ఇద్దరు తల్లులు

“పంతులమ్మా”

పరీక్ష పేపర్లు దిద్దుతున్న రమ తలెత్తి గుమ్మంవైపు చూసింది. ఆమె కళ్ళల్లో చేస్తున్న పనికి ఆటంకం కల్గినందుకు విసుగూ, అసహనమూ.

ఎదురుగా గుమ్మం ముందు కింది మెట్టు మీద వొకామె నిలబడి వుంది. రమ ఆమెను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు.

లోపలికి రమ్మన్నట్లు చేయి వూపుతూ “ఎవరమ్మ, ఏంగావాలె” అడిగింది రమ. ఆమె సందేహిస్తున్నట్లుగా మరో మెట్టు ఎక్కి “నీ కాడికి పేపరొస్తదట గదమ్మ” అంది.

“ఆ! వొస్తది. పాత పేపర్లు గావాల్నా” వచ్చిన పని తొందరగా తేల్చమన్నట్టుంది రమ ధోరణి. పిల్లల పుస్తకాల అట్టల కోసమో, పండగలకు పిండి వంటలు చేసేప్పుడో పాత పేపర్లు అడిగి తీసికెళ్ళడం మామూలే.

“పేపర్ నేనేం జేస్కుంట పంతులమ్మ” కొన్ని క్షణాలు ఆగింది మాట్లాడ్డానికి ఇబ్బంది పడుతున్నట్లు.

“మరేంగావాలె” అన్నట్లు చూసింది రమ.

“పేపర్ల ఏమన్న బడ్డదా పంతులమ్మ” ఆమె గొంతులో సన్నని వణుకును రమ గుర్తించలేదు.

“ఏవన్న బడ్డదా? అంటే ఏదో ఒకటి పడతనేవుంటది గదా, నీకేం గావాలె?” మెల్లగా నవ్వుతూ అడిగింది రమ.

ఆమె శక్తిలేనట్లు మెట్ల మీద కూర్చుని గడప మీద చేయి వేసి వంగి “అమ్మా!

ఎక్కన్నో పోలీసోల్లు నచ్చలైట్లను సానమందిని కాల్చేసిండ్రని అనుకుంటుండ్రమ్మ. పేపర్లేసిండ్రామ్మ?” ఆమె గొంతులో ఆందోళనను రమ గుర్తించింది.

“ఆ! ఏసిండ్రు” ప్రశ్నార్ధకంగా చూసింది రమ.

“ఆళ్ళ పేర్లు ఏసిండ్రామ్మ?”

“ఏసిండ్రు” రమ మొహంలో ప్రశ్నార్ధకం వీడలేదు.

“జెర గా పేర్లు జెప్తవామ్మ” ఆమె గొంతులో ఆందోళనతో కూడిన అర్ధింపు.

“నీకేం పనమ్మా పేర్లతో” అంటూ ఆమె వైపు చూస్తూ ఇందాక చదివి పక్కన పడేసిన పేపర్ చేతిలోకి తీసుకుంది రమ.

కొన్ని క్షణాలు తటపటాయించి మాటలను కూడదీసుకుంటూ చెప్పిందామె. “నా కొడుకు… నా కొడుకు ఆండ్ల గలిసిండమ్మ” దిగులు నిండిన గొంతు. కొన్ని క్షణాలు ఏమీ అర్థం కాలేదు రమకు. అలాంటి మాటలు ఆ ప్రాంతంలో అంతకు ముందెన్నడూ ఆమె వినలేదు. మెల్లగా విషయం అర్థమైంది.

“ఈ పేర్లలో ఈమె కొడుకు పేరు ఉన్నదేమో చూసి చెప్పాలి. ఈమె కొడుకు సచ్చిపోయిందో లేదో నేనిప్పుడు చెప్పాలె. ఈమె కడుపు కాలిందో లేదో ఇప్పుడీ వార్త తేలుస్తది” అనుకుంది రమ. ఉన్నట్టుండి పేపర్ బరువెక్కినట్టనిపించిందామెకు. ఆ బరువును మోయలేనట్టు ఆ చేతులు వణకసాగాయి. పేపర్లో అక్షరాలన్నీ అల్లుకుపోయినట్టుగా కనబడుతున్నాయామెకు. “అరే! ఏందిట్లయిపోతున్న. నాకే ఇట్లుంటే ఆ తల్లికెట్లుందో అనుకుంటూ రెండు క్షణాలు కళ్లు మూసుకుని మనసు కుదుట పరచుకుంది. అప్పటికి పేపర్లో చదివిన వార్త, మొదటి పేజీలోనే వచ్చిన వార్తకేసి దృష్టి సారించింది. “ఎన్ కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ హతం” పెద్ద పెద్ద అక్షరాల్తో ఫోటోలతో కూడిన వార్త. వార్తంతా వదిలేసి పేర్ల వైపు చూపును పరిగెత్తించింది. ఏడుగురి పేర్లూ ఉన్నాయి. ఏడుగురి పేర్లను మళ్లీ చదివింది. ఆమె కొడుకు పేరు తెలియదన్న విషయం అప్పటికి గుర్తొచ్చి “ఏం పేరమ్మ నీ కొడుకు పేరు” అడిగింది. రమ గొంతు రమకే అపరిచితంగా వినిపించింది. ఆమె మొహంలోకి చూడలేకపోయింది.

“యాదయ్య యాద్గిరి” తడబడుతూ చెప్పింది.

మరోసారి పేపర్ వైపు చూసి “లేదు…… ఆ పేరులేదు” మనసులోనే అనుకుంది. ఏదో బరువు దిగినట్టనిపించింది.

“ఈళ్లందరు వేరే వాళ్లమ్మ” ఆమె వైపు చూస్తూ చెప్పింది.

ఆమె మొహంలో ఆందోళన తొలగిపోయింది. కానీ మరుక్షణమే దిగులు కమ్ముకుంది.

“ఎవరైతే ఏందమ్మా ఏ తల్లులో కన్నబిడ్డలే గద, ఏ తల్లుల కడుపులు కాల్నాయో, ఆ తల్లులు ఎంత కొట్టుకుంటున్రో, ఎంత తండ్లాడుతుండ్రో. కడుపు తీపి ఎవలకైన ఒక్కటేగద పంతులమ్మ” ఆమె గొంతు జీరబోయింది.

రమ కళ్లు చెమ్మగిల్లాయి. ఆమె చూడకుండా కళ్లు దించుకుంది. “ఓ తల్లి బాధను మరోతల్లి బాగా అర్ధం జేస్కుంటదేమో” అనుకుంది. ఆమె కళ్లు తుడుచుకుంటున్నప్పుడు ఆమె చూడకుండా రమ కళ్లు తుడుచుకుంది. వాళ్లిద్దరి మధ్య కొన్ని నిమిషాల మౌనం దొర్లింది. మసక బారిన పరిసరాలు గమనించి లేచి ఇంటిముందర, గదిలోనూ లైట్లు వేసింది రమ. “ఈమెను లోపలికి రమ్మంటే బయటనే కూర్చుందే” అనుకుని మళ్లీ లోపలికి రమ్మని బలవంతం చేయకుండా తనే వెళ్లి తలుపుకు వీపు ఆనించి కూర్చుంది. ఇద్దరి మధ్య గడప అడ్డంగా వుంది. ఆమె కొంచెం ఇబ్బందిగా కదలబోయింది. “కూర్చోమ్మా ఫర్వాలేదు” అంది రమ.

ఆమె అలాగే కూర్చుండిపోయింది. ఇద్దరూ ఏమీ మాట్లాకోకుండా కాస్సేపు కూర్చుండిపోయారు. ఇందాకటి భావోద్వేగం పూర్తిగా వదల్లేదు రమని. చదువుకున్న ఈ పంతులమ్మతో ఏం మాట్లాడాలో తోచక ఆమె కూడా మౌనంగా కూర్చుంది.
రమ తేరుకుని “ఏం పేరమ్మా నీ పేరు” అడిగింది.

“అడివి” చెప్పిందామె.

“అడవా!?” రమ ఆశ్చర్యంగా అడిగింది.

“ఔనమ్మ”

“ఇదేం పేరు వింతగా ఉందే” అనుకుంది.

“ఎక్కడ మీ ఇల్లు?” మళ్లీ ప్రశ్నించింది.

చెప్పిందామె. అప్పుడర్థమైంది రమకు. ఆమె ఇంట్లోకి రాకుండా బయటే ఎందుకుండి పోయిందో.

“పిల్లలెంతమందమ్మ”

“ఒక్కడేనమ్మా, ఆడొక్కడే. పుట్టుకల్నే నలుగురు సచ్చిపోయిండ్రు. అయిదోవోడు ఆడొక్కడు మిగిలిండు. ఆడట్ల బోయిండు” మళ్లీ దిగులు కమ్ముకుందామె మొహంలో. రమ పరీక్షగా చూసిందామెను. యాభై దాటిన వయస్సు, కాయకష్టం చేస్తుందనిపించే శరీరం. అక్కడక్కడా తెల్లబడి నూనె లేక రేగిన జుట్టూ, వంటి మీద మాసిన ముతకబట్టలు, భర్త చనిపోయాడని చాటిచెప్పే చిహ్నాలు.

“నువ్వొక్కదానివే ఉంటవా ఇంట్లో” అడిగింది రమ.

“ఔ! ఇంకెవలున్నరు పంతులమ్మ నాకు”

“ఏం పనిచేస్తవ్”

“కూలికి బోత”

“ఏం కూలికి బోతవ్”

“నాట్లు కలుపులు, అన్ని పనులకు బోత”

కాసేపు అదీ ఇదీ మాట్లాడేటప్పటికి అడవమ్మకు ధైర్యం వచ్చింది. “ఈ పంతులమ్మ సాన మంచిది” అనుకుంది. రమను అడవమ్మ అంతకు ముందు రెండు మూడుసార్లు చూసింది. భుజానికి బ్యాగు తగిలించుకుని ఎవరివైపూ చూడకుండా వీధిలో చకచకా నడిచి వెళ్తుంటే తిరిగి తిరిగి చూసింది. “ఈ పంతులమ్మకు సాన గర్వం ఎవరితోటి మాట్లాడదు’ అని ‘ఒకరిద్దరు’ అంటుండగా వింది. కానీ ఈ రోజు పంతులమ్మ మంచిదనే అభిప్రాయానికి వచ్చింది. మెల్లగ ధైర్యం తెచ్చుకుని రమకు సంబంధించిన వివరాలను అడిగింది. అడవమ్మ అడిగిన వివరాలన్నింటికి ఓపిగ్గా సమాధానం చెప్పింది రమ.

“పేపర్ల ఈ వార్తొచ్చిందని నీకెట్ల తెల్సు” మెల్లగా అడిగింది రమ.

“మా యాద్గిరితోని సిన్నప్పుడు సదువుకున్న పిలగాడున్నడు. ఆ పిలగాని తాన రేడియుంది. గా పిలగాడే నాకెప్పుడన్న గాడ గిట్ల జరిగింది, గీడ గిట్ల జరిగింది అని జెప్పుతడు. ఇయ్యాల కూలికిపోయి వొస్తుంటే ఆ పిలగాడు గూడా గడ్డిమోపు ఎత్తుకొని ఊళ్లకు రాబట్టిండు. ఆ మాట ఈ మాట జెప్పి మెల్లగ గీమాట జెప్పె. గిట్లేదన్న యింటే నాకు భయమయితది, నా కొడుకెట్లుండో అని మెర మెర అనబట్టి. ఆ పిలగాడే జెప్పిండు పేపర్లయితే పేర్లేస్తరని. ఇన్నొద్దులు ఈ ఊర్లె పేపర్ తెప్పిచ్చేటోళ్లు ఎవ్వర్లేరు. పంతులమ్మకు పేపరొస్తదని జెప్పిండా పిలగాడే. అందుకే గిట్లొచ్చిన”

అడవమ్మతో మాట్లాడుతున్నంతసేపూ యాదగిరి గురించి వివరాలడగాలని తహతహలాడింది రమ. కానీ మళ్లీ ఆమెను మరింత బాధ పెట్టడమెందుకని మానుకుంది. “ఇంకోసారి అడగొచ్చులే” అనుకుంది.

వాళ్ల మాటల్లో గంటకు పైగా కాలం దొర్లి పోయింది. “ఇంగబోత పంతులమ్మ సీకటైపోయింది. కూలి నుంచి సక్కగ ఇటే వొచ్చిన. అయినా నాకోసం ఇంటికాడ సూసెటోళ్లు ఎవరు గని? ఎట్లయిన ఏడ దిరిగిన గూటికి పోవాల్సిందే గదా” అని నిట్టూర్చి పైకి లేచింది అడవమ్మ.

“సరేనమ్మా, అప్పుడప్పుడూ రా. నేను గూడ వొక్కదాన్నే గదా. నువ్వొస్తే నాగ్గూడ పొద్దుపోతది” అంది రమ.

ఉక్కిరిబిక్కిరయింది అడవమ్మ. ఆ ఆహ్వానం ఆమె వూహించనిది. చదువుకున్న, తెల్లగా, నాజూగ్గా, అందంగా వున్న పంతులమ్మ తననలా ఆహ్వానిస్తుందని ఆమె ఊహించలేదు.

“అట్లనే పంతులమ్మా ఇంకా ఏదో అనబోయింది కానీ మాటలు రాలేదు. మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లిపోయింది.

ఆమె వెళ్తున్నంతసేపూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయింది రమ.

ఆ రాత్రి పడకమీద చేరిన రమకు ఎంతకూ నిద్ర రావటం లేదు. ‘మానుతోంది’ అని తను భ్రమపడుతున్న గాయం ఇంకా పచ్చిగానే ఉన్నట్లు అర్థమవుతోందామెకు.

ఇన్నాళ్లు గుండెల్లో ఇంకించుకున్న బాధను కెలికి బయటకు లాగి ఎదురుగా పేర్చినట్లుగా ఉంది. జ్ఞాపకాల తుట్టె కదిలి ఆమెను ముసురుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నయ్. ఒకప్పుడు హృదయాన్ని దూదిపింజగా చేసిన సంఘటనలు పిల్ల తెమ్మెరలా హాయిగొల్పిన అనుభవాలు ఇప్పుడు బాధిస్తున్నయ్. ఆ జ్ఞాపకాలను వదిలేస్తే వేగంగా రూపం పోసుకుంటాయి. అది వేణూది… ఆ జ్ఞాపకాలను చెల్లాచెదురు చెయ్యాలనుకుంటుంది. తరచూ ఓడిపోతూంది. ఆ రోజూ ఓడిపోయింది. ఫలితంగా వేణూ రూపం కళ్ల ముందు తిష్ట వేసింది. ఆ రూపాన్ని చూడొద్దు అన్నట్లుగా కళ్లు మూసుకుంది. మరుక్షణం కనురెప్పల వెనక ప్రత్యక్షం. అసహనంగా పడకమీద దొర్లింది. సంవత్సరం నుంచీ ఆమె భరిస్తున్న అశాంతి, వేదన ఆ రోజు ఎన్నోరెట్లు పెరిగినట్లుగా ఉంది. మనసును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఎప్పటిలాగే లేచి లైటు వేసుకొని పుస్తకం చేతిలోకి తీసుకుంది. కళ్లు పుస్తకంలోకి చూస్తున్నా మనసు ఎక్కడికో వెళ్తంది. కొద్ది నిముషాల్లోనే “ఊహూ! లాభంలేదు. అక్షరం కూడ బుర్రకెక్కడంలేదు” అనుకుంటూ పుస్తకం మూసి పక్కన పడేసి, లైటాపి పడుకుంది. కళ్లలో మెదులుతున్న వేణూ రూపాన్ని పక్కకు తోసి సంవత్సరమయింది. కానీ నిన్నగాక మొన్న తన ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పినట్టే ఉందామెకు. వేణూని చూడకపోయినా అనుక్షణం మర్చిపోవాలనుకుంటూ గుర్తు తెచ్చుకుంటూనే ఉందామె. నిజానికి వేణూని మర్చిపోవడం అంత సుళువు కాదామెకు. అంతగా ప్రేమించింది.

“నువ్వే నా సర్వస్వం, నువ్వు తప్ప నాకు లోకం లేదంటే” గర్వపడింది. వేణూతో జీవితాన్ని పంచుకోవడానికి ఆతృత పడింది.

కానీ అతను “ప్రపంచమంటే నాకు నువ్వు నీకు నేనూ మాత్రమే కాదు. ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఇందులో కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, ఇద్దరం కల్సి తెల్సుకుందాం” రమ్మన్నాడు.

కానీ అప్పటికే బిజినెస్లో రమ తండ్రి నష్టపోయాడు. కుటుంబంలోని కష్టాలను, కన్నీళ్లను తుడిచెయ్యటానికి ఆమె ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నంలో ఉంది. ఇంటికి పెద్ద కూతురిగా అది తన బాధ్యతనుకుంది.

“నీ బాధలను ప్రపంచపు బాధల్లోంచి చూడ”మన్నాడు వేణు.

“నా బాధలు తీరిన తర్వాతే ప్రపంచపు బాధల్ని పట్టించుకుంటా”నంది రమ. ఇద్దరి దారులూ వేరయ్యాయి. విశాల ప్రపంచంలోకి సాగిపోతున్న వేణూని తప్పుపట్టలేకపోయింది రమ. కన్నీటితో వీడ్కోలు చెప్పింది. కుటుంబం కోసం తన ప్రపంచాన్ని కుదించుకుని ఈ పల్లెటూరుకు ఆరునెల్ల క్రితం టీచర్ గా వచ్చింది. మనసులో రగులుతున్న అశాంతితో రోజులు గడుపుతూ నెల నెలా ఇంటికి డబ్బులు పంపిస్తోంది.

“ఛ! ఎన్ని రోజులు వేణునిట్ల తల్సుకోవడం. మరచిపోవాలె” అట్ల అనుకుంటే మరింత బాధేసింది. కనుకొలుకులనుండి కన్నీళ్లు జారాయి. ఎప్పటికో మగతగా నిద్రలోకి జారిపోయింది.

*

“ఏం జేస్తున్నవ్ పంతులమ్మా”

అడవమ్మ గొంతును వెంటనే పోల్చుకుని వంట గదిలో నుంచి ముందు గదిలోకి వస్తూ “రామ్మా లోపలికి రా” అంది నవ్వుతూ.

తటపటాయిస్తూ బయటే నిలబడిన అడవమ్మతో గట్టిగా “రా లోపలికి ఫర్వాలేదు” అంది. గుమ్మంలోంచి లోపలికి వచ్చి గుమ్మం దగ్గరే బెరుగ్గా ఆగిపోయింది అడవమ్మ. “పొయ్యిమీద పాలు పెట్టిన” అంటూ లోపలికి పరుగెత్తింది రమ. పాలు దించి టీ పెడుతూ “రామ్మా ఈడికి” అని పిలిచింది.

ఆశ్చర్యపోతూ అక్కడే నిలబడింది అడవమ్మ.

“చెప్తుంటే నీక్కాదూ, రా నాకేం పట్టింపులు లేవు” అని కసిరినట్టుగా పిలిచింది.

అడుగులో అడుగు వేస్తూ మెల్లగా వంటింట్లో అడుగు బెట్టింది. రమ స్టౌ ముందు నిలబడి టీ చేయడంలో నిమగ్నమై వుంది. పొంగుతున్న టీని దించి రెండు గ్లాసుల్లో పోసి రెండు చేతుల్లో గ్లాసులు పట్టుకుని “రామ్మా! ముందట కూచుందాం” అంటూ ముందు రూంలోకి దారి తీసింది.

చాపలో తను కూర్చుంటూ “కూచోమ్మా” అంది.

కింద కూర్చోబోతున్న అడవమ్మను చూసి “అరె! చాపలో కూర్చో” అంది. “ఎందుకు తియ్ పంతులమ్మ ఈడ కూసుంట” అంటూ కింద కూలబడింది. “చెప్తే వినవు గద” అంటూ ఆమె ముందు టీ గ్లాసు పెట్టి “తాగు” అంది. బెదిరిపోయినట్లుగా చూసింది.

“నాకెందుకు పంతులమ్మ” అంది కంగారుగా.

“ఎందుకేంది. తాగేటందుకు. విషం కాదు గద తాగు”

“నాకెందుకు పంతులమ్మ నువ్వు తాగు”

“ఇదేమన్నా మంచి నీళ్ల రెండు గ్లాసులు తాగెటందుకు? చాయ. ఒక్క గ్లాసు తాగితే సరిపోతది. ఏం కాదులే తీసుకుని తాగు” అంది అనునయంగా.

ఇంక తప్పనిసరై తాగడానికి సిద్దపడింది అడవమ్మ.

టీ తాగుతూ మాటల్లోకి దిగింది రమ “కూలికి పోయొచ్చినవ, ఇయ్యాల”

“పోయొచ్చిన పంతులమ్మ. నాకు పోకుంటే తెల్లార్తదా. ఇంట్ల ఉల్లిగడ్డల్లేవు, మిర్పకాయల్లేవు. ఏదో ఒక్కదానికైన ఇంత ఉడకేసుకోవాలె గద. దుకాన్లకుపోయి ఇగో గీ ఉల్లిగడ్డలు, మిర్పకాయలు తీసుకొస్తున్న. తొవ్వల్నె నిన్ను మందలిచ్చిపోదమని ఇటొచ్చిన” అంది.

అడవమ్మ కొంగులో కట్టుకున్న మూటవైపు చూసింది రమ. అదీ ఇదీ మాట్లాడి మెల్లగా యాదగిరి ప్రస్తావన తెచ్చింది.

“నీ కొడుకు ఆండ్లకుపోయి ఎన్ని రోజులయిందమ్మా?”

“దగ్గరదగ్గర ఏడెనిమిదేళ్లు అయింది పంతులమ్మ.”

“ఎట్లు బోయిండు. ఈ వూళ్లై ఇంకెవరన్నా పోయిండ్రా.”

“ఎవ్వరు వోలే పంతులమ్మ. ఈ వూళ్లెవరికి గట్లాంటియి తెల్వదు.”

“మరి నీ కొడుకెట్ల బోయిండు.”

“అంత రాత పంతులమ్మ. ఆడింత పిలగాడుగున్నప్పుడే వాళ్ళనాయిన సచ్చిపోయిండు పాంగరిసి. ఇగెవలున్నరు నాకు ఈడొక్కడే గద. కండ్లల్ల బెట్టుకుని సాదుకున్న. సదువుకుంటే బాగుపడడని బడికి తోలిచ్చిన. ఈవూర్లోనే అయిద్దాక సదివిండు. సాన తెలివికల్లోడు. ‘అమ్మ! ఇంకా సదుకుంటనే’ అన్నడు. వాళ్లు వీళ్లు గూడ ‘మీదాంట్ల తొందరగ నౌకర్లొస్తయ్ సదివియ్యరాదు’ అన్నరు. ‘వాడు సదువుకొని నౌకరి చేస్తే నాకింకేంగావాలె అనుకున్న. ఈ పక్కూల్ల పడ్డాక జదివిండు. ఆండ్ల మంచిగొచ్చిందట. పట్నంల సదువుకుంటనన్నడు. సర్కారు పైసలిత్తదన్నడు. నేను సరెనన్న. మరేమిచ్చిందో సర్కారు. నేను కూలినాలి చేసిన పైసలు పంపిచ్చేదాన్ని. వాడు ఎక్కువ కర్సుజేసే మనిషి కాదు. పట్నంల నాలుగేండ్లు జదివిండు. అదేందో నాకు నోరు తిర్గది. ఆ సదువు. గప్పుడే ఎవల సోపతి బట్టిండో గియ్యన్ని నేర్చుకున్నడు” మాటలాపింది అడవమ్మ.

“నీకు ముందుగాల్నె తెల్సా అట్ల వోతడని”

“ఆ ఆడె జెప్పిండు. పండుగ పండుగకు ఇంటికొచ్చెటోడు. ఓ యేడాది అస్సలింటికే రాలేదు. నేను కారటు మీద కారటు రాసేయిస్తే వచ్చిండు. అప్పటికే సదువు బందు బెట్టిండంట. ‘ఇంక మీదట నేనింటికి రాను’ అని జెప్పిండు. అదేందిరా అంటే ఏందేందో జెప్పిండు. ‘నన్ను దిక్కులేని దాన్ని జేసి పోతవాకొడ్క’ అంటే ‘నీ లెక్క ఇంక సానమందున్నరు ఆళ్లందరి కోసం కొట్లాడాలన్నడు. ఏడ్సిన బతిమిలాడినా అయినా వానిపట్టు వాడే పట్టిండు. ఎట్లయిన పోకుంట ఆపాలనుకున్న. ఆ రోజు కూలిగ్గూడ పోలే. వాగుల బట్టలుతుక్కుని తానంజేసొస్తనని పోయిండు. అంతే మల్ల రాలే, అటే బోయిండు.” కళ్లు తుడుచుకుంది అడవమ్మ. దుఃఖంతో మాటరాక ఆగిపోయింది.

రమ గోడకానుకొని అడవమ్మనే చూస్తూ ఉండిపోయింది. ఆ తల్లి కన్నీటితో రమ హృదయం కరిగిపోతోంది.

మళ్లీ అడవమ్మ అందుకుంది “సక్కదనాల కొడుకమ్మా ఆడు. మా ఆడకట్టంత గూడ మురిసిపోదురు ఆన్ని జూసి. మగ దిక్కులేకున్నగనీ నా కొడుకు బుద్ధిమంతుడే అయ్యిండు. ఎన్నడు నన్ను బాధపెట్టినోడు కాదు. ఒక్కసారే ఇంత పెద్ద బాధ పెట్టిండు” గొంతులో జీరవస్తాంటే ఆగిపోయింది. ముక్కును కొంగుకు తుడుచుకుంది.

రమకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓదార్చాలని కూడా తోచలేదు. అడవమ్మ దుః ఖాన్ని వెళ్లగక్కుకుంది. రమ దుఃఖాన్ని దిగమింగుతోంది.

మళ్లీ అడవమ్మే మాట్లాడింది. “ఏం బతుకు పంతులమ్మ నాది గుడ్డి బతుకైపోయె. కడుపు కింత తింటున్న, ఇప్పుడు రెక్కలున్నయ్ కష్టం జేసుకుంటున్న. ఆ తర్వాత రాతెట్లున్నదో భగవంతునికెరుక.” కాస్సేపటికి తేరుకొని “సీకటైంది పంతులమ్మా, లేసి లైటేసుకో. ఇగనేను బోత” అంటూ పైకి లేచింది.

స్పృహలోకి వచ్చింది రమ. “సరేనమ్మా” అంది. గదిలో మసక చీకటి ఉండడం వల్ల రమ మొహంలోని భావాలను అడవమ్మ చదవలేకపోయింది.

మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లిపోయింది అడవమ్మ.

రమ లేచి తలుపు వేసుకొని లైటు వేసుకోకుండ చాపమీద వాలిపోయింది. ‘అడవమ్మ మాట్లాడుతుంటే నా బాధను నాతో నేను చెప్పుకున్నట్లుందే’ అనుకుంది. “అడవమ్మా నేనూ ఒకటేనా? యాదగిరీ వేణూ ఒకటేనా? యాదగిరి లేని అడవమ్మ జీవితం చీకటే గద. వేణులేని నా జీవితం గూడ అంతే! ఛ! ఎందుకు నేనిట్ల ఆలోచిస్తున్న. ఇంకెన్ని రోజులు వేణుని తలుచుకునేది. మర్చిపోవాలె, తప్పదు. మర్చిపోయి నా జీవితాన్ని మరో వ్యక్తితో పంచుకోవచ్చు గద” అనుకుంది రమ. కానీ ఆ ఆలోచన ఆమె మనసుకు కష్టంగా తోచింది. “మనసుకెంత కష్టంగున్నా తప్పదు వేణును మర్చిపోవాలె” గట్టిగా అనుకుంది. “కానీ పాపం అడవమ్మ ఒక్కగానొక్క కొడుకు. తన కడుపుతీపిని ఎట్ల మర్చిపోతుంది. గుండె దిటవు చేసుకుని బతికినా రేపు ఆమె ముసలిదైతే తనకు దిక్కెవరు? అడవమ్మ బాధతో పోల్చుకుంటే నా బాధ చిన్నదేనా? కానీ అడవమ్మ తన బాధ నలుగురికి జెప్పుకొని ఓదార్పన్నా పొందగల్గుతది. కానీ నేనెవరికి జెప్పుకోను, ఏమని జెప్పుకోను?” ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది రమ.

రోజులు గడుస్తున్నకొద్దీ అడవమ్మ రమ ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు. అడవమ్మ దాదాపు ప్రతిరోజు రమ దగ్గరకు వస్తోంది. వాళ్లిప్పుడు సంతోషంగా నవ్వుకునే సందర్భాలెన్నో. బడి కబుర్లు, వాళ్ల ఇంటి కబుర్లు, పేపర్లో చదివిన విషయాలు చెపుతుంది రమ. తను కూలికి పోయేచోట జరిగే విశేషాలు ఇరుగు పొరుగు ముచ్చట్లు, ఆ వూరి మనుషుల గురించి, ఆ వూరి గత చరిత్ర గురించి చెప్తుంది అడవమ్మ. తరచుగా ఒకరి ప్రపంచంలోకి మరొకర్ని తీసికెళ్తారు. ఇప్పుడు అడవమ్మ ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతుంది. వేణూని తలుచుకుని మునుపటిలా బాధపడట్లేదు రమ. యాదగిరి కబుర్లు ఏడవకుండా మామూలుగానే చెప్తోంది అడవమ్మ.

“ఏడేండ్ల నుంచి నీ కొడుకును సూడనే లేదామ్మ” అడిగిందో రోజు రమ.

మెల్లగ గొంతు తగ్గించి “రెండుసార్లు కల్పిండమ్మా. ఎవ్వరికి సెప్పొద్దన్నడు. ఎవ్వరికి జెప్పలే. ఇప్పుడు నీకు జెప్తున్న” అంది. ఆమె కళ్లల్లో “నువ్వెవ్వరికి జెప్పవులే” అన్న ధీమా కనబడింది రమకు.

“ఎప్పుడు కల్సిండు?”

“కల్సి రెండేండ్లయింది. మల్ల కలుస్తనన్నడు ఎప్పుడు కలుస్తడో” అంది.

“కల్సినపుడు ఏం మాట్లాడాడు?”

“ఏందేందో జెప్తడమ్మా. బాధలు లేని రాజ్జెమొస్తదంటడు. ఆడు జెప్పేయన్నీ బాగానే వుంటయమ్మా. నా కొడుకేం జేసిన మంచే జేస్తడు. కానీ ఈ జనం ఏదేదో అనుకుంటరు.”

“ఈ వూళ్లె ఆ వాసనలె లేవెందుకో.”

“మా యాదయ్యన్నడు. అన్ని వూర్లలకు వొస్తం. మన వూరిగ్గూడ వొస్తం అన్నడు. ఎప్పుడొస్తరో మరి” ఆమె గొంతులో వస్తే బాగుండునన్న ధ్వని.

“పోలీసులొచ్చి అడగలేదామ్మ నిన్ను.”

“ఆ! వచ్చిండ్రమ్మ. రెండుసార్లొచ్చిండ్రు. నీ కొడుకేడని అడిగిండ్రు. నాకు తెల్వదన్న. ఇంటికొస్తే పట్టియ్యమని బెదిరించ్చిపోయిండ్రు. మూడేండ్లు దాటిపోయింది ఆళ్లొచ్చిపోయి మల్లరాలె.”

ఇలా సాగింది వాళ్ల సంభాషణ.

ఆ రోజు స్కూల్లో ఆఖరి పీరియడ్ పిల్లల్ని ఆట కొదిలేసి రూంలోనే కూర్చొని పుస్తకం చదువుకుంటోంది రమ. ఇంతలో పోస్ట్మన్ వచ్చి రోజూ ఇచ్చే వార్తాపత్రికతో పాటు ఓ ఉత్తరమూ ఇచ్చి వెళ్లాడు. ఇంటినుండి తప్ప ఇంకెక్కడి నుండీ ఉత్తరాలు రావామెకు. పేపర్ టేబుల్ మీద పెట్టి ముందు లెటర్ చదవాలనే ఉద్దేశంతో కవర్ చించబోతూ అడ్రస్ చూసింది. కవర్ మీదున్న చేతిరాతను పోల్చుకోగానే ఆమె గుండె దడదడలాడింది. కవర్ ను పట్టుకున్న చేయి సన్నగా వణికింది. కవర్ చింపబోయిన వేళ్లు ఆగిపోయాయి. అది వేణు చేతిరాత. కవర్ చించకుండా అడ్రస్ వైపే చూస్తూ ఉండిపోయింది. రెండు మూడు నిమిషాల తర్వాత ‘ఉత్తరం చదవాలి కదా’ అనే ఆలోచన వచ్చింది. ‘ఉహూ! ఇక్కడ చదవలేను ఇంటికి పోత’ అనుకుంది. అనుకుందే తడవుగా బ్యాగ్ లో లెటర్, పేపర్ పెట్టుకొని కుర్చీలోంచి గభాలున లేచి బ్యాగ్ భుజాన తగిలించుకొని హెడ్ మాస్టర్ ఉన్న రూంవైపు తడబడుతూ అడుగులు వేసింది, ముఖాన పడుతున్న చెమటను తుడుచుకుంటూ.

“సర్! పనుంది ఇంటికి పోత” అని అడిగింది.

ఎన్నడూ పర్మిషన్ అడగని రమ అడిగేసరికి “సరేపోమ్మా” అన్నారాయన.

థాంక్స్ చెప్పాలనే విషయం కూడా మరిచిపోయి గబుక్కున వెనక్కి తిరిగి ఇంటివైపు వడివడిగా ఎవరో తరుముతున్నట్టు అడుగులు వేయసాగింది. ఆమెను ఆలోచనలు తరుముతున్నాయి.

“ఇన్నాళ్లకి లెటర్ రాసిండే. నేను గుర్తున్నానా? నన్ను మర్చిపోలేదా! అయినా అంత తొందరగా మర్చిపోయే అనుబంధమా మాది? ఏమని రాసిండో ఎట్లున్నడో. నా అడ్రస్ తనకెట్ల తెల్సిందో. అయినా తను తెలుసుకోవాలంటే పెద్ద కష్టమేం కాదు కదా” ఆలోచనలతోనే తాళం తీసి ఇంట్లోకడుగుబెట్టి తలుపులు వేసుకొని గోడకు చేరగిలబడి ఉత్తరం చేతిలోకి తీసుకుంది. కవర్ చింపుతుంటే ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరయింది. గతంలో వేణు ఎన్ని ఉత్తరాలు రాసాడో లెక్కలేదు. కానీ ఎన్నడూ ఇలాంటి అవస్థకు గురికాలేదామె. కవర్ చించి మడతపెట్టి వున్న కాగితాల్ని బయటకు లాగి విప్పింది. కాగితాల నిండా పరచుకున్న అక్షరాలు. ఆమె ఎంతో ఇష్టపడే అక్షరాలు. ఎన్నోసార్లు ఆమెను ప్రేమతో తడిపేసిన అక్షరాలు. కొన్ని క్షణాలు ఆ అక్షరాలను తదేకంగా చూసి మెల్లగా చదవడం మొదలెట్టింది. సెలమలయితున్న కళ్లను ఎన్నిసార్లు తుడుచుకుందో, ఉత్తరాన్ని నాలుగైదుసార్లు చదువుకొని చేతిలో పట్టుకొని అలాగే కూర్చుండిపోయింది. తన గురించి, తను నడుస్తున్న బాట గురించి ఎన్నెన్ని విషయాలో రాసాడందులో.

“వేణు ఏమైనా మారిండా? వేణు మారిండు. విప్లవకారుడిగా మరింత పరిణితి చెందిండు. మరింత దృఢంగా తయారయిండు. తనను తాను ప్రజలతో మరింత మమేకం చేసుకుండు. వేణు మారలేదు నామీద వేణుకున్న ప్రేమ మారలేదు. వేణు నన్ను మర్చిపోలేదు. తన ప్రేమ హస్తాన్ని నా కోసం సాచే ఉంచిండు. కానీ ఆ చేయిని నేనందుకోగలనా? లేదు నేనందుకోలేను. ఆ నేనందుకోలేనంత దూరంలో ఉంది. నేనందుకోలేనంత ఎత్తులో ఉంది ఆ చేయి.” తన చేయిని మరింత ముడుచుకుంది రమ. కాని అతని కోసం తెరచిన హృదయాన్ని మూసుకోలేకపోతోంది.

ఇంకా ఎంతసేపు అలా ఆలోచనల్లో ఉండిపోయేదో, తలుపు చప్పుడవడంతో ఉలిక్కిపడి గభాలున వెళ్లి తలుపు తీసింది. ఉత్తరం ఆమె చేతిలోనే ఉంది. తలుపు తీసే ముందర కళ్లు తుడుచుకోవాలనిగానీ ఉత్తరం దాచుకోవాలనిగానీ తోచలేదామెకు. ఎదురుగా నవ్వుతూ రోజూ వచ్చే అడవమ్మ.

“అయ్యో ఏందమ్మా గట్లున్నవ్ ఏమయింది?” అడవమ్మ మొహంలో నవ్వు స్థానంలో ఆందోళన.

“ఏం లేదులే తలకాయనొప్పి. బడి నుంచి గూడ తొందరగొచ్చిన” రమ ఆడిన అబద్ధం అతికినట్టుగా లేకపోయినా, అబద్ధం ఆడాల్సిన అవసరం రమకుంటుందని ఊహించని అడవమ్మ నమ్మేసింది.

“అయ్యో ఎట్ల మరి. వెంకటయ్య నడిగి ఏమన్న మందుగోలి తేనా?”

“అహ ఒద్దు. ఇప్పుడే ఏసుకున్నగని. కొంచెం చాయ పెట్టిస్తవా?”

‘సరే’నంటూ వంటగది వైపు వడివడిగా అడుగులేసింది.

అడవమ్మ రెండు టీ గ్లాసులతో ముందు గదిలోకి వచ్చేలోగా రమ బట్టలు మార్చుకుని ఇంటి వెనక్కి వెళ్లి చన్నీటితో మొహం కడుక్కుని శుభ్రంగా తుడుచుకుని, రేగిన జుట్టు నున్నగా దువ్వుకుంది. టీ గ్లాసు చేతికందిస్తున్న అడవమ్మ వైపు చూస్తూ ప్రేమగా నవ్వింది రమ.

“ఆ! ఇప్పుడు సూడబుద్దయితుంది నీ మొహం, ఎట్లున్నవ్ తలుపు తీసేసరికి!”

“జెర తక్కువైంది నొప్పి. నీ చేతి చాయ్ తాగితే మొత్తం తగ్గుతది” హాయిగా నవ్వుతూ అంది రమ.

“ఆ ఏం తగ్గుతదో నా చేతి చేయకు, నువ్వెంత నేర్పినగని నీ లెక్క చేయొస్తదా”

“ఎందుకు రాదు నాకంటే నువ్వె బాగా జేస్తవ్”

మెల్లగా మాటల్లో పడ్డారిద్దరూ. కావాలనే యాదగిరి ప్రస్తావన తీసుకొచ్చింది రమ. “నీ కొడుకు చాలా గొప్పోడమ్మా. అట్లాంటి కొడుకును గన్నందుకు నువ్వు గర్వపడాలె” అంది రమ.

అడవమ్మ తబ్బిబ్బయిపోయింది. యాదగిరి గురించే చాలాసేపు మాట్లాడింది. మాట్లాడించింది రమ. తన మాటలతో అడవమ్మను యాదగిరి దగ్గరికి తీసికెళ్లింది. అడవమ్మను యాదగిరి దగ్గరికి తీసికెళ్లిందో, తనే వేణూ దగ్గరకు వెళ్లిపోయిందో! యాదగిరి గురించి ప్రశంసంతా యాదగిరి కోసమో, వేణు కోసమో, ఇద్దరి కోసమో! వేణూ ప్రస్తావన అడవమ్మ దగ్గర తేలేక యాదగిరి ప్రస్తావన తెచ్చిందేమో యాదగిరి కబుర్లు అడవమ్మ చెప్తుంటే రమ చెవులకవి వేణూ కబుర్లలాగ వినిపించేవి. ఇద్దరి గుండెలు సంతోషంతో నిండిపోయాయి.

  • రమకు మనసు మొద్దుబారినట్టయింది. గుండెల్లో దుఃఖం గడ్డకట్టుకుపోయింది. ఈ గదిలోంచి ఆ గదిలోకి ఆ గదిలోంచి ఈ గదిలోకి తిరుగుతూనే ఉంది.

“ఎట్ల ఎట్లు ఎదుర్కోవాలె ఈ పరిస్థితిని” ఎన్నిసార్లనుకుందో… “ఇంకాసేపయితే అడవమ్మ వొస్తది ఏం చెప్పాలామెకు ఎట్ల జెప్పాలె” ఇట్లా అనుకోవడం గూడా ఎన్నోసారో. చాపలో వున్న పేపర్ తీసి మరోసారి ఆ వార్తకేసి చూసింది. ఆ వార్త అబద్ధమైతే బావుండునని మళ్లీ మళ్లీ అనుకుంది. మరోసారి నిజమై తాకిందా వార్త. “పేరు, ఇంటిపేరు, ఊరిపేరు, వయసు అన్నీ సరిగ్గా సరిపోయినాయి. అబద్ధం కాలేదీ వార్త. అయ్యో అడవమ్మ కెట్ల జెప్పనీ వార్త. నీ కొడుకింక లేడు అని ఎట్ల జెప్పను? ఈ వార్త వింటే ఆ కన్నతల్లి గుండె తట్టుకుంటుందా? ఆమె గుండెకోత చూసి నేనెట్ల తట్టుకోను. ఒస్తది. వచ్చే టైమయింది. బురదలో బురదై మట్టిలో మట్టె వొళ్లు అలసినా మెరిసే కళ్లతోటి ఈ పంతులమ్మ దగ్గరికొస్తది. ఏమని చెప్పను. నీ కంటి దీపం ఆరిపోయిందని చెప్పనా? అయ్యో! ఎట్ల తప్పిచ్చుకోను ఈ పరిస్థితి నుండి?”

ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతోంది రమ. చిరు అలికిడికి కూడ బెదిరిపోయి గుమ్మం వైపు చూస్తోంది. రోజూ అడవమ్మ వచ్చే వేళ దాటిపోయింది. కానీ అడవమ్మ రాలేదు. ‘అరె రాలేదే’ అనుకుంది. ఓ సంవత్సరం నుండి అడవమ్మ రాని రోజులు చాలా అరుదు. ‘ఎందుకో లేటయినట్టుంది. దుకాణకు పోయొస్తదేమో’ అనుకుంది. అడవమ్మ వచ్చి తిరిగెళ్లే వేళ కూడా అయింది. కానీ అడవమ్మ రానేలేదు. దిక్కు తోచడం లేదు రమకు.

లైటువేసి గడపమీద కూర్చుంది. “ఏమయి వుంటది. ఎవరన్న చెప్పుంటర వార్త. ఎవరు జెప్పుంటారు. ఇంకెవరికీ పేపర్ రాదే మరెట్ల తెలుస్తది. తన కడుపు కాలిన సంగతి తెల్వడానికి పేపర్ వార్త కావాల్నా. ఆ కొడుకు ప్రాణాలు వదిలేముందు, ‘అమ్మా’ అని వేసిన కేకలు తల్లి గుండెల్ని తాకుతాయేమో ఆ కొడుకు చిందించిన రక్తం తల్లి ఒడిని తడుపుతదేమో… ఛ! ఏందిట్ల ఆలోచిస్తున్న. మరెట్ల తెలిసుంటది. ఎవరన్నా టౌన్ నుంచి వచ్చేటోళ్లు పేపర్ తీస్కొస్తే… అట్ల తెలిసుంటది అడవమ్మకు. ఎట్లుందో, ఇంటికి పోయి చూస్తే! నాకిల్లు తెల్వదే. ఇల్లు తెల్సుకొనుడు పెద్ద కష్టంగాడు గని. ఏం చూసేటందుకు పోవాలె. గుండెల నిలువెత్తు శోకాన్ని చూసేటందుకా…”

“పంతులమ్మ” అనే పిలుపుతో ఆలోచనల దారం పుటుక్కున తెగింది. ఎదురుగ కొండమ్మ. ఏదో పనిమీద అలా వెళ్తూ ఆగి పలకరించినట్టుంది.

“అడవికి రాత్తిర్నుంచి వొళ్లెరగని జెరం పంతులమ్మ”

“?”

“అవును పంతులమ్మ. మూసిన కన్ను తెర్వకుంటున్నది. దాన్ని జూత్తె గోసనిపిత్తాంది”

“అరె! డాక్టరుకు సూయించలేదా?”

“ఆడికిపోతే ఆయనరాలె ‘తర్వాత వొస్త పో’ అన్నడు. రెండు మూడు గోలీలిచ్చిండు. అవ్వేసిన గని కొంచెం గూడ తక్కువకాలె”

“డాక్టరెందుకు రాలె?”

“పైసలు సేతిల పెడ్తానే వొస్తడు. అడివికి పద్దినాల్నుంచి కూలియ్యలే. నేనన్న ఇద్దమంటే నాగ్గూడ కూలియ్యలే వారం నుంచి. ఇద్దరు ముగ్గుర్నడిగిన. అందరు గదె జెప్పిన్రు. నేనిప్పుడు గందుకే పోతున్న కూలిపైసలు అడుక్కొద్దామని పోతున్న.”

“సరే నువ్వు పో”

రమ లేచి చెప్పులు తొడుక్కుని ఇంటికి తాళం వేసి చకచకా అడుగులు వేసింది. మూడో నిమిషంలో ఊరి చివర ఉన్న ఇండ్లవద్దకు చేరుకుంది. వీధి మొదట్లోనే ఉన్న ఇండ్ల దగ్గర సందేహంగ నిలబడింది. అక్కడ నలుగురైదుగురు ఆడవాళ్లు కూర్చొని, నిలబడి వున్నారు. వాళ్లవైపు రెండడుగులు వేసేటప్పటికి వాళ్లలో ఒకామె “ఏంది పంతులమ్మ! గిట్లొచ్చినవ్?” అంది ఆశ్చర్యంగా. కూర్చున్నవాళ్లు చటుక్కున లేచి నిలబడ్డారు.

“అడవమ్మ ఇల్లెక్కడమ్మా?”

“అడవిల్లా? నేను జూపిస్తరా పంతులమ్మా” అంటూ ఓ ముసలమ్మ దారితీసింది. ఆమె వెనుకే రమ నడవసాగింది. రమ వెనుక అక్కడ నిలబడి ఉన్న వాళ్లలో మరొకామె నడవసాగింది.

“అడివికి జెరంగద సూద్దామని వచ్చినట్టుంది పంతులమ్మ”

“ఎంత పెద్దమనసో సూడు పంతులమ్మది. అడవి జెప్తనే ఉంటది. సాన మంచిదని” అని వెనక నుండి వాళ్లనుకునే మాటలు రమకు వినిపించాయి.

రమ అడవమ్మల స్నేహం దాదాపు వాళ్లందరికి తెలుసు.

ముసలమ్మ వెనకాలె అడవమ్మ ఇంట్లోకి అడుగు పెట్టింది రమ. ఆమె వెనకాల ఓ చిన్న గుంపు తయారయింది. కొందరు బయటే ఆగిపోతే కొందరు లోపలికొచ్చారు. రెండు గదుల చిన్న మట్టి ఇల్లది. పైన తాటాకుల కప్పు. ముందు గదిల నులక మంచంలో అడవమ్మ. గదినిండా లో వోల్టేజి బల్బు నుండి వచ్చే మసక వెలుతురు. అడవమ్మ మంచం దగ్గరకు వెళ్లి వంగి నుదుటి మీద చేయి వేసింది రమ. చురుక్కుమని తగిలింది. చేయి వెనక్కి తీసుకుంది. ఆ స్పర్శకు అడవమ్మ మెల్లగ గదిలిందే కాని కళ్లు తెరవలేదు.

వెనక్కి తిరిగి అక్కడున్న వాళ్లవైపు చూస్తూ “ఎవరన్నా డాక్టరును పిలుచుకొస్తరా” అనడిగింది రమ.

“ఆయన రాడు పంతులమ్మ” నిస్పృహగా అనిందొకామె.

“నేను రమ్మన్ననని చెప్పుండ్రి వొస్తడు”.

“అవునే పంతులమ్మ పేరు జెప్తే రాకుండుంటడ”

“ఒస్తడు ఒస్తడు” నాలుగైదు గొంతుల్నుండి వచ్చాయా మాటలు.

“రావే మనం పోదాం” ఓ ఇద్దరు వెళ్లారు.

చేతిలో మందుల సంచితో పది నిమిషాల్లో డాక్టర్ అక్కడున్నాడు. పంతులమ్మ అడవమ్మింట్లో ఉందని చెప్తే ఏమీ అర్ధం కాలేదు. అయోమయంగా వచ్చాడు.

డాక్టర్ వైపు చూస్తూ “రాత్రి నుంచి బాగా జ్వరమట. మీరిచ్చిన మందులతో తగ్గలేదు. మంచి మందులియ్యండి” చెప్పింది రమ.

అడవమ్మకు జ్వరమొస్తే రమ అంత శ్రద్ధగా పట్టించుకోవడం ఆశ్చర్యంగా ఉందాయనకు. ఆశ్చర్యంతోనే ఇంజక్షన్ వేసి కొన్ని మాత్రలు ఇచ్చి రమకు వివరాలు చెప్పి బయల్దేరాడా డాక్టర్.

“రేపు డబ్బులు పంపిస్తానండి” చెప్పింది రమ.

సరేనన్నట్టుగా తలూపుతూ మరింత ఆశ్చర్యంగా వెళ్లిపోయాడా డాక్టర్.

డాక్టర్ వెళ్లిపోయాక అక్కడి వాళ్లవైపు చూస్తూ “మంచి నీళ్లున్నాయామ్మా?” అని అడిగింది.

“ఆ! ఉన్నయ్ పంతులమ్మ పొద్దుగాల తెచ్చిపెట్టిన” అందొకామె.

“ఆ! ఉంటె సరే ఈ గోలీలు వేయడానికి అవసరమైతయని అడిగిన. ఓ గంట తర్వాత వేయమన్నడు.”

అందరూ రమకేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆమె వచ్చినప్పటి నుంచి నిలబడే వుంది. అప్పుడప్పుడు వంగి అడవమ్మను తాకి చూస్తోంది. అట్లా తాకి చూడడాన్ని వాళ్లొక అపురూప దృశ్యంలా చూస్తున్నారు. ఆమెను కూర్చోమంటే బావుండు అనుకున్నారు. కానీ ఎక్కడ కూర్చోమనాలి. ఏమనుకుంటుందో అనుకున్నారు. చాల రాత్రయిపోతుందే అయినా పంతులమ్మ ఇంటికి పోతలేదే అనుకున్నారు ఎవరికి వాళ్లే.

“పంతులమ్మ! సాన రాత్రయింది. ఇంటికి పోరాదు” అంది కొండమ్మ. ఆలోచనల నుండి బయటపడ్తూ, “లేదమ్మా నేనిక్కడే ఉంట” అంది రమ. “అయ్యో! పంతులమ్మ నువ్వెట్ల ఉంటవు ఈడ” మరొకామె అంది. “ఎందుకుండలేను” చిరునవ్వుతో అడిగింది.

“నువ్వు పో పంతులమ్మ నేను జూస్కుంట తియ్” కొండమ్మ అంది. “అహ నేనుపోను. గంట గంటకు గోళీలెయ్యాలె. నేనైతే టైం జూస్కుంట ఏస్త” ఆ మాటకు వాళ్లేం మాట్లాడలేదు. “అన్నమన్న తిన్నవో లేదో” “తినే వొచ్చిన” అన్నం తినే కోరిక లేనందువల్ల అబద్దమాడింది. “పొద్దుపోయింది ఇగ మీరు ఇండ్లల్లకు పొండమ్మా” అంది రమ.

వెంటనే ఎవ్వరూ కదల్లేకపోయారు. “పోండమ్మా మీరు బోతే జెర గాలి తలుగుతది” మళ్లీ రెట్టించే సరికి ఒక్కొక్కరు మెల్లగ కదిలారు.

కొండమ్మ మాత్రం “నేనిక్కడ్నే పండుకుంట పంతులమ్మ” అంది.

“నీ ఇష్టం” అంది రమ.

“ఇంట్ల జెప్పి, బొంత తీస్కోని వొస్త” అంటూ వెళ్లిపోయింది కొండమ్మ. కొండమ్మ వచ్చేసరికి మూలనున్న చినిగిన చాపను మంచం పక్కనే వేసుకుని మంచం కోడుకు వీపు పెట్టి కూర్చొనుంది రమ.

ఓ అరగంట ఇద్దరూ అదీ ఇదీ మాట్లాడుకున్నారు. కొండమ్మ అడిగిందానికి రమ ముభావంగా సమాధానాలు చెప్పసాగింది. నిజానికామెకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు.

“నిద్రొస్తుంది పంతులమ్మ ఇంగ పండుకుంట” అందామె.

“సరె పండుకోమ్మ” అంది రమ.

“ఏమన్న అవుసరమైతే లేపు పంతులమ్మ” అందామె, మూలనున్న గోనెసంచిని పరచుకుంటూ.

“అట్లనే!”

కొద్దిసేపటికి ఆమె సన్నని గురక వినబడింది. “పాపం పగలంతా రెక్కలు ముక్కలు జేసుకుంటరు. నిద్ర బోకుంట ఉండాలంటే వీళ్లకు కష్టమే కదా” అనుకుంది. రాత్రి పదయింది. మెల్లగా అడవమ్మ వంటిమీద చేయి వేసి చూసి ‘జ్వరం తక్కువైనట్టుంది’ అనుకుంది. ఆ స్పర్శకి మెల్లగా కళ్లు తెరిచింది అడవమ్మ. రమ వైపు పిచ్చిగా చూసింది. కొద్ది సేపటికి నీరసంగా…

“అమ్మా! నువ్వా” అంది రమ చేయిని తడుముతూ.

“ఆ! నీకు జెరమొచ్చిందంటే చూద్దామని వొచ్చినగాని, ఒక్కసారి జెరలేసి కూసో గోళేసుకుని మళ్ల పడుకుందువుగాని” అంటూ మెల్లగా ఆమె భుజాలు పట్టుకొని లేపి కూర్చోబెట్టింది. మాత్ర వేసుకొని నీళ్లు తాగి కూర్చునే ఓపిక లేనట్టు మళ్లీ రమ చేయి ఆసరాతో మంచం మీద వాలిపోయి ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసి సాధ్యం గాక మగతగా కళ్లు మూసుకుంది. క్రమంగా నిద్రలోకి జారిపోయింది.

కొద్దిసేపు ఆమె మొహంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది రమ. ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లి అడవమ్మ మొహం మసకబారింది.

కళ్లు తుడుచుకుని మంచం దగ్గరనుండి కదిలి ఆ చిన్న గదిలోనే అటు ఇటు తిరగసాగింది. తిరుగుతూ ఆ గది నాలుగుమూలలూ పరీక్షగా చూడసాగింది. గోడక్కొట్టిన మేకుకు వేలాడదీసిన ఫోటో ఆకర్షించిందామెను. ఫోటో ముందుకు వెళ్లి నుంచుని పరీక్షగా చూసింది. పాతకాలం నాటి ఫోటో అది. ఆ ఫోటోలో అడవమ్మను పోల్చుకోగలిగింది. పక్కన కూర్చున్నది ఆమె భర్తని అర్థమైంది. ఆమె చూపులు వేగంగా అడవమ్మ ఒడిలో కూర్చున్న పిల్లోడి వైపు కదిలాయి.

“ఈ అబ్బాయి… ఈ అబ్బాయేనా యాదగిరంటే, ఖచ్చితంగా యాదగిరే. అయిదారేళ్ల వయసుంటుందేమో, అబ్బ ఎంత అమాయకంగా ఉన్నడు! అమ్మ ఒడిలో అడవమ్మ వొడిలో ఎంత నిశ్చింతగా కూర్చున్నడు! అరె! ఈ అబ్బాయి ఇప్పుడు లేడు కదూ. అడవమ్మ వొడి బోసిపోయిందా? ఒక్క అడవమ్మ వొడేనా. ఎంతమంది అమ్మల వొడుల్ని బోసిగ జేసిపోయిందో ఈ అబ్బాయి… ఎంతమంది అమ్మలు గుండెలు బాదుకుంటుండ్రో ఈ రోజు… ఈ అమ్మ… ఈ అడవమ్మ మాత్రం అమాయకంగా, నిశ్చింతగా నిద్రబోతుంది. ఈ అడవమ్మ కొడుకు అడవి తల్లి వొడిలో నిశ్చింతగా నిద్రబోతున్నడు.”

తన చూపుడు వేలుతో ఫోటోలోని అబ్బాయిని మెల్లగ తడిమింది. కన్నీళ్లు రమ గుండెల్ని తడుపుతున్నాయి. తుడుచుకోవాలనే స్పృహ కూడా లేనట్టు ఫోటో వైపు చూస్తూ నిలబడింది. ఇంకా ఎంతసేపు అలా ఆలోచనల్లో కొట్టుకుపోయేదో కానీ అడవమ్మ ఏదో గొణిగినట్టు వినిపించింది. గబగబా కొంగుతో కళ్లు తుడుచుకుని మంచం వైపు నడిచింది. మంచం పట్టెమీద చేయివేసి చాపలో మోకాళ్ల మీద కూర్చొని అడవమ్మ వైపు వంగి చూసింది.

అడవమ్మ కలవరిస్తోంది…. “యాదయ్యా యాదయ్యా” అంటూ. రమ గుండెను తాకిందా పిలుపు. ఓ చెయ్యిని అడవమ్మ తలమీద మరో చెయ్యిని అడవమ్మ పొట్టమీద వేసి “అమ్మా” అని పిలిచింది రమ.

“కొడక… వచ్చినవ కొడ్క”

“అమ్మా…”

“కొడక… నేను యాదికొచ్చిన కొడుక…” అంటూ రమ చేయిని గట్టిగా పట్టుకుంది, కొడుకెక్కడ మళ్లీ వదిలి వెళ్తాడో అన్నట్లు నెమ్మదిగా కళ్లు తెరిచింది.

రమవైపు పిచ్చిగా చూసింది. మళ్లీ ఆమె కళ్లు మగతగా మూతబడ్డయ్. ఆమె చేతిలోని తన చేతిని తీసుకుంటే అడవమ్మకు మెలుకువ వస్తుందేమోనని అలాగే కూర్చుండిపోయింది రమ. ఆమె దీనమైన మొహం వైపు చూస్తూ ఆలోచించసాగింది. “ఈ పిచ్చితల్లి ఎట్ల తట్టుకుంటది విషయం తెలిస్తే. ఈ ఒంటరి బతుక్కి ఇంక ఆధారమేముంది? ఈ అమ్మ జీవితాంతం ఒంటరిగా ఉండవలసిందేనా? జ్వరమొస్తే నొప్పొస్తే ఈమెనెవరు జూసుకుంటరు? రేపు వయసు మీద బడ్డంక అప్పుడెవరు జూస్తరు. ఈమె బతుకేమయితది… అతను తల్లికి దూరమయిండు… కానీ మరెందరికో కొడుకై దగ్గరయిండు. ఈమెను దిక్కులేని దాన్ని జేసిండు కానీ ఎందరికో దిక్కయిండు… తనెందరికో కొడుకైనప్పుడు
ఈమె గూడ ఎందరికో తల్లిగావాలె గద… ఎంతమంది కోసం అతను తల్లికి దూరమయిండో… ఎంతమంది కోసం ప్రాణాలిచ్చిండో… అంతమందికి ఈమెను తల్లిగా చూసుకోవాల్సిన బాధ్యతుంటది గద’

“కానీ ఈ వూళ్ల ఉద్యమమే లేదు… అతను ప్రజల కోసం ప్రాణాలిచ్చిండని నమ్ముతున్న. మరి నేనీమెను జూసుకోవచ్చు గదా…

రమ ఆలోచన లాగిపోయాయి. ఆ ఊహకే ఉక్కిరిబిక్కిరయింది. ఇంకా అడవమ్మ చేతిలో ఆమె చేయి బిగుసుకునే ఉంది.

మళ్లీ ప్రశాంతంగా ఆలోచించడం మొదలెట్టింది.
‘అవును ఈమెను నేనెందుకు చూసుకోగూడదు? జీవితాంతం నేనీమెకు తోడుగా ఎందుకు ఉండగూడదు? ఈమెను నాతోటి ఉంచుకుంటే ఎవరూ ఏమీ అనరా? ఎవరంటారు ఎవరికి నష్టం?”

“అమ్మా నాన్న ఏమంటారు? వాళ్లకర్థం జేయించొచ్చు. అర్ధం జేస్కోకపోతే ఎవరి దారి వాళ్లది. అయినా నేను నెల డబ్బులు పంపినంత కాలం వాళ్లు నన్ను గట్టిగ ఏమన్లేరు.”

“వేణుకు తెలిస్తే ఎట్ల ఫీలయితడు? సంతోషపడ్తడు. నన్ను ప్రేమించినందుకు గర్వపడకపోయినా కనీసం సిగ్గుపడడు. అవును సిగ్గుపడడు.”

“వేణు తీరుగ బతికే ధైర్యం, యాదగిరి తీరుగ మరణించే ధైర్యం నాకు లేకపోవచ్చు. కానీ కనీసం ఇట్లయిన బతకొచ్చు… ఇట్లనన్న బతుకుత నేను.”

“ఈ అమ్మకు నేను బిడ్డనైత” దృఢంగా అనుకుందామె.

రమ చేయిని పట్టుకున్న అడవమ్మ చేయి మెల్లగా సడలింది. ఇప్పుడు అడవమ్మ చేయిని రమ గట్టిగా పట్టుకుంది.

సెప్టెంబర్ – అక్టోబర్ 98, అరుణతార
‘కథాకెరటాలు’ సంకలనంలో పునర్ముద్రణ

One thought on “ఇద్దరు తల్లులు

  1. “నీ బాధలను ప్రపంచపు బాధల్లోంచి చూడ”మన్నాడు వేణు. ఎంత గొప్ప మాట !

Leave a Reply