“అవును నేను కుక్కనే- భారత రాజ్యాంగాన్ని కాపాడాలని విశ్వాసంతోనూ దీక్షగానూ వున్న కాపలా కుక్కనే!” ఖాదర్ మంచం మీద పడుకున్నాడనేగానీ కళ్ళమీదకు కునుకు రావడంలేదు.
మార్చి నెల, మబ్బుల్లేని ఆకాశం, కానీ అమావాస్య రోజులు కావడంతో మిన్నుమీద వెలుతురు జాడలు దోబూచులాడుకుంటున్నాయి.
చల్లగాలికి ఆరుబయటే మంచం వేసుకున్నా, ఆలోచనల వత్తిడి ఆయనకు అలజడిగా వుంది. అటూ ఇటూ కదిలినప్పుడల్లా మంచం కిర్రుమంటోంది. పాత పట్టెమంచం ఎప్పుడు విరుగుతుందో!
నిజమే!, ఇప్పుడెందుకు ఈ కాయితాలూ? ఎక్కడ్నించి తేవాలీ? నేను నేనని చూపించుకోడానికే చిన్న కాయితం ముక్క లేదుగానీ ఇంక మా ‘అబ్బా’దీ, మా ‘తాత’దీ ఎక్కడ్నించి తేనూ?… ఏమిటిదంతా? ఎందుకోసం? – ఆయనకు అర్థమయీ కానట్టుగా వుంది.
ఆ రోజు సాయంకాలం సభలో విన్న సంగతులూ, వచ్చిన వాళ్ళ ఆవేదనా, అశాంతీ ఖాదర్ ని నిలవనీయడం లేదు.
“నేను మా అమ్మను అడిగాను- ‘అమ్మా! నేను ఎక్కడ పుట్టానూ’ అని! నాకు అరవై ఏళ్ళు, మా అమ్మకు కనీసం ఎనభై. జ్ఞాపకం తగ్గిపోయింది, వినబడటమూ తగ్గింది. మరి నేను అడిగింది విన్నదో, లేదో? విన్నా, ఏం! అర్థమయిందో నాకు తెలియదు. “ఛా! భడవా!, నీకీ వయసులో ఆ విషయం కావాల్సి వచ్చిందటరా!” అంది. మా అమ్మే నాకున్న గుర్తింపు దిక్కు ఆమే అలా అంటే ఇప్పుడిక నేనేం చేసేట్టూ!”
ఆ, చల్లనివేళ నిద్రకు దూరమయిన ఖాదరకు మనసును వేడెక్కించిన శ్రీధరన్ ఉపన్యాసం పదేపదే చెవుల్లో ఇంకా రింగుమంటోంది. ఓ మోస్తరు పొట్టిగా, బలంగా వుండి- అంతకంటే దీటుగా, జ్ఞానంతో కూడిన గుండెబలంతో మాట్లాడిన ఆయన మాటలు అందరినీ నిశ్శబ్దంగా ఆకర్షిస్తున్నాయి. పదే పదే ప్రభుత్వానుద్దేశించి చీల్చి చెండాడుతూ రాజ్యాంగంపట్ల వాళ్ళ అతిక్రమణను నిరసిస్తూ సాగుతున్న ఆయన వుపన్యాసం వింటున్న ప్రేక్షకులు అలజడితో నిశ్చేష్టులయ్యారు. ఇప్పుడున్న ఈ ఉక్కపోత స్థితిలో ఈ మాత్రపు ధైర్యంతో ప్రశ్నలు వేస్తున్న వాళ్ళెంత మందీ?
ఆ కళాశాల మైదానం ఓ పక్క బురఖాలు వేసుకున్న మహిళలు, మరో పక్క టోపీలతో ముసల్మానులు, విద్యార్థులు, ప్రజాసంఘాల వాళ్ళతో నిండిపోయివుంది.
ఆ రోజు మీటింగు కోసం రెండు రోజుల ముందుగానే పేటల్లో ప్రచారం చేశారు. ఖాదర్’ కూడా- “తాతా! నీకసలే దేవుడంటే నమ్మకం తక్కువ, నమాజుకు రమ్మన్నా సరిగ్గా రానేరావు… ఈ రోజు మాత్రం తప్పకుండా రావాల” అని గట్టిగా చెప్పాడు, ఇక్బాల్.
“నాకు అల్లా అంటే నమ్మకం తక్కువ కాదురా మనవడా?, నమాజు అన్నిసార్లు చెయ్యాలా? అనీ! అంతే!”
“సరేలే! ఏదైతే ఏం గానీ! ఇప్పుడైతే మన ముస్లింలకు ఖరాబైతుంది, మనం అంతా ఒకటై ఎదిరించాల”
ఇక్బాల్ చెప్పాడని కాదుగానీ- మసీదుకు వచ్చే, పోయేవాళ్ళు, పేపర్లు, టీ.వీలల్లోనూ- ఇంట్లో, కొడుకూ కోడలూ మాట్లాడుకునే మాటలను బట్టి, ముసల్మానులకు రోజులు గడ్డుగా వున్నాయనే భావన కలిగిందాయనక్కూడా!
ఖాదర్ వాళ్ళు వుండేది మసీదు వీధిలోనే. చుట్టు పక్కలంతా ముస్లింలే ఎక్కువ. ఆ బజారు ఇటు మెయిన్ రోడ్డు నుండి అటు ఆంజనేయస్వామి గుడికాడికి దారితీస్తుంది. మసీదుకు కొద్ది దూరంలో నాలుగిళ్ళ అవతలగా వేపచెట్టు సెంటరుంది. ఆ వీధిలో వయసు మళ్ళిన వాళ్ళు తీరిక సమయాల్లో ఆ చప్టా మీద చేరి కాలక్షేపం చేస్తుంటారు.
ఇక్బాల్ చెప్పి వెళ్ళాక అదే ఆలోచన చేస్తూ ఖాదర్ వేపచెట్టు కిందికి చేరాడు. తెల్లోడు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేనాటికి తనకంతగా వూహ లేకపోయినా ‘అబ్బా జాన్’ ఎప్పటికప్పుడు తన జ్ఞాపకాలను సంతోషంతో నెమరు వేసుకోవడం తనకింకా ఎంతగుర్తో “అటు ఉత్తరాదిన దేశ విభజన జరిగి రక్తపుటేరులు పారినయ్యిగానీ, – మనకిటువైపు అట్టా ఏం జరగలేదురా! …. అందుకని మాకవన్నీ ఏమీ తెలియదు, వినేవాళ్ళం! అంతే! అందులో మనకు ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీ బలంగా వుండేది! మేమంతా ఆ పార్టీలో వుండేవాళ్ళం. అప్పుడు రజాకార్లు వూరిమీద బడితే ఈ పేటలో మన ఇళ్ళల్లోనే ఆ వీరయ్యవాళ్ళను దాచాం. అందరం అన్నదమ్ముల్లగుండేవాళ్ళం.” పార్టీ విషయాలు చెప్పడం ఆయనకెంత ఇష్టమో!!
“మనకు తాతనాటికి మూడెకరాల భూమి వుంది. నేను కమ్యూనిస్టు పార్టీలో తిరుగుతున్నానని- ఆయనకు నా మీద కోపం. నా మూలంగా పోలీసులు భూములు లాగేసుకుంటారని బంధువులు ఆయన్ను భయపెట్టారు. అమాయకుడు పాపం? భూమంతా పోగొట్టుకున్నాడు. చివరిలో బాధపడ్డాడు. ఈ ఎకరా నేల మిగిల్చాడు. అయినా నేను పార్టీని వదల్లేదనుకో!”
ఖాదరకు తన తండ్రి మీరాసాయిబు రూపం కళ్ళల్లో మెదిలింది. సన్నగా పొడుగ్గా వుండి, పట్టుదలను చూపించే ఆయన కళ్ళూ, ముక్కూ ప్రత్యేకంగా వుండేవి. దేనికీ భయపడడన్నట్టు ధీమాగా నిటారుగా నడిచేవాడు.
“ఆయన కాలంలో అనే ఏముంది? మేమంతా ఇన్నాళ్ళుగా కలిసిమెలిసే వున్నాంగదా? ఎందుకో ఈ తరం కుర్రోళ్ళు తేడాగా వుంటున్నారు. అంతగా కలిసి పోవడంలేదు. అయితే ఎప్పుడూ ఒకర్నొకరు ఒక్కమాట అనుకున్నదిగానీ ఒక్క కొట్లాట జరిగిందిగానీ లేదనుకో!” మనసులోనే అనుకున్నాడు.
అయితే మరి ఇప్పుడు సాయిబులే తమ వూరూ, పేరూ ఎందుకు నిరూపణ చేసుకోవాల్సివచ్చింది? నా వరకు నాకే మా పూర్వీకుల వందేళ్ళ చరిత్ర తెలుసుకదా? అంతకు ముందు మా ముత్తాతలు ఆకాశం నుండి వూడిపడలేదుగా? ఇక్కడి వాళ్ళమేగదా!!
ఆయన ఈ ఆలోచనల్లో నుండే- ‘ఈ మధ్యలో ఈ బాంబులేందో, ఈ పేలుళ్ళేందో ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు’ జిజ్ఞాసగా అనుకున్నాడు.
ఖాదర్ వేపచెట్టు కింద కూర్చోనుండటం చూసి- చందయ్య కూడా అక్కడకు చేరాడు. “ఏంది ఖాదరూ! మనిషి వచ్చింది కూడా గమనంలో లేకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్!” పలకరించాడు.
“ఆ !, ఆలోచన చెయ్యాల్సిన సంగతులే జరుగుతున్నయ్యి చందయ్యా! రేపు గుంటూరులో మీటింగుంది మా సాయిబులకు. మేం ఇక్కడి వాళ్ళమేనని రుజువు చేసుకోవటానికి ఏవో కాయితాలు చూపించాలంట, మా తాతలయ్యీ మా నాయనలయ్యీ- దాని గురించి తెలుసుకోవడానికి పోవాలని ఇక్బాల్ చెప్పిపోయాడు.”
తనేం మాట్లాడకుండా ఆశ్చర్యంగా, “ఏం? కాయితాలూ?” అన్నట్టుగా ఖాదర్ వలీ మొహంలోకి చూసి- “నువ్విక్కడి వాడివి కాకపోతే ఎక్కడివాడివి మరీ?”- ప్రశ్నార్థకంగా అడిగాడు చందయ్య.
“ఏమో! మరి”
చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరూ మంచి దోస్తులు. పక్కపక్క పొలాలు కావడంతో కలిసి వ్యవసాయపు పనులకు పోతుండేవాళ్ళు. అవసరమయినపుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటుండేవాళ్ళు.
“అసలిప్పుడీ గొడవలెందుకు వస్తన్నయ్యి ఖాదరూ? మన వూళ్ళో ఒకవంతు మీ సాయిబులే కదా! మీ వాళ్ళు ఎవరి జోలికొచ్చినట్టుగానీ, తగాదాల్లోకి పోయినట్టుగానీ, వినలేదే? ఇక మీతో ఎవరికి ఏం చిక్కులొచ్చినట్టూ? ఏం కొంపలు మునిగినట్టూ! ఈ టీ.వీ. లొచ్చి సగం జనాన్ని చెడగొడుతున్నాయనుకో!… అయినా ఇప్పటికీ పెళ్ళిళ్ళకూ, పండగలకూ ఒకర్నొకరం పిలుపులు పిలుచుకుంటున్నాం, అందరం పోయి భోజనాలు చేస్తన్నం!”- ఆ మాట అని అర్దోక్తిలో ఆగిపోయాడు చందయ్య.
“అయితే ఈ తరం కుర్రకారులో మాత్రం ఏదో కొద్దిగా తేడా కనబడుతుంది. అంతకుముందు లేని ఈ గడ్డాలూ, టోపీలు వచ్చినయి.” ఆ మాట అని ఓ క్షణం సాలోచనగా ఆగిపోయాడు చందయ్య. తిరిగి తనే, “అయినా మనం కలిసిపోయినట్టు ఇప్పుడు మా పిల్లలూ, మీ వాళ్ళూ కూడా కలిసిపోవటం లేదెందుకో?” ఆ మాట అని మౌనంగా వుండిపోయాడు.
ఖాదరు కూడా ఏదో బరువుగా అనిపించి నిట్టూర్పు తీసుకుంటూ, “ఇయ్యన్నీ అప్పుడు ఎక్కడ చందయ్యా! పొద్దున్నే లేచి అటు జూట్ మిల్లుకో, ఇటు పొలానికో పరిగెత్తనే సరిపోయే, ఐదేసిసార్లు నమాజు చేసుకోను తీరికెక్కడా?… ఆ పండగ రోజుల్లో నమాజుకు పోతే పోయేది! లేదంటే “యా అల్లా” అని ఇంట్లోనే ‘దువా’ చేసుకునేది. పొద్దుటే నిదర లేచినకాడి నుండి జూట్ మిల్లు ‘సైరన్’ మోగుద్దేమోనని రంథితో సరిపోయే! ఇదిగో ఈ బి.జె.పి. బలపడి, బాబ్రీ మసీదు పడగొట్టాక, మా వాళ్ళల్లో కొంత ఆందోళన కలిగిందిగానీ- అప్పటిదాకా ఎవరి గొడవల్లో వాళ్ళుండేవాళ్ళు మరి!”
అప్పటిలో గ్రామంలో చాలామందికి అంతో ఇంతో వ్యవసాయాలుండేవి. అంతా సన్నకారు రైతులు. సబ్బన్న కులాలకూ ఎకరా, రెండకరాలూ వుండేవి. ఆర్థికంగా వెన్నూదన్నూ వున్న వూరు కాదు. వ్యవసాయం మీద కంటే పైపనులమీదే ఆధారపడే జనం.
అదంతా మనసులో మెదిలి- “మనం చూస్తుండగానే రోజులెట్టా మారిపోయినయ్యి ఖాదరూ! ఈ ఆటోలు, ఈ బళ్ళూ?… వాటిని బట్టి ఈ కుర్రకారూనూ, అంతా మారిపోలేదూ!”- ఆలోచనగా అన్నాడు చందయ్య.
“అవును! ఇప్పుడు జనం తెల్లారి ఆరు దాటితేగాని నిద్దర్లు లేవడంలేదు. అప్పుడు ఆడోళ్ళంతా చీకట్నే రెండు జాములకాడ లేచి, ఇళ్ళల్లో పాచిపనులు చేసుకుని- పెరుగుతట్టలు నెత్తినేసుకుని పొలోమంటూ తెల్లారేటప్పటికల్లా గుంటూరు పోయేది!”
“ఆ! అవును! మా అచ్చాలు కూడా పొద్దున్నే పరిగెత్తేదిగా! ఇక మిగిలిన పనులు, పిల్లల్ని మా అమ్మే సవరించుకునేది. అప్పుడు అందరి కొంపల్లో నలుగురు మనుషులు కనబడేది. పొలాలు పోయేవాళ్ళూ, మిల్లుకు పోయేవాళ్ళూ, పాలు, పెరుగు అమ్మకానికి పోయేవాళ్ళు, గొడ్లను మేతకు ఇప్పేవాళ్ళూ అట్టా జనం అంతా పదింటికల్లా వూరు దాటేది. ఇక ముసిలోళ్ళు ఇంటికాడ కోళ్ళ, కుక్కల కాపలా కుండేదనుకో!” చందయ్యకు ఆ జ్ఞాపకాలన్నీ ఏదో గుబులుగా అనిపించాయి.
“ఆ, అదే చందయ్యా! అప్పుడు జనానికి బతకటమెట్లా అనేదే వుండేది. ఈ నమాజులూ, ఈ నవమి పందిళ్ళూ ఎక్కడా? అంత తీరికేదీ?”
“అంతే, అంతే, ఇప్పుడు డబ్బులెక్కువయి ఈ పిచ్చిపోకళ్ళు పోతున్నారు!”
ఎప్పుడొచ్చి కూర్చున్నాడో గానీ, జానీ అందుకుంటా- “ఆ మాట నిజమేగానీ మామా, మసీదు పడగొట్టడం మాకు వత్తిడి పెంచినట్టు కాలా! అయినా మీలో కూడా కొంత మారారుగా చందయ్య మామా”…
“అదీ నిజమేలే జానీ… కాలం ఎప్పుడూ ఒక రకంగానే వుండదుగా!” – “మన చేతుల్లో ఏముందీ”- ఓ క్షణం మౌనంగా వుండిపోయాడు.
జానీ ఎక్కడో దేనినో దీక్షగా చూస్తున్నట్టు నిట్టూరుస్తూ- “బేతపూడి నుండి మేమిక్కడికి మారటానికి మా పిల్లల్ని చదివించాలనే దొకసంగతనుకో! అయితే అప్పటికే మా వూరిలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం మాకు మనస్తాపం కలిగించింది మామా! నీకు తెలుసుగా మా తాతల కాలం నుండి అక్కడే వున్నాం, మా జనాభా కూడా ఎక్కువే కదా! మా నాయనది చిల్లర కొట్టు, ఆయన తరవాత దాన్ని మా అన్నదమ్ములమే సాగించాం. అప్పుడు మా వూళ్ళో ఇంకో కొట్టు వున్నా మేం మోసం చెయ్యమని మా కొట్టుకే ఎక్కువగా వచ్చేది. చిల్లర కొట్టు కావడంతో అందరూ చనువుగా వరసలు పిలుస్తూ మాతో కలుపుగోలుగా వుండేది. మేం అప్పులిచ్చేది, వాళ్ళు తీర్చేది, అంతా జరిగిపోయేది. మాకేం తేడా అనిపించేదే కాదు.
ఇదిగో ఈ మసీదు గొడవ తరవాత మా వూరులో ఒకరిద్దరు వూరేగింపు తీసి ఏవో వుపన్యాసాలు ఇచ్చి మందిరానికని ఇటుకలు పంపారు. ఆ మాటలు విన్న మా వాళ్ళు బాధపడ్డారు. పోనీ అంతటితో పోకుండా మెల్లిగా మా కొట్టుకు రావడం కూడా తగ్గించారు గదా మామా! ఇది మాకు కష్టంగా వుండేది. ఇక ఆ వ్యాపారం మీద అన్నదమ్ములం సాగటం కష్టమనుకుని అది పెద్దాడికి వదిలి- నేనూ, చిన్నోడూ ఇటు వచ్చాం!- వచ్చినందుకు మేమేం నష్టపోలేదులే మామా! పిల్లల్ని చదివించుకున్నాం. ఉద్యోగాలొచ్చి కుదురు కున్నారనుకో!…. అయితే జరిగిన సంగతులు చెప్తున్నానంతే!”…
“నిజమే! ఎవరి అనుభవం వాళ్ళది! మీ వూరి సంగతి నాకు తెలియదుగానీ, ఇక్కడ మాకు మాత్రం ఏం తేడాగా వుండేది కాదుగా జానీ! అంతదాకా ఎందుకూ! నువ్వు మీ అమ్మమ్మ వున్నన్నినాళ్ళూ వచ్చేవాడివిగా. అందరూ కలిసిమెలిసి వుండేది గాదూ! అంతదాకా ఎందుకూ! ఈ ఖాదర్ చెల్లెలు పెళ్ళప్పుడు మేమంతా ఎట్లా చేశామనీ?” –
“అవును! జానీ! మా పెద్ద చెల్లెలు పెళ్ళినాటికి వూళ్ళో నీటి ఎద్దడిగా వుంటుండేది. ఇక్కడే కాదు, గుంటూరు చుట్టుపక్కలంతా అంతే… అప్పటికింకా నీళ్ళకు బావులే ఆధారం. ఆ ఏడాది వూళ్ళో బావులన్నీ ఎండిపోయాయి. ఇక పొలాలల్లో బావులే దిక్కు. ఇదిగో ఈ చందయ్యా, ఈరయ్యా, మన హుస్సేన్‌రావూ అందరూ బళ్ళు కట్టి చెక్క పీపాలు పెట్టుకుని పొలాల్లో వున్న ‘కాపా’ వాళ్ళ బావినుండి ఎన్ని నీళ్ళు తెచ్చి పోశారనీ!… పైగా పిల్లాడి వూరు నకిరేకల్ నుండి వూరి జనమంతా రెండు లారీల నిండా వచ్చారు. అంత జనానికీ నీళ్ళు లోటు లేకుండా చేశారు పాపం! అప్పుడు కాబట్టి సరిపోయింది!”
“అసలు అప్పుడు ఎవరిళ్ళల్లో పెళ్ళో, పేరంటమో పెట్టుకున్నా వూరంతా తెలిసేది, కనబడ్డవాడల్లా అడిగేది. ఎవరైనా పిలుపులు పిలవటం ఆలస్యమయిందనుకో, ‘ఏంది భాయ్! ఇంకా పిలుపురాలేదూ!”, అని చనువుగా అడిగేది! అట్టా వుండేవాళ్ళం.”
“అంతెందుకూ! వీరయ్య కూతురు పెళ్ళి తిరపతిలో పెట్టుకున్నాడు. ఆయనకి చేతి సహాయం లేదు. ఇంటికి ముందు కూతురాయె! ఖాదర్ భయ్యా! మీరిద్దరూ మాతో తిరపతి రావాల! అన్నాడు! నేనేం ఆలోచించలా! చందయ్యా, నేనూ వాళ్ళతోపాటు బయలుదేరి అక్కడి పనులన్నీ మీదేసుకుని చేశాం మరి!- నేను సాయిబునని నేననుకోలేదు, వాళ్ళు వేరే మతస్తులని వాళ్ళూ అనుకోలేదు. ఇంటికొచ్చేటప్పటికి నాలుగు రోజులు పట్టింది. అప్పుడు ప్రయాణాలుగానీ, అక్కడి వసతులుగానీ ఎంత ఇబ్బందులుగా వుండేది? మనుషులు తోడులేకుండా అయ్యేదా” ఖాదర్ ఆగి వూపిరి తీసుకున్నాడు. ఎవరేం మాట్లాడలేదు. అప్పటికి ఆ చప్టామీద ఐదారుగురు చేరారు.
ఈరయ్యకు గుర్తు కొచ్చినప్పుడల్లా – “మీరిద్దరుండబట్టి ఇంత కష్టం కూడా లేకుండా ఆ రోజుల్లో పిల్ల పెళ్ళి చేసుకుని తిరిగొచ్చాం ! అనేది” – జ్ఞాపకంగా చెప్పాడు ఖాదర్.
“మా కాలంలో ఎవరన్నా అంత సాయం చేశారంటే మర్చిపోయేది కాదు. ఇప్పుటిలాగానా” అన్నాడు.
“దానికి మనం ఏం చేస్తాములే ఖాదరూ! రోజులు మారిపోలా! అందులో ఇది కూడా ఒకటి”- అని?, “ఎన్ని గంటలకు మీటింగూ” అడిగాడు చందయ్య. “అయినా మీవాళ్ళు వస్తారేమో!”
“వస్తే వచ్చారులే- మనం పోదాం”
ఖాదర్ మాటతో చందయ్యకు మనసులో సంతోషం కలిగింది. ‘ఖాదర్ ఏమీ మారలేదు- ఇప్పటిదా తమ స్నేహం’ అనుకున్నాడతను. “సరే చందయ్యా! ఐదు గంటలకు పంపుసెంటరుకు రా! అక్కడి నుండి పోదాం! ఆరు గంటలకు సరిపోద్ది”.
“మీటింగుకేనా! నేనూ వస్తన్నా!”- అన్నాడు జానీ.
***
నిద్రపట్టని ఆ రాత్రి ఖాదరకు ఆ రోజు మీటింగులో కలిసిన అక్తర్ మొహమూ, గొంతూ వెంటాడుతున్నాయి. “హా! యా అల్లా! భయమన్నమాట లేకుండా ఏం మాట్లాడాయన! ఎంత ధైర్యం…”
“ఈ రోజు ఈ బిల్లు ముస్లింలకేనని మనం మౌనంగా వుంటే, రేపు మనదాకా వచ్చినపుడు మునిగిపోతాం! మన దగ్గరకొచ్చి వివరాలు అడిగిన వాళ్ళకు మనమిచ్చే ఆధారాలు చాలకపోతే, లేదూ వచ్చినవాడికి మనం నచ్చకపోతే మన పేరు చివర- “డి”- అని పెడతాడు, అంటే ‘డౌటుల్’ అని! ఇక ఆ ‘డి’ పడిందో! మన పని ఖాళీ. ఏ విదేశపు ఏజంటో, లేదూ దేశద్రోహం చేయడానికి పన్నిన కూటమిలో మనిషిగానో ముద్ర పడిపోయినట్లే! అది నిరూపించుకోవాలంటే మన తాతలు దిగిరావాలి. నిరూపించుకోలేని వాళ్ళకు “క్వారంటైన్” (డిటెన్షన్ సెంటర్లు) ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఇరవై అయిదు అడుగులుండి, జైలు గోడల కంటే ఎత్తైనవి.” ప్రొఫెసర్ శ్రీధరన్ మాటలు నిశ్శబ్దంగా వున్న ఆ ప్రాంగణంలో తూటాల్లాగా ప్రతివాళ్ళ హృదయాలనూ తాకి కలవరపరుస్తున్నాయి.
ఖాదరి కి అటువైపు కూర్చున్నతను బాధగా నిట్టూరుస్తూ- “యా అల్లా! పోయిందనుకుంటే మళ్ళీ ఎలాంటి కాలం దాపురించిందీ?”- జీర సాగుతూ ఆవేదనతో కూడిన అతని స్వరం పలికిన తీరు ఖాదరు కలిచినట్లయింది. అతని వైపు చూస్తూ- “ఏం! భయ్యా! ఎందుకంత భయపడతావ్! జరిగేది జరుగుతుంది కానీ!, నసీబు ఎలా వుంటే అలా, ధైర్యంగా వుండాలి” అన్నాడు.
“అట్లా అనుకుని వూరుకోలేం కదా భయ్యా! జరిగిపోయిన సంగతులు తొలుస్తుంటయ్యి కదా? ఆ విభజన రోజుల్లో మా కుటుంబం సర్వం కోల్పోయింది. ఎవరికి వాళ్ళం తలోచోట అయిపోయాం. ఆ బాధ నుండే మేమింకా కోలుకోలేనట్టుగా వుంది- తిరిగి ఇప్పుడు ఈ పౌరసత్వం గొడవతో- ముస్లిమ్ గా పుట్టటమే నేరమయ్యేటట్టుగా వుంది! యా అల్లా”. అతని గొంతు నిస్పృహగా ధ్వనించింది.
ఖాదర్ వెంటనే ఏమీ మాట్లాడలేక పోయాడు.
ఓ క్షణం ఆగి “మీది ఇక్కడ కాదా?”- సందిగ్ధపడుతూ అడిగాడు.
“లేదు భయ్యా!, మా తాతది బీహార్! అప్పుడు పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు అక్కడ యేదో ఒరిగిపోతుందని మా చిన్నాయన వాళ్లు, తూర్పు పాకిస్తాన్ పోయారు. అంతవరకైతే బాగానే వుండేది. మళ్ళీ ఈ బంగ్లాదేశ్ గొడవలొచ్చాక, బీహార్ వాళ్ళను స్థానిక ముస్లింలు తరుముకుంటిరి. ఆ గొడవల్లోనే మా చిన్నాయన ఒకడు అక్కడే చనిపోయాడు. ఇంకో చిన్నాయన ఎట్టాగో గొడవల్లో తప్పించుకుని మా దగ్గరకు వచ్చాడు. కానీ ఏం ఉపయోగం? అప్పుడూ ఈ కాగితాల గొడవలే వచ్చాయి. బీహార్ లో పుట్టి, పెరిగి, అక్కడే చదువుకొని, ఈ దేశం వాడు కాకుండా పోయాడు మా చిన్నాయన. ఆయన్ను, ఆ కుటుంబాన్నీ ఆ రెండు మూడు నెలలు కాపాడుకోవడానికే మేమంతా ఎంత కిందుమీదులయామంటే- ఓ పక్క వాళ్ళను స్థానికులు గమనించి పాకిస్తానీయులని అల్లరి చేస్తారనీ, మరోపక్క అసలు కాగితాలు లేకుండా రేపు ఇక్కడి నుండి పోవడమెట్లా అనేది…. ఆ రోజుల్లో మేం చిన్నవాళ్ళమే అయినా మా దాదీమా పడ్డ దు:ఖం నాకిప్పటికీ గుర్తె భయ్యా! ఆ దిగులుతోనే ఆమె చనిపోయింది…” ఆ మాట అంటూ కళ్ళల్లో నీళ్ళు తిప్పుకున్నాడతను. గడ్డం లేకుండా తెల్లగా మెరుస్తున్న అతని మొహం ఒక్కసారిగా నీలిమకు తిరిగింది. మనిషి ఎత్తుకుతగ్గ లావుతో వయస్సులో బావుండేవాడనిపించాడు. పేరు అక్తర్ అన్నాడు.
అతని భుజంమీద చెయ్యివేస్తూ “మనమేం చేస్తాం భయ్యా! అంతా అల్లా దయ”… అన్నాడు భారంగా! ఖాదరకూ కష్టమనిపించింది.
“నిజానికి అప్పటికి మా చిన్నాయన వాళ్ళ భూములన్నీ ఇక్కడే వున్నాయి. అయినా వుండడానికి ఆరడుగుల నేల కోసం ఎంత క్షోభ పడ్డారో”…
గతం క్షణ కాలం అతని కళ్ళలో తారాడింది.
“తినండమ్మా, ఒక్క ముద్ద తినండిరా! ఏడ్చి ఏడ్చి ఎంతకని ఏడుస్తారూ”- దాదీమా తను కన్నీళ్ళు కారుస్తూనే బిడ్డలను ఓదార్చాలనే ప్రయత్నం.
“అత్తా ! మేం ఇక్కడే చచ్చిపోతాం! ఇక్కడే చచ్చిపోతాం!- మాకు ఈ వూళ్ళో, ఈ దేశంలో జానెడు చోటు లేకుండా ఎట్లా పోయింది, మా! మేం మీ కడుపున పుట్టినోళ్ళమేగా! ఇంత దొంగ బతుకు ఎందుకు బతకాల్సి వచ్చింది- మా.” ఎంత ఓదార్చినా ఆగని ఆక్రోశంతో కంటికీ మంటికీ ఏకధారగా తన చిన్నమ్మ ఏడ్చిన ఏడ్పు ఇప్పటికీ అతన్ని వెంటాడుతూనే వుంది.
పురాగతం భారం కాగా దీర్ఘంగా నిట్టూరుస్తూ! “ఈ నేల ఇక వారిది కాదని తేలిపోయాక చేసేది లేక ఎంతో కష్టంగా పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఆ రోజు, వాళ్ళు వెళ్ళే రోజు మా యింటిలో పొయ్యి వెలిగించలేదు. శవం వున్న ఇంటిలాగా ఆడవాళ్ళ అప్పటి ఏడ్పులు ఇంకా కళ్ళముందు కదలాడుతున్నాయి భయ్యా” అన్నాడు. అతని గొంతు బొంగురుపోయింది. “చిన్నాయన వెళ్ళిపోయాక కొద్ది రోజులకే ఆ దిగులుతో మా దాదీమా చనిపోయింది. మా నాయన కూడా మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఇల్లుదాటి బయటకు రాకపోయాడు. అప్పటిదాకా వుమ్మడిగా కలిసివుండి, ఆయన చేతుల్లో పెరిగిన పిల్లలు వాళ్ళు. అది తట్టుకోలేకపోయాడు.
ఇక అక్కడ కూడా మా చిన్నాయనవాళ్ళు స్థానికులు కాకపోవడంతో దేనిలోనూ స్థిరపడలేకపోయారు. అప్పుడు బంగ్లాదేశ్ లో అన్నీ పోగొట్టుకున్నారు. ఇక్కడి నుండేమో ‘దొంగ వీసా’ లతో చాటుగా పాకిస్తాన్ పోవాల్సివచ్చి, కట్టుకునే బట్టలు తప్ప ఏమీ తీసుకుపోలేక పోయారు. అంత భూములు పెట్టుకుని జాగీర్దారులుగా బతికిన కుటుంబం – చివరికి నాదీ అనే ఆరడుగుల నేల లేక, ఆ దిగులుతోనే మా చిన్నాయన పాకిస్తాన్లో చచ్చిపోయాడు. మా నాయనా పోయాడు!
ఇక మేము అక్కడ వుండలేక ‘నైజాం’ వచ్చాం . ఇప్పుడు మా మనవడిక్కడ డిప్యూటీ కలెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ లో.”
అతను చెప్పింది వింటున్న చందయ్య ఆ మాటతో తేరుకున్నట్టయి, “పోనీలే ఇప్పటికైనా ఎక్కడో అక్కడ స్థిరపడ్డారు. పిల్లలు చదువుల్లోకి వచ్చారు. అంతే చాలు!” అన్నాడు ఓదార్పుగా.
“అంతే మరి. ఇక వ్యాపారాలు వద్దనుకుని అక్కడ భూములమ్మి పిల్లల్ని చదివించాం. ఫరవాలేదిప్పుడు. కానీ కొత్తగా ఈ కాయితాల గొడవలంటే గుండెల్లో దడ వస్తుంది భయ్యా!”. గత జ్ఞాపకాలు అతన్ని కలత పెడుతున్నాయి.
అతని మాటలు వింటూ, “ఈ పార్టీ ఏమంటూ పుట్టిందో! జనం బతుకులు అల్లకల్లోలమై పోయాయి” అన్నాడు ఖాదర్. అప్పటివరకు చందయ్యకు ఈ గొడవలేం తెలియవు. అవి వింటూ, ఎంత అన్యాయంగా వుంది అనుకున్నాడు.
శ్రీధరన్ మాటలు తలచుకుంటూ, “అయినా, మా తద్దినాల బ్రాహ్మలకైతే తద్దినాలప్పుడు ఏడు తరాల వంశ వృక్షం చదువుతారు కనక, మాకు కనీసం పేర్లు అయినా తెలుస్తాయి. మిగిలినవాళ్ళ కెక్కడుంటాయీ?”… నిజమే! మసీదులో మాత్రం మా నాయన పేరు వుంటుంది. అయినా ఆయన కాయితాలు ఎక్కడ తేవాల. భూమి వుంటే దాని పట్టాలోనన్నా పేరు వుండేది. ఆ భూమీ లేదుగా. ఈ కాలనీకి అమ్మేశాం కదా అనుకున్నాడు.
***
ఆ అర్థరాత్రివేళ ఖాదరకు ఎప్పుడో చనిపోయిన తన తాత నాగుల్ మీరా కళ్ళముందు కొచ్చాడు. ఆయన కథలు కథలుగా తన అనుభవాలు ఎన్ని చెప్పేవాడో!!
“మందడంలో అప్పయ్య అని జమిందారు వుండేవాడురా! ఆయన మా చిన్నప్పుడు గుర్రమేసుకుని చుట్టుపక్కల వూళ్ళన్నీ తిరుగుతుండేది. ఆయన గుర్రమేసుకుని పోతుంటే పిల్లలమంతా నోరు తెరుచుకుని అట్లా చూస్తూ వుండేవాళ్ళం. ఆయనకు వెయ్యి ఎకరాల పైనే భూమి వుంది. మా నాయనది ఇటుకల బట్టి వ్యాపారం, అదే పని అందరం చేస్తుండేది. అప్పయ్య వాళ్ళు ఏది కట్టుబడి చేసినా మా దగ్గరే ఇటుకలు కొనేది. అసలు వాళ్ళు బట్టీ వెయ్యమంటేనే మనం వేసేది. అట్టా ఆయన కొడుకు వెంకటప్పయ్యకు నేను బాగా దగ్గరయ్యాను. కొడుకు పిసినారివాడు గానీ, అప్పయ్య మంచి దానశీలి. ఓసారి నాతో, “మీ తండ్రి కాలం నుండి నమ్మకంగా మాకు సేవ చేస్తున్నారు. మీకేదన్నా చెయ్యాలని వుంది సాయిబూ” అని, “అటు పడవట తుమ్మల చెరువు దగ్గర బీడు పడిపోయింది చూడూ, ఆ భూమి బాగు చేసుకోండి! పట్టా ఇస్తా!” అన్నాడు రా! అభిమానంతో! అప్పటికాయన పెద్దవాడై పోయాడులే.”
“మరి ఆ భూమి ఇప్పుడుందా తాతా”- చిన్నతనం నుండి కూడా భూమి అంటే తనకిష్టంగా వుండేది.
“ఆ భూమి ఇప్పుడుంటే మనం ఆ వూరు వదిలి ఎందుకొచ్చేవాళ్ళంరా! మీ అబ్బా జాన్ ఇన్ని తిప్పలు ఎందుకు పడేవాడూ!… నాకు తెలివి లేదురా. ఆయన భూమి ఇస్తానంటే తీసుకున్నానా? ‘మాకెందుకు సారూ, ఈ భూములూ, ఈ తోటలూ, మేమేం వ్యవసాయాలు చేస్తామా? అదంతా వద్దుగానీ- ఈ ఊళ్ళో మా సాయిబులకు మసీదు కట్టుకోవడానికి స్థలం ఇవ్వండి చాలు’ అన్నాను.”
“ఇప్పటికీ ఆ వూళ్ళో మనం కట్టించిన మసీదు వుంది- మనం పోయినా, నాగుల్ మీరా మసీదని ఎల్లకాలం చెప్పుకుంటారుగదా!…. పదిహేను సెంట్ల భూమి, పెద్ద ఆవరణ, బాగుంటదిరా!”- ఖాదర్ తన తాత రూపం, మాటలు తలచుకుంటూ; అప్పట్లో ఈ ఆస్తులూ, భూములూ ఏం పట్టేవీ?.. ఆడోళ్ళు బయటికొచ్చి పొలాల పనులు చేసేది లేదు. పైగా సంతానం ఎక్కువ కావడంతో వాళ్ళతోనే సరిపోయేది. అందుకే ఎప్పటికప్పుడు డబ్బులు చేతిలో పడే వ్యాపారాల వైపే మొగ్గు చూపేది.
“మీ నాయన ఐదోవాడు. అప్పటికి నాకూ ఓపిక తగ్గిపోయింది. మిగిలిన వాళ్ళను గట్టెక్కించాలి, ఆడపిల్లల పెళ్ళి చెయ్యాలి, ఇక అక్కడ అందరికీ బతుకుదెరువు సాగదని, టౌను దగ్గరలో అయితే ఏదో ఒక పని దొరుకుతుందని మీ నాయన ఎదిగి వచ్చే నాటికి అందరం ఇక్కడికొచ్చాం. ఇక ఇటుకల బట్టి మీ పెదనాయన వాళ్ళు చూసుకున్నారు.”
తాతకు మందడం అంటే ఎంతిష్టమో!- “అక్కడింత వేడిగా వుండదురా! కృష్ణ ఒడ్డు గదా! మొక్కజొన్న, అరటి తోటలతో ఎప్పుడూ పచ్చగా వుండేది. వ్యవసాయాలకు దూరంగా వుండటమే మనం చేసిన తప్పురా!” అనేది.
ఖాదరకు తన తాత మాటలు నిజమేననిపించేవి. ‘చందయ్య వాళ్ళతో ఇప్పటికీ స్నేహంగా వుండగలుగు తున్నామంటే తామిద్దరమూ, వ్యవసాయపు పనులు కలిసి చేసుకోవడం, చేనుకు వస్తూపోతూ మాటా మనసూ కలవడం వల్లనే కదా!’- అనుకున్నాడు.
ఇంతకాలం ఎట్టాగో జరిగిపోయింది. ఇక ముందు ఏం కాలం దాపురించనుందో తెలియడం లేదు అనుకున్నాడు. ఎక్కడ ఏ గొడవ జరిగినా ముందు ముసల్మానుల మీదకొచ్చి పడుతున్నారు. వెనకటిలాగా ఇప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునే స్థితికూడా లేకపోతోంది. అపనమ్మకాలు ఎక్కువయ్యాయి. అట్టా ఆ రాత్రి ఏవేవో ఆలోచనలు ఆయనకు వేదన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ చిన్నపిల్లలు ఎలా బతుకులు సాగిస్తారోనని, మనవడు, మనవరాళ్ళను తలచుకుంటూ దిగులుపడ్డాడు.
నిద్రాదేవి దయతో ఎప్పటికో ఓ కునుకు ఆ కళ్ళమీద వాలింది.
***
పొద్దుపోయి నిద్రపోవడంతో మంచంమీద నుంచి లేస్తుంటే భారంగా అనిపించింది ఖాదర్ కి. దుప్పటి మడతపెట్టి, మంచం లేపి గోడకానించి, తొట్టి దగ్గరకు పోయి పుక్కిలించి వేప్పుల్ల విరుచుకుని రుద్దుకుంటూ బజారులోకి పోయాడు. అప్పటికే కొడుకు భాషా పంపుదగ్గర నుండి నీళ్ళు తెస్తున్నాడు.
భాషా కరెంటు పనిచేస్తాడు. సొంతంగా చిన్న కొట్టు పెట్టుకున్నాడు. షాపు ఎనిమిది గంటలకల్లా తియ్యాలి. సామాన్లు కావాల్సిన పనివాళ్ళు పొద్దుటే వస్తారు. అతను పనికి వెళ్ళేదాకా ఇంటిలో అంతా టెన్షన్ గా వుంటుంది. ఆ సమయంలో ఖాదర్ ఇవతలికే వుండిపోతాడు. ఈ అపార్ట్ మెంట్ల పనులు మొదలు పెట్టాక కొడుక్కి కాస్త గిట్టుబాటుగానే వుంటోందనుకున్నాడు.
భాషా టీ తాగుతూ, “అబ్బా! ఆవో! చాయ్ తయార్ హోగయా!” అని పిలుస్తూనే, కాళ్ళు చేతులూ కడుక్కుని బట్టలు మార్చుకుని మసీదుకు వెళ్ళాడు.
“నాకు లేని శ్రద్ధ వీడికెక్కడ నుండి వచ్చిందోగానీ- ఎంత పనిలో వున్నా రోజూ రెండుపూటలూ మసీదుకు తప్పకుండా పోతాడబ్బా!… ఇక రంజాన్ నెల పట్టారంటే ఐదుపూటలా నమాజే!”
పొద్దుటిపూట కోడలు హడావిడి, హైరానా చూస్తూ, పిల్లలకు, వాడికీ నాస్తా తయారుచేసి పంపేటప్పటికి తొమ్మిదవుతుంది. పాపం ఒక్కతే చేసుకోలేక సతమతమవుతోంది. ‘అది’ వున్నన్నినాళ్ళూ ఇద్దరూ కలిసి చేసుకునేది. అల్లాకు దయలేకపోయింది. తిరుగుతా తిరుగుతానే పోయింది. భార్య ఖాసింబీ ని గుర్తుచేసుకుంటుంటే మనసు వజవజమంది.
భాషా మసీదు నుండి వస్తానే! – “ఆవో అబ్బాజాన్!, నాస్తా ఖాయేంగే” అని పిలిచాడు. “నై! బేటా! తు ఖావో! టైం హోగయా!” అన్నాడు.
భాషా తినడం అయిందనిపించి- పెద్దకొడుకుని లూనామీద ఎక్కించుకుని షాపుకు వెళ్ళిపోయాడు. కోడలు రేష్మా మిగిలిన పిల్లల్ని కూడా తయారుచేసి బడికి పంపించి వూపిరి తీసుకుంది. బడికిపోతున్న పిల్లల్ని చూస్తూ, “వెనకటి లాగా కాకుండా, ఆచారాలని పట్టుకోకుండా ముగ్గురితోనే పిల్లలను ఆపి వేసుకుని మంచి పనిచేశాడు. లేదంటే ఇప్పుడు అయ్యే పనేనా?” కొడుకుని మనసులోనే మెచ్చుకున్నాడు, ఖాదర్. ఇంతలో “రా! అబ్బా! నాస్తా తిందువు” అని- మామను తినడానికి పిలిచింది రేష్మా!
ఖాదర్ నింపాదిగా కాళ్ళూ చేతులూ కడుక్కుని లోపలికెల్లి, దోసిలిపట్టి దువా చేసుకున్నాడు! నాస్తా ముగించి, సైకిల్ తీసుకుని కోడలితో చెప్పి కొడుకు షాపు వైపు దారితీశాడు.
ఖాదర్ కొట్టుకుపోతే, పిల్లాడిని తోడుంచి, భాషా పనులుమీద బయటకెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా తండ్రి కోసం చూస్తున్నాడతను.
“ఇవ్వాళ ఇంటి స్లాబు ఒకటుంది, అక్కడికి పోతున్నాం, వీడిని కూడా తీసుకుపోతా! ఆలస్యమవుతుందేమో!”
“ఫరవాలేదు! నాకు పనేముందీ! మీరు వచ్చేదాకా షాపులోనే వుంటా!”
భాషా ఈ మధ్యనే ఈ షాపు తీసుకున్నాడు. అంతకుముందు బడ్డీ షాపు పెట్టుకుని రిపేరు పన్లు చేస్తుండేవాడు. పెద్ద కొడుకు ఎక్కిరావడం, ఎపార్ట్మెంట్ల పనులు రావడంతో భాషాకు పనులు బాగా వస్తున్నాయి. అదేగాక ఇళ్ళకు కరెంటు పని, చిన్న చిన్న కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాడు.
ఖాదరు కొడుకు స్థితి మెరుగవడం సంతోషమే అయినా, పిల్లల్ని చదివించాలనేది అతని కోరిక. ఈ వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎలా వుంటాయో తనకు తెలియంది కాదు. అయితే చదువుకుని వుద్యోగమే చేయాలనే ఆలోచన కంటే, చదువుకుంటే మనుషులు వికాసం చెందుతారనేది ఆయన ఆశ. తన బంధువులనూ చుట్టుపక్కల తమవారినీ చూస్తూ, చదువుల్లేక లోకం పోకడ తెలుసుకోకుండా అంతకంతకూ తమలో తాము గిరిగీసుకుంటున్నారనీ అతనికి బాధ.
అదీగాక ముందు రోజు మీటింగులో విన్న సంగతులు ఆయన మనసుమీద ముద్రపడిపోయాయి. మనుషులకు చదువు లేకపోతే ఎట్లా? అనిపిస్తోంది.
ఖాదర్ జిజ్ఞాసగా, ఇదే ఆలోచనే చేస్తూ పరధ్యానంగా కూర్చోనున్నాడు.
“చాచా!, ఏం కునుకు తీస్తున్నావా!” మస్తాన్ పలకరింపుగా వచ్చి కూర్చున్నాడు.
“లేదు! వూరికే ఏదో ఆలోచన చేస్తున్నా!” అని “సరేగానీ మస్తాన్! మీ పిల్లకాయల్ని చదివించడం లేదెందుకనీ?” అర్థాంతరంగా ప్రశ్నవేశాడు.
ఖాదర్ ప్రశ్నకు వింతగా చూస్తూ- “అదేంది చాచా!, పని నేర్చుకుంటేనేగా రేపు వాళ్ళు బతికేది. ఈ చదువులు మనకేమన్నా తిండి బెడతాయా? మన కష్టం మనకు తప్పదుగా!”
“చదువుకుంటే ఉద్యోగాలే చెయ్యాలని కాదుగా మస్తాన్! కాస్త బయట లోకం పోకడ ఎలా వుందో చూసి నేర్చుకుంటారుగదా”
“నిజమేగానీ, మనమేం చదివిస్తాం, మనకంత స్తోమతెక్కడ వుందీ? మనకెవరు సహాయం చేస్తారు… ఆ మదరసాలకు పంపాల, అక్కడ నేర్పే ఆ ఉర్దూ, అరబ్బీలతో ఏం ఉద్యోగాలొస్తాయీ? ఏం నేర్చుకుంటారూ? మన పిల్లలేం మత పెద్దలవ్వాలా ఏమిటి? ఎందుకొచ్చింది! మళ్ళీ ఆ ఆటోలు, సైకిళ్ళూ, పంపులూ రిపేర్లు తప్పవుగా!
“ఆ! ఆ! మదరసాలకు పంపితే చదువేం వస్తుందిగానీ! అందరిలాగా మామూలు చదువులు చదువుకోవచ్చు గదా! మామూలు స్కూలుకు పంపూ- లేకపోతే, ఉర్దూ స్కూలుకు పంపు, అదీ గవర్నమెంటుదే గదా!”
“అయినా ఆ మదరసాలు మనకేం మేలు చేస్తాయీ? ఏమన్నా చెప్పామంటే అల్లా మీద శ్రద్ధ లేదనుకుంటారుగానీ, ఎంతసేపూ మసీదులో కూచ్చుని జపం చేసుకోమనే గానీ- ఖురాన్ లో ఏముందో అసలు విషయం చెప్పరు. లోకం పోకడ తెలుసుకునేందుకు అవసరమయిన చదువు లేకపోవడం వల్లే మన ముస్లిం సమాజం ఇలా వుందనుకో!”
“ఎప్పుడన్నా మా వాళ్ళను చూడటానికి ఆ మందడం పోతానా, ఆ వూరును చూస్తుంటే కడుపు నిండిపోద్ది మస్తానూ. అందరూ చదువుకున్నవాళ్ళే. చిన్న చిన్న రైతులు కూడా అప్పులు చేసో, లేదంటే వున్నది అమ్ముకునో పిల్లల్ని చదివించారు. మనమో!”
“మీ నాయన నాడున్న ఆ పూలబుట్ట నువ్వూ తీసుకున్నావ్. నీ పిల్లలకు సైకిల్ షాపులు చూపించావు”
“అదికాదు చాచా; వాళ్ళకంటే చదువుకుంటే ఉద్యోగాలొస్తాయి, రికమండేషన్లు, డబ్బులు అన్ని వుంటయ్యి!, మనకెక్కడవుద్దీ” ఆ మాట అని మస్తాన్ మౌనంగా వుండిపోయాడు.
అతనిది భాషా షాపుకు వెనక సందులోనే ఇల్లు. ఖాదర్ మీద ప్రేమతోనూ, చనువుతోనూ, దగ్గరి బంధువూ అవడంవల్ల ఎప్పుడన్నా వచ్చి కూర్చోవడం మస్తానుకు అలవాటు. రైతుల దగ్గర హోల్ సేల్ గా పూలు కొని, మార్కెట్లో చిన్న చిన్న కొట్లకు వేస్తాడు. మిగిలిన పూలు ఇంటికి తెచ్చి, ఇంటిదగ్గర చుట్టుపక్కల ఆడవాళ్ళకు తూకంవేసి ఇచ్చి, దండలు కట్టిస్తాడు. అవి సాయంత్రం సైకిల్ మీద తనూ అమ్ముతాడు.
మస్తాన్ తండ్రిది కూడా ఇదే వ్యాపారం. ‘పూలమాబు’ కొడుకు- అంటేనే మస్తాన్ని గుర్తుపడతారు వూళ్ళో జనం!
తిరిగి తనే అందుకుంటూ “నువ్వు చెప్పేది నిజమేగానీ చాచా- మనకు సంతానం జాస్తి, వెనక ఆస్తులా! వుండవు. ఇంతమందిని బతికించాలంటే అవుతుందా! పిల్లలకి రెక్కలొచ్చిన కాడ నుండి, ఇంటికి రూపాయి వచ్చే మార్గం ఆలోచన చేస్తుంటాం మరి”
“అదీ నిజమే! కానీ ఎక్కడో దీన్ని దాటాలి మస్తాన్- లేకపోతే మనం ఇంతే! పైకి రాలేం”- భారంగా అనిపించింది ఖాదర్ కి. “నిన్న నువ్వూ వచ్చావుగా మీటింగుకు! విన్నావు గదా!”
“అసలు రాత్రి నుండి నాకూ అదే ధ్యాసగా వుంది చాచా! అందుకే నీ దగ్గర కాసేపు కూర్చుందామని వచ్చాను. నువ్వేమో ఈ చదువు సంగతి ఎత్తావ్!- ఈ కాయితాలు చూపించటమెందుకో! ఏమిటో! మన దగ్గర ఏం కాయితాలు వుంటయ్యీ! – మనమీద ఇంత సాధింపేమిటి చాచా”
“అదేగదా! నేను మొత్తుకునేది. మన సమాజంలో పిల్లలు చదువుల్లేకుండా అలవా సులవా తిరుగుతున్నారనీ, వీళ్ళు ఎంత సేపూ మతం అనే మూఢత్వంలో వుంటారనీ- మనవాళ్ళు చేసే ఈ మెకానిక్కు పనులూ ఇవన్నీ, మనుషులను మొరటుగా తయారు చేస్తాయనీ- అందుకే గొడవలు సృష్టించడానికి ముందుంటారనీ మనమీద ఈ మతతత్వ గూండాలు ప్రచారం చేసేది. అందుకే మనం కూడా మారాల, చదువుకోవాలి, ఖురాన్ చెప్పే మంచి విషయాలు పాటించాలి. అసలు ఖురాన్లో ఏముందో ఎప్పుడైనా మన మత పెద్దలు చెప్తారా? తెలుసుకోనిస్తారా? అన్ని మతాలనూ సమానంగా చూడాలనీ, నీతి నియమాలతో బతకాలనీ- నువ్వు సంపాదించిన దానిలో కొంత తప్పనిసరిగా దానం చెయ్యాలనీ- అసలు వడ్డీ వ్యాపారం చెయ్యకూడదనీ- ఎన్ని మంచి విషయాలున్నాయి? అవి చదువుకుంటేనే గదా తెలిసేది”… ఖాదర్ మనసులో వున్న ఆక్రోశం వ్యక్తమవుతోంది.
ఇంతలో భాషా రావడంతో సంభాషణ అక్కడ ఆగిపోయింది. ఇక ఇద్దరూ కలిసి ఇంటివైపు దారితీశారు.
ప్రతిరోజూ సాయంత్రం నమాజు అయ్యాక అలవాటుగా మసీదు మెట్లమీద ఒకరిద్దరు పెద్దలు చేరుతుంటారు. ఆ రోజు మాత్రం ఎక్కువ మందే కూర్చున్నారు.
ఇన్నాళ్ళగా కుర్రోళ్ళు చెప్తుంటే వాళ్ళకంతగా అర్థం కాలేదు. ‘ఏదో కాయితాలు చూపించాలంట!’ అనే అనుకుంటున్నారు. ఆ మీటింగులో మాటలు విన్నాక గానీ, దానిలో వున్న కష్ట నష్టాలు తెలిసిరాలేదు. అందుకే ఉదయం నుండి ఎవరి పనుల్లో వాళ్ళున్నా అందరి మనసుల్లో సన్నని కలవరమేదో కలకవేస్తోంది.
“మనం ఎప్పుడూ ఒకరి జోలికి పోయింది లేదు. మన గోలేందో మనమేందో, ఇదేగానీ ఒకరి సంగతి మనకక్కర పట్టదుగదా అయినా ఎందుకంత కోపం, మనమేం చేశామనీ”
“అటు, వాళ్ళు ప్రార్థనా కూటములనీ, స్వస్థత కూటములనీ, యువజనుల కూడికలనీ ఎన్నో చేస్తుంటారు, గ్రామాలకుపోయి, పేటల్లోకొచ్చి ఎంత ప్రచారం చేస్తుంటారూ! వాళ్ళకు విదేశాల నుండి ఫండు వస్తుందని అందరికీ తెలుసు, అయినా వాళ్ళనేం అనరు, మనమీద ఎందుకు అంత విచక్షణగా వుంటున్నారూ?”
“అది ఇప్పటిది కాదు భయ్యా! మనకు బ్రిటీషువాడు పోతా పెట్టిపోయాడు ఈ కొరివి. అసలు ఆ విభజన కాకుండా వుంటే ఎంత బాగుండేది?” విచారంగా అన్నారెవరో!
“అందుకే గాంధీని చంపింది పాపం! ఆయన మాత్రం ఏం చేస్తాడూ! అయినా అదంతా అయ్యేపోయే! రాజులూపోయే, రాజ్యాలూపోయే- పార్లమెంటూ, ఎన్నికలు వచ్చినయ్యికదా! ఇప్పుడింక వెనకటి చరిత్రలు తవ్వుకోటం దేనికీ? గోరీలోకి పోయినోడు అక్కడే మట్టయిపోయే! తిరిగొస్తాడా?”
“సరే అవన్నీ అనుకుని ఎంత విచారపడ్డా చేయగలిగేది ఏముందిగానీ- ఇప్పుడు జరగాల్సింది ఏమిటీ! అదికదా!”
“ఆయన, ఆ ప్రొఫెసరు చెప్పినట్టు- కాయితాలు చూపించటం మనవల్ల కాదు! చూపించినా మనల్ని ఏదో రకంగా కొర్రిపెట్టి తిప్పలు పెట్టాలని చూస్తారు. లేదంటే వచ్చిన వాళ్ళకు డబ్బులిచ్చుకోవాలి. అదికూడా మనవల్ల చేతగాని పనే. ఇక వున్నది ఒకటే మార్గం- “హమ్ నహీ దిఖాయేంగే”- మేం చూపించం! అంతే!?
“యా! అల్లా! ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయో! స్వతంత్రం వచ్చింది, పోయినవాళ్ళు అటుపోయారు. ఇక్కడే వుండాలనుకున్నవాళ్ళం, కష్టమో, నష్టమో వుంటున్నాం- మనం మాత్రం ఎన్ని అవమానాలు పడటం లేదూ- అయినా తలొంచుకున్నాం. ఈ గెడ్డమీద ప్రేమతో వున్నాం! ఓర్చుకుందామనే అనుకున్నాం”- బాబావలి గొంతు జీరపోయింది.
“ఇదిగో ఈ బి.జె.పి. వాళ్ళు బలపడినప్పుడల్లా మనల్ని ఏదో విధంగా తంటాలు పెడుతున్నారనుకో! అప్పుడు బాబ్రీ మసీదు పగలగొట్టి ఒకాయన పెద్దాడయ్యాడు, ప్రధానమంత్రిని కావాలనుకున్నాడు. అయితే ఆయన శిష్యుడు ఆయనకంటే ఘనుడు. గుజరాత్ లో వేలమందిని వూచకోత కోయించాడు, ఇక గురువును తుంగలో తొక్కి ఆయనే మొనగాడయ్యాడు.”
“సరే, దాన్ని పగలగొట్టనే గొట్టారు- కావాలన్న పదవి సాధించుకున్నారు. ఇంకా ఏమిటీ?”
“ఇంకా ఏమిటంటే?, మనం ఇంకా ఇక్కడే వున్నాంగదా! మనలనందరినీ వెళ్ళగొట్టాలనీ”- అదే జనానికి నూరిపోస్తున్నారు.
“అదెట్లా భయ్యా! మనం మన తాతలనాటి నుండి ఈ మట్టిమీద బతుకుతున్నాం!, ఇక్కడ పుట్టాం, ఇక్కడే చస్తాం! ఇక్కడే గోరీల్లోకిపోతాం! అంతకు ముందు సంగతి వదిలెయ్యి- ఈ ఐదు తరాలు మన కళ్ళముందు ఇక్కడే నడయాడాయి”
“ఒకరిని ఒకరం పిన్నీ, బాబాయ్, మామ అని వరసలు పెట్టి పిల్చుకున్నాం. హిందువులూ, ముసల్మానులం ఒకరి ఇంట్లో ఒకరం అవసరానికి కూరా, నారా తెచ్చుకునేది. పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ కలిసి పనులు చేసుకున్నాం- అంతా కలిసే వున్నాం”
ఎంతో ఉద్విగ్నంగా మాట్లాడుకుంటున్న ఆ సమయంలో ఖాదర్ ని వెతుక్కుంటూ చందయ్య, హసేన్ రావు అటుగా వచ్చారు, వాళ్ళను చూడటంతోనే ఖాదర్ చెయ్యి ముందుకు చాచి, తన పక్కన చోటు చూపించాడు.
మిగిలిన వాళ్ళు చూస్తూ మిన్నకుండి పోయారు.
“ఏందీ? మీ విషయాలేమైనా మాట్లాడుకుంటున్నారా? అందరూ అట్టా వుండారూ! నువ్వు సెంటరుకు రాకపోతే, ఇక్కడవుంటావని ఇటు వచ్చాం”… అన్నాడు సంజాయిషీగా చందయ్య.
“ఏం కొత్త విషయాలు కాదులే! నిన్న మీటింగు సంగతులే”
“అవునూ! ఖాదరూ! నేనూ అదే ఆలోచిస్తున్నా. అది మీ ఒక్కరికే అనుకున్నారు ఇన్నాళ్ళు. కానీ- ఇది అందరినీ ఇబ్బంది పెట్టడానికొచ్చిందని ఆయన చెప్తున్నాడుగదా! నిన్న మా రాముడు కూడా ఆ మీటింగుకు వచ్చాడంట, పొద్దున అంటున్నాడు- మన అందరికీ కూడా నష్టం ఆ బిల్లు వస్తేనని!”
“అసలు నాకు అర్థం కావటం లేదు చందయ్యా- మనమెప్పుడు, ఎట్లా విడిపోయాం ? – మీరూ, మేమూ అనేది ఎప్పుడు మొదలయిందీ? మనకే తెలియకుండా ఇది మన మధ్యలోకి ఎట్లా వచ్చిందీ?”… ఖాదర్ గొంతు పట్టేసింది.
“అవును ఖాదరూ! మనం కళ్ళు తెరిచే లోపుగా జరిగిపోయింది. నా పేరు హసేన్ రావని ఎందుకు పెట్టారని- మా అమ్మను అడిగితే, నీకు ముందు ఇద్దరు పుట్టి పోయారయ్యా! ఆ పీర్ల పండగనాడు మొక్కుకుంటే నువ్వు బతికావు, అందుకే ఆ పేరే పెట్టుకున్నాం” అని చెప్పింది.
“అవును హసేన్ రావూ, ఇప్పుడు ఈ పదిహేను, ఇరవై ఏళ్ళ నుండి కొత్తతరం వచ్చాక ఊళ్ళో పీర్ల పండగ పట్టించుకోవడం మానేశారుగానీ, నా చిన్నప్పటి నుండి ఏటా మనవూళ్ళో పీర్ల పండగ చేసేది! ఆ పండగ వీళ్ళదే అయినా అందరం కలిసి చేసుకునేవాళ్ళం కదా!” – చందయ్య అందుకుంటూ అన్నాడు. “ఆ రోజు వూరు మొత్తం పలావు వాసనలతో గుప్పుమనేది కదా! కోళ్ళో, మేకలో తెగని ఇల్లుండేదా? పలావు, క్షీరాన్నం లేంది పండగ లేదనుకో! ” ఉత్సాహంగా చెప్పసాగాడు.
“సంతాప దినాలు మాత్రం మేం చేసుకునేవాళ్ళమనుకో, పదోరోజు పీర్లు గుండాన వేసే రోజు అందరూ కలిసేది. ఆ రోజు తెల్లారిజామునుంచే వూరు ఎంత సందడిగా వుండేది. మా పిల్లలేందీ, మీ పిల్లలేందీ అంతా కొత్త గుడ్డలు కట్టుకుని, పూలు పెట్టుకుని, గోరింటాకు పెట్టుకుని ఆడోళ్ళు కూడా కదిలేది.
అసలా పండక్కి మాలోళ్ళూ, మాదిగోళ్ళూ, శూద్రోళ్ళనే తేడా ఎక్కడుండేది? పీర్ల పండక్కి పల్లె కూడా కదిలేది. అసలు రెండు పీర్లు మాదిగోళ్ళ హసేన్, హుస్సేనులవే కదా.
“హస్సేన్, హుస్సేన్ యా, ఆలీ దూలా” అని ఆడుకుంటూ పెద్దలు, పిన్నలు సంతోషంగా సాగే ఆ వూరేగింపు చందయ్య ముందు రూపుకట్టింది.
ఆ ఊరేగింపు ముందు పిల్లల గోల, సందడి, ఇప్పుడు కూడా కనబడుతున్నట్టే వుంది. జనం సెంటరుకు చేరి డప్పులూ, సన్నాయి బూరా మోతల్లో విచిత్రవేషాలతో, సాగుతూ- ముస్లింల పీరును ఎత్తుకుని , మాదిగ పేట వైపు సాగుతూ హసేన్, హుస్సేన్ వాళ్ళ ఇళ్ళకు చేరి అక్కడ ఆ పీర్లను కలుపుకుని అటునుండి వేపూరి వాళ్ళ ఇంటిమీద నుండి కాపోళ్ళ ఇళ్ళమీదనుండి పడమట వీధి గుండా- ముందు రోజు తవ్వి వుంచిన పీర్లగుండం దగ్గరకు సాగుతోంది.
“అదికాదు చందయ్యా! ‘పీర్ల గుండం’ ఎక్కడ తీసేవాళ్ళం”- కుతూహలంతో ఉత్సాహంగా అన్నాడు ఖాదరు.
“అవునోయ్! పోలేరమ్మ చెట్టు కింద – పులి సాంబయ్యవాళ్ళ సావిడిలో తీసేది కదా!”
“చూడు మరి! అప్పుడంతా ఈ మతం, ఆ మతం అనేది ఎక్కడికి పోయినట్టూ! పీర్లు మాదిగవాళ్ళవి, పీర్ల చావిడి పోలేరమ్మ చెట్టు దగ్గర- అన్ని మతాలు, కులాల వాళ్ళం కలిసి పండగ చేసుకున్నాం- ఇదంతా మనకు తెలిశాక, మన ఎరుకలోనే! కానీ ఇప్పుడు మనల్ని ఇంతగా వేరు పెడుతున్నదెవరో తెలియడం లేదు” ఖాదర్ ఆర్తిగా అన్నాడు.
“ఇది ఒకరు తెచ్చి పెట్టింది కాదులే ఖాదరు భాయీ! రోజులే మారాయి” ఓదార్పుగా అన్నాడు హసేన్ రావు.
“అది కాదులే హసేన్ రావు! జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం మొదలు పెట్టి చివరికి ఇప్పుడు అందరి మధ్యా కుంపట్లు పెట్టారు… ఇప్పుడసలు ఈ బిల్లు పేరుతో సాంతం కల్లోలం రేపాలనుకుంటున్నారు. చూద్దాం! ఏమవుతుందో?” దిగాలుగా అన్నాడు.
ఎప్పుడు వచ్చాడో ఇక్బాల్ అందుకుంటూ!… “బాధపడొద్దు తాతా! ఏం కాదు! అంత తేలికా ఏమిటి? ఈ దేశ ప్రజలు ఎంతో వివేకవంతులు. అనాదిగా ఎన్నో జాతులూ, మతాలూ ఇక్కడ మనగలిగాయి. మన రక్తంలోనే సహన సంస్కృతి వుంది. కొంత మందిని, కొన్నాళ్ళపాటు నమ్మించగలరు, ఎల్లకాలం కుదరదు.”
“కాగితాల రుజువులతో మన వునికిని నిరూపించుకోవాల్సిన అగత్యం రానేరాదు. మనం బతికినా ఇక్కడే, చచ్చినా ఇక్కడే! ఇది మన భూమి, మనం పుట్టిన గెడ్డ. దీనికోసం మనం దేన్నయినా ఎదిరిద్దాం!”
Veru well written about the present day’s conditions arising out of hindu Mata unfortunate domination. The proposed CAS is going to create lot of problems for the muslims in this country. Nalluri Rukmini garu has written very well.