ఊహించ లేదు, మిలార్డ్. మీరు అట్లా చేస్తారనుకోలేదు. మాలాంటి భ్రమజీవుల మతి పోయేలా మీ దేవుడి ముందు మోకరిల్లి తీర్పులు రాయించుకుంటారని కలలో కూడా అనుకోలేదు. మీరెన్ని మాటలు చెప్పారు మిలార్డ్…! అవన్నీ విని న్యాయదేవుడే నల్లకోటేసుకొని వచ్చిండనుకున్నం. నోరు తెరిస్తే రూల్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తి… అబ్బో తలుసుకుంటెనే గుండె దడదడ కొట్టుకుంటున్నది.
మీ కంచు కంఠం కోర్టు గదిలో మోగుతుంటే అదేదో ధర్మఘంట మోగుతుందని ఎంత సంబురపడి పోయేవాళ్ళమో! మిమ్ముల ఒక “ఆశా రేఖ” (రే ఆఫ్ హోప్) అని పొగుడుతుంటే, ఇక మీ రాకతో మొత్తం న్యాయవ్యవస్థ బూజంతా వదులుతుందనుకున్నం.
దింపుడు కళ్ళం ఆశతో ఉన్న ప్రజాస్వామ్యానికి కొత్త జీవం పోస్తవని ఎదురుచూసినం. న్యాయవ్యవస్థ తలను మింగిన ఫాసిజం కోరలు విరిచి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తవనుకున్నం. ఏం ఫర్వాలేదు, చరిత్రలో నిలిచిపోతరులే మిలార్డ్. ఎందుకంటే దేవదూత అయిన ప్రధాని కనుసన్నల్లో దేవుడి ఆదేశాలతో తీర్పులు చెప్పిన ఘనాపాఠి మీరొక్కరే. ప్రజలు గుర్తుంచుకోకపోయినా దేవుళ్లు, దేవదూతలు మిమ్ముల బాగనే గుర్తుపెట్టుకుంటరులే. దానికి తగిన తిరుగు బహుమతి (రిటన్ గిఫ్ట్) ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో దొరుకుతుందిలే!
మిలార్డ్, ఇలాంటి ప్రమాణాలేమైనా గుర్తున్నయా? “నేను భారతదేశ రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, విధేయతతో ఉండి, భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుతాను. ఎటువంటి భయం, పక్షపాతం, ప్రేమ లేదా ద్వేషం లేకుండా నా కార్యాలయపు విధులను నా సామర్థ్యానికి, జ్ఞానానికి తగ్గట్టు నిష్కళంకంగా నిర్వహిస్తాను. అలాగే రాజ్యాంగాన్ని, చట్టాలను ఎత్తిపడతాను.”
రాజ్యాంగంలోని Oath of Office (Article 124(6)) ప్రకారం దాదాపుగ ఇలాంటి ప్రమాణం ప్రధాన న్యాయమూర్తి గద్దెనెక్కినప్పుడు చేసేవుంటారు. బహుశా మీరు రామమందిరం తీర్పు గురించి మథన పడుతున్నప్పుడు, తీర్పు చెప్పడానికి చరిత్ర, రాజ్యాంగం, చట్టం పనికిరావని అర్థమయినప్పుడు, మీ సామర్థ్యం, జ్ఞానం ఏ దారీ చూపక మీరు “దేవుడా నువ్వే ఒక మార్గం చెప్పు” అని మొరపెట్టుకున్నప్పుడు అది మీ మదిలో నుండి జారిపోయివుంటుందిలే! అయినా ప్రమాణానిది ఏముందిలే మిలార్డ్, నాలుగు మాటల్ని “మమ” అనిపిచ్చుడే కదా.
ఈ లోకానికి మీ నిజాయితీ అర్థం కాదులే మిలార్డ్. మీతో రాయించింది దేవుడు కాబట్టి ఆ తీర్పు మీద మీరు సంతకం కూడా పెట్టలేదు. అది కదా మీ నిజమైన విశ్వాసం, విధేయత మిలార్డ్!
పోనీలే ప్రమాణం గుర్తు లేదేమో కానీ 7 మే, 1997న సుప్రీంకోర్టు అంగీకరించిన “Restatement of Values of Judicial Life” (న్యాయమూర్తుల జీవనశైలికి సంబంధించి ఎలాంటి పనులు చెయ్యొద్దో అని రూపొందించిన పదహేడు న్యాయ నీతి సూత్రాలు) అయినా గుర్తుకు రాలేదా మిలార్డ్. నిజమేలే. నీతిసూత్రాలు మందికి చెప్పడానికే గానీ మనం పాటించడానికి కాదు కదా!
అయినా తీర్పులు రాసింది, మీరైనా వాటిని రాయించింది మీ భగవంతుడే కదా? ఏమైనా మంచి జరిగితే మీ ఖాతాలో వేసుకోండి. పొరపాట్లు జరిగితే మీ దేవుడి ఖాతాలో వెయ్యండి. ఇది మీకు కొత్తేం కాదు కదా మిలార్డ్. మీ కులాల, వర్గాల పెత్తనం కోసం దేవుడి పేరుతో చాతుర్వర్ణ వ్యవస్థనే నిర్మించినోళ్ళు. ఇదో లెక్కనా? ఇంత చిన్న దానికే “చరిత్ర నన్ను ఎట్లా అంచనా వేస్తుంది, ఎట్లా గుర్తుంచుకుంటుంది” అని తెగ గింజుకోవడం ఎందుకు మిలార్డ్?
నిజానికి మీరు చేసిన పనులు తక్కువేమి లేవు మిలార్డ్. మీ దేవుడికి నైవేధ్యంగా రామమందిరాన్ని రాసిచ్చిన విషయం పక్కకు పెట్టినా, మీ గొప్పతనం ఇంకా చాలా వుంది. మచ్చుకు ఒకటి, రెండైనా చెప్పుకోవాల్సిందే! ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని మీ నాయకత్వంలోని బెంచ్ ఎత్తి పట్టి హిందుత్వ శక్తులకు మద్దతిచ్చారు. ఆ దెబ్బతో అటా ఇటా అంటూ ఊగిసలాడే ఊసరవెల్లులన్నీ “దేశం కోసం, ధర్మం కోసం” అనే నినాదంతో కోరస్ పలికేశారు. అన్యాయాన్ని చట్టంగా మార్చాక న్యాయం హత్యకు గురవుతుందని కొత్తగా చెప్పాలా, మిలార్డ్?!
ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధం అని ప్రకటించి జాతిని మేల్కొల్పారు, కానీ ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని కానీ, తీసుకున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కానీ చెప్పకుండానే పాలకవర్గాల బ్యాంకులు నింపి ఆశీస్సులు పొందడమంటే మామూలు విషయం కాదు, మిలార్డ్!
ప్రజా మేధావుల, ఉద్యమకారుల అక్రమ నిర్బంధం కేసులో ప్రజాస్వామ్యంలో నిరసన, స్వేచ్ఛ లేకపోతే అది ప్రెజర్ కుక్కర్ పేలినట్లు పేల్తది అని చెప్పినప్పుడు చేతులు బొబ్బలొచ్చేలా చప్పట్లు కొట్టినం మిలార్డ్. కానీ, మీ అదుపాజ్ఞల ప్రకారమే మేధావుల మెదడు ప్రశ్నార్థకమై ఏండ్లకొద్దీ అక్రమంగా నిర్బంధించబడతారని, క్లీనికల్ హత్యలకు గురవుతారని అనుకోలేదు మిలార్డ్. మీరెంతయినా గ్రేట్ మిలార్డ్, చేతికి మట్టంటకుండ కాశాయ సౌధాన్ని కట్టగలరు.
అలగా జనాలు ఏవేవో అంటుండ్రులే మిలార్డ్. మీరు తేనె పూసిన కత్తని, అంతర్గత మనువాదని, మీకు మతిభ్రమించి ఊహాలోకంలో ఊరేగుతున్నారని, మట్టి విగ్రహాలతో మాట్లాడుతుంటారని… ఎవరు ఏమనుకుంటే మనకేంటి మిలార్డ్. మనకు వెన్నెముక వుందా? లేదా? అనేదే ప్రధానం. వుందనే మీమనుకుంటున్నం. మీరు కూడా ఒక్కసారి మీ వెన్ను మీరే తట్టి చూసుకోని నిర్ధారణ చెయ్యండి.
చివరిగా ఒక్క మాట మిలార్డ్ : చరిత్ర నిర్మాణంలో భాగం కాలేకపోయినా ఫర్వాలేదు కానీ చారిత్రక గమనానికి గండికొట్టినోళ్లు చివరికి మిగిలేది చరిత్ర చెత్తకుప్పలోనే! ఇంతకంటే ఇంకేం చెప్పగలం మిలార్డ్!
True never flow in wrong direction.
This article is going on in right direction.