ఇద్దరు మహాకవుల సంగమం

బాంగ్లాదేశ్ లో నిరంకుశ షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో స్వాతంత్ర్యోద్యమంగా ప్రఖ్యాతమైన ఉద్యమంలో రాజ్యపు పోలీసు బలగాలు విద్యార్థుల మీదికి తుపాకులు ఎక్కుపెట్టి ఉండగా, విద్యార్థులు మాత్రం తమను తాము ఛేదించలేని గోడగా నిలుపుకుని, పోలీసులకు నేరుగా గురిపెట్టి,
“బందిఖానా ఇనుప ద్వారాలు
బద్దలు కొట్టండి
సంకెళ్లను పూజించే
రక్తసిక్త మందిరాల
బలిపీఠాలను ధ్వంసం చేయండి”
అని నజ్రుల్ ఇస్లాం గీతాలు పాడుతుంటే, స్వేచ్ఛా స్వప్నాలు కనే వారందరికీ రోమాంచితమైన సందర్భం అది.

బాంగ్లాదేశ్ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ నిర్వహణలోని ఒక మదరసాలో ఉపాధ్యాయినిగా, స్వయంగా బాంగ్లా వ్యక్తిగా, ఆ సంఘటన నన్ను లోలోపలి నుంచి కదిలించింది. యాదృచ్ఛికంగా ఆ రోజే నేను ఐదో తరగతి విద్యార్థులకు ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నాను. నేను విద్యార్థులకు వేసిన మొట్టమొదటి ప్రశ్న “కాజీ నజ్రుల్ ఇస్లాం పేరు విన్నారా” అని. విద్యార్థులు తమ మౌనంతో జవాబిచ్చారు. ఆ మౌనం చూసి నా గుండె జారిపోయింది. సరిహద్దుకు అవతలివైపు, బాంగ్లా ప్రజలే ఉత్సవాలు జరుపుకుంటూ, అందుకు నజ్రుల్ రాసిన పాటల నుంచీ కవితల నుంచీ శక్తిని పొందుతుంటే, సరిహద్దు ఇవతలివైపు నజ్రుల్ పేరయినా తెలియని స్థితి ఉంది. ఆ తరగతి అయిపోయి ఉపాధ్యాయుల గదిలోకి వచ్చాక, ఆ సంగతి నా సహ ఉపాధ్యాయులతో పంచుకున్నప్పుడు నా సహోద్యోగి కూడ ఆశ్చర్యపోలేదు సరిగదా, ‘నజ్రులా, ఎవరు? బాంగ్లాదేశ్ కు చెందినవారే కదా’ అంటే నా గుండె మరొకసారి పగిలిపోయింది.

కవికి ఒక దేశం ఉంటుందా? కవిని ఒకానొక జాతిలో బంధించ వచ్చునా? తన జీవితమంతా పీడితుల కోసం, అణగారిన ప్రజల కోసం పోరాడిన
నిజమైన తిరుగుబాటు కవిని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఒక ప్రధాన సాధనంగా ఉండిన కవిని ఇప్పుడు శకలీకరించి ఒక ప్రత్యేక స్థలానికీ, ఒక ప్రత్యేక దేశానికీ పరిమితం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం ఏదో పొరపాటుగా జరిగినది కాదు, ఒక ఫాసిస్టు రాజ్యంలో అదే సాధారణం. వరవరరావు వంటి కవి తన జీవితంలో అత్యధిక భాగం జైలులో గడపవలసివచ్చిన రాజ్యం ఇది. బహుశా ఆయన అతి ఎక్కువ కాలం జైలులో ఉన్న కవి కావచ్చు. కనీసం ఇప్పుడైనా ఆయన ఎంత స్వేచ్ఛగా ఉన్నారు? ఇప్పటికీ ఆయన తన స్వస్థలం వరంగల్ నుంచి సుదూరాన ఉన్నారు. ముంబాయి నగరం వదిలి వెళ్లడానికి వీలులేదు. కాని సమాజ పరివర్తనా స్వప్నం కనే స్వాప్నికులందరికీ నజ్రుల్ ఇస్లాం ఎంత ప్రాసంగికుడో, వరవరరావు కూడా అంతే. ఆయన మనందరికీ, అణగారిన వారికి, అంచుల్లోకి తోయబడిన వారికి, పీడితులకు, రాజ్యం దృష్టిలో పేరులేని, అంకెలుగా మాత్రమే మిగిలిన అసంఖ్యాక ప్రజలకు ఒక శ్వాసించే, సజీవమైన కవి.

నజ్రుల్ ఇస్లాం కవితలను వరవరరావు అనువదిస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే నేనేమనుకున్నానంటే, నజ్రుల్ ను అనువదించడానికి వివిని మించిన మంచి అనువాదకులెవరు! ఒక విప్లవకారుడి కవితలను మరొక విప్లవ కారుడు అనువదిస్తున్నాడు. మన వంటి పాఠకులూ స్వాప్నికులూ అంతకన్న సంతోషపడదగిన సంగతి ఏముంటుంది? ఒక విప్లవకారుడు మరొక తిరుగుబాటు కవి కవితలను అనువదిస్తున్నప్పుడు, ఆ కవిత్వం లోని సకల తంత్రులనూ మీటగలడు. పదాల వెనుక దాగిన పదాల్ని వెలికి తీయగలడు. ప్రతి కవిత వెనుక దాగిన ఉద్వేగాన్ని వ్యక్తీకరించగలడు. స్ఫూర్తిలో, విప్లవ భావనకు మమేకం కావడంలో వాళ్ల ఇద్దరి కవితలూ సరిగ్గా సరిపోతాయి. విద్రోహి కవితలో నజ్రుల్,
“నేను నేల గుండెల్లో అగ్ని పర్వతాన్ని, అరణ్యాగ్నిని, ప్రళయ జల
విలయాన్ని
భూమి పొరల్లో సలసల మసులుతున్న సముద్రాల ప్రతికంపనలను నేను!
నేను మెరిసే పిడుగునెక్కి ఎగిరిపోతాను వేళ్లు వేగంగా కదిలిస్తూ
గెంతుతాను
నేను భూకంపాలను సృష్టించి ప్రపంచాన్ని భయపెడతాను” అంటాడు.
అదే స్ఫూర్తితో వరవరరావు ‘ఇప్పుడు సంకెళ్లు రాస్తున్నాయి’ లో,
“బయట నువ్వెంత ఒంటరివో
నీ నీడ కూడా నీకు నిజం చెప్పలేక
ఇచ్చకాలే చెప్తున్నదో
లోపల నేనంత బలగంలో ఉన్నాను
సిద్ధాంత బలంతో ఉన్నాను
ఇవాళ మౌనంగా ఉన్నా
ఇపుడో రేపో లావాలెగజిమ్మే
అగ్నిపర్వత సదృశ ప్రజాబలంతో ఉన్నాను
దీర్ఘ నిశ్శబ్ద నిర్బంధంలో
ఆలోచనల్ని పదును పెడుతూ
ఇపుడు నిగళాలు రాస్తున్నాయి నియంతా,
రేపు గళం విప్పి స్వేచ్ఛలో పాడుతాను” అంటాడు.

నజ్రుల్ ఇస్లాం, వరవరరావు ఇద్దరి రచనల సారాంశమూ ఆ అంతర్గర్భితమైన విశ్వాసమే, స్వేచ్ఛా స్వప్నమే. స్వేచ్చగా వికసించే హృదయమూ ఆత్మా అనే భావన కోసం వాళ్ల సుదృఢమైన సంకల్పం, కార్మిక కర్షకుల కోసం నిర్భయమైన ప్రాతినిధ్యం వాళ్లిద్దరినీ జైళ్లకు పంపాయి. కాని సంకెళ్లు లేని శక్తిమంతమైన గళాన్ని చూస్తే అధికార పీఠాల మీద ఉన్నవారికి ఎల్లప్పుడూ ఎంత భయమో చరిత్రే సాక్షిగా చూపుతున్నదని తెలియనిదెవరికి? బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరగబడమని ప్రజలకు పిలుపునిస్తూ నజ్రుల్ రాసిన బిషేర్ బంశీ (విషపు వేణువు) సంపుటాన్ని బ్రిటిష్ పాలకులు నిషేధించారు. ఆ సంపుటంలోని కూలీ మజూర్ కవితలో నజ్రుల్,
“నిన్న ఒక రైల్వే స్టేషనులో ఒక పెత్తందారు
ఒక మనిషిని కిందికి తోసేస్తున్నాడు
అతడు కూలీ అయినందుకే
నా కళ్ళల్లో నీళ్ళు ఉబికినయ్
ప్రపంచం అంతా బలహీనుల మీద
ఇట్లా దాడి జరగవలసిందేనా
ఈ ఆవిరియంత్రం దధీచి జాతి ఎముకలతో నడుస్తుంది
ఈ కూలీ ఆ దధీచి జాతి ప్రతినిధి
ఆ రథం మీద బాబులు సవారీ చేస్తారు
కూలీలను కిందికి తోసేస్తారు.
మేం వాళ్ళకు కూలీ ఇస్తున్నాం కదా అనొచ్చు
నోర్ముయ్ అబద్ధాల జాతికి చెందినవాడా!” అంటాడు.

ఇలా మానవ వేదనను అనుభవించగలిగే, చుట్టూరా ఉన్న అసమానతను చూడగలిగే హృదయమే వరవరరావు కవిత్వానికి కూడా చోదకశక్తి. అందుకే ఆయన,
“మనిషి మరణం నన్ను కలవర పెడుతుంది
అమరుడయ్యాడనూ
ఆకాశతార అవుతాడనూ
ఒక మనిషి చావడమంటే
మానవత్వం ఊపిరి బిగపట్టడమే” అంటాడు.

సత్యానికీ అసత్యానికీ మధ్య తేడాను కూడా అధికారంలో ఉన్నవారే నిర్మిస్తున్న ప్రస్తుత కాలంలో, సత్యాన్ని గ్రహించాలంటే మనం భూమి మీదికి దిగాలి, ప్రజల దగ్గరికి వెళ్లాలి. అలాగే ప్రజాకవులైన నజ్రుల్ ఇస్లాం దగ్గరికీ, వరవరరావు దగ్గరికీ వెళ్లాలి. వాళ్లు అతిశయోక్తులను దరిజేరనివ్వరు. మరెవరో స్థాపించిన నియమాలను ధిక్కరిస్తారు. జనాకర్షక కథనాలను తోసిరాజంటారు. ప్రజా ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా ఒక కలల ప్రపంచాన్ని నెలకొల్పుతారు. నజ్రుల్ సామ్రాజ్యవాదానికి తీవ్రమైన విమర్శకుడు. ఆయన కేవలం విమర్శకుడుగా మాత్రమే ఆగిపోలేదు. వరవరరావు కూడా అంతే. ‘కంధారీ హుసియార్’ కవితలో నజ్రుల్,
“ఈదడం ఎలాగో తెలియక
ఈ అసహాయ జాతి మునకలేస్తున్నది
నావికా, ఈ మాతృభూమి
న్యాయం కోసం నువ్వు ప్రతిజ్ఞ
తీసుకోవటం నేను చూడదలచుకున్నాను
వాళ్లు హిందువులా ముస్లింలా అని ఎవరైనా
అడిగితే, నావికా, వాళ్లు
మానవులు, మునుగుతున్నారు.
నా తల్లి సంతానం అని చెప్పు” అంటాడు.

వరవరరావును ముప్పైకి పైగా కేసులలో ఇరికించారు. ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు చేశారు. నజ్రుల్ ఎట్లా తన కాలపు చరిత్రకారుడో, వివి కూడా అంతే. ఎమర్జెన్సీ నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ దాకా, సాధారణ ప్రజల మీది నుంచి, ఆదివాసుల మీది దాకా ప్రతి నిర్బంధకాండలోనూ, ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగానూ వివి కలం నిప్పులు కక్కింది.

ఈ అనువాద సంపుటంలో వివి నజ్రుల్ రాసిన 65 కవితలను అనువదించారు. ఈ కాలానికి ఈ అనువాదం అత్యవసరమైనది ఎందుకవుతుంది?

చరిత్రను తుడిచి వేయడమే, తిరుగుబాటు వారసత్వాన్ని కనుమరుగు చెయ్యడమే ఫాసిస్టు పాలకుల ప్రధాన సాంస్కృతిక కార్యక్రమం. లేచి నిలబడడానికీ, పోరాడడానికీ జనబాహుళ్యానికి అవసరమైన శక్తినీ, ఉత్సాహాన్నీ ఒక తిరుగుబాటు కవి శబ్దం ఇవ్వగలుగుతుంది. 1990ల తర్వాత ఆర్థిక సంస్కరణల్లో, హిందుత్వ, ఫాసిస్టు ప్రపంచీకరణ పెచ్చరిల్లినప్పుడు, సాధారణ ప్రజానీకం ప్రజా పోరాటాలు అనే భావనను, స్వేచ్ఛ అనే భావనను మరిచిపోయారు. మన అరణ్యాలన్నిటినీ బడా కంపెనీలకు పళ్లెరాలలో పెట్టి అందించడం జరుగుతున్నది. ప్రజాస్వామ్యం అనేది కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టే ప్రజాస్వామ్యంగా మారిపోయింది. అద్భుత మేధావులనూ, పదునైన గళాలనూ జైలు కటకటాల వెనక్కి తోస్తున్నారు. కార్పొరేట్ అనుకూల విద్యావిధానం యువతరాన్ని మార్కెట్ బానిసత్వంలోకి నెడుతున్నది. కష్టభరితమైన పోరాటాల ద్వారా సాధించిన ఎనిమిది గంటల పని దినాన్ని తిరగదోడుతున్నారు. ప్రతి రోజూ మత ఛాందసత్వమూ అటో ఇటో కొట్టి పడేసే వాదనలూ లింగ, భాషా, మత, అన్ని రకాల అల్పసంఖ్యాక వర్గాలనూ ప్రమాదపు అంచులలోకి నెడుతున్నాయి. హిందుత్వ ప్రయోగశాలల్లో వండి వార్చిన కథనాలను వాట్సప్ యూనివర్సిటీలలో విపరీతంగా చలామణీ చేస్తున్నారు. ఉన్నవారికీ లేనివారికీ మధ్య ఆదాయ అంతరం కనీవినీ ఎరగనంత అఖాతంగా మారింది. అస్తిత్వ రాజకీయాలను సమ్మిళితం చేసుకుని వర్గ రాజకీయాలు బలోపేతం కావలసిన సందర్భంలో రాజ్యం లోలోపలి రహస్య రాజ్యపు నిధులతో చెలరేగుతున్న అస్తిత్వవాద రాజకీయాలు వర్గ రాజకీయాలను బలహీనం చేస్తున్నాయి.

ఇటువంటి సందర్భంలో నజ్రుల్ కవితల అనువాదాలు తెలుగు యువ పాఠకులకు ఫాసిస్టు కార్పొరేట్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే ఆశనూ శక్తినీ అందజేస్తాయి. ఈ ఫాసిస్టు కార్పొరేట్ శక్తులు ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో ప్రజల హక్కుల మీద విరుచుకుపడి, పౌర హక్కులను కాలరాస్తున్నాయి. నజ్రుల్ ఎల్లప్పుడూ వర్గ రాజకీయాలే ఎత్తిపట్టాడని ఆయన కవితలన్నీ చూపుతాయి.

ఈ అనువాదం ఎందుకు ముఖ్యమైనదంటే నజ్రుల్ జన్మస్థలమైన పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఒక డోలాయమాన స్థితిలో ఉంది. వామపక్ష ఉద్యమం మీద ఉన్నత వర్గాల భద్రలోక్ ఆధిపత్యం, అది కూడా కలకత్తాకు పరిమితమైన ఆధిపత్యం, కొత్త తరం మెరుగైన ప్రపంచం కోసం, విప్లవం కోసం కలలు కనలేని పరిస్థితి కల్పించింది. అది కూడా ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానం అనే మంత్రసానుల సాయంతో ఫాసిజం దాని అత్యున్నత దశలో ఉన్నప్పుడు. ఇటువంటి సందర్భంలో నజ్రుల్ కవితల సంపుటం మాలో ధైర్యాన్నీ ఉత్సాహాన్నీ నింపుతుంది. నయా ఉదారవాద మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ఒంటరితనం, ఫాసిస్టు నిర్బంధం చుట్టుముడుతున్నప్పుడు, మేం ఆధారపడడానికి ఎటువంటి సంస్థలూ లేనప్పుడు మా వంటి కవులకు ఈ సంపుటం శక్తినిస్తుంది. సుప్రసిద్ధుడైన నజ్రుల్ ఇస్లాం కవితలకు వరవరరావు అనువాదాలు ఫాసిస్టు పాలకులు కోరుకుంటున్నట్టుగా నజ్రుల్ ఇస్లాం చీకటిలోకీ మరపులోకి జారిపోకుండా రక్షిస్తాయి.

ఇది కేవలం అనువాదం కాదు. ఇది తమ తమ కాలాల్లో పీడక రాజ్యాన్ని ధిక్కరించిన, ధిక్కరిస్తున్న ఇద్దరు మహాకవుల సంగమం. రాజ్య ప్రాపకం పొందాలనే ఆలోచననే తోసిపారేసిన ఈ ఇద్దరు కవులూ ప్రజల గళంగా నిలిచారు. ఈ అనువాదం రాజీ పడడానికి నిరాకరిస్తున్న మన యువతరం కవులకు, స్వాప్నికులకు, ఆలోచనాపరులకు అందిస్తున్న గత తరాల వారసత్వ సంపద కానుక. ఇందుకు మనం వరవరరావుకు కృతజ్ఞులమై ఉండాలి. తెలుగు పాఠకులు ఈ సంపుటంలో ఆశనూ ప్రతిఘటననూ తప్పనిసరిగా పొందుతారనే నా ఆశ.

Leave a Reply