ఇంతకీ నా ఊరేది? పుట్టిందోకాడ. సదివింది మరోకాడ. బతికేది పట్నంల. కరోనా జిందగీని ఉల్టాపల్టా చేసింది. ఇప్పుడు నేనేక్కడికి పోవాలె? పుట్టిన ఊరికి పోవాల్నా? అక్కడెవరున్నరు నాకు? సదువుకున్న కాడికి పోవాల్నా? చుట్టపు చూపు తప్ప మరేమీ లేకపాయె. పట్నంల ఉండల్నా? ఉండలేవ్, పొమ్మనవట్టె. మరి నేనేడికి పోవాలె? నా మజిలీ ఎటు?
”మేం పడ్డ కష్టాలు మీరు పడొద్దు బిడ్డా…” అంటూ అమ్మనాన్న సక్కగ సదువుకోవాలని చెప్పిన్రు. ఊల్లె సదివితే సోపతి ఎక్కువై పాడైతనని చుట్టాల ఇంట్లుంచి బడికి తోలిన్రు. పుట్టిన ఊల్లె నాకు తెలిసినోల్లు తక్కువ. పండుగ.. పబ్బానికి పోతే ఇంటి పక్కన ఉన్నోల్లో.. లేకపోతె నా ఈడోల్లో కొంచెం ఎరుకయిండ్లు. ఇగ సదువు పూర్తి కాంగనె ఉద్యోగమంటూ పట్నం బోయిన. ఊరి బాట తొక్కుడు తక్కువైంది. పని ఆగంల బడి సోపతిగాండ్లకు ఫోన్చేసుడు మరిచిన. ఇగ లగ్గమైనంక కుటుంబం, ఉద్యోగం.. జీవితం. ఈ మూడే కనిపించినై. ఉన్నోనిలెక్క బతకాల్ననే ఆశతోటి అందరినీ మరిచిన. ఉద్యోగమే లోకంగ బతికిన. కాలంతోటి ఉరికిన. ఉన్న బంధాలు తెగిపోయినై. కట్టమస్తే పలుకరించేటోల్లే లేరు. పట్నం కదా.. పక్కనున్నోల్లు సుత బిజీ. వారికీ వారి జీవితం.. కుటుంబం. ఇక మనతో ముచ్చట్లు ఎక్కడియి? అంతా మెకానికల్ లైఫ్. అక్కడా ఎవ్వలు లేకుండా బతికీడ్చిన.
జీవితం కంగాలైంది..
జిందగీల గింత పెద్ద ఆపద వస్తదనుకోలే. కరోనా బతుకును కంగాలు… కంగాలు చేసింది. బతుకు మీద భయాన్ని తెచ్చింది. బయటికి పోకుండా చేసింది. మరి బయటికి పోకపోతే బతికేదెట్లా..! కరోనాతోటి ప్రంపచమే వణికింది. ఇట్లనే ఉండాలని శాసించింది. ఇంకేంది? కంపెనీలు దివాలా తీసినయ్. ఉద్యోగాలు పీకినయ్. బతుకు బజార్ల బడ్డది. పట్నంల విపరీతంగ కరోనా కేసులు. ఉపాధి కోసం రమ్మన్న పట్నమే.. ఇగ ఇప్పుడు ముల్లెమూట సదురుకొని పోమ్మన్నది. ఇక్కడ ఉంటే బతకలేవంటూ తరిమింది. నీకీడ ఎవ్వల్లేరు.. నీకెవ్వరూ ఏమీ కారని బోధ చేసింది.
మరి ఏడికి పోవాలె…
సరిగ్గా గప్పుడే బుర్ర గిర్రున తిరిగింది. ఆలోచన మొదలైంది. గుబులు పట్టుకుంది. మెదట్ల అతలాకుతలమైంది. ప్రశ్నల మీద ప్రశ్నలు మనసును తొలిచినయ్. నేనెవరు? ఎక్కడ పుట్టిన? ఎక్కడ పెరిగిన? ఏడ సదివిన? ఏడ కొలువు చేస్తున్న అని. గిప్పుడెక్కడికి పోవాలె.
‘‘ఇంతకీ నా ఊరేది’’ అనే ఆలోచనలు సుట్టుముట్టినయ్. నిలువెల్లా వణుకు. ఒళ్లంతా శెమటలు పట్టినయ్. ఎట్లా బతకుడనే రంధి పట్టుకుంది. ఒక్కసారిగ నడి సంద్రంల పడినట్లు అనిపించింది. చుక్కాని లేని నావ అయింది నా బతుకు. పుట్టింది ఓ కాడ. సదువుకున్నది ఓ చోట. కొలువు చేసేది పట్నంల. ఏదీ ఎంచుకోవాలె. ఏ ఆలోచన రావట్లే. మనసు కకావికలం ఐతున్నది. సుడిగుండంల కొట్టుమిట్టాడుతున్నది. నా బతుకేంది? నా బాట ఎటు అనే ఆలోచన పొడుసుకు తింటున్నది. అప్పుడు మొదలైంది నాలో ఓ ప్రశ్న..
‘‘ఇంతకీ నా ఊరే ఏదీ’..!!
పట్నంలనే ఉంటి. పీజీలు చేసిన. పట్టాలు తీసుకున్న. ఇన్నాళ్లు అంగికి మరక అంటకుండా.., ఇస్ర్తీ నలగుకుండ బతికిన. గిప్పుడు పల్లెకు పోవుడేంది.. ఉద్యోగం రాదా.. బతకలేమా.. అనుకుంటే గప్పటికే ధైర్యమనిపిస్తది. కనీ.., ముందు సూత్తే ఏ తొవ్వాలేదు. ఉద్యోగం మళ్లీ చేస్తమనే ఆలోచన అందడం లేదు. బడా బడా కంపెనీలే మూసేస్తున్నరు. ఏండ్లకేండ్లు అనుభవం ఉన్న సార్లను వద్దంటున్నరు. మనం ఓ లెక్కనా? చిన్నాచితక కొలువూ దొరికేటట్టు లేదు. ఇన్నాళ్లు ఓ మెకానికల్ లైఫ్ కు అలవాటు పడిన బతుకాయే.. మరోపని సహించడం లేదు.
మరి ఎట్లా..? రోజులు ఎల్లదీసేదెట్లా..! అంతా అంధకారం. అద్దె కొంప.. రోజు తిండితిప్పలు. కొలువు లేదాయే.. పైసల్లేవాయె. ఇక్కడ ఉంటే బతుకుమీద ఆశ సచ్చేటట్టున్నది. అందుకే పట్నాన్ని ఇడిసి పెడుదామనుకున్న. ముల్లెమూట సదిరిన. అందరూ ఊళ్లకు పోతుంటె నేనూ పోదామనుకున్న. అప్పుడు మొదలైంది ఆలోచన ‘నా పయనం ఎక్కడికి?..!!
సదువుకున్నకాడికి పోతే…
అక్కడ ఎవరున్నరు..? సుట్టంగా పోయి సదువుకున్నం. ఉన్నత చదువుల కోసం వాళ్లనీ వదిలేసి మరెక్కడికో పోయిన. కలిసి సదువుకున్న దోస్తులను ఉద్యోగం.. సంపాదన, భార్యాపిల్లలు అంటూ మరిచిపోయిన. ఇప్పుడు నన్ను గుర్తుపట్టే బడి దోస్తులను ఎంకులాడడం కష్టం. మరి సుట్టాల ఇంటి దగ్గర ఉందామంటే.. ఉద్యోగం ఉన్నన్ని రోజులు పట్టించుకోని నన్ను వాల్లు రానిస్తరా? ఒకవేళ రానిచ్చినా నేను ఏ ముఖం పెట్టుకొని పోవాలె? సరే. అన్ని చంపుకొని పోయినా.. ‘సుట్టం మూడొద్దుల సంబురమే’ అన్నట్టుగా ఒకటి రెండు రోజులే. మరి జీవితాంతం ఎట్లా.. నా భార్యా పిల్లలు ఎట్లా? అనే తండ్లాటల ప్రశ్నల్లోంచి మళ్లీ ఉదయించింది “నా దారేది? అని.
పల్లె రానిస్తదా?!
సదువులంటూ నా పల్లెకు దూరమైన. ఉద్యోగమంటూ పుట్టిన ఊరిని బొత్తిగ మరిసిన. పండుగ పబ్బానికి వచ్చినప్పుడు.. కలిసే దోస్తుగాళ్లను నిలుపుకోలేక పోయిన.
పక్క ఇండ్లల్ల ఉండే బంధాలను ఆప్యాయంగా పలుకరించలేక పోయిన. ఏదో నా ఆస్తి వాళ్లు గుంజుకున్నట్టు పట్నం నుంచి ఊల్లెకే వచ్చి సక్కగ ఇంట్ల సొత్తి. దుకాణానికి పోవాలన్నా .. అమ్మనాన్ననే పంపితి. బయటికి పోతే ఎక్కడ నా ఆస్తులు కరుగుతాయోననే ఇగో ఫీలింగ్తో పట్నంల ఉన్నట్లే నాలుగు గోడల మధ్య టీవీ, కంప్యూటర్ అంటూ గడిపితిని. ఇగ నా ఊరిని నేనెప్పుడు సూత్తిని. నన్ను ఊరు ఎప్పుడు చూసే. ఊల్లె ఎవలు తెలిసినోల్లున్నరు? ఎవ్వలు తెల్వదు. ఉద్యోగం.., పైసల మాయల పడి.. నాకు నేనే అనే యావల బతికిన. బంధాలను మరిచిన. మా అమ్మనాన్నల పేర్లు చెబితే తప్పా నేను ఎవరికీ తెల్వదు. పలుకుబడి లేకపాయే. మరి ఇప్పుడు నా ఊరు నన్ను గుర్తుపడ్తదా? నన్ను రానిస్తదా? నేను మరిచిన తొవ్వ నన్ను స్వాగతిస్తుందా..! బంధాలు నన్ను మళ్లీ అల్లుకుంటయా..! నా పల్లె ‘తల్లి’ నన్ను కడుపున పెట్టి చూసుకుంటదా..! ఉపాధినిచ్చి మల్లా నా జీవితాన్ని చిగురింపజేస్తదా? అసలు నా ఊరు నన్ను గుర్తుపడ్తదా.! గుర్తు పట్టకపోతే.. రానియ్యకపోతే. ‘‘మరి నా గమ్యం ఎటు’’..? నా బతుకేది..!
నా అయ్యఅవ్వకు ఎట్ల సెప్పాలె…
ఇన్నాళ్లు నా కొడుకు పట్నంల ఉద్యోగం చేస్తుండు.. దొరలెక్కన బతుకుతాండంటూ ఊల్లె ఈ పక్కోల్లకు.. ఆ పక్కోల్లకు… కూలీకి పోయిన కా నా ముచ్చట్లను గొప్పగ చెప్పుకున్నరు. అందరూ మీరు రెక్కలు ముక్కలు చేసుకొని సదివిచ్చినందుకు వాడు మంచిగా ఎదిగిండు. పట్నం తీసుకపోయి మిమ్మల్ని మంచిగా సూసుకుంటడు. మా పోరగాల్లకు వాడిలెక్కన ఉండాలె అని సూపిస్తున్నం అంటూ నా గురించి పొగుడ్తుంటే వాళ్ల కండ్లల్ల ఆనందం ఎగిరి దునికేది. కానీ వాల్ల కలలు నేడు కల్లలైనయని నేను ఎట్లా చెప్పాలె?
ఉద్యోగం పోయింది. పట్నం వదిలేస్తున్నదని వాల్లకు ఎట్ల చెప్పను. చిన్నప్పటి నుంచి నన్ను ప్రయోజకుడిని చేయాల్నని తండ్లాట పడ్డ ఆ మనస్సులకు ఎట్లా ముఖం చూపను? బుక్కెడు బువ్వ పెట్టేలేని పరిస్థితికి వచ్చిందని ఎట్ల వివరించేది. పదిమందిల నన్ను గొప్పగ చూపించిన వారికి చిన్నతనం తేవాల్నా! మరి జీవన పోరు కోసం నేనేడికి పోవాలె. నా అయ్యఅవ్వ కలలు తీర్చే నా దారేది? !
సోపతి కలుపుకుంటరా..?
కరోనా కష్టకాలంల పట్నంలకెళ్లి అచ్చిన నన్ను ఊరోల్లు సోపతి కలుపుకుంటరా? సదువు ఆడ సదవకపోతిని. పండుగకొచ్చినప్పుడు ఎవరినీ నవ్వుకుంట పలుకరించకపోతిని. కాసేపు ముచ్చట పెట్టకపోతిని. మరి ఉద్యోగం పోయి నేను ఊల్లెకుబోతె నన్ను ఎవరో అన్నట్లు దూరం పెడితే..! పట్నంల బతికినట్లు బతుకుడైతదా..? ఆపతి సోపతి వస్తే ఇటేపు వచ్చేదెవరు? అరెయ్… అని పిలిచేదెవరు? నేను పుట్టిన ఊల్లె నేను కొత్తగ సోపతిగాళ్లను పరిచయం ఎట్ల చేసుకోను. ఉద్యోగం ఉన్నన్ని రోజులు వాడు పట్టించుకోలే.. గిప్పుడు కొలువు పోతే కానీ ఊరు యాదికి రానోడితే మనం దోస్తు చేసుండేందని లేచిపోతే. మరి నేను ఏం ధైర్నం చేసి ఊల్లె ఉండేది. ఎట్ల పని చేసుకొని బతికేది. మరి నేనేం చేసేది..! ఉపాధి కోసం ఏ బాట పట్టేది..!
నలుగురు నా చుట్టు చేరేనా..
ఊల్లె నా పేరేందో ఎవరికీ తెల్వదు. నా ముఖం ఎన్నడూ సూసి ఎరగరు. నా అయ్య పేరో.. అవ్వ పేరో చెప్పుతే ఆ.. నువ్వు అని అనేటోల్లే అంత. మారి నేను ఊరికి పోయి బతుకీడ్చగలనా..! కష్టమొస్తే నలుగురు నా చుట్టూ చేరి అయ్యో కొడుకా.. అంటరా. ఒకవేళ ఏ ఊరి పిల్లగాడో ఇడికొచ్చి గిట్ల అయిండు అటే.. నా బతుకు ఎట్ల..?
పల్లె ఎంత గొప్పదో..
నాకు యాదికుంది. నా పల్లె గొప్పతనం. నా ఊరి ఆప్యాయత. పలకరింపు.. కల్లాకపటంలేని ప్రేమ. నేనే ఊల్లె బస్సు దిగి నడుసుకుంటూ ఇంటికి పోతుంటే దారి పొడవునా.. ఇప్పుడేనా కొడుకా రాకటా అంటూ పలుకరించేది. ఏం బిడ్డ మంచిగున్నవా.. బాగా సదువుకో.. అంటూ కుశల ప్రశ్నలు ఏసేటోల్లు. నీ కోసం మీ అవ్వ రెక్కలు ముక్కలు చేసుకుంటాంది.. మీ అయ్యా చాకిరీ చేస్తుండు. అన్ని యాది పెట్టుకొని సదువుకో అంటూ నాకు తెలియకుండానే నాలో ఉద్యోగం తెచ్చుకోవాలనే పట్టుదలను నింపిండ్రు. పొలం పనికి పోయే మా అవ్వ ఎంబడి పోతుంటే అందరూ సూత్తాలన్ని కొంగుసాటు పెట్టుకున్నా.. ఏంది పిలగా జాకుంటున్నవు.. అంటూ మళ్లీ నా క్షేమాన్ని ఆరే తీసేటోల్లు. ఆరు నెలలకు.. యాడాదికి వచ్చినా.. వాళ్ల మాటలు, పలకరింపులల్ల మాత్రం ఎన్నడూ తేడా కనిపించలె. ఉద్యోగమచ్చి కారులో ఇంటికి పోయినా వాళ్ల నుంచి అదే ఆప్యాయత కనిపించేది. మరి అట్లాంటి పల్లె నన్ను ఈ రోజు కాదంటదా..! ఎంతకీ కాదనదు. ధైర్యాన్ని ఇస్తది. ప్రేమను పంచుతుంది. ఉపాధినిచ్చి.. కష్టాలను దాటే ప్రేమను అందిస్తది.
నాకు నా ఊరే కావాలె..
ఎవరిన్ని చెప్పినా.. ఎవరేమనుకున్నా.. కరోనా ఎంటబడినా.. పట్నం పొమ్మన్నా..నేను భయపడను. నాకు నా ఊరే కావాలె. చిన్నప్పుడు తెలిసి తెలియక నా అయ్యఅవ్వను ఎన్ని బాధలు పెట్టినా.. కడుపుల పెట్టుకొని సూసుకున్నరు. కంట కన్నీరు… వస్తే వారి గుండెల్లో నీటి సుడులు తీరిగేటిది. ఇప్పుడు నా ఊరి కూడా నన్ను గట్లనే పొత్తిల్లళ్ల పెట్టుకొని కాపాడుకుంటది. నేను చేసి గాయాలను మరిచి నన్ను లాలిస్తది. నేను దూరం పెట్టిన వాళ్లు.. ఒక్క పిలుపుతో నన్ను కలుపుకుంటరు. కల్లాకపటం లేని ప్రేమను చూపిస్తరు. గుండెల్ల నింపుకుంటరు. మేమున్నామనే ధైర్నాన్ని ఇస్తరు. ఉపాధినిచ్చి జీవితంల వెలుగులు నింపుతది. ఎన్నటికీ నేను కన్నతల్లిని.., పుట్టిన ఊరిని మరువ.
కరోనా పుణ్యమే..
‘బతుకు పోరులో అన్ని మరిసి ఆగమైన మనిషిని నేను. ఇప్పుడు నా వాళ్లు అనే బంధాల కోసం పరుగెడుతున్న జీవిని నేను. ఇదంతా కరోనా పుణ్యమే. నువ్వు ఒంటరి అని తెలిసేలా చేసింది. అసలు బతుకు ఇది కాదని జ్ఞానోదయం చేసింది. కొత్త బతుకుపై ఆశలు చిగురించేలా చేసింది.’
Nice 👏 story.