(మనిషికి ఎలా జీవించాలో నేర్పటం చాలా ముఖ్యం. అది మానేసి కేవలం ఆర్జనకు సంబంధించిన విద్యలు మాత్రమే నేర్పటం వలనే ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా స్వార్ధం, పేరాశ, వంచన, కుళ్ళు, కపటం, ఇచ్ఛా విహారం జరుగుతున్నాయి. మనిషిలో సంస్కారం లోపించి సమాజంలో తనూ ఒకడినన్న జ్ఞానం నశించిన తరువాత సిరి సంపదలు ఎంతగా విలసిల్లినా దేశం బాగుపడదు. మనిషి అంతరంగాన్ని, ఆలోచనలని, ప్రవర్తనని అందంగా తీర్చి దిద్దేవే సాహిత్యం, కళలు. మనిషి లోపలి ఇంద్రియాలే యంత్రాలు. వాటిని నియంత్రించేదే సాహిత్యం -అఖిలన్ (జ్ఞానపీఠ్ అవార్దు గ్రహిత))
ఏ కళ అయినా ఏంతో కొంత కొత్త జ్ఞానాన్ని ఇవ్వాలి, కొన్ని చిక్కుముడులను విప్పాలి, కొత్త దారులు చూపాలి, మసక తెరలను తెరిచి స్పష్టతను అయినా ఇవ్వాలి. అప్పుడే ఆ కళ అది సాహిత్యం అయినా, సంగీతం అయినా లేదా సినిమా రంగం అయినా ప్రయోజనకారి అవుతుంది. అన్ని కళారూపాలలోకి సినిమా శక్తివంతమైన మాధ్యమం. సమాజం పై ఎంతో ప్రభావం చూపగల శక్తి దానికి వుంది. పెట్టుబడిదారి ప్రపంచంలో అన్ని రంగాలూ పెట్టుబడి కనుసన్నలలోనే వుత్త్పత్తి చేస్తాయి. ఈ రంగాలను ఉపయోగించుకుని పెట్టుబడి తనకు కావలసినట్టుగా మనుషులను తయారు చేస్తుంది. ఆలోచించే మనుషులు దానికి అవసరం లేదు. సంస్కారవంతమైన వారు అవసరం లేదు. వాస్తవికత వున్న ప్రజలు కూడా అవసరం లేదు. అందుకే ఆస్కార్ అవార్డులు అన్నీ ఫాంటసీ సినిమాలకే వస్తున్నాయి .
పెట్టుబడి తనకు లాభం అనుకుంటే పెట్టుబడికి వ్యతిరేకమైన కళలను తనకు ప్రమాదం కానంత మేరకు ప్రోత్సహించగలదు. విప్లవ సినిమాలు లాభం వస్తాయి అనుకుంటే వాటిని నిర్మించ గలదు. ప్రపంచంలో దొరికే సహజ వనరులను పెట్టుబడి ఎలా దోచుకుంటుందో అద్భుతంగా చూపించిన అవతార్ సినిమాను కూడా పెట్టుబడి నిర్మించగలిగింది. అందుకే కొన్ని మంచి సినిమాలు కూడా వచ్చాయి. అలాంటి పెట్టుబడి వికృత రూపాన్ని చర్చిస్తూ వచ్చిన సినిమా ఇన్ టైం.
ఇది ఒక సైన్సు ఫిక్షన్ సినిమా గా మొదలవుతుంది. 2169 వ సంవత్సరంలో జెనెటికల్ ఇంజనీరింగ్ లో చేసిన ఆవిష్కరణలతో ప్రజలందరి వయసు 25 సంవత్సరాల దగ్గర ఆగిపోయివుంటుంది అంటూ సినిమా మొదలవుతుంది. అందరి చేతుల మీద గ్రీన్ కలర్లో టైం డిస్ప్లే అవుతూవుంటుంది. ఈ డిస్ప్లే వారు ఇంకా ఎంతకాలం బతికివుంటారో చూపిస్తూవుంటుంది. ఈ టైం ఎప్పుడైతే జీరో కి వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి చనిపోతాడు. వారిని Timed అవుట్ అంటారు. అందుకే టైం అత్యంత విలువైనది ఈ కాలంలో. డబ్బు స్థానాన్ని కాలం ఆక్రమిస్తుంది. డబ్బు ఎలాంటి పాత్రను ఇప్పుడు పోషిస్తూవుందో కాలం ఆ పాత్రను పోషిస్తుంది. ఏది కొనాలన్నా మిగిలివున్న జీవిత కాలంలో కొంత కాలాన్ని క్రెడిట్ చెయ్యాలి. ఇప్పుడు డబ్బుని మార్చుకుంటున్నట్టు, దాచుకుంటున్నట్టు కాలాన్ని ఒకరినుంచి ఒకరికి మార్చుకోవచ్చు లేదా టైం కాప్సూల్లో దాచుకోవచ్చు. ఎక్కువ జీవిత కాలం చేతిమీద వున్నవారు ధనవంతులు.
ఇప్పుడు ధనవంతులు వుండే ప్రదేశాలు, పేదవారు వుండే స్లమ్స్ లాగా 2169 లో టైం జోన్స్ వుంటాయి. డేటన్ అత్యంత పేదవారు వుండే ప్రదేశం. ఇక్కడ వుండే వారి చేతిమీద అరుదుగా మాత్రమే 24 గంటల కాలం వుంటుంది. ఉత్పత్తి లో భాగస్వామ్యం వీరిదే. కానీ వీరికి 24 గంటల కంటే ఎక్కువ టైం ఎప్పుడూ వుండదు. టైం అవుట్ అయి చాలా మంది వీధులలోనే చనిపోతూవుంటారు. ఇంకో వైపు గ్రీన్ విచ్ బాగా ధనవంతులు వుండే ఏరియా. ఇక్కడి వారి చేతుల మీద వందల సంవత్సరాల కాలం వుంటుంది. వీరు విందులు విలాసాలతో మునిగితేలుతుంటారు. ఏమాత్రం ఉత్పత్తిలో భాగం కాని వారు చిరంజీవులుగా వుండగా ప్రపంచాన్ని నడిపే కార్మికులు తమ కాలం ఎప్పుడు ఆగిపోతుందో అని బ్రతుకు భయంతో వుంటారు ఇప్పుడు ఉన్నట్టే.
105 ఏళ్ళ వయసు వుండి ఇంకా 116 సంవత్సరాల కాలం బతకటానికి వున్నా జీవితం మీద విరక్తి తో వున్న ఒక వ్యక్తి, కాలాన్ని దొంగిలించే వ్యక్తుల నుంచి తనని కాపాడిన హీరో కి తన జీవిత కాలాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసి చనిపోతాడు. డేటన్ లో వారు ఎప్పుడూ పేదవారిగా ఉండటానికి కారణం గ్రీన్ విచ్ లో ఉన్నవాళ్ళు, నిరంతరం ధరలు పెంచుతూ డేటన్ లో వుండే వారి కాలాన్ని దోచుకుంటూ వారు తొందరగా చనిపోయేలాగా చేస్తున్నారని, దోచుకున్న కాలాన్ని క్యాప్సుల్స్ లో దాచుకుంటున్నారని ఆ వ్యక్తి హీరోకి చెబుతాడు. గ్రీన్ విచ్ కి వెళ్ళిన హీరో అక్కడ వున్న టైం టైకూన్స్ ని కలుస్తాడు. ప్రకృతి పరిణామం గురించి వివరించిన డార్విన్ సర్వైవల్ అఫ్ ఫిట్టెస్ట్ ప్రకారం వారు ఫిట్టెస్ట్ కాబట్టి చావులేని వారిగా తాము ఉండటానికి అర్హులం అంటూ తమని సమర్ధించుకుంటారు వారు. దోచుకున్న మిలియన్ సంవత్సరాల కాలాన్ని టైం కాప్సుల్ లో దాచుకుని తరతరాలకు చావు లేకుండా చేసుకుంటుంటారు. వీరి దగ్గర బ్యాంకు లలో దాచుకున్న కాలాన్ని దోచుకుని అందరికీ పంచి పెడుతుంటారు హీరో హీరోయిన్ లు. ఇది ఈ సినిమా కథ.
సైన్స్ ఫిక్షన్, యాక్షన్, డ్రామా అన్నీ కలిసిన సినిమా ఇది. కానీ చాలా పెద్ద విషయాలని చాలా సింపుల్ గా అర్ధం అయ్యేలాగా చెప్పారు. ధరలు ఎందుకు పెరుగుతాయో, పేదవాళ్ళు పేదగానే ఎందుకుంటారో, ధనవంతుల దగ్గర డబ్బు రోజు రోజుకూ ఎలా పెరుగుతుందో ఈ సినిమా బాగా అర్ధం చేయిస్తుంది. గ్రీన్విచ్ లో టైం ని కొల్లగొట్టి డేటన్ కి అందిస్తాడు హీరో. వెంటనే ధరలు పెంచి వారి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండా చేస్తారు టైం టైకూన్స్. టైం టైకూన్ కూతురయిన హీరోయిన్ ని కిడ్నాప్ చేసి 1000 ఏళ్ళు కాలాన్ని అవసరమైన అందరికీ ఇవ్వమని, హీరో డిమాండ్ చేస్తాడు. కూతురి చావునే కోరుకుంటాడు టైకూన్. పెట్టుబడి తన యజమానినైనా చంపటానికి సిద్ధపడుతుంది అన్న మాటలు గుర్తుకు వస్తాయి.
ఏ వ్యవస్థ అయినా ఆ కాలంలో వున్న రాజ్యాన్ని రక్షించటానికే. 2169 లో కూడా ఇప్పుడు వున్న పోలీస్ వ్యవస్థ లాంటి టైం కీపర్ అనే వ్యవస్థ వున్నట్టు చూపుతారు ఈ సినిమాలో. వారికి కూడా బతకటానికి కావలసినంత కాలం వుండదు. వారి పరిస్థితికి కారణమైన వారిని కాకుండా వారి స్థితిని మార్చాలని ప్రయత్నించేవారినే నేరస్తులుగా చూస్తుంటారు. పేద వాళ్ళనే దోచుకునే విలన్ పాత్ర వుంటుంది. ఒక సందర్భం లో హీరో తో నేను నీలాగా గ్రీన్ విచ్ వాళ్ళను దోచుకోను, నా జనాలనే దోచుకుంటాను, అందుకే టైం కీపర్స్, గ్రీన్ విచ్ వాళ్ళు నన్ను పట్టుకోరు అంటాడు హీరోతో. మన రాజకీయ నాయకులను పోలివుంటారు ఈ దొంగలు.
చాలీ చాలని జీతాలతో వుంటూ వుమ్మడిగా పని చేసే కార్మికుల వల్లే విప్లవం వస్తుంది, ప్రొలెటేరియన్స్ వల్ల విప్లవం రాదు అంటారు లెనిన్. ఈ సినిమాలో డేటన్ లోని కార్మికులను చైతన్యం లేని మనుషులుగా చూపిస్తారు. అన్ని సినిమాల లాగానే కాలం ఎక్కువ ఉన్న వాడిని దోచి పేదవాడికి పెట్టటం అనే పద్ధతిలోనే సినిమా ఆపేసారు. కానీ ఒక కమర్షియల్ సినిమాలో అత్యంత ముఖ్యమైన పెట్టుబడిదారి పద్ధతిని చాలా సులభంగా అర్దం అయ్యేటట్టుగా తీయటం లో విజయవంతం అయ్యారు. 2011 లో విడుదల అయిన ఈ సినిమా నెట్ ఫ్లిక్ష్ లో వుంది.
మంచి పరిచయం. థాంక్యూ.