మహిళలు భూమ్మీద ఏ జీవీ ఎదుర్కోనంత దోపిడీ, అణచివేత, వివక్షలను ఎదుర్కొంటున్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యున్నత హోదాలో వున్నా, ఇంటా, బయటా ప్రతి చోటా, ప్రతి క్షణం దోపిడీ, అణచివేత, వివక్షలను ఎదుర్కొంటున్నారు. ఇవి కాక వర్ణ, కుల, మత, జాతి, ప్రాంత మొదలైన వివక్షలను కూడా ఎదుర్కొంటున్నారు. ఒక్క కులం తప్ప మిగతావన్నీ ప్రపంచ స్త్రీలందరూ ఎదుర్కొంటున్నారు. ఇండియా విషయానికి వస్తే పై వివక్షలతో పాటు కులం, దోపిడీ, అణచివేత, వివక్షలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సాంఘిక వివక్ష అన్ని వివక్షలకన్నా అత్యంత హీనమైనది. అమానవీయమైనది అంటారు డా. బి.ఆర్ అంబేడ్కర్. ఎందుకంటే దళితులను దళితేతరులంతా జంతువులకన్నా హీనంగా చూస్తారు కాబట్టి. అలాంటి దళితులలో అత్యంత దళితులైన స్త్రీల దయనీయమైన దుస్థితి గురించి సమగ్రంగా రాయలేను కానీ, సంక్షిప్తంగా రాసే ప్రయత్నం చేస్తాను.
ఇండియాలో పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఏ కులం స్త్రీలకు చదువులేదు. ఈ దుస్థితిని గుర్తించిన పూలే దంపతులు స్వచ్ఛందంగా స్త్రీలకు ముఖ్యంగా దళిత, బహుజన స్త్రీలకు అనేక పాఠశాలలు ప్రారంభించారు. ఆ తర్వాత బ్రిటిషర్లు కొనసాగించారు. 18వ శతాబ్దం వరకు దళిత, బహుజనుల చరిత్రను శాస్త్రీయంగా రికార్డు చేసిన వారులేరు. ఈ క్రమంలో లభ్యమైన అరకొర చరిత్రను పరిశీలించినట్టయితే…. క్రీ. పూ రెండువేల సంవత్సరాల నాటికి సింధూలోయ (పంజాబ్ పరిసర ప్రాంతాలు) ప్రాంతంలో భారతీయ మూలవాసులేన “ద్రావిడులు” కంచును ఉపయోగించి, తేలికపాటి వ్యవసాయం చేసేవారు. ఇనుము నాగలి వారికి తెలియకున్నానదులకు ఆనకట్టలు కట్టి పంటలు పండించేవారు. హరప్పా, మొహంజోదారో వంటి పట్టణాలు కూడా నిర్మించారు. ఈ క్రమంలో వ్యవసాయంలో మిగులు ఏర్పడటం, ఆ మిగులును బలవంతులు “సొంతాస్తిగా” స్థిరపర్చుకోవడంతో అక్కడ ప్రాథమిక స్థాయిలో వర్గాలు ఏర్పడ్డాయి. ఈ మిగులును ఆక్రమించిన బలవంతులను “రాజన్య పురోహితులు” అని పిలిచేవారు. అప్పుడే వర్తకం కూడా మొదలైంది. అందుకే ఇక్కడి వర్తకానికి గ్రీకులోని మెసపొటోమియా అంతటి ప్రాచీన చరిత్ర వుందంటారు చరిత్రకారులు. రాజన్య పురోహితులు, వర్తకవర్గం సొంతాస్తికి దూరం చేయబడ్డవారిని “బానిసలు”గా మార్చుకొని వెట్టి చాకిరి చేయించుకునేవారు.
దాదాపు ఇదే కాలంలో (క్రీ.పూ.2వేలు) మధ్య ఆసియా నుండి ఆర్యులు పశు పాలకులుగా ఇండియాలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టడం అంటే సామరస్యంగా కాదు. ఇక్కడి ద్రావిడ జాతితో భీకరమైన యుద్ధాలు చేసి, ఇక్కడి సొంతాస్తిదారులైన రాజన్య పురోహితులను ఆర్యులు తమలో కలుపుకున్నారు. వీరిరువురు ఏకమై స్థానిక తెగలలో, బానిసలతో అనేక యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలలో ఓడిపోయిన వారిని దాసులు మరియు “దస్సులు” అని నామకరణం చేశారు. ఈ దస్యులనే క్రమంగా శూద్రులన్నారు. ఆర్యులు దస్యులచే పశువులను కాయించడం, వ్యవసాయం చేయించడం చేసేవారు. ఆర్యులు ఈ దేశంలో అడుగుపెట్టే నాటికి ఇక్కడ ఇంకా “మాతృస్వామిక” వ్యవస్థ మనుగడలోనే వుంది. ఆర్యులు మాతృస్వామిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి “పితృస్వామిక” వ్యవస్థకు పురుడు పోశారు. ఈ క్రమంలో ఆర్యులు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేశారు. స్త్రీని సొంతాస్తికి దూరంచేసి ఆమెను కూడా అనేక వర్గాలు, వర్ణాలులు విభజించారు.
ఆర్యులు ఇక్కడి ప్రాథమిక స్థాయిలోని వర్గాలపై మాత్రమే ఆధారపడకుండా వర్ణాలను ఏర్పాటు చేశారు. వారే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలు. ఈ వర్ణవ్యవస్థను క్రమంగా “కుల వ్యవస్థగా” మార్చారు.
ఆర్యులు మిగులును దోచుకోడానికి “కర్మకాండల”పై ఆధారపడేవారు. వారికి వైశ్యులు పశువులను, బానిసలను కానుకలుగా సమర్పించేవారు. ఈ కానుకలపై ఆధారపడ బ్రాహ్మణ, క్షత్రియులు “పాలక వర్గంగా” చెలాయించేవారు. ఆర్యులు ఇక్కడి స్థానిక తెగల నుండి వ్యవసాయం నేర్చుకుని, తాము వెంట తెచ్చుకున్న ఇనుమును ఉపయోగించి ఉత్పత్తిలో గణనీయమైన మిగులును సాధించారు. బానిసలచే దట్టమైన అరణ్యాలను పోడుచేయించి వ్యవసాయాన్ని మరింత విస్తరించారు. ఈ క్రమంలో “భూమి” కూడా సొంతాస్తిలో భాగమయింది. భూ యజమానులు “భూస్వాములయ్యారు”. ఈ భూస్వాములు బ్రాహ్మణ, క్షత్రియులు మాత్రమే. అందుకే ఇండియాలో “రోమ్” తరహా బానిస వ్యవస్థ స్థానంలో “కుల భూస్వామ్య” వ్యవస్థ ఏర్పడింది.
భూస్వాములకు, శ్రామికులకు మధ్య తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. ఈ యుద్దాలే పూర్తిస్థాయి రాజ్యాలు ఆవిర్భావానికి దారితీశాయి. రాజులు (క్షత్రియులు) తమ పాలన సుసుస్థిరం చేసుకోడానికి కుల వ్యవస్థను, వ్యక్తిగత ఆస్తిని కట్టుదిట్టం చేశారు. రాజులకు మంత్రులుగా, సలహాదారులుగా బ్రాహ్మణులు వ్యవహరించేవారు. వైశ్యులు మొదట్లో వ్యవసాయం, పన్ను వసూలు చేసి, తర్వాత వ్యాపారానికి బదిలీ అయ్యారు. శూద్రులు భూస్వాముల భూముల్లో పెట్టి చాకిరీ చేసేవారు. ఈ చాకిరి సరిగా చెయ్యకపోతే భూస్వాములు తీవ్రమైన దండనలు విధించేవారు. దండనలు, విధులను చట్టబద్దం చేస్తూ బ్రాహ్మణులు “మను స్మృతిని” రాశారు. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న క్రమంలో పనిముట్లు ఎక్కువ కావలసివచ్చింది. దాంతో “వృత్తులు” ఏర్పాటు చేశాయి “భూస్వా మ్యవర్గాలు”. శూద్రులు వృత్తి పనిచేస్తూ, భూస్వాముల భూముల్లో వెట్టి చెయ్యాలి. బ్రాహ్మణ, క్షత్రియులుకు వ్యక్తిగత సేవలు చెయ్యడానికి మరో వర్ణం అవసరమైంది. భూస్వాములు శూద్ర వర్ణంలో అత్యంత అణచివేసిన బానిసలను “పంచమ” వర్ణంగా ఏర్పాటుచేశారు. వారే అంటరానివారు. దళారులు, భూస్వాములు పంచముల శారీరక శ్రమను అత్యంత దోచుకోవడమేకాక, ఈ వర్ణం స్త్రీలను లైంగికంగా అనుభవించేవారు. ఇలా వాడుకుంటూ అంటరానివారిగా ముద్రవేసి ఊరికి దూరంగా వెలివాడలలో కుక్కలకంటే హీనంగా జీవించేలా నెట్టేశారు. దళితుల వెట్టిచాకిరి, దండనలు, పై కులాల స్త్రీలు తమ పురుషుల పట్ల నిర్వర్తించాల్సిన అమానవీయ విధులను కూడా మను స్మృతిలో పొందుపర్చారు. ముఖ్యంగా దళితుల తమ విధుల పట్ల అతిక్రమించినా, ఎదిరించినా, దళిత పురుషులు పైవర్ణం స్త్రీలను కన్నెత్తి చూసినా మరణ దండనలు వుండేవి. పైవర్ణాల పురుషులు మాత్రం దళిత స్త్రీల శరీరాలు తమ హక్కని అన్ని రకాలుగా వాడుకోవచ్చు, మోసం చెయ్యొచ్చని ‘మను స్మృతి’ సెలవిచ్చింది. (ఇప్పటికీ ఇవి అమల్లో వున్నాయి) ఈ దుర్మార్గమంతా తమ తల రాత, విధి అని దళితులు సరిపెట్టుకునే విధంగా కర్మ సిద్ధాంతం” కూడా సృష్టించాయి భూస్వామ్య వర్గాలు. భూస్వాములు పంచమ వర్ణాలను ఇలా తాత్కాలికంగా అనుభవించడమేకాక, శాశ్వతంగా అనుభవించడానికి దేవదాసీ, ముర్లి, జోగిని, బసివిని, మాతంగి వంటి దుర్మార్గపు ఆచారాన్ని తయారు చేసి “ఊరుమ్మడి లైంగిక సాధనంగా మార్చారు. ఈ దురాచారం నేటికీ కొనసాగుతుంది.
పదమూడవ శతాబ్దంలో దేశంపై దండెత్తిన మొఘలులు, పదిహేడవ శతాబ్దంలో దురాక్రమించిన బ్రిటిష్ వాళ్ళ కూడా ఇక్కడి అగ్రకుల భూస్వామ్య వర్గాలతో మిలాఖలై, అదే దోపిడీ విధానాలను అమలుచేశారు. బ్రాహ్మణీయ హిందూ భూస్వామ్యం దళితులకు దేవాలయ ప్రవేశం నిరాకరించడం, విద్యకు దూరం చెయ్యడం వల్ల దళితులు బ్రిటిషర్ల క్రైస్తవ మతానికి, మిషనరీ విద్యకు దగ్గరయ్యారు. అంతేకాక ఇక్కడి వాస్తవ పరిస్థితులను ఏసయ్య మారుస్తాడనే భ్రమల్లో మునిగిపోయి పోరాటాలకు దూరమయ్యారు. దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్ళినా దాడులు, హత్యలు, అత్యాచారాలు యధా విధిగా కొనసాగుతూనే వున్నాయి.
బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన జమిందారీ, రైత్వారీ ఆర్థిక విధానాల వల్ల శూద్రులైన పాటిదార్లు, జాట్లు, నాయకర్లు, గుజ్జర్లు, వొక్కలిగ, పల్లాలు, లింగాయతు, వెలమ, రెడ్డి, కమ్మ, కాపులు భూమికి దగ్గరైనారు. కానీ వీరు కూడా అదే భూస్వామ్య విధానాలను కొనసాగిస్తూ, దళితులు చేసిన రైతుకూలీ పోరాటాలను, ఆత్మగౌరవ పోరాటాలను రక్తసిక్తం చేస్తూ కీలవేణ్మణి(తమిళనాడు) లక్ష్మణ్ పూర్ బాతే, (బీహార్ ) కంబాలపల్లి, (కర్ణాటక) ఖైర్లాంజీ, (మహారాష్ట్ర) పాదిరికుప్పం, కారంచేడు, చుండూరు, వేంపెంట, లక్ష్మీంపేట (ఆంధ్రప్రదేశ్)లలో పురుషులను ఊచకోతలు కోశారు, స్త్రీలను సామూహిక అత్యాచారాలు చేశారు. ఖైర్లాంజీ హత్యలు కూడా చేశారు. అధికార మార్పిడి (1947) అనంతరం ఒకటి, రెండు శాతం భూమి, రాజకీయ పదవులు దక్కించుకుంటున్న వెనకబడిన కులాలు కూడా అదే దోపిడీ విధానాలలో భాగస్వాములై దళితులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఇదే అధికార మార్పిడి తర్వాత ఒకటి, రెండు శాతం దళితులు కూడా భూమికి దగ్గరై, దోపిడీ రాజకీయాలలో భాగం పంచుకుంటూ, మెజారిటీ దళితులపై OC, BC లు చేస్తున్న దాడులు, హత్యలు, అత్యాచారాలను నిరసించడం లేదు. అంటే “సమానత్వం” సిద్ధాంతం లేని రాజకీయాలలో దళితులు అధికారంలోకి వచ్చినా, అవే అగ్రకుల భూస్వామ్యం పెట్టుబడిదారీ విధానాలను ఆచరించాల్సిందేనని గత 73 ఏళ్ల స్వతంత్ర భారతదేశం రుజువు చేసింది. అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల వల్ల దళితులు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాలకు దగ్గరైనప్పటికీ, అంటరానితనం, వివక్షలు అదే విధంగా కొనసాగుతున్నాయి. ఇక శ్రామిక దళితస్త్రీల పరిస్థితి ఏ విధంగా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దళిత శ్రామిక స్త్రీల ఆర్థిక, సాంస్కృతిక స్థితిని గమనించినట్టయితే, పూర్వం భూస్వాముల భూముల్లో కట్టుబానిసలుగా వెట్టి చేస్తే ఆసే, తుసే అనుకుంటూ కలో గంజోపోసేవారు. తమ పురుషుల శ్రమకు స్త్రీల శ్రమను అనుబంధంగా లెక్కించేవారు తప్ప, ప్రత్యేక వేతనం ఇచ్చేవారు కాదు. ఆ తర్వాత వచ్చిన సామాజిక, భక్తి ఉద్యమాల ఫలితంగా తిండి మందం ధాన్యం ఇచ్ఛే వారు. 19వ శతాబ్దంలో వెల్లువెత్తిన విప్లవోద్యమాల డిమాండ్ల వల్ల దళితులు రైతు కూలీ పోరాటాలలో భాగస్వాములై, తను శ్రమకు తగ్గ వేతనాలు సాధించారు. విప్లవోద్యమాల డిమాండ్ల వల్ల అనేక కార్మిక చట్టాలు చేశాయి. ప్రభుత్వాలు, చట్టా లలో చెప్పినప్పటికీ, స్త్రీలకు పురుషులతో సమానమైన వేతనాలు ఇప్పటికి కూడా ఇవ్వడం లేదు. రైతుకూలి పోరాటాలతో ప్రజలలో వచ్చిన చైతన్యాన్ని కనీస ఉపాధిని దెబ్బతీస్తూ భారత పాలకవర్గాలు నూతన ఆర్థిక విధానాలను (1990) ముందుకు తెచ్చాయి. దాంతో వ్యవసాయం దెబ్బతిన్నది. వ్యవసాయ పనులు తప్ప మరో నైపుణ్యంలేని దళిత స్త్రీలు పట్టణాలలో, నగరాలలో “అడ్డా కూలీలు”గా అవతారం ఎత్తి భవన నిర్మాణ కార్మికులుగా, పారిశుధ్య కార్మికులుగా, పాకీపనివారిగా, ఇండ్లలో పనిమనుషులుగా, రోడ్లపక్కన పండ్లు, కూరగాయలు, పూలు అమ్ము కుంటూ కుటుంబాలను పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. కొద్ది మందికి వున్నఎకరం, అర్థ ఎకరం అసైన్డ్ భూములను ప్రభుత్వాలు దౌర్జన్యంగా లాక్కొని పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు.
దళిత స్త్రీల సాంస్కృతిక విషయానికొస్తే… పీష్వాల కాలంలోవలే మూతికి ముంత, ముడికి తాటాకు కట్టుకోకపోవచ్చు. కానీ దేశం వెలిగిపోతుంది. ఆధునికంగా, శాస్త్ర సాంకేతిక ఎంతో ముందంజలో వున్నాం అని నాయకులు బాకాలూదుకుంటున్నట్టు దళితుల దుస్థితి లేదు. గ్రామాలలో ఇప్పటికీ దళితులకు దేవాలయ ప్రవేశంలేదు. చేతికి వాచిపెట్టుకోరాదు. పెళ్లిలో గుర్రంపై ఊరేగరాదు. బైక్ పై తిరగరాదు. బతుకమ్మ ఆడరాదు. వినాయకుని విగ్రహాలు పెట్టరాదు. మంచి బట్టలు వేసుకోరాదు. కొన్నిచోట్ల రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతుంది. విశ్వవిద్యాలయాలలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చదువులో ప్రతిభ కనపర్చరాదు. ఆస్తి ఉండకూడదు. భూమి ఉండరాదు. ఆత్మగౌరవం ప్రదర్శించరాదు. తలపాగ పెట్టుకుంటే తలలు తెగిపడుతయి. సాంఘిక బహిష్కరణలు కొనసాగుతున్నాయి. మలమూత్రాలు తాగిస్తున్నారు. స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ, చచ్చేలా కొడుతున్నారు. ఆవు మాంసం తింటున్నారని, ఆవు చర్మం వొలుస్తున్నారని దాడులు, హత్యలు చేస్తున్నారు.. కాళ్ళకు చెప్పులు, మెడలో బంగారు గొలుసు వేసుకుంటే దాడులు చేస్తున్నారు. రిజర్వేషన్లను తీసేసే కుట్ర ముమ్మరంగా జరుగుతుంది. ప్రతిఘటిస్తే హత్యలు చేస్తున్నారు. పోరాడి, అనేక ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న SC, ST అత్యాచార నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుంటే చంపుతున్నారు. OC, BC అబ్బాయిలు దళిత అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోమంటే బుకాయిస్తున్నారు. అంబేడ్కర్ పాటలు ఫోన్లో రింగ్ టోనగా పెట్టుకుంటే దాడులు చేస్తున్నారు. ప్రతి 15నిమిషాలకు పురుషులపై దాడి, హత్య, పదుల సంఖ్యలో స్త్రీలపై అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి. స్త్రీలు పూలు పెట్టు కోరాను, చీర కిందికి విడుచుకోరాదు. పట్టణాలు, నగరాలలో కులం అడిగి ఇండ్లు కిరాయికి ఇవ్వడం లేదు. తమ ప్రియతమ నాయకుడు అంబేడ్కర్ కు నిత్యం చెప్పుల దండలువేస్తూ అవమానిస్తున్నారు. ఆ ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. దాడులు, హత్యలకు గురవుతున్న తమ పురుషులు (తండ్రి, భర్త, అన్న, తమ్ముడు, కొడుకు మొ॥ ) వేదనకు స్త్రీలు నిత్యం ఏడుస్తూ, ఘర్షణ పడాల్సిన స్థితి. స్త్రీలపై జరిగే అత్యాచారాలకు, హత్యలకు పురుషులు ఘర్షణ పడటం ఇండియాలో నిత్యం జరుగుతున్న దుస్థితి.
పితృస్వామ్యం విషయానికొస్తే… దళితేతర స్త్రీలతో పోల్చుకుంటే దళిత స్త్రీలపై పురుషాధిక్య తీవ్రత ఎక్కువగానే వుంటుంది. దళిత పురుషుడు సమాజంలో ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దోపిడి, పీడనలకు గురవుతుంటాడు. అతని బాధ, ఉక్రోషం, న్యూనతలను వ్యక్తీకరించడానికి ఇంట్లో స్త్రీనే వుంటుంది. మాటలు, బూతులలో వ్యక్తపర్చడమేకాక, తీవ్రమైన భౌతిక దాడికి కూడా దిగుతాడు. దళిత స్త్రీ దళితేతర పురుషుల ఆధిపత్యాన్ని కాక స్త్రీల ఆధిపత్యాన్ని కూడా ఎదుర్కొంటుంది. ఇతర పురుషులతో ప్రేమ వివాహాలు ఫలించినా, ఆదర్శ వివాహాలు చేసుకున్నా పితృస్వామిక పీడనను ఎక్కువనే ఎదుర్కొంటుంది. శ్రామిక వర్గ దళిత స్త్రీ చివరికి తమ కులంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన స్త్రీ పురుషుల నుండి కూడా ఆధిపత్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
శ్రామిక వర్గ దళిత స్త్రీ సంపద, భూమి పని ఏనాడూ ఎరగదు. వాటిని కాపాడే దోపిడీ సాధనాలైన కులం, వర్గం, మతం, జెండర్, అంతర జెండర్, జాలి, ప్రాంతంలాంటి అసమానతలలో ఆమె నిరంతరం పోరాడుతుంది. చార్వాకులు, లోకాయతులు, భక్తి ఉద్యమం, పూలే, పెరియార్, అంబేడ్కర్, జాతీయోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, జాతుల పోరాటాలు, మహిళా ఉద్యమం, దళిత ఉద్యమం, కులనిర్మూలన ఉద్యమం, విప్లవోద్యమం ఇలా అన్ని ఉద్యమాలలో దళిత స్త్రీ భాగమవుతూనే వుంది. మరోపక్క రెక్కాడితేనే డొక్కాడని దుర్భర దారిద్ర్యం, పితృస్వామిక ఆంక్షలు, ఉద్యమాలలో దళితేతర పురుషుల, స్త్రీల ఆధిపత్యం, రాజ్య నిర్బంధం లాంటి వైరుధ్యాల వల్ల ఆమె ఆయా పోరాటాల్లో భాగం కావల్సినంత కాకపోతుంది.
డెబ్బైమూడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కులాన్ని తన దోపిడీ సాధనంగా వాడుకోవడంలో పోటీ పడుతున్నాయి. ఎదిగివస్తున్న దళిత నాయకత్వాన్ని ఈ దోపిడీ పార్టీలు తమలో విలీనం చేసుకుంటున్నాయి. దళిత నాయకత్వం కూడా తమ జాతిని అగ్రకుల దోపిడీ పార్టీలకు తాకట్టు పెట్టడంలో వెనకాడటం లేదు!
గత దోపిడీ పాలక వర్గాలకన్నా బీజేపీ మరింత దూకుడుగా దేశ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు దేశ సహజ వనర్లను దోచిపెట్టడానికి కులం పునాదులపై నిర్మితమైన హిందూమతాన్ని రాజకీయం చేస్తూ కుల విభజనను మరింత బలోపేతం చేస్తూ దళితులపై దాడులను, స్త్రీలపై అత్యాచారాలను పెంచుతుంది. అంతేకాక గత “చాతుర్వర్ణ” వ్యవస్థ పునర్ నిర్మాణానికి తీవ్రమైన కృషి చేస్తుంది. అందుకే అన్ని రంగాలను సంఘ పరివార్ శక్తులతో నింపేస్తూ, హిందూత్వ భావజాలాన్ని తీవ్రతరం చేస్తుంది. హిందూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా సంఘటితం ఆవుతున్న దళిత, ఆదివాసీ, ముస్లిం, క్రైస్తవ, ప్రగతిశీల ప్రజలను ఊచకోత కోస్తుంది. ఈ ప్రజల పక్షాన మాట్లాడుతున్న రచయితలను, మేధావులను దుర్మార్గమైన “ఊపా చట్టం” మోపి తీవ్రంగా హింసిస్తూ, జైళ్ళపాలు చేస్తుంది. దేశంలో ఆయా రాష్ట్రప్రభుత్వాలచేత కూడా తన హిందూత్వ ఎజెండానే అమలు చేయిస్తుంది.
వేల సంవత్సరాలుగా దళిత స్త్రీలపై అమలవుతున్న లైంగిక హింస, ఆర్థిక దోపిడీ నేడు అన్ని కులాల పీడిత స్త్రీల మీదకూడా కొనసాగుతుంది. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాల అనంతరం పసి పిల్లల నుండి, పండుముసలమ్మల మీద సైతం లైంగిక హింస, హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ వర్గాల స్త్రీలంతా ఇవాళ రోడ్లెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. పీడిత మహిళలే కాక దేశంలో కార్మికులు, కర్షకులు, విద్యార్థి, ఉద్యోగులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులు కూడా ఆర్థిక సంక్షోబానికీ ఆత్మహత్యలకు పాల్పడుతూ, పాలకుల భూస్వామ్యం, సామ్రాజ్యవాదుల దోపిడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పోరాడే ప్రతి సెక్షన్ (రంగంలో) ప్రజల లో దళిత స్త్రీ భాగమవుతూనే వుంది. తన ఆకలి, అంటరానితనం, పితృస్వామ్యం, కులం, జెండర్, నిర్మూలన జరగాలంటే అగ్రకుల భూస్వామ్య వ్యవస్థతోపాటు, దానికి దన్నుగా వున్న సామ్రాజ్యవాదుల ఆర్థిక దోపిడీపై కూడా పోరాడాల్సిన అవసరం వుంది. వాటిపై పోరాడుతున్న అశేష పీడిత ప్రజలతో దళిత స్త్రీకి ఎన్ని వైరుధ్యాలు, ఘర్షణ ఉన్నప్పటికీ, ఆయా ఐక్య సంఘటనల్లో భాగం కావలసిన అవసరం ఎంతోవుంది.
గొప్ప విశ్లషణాత్మకంగా వుంది మేడం
విశ్లేషణాత్మకంగా ఉంది..