ్లు బతికినోళ్ళు బతికిండ్లు. అనేక కారణాలవల్ల ఆనాడు మేం ఓడిపోయినం. దున్నెటోళ్ళకు భూమి దక్కలే. అయితేనేమి భూమి దొరల చేతిలో ఉన్నా, ఎవరి చేతిలో ఉన్నా భూమి భూమి లెక్క ఉంది. కాబట్టి దాని మీద కూలీ నాలి చేసుకొని బతికినం. మా పిల్లలు బతుకుతాండ్లు. ఇవ్వాళ కాకున్న రేపయిన భూమిని స్వాధీనం చేసుకుంటామని ఆశలుండే. కాని ఇవ్వాళ కంపినోడు వచ్చి భూమి చెరపట్టి, దాన్ని పల్గ చీరి, బొందల గడ్డలు చేసి, ఈ ప్రకృతిని నాశనం చేసి బొగ్గు తవ్వుకుని పోతడట.. ఈ భూమిని, ప్రకృతిని నాశనం చేసే అధికారం వీళ్ళకు ఎవరు ఇచ్చారు. భూమి నాశనమైతే రేపు నా మనుమలు ఎట్లా బతుకుతారు. భూమిని చెరపట్టిన వాడు బతకటానికి వీలులేదు’ అంటూ ప్రశ్నించిన ‘భూమిపుత్రుడు’కి సమాధానం ఏది?

ప్రాజెక్టుల కింద భూసేకరణ జరిగేటప్పుడు ఎంత హడావిడిగా ఎంత కుట్రపూరితంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందో ప్రజల గొంతు ఎలా నొక్కివేయబడుతుందో మనకు తెలియంది కాదు. అటువంటి ఒక సమావేశంలో భూమి తల్లికి ప్రతిరూపమైన రాజ పోషవ్వ అనే మహిళ మాట్లాడుతూ ‘అయ్యా మాకు భూమి లేకుంటే బతుకులేదు.. ‘సేపును’ ముక్కలు ముక్కలుగా కోసుకొని తిన్నట్టు ఎందుకు మమ్ముల్ని కొద్దిగ కొద్దిగ చంపుక తింటరు. ఒక్కసారే మా అందరి ప్రాణాలు తీసి మా భూములు తీసుకోండి అప్పుడు మీకు ఏ అడ్డంకులుండవు’ అంటూ పుట్టెడు దుఃఖంతో మాట్లాడటమే ‘నేను రాజపోషవ్వను మాట్లాడుతున్న’ కథ.

బొగ్గు గనుల క్రింద భూములు పోయి బతుకు తెరువుకై ఎర్రటి ఎండలో పండ్లు అమ్ముకునే ఒకప్పుడు ఉన్నతంగా బతికిన స్త్రీ కథ ‘రేగుపండ్లు’

గోదావరి ఒడ్డున ఉండే గ్రామం లింగాపూర్‌. తన భూమిని కబ్జా చేయటానికి ప్రయత్నించిన ఊరి దొరకు ఎదురునిలిచిన లింగయ్యను అందరూ లింగాపూర్‌ లింగయ్య అంటారు. కాని అదే లింగయ్య ఓపెన్‌కాస్టు కింద కంపెనీ భూములు గుంజుకుంటే ఆపలేకపోయాడు. ఏండ్లకు ఏండ్లు కోర్టుల చుట్టూ తిరిగిండు కాని కేసులు ఎటు తేలకుండా పోయింది. ఈలోపున ఊరి జనంలో చాలామంది బతుకుతెరువు వెతుక్కొంటు వలసపోయిండ్లు. కాని సచ్చేంత వరకు ఊరును వదిలిపోయ్యేది లేదని భీష్మించుకూచున్న లింగయ్యకు సచ్చిన తరువాత కూడా కంపినోని వేధింపులు తప్పలేదు. సంప్రదాయం ప్రకారం శవాన్ని గోదావరి ఒడ్డుకు తీసుకపోయి దహన సంస్కారాలు చేస్తామంటే కంపిని అందుకు అవకాశం ఇవ్వక రోడ్డుకు అడ్డంగా గేట్లు పెట్టి పోలీసు రక్షణ ఏర్పాటు చేస్తుంది. చివరికి భూమికోసం చివరి శ్వాస వరకు కొట్లాడిన లింగయ్య శవాన్ని ఆయన ఇంట్లోనే సమాధి చేసే విషాదమే ‘నిర్వాసితుడు’ కథ.

‘అమ్మ ఆకలైతాంది’ ‘కాస్త ఆగు బిడ్డ’ అంటూ ప్రశ్న జవాబు రూపంలో సాగే చిన్న కథ ‘భూమి’ మూడు తరాల మూలవాసుల జీవితకథను నిర్వాసితుల కన్నీటి కథను, చిత్రిక పడుతుంది. ఆ కథ చదివిన తరువాత కన్నీరు ఆగదు. ఒక నవలకు సరిపడా ఇతివృత్తాన్ని ఒక్క చిన్నకథలో ఇమడ్చటం మామూలు విషయం కాదు. శిల్పపరంగా రచయిత సాధించిన పరిణతికి ఈ కథ నిదర్శనం.

లక్షల సంవత్సరాలుగా మనుషులకు రక్షణ ఇస్తూ సకల జీవజాలానికి, జంతు సంపదకు కేంద్ర బిందువై ప్రకృతి సిద్ధ సహజ వాటర్‌ స్టోరేజి ట్యాంకులు వర్షపు నీటిని ఒడిసి పట్టి నదులు, చెరువులకు జన్మనిచ్చి మానవ మనుగడకు దోహదపడటమే కాకుండా, గుళ్ళు గోపురాలకు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన గుట్టలను, గ్రానైట్‌ మాఫియా తమ లాభాల కోసం ఎలా విధ్వంసం చేస్తుందో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలియచెప్పే కథ ‘గుట్ట’ అటువంటి నేరస్తులే మంత్రులుగా రాజ్యాలు ఏలుతున్న పాడు కాలం మనది.

తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆ మాటకు వస్తే ఒక్క తాజ్‌మహలేకాదు, ప్రపంచంలోని సమస్త కట్టడాలను, డ్యామ్‌లను, ప్రాజెక్టులను, సుందరమైన భవనాలు అన్ని కూడా పొట్ట కూటి కోసం వలసవచ్చిన కూలీల చెమట చుక్కలతోనే నిర్మించబడ్డాయి. 

పొద్దంతా రెక్కలు ముక్కలు చేసకుంటారు. ఇవ్వాళ ఇక్కడ ఉంటే రేపు మళ్ళీ ఎక్కడో. రోడ్డు పక్క మురికి కాలువలపొంటి, ఏ మోరి కిందో ప్లాస్టిక్‌ కవర్లతో, అట్టలతో నిర్మించుకున్న గుడిసెలే వారి నివాసాలు. అక్కడ తాగేందుకు నీళ్లు ఉండవు, కరెంటు ఉండదు, రోగమొస్తే మందులుండవు. అసంఘటిత కార్మికుల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు ఏవి అమలుకావు. కూలీల సంక్షేమం చూడాల్సిన లేబర్‌ ఆఫీసర్స్‌ ఎవరు కూడా వారి దరిదాపులకు కూడా పోరు. కూలీ అడ్డాలల్లో ఆ రోజు పని కోసం అంగలారుస్తారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడువాలన్న కూలీల రక్తం పిండుకోవాల్సిందే. కాని వారి యోగక్షేమాలు చూసే బాధ్యత మాత్రం యజమానికి ఉండదు. అటు యజమానులకు కూలీలకు మధ్య దళారులుంటారు. వాళ్ళే ఊళ్లపొంటి తిరిగి బతుకు తెరువు లేని వాళ్ళను, కాస్త కండపుష్టి ఉన్నవాళ్ళను ఏరుకొని తెస్తారు. వాళ్ళ రెక్కల కష్టం కావాలి తప్ప ఎవరికి బాధ్యత ఉండదు. చివరి రోజు దేశం వెలిగిపోతుంది. అభివృద్ధి పథంలో దూసుకపోతుందంటూ సొళ్ళు కబుర్లు చెప్పే రాజ్యాధినేతలకు కూడా పట్టింపు ఉండదు. కార్పొరేటు సేవలో తరించిపోయే నాయకులకు ఒక్క క్షణం కూలీల బతుకు గురించి ఆలోచించే తీరిక ఉండదు. అట్లా ఉండి ఉండేదుంటే రాత్రికి రాత్రి ‘కరోనా’ పేరు మీద దేశమంతా లాకౌట్‌ ప్రకటిస్తే ఊరు కాని ఊరుకు వచ్చిన కూలీలు అటు పనులులేక ఇటు ఇంటికి పోలేక మలమల మాడి సచ్చేవాళ్ళా? తట్టాబుట్టా పట్టుకొని ఇంటికి రావటానికి వందల కిలోమీటర్లు తిండి తిప్పలు లేక కాలినడక నడిచిపోయ్యేవాళ్ళా? అర్దాంతర చావులకు బలయ్యేవారా?

ఎవ్వరికి పట్టని కూలీల బతుకుల్ని రచయిత అధ్యయనం చేసిండు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి వలస వచ్చిన కష్టాలు కన్నీళ్ళతో కూడిన మిని భారతదేశం లాంటి పి.కే. రామయ్య కాలనీ, క్రషర్‌నగర్‌, ఒడ్డెర కాలనీ, ఎన్టిపిసి కూలీ అడ్డాలు. ఇటుక బట్టీల పొంటి రోజుల తరబడి తిరిగాడు. వారిలో ఒకడుగా కలిసిపోయిండు. వాళ్ళ బాధలు ఒడిసిపట్టుకొని కథలుగా, ‘కూలీ బతుకులు’ నవలగా సాహిత్యలోకానికి అదించాడు. 

‘‘భారతి’’ కథలో మంచి అనుభవం, నైపుణ్యం ఉన్న నాయర్‌ ఫిట్టర్‌గా కంట్రాక్టు కూలీగా పనిచేస్తూ ఎన్టిపిసి బాయిలర్‌ రిపేర్‌ చేస్తూ చిమ్ని నుండి కింద పడి నడుము విరిగి మంచం పాలైతడు. దాంతో వారి కుటుంబం చితికిపోతుంది. అప్పటివరకు చదువుకుంటున్న భారతి  అనివార్యంగా కూలీ పనులకు పోవల్సి వస్తుంది. భారతి నిస్సహాయ పరిస్థితిని ఆసరగా చేసుకొని కంట్రాక్టరు లోబరుచుకుని వాడుకుని వదిలేస్తాడు. చివరికి పొట్ట కూటికోసం అనివార్యంగా ఒళ్ళు అమ్ముకుని బతకాల్సిన స్థితికి చేరుకుంటుంది. భారతి కథ, చదువుతుంటే అంతర్జాతీయ అంగట్లో అంగంగాన్ని అమ్ముతున్న ‘భారతమాత’ను గుర్తుకు తెస్తుంది.

 రెక్కలు ఆడినంతకాలం కూలీపనులు చేసి రెక్కలు ఉడిగిన తరువాత బిక్షగాడిగా మారిన దాసపల్లి బొందయ్య కథ ‘కూలీ’. రామగుండంలోని పర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో కూలిగా పని చేస్తాడు. కూలీల హక్కుల కోసం పోరాటంలో ముందు నిలిచిన పాపానికి, ఉద్యోగం పోయి తిండికి కటకటలాడుతు నవిసి చనిపోయిన కూలీ కథ ‘ఓదెలు.’

ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో కూడా కూలీలకు ఏ హక్కులు అమలుకు నోచుకోవు. ఓపెన్‌ కాస్టులో ఓవర్‌ బర్డెన్‌ తీసే బడా కాంట్రాక్టర్‌ కూలీల మీద 

ఎటువంటి దౌర్జన్యం చేస్తారో చెప్పే కథ ‘ఇది కథకాదు’. సంతలోని పశువును కొన్నట్టుగా కంట్రాక్టర్‌ కూలీ అడ్డాల మీద కాస్త కండపుష్ఠి ఉన్నవాళ్ళనే ఎలా కూలీకి తీసుకపోతరో చెప్పే కథ ‘రాజమ్మ’.

దేశంలోని వివిధ ప్రాంతాలనుండి బతుకు తెరువు లేక వలసవచ్చి కూలీనాలి చేసుంటూ కలిసిమెలిసి బతికే చోట కూడా జనాలను భాషాపరంగా ప్రాంతాలుగా రాజకీయ నాయకులు విడగొట్టి ఓటు బ్యాంకుగా మార్చుకొని చివరికి దొంగలు దొంగలు ఒకటై చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారని చెప్పే కథ ‘ఎన్నికలు’.

కూలీల పిల్లలకు చదువుకోవటానికి బడులు ఉండవు, రోగాలు వస్తే మందులుండవు. అపరిశుభ్ర వాతావరణంలో సరైన తిండి లేక కండ్లల్లో ఊపిరి పెట్టుకొని బతుకుతారు. కాస్త రెక్కలు ముదిరేసరికి ఏ ఇటుక బట్టీలల్లో, హోటల్లలో పనులు చేస్తారు. ఘనత వహించిన రాజ్యం బాలకార్మిక వ్యవస్థను ఎప్పుడో నిషేధించింది. కాని బాల కార్మికులు సర్వత్రా పనులు చేస్తూ కనిపిస్తూనే ఉంటారు. అదిగో అటువంటి కూలీ పిల్లలు ఎన్టిపిసి యాప్‌ ప్లాంట్‌ బూడిద చెరువులో స్నానం చెయ్యటానికి పోయి బుడుగులో చిక్కి చనిపోయిన విషాదాన్ని తెలిపే ‘బుడుగు’ కథ.

కూలీలు పారిపోకుండా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటానికి కాంట్రాక్టర్లు అడ్వాన్స్‌లు ఇస్తారు. అపద సంపదకు అప్పులు ఇస్తారు. ఇలా అప్పులో ముంచి వారు ఎటూ పారిపోకుండా కట్టడి చేస్తారు. వాళ్ళను దోపిడి చేస్తారు. ‘బాకీ’ కథలో పీల్చి పిప్పి చేసే ఇటుక బట్టి యజమానికి బాకీ పైసలు చెల్లించినా చెల్లించలెదని బుకాయిస్తాడు. దాంతో కూలీ ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితికి నెట్టబడుతాడు.

పులులను బలి ఇవ్వరు మేకలనే బలి ఇస్తారు అంటారు అంబేడ్కర్‌. తాంత్రిక స్వాములకు, జీయ్యర్‌ స్వాములకు సాగిలపడి మొక్కే నాయకులు, వాస్తు పట్ల యజ్ఞ యాగాదుల పట్ల జాతకాలపట్ల అలివి కాని విశ్వాసం కల్గిన మూర్ఖులు దేశాధినేతలై రాజ్యాలు ఏలుతుంటే ఎన్టిపిసి కట్టమైసమ్మకు గణపతి లాంటి కూలీలను ‘బలి’ ఇవ్వటం ఎంత మాత్రం సటైర్‌ కాదు.

దుర్బరమైన బతుకులో నుండి, కష్టాలు, కన్నీళ్ళలో నుండే దేనికి రాజీపడని ఒక పోరాట యోధుడు పుట్టుకొస్తాడు. సమస్త అన్యాయాలకు వ్యతిరేకంగా అసమాన త్యాగాలతో రాజీలేని పోరాటం చేస్తాడు. గాడాంధకారంలో ఒక వెలుగు దివ్వెను పట్టుకొని మార్గదర్శకుడు అవుతాడు. అదిగో అటువంటి పోరాట యోధుని కథే ‘వీరుడు’.

అనాదిగా గిరిజనులు అడవులను అంటిపెట్టుకొని తమదైన సంస్కృతి సంప్రదాయాలతో జీవన సాగిస్తున్నారు. ప్రకృతిలో వారి జీవితం ఎంతగా మమేకమైందంటే అడవుల్లోని చెట్టు, పుట్టలను, గుట్టలను, కృార జంతువులను, చివరికి దేవుళ్ళను కూడా తమలో ఒకరుగా భావిస్తారు. వరుసలు పెట్టి పిలుచుకుంటారు. నిష్ఠతో కొలుస్తారు. అవసరానికి మించి ఒక్క చీపురు పుల్లకూడా వాడుకోరు. అందుకే ఆదివాసులు అడివిలో వేల సంవత్సరాలుగా నివసిస్తున్నా కూడా అడవులు నాశనం కాలేదు. సరికదా అడవులను సంరక్షించారు.

కాని ఎప్పుడైతే అటవీ సంపద మీద కన్నేసిన మైదాన ప్రాంతవాసులు దాడులు చేసి ఆక్రమించుకొని, వారిపై ఆంక్షలు విధించి, విపరీతమైన పన్నులభారం మోపి వాళ్ళ సహజ జీవనానికి భంగం కల్గించారో అప్పుడిక వారిలో అసంతృప్తి రగిలి అనేక తిరుగుబాట్లకు కారణమైంది. బలవంతులైన పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసులు జరిపిన పోరాటాలను పాలకులు రక్తపుటేర్లలో ముంచి అణచివేసారు. అయినా ఆదివాసులు తమ మనుగడ కోసం మళ్ళీ మళ్ళీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆదివాసుల జీవితంలో మార్పురాలేదు. అడవుల రక్షణ పేర ఫారెస్టు డిపార్టుమెంటు ఏర్పాటు చేసి, చట్టాలు చేసి ఆదివాసులను అడవుల నుంచి దూరం చేస్తూ సాగిస్తున్న జులుం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ముఖ్యంగా మధ్య భారతంలోని దండకారణ్య ప్రాంతంలో అక్కడి అడివి సంపదను, ఖనిజసంపదను కార్పొరేటు శక్తుల లాభాల కోసం బలి చేస్తున్నది. దాన్ని వ్యతిరేకిస్తూ ‘జల్‌, జంగల్‌, జమీన్‌పై తమకే సర్వహక్కులుండాలని పోరాటాలు చేస్తున్న ఆదివాసుల మీదికి సైన్యాన్ని పంపి ఊచకోత కోస్తున్న వైనం మన కండ్లముందు జరుగుతున్నది.

అటువంటి ఆదివాసి జీవితాల మీద, వారిపై జరుగుతున్న అన్యాయాల మీద దౌర్జన్యాలమీద గతంలో రచయిత ‘గుమ్మన్‌ ఎగ్లాస్‌పూర్‌ గ్రామస్థుడు’ అన్న అటవిప్రాంత కథల సంపుటి ప్రచురించారు.

‘హత్య’ కథలో పచ్చని అడివిలో చుట్టూ అలుముకున్న కొండల మధ్య ‘దేవపూర్‌’ తదితర ముప్పయి గూడేల ప్రజలు తమ బతుకేదో తాము బతుకుతుంటారు. దేవపూర్‌ ప్రాంతంలోకి బిర్లాకు చెందిన ఓరియెంట్‌ సిమెంటు ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత అక్కడ పకృతి, గిరిజనుల జీవితం పెద్ద ఎత్తున విధ్వంసం అవుతుంది. కథ మొదట ఒక గిరిజన అమ్మాయి అత్యాచారానికి గురై హత్య చేయబడుతుంది. సాదా సీద కథలా, ఒక డ్యాక్యుమెంటరీగా మొదలైన కథ ముగిసే నాటికి ఫ్యాక్టరీ ఆ ప్రాంత వాసులను బతికి ఉండగానే ఎలా హత్యకు గురి చేయబడుతున్నారో తెలియచేస్తుంది. అభివృద్ధి పేరిట  జరుగుతున్న భయంకర విధ్వంస పరిణామాలను ఒక కథలో ఫ్రేం కట్టి చూపుతుంది. సిమెంటు దుమ్ముతో నిండి వాళ్ళ భూముల్లోకి మళ్ళీ జీవనాన్ని నింపేది ఎవరు? చిందర వందర అయిన అమాయక గిరిజన బతుకుల్లో మళ్ళీ వసంతం చిగురిస్తుందా’ అని రచయిత వేసే ప్రశ్నలు కన్నీళ్ళు తెప్పిస్తాయి.

అమాయక గిరిజనులను షావుకార్లు ఎలా దోపిడి చేస్తారో తెలిపే కథ ‘అనామతు ఖాతా’ బాకీ మొతాన్ని చెల్లించిన గిరిజనున్ని షావుకారు అనామతు ఖాతా కింద ఐదు రూపాయలు రాసి పెడుతాడు. దానికి నువ్వేమి చెల్లించవద్దు అంటాడు. కొన్నాళ్ళ తర్వాత అప్పుచెల్లించాలని కోర్టు నుండి  డిక్రీ పంపి బలవంతంగా గిరిజనుడి ఆస్తులను ఆక్రమిస్తాడు.

గిరిజనులు తరతరాలుగా భూములు సాగు చేసుకుంటున్నా వారి భూములకు పట్టాలుండవు. అటువంటి ఒక వ్యవస్థ ఉందని కూడా చాలా మంది గిరిజనులకు తెలియదు. గిరిజనుల సంక్షేమం గురించి ఏమి పట్టించుకోని ప్రభుత్వాలు అడువుల సంరక్షణ పేరు మీద అడవుల అభివృద్ధి పేరు మీద మంది మార్బలంతో వచ్చి గిరిజనులు సాగు చేసకుంటున్న భూముల నుండి బలవంతంగా ఖాళీ చేయించి ఫ్లాంటేషన్‌ పేరు మీద పేపర్‌ మిల్లు యజమానులకు ఉపయోగపడే యూకలిప్టస్‌ చెట్లు నాటుతారు. వ్యవస్థీకృతమైన ఈ దుర్మార్గం వాళ్ళ బతుకుల్ని ఎలా చిన్నా భిన్నం చేసిందో చెప్పే కథ ‘గుమ్మన్‌ ఎగ్లాస్‌పూర్‌ గ్రామస్థుడు’.

గిరిజనుల వెనుకబాటుతనాన్ని, అమాయకత్వాన్ని, నిస్సహాయ పరిస్థితిని ఆసరాగ చేసుకొని ఎలా దోపిడి చేస్తారో, ఎంత కృారంగా వ్యవహరిస్తారో గిరిజన స్త్రీల పట్ల ఎటువంటి అత్యాచారాలకు పాల్పడుతారో హృదయవిధారకంగా ‘రాధాబాయి’ కథ తెలియచేస్తుంది.

తమ లాభాల కోసం అడవులు, గుట్టలను, నీటి వనరులను నాశనం చేస్తే నీళ్ళ కోసం వచ్చి చిక్కిన ‘చిరుత కథ’.

అధికారంలో ఉన్నప్పుడు అధికారమత్తు తలకెక్కి ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అపహాస్యం చేస్తారో, హక్కులను ఎలా ఉల్లంఘిస్తారో, ఎంత హింసకు పాల్పడతారో, రక్తపుటేర్లు పారిస్తారో తెలియచేసేందుకు తెలంగాణ పల్లెలో ఊరూర వెలసిన అమర వీరుల స్థూపాలే సాక్ష్యం. కాని అదే నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత తమకు చిన్న హాని జరిగినా ప్రజాస్వామ్యం మంటగలిసి పోతుందని గగ్గోలు పెడుతారు. అటువంటి నరహంతకులను ఎందుకు క్షమించాలి. నక్క భూదేవికి పైస బాకీ పడ్డట్టు వాళ్ళ పాపానికి పరిహారం చెల్లించాలి.

కార్మికుల హక్కులు కాపాడటం కోసం పోరాటంలో ముందు నిలిచిన పాపానికి కార్మికున్ని డ్యూటి నుండి తిరిగి వస్తుంటే ఎత్తుకపోయి బూటకపు ఎన్‌కౌంటర్‌లో  హత్యచేసిన పోలీసు అధికారిని, అదే కార్మికుని కొడుకు తనదైన పద్ధతిలో మట్టు బెట్టి ‘రుణ శేషం’ లేకుండా చేసే చర్యను ఎలా తప్పు పట్టగలము.

ఓపెన్‌ కాస్టు గనిలో ఓవర్‌బర్డెన్‌ తీసే బడా కంట్రాక్టర్‌, డంపర్‌ బొల్తా పడి కాంట్రాక్ట కూలీ చనిపోతే, తన పలుకుబడి ఉపయోగించి దాతు ఫిర్యాదులేకుండా మట్టి కుప్పల్లో కప్పేసి చేతులు దులుపుకుని ఎక్కడో రాష్ట్ర్రం కాని రాష్ట్రంకు వెళ్లి పోయిన బడా కాంట్రాక్టర్‌ను వెంటాడి వేటాడి మట్టుపెట్టిన కూలి కొడుకు మనకు ఉద్దాంసింగ్‌ను గుర్తు చేస్తాడు. నిత్యం ప్రజల రక్తాన్ని పీల్చి లాభాలు పిండుకొనే హింసోన్మాదులకు హింసకు హింసే పరిష్కారం అని బల్లగుద్ది చెప్పుతుంది ‘ప్రతీకారం’ కథ.

సమాజంలోని అన్యాయాలను, మొద్దు కష్టం చేస్తున్న కష్టజీవుల బతకలేని పరిస్థితిని, కార్పొరేటు విషసంస్కృతిలో విచ్ఛిన్నం అవుతున్న మానవ సంబంధాలను తెలిపే కథలు కొన్ని ఈ సంపుటిలో ఉన్నాయి.

కష్టపడేవాడు బతికే రోజులు పోయినవి. డాలు డోలు చేసి మోసాలకు పాల్పడేవాళ్ళు దర్జాగా బతుకుతుంటే జీవితమంతా ఎద్దు ముడ్డి పొడుచుకుంటూ బతికి చివరికి ‘బిక్షగాడు’గా మారిన రైతు కథ. ఇవన్నీ ఇందులో రికార్డయ్యాయి.

బయట సమాజంలో పెద్ద మనిషిగా, గౌరవ ప్రదమైన వ్యక్తిగా, ఉదారపురుషుడుగా చెలామణి అవుతూ తన కామవాంఛ తీర్చుకోవటానికి నిస్సహాయ స్త్రీల పట్ల ఎంత దుర్మార్గంగా ఉంటాడో తెలియ చెప్పే కథ ‘అరాచకం’.

చీకటి దందాలు చేసే సారా కాంట్రాక్టరు, ప్రజలను ఉద్దరించటానికే పుట్టిన రాజకీయ నాయకుడు, వారి అడుగులకు మడుగులు ఒత్తి బతికే పోలీసు అధికారి. విందు వినోదాలలతో మునిగి తేలుతుండగా ఒక పేదవాని కొడుకు చిల్లర దొంగతనం చేస్తూ దొరికిపోతాడు. వాన్ని అరెస్టుచేసి అవకాశం ఉన్న శాంతికాముకులు కాల్చి చంపే కథ ‘దొంగ’.. పేదవాడు చిన్న తప్పు చేసిన శిక్షలు పెద్దగానే ఉంటాయి. అవసరం అనుకుంటే కాల్చి చంపి దేశంలో శాంతి భద్రతలు కాపాడుతారు. అదే పెద్దవాడు ఏ తప్పు చేసినా ‘బారా కూన్‌ మాఫ్‌’ వాని అడుగులకు మడుగులు ఒత్తుతారు.

సమాజంలో మోసగాళ్ళు, దోపిడిదొంగలు రకరకాలుగా ఉంటారు. అందులో మేధావులుగా చెలామణి అవుతూ అవకాశం రాగానే ఎట్లా సొమ్ము చేసుకుంటారో ఒక సీనియర్‌ జర్నలిస్టు, ఊరప్‌ మాజీ నక్సలైటు కథ ‘ఇంటిలిజెంట్‌ థీఫ్‌’. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ జీవించే అవకాశవాది కథ ‘బతకనేర్చినవాడు’.

సుప్రసిద్ధ కథా రచయిత ‘కాప్కా’ కథలు క్లుప్తంగా సూటిగా ఉంటాయి. ఆయన కథల్లో చెప్పినదానికి, చెప్పాలనుకున్నదానికి పోలిక ఉండదు. మనం మనసుపెట్టి ఆలోచిస్తే కానీ ఆయన కథలోని అంతరార్థం అర్థం కాదు. అటువంటి కథలే ‘చేతులు’ , ‘స్వచ్ఛభారత్‌’.

రాజ్యం చాలా కృారమైంది. పాలకవర్గాలు తమ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించేవారిని, వారు ఎంత ఉన్నత స్థాయి వ్యక్తులైనా వదలదు. అంతు చూసేదాక నిదురపోదు. ‘అసమ్మతి’ కథలో ఒక గవర్నమెంట్‌ సంస్థ డైరెక్టర్‌ రాజకీయ అవినీతితో సంస్థకు తెల్ల ఏనుగులా మారబోయే ప్రాజెక్టును వ్యతిరేకించిన పాపానికి కంపల్‌సరి రిటైర్‌మెంటు చేస్తారు. ‘అధికారి’ కథలో సీనియర్‌ ఐపీయస్‌ అధికారి సెంట్రల్‌ గవర్నమెంటులో సెక్రటరీ స్థాయి ఉద్యోగి ఒక కార్పొరేటు సంస్థ చేపట్టిన మాంగనీస్‌ క్వారీ రూల్స్‌కు విరుద్ధంగా ఉందని వ్యతిరేకించినందుకు, ఆయన ఆఫీసులోనే అతణ్ణి లిఫ్టు నుండి కిందికి తోసి హత్య చేస్తారు.

‘గంజాయి’ కథలో రైతుకు భూమికి ఉండే సంబంధాన్ని తెలియచేస్తుంది. వృత్తులు కోల్పోయి వలసపోయే చేనేత కార్మికుని కథ ‘వలస’ పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎలా అణచివేతకు గురవుతారో తెలియచెప్పే కథ ‘స్త్రీ’.

ప్రతీది డబ్బు, హోదాలతో కొలువబడే నేటి వ్యాపార సమాజంలో మానవ విలువలు ఎలా పతనం అవుతున్నాయో చెప్పే కథ ‘పరాయీకరణ’. గొర్రె కసాయివాడిని నమ్మినట్లుగానే సామాన్య జనం తమకు బతుకు లేకుండా చేస్తున్నవారిని నమ్ముతారు. మోసగాళ్లు విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఉదార పురుషుడుగా భావిస్తారో చెప్పే కథ ‘చావు’.

వట్టిపోయిన ఆవును కటిక వానికి అప్పచెప్పినట్లు లాభాలు వచ్చినంతసేపు నడుపుకొని, ఇక లాభాలు రావని తెల్సినప్పుడు నిర్ధాక్షిణ్యంగా మూసివేసి మూడువేలమంది సర్‌సిల్క్‌ కార్మికులను వీధుల్లోకి నెట్టింది బిర్లా మెనేజుమెంటు. మరోవైపు అదే బిర్లాలు హైద్రాబాద్‌ నడిబొడ్డున నౌబత్‌ పహడ్‌పై ‘బిర్లామందిర్‌’ను నిర్మించింది. పాలనురుగులాంటి పాలరాతి బిర్లామందిర్‌ పనులు కోల్పోయి బతుకు లెకుండా పోయిన మూడు వేలమంది సర్‌సిల్క్‌ కార్మికులు రక్తంతో తడిసిపోయింది అంటే తప్పేమి కన్పించదు.

పాము పుట్టలో వేలు పెట్టనంత వరకు ఓకే. ఒకవేళ పెట్టినవే అనుకో నిలువున విషం చిమ్మి అంతం చేస్తుంది. దోపిడీ వ్యవస్థ కూడా అంతే. వాళ్ళ దోపిడీని ప్రశ్నించినా, న్యాయం కోసం నిలబడి ఎదిరించినా నిన్ను అంతం చేసేదాక వదిలి పెట్టదు. అంతవరదాక వేసుకున్న శాంతి ` అహింస, ప్రజాస్వామ్యం వంటి ముసుగులు తొలగించుకొని ఒక నగ్నమైన ఫాసిస్టు మొఖం పొడుచుకువస్తుంది. అప్పుడిక ఏ విలువలు ఉండవు. రాత్రులకు రాత్రులు ఇండ్లమీద దాడులు చేసి తిండి గింజల్లో విషం కలుపగలరు. పంటపొలాలను తగులబెట్టగలరు. ఇండ్లు కూల్చగలరు. అందరు చూస్తుండగానే తల్లిదండ్రుల కండ్ల ముందు పెండ్లాం పక్కలో పన్న వాన్ని గద్దలా తన్నుకపోగలరు. మనకండ్ల ముందే ఎత్తుకపోయిన వాళ్ళను కాల్చి చంపి ఊరి చివర డొంకలో పారవేసి ఎదురుకాల్పుల కట్టు కథలు అల్లగలరు. మనం ఏమి చెయ్యలేం. మన కండ్ల ముందే జరిగినా సాక్ష్యం చెప్పకుండా కుత్తుక మీద బాయినెట్‌లు ఎక్కుపెట్టబడతాయి. ఘనత వహించిన కోర్టులు సాక్ష్యాలు సరిగాలేవని కేసులు కొట్టి వేస్తాయి. ఎంతమందిని చంపితే అన్ని అగ్జలరీ ప్రమోషన్లు ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించే పాలకులు ఉన్నప్పుడు ఎవరికి మాత్రం భయం ఉంటుంది.

అయినా ప్రజలపై ఇంత హింస ఎందుకు?

పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలన్నందుకు. మేం చేసిన కష్టం మాకే చెందాలన్నందుకు. కష్టపడి పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కావాలన్నందుకు. నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలన్నందుకు. తరతరాలుగా ఉంటున్న మా నేల మాకే కావాలన్నందుకు. అన్యాయాన్ని వ్యతిరేకించినందుకు. దోపిడీ అణచివేతలను ప్రశ్నించినందుకు. ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా వారిపై ఇంత హింసాకాండ అమలు జరుపటం ఏం న్యాయం? స్వాతంత్రం వచ్చి డెబ్బైjైుదు సంవత్సరాలు గడిచినా ఈ పరిస్థితి మారదా!

అదిగో అటువంటి రాజ్యహింసను ఎత్తిపట్టిన కథలు కొన్ని ఈ సంపుటిలో ఉన్నాయి.

‘జులుం’ కథలో సింగరేణిలో సమ్మె జరుగుతుంటుంది. ఆ సమ్మెకు విప్లవ కార్మిక సంఘం కార్యకర్త చంద్రయ్య నాయకుడుగా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తారు. దీంతో పోలీసులు చంద్రయ్య అనే పేరున్న మరోకార్మికుని ఇంటి మీద రాత్రికి రాత్రి దాడిచేసి ఎత్తుకుపోతారు. నిజం చెప్పమని తీవ్రంగా చిత్రహింసలు పెడుతారు. అమాయకుడైన చంద్రయ్య నోరు విప్పకపోయేసరికి ‘పోలీసులు అటుకాలు ఇటుకాలు పట్టుకొని జరాసందున్ని చీల్చినట్టుగా చీల్చుతారు. చంద్రయ్య చనిపోతాడు. ఆ శవాన్ని తీసుకపోయి గుట్టుచప్పుడు కాకుండా పాతిపెడతారు. భర్త జాడ కోసం చంద్రయ్య భార్య తిరుగని చోటుండదు. కలువని నాయకుడు ఉండడు. చివరికి మానవతామూర్తి అయిన ఓ జర్నలిస్టును కలుస్తుంది. ఆ పాత్రికేయుని ఇన్‌వెస్టుగేషన్‌లో మనకు విషయమంతా తెలుస్తుంది. బయట జరిగినదానితో తమకు సంబంధంలేదంటూ మెనేజుమెంటు చేతులు దులుపుకుంటుంది. నేరస్తులు ఎవరికీ ఏం కాదు. సంపాదించే భర్తను కోల్పోయి తిండి తిప్పలకు కటకటలాడుతు చివరకు తన ముగ్గురి పిల్లలతో ఆత్మహత్య చేసుకునే విషాదాంతాన్ని మనం జీర్ణించుకోలేం.

తెలంగాణలో విప్లవోద్యమం బలంగా పనిచేస్తున్న కాలంలో విప్లవకారులను, వాళ్ళ సానుభూతిపరులను పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకపోయి గుర్తు తెలియని శవాలుగా మార్చటం యధేచ్చగా సాగింది. సింగరేణిలో కూడా అటువంటి సంఘటనలు జరిగాయి. కార్మికుని కొడుకైన తిప్పారపు సమ్మయ్యను, గర్భవతిగా ఉన్న భార్యకు మందులు తీసుకొని వస్తుంటే కలువల సారయ్యను, డ్యూటి చేసి ఇంటికి తిరిగి వస్తున్న నాగవేయన పాల్గుణను మాయం చేసి గుర్తు తెలియని శవాలుగా మార్చారు. కొంతమంది శవాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. అటువంటి దుర్మార్గాన్ని ఎత్తి పట్టిన కథ ‘సన్న జీవాలు’.

‘జల్లెడ’ కథలో కొడుకు అన్నల్లో తిరుగుతుంటాడు. తండ్రి కానిస్టేబుల్‌గా అంటీ నక్సలైట్‌ స్క్వాడ్‌లో పని చేస్తుంటాడు. మనకంట్లో మన వేలుతో పొడిచే వ్యవస్థ దుర్మార్గాన్ని చెప్పే కథ. ఈ కథలో ముగింపు మాత్రం మనం అస్సలు ఊహించలేం.

తన కొడుకును ఇంట్లో నుండి తన కండ్లముందు నుండే ఎత్తుకపోయి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపితే పిచ్చివాడైన కార్మికుని కథ ‘ఒక తండ్రి’. చివరికి ప్రజాకళా రూపాలకు తన డప్పు సహకారం అందించిన, డప్పు కళాకారున్ని కూడా వదలకుండా ఎత్తుకపోయి హత్యచేసి గుర్తు తెలియని శవంగా రైల్వే పట్టాల మీద పడవేస్తారు. కాని ప్రజాకళాకారులకు అంతం ఉండదని మోళ్ళూ కూడా చిగురిస్తాయని ఎంతో ఆశావాదాన్ని కల్గిస్తుంది ‘డప్పోడు’ కథ.

వ్యాపారం పేరిట వలస వచ్చిన పిడికెడు మంది బ్రిటిషు వాళ్ళు దాదాపు మూడు వందల సంవత్సరాలు మనదేశాన్ని పరిపాలించారు. అందుకు కారణం ఏ ప్రజలనైతే తాము పీడిస్తున్నారో, ఆ ప్రజలనుండే కొంత మందిని పోలీసులుగా సైనికులుగా నియమించుకొని తమకు రక్షణ కవచంగా వాడుకోవటం వల్లనే సాధ్యమైంది. లేకుంటే తుప్పుకు కొట్టుకపోయ్యేవాళ్ళు. ఆ మాటకు వస్తే ఒక బ్రిటిష్‌ వాడే కాదు దోపిడి పాలకులు ఎవరైన అనాదిగా అదే చేస్తున్నారు. ప్రజలను దోపిడీ పీడనలకు గురి చేస్తున్నారు. అదే ప్రజల నుండి ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థను ఉపయోగించి తిరగబడే ప్రజలను అణచివేస్తున్నారు. అందుకే ప్రజాకవి చెరబండరాజు, మాలోని మనిషివే మా మనిషివే నీవు పొట్టకూటికి పోలీసు అయినావు అంటూ పాట రాసిండు.

బతుకు తెరువు లేని ఒక పేద కుటుంబంలో ఒక కొడుకు పొట్ట కోసం పోలీసైతే, మరో కొడుకు సమాజాన్ని మార్చాలనే లక్ష్యంతో విప్లవకారుడైనాడు. చివరికి తల్లి చనిపోతే ఎవ్వరూ రాని పరిస్థితిని ‘కొడుకులు’ కథలో చూడవచ్చు.

చనిపోయిన జవాన్ల శవపేటికల కొనుగోలులో అవినీతికి పాల్పడి ‘శవపేటికల మీద పైసలు ఏరుకునే నాయకులే పాలకులైండ్లు. తమ అధికారం నిలబెట్టుకోవడానికి ఎంతటి పాపానికైన ఒడిగట్టే నాయకులు సృష్టించే కృత్రిమ, కుహన యుద్ధంలో సామాన్యుల పిల్లలే సైనికులుగా బలి పశువులు అవుతారు. ఈ మర్మం తెలిసిన గని కార్మికుడు ఒకరు తన కొడుక్కి సైనికుడుగా ఆర్మీలో ఉద్యోగం రావటం అస్సలు ఇష్టం ఉండక పోవటమే ‘సైనికుడు’ కథ.

పురిటినొప్పులు పడకుండా ఏ తల్లి ప్రసవించదు. అధికారంలో ఉన్న దోపిడి వర్గాలు అంత తొందరగ తమ అధికారం వదులుకోరు. ప్రజలు తమ న్యాయమైన సమస్యలపై ఉద్యమించిన ప్రతీసారి తమ పశుబలంతో అణచివేస్తూ ప్రజా పోరాటాలను రక్తసిక్తం చేస్తారు. అందుకే మావో విప్లవం విందు భోజనం కాదు. ఒక వర్గం మరోవర్గం మీద దాడి చేసి బలవంతంగా రాజ్యాధికారం గుంజుకోవటమే అంటాడు.

దాదాపు గత యాబై ఏండ్లుగా మనదేశంలో పీడిత ప్రజలు తమ విముక్తి కోసం సాయుధ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో అనేకమంది శత్రువు తూటాలకు బలై తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి అమరులైనారు. ఆశయ సాధనలో నేలకొరిగిన తమ సహచరులను తలుచుకుంటూ ఒక కంట కన్నీరు కారుస్తూనే మరోవైపు లక్ష్యసాధనకు పోరాటాన్ని ముందుకు తీసుకపోతున్నారు.

పోరాటం సామాన్య జనాలను అసమాన యోధులుగా తీర్చి దిద్దుతుంది. సమసమాజ నిర్మాణం కోసం ప్రజలు అనేక త్యాగాలు చేస్తూ నూతన చరిత్ర సృష్టిస్తారు. అటువంటి ప్రజల చరిత్రను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రజా రచయితలపై ఉంది. అటువంటి బాధ్యతను రచయిత సమర్థవంతంగా నిర్వహించాడని ఇందులోని పోరాట కథలు తెలియచేస్తాయి.

‘పిల్లవాని తెలివి’ కథ గోదావరిఖని పైవ్‌ ఇంక్లయిన్‌ కాలనీలోని ఒక కార్మికుని ఇల్లు కేంద్రంగా సాగుతుంది. విప్లవ సానుభూతిపరుడైన ఆ కార్మికుని ఇంట్లో సికాస కార్యకర్త షల్టర్‌ తీసుకుంటాడు. పోలీసులు కాలనీని చుట్టుముట్టి ఇంటింటిని సోదా చేస్తూ కార్యకర్త కోసం వెతుకుతుంటారు. అటువంటి క్లిష్ట సమయంలో ఏం చెయ్యాలో తోచక సతమతమౌతుంటే బడికి పోయ్యే చిన్న పిల్లవాడు ‘అన్న తుపాకిని నా బ్యాగ్‌లో పెట్టుకొని సైకిల్‌ మీద స్కూల్‌కు పోయినట్టు పోదాం’ అంటూ ఉపాయం చేసి కార్యకర్తను తప్పించటమే కథ సారాంశం.

ఇంటి మీద దాడికి వచ్చిన పోలీసులకు తన కన్న కొడుకును అప్పగించి విప్లవకారున్ని కాపాడిన ఒక తల్లి కథే ‘అమ్మ’ అటువంటి తల్లులే లేకుంటే విప్లవం ఎప్పుడో అడుగంటి పోయ్యేది కదా!

‘కమల’ కథలో భర్తను పోలీసులు అరెస్టు చేసి జైలు పాలు చేసినా కుటుంబం గడవని స్థితిలో నిండు గర్భిణి అయిన ఒక సామాన్య స్త్రీక్లిష్టపరిస్థితిలో కూడా 

ఉద్యమాన్ని ఆదరిస్తుంది. విప్లవం అంటే మనిషిని ప్రేమించటమే. ఉన్నత మానవ సంబంధాలను నెలకొల్పటమే అని ‘కమల’ కథ తెలియచేస్తుంది.

నదులన్నీ పోయి సముద్రంలో కలవాల్సిందే. పేదరికంలో కునారిల్లిన బతుకులన్నీ విప్లవోద్యమంలో కలవాల్సిందే. అంతకుమించి మార్గం ఏమిలేదు. కార్మిక వాడల్లో కూరగాయలు అమ్ముకొని బతికే ఒక పేదతల్లి కొడుకు, ఇంకా రెక్కలయిన ముదరని పిల్లవాడు విప్లవోద్యమంలో భాగస్వామిjైు ఆగస్టు పదిహేను విద్రోహాన్ని ఎండగడుతాడు. రామక్రిష్టపూర్‌లో నల్లజెండా ఎగరేసి పోలీసు తూటాలకు బలై నేలరాలిపోవటమే ‘నేలరాలిన వసంతం’ కథ.

ప్రజా గెరిల్లాలనే లక్ష్యంగా పెట్టుకొని పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతుంటే నీటిలోని చేపలాగా గెరిల్లాలు ప్రజలను అంటిపెట్టుకొని తిండి తిప్పలు లేకుండా విప్లవమే ఊపిరిగా ఎలా బతుకుతారో తెలియచేసే కథ ‘గెరిల్లా’.

జన్మత వచ్చిన గుండెజబ్బు తీవ్రంగా బాధిస్తున్న లెక్కచెయ్యక పిడికెడు పిడికెడు గోలీలు బుక్కుతూ సడలని దీక్షతో హుజురాబాద్‌ ఏరియాలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తాడు.  ఆదిలాబాద్‌ జిల్లాలో చెన్నూర్‌ అడవుల్లో గిరిజనుల మధ్య పనిచేస్తూ పిన్నారం గ్రామంలో పోలీసు కాల్పుల్లో అమరుడైన పల్లె కనకయ్య అమరత్వాన్ని తెలిపే కథ ‘ఒరిగిన అన్నలకు ఎన్నియలో’.

తెలంగాణలో పల్లెపల్లెన పోలీసు క్యాంపులు పెట్టి విప్లవకారులను, విప్లవ సానుభూతిపరులను పిట్టల్లా కాల్చివేస్తూ బీభత్సం కొనసాగింది. నిర్భందపు చీకటి కడుపులోనే ఒక వెలుగురేఖ వికసించి ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతుందని తెలియ చెప్పే కథలు ‘స్వర్ణోత్సవం’ ‘చిగురు’ కథలు.

విప్లవమే వృత్తిగా బతికే భార్యభర్తలైన ఇద్దరు కార్యకర్తలు తమ ఒక్కగానొక్క కొడుకును ఎవరికైనా అప్పగించాలని ప్రయత్నిస్తుంటారు. ఈలోపు పిల్లవానికి జబ్బు చేస్తుంది. ఒక సంఘ నాయకుడి ద్వారా ఆమె పిల్లవాన్ని హాస్పటల్‌కు తీసుకపోతుంది. కాని రోగం వికటించి పిల్లవాడు హాస్పటల్లో మరణిస్తాడు. తెల్లారి మళ్ళీ వస్తానన్న సంఘ నాయకుడు రాడు. చనిపోయిన కొడుకు శవాన్ని తీసుకపోయి దహనం చెయ్యాలని భావించిన ఆ తల్లి చేతిలో ఉన్న కొద్ది డబ్బుతో చనిపోయిన పిల్లవాని శవాన్ని తీసుకపోవటం సాధ్యం కాక శవం అని తెలియకుండా వాన్ని భుజం మీద వేసుకుని బస్సులో బయలుదేరుతుంది. కాని అంతకు ముందురోజే పోలీసులు ఊరుమీద దాడి చేసి సంఘ నాయకునితో సహా చాలామందిని అరెస్టు చేసారని తెలుస్తుంది. దాంతో ఆ తల్లి ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో జోరుగ వర్షం కురుస్తుంటే పొంగి పొర్లే గోదావరిలో తన కొడుకు శవాన్ని వదలుతుంది. ‘ఒకతల్లి’ కథ చదివి కన్నీళ్ళు ఆపుకోవటం కష్టం.

దోపిడి వ్యవస్థ మనిషిలోని రాక్షసత్వాన్ని ప్రేరేపిస్తుంది. విప్లవం మానవత్వాన్ని తట్టి లేపుతుంది. వాకపల్లి సంఘటనలు చూసిన తరువాత ‘వేట’ కథ ఎంతమాత్రం కల్పితం కాదు అని అర్థం అవుతుంది.

విప్లవోద్యమానికి తన కన్నకొడుకును అర్పించిన తల్లి చివరి దశలో అడుక్కొని తినాల్సిన పరిస్థితికి చేరుకుంటుంది. అయినా అపురూపంగా దాచుకున్న తన కొడుకు ‘ఫోటో’ ఆమె చనిపోయిన తరువాత కాని బయటపడదు. విప్లవోద్యమంలో కొడుకులను కోల్పోయిన తల్లులకు ప్రతీక ‘ఫోటో’ కథ.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బతుకు మారలేదు. దోపిడి ఆగలేదు. నిర్బంధాలు, అణచివేత ఆగలేదు. పాలకుల రూపం మారింది కాని సారం ఒక్కటే. అడవుల సంరక్షణ పేరుమీద తరతరాలుగా నివసిస్తున్న గిరిజనులను తరిమేసి అటవి సంపదలను కార్పొరేటు దోపిడీకి అప్పగించటమే లక్ష్యంగా కుట్రలు సాగుతున్నవి. గిరిజనులకు అండగ నిలిచిన విప్లవకారులను వేటాడి చంపటం ఆగలేదు. పోరాటం లేకుండా బతుకులేదని భావించిన ప్రజలు విప్లవకారులను కాపాడుకోవటానికి ఎటువంటి త్యాగాలు సాహస కార్యాలు చేస్తారో తెలియచెప్పే కథ ‘ప్రజలు అజేయులు’.

మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలోనే చంద్‌ ఉద్యమంపై కథలు రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలపై మరికొన్ని కథలున్నాయి. ఇవి కాకుండా రచయిత ఉద్యమం జరుగుతున్న కాలంలో ఉద్యమాన్ని చిత్రిస్తూ ‘తెలంగాణ తల్లి’ ,‘సకల జనులసమ్మె’ అనే రెండు నవలలు రాసారు. తెలంగాణ తల్లి నవల 2011 లో ఉద్యమకాలంలో ‘జనపక్షం’ మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది. సకల జనుల సమ్మె జరుగుతున్న కాలంలోనే సింగరేణి కార్మికులు నిర్వహించిన ‘సకల జనులసమ్మె’ నవలను రాసాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ‘సాహితి గోదావరి’ మాసపత్రికలో వచ్చింది.

మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థి ఉద్యమానికి కేంద్రస్థానంగా ఉంది. విద్యార్థులు అనేక నిర్బాంధాల మధ్య లాఠీ ఛార్జీల మధ్య, రబ్బర్‌ బుల్లెట్ల మధ్య విరోచిత పోరాటం సాగించారు. అయితే స్వార్థ రాజకీయ నేతలు ఆత్మహత్యల హైడ్రామాలు ఆడి ఉద్యమకారులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించిండ్లు. తెలంగాణ చరిత్రలో అనేక ఉద్యమాలు జరిగినవి. మహత్తర రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. కాని తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకోవటం మొదలైంది. ఆ విధంగా ఉద్యమం కాలంలో దాదాపు పన్నెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఒక విద్యార్థి హాస్పటల్లో చావు బతుకుల మధ్య ఉంటాడు. కాని అతని తల్లి కొడుకును చూడటానికి కూడా ఇష్టపడదు. ఎందుకంటే ఆమె తండ్రి తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైండు. ఆమె భర్త సమసమాజాన్ని నిర్మించాలని కలలకంటూ నక్సలైట్‌ ఉద్యమంలో చేరి పోలీసు తూటాలకు బలౌతాడు. అటువంటి పోరాట వారసత్వంలో పుట్టి పోరాడి సచ్చినా ఫర్వాలేదుకాని పిరికిగా ఆత్మహత్యకు ప్రయత్నించటం ఆమె సహించలేకపోతుంది ‘తెలంగాణ’  కథ.

‘ఉత్తరం’ కథలో పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఆంధ్ర వలస పాలకుల వివక్ష వలన ఉద్యోగం రాదు. చివరికి సమాజం మారకుండా పేద ప్రజలకు న్యాయం జరుగదని భావించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ‘చర్చ’ కథ కూడా దాదాపు అటువంటిదే.

ప్రజలు ఏ ఆశయం కోసమైతే, ఏ లక్ష్యం కోసం అయితే పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారో, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ లక్ష్యాలు నెరవేరకుండా పోయాయి. అంతవరదాక తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిసవాళ్ళు పార్టీలు మారి అధికార పీఠం ఎక్కి చేస్తున్న అన్యాయాలను ఎత్తిపట్టిన కథలు ఈ సంపుటిలో కొన్ని ఉన్నాయి.

అటువంటి కథే ‘శవయాత్ర’. రాజమల్లు లాంటి అనామక జనం ఉద్యమ కాలంలో అన్నీ మరిచి ఉద్యమమే ఊపిరిగా బతికిండ్లు. కాని తెలంగాణ వచ్చిన తరువాత వాళ్ళ ఆశలన్ని అడియాసలు కావటంతో నిరాశ నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకుంటాడు. శవాన్ని దహనం చేయటానికి తీసుకపోతుంటే, తెలంగాణ ద్రోహులు పార్టీలు మారి, పదవులు పొంది, నాయకత్వాన్ని మచ్చిక చేసుకోవటానికి ‘నాయకురాలు రాక సందర్భంగా హంగు అర్బాటాలతో, డప్పు చప్పుల్లతో పెద్ద ఊరేగింపు తీస్తారు. అయితే ఊరేగింపు శవం ఎదరు  రావటం శుభ సూచకం కాదని ఒక సందులోకి మళ్ళీస్తారు. ఊరేగింపు వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ శవయాత్ర కొనసాగుతుంది. ఉద్యమమే ఊపిరిగా బతికిన వాళ్ళు శవాలుగా మారుతుంటే, ఉద్యమద్రోహులు ఊరేగటం అనే కఠోర వాస్తవాన్ని చాలా సున్నితంగా మనస్సుకు హత్తుకునేలా చెప్పటం అనితరసాధ్యం. ‘శవయాత్ర’ కథ చదివిన తరువాత మనసు దుఃఖభరితం అవుతుంది. కడుపు రగిలి పోతుంది.

దున్నేవానికి భూమి కోసం తెలంగాణ రైతాంగం దాదాపు శతాబ్దకాలంగా ఎడతెగని పోరాటం చేస్తున్నారు. ఇదే భూమి కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అనేకవేల మంది చనిపోయిండ్లు. లక్షలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. కాని సర్కార్‌ సైన్యాలు వచ్చి ప్రజలను ఊచకోతకోసి పారిపోయిన దొరలకు గాంధీ టోపీలు పెట్టి మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించింది. నేడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అదే జరుగుతుంది. గత యాబై ఏండ్లుగా నిరుపేద రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి అనేక త్యాగాలతో దొరల భూములు స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత భూములు రీసర్వే పేరు మీద ‘ధరణి’ పోర్టల్‌ తీసుక వచ్చి రైతుల ఆధీనంలో ఉన్న భూములు గుంజుకొని తిరిగి ఎలా భూస్వాములకు అప్పచెప్పుతుందో తెలిపే కథ ‘స్థూపం’. గిరిజనులను అడివినుండి తమ భూములను ఖాళీ చేయించే కుట్రలను ఎత్తిచూపిన కథ ‘ప్రజలు అజేయులు’.

వలస పాలనలో రింగ్‌రోడ్ల పేరు మీద రైతుల భూములను గుంజుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోను ‘లాండ్‌ పూలింగ్‌’ పేరుమీద అదే జరుగుతున్నది. అట్లా భూమి పోయి ‘బిక్షగాడు’గా మారిన రైతు కథ ‘బిక్షగాడు’.

గుట్టలు నాశనం చేసి చెరువులు కుంటలు ఎండిపొయ్యేలా చేసిన గ్రానైట్‌ మాఫియా కోట్లు కూడబెట్టుకొని రాజకీయ నాయకులయ్యారు. తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయ పండుగ బతుకమ్మను హంగు ఆర్బాటాలతో నియాన్‌ లైట్ల వెలుగులో హోరేత్తించే ప్రచార హోరులో ఎలా కార్పొరేటీకరించబడిరదో తెలిపే చిన్న కథ ‘బతుకమ్మ’

ఈ కథలు జనం బాధలను, కష్టాలను ఏకరువు పెడుతాయి. వాళ్ళ పోరాటాలను ఎత్తిపడుతాయి. తలక్రిందులైన విలువలను ప్రశ్నిస్తాయి. మనల్ని ఆలోచనల్లో పడవేస్తాయి. ఇక నువ్వు ఏవైపో తెల్చుకొమ్మంటాయి.

అటువంటి జనం గోసలోకి వెళ్దాం రండి.

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

Leave a Reply