కొలకలూరి ఇనాక్ ప్రవృత్తి రీత్యా సృజన సాహిత్య కారుడు.కానీ తెలుగులో ఎమ్మే పిహెచ్ డి లు చేసి విశ్వవిద్యాలయ అధ్యాపకత్వం వృత్తిగా చేసుకొనటం వల్ల ఆయన పరిశోధకుడు, విమర్శకుడు కూడా అయినాడు.
పరిశోధన, విమర్శ రెండూ విజ్ఞానాభివృద్ధి సాధనాలు. అపారమైన జ్ఞాననైపుణ్యాలు, కఠోరమైన శ్రమ లేనిదే పరిశోధన, విమర్శ సాధ్యం కావు. మన చుట్టూ ఉన్న సాహిత్య ప్రపంచాన్ని అర్ధంచేసుకుని అభినందించగల సామర్ధ్యాన్ని పెంచటంలో ఆ రెండింటికి అనితర ప్రాధాన్యత ఉంది. పరిశోధన ప్రధానంగా విషయసేకరణకు,మదింపుకు, నిర్ధారణకు, నూతన ప్రతిపాదనకు సంబంధించింది. విమర్శ ప్రధానంగా ఒక రచనను శబ్దార్ధ సంయోజన విచారణ ప్రాతిపదికగా, సాహిత్య ప్రయోజన కోణం నుండి గుణాగుణాలను హేతుబద్ధంగా తర్కించి నిరూపించటానికి సంబంధించింది. అయినప్పటికీ రెండింటికి పరస్పర సంబంధం లేకపోలేదు. పరిశోధనలో విమర్శ సాధనం అవుతుంటుంది. విమర్శకు పరిశోధన అవసరం అవుతుంటుంది. పరిశోధన అయినా విమర్శ అయినా దేశకాల సామాజిక పరిణామాల సంబంధంలో జరగవలసినవే.
ఇనాక్ పరిశోధన 1968 లో పిహెచ్ డి డిగ్రీకోసం తెలుగు వ్యాస పరిణామం పై పనితో మొదలైంది. మూడేళ్లపాటు చేసిన పనికి 1974లో ఆయనకు ఆశించిన ఫలితం దక్కింది. 1981 నాటికి ఆ పరిశోధన గ్రంధరూపంలో అందరికీ అందుబాటులోకి వచ్చింది. 1974 లో ఈ అంశం పైననే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సదస్సులో ఉపన్యాసం కూడా ఇచ్చారు. దానితోపాటు అదే సాహిత్యకాడెమీ సదస్సులలో 1977లో తెలుగు సాహిత్య విమర్శ పైన, 1983లో తెలుగు జానపద పరిశోధన పైన చేసిన ప్రసంగాలతో 2013 లో పత్రత్రయి అనే పుస్తకం వచ్చింది. జానపద పరిశోధనలపై చేసిన ఈ ప్రసంగాన్ని మరింత అధ్యయనంతో అభివృద్ధిపరచి 2010 లో జానపదుల సాహిత్య విమర్శ అనే సిద్ధాంత గ్రంధం ఆయన ప్రచురించారు. 2018 లో మిత్ర సమాసం అనే లఘు సిద్ధాంత గ్రంథ ప్రచురణ జరిగింది. ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం (1996), విమర్శిని (?) తెలుగులో తోలినవల వంటి విమర్శ గ్రంధాలు కూడా ఉన్నాయి. ఇనాక్ తెలుగులో పరిశోధన విమర్శల వికాసానికి చేసిన దోహదాన్ని మదింపు చేయటానికి ఇవి సరిపోతాయి.
1
పరిశోధన కు ఎంచుకొనే అంశం ఆసక్తికి సంబంధించినది. అంతకు ముందు చేసిన అధ్యయనం నుండి కలిగిన ప్రేరణల పరిణామంగా అది రూపు దిద్దుకొంటుంది. అప్పటికి ఆ అంశం ఎవరూ పట్టించుకోనిది కూడా కావాలి. ఒక వేళ ఎవరైనా పరిశోధించినా వాళ్ళు చూడని కొత్త కోణం ఏదో ఆవిష్కరించగల అవకాశం ఉంటే అది పరిశోధనకు స్వీకరించదగింది అవుతుంది. ఇనాక్ పరిశోధనాంశం ఎంచుకోవలసిన సమయానికి ప్రాచీన, ఆధునిక కావ్యాలపైనా వచన రచనలైన కథ నవల, నాటకం వంటి ప్రక్రియలపైనా పరిశోధనలు బాగానే జరిగాయి. అందువల్ల అప్పటివరకు పరిశోధకుల దృష్టి పడకుండా మిగిలిపోయిన వ్యాసప్రక్రియ పై పరిశోధనకు ఇనాక్ సిద్ధపడ్డారు. వ్యాసం సృజన విమర్శల కూడలి కావటం ఆయనను ప్రధమంగా ఆకర్షించిన విషయం.
వ్యాసం పై ఇనాక్ పరిశోధన ఒక రచయిత రచనలకు సంబంధించింది కాదు. అందువల్ల అధ్యయనానికి ముడి సరుకు అయిన వ్యాసాలు సేకరించుకోవలసిందే. ప్రసిద్ధమైన వ్యాస సంపుటాలు, సంకలనాలను గ్రంధాలయాలలోనో, పుస్తకాల షాపుల్లోనో ఉన్నాయేమో చూసి సంపాదించవచ్చు. కానీ వివిధ పత్రికలలో అచ్చయిన వ్యాసాల సేకరణ పెద్దపని. గ్రంధాలయాలలో ప్రతిపత్రికను తీసి చూడాలి. ఒక గ్రంధాలయంలోనే అన్నీ దొరకవు. దేశమంతా విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. అనేకమంది వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. అంతా శ్రమ తో కూడుకొన్న పని. సేకరించే కొద్దీ పోగుపడే సమాచారం సమగ్రం కావచ్చు కానీ ఎప్పటికీ సంపూర్ణం కాదు. అయితే ఈ తవ్వకపు పనిలో నీళ్లు, నిధులు బయటపడే కొద్దీ పరిశోధకులకు కలిగే సంతోషం పడిన శ్రమను మరిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు. సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేయటం, సామాన్య, వైరుధ్య అంశాలను గుర్తించి వాటి ప్రాతిపదికన వర్గీకరణ చేయటం మొత్తంగా వ్యాస పరిణామాన్ని మదింపు చేయటం మరొక ఎత్తు . ఈ రెండింటిలో ఇనాక్ శక్తి సామర్ధ్యాల ఫలితం ఈ సిద్ధాంత గ్రంధం.
ఈ పుస్తకంలో అధ్యయాలు ఆరు. వ్యాసం బ్రిటిష్ వలస పాలనా కాలంలో తెలుగువారికి తెలియవచ్చిన వచన ప్రక్రియ. తెలుగులో ఈ పద్ధతిలో కాకపోయినా కావ్యాలలో భాగంగా గద్యం అనే పేరుతో వచనం ఉంది. వ్యాసం పూర్తిగా భిన్నమైనది. అయినా తెలుగు వ్యాసపరిణామ నిరూపణకు భూమికగా గద్యం అనే ప్రక్రియ స్వరూప స్వభావాలను కావ్యాలనుండి శాసనాలవరకు భక్తి, చారిత్రక రచనలవరకూ ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో స్థూలంగా వివరించి, ఆంగ్ల వచన పరిణామాన్ని పరిచయం చేసి ఆంగ్ల విద్యా ప్రభావం వల్ల తెలుగులో ఆధునిక వచనరచనకు పడిన దారులను చూపిస్తుంది మొదటి అధ్యాయం. వచనానికి ఆలోచనకు, చైతన్యానికి ఉన్న సంబంధాన్ని, వచనానికి సామాజిక పరిణామానికి ఉన్న సంబంధాన్ని ఈ అధ్యాయంలో ఆయన స్పష్టంగా గుర్తించి చెప్పారు. రెండవ అధ్యాయంలో వచనంలో ప్రత్యేక ప్రక్రియ అయినా వ్యాసం ఆంగ్ల భాషలో ఎలా వికసించిందో చెప్పి అటు ఆంగ్ల రచయితలు, ఇటు తెలుగు రచయితలు వ్యాసానికి ఇచ్చిన నిర్వచనాలు, వివరణలు తులనాత్మకంగా పరిశీలిస్తూ లక్షణాలను క్రోడీకరించే ప్రయత్నం చేశారు. వ్యాసానికి వస్తువు ఏదైనా కావచ్చు. అది రచయితలో కలిగించే ఆలోచన, అనుభూతి ప్రధానమైనవి. ఆ వస్తువు గురించిన అవగాహనను జనం లో కలిగించటం వ్యాస రచన ఉద్దేశం. అందువల్ల మిగిలిన సాహిత్య ప్రక్రియలలో వలె రచయిత తనను మరుగుపరచుకునే అవకాశం ఇందులో ఉండదు. రచయిత వ్యక్తిత్వం, దృక్పథం స్పష్టంగా వ్యక్తమయ్యే ప్రక్రియ వ్యాసం అని ఈ అధ్యాయం సూచిస్తుంది.
మూడవ అధ్యాయం సృజన వ్యాసం. వ్యాస పరిణామంలో సృజన వ్యాసం ఒక శిఖరం, విమర్శ వ్యాసం మరొక శిఖరం అంటారు ఇనాక్. హృదయ ప్రాధాన్యత,కాల్పనికత ప్రధానంగా ఉన్నది సృజన వ్యాసం అయితే బుద్ధి ప్రధానమై ధర్మనిరూపణ లక్షణం ఉన్నప్పుడు అది విమర్శ వ్యాసం.ఇనాక్ ఇచ్చిన ఈ వివరణలు ఏ అవసరం కోసం, ఏరకమైన వ్యాసాలు చదువుతున్న వాళ్ళకయినా వాటి స్వభావాన్ని అర్ధంచేసుకొనటానికి దారి చూపుతాయి. వ్యాసాన్ని నవయుగ వ్యాసం, స్త్రీ వ్యాసం, పత్రికా వ్యాసం,వివాద వ్యాసం అని నాలుగు రకాలుగా వర్గీకరించి వివరించారు.
నవయుగ వ్యాసం అనే శీర్షిక కింద వీరేశలింగం తో తెలుగులో వ్యాసరచన మొదలైనట్లు అనుకొంటున్నప్పటికీ నిర్దిష్ట విషయ వివరణ, బోధ ప్రధానంగా పురాణేతిహాసాలలో ఉన్న సందర్భాలు వ్యాస ప్రాయమే అని, కోర్టు కేసులు, వాదనలు, తీర్పులు మొదలైన వాటిలో కూడా కొన్ని సందర్భాలలో అది కనబడుతుందని పూర్వులు వ్రాసినవాటిని ఉదహరిస్తూ చేసిన వివరణ ఆసక్తి కరం. ఇనాక్ నవలలు, యాత్రాచరిత్రలు మొదలైన వాటిలో అంతర్భాగంగా వ్యాసం అనదగిన రచనలు ఉన్నాయని సోదాహరణంగా నిరూపించారు. ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం అనే పేర్లతో వచ్చిన రచనలు వ్యాస లక్షణ లక్షితలని నిరూపించారు. ఈ క్రమంలో ఇనాక్ పరిచయం చేసిన హితసూచని, స్త్రీకళా కల్లోలిని అనే రెండు పుస్తకాలు హేతుబద్ధత, తర్కం ప్రధానంగా సామాజిక అసమానతలను, మౌఢ్యాన్ని అర్ధం చేయించి ప్రజలను వాటికి విముఖులుగా చేసే లక్ష్యంతో వచ్చాయి కనుక ఆ తరువాతి కాలంలో స్త్రీల విషయంలో సంఘసంస్కరణ ఉద్యమ ప్రారంభ స్వభావాన్ని అధ్యయనం చేయటానికి సాధికార వనరుగా అందివచ్చాయి. కందుకూరి వ్యాసాల వస్తుపర వర్గీకరణ, ఆయన మీద పూర్వ వ్యాస రచయితల ప్రభావం, అతని సమకాలికులైన వ్యాస రచయితలను పరిచయం చేసి గురజాడ,గిడుగు దగ్గర నుండి పానుగంటి, కట్టమంచి, చెళ్ళపిళ్ళ చలం మొదలైన వారి వ్యాసరచన విషయ విన్యాసాలను వివరించటంతో ఈ అధ్యాయాన్ని ముగించారు. ఈ మధ్యకాలంలో సామాజిక విమర్శన వ్యాసం, సాహిత్య విమర్శన వ్యాసం ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చాయో సమాంతరంగా చూపించబడింది. ఈ అధ్యాయంలో వ్యాస ప్రక్రియా పరిణామం ప్రధానంగా వ్యక్తుల కోణం నుండి, అంటే ఒకరచయితను పేర్కొంటూ వ్యాసప్రక్రియలో వాళ్ళ కృషిని సమీక్షించటంగా సాగితే పత్రికా వ్యాసం అనే అధ్యా యంలో తెలుగులో వచ్చిన పత్రికలను ప్రత్యేకంగా పేర్కొంటూ వాటిలో వివిధ శీర్షికల కింద ప్రచురించబడిన వ్యాసాల సమీక్షగా సాగింది.ఈ రెండు అధ్యాయాలను కలిపి చూస్తే సామాజిక సాహిత్య అధ్యయనాలకు, పత్రికా రంగానికి సంబంధించిన ఒక చారిత్రక అవగాహన అందివస్తుంది.
ఏ రచయిత పై ఎవరు ఏ కోణం నుండి పరిశోధన చేస్తున్నా, ఆ రచయితల ఆలోచనారీతి, సామాజిక దృక్పథం గురించి అవగాహన ఏర్పరచుకొనటానికైనా, ఆరచయితల రచనల ప్రచురణల సమాచారం ఎమన్నా తెలుసుకోవాలన్నా ఇప్పటికీ వ్యాసపరిణామం ప్రధమం గా సంప్రదించవలసిన పుస్తకం. ఈ పుస్తకానికి అనుబంధంగా 19 వ శతాబ్ది తెలుగు పత్రికలు అనే శీర్షికతో 1835 నుండి 1899 వరకు వచ్చిన 87 పత్రికల జాబితా చాలా విలువైనది.ఇవి ఆనాడు తన పరిశోధన కోసం ఇనాక్ చూసిన పత్రికలు కావచ్చు కానీ ఈ నాడు పదునెక్కిన కొత్త చూపుతో ఆ పత్రికలను సేకరించి పరిశీలించగలిగితే తెలుగు సమాజ సాహిత్య చరిత్ర నిర్మాణానికి అవసరమైన కొత్త ఖనిజం దొరకకపోదు.
వ్యాసాల విషయపర వర్గీకరణ, వివరణ, విశ్లేషణ ప్రధానంగా వ్రాసిన అధ్యాయాలు వివాద వ్యాసం, విమర్శన వ్యాసం. ఒక వ్యాసంలోని విషయంతో విభేదిస్తూ వెక్కిరింతగానో, హేళనగానో, ఖండనగానో,దూషణగానో, సవరణగానో వ్రాసే వ్యాసాలు వివాదవ్యాసాలు. వ్యక్తుల అహంకారం, మూర్ఖత్వం, పట్టుదల, విషయంలోని మంచి చెడ్డల తీవ్రత వివాదాస్పద వ్యాసానికి మూలం అని చెప్పి ఆయన చూపిన ఉదాహరణలు చూస్తే సాహిత్య రంగంలో వాదవివాదాలు ఎంత పాతవో అర్ధం అవుతుంది. విషయపరంగా విమర్శన వ్యాసాన్ని పరిచయం చేసేటప్పుడు చెప్పిన కావ్య తత్వ నిరూపణ, కావ్యాత్మ నిరూపణ, కవ్యాత్మ నిరూపణ అనే మూడు శబ్ద సామ్యం రీత్యా ఒకటిగానే అనిపిస్తాయి కానీ ఇనాక్ చాలా జాగ్రత్తగా మొదటి దానిలో కావ్యామూలతత్వ విమర్శ, కావ్య నిర్మాణ పునాది చర్చ ప్రధానంగా ఉంటాయని అవి సాధారణ సూత్ర ప్రతిపాదనలుగా ఉంటాయని కట్టమంచి ‘కవిత్వతత్వవిచారము’ ను ఉదహరిస్తూ చెప్పారు. కావ్యాత్మ విమర్శలో ఎదో ఒక ప్రక్రియకు సంబంధించిన ఒక కావ్యం మీద దాని స్వభావాన్ని నిరూపిస్తూ చేసే సూక్ష్మస్థాయి పరిశీలన అని నిగ్గు తేల్చారు. ఇక మూడవది కవి కోణం నుండి కవి ఆత్మతత్వం ఆ కావ్యంలో ఏ విధంగా ప్రతిఫలించిందో నిరూపించే పద్ధతి అని స్పష్టం చేశారు. కావ్యాత్మ, కవ్యాత్మ విమర్శ అనే మాటలు మరీ దగ్గరివి . ఒకటే అని పొరబడటానికి ఎక్కువ అవకాశం ఉంది. నిజానికి కావ్య విమర్శ లో ఆ రెండూ విడదీయలేని భాగాలే.
ఈ పరిశోధనలో మరొక ప్రత్యేకత స్త్రీల ను వ్యాస రచయితలుగా గుర్తించి ప్రత్యేకంగా వ్యాసపరిణామానికి సంబంధించి స్త్రీల కృషిని మదింపు వేసేందుకు చిన్నదే అయినా స్త్రీవ్యాసం అనే ఒక అధ్యాయాన్ని చేర్చటం. ఈ అధ్యాయం వరకే పరిమితం కాకుండా మిగిలిన అధ్యాయాలలో కూడా వ్యక్తులుగా గానీ, పత్రికా రచయితలుగా గానీ, నిర్వాహకులుగా కానీ,సంస్కరణ భావప్రేరితులుగా కానీ స్త్రీల కృషిని ఆయన ప్రస్తావించారు. సంస్కరణోద్యమ కాలపు స్త్రీల చైతన్యం, భాగస్వామ్యం దానిని డిమాండ్ చేశాయి అందువల్ల ఆయనకు పట్టించుకోక తప్పలేదు అని ఎవరైనా అనవచ్చు. కానీ అట్లా పట్టించుకోకుండా పోయినవాళ్లు చరిత్రకు చేసిన ద్రోహాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకొంటున్నాం. ఈ సందర్భం నుండి యాభయ్ ఏళ్ల వెనక్కు చూస్తే ఇనాక్ వ్యాస రచనలో స్త్రీల కృషిని నిజాయితీగా నమోదు చేయటం ఒక విలువగానే భాసిస్తుంది.
2000 సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో తెలుగు విభాగం స్త్రీల సాహిత్యం పై పెట్టిన సెమినార్ లో స్త్రీల వ్యాసాచరిత్ర పరిణామ క్రమాన్ని నిరూపించే మూడు ప్రసంగ పత్రాలు ఉండటం ఇనాక్ గారి వ్యాస పరిణామ స్ఫూర్తి ఫలితమే. ఇందులో ఆయన ప్రస్తావించిన పత్రికలు అందుబాటులోకి వచ్చే కొద్దీ స్త్రీల సాహిత్య చరిత్ర నిర్మాణానికి అవకాశాలు మరింత కలిసి వస్తాయి. ఇలా స్త్రీల సృజన విమర్శన సాహిత్య శక్తుల అధ్యయానానికి ఎన్నోరకాల ప్రేరణలను ఇచ్చే సిద్ధాంత గ్రంథ కూడా ఇది. ఈ ‘తెలుగు వ్యాసపరిణామం’ స్థూల పరిశోధన అనీ దీని నుండి జరగవలసిన సూక్ష్మస్థాయి పరిశోధనలు ఎన్నో ఉన్నాయని అంటారు ఇనాక్. సంఘాసంస్కరణ కాలపు స్త్రీల వాజ్మయం, తెలుగు విమర్శన సాహిత్య పరిణామం, తెలుగు సాహిత్య విమర్శలో స్త్రీల కృషి వంటి పరిశోధనలు ( కాకతీయవిశ్వవిద్యాలయం) ఇనాక్ గారు ఆకాంక్షించిన సూక్ష్మస్థాయి పరిశీలనలే అవుతాయి.
జానపదుల సాహిత్యవిమర్శ ఇనాక్ గారి వ్యాసపరిణామం పరిశోధనకు ఉపఉత్పత్తి. వ్యాసం ఇతరేతర ప్రక్రియల్లో కూడా దాగి ఉంటుంది అన్న ఊహతో సాహిత్య చరిత్ర రచనలు చదువుతున్నప్పుడు కవి జీవితాలకు సంబంధించిన కథలు వాటిలో క్రోడీకరించబడి కనిపించాయి. కుతూహలాన్ని రెచ్చగొట్టాయి. వ్యాస లక్షణాలు, స్వభావం లేవు కనుక పరిశోధన పరిధిలోకి అవి రావు. కానీ వాటిని వదిలివేయలేక విద్యార్థిమిత్రులకు ఇచ్చి కాపీలు వ్రాయించి పెట్టుకొన్నారు. ఎత్తివ్రాయించిన కాగితాలు 300 ఫైల్ చేసి భద్రపరచుకొన్నారు. 1983 లో జానపద సాహిత్య పరిశోధనలమీద ప్రసంగించినప్పుడు అధ్యయనంలో ఆయనకు జానపద పరిశోధకులకు సమాచార సేకరణ దృష్టే ప్రధానంగా ఉన్నట్లు, తత్వ చర్చ పరిమితంగా ఉన్నట్లు అర్ధమై తాను లోగడ వ్రాయించి పెట్టుకొన్న కవిజీవిత సంబంధి కథనాలలో విమర్శన దృష్టి ఉన్నట్లు అర్ధమై ఆ కోణం నుండి పాత ఫైల్ దుమ్ము దులిపి చేసిన శోధన ఫలితమే ఈ జానపదుల సాహిత్య విమర్శ.
కవుల రచనలు ఉంటాయి. ఆ రచనలలోని అవతారికలను బట్టి కవి దేశకాలాలను వ్యక్తిగత వివరాలను కొన్నిటిని తెలుసుకొంటాం. వాటికి అవతల ఆ కవుల జీవితాలకు, చర్యలకు, సాటి కవులతో వాదప్రతివాదాలకు, స్పర్ధకు, పరిణామాలకు సంబంధించి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిని సేకరించి తొలి సాహిత్య చరిత్రకారులు నమోదుచేసి పెట్టారు. ఆ కథలు ఎప్పుడు ఎవరు వ్రాసినవో తెలియదు. జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. కర్త, కాలము తెలియకపోవటం, అద్భుతమైన ఊహలు, కల్పనలు ఉండటం, మౌఖిక ప్రచారంలో ఉండటం జానపద సాహిత్య లక్షణం. అందువల్ల అవి జానపద కథలు అంటారు ఇనాక్. ఆ వూహలు, కల్పనలు సాహిత్య రచనకు, సంబంధాలకు సంబంధించినవి కనుక అవి సాహిత్యం గురించిన జానపదుల అభిప్రాయాలకు, ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తాయి అనీ వాటిపై కేంద్రీకరించి ఆలోచిస్తే జానపదుల సాహిత్య విమర్శ సూత్రాలను నిర్ధారించవచ్చు అనీ ఇనాక్ భావన.
అయితే కవి జీవితాలకు సంబంధించిన కర్త ఎవరో తెలియని కల్పిత కథలలో పద్యాలు అనేకం కనిపిస్తాయి. ఒక సందర్భం కల్పించి ఆ సందర్భంలో ప్రసిద్ధులైన ఆయా కవులు చెప్పినట్లు కూర్చబడిన పద్యాలు అవి. అవి ఆ కవే వ్రాసాడనటానికి ఆధారాలు ఏవీ లేవు కనుక వాళ్ళ పేర్లను ముందుపెట్టుకుని జానపదులే వాటిని అల్లి ఉంటారు. పాట, కథ జానపదుల సాహిత్య రూపాలు అంటారు. వాళ్ళ సాహిత్య రూపాలు మౌఖికమైనవి. పద్యం శిష్టుల ప్రక్రియ. వ్రాయబడేది. అందువల్ల కవిజీవిత ఘటనలకు సంబంధించిన ఈ కథనాలు, వాటిలో భాగమైన పద్యాలు జానపద సాహిత్యం ఎలా అవుతుందన్న ప్రశ్న వస్తుంది. ఇనాక్ ఆ ప్రశ్న వేసుకొన్నారు. జానపదులంటే. గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో జీవించేవాళ్లు, నిరక్షరాస్యులు మాత్రమే అనుకోరాదని, వాళ్ళు మనచుట్టూనే ఉంటారని పద్యం అల్లగలిగిన పాటి పరిజ్ఞానం, వాగ్ధార వాళ్లకు ఉంటాయని నిర్ధారించి ఈ కథా కథనాల ద్వారా వాళ్ళు సాహిత్య విమర్శను మౌఖికంగా ప్రచారంలో ఉంచారని ప్రతిపాదించారు. పుక్కిటి పురాణాలుగా చెప్పబడే కవి సంబంధ కథల నుండి సాహిత్య విమర్శకు పనికివచ్చే సూత్రాలను నిర్ధారించవచ్చు అని నిరూపించటానికి ఆయన చేసిన ప్రయోగం ఈ పుస్తకం. 2010 లో దీనిని ప్రచురించారు.
కవి అంటే ఎవరు? కవి లక్షణాలు ఏమిటి? ప్రతిభా వ్యుత్పత్తులు ఎటువంటివి మొదలైన ప్రశ్నలను సాహిత్య విమర్శలో చర్చిస్తారు. అదే పద్ధతిలో ఈ జానపద కథలలో కర్తలు కవుల గురించి,కవిత్వ శక్తి గురించి, కావ్యాలక్షణం గురించి ఏమనుకున్నారో నిర్ధారించే ప్రయత్నం ఇనాక్ చేశారు.దైవీయం, మానవీయం అన్న విభాగాలుగా జరిగింది ఆపని. భీమకవి, శ్రీపతి పండితుడు, పోతన,అన్నమయ్య మొదలైన కవులగురించిన కథల ద్వారా జానపదులు కవులకు దైవసంబంధ శక్తులను, దైవ కృపను సంభావించారని వివరించారు. ఇక కవుల లౌకిక జీవిత సంబంధాల ప్రాతిపదిక మీద విమర్శకు అందివచ్చే సూత్రాల నిర్ధారణ మానవీయత అనే విభాగంలో జరిగింది. ఆ క్రమంలో ఆయన చేసిన కొన్ని పరిశీలనలు, నిరూపణలు ఆసక్తికరమైనవి.
తిక్కనకు వ్రాయసకాడు గురునాధుడు అని, తిక్కన తండ్రికి కుమ్మరి కులపు స్త్రీయందు పుట్టినవాడని చెప్పే కథ ద్వారా జానపదులు కులాంతర లైంగిక సంబంధాలను విద్య బ్రాహ్మణేతర కులాలకు కూడా అందుబాటులో ఉండటాన్ని సాధారణ అంశాలుగా ఆమోదించారు.
కవులు రాజులను ఆశ్రయించటానికి ఎంత ప్రశంసిస్తూ కవిత్వం వ్రాస్తారో ఆదరణ కరువై అవమానం జరిగితే అంతగా ధిక్కారవాణిని వినిపిస్తూ నిందారూపకంగా కవిత్వం ప్రకటిస్తారు అని శ్రీనాధుడు, భట్టుమూర్తి గురించిన కథల ద్వారా చెప్పి కవులు తమ ఉనికిని చాటుకొనటానికి, గుర్తింపును పొందటానికి స్తుతిని కాకపోతే నిందను ఆశ్రయించటం జానపదులకు ఆమోదమే.
తెనాలి రామలింగ కవికి, భట్టుమూర్తి కి జరిగినట్లు చెప్పబడే సంవాదాలను ఉటంకించి తెనాలి రామలింగకవి భట్టుమూర్తిని శూద్రుడు అని అవమానపరిస్తే భట్టుమూర్తి కులం పేరు ఎత్తకుండానే కుక్క సింగంబగునే అన్న సమర్దనతో రామకృష్ణుడు కవే కాదు అని ప్రతి సమాధానం ఇచ్చిన తీరులో విమర్శకు ప్రతివిమర్శ ఎలా ఉండాలో జానపదులు సూచించారు అని నిర్ధారించటం.
రామలింగ కవి నరసరాజకవి మధ్య స్పర్థను ప్రస్తావించి చెప్పింది చెప్పినట్లు వ్రాయటం రాక నరసరాజకవి రామలింగ కవితో ఒక స్పర్ధలో ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావించి ఎంత వ్యవహారికం, మాండలికం వ్రాసినా మాట్లాడినట్లు వ్రాయటం కుదరదన్నది జానపదుల భాషా దృష్టి అని నిర్ధారించటం.
ఇలాంటివాటిని మరికొన్నిటిని గుర్తించవచ్చు. అయితే కవుల గురించి, కావ్యాలగురించి, కవికి రాజుకు, కవికి తోటి కవులకు, కవికి సమాజానికి మధ్య ఉండే, ఉండవలసిన సంబంధం గురించిన జానపదుల ఊహాకల్పనలో విమర్శ లక్షణం వున్నదే కానీ సాహిత్య విమర్శకు అవసరమైన సూత్రాల పరికల్పనకు అది సరిపోదు. అందువల్లనే ఈ నాటి గ్రంధాల విమర్శకు, సంపూర్ణ సాహిత్య విమర్శ పద్ధతికి సమానమైనది కాకపోయినా తాతముత్తాతల విమర్శ వారసత్వంగా దానిని గుర్తించాలి, గౌరవించాలి అంటారు ఇనాక్.
ఇనాక్ పరిశోధనా దృష్టి వ్యాకరణం మీదికి కూడా ప్రసరించింది. దాని ఫలితమే ‘మిత్ర సమాసం’ అనే లఘు సిద్ధాంత గ్రంథం. 2018 లో అచ్చయింది. కానీ ఈ పరిశోధన అంతా 1979 నాటికే ముగించబడిందని పుస్తకానికి ముందు వ్రాసిన ‘ఒక్క మాట’ లో చెప్పుకొన్నారు. వ్యాకరణం ప్రాచీనమైన లక్షణ శాస్త్రం. భాషా నిర్మాణ ప్రయోగాల సంబంధ శాస్త్రం. కావ్యలక్షణాలను నిరూపించే అలంకార శాస్త్రాలు సాహిత్య విద్యలలో ఒకటిగా దీనిని పేర్కొన్నాయి. సంస్కృత భాషలోని వ్యాకరణ శాస్త్ర నమూనాలో తెలుగులో వ్యాకరణ శాస్త్రం అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో వ్యావహారిక భాషా ఉద్యమ సందర్భం నుండి వ్యాకరణం లోని విధినిషేధ సూత్రాలకు సృజనాత్మక జనవ్యవహారానికి మధ్య వైరుధ్యం చర్చినీయాంశం అయింది. ఈ నేపథ్యం నుండి చూడాలి ‘మిత్ర సమాసం’ అనే పుస్తకాన్ని.
వ్యాకరణం లో సమాస పరిచ్ఛేదం ఒక భాగం. ఇందులో మొదటి సూత్రం సమాసం అంటే సమర్థంబులగు పదములు ఏకపదమగుట అని చెప్తుంది. సమర్ధములైన పదాలు అంటే అర్ధవంతమైన పదాలు. వేరువేరు అర్ధాలు గల రెండు పదాలు ఒకే అర్ధం ఇచ్చేలా కలవటం సమాసం. సమాసవిజ్ఞానికి సంబంధించిన అంశాలలో ‘వైరి సమాసం’ అనేది ఒకటి. ఎకార్ధీభావ సామర్ధ్యమే సమాసం అవుతుండగా వైరి అనే విశేషణం వైరుద్యం అవుతున్నది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించటానికి ఇనాక్ చేసిన చర్చ ఈ పుస్తకానికి విషయం. దానికి సంబంధించిన సూత్రీకరణలను వివిధ మూల గ్రంధాల నుండి సేకరించి విశ్లేషిస్తూ వ్యాకరణ శాస్త్రంలో విశేష కృషి చేసిన వారి వివరణలను చర్చించి పూర్వ నిర్ధారణలతో భేదించి సమాసంలో రెండు పదాలమధ్య ఎప్పుడూ మిత్రత్వమే ఉంటుంది కానీ శత్రుత్వం ఉండదని నిరూపించారు.
సమాసం రెండు పదాల కలయికతో కదా సమాసం ఏర్పడేది!? వాటిలోఒకటి సంస్కృత పదం అయి మరొకటి తెలుగు పదం కూడా కావచ్చు. అయితే మొదటి పదం ప్రత్యయం లేని సంస్కృత పదం గనుక అయితే దానిమీద తెలుగు పదం చేరినప్పుడు అది వైరి సమాసం అవుతుందని శాస్త్ర నిర్దేశం.అది వైరి పదం, వైరివర్గం, గ్రామ్య పదం, మిశ్ర సమాసం, దుష్ట సమాసం మొదలైన పేర్లతో వ్యవహరించబడుతున్నది.
వైరి సమాసం అన్నమాట సంస్కృత తెలుగు పదాల కలయికకు సంబంధించింది. కానీ తెలుగు పదాలు సంస్కృత పదాలతోనే కాక అరబ్బీ పారసీక పదాలతో మొదలుపెట్టి ఆంగ్లం వరకు అనేక అన్యదేశ భాషా పదాలతో కూడా సమసిస్తున్నాయి. కనుక వైరి సమాసం అనే భావన కాలం చెల్లినది అని ఇనాక్ అభిప్రాయం. అందువల్ల మిశ్ర సమాసం అన్న మాట వాడటం సమంజసం అని భావించారు. ఇది మొదటి అంచె. లాక్షణికులు వైరి సమాసాన్ని నిర్వచించి నిషేధించినా శాసనాలతో సహా సంప్రదాయ సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు వైరి సమాస ప్రయోగాయాలు ఎలా జరిగాయో సోదాహరణం గా వివరించి సమాస వ్యవస్థ వ్యావహారిక భాషలో విశాలమవుతూ వచ్చిందని నిరూపించి భిన్న అర్ధాలు గల పదాలు, భిన్న భాషాపదాలు కలిసి ఏకార్ధ భావ సాధకాలై భాషను సమృద్ధం చేస్తున్నప్పుడు సమాసాలు ఏవైనా మిత్ర సమాసాలే అని ప్రతిపాదించారు ఇనాక్. బాష సామాజిక ఉత్పత్తి అన్న దృక్పథంతో ఇనాక్ చేసిన ఈ రచన ఏక కాలంలో చారిత్రక సామాజిక తులనాత్మక పద్ధతి అధ్యయనానికి ఒక నమూనా కూడా.
2
1968 లో పిహెచ్ డికి పరిశోధన ప్రారంభించేనాటికి కాలేజీ అధ్యాపకుడిగా ఇనాక్ కు ఎనిమిది తొమ్మిదేళ్ల అనుభవం. అప్పటికే ఆయన సాహిత్య బోధన విమర్శన ముఖంగా సాగుతున్నది. 1974 నాటికి సాహిత్య వ్యాసాల తొలి సంకలనం వచ్చింది( సాహిత్య వ్యాసాలు ) ఎనభయ్యవ దశకంలో రెండు సంపుటాలు -సాహిత్య దర్శిని (1985), సమీక్షణం (1987) వచ్చాయి. తొభయ్యవ దశకంలో ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం (1996) శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం (1996) సాహిత్య సందర్శనం( 1999)- మూడు పుస్తకాలు ప్రచురించారు.
మళ్ళీ పదేళ్లకు రెండువేల పదవ దశకంలో ‘తెలుగులో తొలి నవల’ ప్రచురణతో మొదలుపెట్టి ఇనాక్ వ్యాస సంపుటాలు విరివిగా ప్రచురించారు. 2013 లో ‘పత్రత్రయి’, ‘తెలుగు వెలుగులు’, ‘తెలుగునవల’, ‘తెలుగు కథానిక’ పుస్తకాలు ప్రచురించారు. పత్రత్రయిని మినహాయించి మిగిలిన మూడింటితో అదే సంవత్సరం ‘విమర్శిని’ ప్రచురణ జరిగింది. ఆ సంవత్సరంలోనే సాహిత్య సమీక్ష, సాహిత్య పరామర్శ, సాహిత్య పరిచయం అనే మరో మూడు పుస్తకాలు ఆ మూడూ కలిసిన సంపుటి ‘వివేచన’ కూడా వచ్చాయి.అదే సంవత్సరం ‘దండోరా’ ప్రచురణ జరిగినా అవి సాహిత్య విమర్శ వ్యాసాలు కావు. దండోరా రాజకీయాలు కేంద్రంగా గల పత్రికా రచనలు, ఆ ఉద్యమానికి సంబంధించి ఆయనే వ్రాసిన కవిత్వం,కథలు చేర్చి ప్రచురించిన పుస్తకం అది. అయినా పత్రత్రయితో కలిపి ఇది సమాజం- ఇది సాహిత్యం ( 2013) అనే పుస్తకంగా ప్రచురించారు.( కొలకలూరి మధుజ్యోతి – ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్య సృష్టి – దృష్టి,2019,పుట 17) ఏడు సాహిత్య విమర్శ రచనలు వాటిలో రెండు మూడింటిని కలిపిన సంపుటాలు మూడు ఒక సంవత్సరంలోనే రావటం విశేషం.తెలుగు వ్యాస పరిణామంలో వచనతత్వం (2017) ఆయన మరొక ప్రచురణ. ఇది వారి సిద్దాంత గ్రంథానికి విస్తరణ అనుకోవచ్చు.
ఈ రచనలను బట్టి ఇనాక్ సాహిత్య విమర్శ నడిచిన మార్గం ఏమిటో స్థూలంగా అంచనావేయవచ్చు. జానపదుల సాహిత్యవిమర్శలో ప్రాచీన కవుల ప్రస్తావనే ప్రధానం అయినా ఆయా కవుల కావ్య విషయాలు ఆ పరిధిలోకి రావు. కానీ వాళ్ళపేరుమీద జన వ్యవహారం లో ఉన్న పద్యాలనూ,కథలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించిన తీరులో ప్రాచీన సాహిత్యాన్ని సమకాలపు స్పృహతో విలువ కట్టడం కనిపిస్తుంది. కుల అసమానతల సామాజిక కోణం ఆయన విమర్శకు అంతఃసూత్రం అని అర్ధం అవుతూ ఉంటుంది. ‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’ జానపదుల సాహిత్య విమర్శ రావటానికి పద్నాలుగేళ్ల ముందే వచ్చింది. దాని శీర్షిక లోనే శూద్రకవి అని విశేషణం వాడటం దళిత బహుజన దృక్పథం వల్లనే కావాలి.
ఆధునిక కవిత్వం మీద ఇనాక్ విమర్శ. సినారె, బోయి భీమన్న ల కవిత్వం పై వ్రాసి నది తప్ప పెద్దగా లేదు. కథ, నవలలపై వ్రాసారు కానీ అవి నిర్దిష్ట రచనకు, రచయిత కు పరిమితమైనవి కాక మొత్తంగా ఆయా ప్రక్రియల చరిత్ర పరిణామ పరామర్శలుగా ఉంటాయి. తెలుగు వ్యాసపరిణామం పై పరిశోధన చేసే క్రమంలో విస్తృతంగా సమాచారం సేకరించి చిలికి వెన్నె తీసే అభ్యాసం, క్రమ శిక్షణ అలవడిన దాని ఫలితం అయివుంటుంది ఇది. కథా నవలా ప్రక్రియల చరిత్ర పరిశీలనతో ప్రారంభించి ఇంతకు పూర్వం ఆయా ప్రక్రియల పై జరిగిన ప్రసిద్ధ అధ్యయనాల నమూనాను కొంత అనుసరించినట్లు కనబడినప్పటికీ నవలను గానీ కథను గానీ ప్రధానంగా భిన్న అస్తిత్వ చైతన్య కోణాలనుండి విశ్లేషించటం ఇనాక్ ప్రత్యేకత. అందువల్లనే సాంఘిక, చారిత్రక, మనోవైజ్ఞానిక తదితర స్థూల వర్గీకరణ లతో సంతృప్తి పడలేకపోయారు. సంస్కరణ, అభ్యుదయ, విప్లవ ఉద్యమాలు, దళిత, స్త్రీవాద, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు ఇచ్చిన నిశితమైన చూపు కథా నవలా విమర్శకు తప్పనిసరి ఆయన చెప్పినట్లయింది.
ఈ సందర్భంలో ఇనాక్ వ్రాసిన ‘తెలుగులో తొలి నవల’ గురించి చెప్పుకోవాలి. తెలుగులో తోలి నవల నరహరి గోపాలకృష్ణమచెట్టి వ్రాసిన శ్రీ రంగరాజ చరిత్ర అని అందరూ అంగీకరించిందే. అయితే చాలావరకు నవలాసాహిత్య విమర్శకులు అది ప్రచురణలో లేకపోవటం వల్ల అందుబాటులోకి రాక తెలుగులో తొలి నవల ఏది అన్న సందర్భగా జరిగిన చర్చలో భాగంగా తెలియవచ్చిన సమాచారంతో సంతృప్తి పడి ఊరుకోవలసి వచ్చింది. పరిశోధనకాలంలో ఈ నవలను సంపాదించిన ఇనాక్ దానిని భద్రంగా దాచి ఒక సమగ్రమైన పరిచయ విమర్శ వ్రాసి పుస్తకంగా వేయటం నిజంగా నవలా సాహిత్య విమర్శకు మంచి చేర్పు. ముఖపత్ర సమాచారం దగ్గర నుండి, రచయిత వ్రాసుకొన్న పీఠికను ప్రస్తావించి చర్చించటం ద్వారా ఇనాక్ తెలుగులో నవల ఆవిర్భావానికి కారణమైనదేశకాల సాంస్కృతిక సందర్భాన్ని తెలియచేసారు. ఉల్లాసాలు అనే పేరుతో ఆ నవలలోని అయిదు అధ్యాయాల కథను పరిచయం చేశారు. నవలలో శైలి, పాత్రచిత్రణ లతో పాటు ఇతివృత్త విశ్లేషణలో భాగంగా గ్రామ జీవితం, వర్ణవ్యవస్థ, ఆచార వ్యవహారాలు, ప్రత్యేకించి లంబాడీల జీవనవిధానం మొదలైనవి వివరించారు. రాజశేఖర చరిత్ర నవలతో పోల్చి చర్చించారు. ఒక విషయం దాని వివరణ ప్రధానంగా ఉండే వ్యాస ప్రాయమైన భాగాలు ఈ నవలలో ఉన్నాయని కూడా ఆయన గుర్తించి చూపారు. అన్నిటికన్నా విశేషం శ్రీ రంగరాజ చరిత్ర నవలను అనుబంధంగా ఈయటం. అసలు నవల అందుబాటులో ఉంది కనుక సమకాలపు విమర్శకులు కొత్త చూపుతో విలువకట్టే అవకాశాలు మెరుగయ్యాయి.
3
ఏదో ఒక సాహిత్య ప్రక్రియను వ్యాసం- కథ- నవల- కవిత్వం – జానపద సాహిత్యం – ఇలాంటి వాటిని వస్తువుగా చేసుకొని వాటిలోని మనచిచెడుల మూలలను దేశకాలాసామాజిక రాజకీయ సందర్భాలనుండి, రచయిత చైతన్యం నుండి నిర్ధారించి మొత్తంగా ఆ రచన సాధించిన ప్రయోజనాన్ని మదింపు వేయటం సాహిత్య విమర్శ కాగా ఒక శాస్త్రంగా సాహిత్య విమర్శ జరగవలసిన పద్ధతికి సంబంధించిన పరికరాలు, సూత్రీకరణలు, సిద్దాంతాలు నిరూపించే విధానం అంతకంటే ప్రత్యేకమైనది. ఇనాక్ సాహిత్య విమర్శకులు మాత్రమే కాదు సాహిత్య విమర్శ విధానాల గురించిన ఆలోచనాపరుడు కూడా.
1977 నుండే సాహిత్య విమర్శ ఆయన అధ్యయన పరిధిలోకి వచ్చింది. ఆ సంవత్సరం ఒక సదస్సులో 1966 నుండి 1976 మధ్య కాలపు సాహిత్య విమర్శనం మీద పత్ర సమర్పణ చేశారు. సాహిత్యవిమర్శనం అన్నది కథ నవల వంటి ప్రక్రియలవలె ఒక సారస్వత శాఖ గా పూర్తిగా రూపొంద లేదు అని భావించారు. సాంఘిక ఆర్ధిక రాజకీయ సందర్భాలకు సాహిత్యానికి సంబంధం బలపడే కొద్దీ సాహిత్య విమర్శ కొత్త కోణాలలో అభివృద్ధి చెందిందని గుర్తించారు. సాంఘిక చైతన్యం కలిగించటం, వ్యక్తిని మార్చటం సాహిత్య ప్రయోజనం అని నిరూపణ అయ్యేకొద్దీ విమర్శ కొత్త కోణాలలో వికసించిన దశాబ్దం 1966-1977 మధ్యకాలం అని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విప్లవోద్యమంవల్ల ఈ దశకంలో విమర్శ కొత్త రుచిని పొందింది అంటారాయన. సాహిత్య పరిణామంలో మూలభూతమైన తత్వాన్వేషణ విమర్శలో కీలకం అని ఇనాక్ స్పష్టం చేశారు. సాహిత్య సృష్టి ఏ బిందువునుండి విస్తరిస్తుందో వివరించేది ‘సాహిత్యాత్మ విమర్శనం’అని, కథా సంబంధ సన్నివేశగత, పాత్రగత సౌందర్య నిరూపణ ‘సాహిత్య గుణ విమర్శ’ అని, కావ్యముయొక్క చరిత్రను గానీ కావ్యాల సమిష్టి చరిత్రను గానీ పరామర్శించేది ‘కావ్య చరిత్ర విమర్శనం’ అని, కవుల రచయితల ప్రత్యేకత వివరించేది ‘కవి చరిత్ర విమర్శనం’ అని, భిన్న సాహిత్య శాఖలకు, ప్రక్రియలకు సంబంధించిన సాహిత్య ధర్మ విచారణ చారిత్రక ప్రాతిపదిక పై జరిగితే అది ‘సాహిత్య చరిత్ర విమర్శనం’ అని నామ్నీకరణ చేసి చెప్పారు. అయితే ఇవి ఏ సైద్ధాంతిక ప్రాతిపదికల పైన జరుగుతాయో, వీటికి అవసరమైన పరికరాలు ఏమిటో ఈ వ్యాసంలో ఆయన చర్చించలేదు.
‘ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం’ అనే పుస్తకం ఆ లోటును కొంతవరకు పూరించింది. విమర్శను సంస్కరణ, పునరుజ్జీవన, కాల్పనిక, అభ్యుదయ, దిగంబర, విప్లవ, స్త్రీవాద, దళిత సాహిత్య విమర్శ అని ఎనిమిది శీర్షికలకింద వర్గీకరించి చేసిన పరిశీలనలన, సూత్రీకరణలకు ఏక సూత్రతను కల్పించేవి ఆధునిక సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం అనే పేర్లతో ఉన్న మొదటి, చివరి వ్యాసాలు. రాజును దేవుడు అనుకొనే దశనుండి మనిషి అనుకొనే దశకు జరిగిన మార్పు ఆధునికతకు నారు పోసింది అన్నది ఇనాక్ భావించారు. సరిగ్గా అక్కడినుండి సాహిత్యంలో మార్పులు, సాహిత్య దృక్పథంలో మార్పులు ప్రారంభం అయ్యాయని, ఇక్కడి నుండే సాహిత్య విమర్శకు ప్రాచీన అలంకారిక సంప్రదాయం పనికిరాకుండా పోయింది అని కొత్త సూత్రాల అన్వేషణ అవసరమైనదని పేర్కొన్నారు.
ఆధునికత అనే మాట కలవాచి అనటం కన్నా ప్రాచీన సంస్కరానికి నూత్న సంస్కరానికి కలిగే ఘర్షణలో నిగ్గుతేలే స్వభావం అనుకొనటం సరైందని భావించారు ఇనాక్. దేవుడు రాజు కాక మనిషి ప్రధానమైన కాలం, మనిషి పోరాటాలు, విజయాలే కీలకమై, హేతువు, శాస్త్రీయ దృక్పథం, చారిత్రక అవగాహన, భౌతిక దృక్పథం అభివృద్ధి చెందే కాలం ఆధునిక కాలం అని ఇనాక్ స్పష్టంగా ప్రకటించారు. కనుక రాచరికపు సాహిత్యం ఆధునిక సాహిత్యం కాదు అని నిర్ధారించారు. “మతగతమైన మానవుడు పరాధీనుడు. పరతంత్రుడు. పారతంత్య్రం వల్ల మనిషి బానిస. భయం వాడి బంధువు. మతాతీత మానవుడు విముక్తమానవుడు. స్వేఛ్ఛా జీవి. స్వతంత్రుడు . వాడు ఆధునికుడు. వాడి సాహిత్యం ఆధునికం.” అని వివరించారు. ఆధునిక సాహిత్య విమర్శలో కవి దృక్పథం పరిశీలించబడుతుంది. మనవా భ్యుదయం, పరిపూర్ణ మానవ వికాసం ఆధునిక విమర్శ లక్ష్యాలు. అని ప్రకటించారు.
ఈ క్రమంలో ఆధునిక సాహిత్య విమర్శలో ఇంతవరకు చర్చించబడుతున్న నిబద్ధత, నిమగ్నత అన్న రెండుభావనాలను ఇనాక్ చర్చించారు. వ్రాసే దానిపట్ల చిత్తశుద్ధి కలిగి ఉండటం నిబద్ధత. తాను స్వీకరించిన వస్తువుకు నిబద్ధత కలిగి ఉండటం. నిమగ్నత అంటే అందులో మునిగిపోవటం. ఎందులో అంటే తాను వస్తువుగా స్వీకరించినదానిలో. అంటే కవులు, రచయితలు తాము స్వీకరించిన వస్తువులో భాగం అవుతారన్నమాట. నిబద్ధత లో వస్తువుతో సానుభూతి సహానుభూతి ఉంటాయి కానీ కవులు రచయితలు వస్తువుకు బయటివాళ్లుగానే ఉంటారు. నిమగ్నతలో వాళ్ళు వస్తువులో భాగం అవుతారు. నిబద్ధత, నిమగ్నత అన్న ఈ భావనలు ఇనాక్ కు అభిమతమైనవే. అయితే అక్కడితో ఆయనకు తృప్తి కలుగలేదు. నిబిడత అనే కొత్తభావనను దానికి చేర్చారు. ఏ వస్తువును రచయితలు స్వీకరించారో ఆ వస్తువు కవిలోనే ఉండటం నిబిడత అని పేర్కొన్నారు. కవిలో వస్తువు ఉండటం అంటే కవి అనుభవమే, జీవితమే సాహిత్యం కావటం అని వివరణ కూడా ఇచ్చారు. ఆ రకంగా ఇనాక్ ఆధునిక సాహిత్య విమర్శకు నిబద్ధత, నిమగ్నత, నిబిడత అనే మూడు అంశాలను కీలకమైన సూత్రాలుగా ప్రతిపాదించారు.
ఆ తరువాత ఇనాక్ సాహిత్య ఉద్యమ స్వభావాన్ని బట్టి పేర్కొన్న ఎనిమిది రకాల సాహిత విమర్శ పద్ధతులను చూస్తే ఆయా అంశాలకు సంబంధించిన సాహిత్య విమర్శ సమాచారం ఆధారంగా కాక ప్రత్యక్షంగా ఆ వర్గపు సాహిత్య సంబంధంలో ఇనాక్ తనదైన విమర్శ దృష్టితో సమీక్షిస్తూ నిర్ధారణలు చేయటం కనబడుతుంది. వాటిలో కూడా పునరుజ్జీవన, కాల్పనిక దిగంబర కవితా ఉద్యమాలకు సాహిత్య విమర్శ సూత్రాల నిరూపణకు అవసరమైన తాత్విక బలం ఉన్నదా అన్నది ప్రశ్న. ఏమైనా ఈ సందర్భగా ఇనాక్ ప్రతిపాదించిన విమర్శ సూత్రాలు —
కందుకూరి వీరేశలింగం సిద్ధాంతం, ఆచరణ ఒక నమూనాగా తీసుకొని సంస్కరణోద్యమ సాహిత్య విమర్శకు వస్తు దృష్టి, విలువల దృష్టి ప్రధానం అని నిర్ధారించారు.
పునరుజ్జీవన సాహిత్య విమర్శకు అదనంగా గుణ దృష్టిని కలిపారు.
కాల్పనిక సాహిత్యంలో భావుకత ప్రాతిపదికగా స్వేఛ్చ అనే విలువను ప్రత్యేకంగా పరిశీలించాలి.
పై మూడింటిలో నిబద్ధత మాత్రమే కీలకం. అభ్యుదయ సాహిత్య విమర్శకు వస్తు దృష్టి ప్రధానం. వాస్తవికత అంతఃసూత్రం. గతి తార్కిక భౌతిక వాదం, మార్క్సిస్టు సామాజిక దృక్పథం ఈ విమర్శకు మార్గం. నిబద్ధత, నిమగ్నత రెండూ ఈ విమర్శలో పరిశీలనాంశాలు.
దిగంబర కవిత్వ విమర్శకు వస్తు దృష్టి తో పాటు నిరసన దృష్టి పరిగణించదగినది.
విప్లవ సాహిత్యానికి అభ్యుదయ సాహిత్యంలోని వస్తు దృష్టి, వాస్తవికత యథాతథం. గతి తార్కిక భౌతిక వాదం, మార్క్సిస్టు సామాజిక దృక్పథం ఈ విమర్శకు మార్గం. అయితే విప్లవ సాహిత్యానికి మూల సూత్రం సాయుధపోరాటం కనుక విమర్శకు కూడా ఆ మూల సూత్రం వర్తిస్తుంది. నిబద్ధత, నిమగ్నత లకు తోడు నిబిడత వర్తించే స్థానం ఇది. వ్యవసాయ విప్లవోద్యమంలో పీడితులు స్వయంగా భాగం అవుతున్నారు కనుక వాళ్ళు రచనలు చేసినప్పుడు ఆ వస్తువు వాళ్లకు బయటిదికాదు . వాళ్లలో మండే అగ్నే . అందువల్ల నిబిడత అనే గుణాన్ని కూడా గీటురాయిగా చేసుకొని ఈ విమర్శ చేయాలి.
స్త్రీవాద సాహిత్యవిమర్శకు వస్తుదృష్టి దానికి ప్రాతిపదిక అయినా వాస్తవికత కీలకం. నిబద్దత, నిమగ్నత, నిబిడత యొక్క గాఢత సాహిత్యవిమర్శ సందర్భంలో గమనంలో ఉంచుకోవలసినవి.
దళిత సాహిత్య విమర్శకు దళితఉద్యమ చరిత్రకథ తెలిసి ఉండటం అవసరం. వస్తుదృష్టి, కఠిన వాస్తవికత, నిబద్ధత, నిమగ్నత లను దాటి సర్విత్క్రుష్ట గుణమైన నిబిడత కు ఇందులో ప్రధమ స్థానం. సాహిత్య విమర్శ సందర్భంలో ఇవి దృష్టిలో ఉంచుకొనవలసినవి.
ఇవి చెప్పి చివరి వ్యాసంలో సార్వకాలికం, సార్వదేశికం, సార్వజనీనం అనే భావనలను తిప్పికొట్టారు ఇనాక్. సాహిత్యవిమర్శ ఆత్మాశ్రయంగా ఉంటుందని, విమర్శకుల ప్రాపంచిక దృక్పథం విమర్శలో ప్రతిబింబించి తీరుతుంది కనుక అది సహజమని అంటారు. విమర్శ పరాశ్రయంగా ఉండటం అసహజం, అసంభవం అని ఆయన అభిప్రాయం. తమ జీవితమే తాము సాహిత్యం చేస్తున్నారు కనుక విప్లవంలో పీడితులు, స్త్రీవాదంలో స్త్రీలు, దళితవాదం లో దళితులు ఉంటారు కనుక విప్లవ స్త్రీవాద దళిత విప్లవసాహిత్య విమర్శ సందర్భంలో నిబిడత పరిగణనలోకి తీసుకోవలసిన విషయం అంటారు ఇనాక్ .
ఈ రకంగా సాహిత్య విమర్శ కొరకు ఇనాక్ చేసిన ఊహలు, సూత్రాలు తెలుగుసాహిత్య విమర్శకు ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రయోగం చేసి చూడవలసి ఉంది.