తీహార్ జైల్లో ఉన్న ‘అవామి ఇంతిహాద్’ అభ్యర్థి షేక్ అబ్దుల్ రషీద్ ను గెలిపించారు కశ్మీర్ లోయలోని బారాముల్లా ప్రాంత ప్రజలు. అదీ మహామహులైన ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించి మరీ. ఇందుకు వాళ్లు ఖర్చు పెట్టిన మొత్తం కేవలం 27000 రూపాయలు. ఆయన గెలుపు కశ్మీర్ లో మరింత తిరుగుబాటు రాజకీయాలకు దారి ఇవ్వనుంది. కశ్మీరీ అస్తిత్వ ప్రకటనను ఈ ఎన్నిక ఎత్తి ఎగరవేసింది. ‘ప్రెజర్ కుక్కర్’ (అబ్ధుల్ రషీద్ ఎన్నిక గుర్తు)ను విజిల్ వేయించి కశ్మీరీలు తమను గత ఐదు సంవత్సరాలుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వత్తిడిని కొంత తగ్గించుకున్నారు.
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను పక్కన బెట్టి కశ్మీర్ ప్రజలు ఈ ఎన్నికల ద్వారా నిశ్శబ్ద ప్రతిఘటనను ప్రదర్శించారు. 370 ఆర్టికల్ రద్దు చేశాక -తమ గొంతునూ, ఆగ్రహాన్ని అణుచుకొని బతుకుతున్న కశ్మీరీలు రషీద్ ను గెలిపించి తమ పాలక పక్షాల పట్ల తమ కోపాన్ని ప్రదర్శించారు. నిరసన ప్రదర్శించటానికి అవకాశం వచ్చిన ప్రతి సందర్భాన్ని కశ్మీరీలు వదులుకోలేదు. ఇప్పుడు అబ్ధుల్ రషీద్ ను గెలిపించి మరోసారి వాళ్లను వాళ్లు రుజువు చేసుకున్నారు.
ఆయనతో పోటీ చేసిన వాళ్లలో నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ సిఎం ఒమర్ అబ్ధుల్లా ఒకరు. ఈయన నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్ధుల్లా మనవడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ధుల్లా కొడుకు. ఇంకొకరు బీజేపీ ప్రాక్సీ పార్టీ అయిన పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజీద్ లోనె. కశ్మీర్ లోయలో బీజేపీ పోటీ చేసే ధైర్యం చేయదు. దానికక్కడ మూడు ప్రాక్సీ పార్టీలు (ప్రతినిధి పార్టీలు) ఉన్నాయి. ఒకటి పీపీల్స్ కాన్ఫరెన్స్, రెండోది అప్నీ పార్టీ. మూడోది గులాం నబీ ఆజాద్ నడిపిస్తున్న డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ. లోయలో బీజేపీకి ప్రతినిధి పార్టీలుగా ఇవి వ్యవహరిస్తున్నాయి. జమ్మూలో మాత్రమే బీజేపీ ప్రచారం చేయగలిగింది. అక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ బారాముల్లా నియోజక వర్గంలో పీపీల్స్ కాన్ఫరెన్స్ కూ; శ్రీనగర్, రాజోరి-అనంతనాగ్ నియోజక వర్గ ప్రజలని అల్తాఫ్ బుఖారి నాయకత్వం వహిస్తున్న అప్నీ పార్టీలకే -ఓటు వేయమన్నట్లు సూచించాడు. అప్నీ పార్టీని అయితే స్వయాన బీజేపీనే ఏర్పాటు చేసింది. అమిత్ షా రాజకీయ ఎత్తుగడలన్నిటినీ గ్రహించి సరిగ్గా ఎదురు వ్యూహం పన్నారు కశ్మీరీలు.
అప్నీ పార్టీ పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లో దాని ప్రత్యర్థి నేషనల్ పార్టీనే గెలిపించారు ప్రజలు. కశ్మీర్ లో పెద్ద తరం వాళ్లు ఈ సారి నేషనల్ కాన్ఫరెన్స్ కు ఓటు వేశారు. దానికి కారణం ఆ పార్టీ మీద ప్రేమ కాదు. కశ్మీర్ నేటి స్థితికి మూల కారణం నేషనల్ కాన్ఫరెన్స్ అనే అక్కడ అత్యధికులు భావిస్తారు. కశ్మీర్ స్వతంత్ర దేశంగా అవతరించటానికి నేషనల్ కాన్ఫరెన్స్ అడ్డుకట్ట వేసింది. షేక్ అబ్ధుల్లా నెహ్రూతో చేసిన స్నేహం ఆ ప్రాంతానికి శాపంగా మారింది. తరువాత కాలంలో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడికక్కడ రాజీ పడుతూ కశ్మీరీల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కశ్మీర్ లోయలో బీజేపీయేతర పార్టీ ఏదైనా ఉందంటే అది నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రమేనని అక్కడి ప్రజలు భావించి నేషనల్ కాన్ఫరెన్స్ ను గెలిపించారు. మెహబూబా ముఫ్తీ నాయకత్వం వహిస్తున్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని (పీడీపీ) ని కూడా కశ్మీరీలు తిరస్కరించి ఓడించారు. దానికి కారణం గతంలో ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని లోయలోకి బీజేపీని ఆహ్వానించటమే. ఇప్పుడు ఆమె ఎంత ప్రజలకు దగ్గరవుదామని ప్రయత్నించినా ఆమె నడిపించిన స్థిరత్వం లేని రాజకీయాలను ప్రజలు ఇష్టపడలేదు.
బారాముల్లా పార్లమెంటు నియోజక వర్గంలో మాత్రం ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్ ను కూడా ఓడించి ‘ఇంజినీర్ రషీద్’ అని ఇష్టంగా పిలుచుకునే అవామి ఇత్తిహాద్ పార్టీ అభ్యర్థి అబ్ధుల్ రషీద్ ను గెలిపించుకున్నారు. ఎవరీ ‘ఇంజనీర్ రషీద్’ అని ఇప్పుడందరూ గూగుల్ వెతుక్కుంటున్నారు. అనేక ప్రధాన స్రవంతి పత్రికలు ఆయన గురించి కథనాలను రాశాయి.
ఉత్తర కశ్మీర్ కు ప్రతిఘటనా పోరాట చరిత్ర ఉంది. కశ్మీర్ తొలి తరం విముక్తి పోరాట నాయకుడు మక్భుల్ భట్ పుట్టి పెరిగిన కుప్వారా జిల్లా -బారాముల్లా జిల్లాకు దగ్గరగా ఉంటుంది. జనాభా పరంగా, వైశాల్యం పరంగా ఈ జిల్లా కశ్మీర్ లో అతి పెద్దది. బారాముల్లా, బండిపొర, కుప్వార, బుడ్గాంలో కొన్ని ప్రాంతాలతో కలిపి 18 అసెంబ్లీ నియోజక వర్గాలు బారాముల్లా పార్లమెంటు నియోజక వర్గంలో ఉన్నాయి. 17.62 లక్షల ఓటర్లు ఈ నియోజక వర్గంలో ఉన్నారు. యాపిల్ పంటకూ, యాపిల్ తో బాటు డ్రై ఫ్రూట్స్ వ్యాపారానికీ ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. బారాముల్లాకు దగ్గరలోని సోపూర్ మార్కెట్ అంతర్జాతీయంగా ఆపిల్స్ ను రవాణా చేస్తుంది.
1990లలో సాయుధ పోరాటం అక్కడ జరుగుతున్నపుడు ఈ ప్రాంతం తిరుగుబాటుదారులకు అడ్డాగా ఉండింది. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండటం వలన కూడా ఈ ప్రాంతం గుండా ఆ నాడు ఎంతో మంది యువకులు పాకిస్తాన్ సరిహద్దుల్లో శిక్షణ పొందటానికి వెళ్లారు. చాలాకాలం ఇక్కడి ప్రజలు భారతదేశం కశ్మీర్ లో జరుపుతున్న ఎన్నికలను తిరస్కరించారు. కాలక్రమేణ ఇక్కడ మార్పులు జరుగుతూ వచ్చాయి. సాయుధ పోరాటం, ఎన్నికల బహిష్కరణ కాలాల్లో; తరువాత 2019లో 370 ఆర్టికల్ రద్దు చేశాక -ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన నిర్బంధానికి గురి అయ్యారు. అరెస్టులు, ఎన్ కౌంటర్స్, నిర్బంధాలు, హింసా ప్రయోగాలు ఈ ప్రాంతంలో అత్యధికంగా జరిగాయి. ఏ దారి దొరకక, అంతా అంధకారమయం అయినపుడు ఇప్పుడు -వాళ్లకొచ్చిన ఒకే ఒక అవకాశమైన ఎన్నికలను వాళ్లు చక్కగా ఉపయోగించుకున్నారు. ఎన్నడూ లేనంతగా 54.2 శాతం ఓటింగ్ బారాముల్లాలో జరిగింది. 2019లో 34 శాతం ప్రజలు మాత్రమే ఇక్కడ ఓటు వేశారు. నరేంద్ర మోడి సైతం ఈ ఓటింగ్ పెరుగుదలను మెచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ఓటింగ్ సంఘీ రాజకీయాలను తిరస్కరిస్తూ జరిగిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే.
అబ్ధుల్ రషీద్ ఒకప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో నిర్మాణ ఇంజినీర్ గా పని చేసేవాడు. ఆయన ఎన్నికల ప్రవేశం 2002లో అబ్ధుల్ గని లొనె హత్యతో బాటు జరిగింది. అబ్ధుల్ గని లొనె, అబ్ధుల్ రషీద్ స్నేహితులుగా ఉండేవాళ్లు. మొదట కాంగ్రెస్ లో పని చేసిన అబ్ధుల్ గని లొనె తరువాత కాలంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ను స్థాపించి కశ్మీర్ స్వయం ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం పని చేశారు. ఆయన హత్యకు కారణం ఇప్పటికీ తెలియలేదు. ఆ సమయంలో అబ్ధుల్ రషీద్, అబ్ధుల్ గని లొనె కొడుకు సజాద్ లొనె తో కలిసి పని చేశాడు. అమరనాథ్ భూముల వివాదం తరువాత సజాద్ లొనె వ్యవహారం మారిపోయింది. బీజేపీకి దగ్గరైన సజాద్ లొనె ను వదిలించుకొని స్వతంత్రంగా అబ్ధుల్ రషీద్ 2008లో పోటీ చేసి గెలిచాడు. 2014 ఎన్నికల సమయానికి అవామి ఇంతిహాద్ పార్టీని ఏర్పాటు చేసి బారాముల్లాలోని లాంగేట్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలిచాడు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడా ఓట్లతో ఓడిపోయాడు. అయినా ఆయనకు లక్ష పైనే ఓట్లు పడ్డాయప్పుడు.
వేర్పాటువాదిగా మొదలైన రషీద్ జీవితం శాసనసభ్యుడుగా మారటం -ఆయన పౌరహక్కుల ఉద్యమంతో ప్రారంభం అయింది. కుప్వారా జిల్లా మారుమూల ప్రాంతంలో ‘బేగార్’ (బలవంతపు వెట్టిచాకిరి)కి వ్యతిరేకంగా ఆయన పని చేయటం మొదలు పెట్టాడు. అయితే ఆయనను ఇప్పటికీ ‘సాఫ్ట్ సపరేటిస్ట్’ అనే అంటారు. 2009లో షోపియన్ లో ఆషియాన, నీలోఫర్ ల అత్యాచారం, హత్యలు జరిగాక రెండు నెలల పాటు కశ్మీర్ లోయ దిగ్బంధనం అయింది. ఆ సందర్భంగా అబ్ధుల్ రషీద్ నిరసన విన్నుతంగా జరిగింది. ఆవులతో, కోళ్లతో, మేకలతో కలిసి ప్రదర్శన చేసి ‘మా జీవితం జంతువులకంటే హీనంగా ఉందని’ ప్రకటించాడు. 2005లో ఆయన మీద PSA కేసు పెట్టినపుడు ఇంట్లో ఆవుల్ని అమ్మి ఆయన బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. కశ్మీర్ లో ప్రజల పక్షాన ఉండి ఏ రకమైన రాజకీయాలు చేసినా ప్రమాదమే.
కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కోసం ఆయన చేస్తున్న ప్రసంగాలు సంఘీయులకు కోపం తెప్పించాయి. 2015లో బీఫ్ రాజకీయాలను నిరసిస్తూ రషీద్ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్ ప్రాంగణంలో బీఫ్ పార్టీ ఇచ్చి తిరుగుబాటును ప్రదర్శించాడు. ఆ కారణాన్ని చూపిస్తూ ఎమ్మెల్యేలు ఆయనను జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో అవమానించారు. అదే కారణంతో ఢిల్లీలో ఆయన ముఖం మీద ఇంకు పోసి అవమానించే ప్రయత్నం చేశారు సంఘీలు. అప్పుడు ఆయన ఉధాంపూర్ లారీ డ్రైవర్ల సమస్య మీద ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఆవుల రవాణా చేస్తున్నారని సాకు చెప్పి లారీ డ్రైవర్ల మీద అప్పుడు జరిగిన మూక దాడిలో 19 సంవత్సరాల జహీద్ మరణించాడు. కశ్మీర్ లో సాయుధ దళాలు జరుపుతున్న మారణకాండకు ఖండిస్తూ ఆయన అనేక సార్లు మాట్లాడారు.
రషీద్ కు శాసన సభ్యుడిగా కూడా చాలా మంచి పేరు ఉంది. ప్రజలకు సన్నిహితంగా ఉంటూ వారి అవసరాలను కనిపెట్టుకొని ఉండే ప్రజా ప్రతినిధిగా ఆయనను అందరూ గుర్తిస్తారు. సాధారణమైన కశ్మీరీ దుస్తులు ధరించి ఆయన ఆటో రిక్షాలో, లేక కాలి నడకన తన నియోజక వర్గంలో ప్రయాణం చేస్తూ ప్రజలను కలిసేవాడు. 2019, ఆగస్టు 5న 370 ఆర్టికల్ రద్దు జరిగిన అనేకానేక ఎన్ ఐ ఏ అరెస్టులలో ఆయన అరెస్టు ఒకటి. ఉగ్రవాద నిధులు వచ్చాయనే అభియోగం ఆయన మీద మోపారు. ఈ ఐదు సంవత్సరాలుగా ఆయనకు బెయిల్ రాలేదు. మనుషులను బంధించి వాళ్ల రాజకీయాలను రూపు మాపే ప్రయత్నాలను కేంద్ర పాలిత బీజేపీ చేస్తూ వచ్చిందనేది నిర్వివాదాంశం.
ఐదు సంవత్సరాలుగా తీహార్ జైల్లో ఉన్న అబ్ధుల్ రషీద్ ను అతని కన్నతల్లి కూడా కూడా చూడలేదు. ఆయన కోసం ప్రచారాన్ని ఆయన కొడుకులు నిర్వహించారు. ఫేస్ బుక్ లో మాధ్యమంగా ప్రచారం మొదలైయ్యింది. మొదట చిన్న చిన్న గుంపులు వీధుల్లో ప్రచారం చేయటం ఎఫ్బీ వీడియోల్లో కనిపించింది. ఆ ఊరేగింపులు క్రమేపీ పెరిగి మెగా ప్రదర్శనలుగా మారాయి. అబ్ధుల్ రషీద్ కొడుకు అబ్రార్ చెప్పిన దాని ప్రకారం మొదట వాళ్లకు నామినేషన్ వేయటానికి 25000 డబ్బులు లేక ప్రజల నుండి సేకరించాల్సి వచ్చింది. నామినేషన్ అయ్యాక ప్రజలు ఒక్కొక్కరుగా వచ్చిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం మొదలు పెట్టారు. డబ్బు సేకరణ దగ్గర నుండి పోస్టర్స్ వేయటం, కార్యకర్తల చిరు తిండి కోసం డబ్బులు చిన్న చిన్న మొత్తాలుగా ఎక్కువమంది నుండి వచ్చి పడ్డాయి. ఇలా రావటం చాలా మంచి సంప్రదాయం. వాహనాలు, వాటికి పెట్రోల్ -ప్రజల నుండే సమాకూరాయి. పోస్టర్లను ప్రజలే తయారు చేసుకొని వచ్చి అంటించారు. అందుకే ఏ రెండు పోస్టర్లు ఒకలాగా లేవు. దినవారీ కూలీలు కూడా ఒక రోజు భత్యాన్ని ఎన్నికల ప్రచారానికి ఇచ్చారు. క్రమంగా ప్రజలే ప్రచారానికి నాయకత్వం వహించారు.
యువ ఓటర్లు, అదీ మొదటి సారి ఓటు వేసిన వాళ్లు ముందుకు వచ్చారు. ఇప్పటి దాకా ఓటు వేయని పెద్దవాళ్లు కూడా అబ్ధుల్ రషీద్ కోసం ఓటు వేయటానికి సిద్ధపడ్డారు. ఈ ఓటు, ఈ గెలుపు కశ్మీర్ కు అత్యవసరమైనవని గుర్తించారు. వాళ్ల ప్రచారం దాదాపు నెల రోజులు జరిగింది. ఊరేగింపుల్లో ప్రజలు ముందుకు వచ్చి పూలు జల్లటంతో పాటు, స్వచ్ఛందంగా డబ్బును ఆఫర్ చేశారు. అబ్రార్ చేసిన చిన్న చిన్న ఎన్నికల ప్రసంగాలు సింహ గర్జనలుగా లోయలో ప్రతిధ్వనించాయి. ‘జైల్ క బద్ల ఓట్ సే…’, ‘ఘర్ ఘర్ కా ఇంజనీర్’ అంటూ నినాదాలు మార్మోగాయి.
అబ్ధుల్ రషీద్ గెలుపు సానుభూతితో వచ్చిందని తీర్మానించటం తేలిక చేయటం అవుతుంది. ఈ గెలుపు ద్వారా బీజేపీ కశ్మీర్ కు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నారు కశ్మీరీలు. అంతే కాదు కశ్మీర్ లోయలో అడుగుపెట్టటానికి బీజేపీ చేసిన ప్రయత్నాలన్నిటినీ తిప్పి కొట్టారు. కశ్మీర్ అంతా ‘మామూలుగా’ అయిపోయిందనే బీజేపీ చేస్తున్న ప్రచారం అబద్దమని రుజువు చేశారు. ఈ గెలుపు ద్వారా కశ్మీరీ సమస్యను మరొక సారి ప్రపంచం ముందుకు తీసుకొని వచ్చారు. ‘మీరు మిమ్మల్ని మర్చిపోవటానికి వీలులేద’ని మరో సారి గల్లా పట్టుకొని భారత, అంతర్జాతీయ ప్రపంచాన్ని కశ్మీరీలు నిలవేస్తున్నారు. నిన్నటి దాకా బీజేపీ అడుగులకు మడుగులొత్తిన కశ్మీరీ ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు ‘తప్పడ్’ వేశారు.
ఇంజనీర్ రషీద్ విజయం, పోరాటం, వ్యక్తిత్వం మీద మంచి వ్యాసం. విశ్లేషణత్మాకంగా ఉంది.
మంచి వ్యాసం. కశ్మీర్ గురించిన అరుదైన వ్యాసాలు తెలుగు పాఠకులకు మీ నుండే అందుతాయి. అది నిజం.
కాశ్మిర్ లో రషీద్ విజయం ఒక బలమైన ప్రజా తీర్పు. చాలా మంచి, అవసరమైన వ్యాసం..
రమాసుందరి గారికి అభినందనలు