సూర్యాస్తమయానికి కొన్ని గంటల ముందు…
ఇక్కడెవరూ… మరణించలేదు!
నిజమే! అంతా అపద్దం. ఎవరో సృష్టిస్తున్న వదంతులే ఇవి. ఇంతగా అభివృద్ది చెందిన అధునాతన రాజ్యం లో మరణాలా? ప్రశ్నే లేదు.. ఇవన్నీ అపద్దాలే. సమస్యే లేదు. ఇవన్నీ అసత్యాలే. ఒక్క చావునీ ఎవ్వరూ నిరూపించలేరు. మరణాన్ని మరణం అనిపించలేరు. శవాల్ని శవాలని చెప్పలేరు. ఇక్కడ ముఖ్యంగా తలసరి అదాయాలే ముఖ్యం. తలకింత అని ఆదాయాలు లెక్క కట్టే లెక్కల రాజకీయం లో, జనాభాను బట్టే నిధుల పంపిణి జరిగే సాంప్రదాయ విధానంలో ఇక్కడ తలలు ముఖ్యం. తలలే ముఖ్యం. మొండేలతో పని లేదు.
నివేదికలన్నీ మార్చి రాయండి. ఎక్కడా ఒక్క అక్షరమైనా అసలు నిజం బయట రాకూడదు. ఆకలి చావులు, పరువు హత్యలు, రైతు ఆత్మహత్యలు, అంటు వ్యాధులు, అకాల మరణాలు, బాల్య వివాహాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, భయంకరమైన రోడ్డు ప్రమాదాలు లేవని ప్రపంచ బ్యాంకుకు, ఐక్య రాజ్య సమితికి నివేదికలు ఇచ్చాం. అభివృద్ది సూచికలో ప్రపంచ బ్యాంకు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తూ వుంది. దేశం లోనే కాదు, ప్రపంచం లోనే మనం ఒక అగ్ర రాజ్యం గా ముందుకు వెడుతూ వున్నాం. ఈ పరిస్థితిలో ఇలాంటి అసత్యాలను, కల్పనలను అందరం ఖండించాలి.” అధికారం చెప్పే మాటలు, ప్రసంగాలు, ఆదేశాలు అయిపోయాయి. ప్రెస్ మీట్ ముగిసింది.
అక్కడినుండి వెనుతిరిగాను. విలేఖరిగా నాకిది చివరి రోజు.
ఎక్కడా అభివృద్ది జరగలేదని కానీ, అన్ని చోట్లా మనుషులు మరణిస్తున్నారని కానీ నేను అనను.
“సమాజం, మనిషి మరణిస్తున్నారయా” అని నేను అంటే మా సంపాదకుడు ఒప్పుకోవడo లేదు. నిష్టూరమైనా సత్యాల్ని ఒప్పుకునే తత్వం కాదు మా సంపాదకుడిది. పైగా, “వార్తలకోసం వెతక్కు. తిరగకు. కొత్త వార్తల్ని నీకు నువ్వుగా కల్పించు, సృష్టించు, ఊహించు” అనే రకం.
వార్తల వెంట కాదు కానీ, కుట్రలు, వెంట నిజాల్ని వెతుకుతూ వెళ్ళడం ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా వెళ్ళకుండా ఉండలేని పురాతన సంచార మానవ లక్షణమేదో నాలో ఎప్పటికప్పుడు కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటుంది.
నేరుగా యూనివర్సిటీ వైపు వచ్చేసాను.
క్యాంటీన్ నిండా పొగ. సిగెరెట్లు మనుషుల్ని కాలుస్తున్నాయి. ఓ మూల కూర్చున్నాను. మూల అంటే అందరూ, అన్నీ కనిపించే మెరుగైన చోటు అని అర్థం. ఆలోచనలు కమ్ముకున్నాయి.
దట్టమైన రంగు రంగుల ఆలోచనలు. నీలం, ఎరుపు, పసుపు, ఆకు పచ్చరంగు, మట్టి రంగు ఆలోచనలు.
వీటన్నిటి మధ్యా నలుపు ఎరుపు కలగలసిన ఉద్రిక్తాలు, ఉద్వేగాలు, నిరసన సెగలు, ఊరేగింపులు, ఖాళీ అవుతున్న పల్లెలు, మనుషులెక్కువై, నిలవ చోటు లేక, ఎటుపడితే అటు అడ్డ దిడ్డంగా విస్తరిస్తూ, చెరువుల్ని, కాలువల్ని మాయం చేస్తూ విస్తరిస్తున్న వ్యాధుల్లాంటి నగరాలు, తమ శరీరాల్లోంచి ఏవేవో అవయవాల్ని కోల్పోతున్న వాళ్ళు, మొత్తంగా అదృశ్యమవుతున్న వాళ్ళు, ఉండీ కనిపించని వాళ్ళు, లేకున్నా, వెంట నడుస్తున్న వాళ్ళు, ఉన్నట్లుండి కనపడకుండా పోతున్న వాళ్ళు…
కాలం అవధులు దాటుతోంది.
నిలబడేలా లేదు, నడిచేటట్లులేదు, పరుగెట్టేటట్లూ… లేదు. జలపాతం కన్నా వేగంగా, కళ్ళ ముందు ఏ మాత్రం కదలిక అయినా కనపడనంత దూకుడుగా… ప్రవహిస్తోంది. కంటి ముందు ఆనవాళ్ళయినా కనపడని కాలం తెంపరితనం ముందు- ఉన్న వాళ్ళు వున్నారు, లేని వాళ్ళు లేకుండా పోయారు. ఉండాల్సిన వాళ్ళు ఉండకుండా పోయి, అవసరం లేని వాళ్ళతో లోకం నిండిపోయి, మనిషి వస్తువై, మనిషి వస్తువే అయిన కాలంలో, ఆ నడి వేసవి సాయంత్రం అక్కడ ఆ మూల కూర్చుని టీ తాగుతుంటే ఉన్నట్లుండి నవ్వొచ్చింది.
“నీ వార్తలపై నాకు నమ్మకం లేదు. నువ్వు రాసేవన్నీ కల్పితాలే. వార్తలు కాదు, కథలు రాసుకో. ఆ కథలు కూడా పత్రికలకు పనికొచ్చేవి కావు, సినిమాలకు పనికి వస్తాయేమో చూడు. సినిమాలు తీసినంత ధైర్యం గా పత్రికల్లో వార్తలు కానీ, కథలు కానీ రావు.” ఎకసెక్కంగానే, నిష్టూరంగానే అయినా నిజాలే మాట్లాడాడు పత్రికా సంపాదకుడు. ఇంకా చాలదన్నట్లు ఇలా అన్నాడు.
“నీ దృష్టి లో జరుగుతున్న అభివృద్ది వార్త కాదా? ఎక్కడో రాయలసీమ పల్లెలో రెండు గ్లాసుల పద్దతి ఇంకా వుంది సార్, దళితులు ఇంకా టీ తాగటానికి కూడా నోచుకోలేదు అని రాస్తావు. మారు మూల చిన్న పల్లెలో పరువు హత్య జరిగిందంటావు. ఏ పెద్ద కులపోడయ్యా హత్య చేసింది అంటే, పరువు ఘర్షణ మొత్తం యస్సీ, యస్టీల మధ్యే జరిగింది సార్. వాళ్ళల్లో వాళ్ళు అమ్మాయి తక్కువ కులపోడిని ప్రేమించిందని తల్లి, తండ్రి ఆ పిల్లను చంపేసారు సార్ అంటావు. ఇదేమైనా వార్తనా? ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల జ్వరం తో వుందని తోడుగా వున్న తల్లి దుఖాన్ని అర్థం చేసుకోలేని మొగుడు తన పెళ్ళాని బలవంతంగా తాగిన మైకంలో ఆసుపత్రి మేడపైన అనుభవించి, గాయ పరచినప్పుడు ఆమె చనిపోతే దాన్ని అత్యాచారం, హత్య అని అంటావు.” అతడి వాదన అతడిది.
కొండల మధ్య అభం శుభం తెలియని ముక్కు పచ్చలారని చిన్నారి అమాయకపు ప్రేమ తన ప్రాణాలనే బలి తీసుకుందని తెలిసినప్పుడు నా గుండెకు తగిలిన గాయం ఇంకా మాననే లేదు.
“నీ గాయాలకు మందుల్లేవు నాయనా. రోజూ ఇన్ని గాయలైతే ఎలా? పోనీ, ఎంత చేసినా నీ గాయాలు నయం కావడం లేదే, కొత్త గాయాలు నిత్యం, నిరంతరం పుట్టుకొస్తూనే వున్నాయి, పాత గాయాలు ఇంకా స్రవిస్తూనే వున్నాయి. ఇన్ని గాయాలతో, ఇన్ని చిల్లులు పడ్డ గుండె వున్న వాడు బ్రతకడం అసాధ్యం. నువ్వో సజీవ శవానివి. నిత్య గాయాలతో చావు లేని, రాని సజీవ శవానివి,” డాక్టరు నిజమే చెపుతున్నాడో, అపద్దమే చెప్పాడో అర్థం చేసుకునే లోపలే, “..నీకు మందులు పని చేయవు కానీ, ఈ పుస్తకాలు పట్టుకెళ్ళు నాయనా, ఇవే నీకు మందులు,” అని కొన్ని పుస్తకాలు చేతుల్లో పెడతాడు డాక్టర్.
నిజమే డాక్టరుకు తన నాడీ తెలుసు. అందుకే, తను చూడని, తనకు తెలియని భీభత్సాల్ని, దుర్మార్గాల్ని, సామూహిక మరణాల్ని నాకు ఆ కల్లోల పుస్తకాల్లో పరిచయం చేస్తాడు. చీలిపోయిన మనుషులు, సగం సగం మనుషులు వెంటాడుతారు. మనిషిని, సమాజాన్ని, సత్యాన్ని, అపద్దాన్ని, కుట్రని, అణచివేతని, అసమానతల్ని అర్థం చేసుకునే క్రమంలో నా చదువు నన్ను ఎప్పుడూ వెక్కిరిస్తూనే ఉంటుంది. యూనివర్సిటి లో చదువుకోని, అస్సలు తెలియని పాఠాలే వర్తమానంలో వార్తలు.
“పత్రికల్లో చదివి, టీ.వి.ల్లో చూసేవన్నీ వార్తలు కావు సార్. అప్రకటితాలన్నీ వెలుతుర్లోకి రావాలి సార్. మీరు చీకట్లో వున్నారు,” నా గొంతు లో కమ్మదనం వుండదు. తియ్యగా మాట్లాడలేను. నంగిగా ఒంగి మాట్లాడటం రాదు. నా మాటలేవీ పత్రికా సంపాదకుడికి నచ్చవు. నచ్చలేదు.
“రేపటి నుండి ఇంకెక్కడైనా వేరే పని ఏదైనా చూసుకో. నీకు రావాల్సింది అక్కౌంట్ లో వేస్తాలే.”
బస్టాండులో…
“ఎవరైనా కొత్త అమ్మాయి వచ్చిందా బస్టాండులో కానీ, రైల్వే స్టేషన్లో కానీ ఒక కన్నేసి ఉంచు. బిజినెస్ లో కాంపిటిషన్ పెరిగి పోతోంది. ఏమరుపాటు పనికి రాదు. పెద్ద వాళ్ళు, నడి వయసోళ్ళు వొద్దు, చిన్న పిల్లలే మేలు. ఎంత లేతగా వుంటే అంత ఎక్కువ డబ్బులు… మీ కమీషన్లు మీకు వుంటాయి. మిగతా కథంతా నేను చూసుకుంటా. ఎవడైనా అడ్డొస్తే నా బూటు కాలి కింద నలిపి పారేస్తా.”
ఉలిక్కిపడి తలతిప్పి చూసాను.
యాభయ్యేల్లు దాటిన వ్యక్తి బస్టాండు లో బెంచి మీద తల వెనక్కి వాల్చి నిద్రలో కలవరిస్తూ అన్న మాటలతో అప్రమత్తం అయ్యాను. లుంగీ కట్టుకుని, సింహం బొమ్మ బనియను ధరించి వున్నాడు. అతడి మాటల్లో అతడేమిటో తెలిసిపోతోంది. జీవించడానికి అర్హత లేని, మనిషి లక్షణాలు అస్సలు లేని ఒకానొక పరాన్న జీవి. గురక వస్తోంది, చొంగ కారుతోంది, ఏదో వెగటు వాసన అతడి నోట్లోంచి. ఇతడి గురించి ఒకసారి వార్త రాసాను కూడా. వాడి మొహం గుర్తుంది. పెద్ద తార్పుడు గాడు.
నాకు ఏవేవో ఆక్రందనలు, ఆడపిల్లల, పసి మనసుల ఏడ్పులు, అరుపులు, కేకలు, వేడుకోళ్ళు వినిపిస్తున్నాయి. గుండెల్లోంచి మంట తన్నుకొచ్చింది నాకు. పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
ఎవరో ముసలి వ్యక్తి కూర్చోవడానికి చోటు లేక, బెంచి మొత్తం ఆక్రమించిన అతడ్ని నిద్ర లేపడానికి ప్రయత్నించాడు. తట్టి తట్టి లేపేసరికి అతడు బలవంతంగా కళ్ళు తెరిచి తన్నడానికి అన్నట్లు నడుము కింద భాగాన్ని పైకి లేపి విసురుగా ఊపాడు.
ఆ ముసలివ్యక్తి గభాలున ముందుకు కదిలాడు. అక్కడెవరో లేచి బస్ కోసం కదలటం తో ఖాళీ అయిన బెంచి మీద కూర్చునేసాడు.
“నా కొడకా.. ఈ పక్క మళ్ళీ వచ్చావంటే తంతా… నీ యబ్బ… దొంగ నా కొడకా…”
అవేశపడిపోతున్న అతడ్ని పరీక్షగా చూస్తూ, “ఏమయ్యా నీ కాళ్ళు ఏమయ్యాయి? కనబడటం లేదు?” ఆశ్చర్యంగా అడిగాను.
అతడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. “ఉన్నాయి కదా,” అంటూనే, ఎందుకైనా మంచిది అనుకున్నట్లు తక్షణమే తల వంచి అప్రయత్నంగా కిందకి చూసి, తల పైకి కిందకీ ఆడిస్తూ, “ఎవడు అడ్డమొచ్చినా తన్ని తన్ని నా కాళ్ళు ఎప్పుడో రెండు బండ రాళ్ళలా మారి పోయాయి,” అన్నాడు మహా గర్వం గా, మురిపంగా కిందకు చూసుకుంటూ.
కొన్ని క్షణాల పాటూ నిశ్శబ్దం మా మధ్య. ఇంకోసారి మౌనం గా అతడి వైపు పరిశీలనగా చూసాను. లేచి నించుని మళ్ళీ అతడి కాళ్ళ వైపు చూసాను, కానీ నా కళ్ళకు అతడి కాళ్ళు కనపడ లేదు. వాడితో వాదించాలో వద్దో తేల్చుకోలేక, తల అడ్డంగా ఆడిస్తూ మౌనం గా కూర్చునేసాను.
అతడికి కోపం వచ్చేసింది. “ఏం? వేళాకోలంగా వుందా? తమాషా చేస్తున్నావా? రాత్రే తన్నాను ఇంట్లో ఆడదాన్ని, నా మాట ఇన్ని ఇంకో పిల్లని. నా బలమంతా నా కాళ్లే. వీధిలో అయినా వూర్లో అయినా ఆడదయినా, మొగోడైనా నాకు అడ్డం చెప్పకూడదు. ఎవరైనా తల ఎగరేసారంటే, నా కాలి దెబ్బలకు తట్టుకోలేక కిందకు వంగి నా కాళ్ళు ముందు వాల్ల తలలు ఉంచాల్సిందే. ఒప్పుకోనని మొండికేసిన ఏ ఆడపిల్ల అయినా నా తన్నులు తిన్నాక, అన్నీ మూసుకుని నేను పొమ్మన్న మొగోడి దగ్గరికి పోవాల్సిందే.”
“తెలుసు. ఇంతకు ముందోసారి ఒక చిన్న అమ్మాయి ఎవరో నీ కాళ్ళ పైన పడి ఏడుస్త వుండే ఫోటో చూసాను పేపర్లో. గుర్తొచ్చింది,” అన్నాను అతడి చరిత్రను గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో.
అతడు నవ్వేడు. భయంకరంగా, ఎదుటి మనిషిని నవ్వుతో భయపెట్టే వాడిలా నవ్వేడు. మొహం నిండా ఏదో కసి, గర్వం.
“అప్పుడప్పుడూ పేపర్లో మన గురించి నిజాలు రాస్తూ ఉంటార్లే. అదీ మనకు మంచిదే. పేపర్లో ఫోటోలు వచ్చి, పోలీసులు కూడా వస్తా పోతా ఉంటేనే కదా మనకూ మజా. మొన్నో పిల్ల ఎంతకూ మాట వినలేదు. నేను పొమ్మన్న చోటుకు పోయి రావల్ల కదా. అంతంత డబ్బు పెట్టి ఆడపిల్లల్ని కొనేది, ఆరు నెలలకు, సంవత్సరానికి లీజుకు తెచ్చుకునేది ఎందుకంట? నేనేం ధర్మ సత్రాలు నడపడం లేదే? ఎంత మంది నాయకులూ, అధికారుల అండ వుంటే నా వ్యాపారం ఇంత కాలం జరిగిపోతా వుందో ఆలోచించు. ఎవరో బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వెట్టి చాకిరీ నుండి బాలలకు విముక్తి అని ఒక ఐదారు మంది వచ్చి గొడవ చేసిర్లే… అప్పుడే కదా నాకు మంట నెత్తికెక్కి ఆ ఆడపిల్లను నడి రోడ్లో నాలుగు తన్నింది. ఇదంతా లక్షల్లో జరిగే వ్యవహారం. వచ్చిన వాళ్ళకు తెలియదు. ఆ ఆడపిల్లే నన్ను రెండో రోజు ఈయన మా బాబాయే అని అందరి ముందరా చెప్పి, ఒప్పుకుంది కదా పోలీసు స్టేషన్లో, తప్పయిపోయింది బాబాయ్ అని నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది కదా. అది రాలే పేపర్లో. నాలుగు తంతే కానీ దార్లోకి రారు మనుషులు.” అని ఆగాడు.
భారీ కాయం గస పోస్తోంది. “అందుకే నేను నా కాళ్ళనే నమ్ముతా. మాటలతో వినని ఆడ పిల్లలైనా, నా పెళ్ళాం అయినా, కాలు ఎత్తితే దార్లోకి వస్తారు. అందుకే నా కాళ్ళకు పొగరెక్కువ, పవరెక్కువ.”
“….” మరోసారి చూసాను. వుహూ.. అతడు చెపుతున్న కాళ్ళు నాకు కనపడటం లేదు. కాళ్ళు లేని అతడ్ని అతడు అంగీకరించేలా లేడు. ఏదో భ్రమలో ఉన్నట్లున్నాడు. అతడి కాళ్ళు ఎవరు విరిచేసారో తెలియదు. బాగా తాగి ఒళ్ళు తెలియకుండా పడున్నప్పుడు కాళ్ళ పైన బండ రాళ్లు అయినా వేసి ఉంటారు. లేదా కడుపు మండిన ఏ అమ్మాయో గొడ్డలి తో కసిదీరా నరికేసి ఉంటుంది. లేదా వాళ్ళ ఆవిడ ఏమైనా తెగిoచిoదేమో?
కాళ్ళు పోయాయన్న స్పృహ అతడికి వున్నట్లు లేదు. ఇంకా ఏవేవో భ్రమల్లోనే వున్నట్లున్నాడు. పసిపిల్లల్ని హింసించిన వాడెప్పుడూ శిక్షార్హుడే. శిక్ష అతడికి మాత్రమే అయితే చాలదు.
చాలా మంది శిక్షార్హులే. ఆడ పిల్లల్ని అమ్ముకునే వాళ్ళు, శిశువుల్ని ఎత్తుకేల్లేవాళ్ళు, నిర్బందించిన వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, లేత అమ్మాయిలే కావాలని డబ్బు ఎర చూపే వాళ్ళు, ఒక అమాయకపు అమ్మాయిని ఎవరో లాక్కు పోతుంటే చూసి చూడనట్లు, ఏమీ తెలియనట్లు మొహాలు తిప్పుకునే వాళ్ళు, బస్సుల్లోనో, రైల్లలోనో… ఏమీ చూడనట్లు, ఏం జరుగుతున్నా పట్టించుకోని వాళ్లు… నాతో సహా…
హోటల్లో…
హోటల్ ఓపిక.
రద్దీ అట్లాగే వుంది. ఆ హోటల్ అసలు పేరు ఏమిటో తెలియదు కానీ, ఎవరు ఎప్పుడు పెట్టారో ఓపిక అనే పేరు.
ఓపిక వున్న వాడికే అక్కడ తిండి దొరుకుతుంది. ఓపిక లేని వాళ్ళు, తిండి కోసం నిలబడలేని వాళ్ళు, వేచి ఉండలేని వాళ్ళు వెళ్లిపోవచ్చు. ఎవరూ వుండండి, కాస్సేపే కదా అని అనరు. వెళ్ళిపోతారేం అని అడగరు.
ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పది గంట దాకా ఎప్పుడు వెళ్లి చూసినా జనం సందడిగానే కనిపిస్తారు. ఇంట్లో ఐదు నిముషాలు తిండి ఆలస్యం అయితే తట్టుకోలేని వాళ్ళు, చేత్తో ప్లేట్లు పట్టుకుని, గుంపులో నిలబడి, తమ వంతు కోసం ఓపిగ్గా కాచుకునే జనాల్ని చూడటం ఒక వింత.
తినటానికి వంట అవసరం లేదు. వండుకోవడం అనవసరం. టైం, ఎనర్జీ వేస్ట్ అంటారు కూడా. హోటళ్ళ నిండా జనమే జనం. రొట్టె వెతుక్కుoటున్నవాళ్ళతో హోటల్లు నిండి పోతున్నాయి. రొట్టెలు చేసుకునే వాళ్ళు తగ్గిపోయాక మా అమ్మ అనే మాటలు గుర్తొచ్చాయి… ఆ క్షణం.
“ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు. ఆడబిడ్డలకే అన్ని పనులూ నేర్పుతారు. అందరు తల్లులు అసలు మగపిల్లలకే ముందు వంట నేర్పించాలి. ఎవరి తిండి వాళ్ళు చేసుకోవడం రాని వాళ్ళకి, వంటలో సహాయం చెయ్యని వాళ్లకి ఆ తిండి తినే అర్హత ఎట్లా ఉంటుంది?”
నా వంతు రావడానికి ఇంకా సమయం వుంది. వరుసలో ప్లేట్ పట్టుకుని నిస్సిగ్గుగా నిలుచున్నాను. నా ముందు నిలుచున్న ఆవిడ తల వెనక్కు తిప్పిoది.
“అరే ఏమైంది!” అప్రయత్నంగా నా నోట్లోంచి కేక బయట కొచ్చింది.
“మేడం మీ ముఖం ఎక్కడ? ఏమైంది? మీ ముఖం కనిపించడం లేదు.” గబగబా అడిగేసాను.
ఆమె విసుక్కుంది.”బాగా చూడు. కళ్ళు దొబ్బాయా? రోజుకో గంట, ఆదివారం ఐదు గంటపాటు టైం కేటాయిస్తాను. అందానికి నేను ఇచ్చే ప్రాధాన్యత నీకు తెలియదు. మా ఇంట్లో పని మనిషి కూడా అందం వున్నoత వరకే ఉంటుంది. అందం తగ్గిపోతే పని మాన్పిచ్చేస్తాను. అందంగా లేని రోజు, మొగుడ్ని కూడా దూరం పెట్టేస్తాను. అలాంటి నన్ను పట్టుకుని నా మొహం కనపడలేదంటావా?” ఆమె మాటలైతే వినిపిస్తున్నాయి కానీ, ఆమె మొహమే కనిపించడం లేదు.
ఏమైందో, ఏమో నాకే తెలియడం లేదు. ఏదో మార్పు కావాలనిపిస్తోంది. సమాజం లో రావాల్సిన మార్పు రాకపోయి ఆ మార్పేదో నాలో ఈ రకంగా మొదలైనట్లుంది. భయం వేసింది. చుట్టూ చూసాను. ఎవరి లోకం లో వాళ్ళు బిజీగా వున్నారు. హడావిడిగా మనుషులెవరూ మనుషులతో లేరు. మొత్తం డివైస్ లతో నిండి పోయింది. మనుషుల మధ్య మాట్లాడుకోవడానికి, కరచాలనం చేసుకోవడానికి, స్పర్శించడానికి కుదరడం లేదు. కాల కృత్యాలు, తిండి, నిద్ర, అదీ తప్ప మొత్తం జీవితాల్ని డివైస్ లే అక్రమించేసాయి.
మాట్లాడడానికీ మనుషుల అవసరం లేదు. స్నేహాలు, ప్రేమలు మనుషుల మధ్య నడిచేవి, నిలబడేవి కాదు. ఇవన్నీ కొన్ని మొబైల్స్ మద్యనో, డివైస్ ల మద్యనో నడిచేవి. ఎవరికి ఎవరితో స్నేహం… కాదు ప్రేమ… కాదు, కాదు… అవసరం… వుందో అవే చెపుతాయి. కలసి తినాలని అక్కడకి వచ్చిన వాళ్ళంతా కలసి తింటున్నారు, కానీ వెంట వచ్చిన వాళ్ళతో ఎవ్వరూ లేరు. చాలా మందిలో సోమరితనం కనిపిస్తోంది. ఏదో నాజూకు తనం, పొద్దు పోని తనం. యధాలాపంగా అదేదో తమ పని కాదన్నట్లు తింటూ సేల్ ఫోన్ లలో మునిగి పోయి, లోకం మరచిన వాళ్ళు. ఎవరి పాస్ వర్డులు, ప్యాట్ట్రన్లు వాళ్ళవే.
నగరం నిండా అట్లా తిరిగే వాళ్ళను చూసి, సోమరితనం అంటువ్యాధి. ముందు దాన్ని నిర్మూలించాలి సార్. పొద్దు పోక పోవడం మృత్యు లక్షణం, పొద్దు చాలక పోవడం జీవ లక్షణం సార్ ఒక కథ లో చదివాను అని నేను అంటాను. అలాంటి సోమరిపోతులే కదా సమాజం లో మెజార్టీ, కొనుగోలుదార్లు, వినియోగదార్లు. వాళ్ళను తక్కువ చేస్తే ఎట్లా అని అంటాడు అతడు.
ఎట్లాగో తిని, అక్కడినుండి బయట పడ్డాను.
దార్లో అక్కడక్కడా కనపడ్డ దృశ్యాలు… భీభత్సoగా వున్నాయి. సొల్లు కబుర్లు, ప్రేలాపనలు, సంపద కై చేసే కుట్రలు, కొందరు సుఖ పురుషులు, సుఖ స్త్రీలు, సుఖ వ్యాధులు… పరాయితనం, బానిసత్వం. పది మంది వున్నా, ఒక్క పడక గదైనా లేని ఇండ్లు. ఆ ఇంట్లోని వాళ్ళు ఎలా వుంటారు? పేదరికమే లైంగిక హింసా ప్రవుత్తికి కారణం అంటే ఒప్పుకోడు అతడు. పప్పరమింట్లు, చాక్లెట్లు అమ్మినంత సులభంగా సిమ్ కార్డులు ఇవ్వడమే నేరాలకు కారణం అని నేను అంటాను. ఒక్కొక్కరికి ఒక్క సిమ్మే వుండాలంటాను.
పేదరికం ,ఆకలి చావులు, రక్త హీనత, నరాల బలహీనత, నీటి కాలుష్యం, విష పూరితమవుతున్న కూరగాయలు, ఇసుక అక్రమ రవాణా కారణంగా, రోడ్డు పక్కల చెట్లు కొట్టేయడం, చెరువులు, కాలువల దురాక్రమణ కారణంగా ఇంకిపోతున్న భూగర్భ జలాలు, డివైస్ లు కూలుస్తున్న సంసారాలు, జంతువులతో ఎలా ఉండాలో తెలుసుకున్న వాళ్లకి మనుషులతో ఎలా ఉండాలో తెలియక పోవడాలు, శిశు హత్యలు, శిశువుల అమ్మకాలు, సామాజికంగా జీవించడం తెలియని వాళ్ళతో నిండిపోతున్న భూమి, కడుపుకోసం రక్తాన్ని, కిడ్నీలను అమ్ముకుంటున్న వాళ్ళు, కరువు నేలలో కురవని వర్షాలు, కూలీలు అవుతున్న రైతులు, సురక్షితమైన నీళ్ళు పూర్తిగా అందని గ్రామాలూ, గుక్కెడు నీళ్ళు లేని జీవాలు, బీడులై నోర్లు తెరుచుకున్న పొలాలు, జనాభా నియంత్రణ పై ఊసే లేని అధికారులు… ఇదీ సమాజ స్థితి. మారాలి. చాలా మారాలి. నాయకుల్లో, అధికారుల్లో, ప్రజల్లో మార్పు రావాలి. సమాజంలో, అందర్లో జవాబుదారితనం పెరగాలి. పనిచేసే తత్వo ఏదో చాలామందిలో లోపిస్తోంది. ముందుగా దాన్ని మెరుగు పరచుకోవాలి. ఇదీ నా మాట. ఆయన వినడు.
సాయంకాలపు దినపత్రికా విలేఖరిగా నీకు ఇంత పొగరు పనికి రాదు అని అంటాడు ఆ పెద్ద మనిషి. సత్యం సత్యమే అని నా వాదన. సత్యం కోసం వాదిస్తే ఏం జరుగుతుందో నాకు చాలా అనుభవాలున్నాయి. మళ్ళీ ఇదొక అనుభవం.
అయిపోయింది. ఆ ఉద్యోగం కూడా పోయింది.
వడ్డీలకు వడ్డీలు లాక్కునే కాల్ మనీ గాళ్ళకు చేతుల్లేక పోవడం దారిలో చూసాను. చక్ర వడ్డీలకు బలయిపోయిన నారాయణ, అతడి భార్య, కొడుకులు, కూతుర్ల శవాలు గుర్తొచ్చాయి. సామూహిక ఆత్మ హత్యలు అని రాయమన్నాడు ఎడిటర్. కాదు సమాజపు హత్యలు అని రాసాను. నేను రాసింది రాసినట్లు పేపర్లో రావు. నేను చూసింది, చెప్పేది, రాసేది ఆయన నమ్మడు. అచ్చు వేయడు.
తన బలం అని తను బలంగా నమ్ముకున్న అవయవాలే లేకుండా పోతే అప్పుడైనా మనుషుల్లో మార్పు వస్తుందా?
సూర్యోదయానికి గంట ముందు…
జేబునిండా విత్తనాలు వేసుకుని నగరంలో మొక్కలు మొలకెత్తాల్సిన నేలను వెతుక్కుంటూ బయలు దేరుతున్నప్పుడు అతడికి ఫోన్ చేశాను.
“మారిపోయావా…? లేదా…? ఏంటో చెప్పు తమ్ముడూ”
“నేను మనుషులు మరణిస్తున్నారయా అని అంటాను. మీరు కాదంటారు, లేదంటారు. సార్. ఒక్క మాట చెపుతాను సార్.”
చెబుదామా వద్దా అనే సంశయంతో ఐదారు క్షణాలు ఆగి అన్నాను, “వోల్టేర్ ఏమన్నాడో తెలుసా సార్? తప్పకుండా మీకు తెలిసి వుండదు. నేనే చెపుతా ఒక్క నిముషం విన్న తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా ఆలోచించండి. మీతో మీరు వున్నప్పుడు.” అని క్షణం ఆగి కొనసాగించాను…
“నీవు చెప్పేదానిలో ఒక్క మాటను కూడా నేను అంగీకరించను. కానీ, ఆ మాట చెప్పడానికి నీకు గల హక్కును నా ప్రాణమిచ్చి అయినా సమర్థిస్తాను”
అవతలవైపు ఫోన్ కట్ అయ్యింది. విసుక్కోకుండా మళ్ళీ చేశాను. తీసాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. వినటానికి సిద్దపడిన వాడిలా మౌనంగా ఉన్నాడు.
“సార్ మీరనే అభివృద్ది లో టెక్నాలజీ వుంది, డివైస్ లు వుంటాయి. ప్రపంచం ఉంటుంది సార్. కానీ సమాజమే లేదు. జననాలు, మరణాలు ఉంటాయి. కానీ జీవితాలే లేవు…”
క్షణాలు, నిముషాలు… అతడింకా ఫోన్ పెట్టేయలేదు. చివరిగా ముక్కు సూటిగా చెప్పేసాను.
“అవును సార్. నిజమే మీరన్నది. ఇక్కడెవరూ… మరణించలేదు! ఎందుకంటే… మనుషులే ఇంకా ఇక్కడ సరిగ్గా పుట్టలేదు. అవును సార్. ఇక్కడ చాలా మంది మనుషులింకా నిర్మాణదశ లోనే వున్నారు.”
అతడు నిశ్శబ్దంగా వింటున్నాడు…
బాలాజీ గారి ఈ కథ కవితల ప్రారంభమై కథల సాగి ప్రపంచమంత విస్తరించి మన ముందు ఒక వాస్తవ చిత్రంలో ఉంటుంది మనం నిత్యం చూస్తూ ఉన్న వాస్తవాలను మనం పట్టించుకోని లేదా పట్టించుకోనట్లు నటిస్తున్న వాస్తవాలను మరలా మన ముందు నిలబెడుతుంది మనం అభివృద్ధి పేరిట వాస్తవ ప్రపంచంలో వస్తువుల మధ్య ఒక వస్తువు గా మాత్రమే మిగిలి పోయిన నేటి సమాజంలో మనకు అసలు ఒక మనిషిగా నిలబడి అర్హత ఉన్నదా అని ప్రశ్నిస్తుంది
అలలు అలలుగా మనలో ఆలోచనలు రేపు స్థిమితంగా కూర్చొని యదు. ఈ కథను పూర్తిగా విశ్లేషించాలి అంటే కథకు మించిన వ్యాసం రాయాలి ఏమో
నమస్కారం. పలమనేరు బాలాజీ రాసిన “ఇక్కడ మనుషులెవరూ మరణించలేదు” కథ చదివిన తరువాత నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను.
కథలు కవిత్వం రెండూ రాయగలిగే వారు కొద్దిమందే. కవి కథ రాస్తే తప్పకుండా ఆ కథ వైవిధ్యంగా ఉంటుంది. కవికి కవిత్వం లో విస్తరించే అవకాశం లేదు. అందుకు కథ ఒక్కటే ఆలంబన. వస్తువును కవితా మయం చేసే కవి చూపు, కలం, కథను కూడా కవితాత్మకం రసాత్మకం చేస్తుంది. జీవితాన్ని రకరకాలుగా చూచి మధనపడి కొన్ని జీవంతమైన ఆలోచనలను కథగా ఆవిష్కరించ పూనితే అందులో ఆ కాన్వాస్ లో,ఎడారులు ఒయాశీస్సులు ఎండిన మోడు లు, పూలవనాలు, కొలనులు కాసారాలు కార్చిచ్చులు జడివానలు మంచినీటి నదులు ఉప్పు నీటి సముద్రాలు కష్టాలు కడగండ్ల వడగళ్ళు భయపెట్టి బెదిరించే ఉరుములు మెరుపులు పిడుగులు అన్నీ కలిసి ఒక రాత్రి ముగిసి తెల్లవారి నట్లు ఉంటుంది. ఒక వాక్య తీర్థంలో మునకలేసి మరో తీర్ధానికి పయనం అయినట్లు ఉంటుంది. కథ ముగిసేసరికి జన స్నానం పూర్తయి సత్యమేదో సాక్షాత్కరించి నట్లు తూర్పున తెల్లవారుతూండగా పరమ సత్యం ఏదో బోధ పడినట్లు మనసు ముఖము తేటపడతాయి.
అవును మనుషులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నారు. కానీ కవులు కథకులు ఆ నిర్మాణ లోపాలు తెలిసినవారు. వారికి ఆకాశ హర్మ్యాలు నిర్మించడం తెలిసినా మనిషికి కావలసినవి కూడు గుడ్డ ఆపై తలదాచుకునేందుకు కాసింత నీడ అని తెలుసు. ఎంత హై ఫై
అయినా ప్రసవం ద్వారానే మనిషి మరొక జీవిని ప్రాణిని లోకంలోకి తెస్తుంది.
కృత్రిమ మేధ పరీక్ష నాళికలో పురుడు పోసుకున్నా, మనిషి మూలాలు మనిషితనం మనిషి DNA లోపిస్తే అది మానవ లోకం ఎట్లా అవుతుంది? ఆహారమే వీర్యకణం గా మారేది నిజమే అయితే మరి మనుషులను పుట్టించే విత్తనాలను ,మరు భూములుగా మారుతున్న మనిషి రాతి హృదయపు పగుళ్ళలో నాటండి. మనుషుల నిర్లిప్తత చేతకానితనం ,దౌర్జన్య దౌష్ట్యాల ముందు నిస్సిగ్గుగా నిర్లిప్తంగా నిస్సహాయంగా, మోకరిల్లుతునే ఉన్నాయి. వాటికి పాఠాలు చెప్పడానికి సుద్దులు నేర్పడానికి, ప్రతి ఒక్కరి చేతిలో పుస్తకం ఉండాలి. ప్రసవ కష్టం తెలియని మనుషులు కనీసం పుస్తకాల్లో నుంచైనా పుట్టుకు రావాలి. అప్పుడే సూర్యోదయం అయినా సూర్యాస్తమయం అయినా మనిషి మనిషి గానే ఉంటాడు. మనిషి మరణించినా మృత్యుంజయుడు అవుతాడు. “ఇక్కడ మనుషులు ఎవరూ మరణించలేదు” అన్న మరణవాంగ్మూలం – మనుషులు మరణిస్తే అమరులు అవుతారు అని అర్థం చెబుతుంది.
నమస్తే .మల్లేశ్వరరావు.
సమకాలీనాంశాన్ని అధి వాస్తవిక ధోరణిలో గొప్పగా చెప్పిన కథ. నిజమే ఇక్కడెవరూ మరణించటం లేదు. మనిషిగా పుడితేనే కదా మరణించటానికి!