రెండు సంవత్సరాల క్రితం మాట. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని భగత్‌సింగ్ నగర్ లో 30 సంవత్సరాల బేబమ్మ నివసిస్తూ ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్నారు. ఆమె భర్త రాములు పెయింటింగ్ పని చేస్తుండేవాడు. బేబమ్మ ఎంతో చురుకైనది. స్వభావరీత్యా సౌమ్యురాలు. కష్టపడే స్వభావం కలది. ఆ బస్తీ లో ఆమెకు మంచి పేరు. భర్త వ్యసన పరుడు. అతని సంపాదన అతడి వ్యసనాలకే చాలదు. ఇళ్ళల్లో పాచి పని చేస్తూ వచ్చే ఆదాయంతో ఇంటిని నడిపిస్తూ ఉంటుంది బేబమ్మ. రాములుకు ఉన్న వ్యసనాలలో జూదం ఒకటి. ప్రతి రోజు రాత్రి 8 గంటలకల్లా ఎవరో ఒకరి గుడిసె ముందు ఒక పది మంది బస్తీ వాళ్ళు కూడుకొని పేకాట మొదలు పెడతారు. నూటికి తొంభై శాతం రాములు ఆటలో ఓడిపోతూనే ఉంటాడు. డబ్బులు ఉంటే కడతాడు లేకపోతే పెళ్ళాన్ని పణంగా పెడతాడు. ఏంటి ఈ అన్యాయం అని ఎవరన్నా అడిగితే, “నా దగ్గర డబ్బులు లేవు. నా పెళ్ళాం ఉంది. నా ఇష్టం నేను నా పెళ్లాన్నే పెడతాను,” అని దబాయిస్తాడు. బేబమ్మ భర్తకు ఎంతో చెప్పి చూసింది… ఏడ్చింది… భర్తను బతిమిలాడుకుంది… మొత్తుకుంది. ఐనా అతనిలో ఏ మార్పు రాలేదు. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా పేకాటలో ఓడిపోయాడు రాములు. డబ్బులు లేవు కాబట్టి ఆ రోజు రాత్రికి తన భార్యను తీసుకోమని చెప్పాడు. బేబమ్మ ఏడుస్తూ… ఇంక ఎప్పటికీ నువ్వు మారవు… ఈ నరకం ఇక పడలేను అంటూ గుడిసెలోకి వెళ్ళి ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. బస్తీ లో సగం మంది ఆ గుడిసె దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎంత వారించినా ఆమె వినలేదు. ఆమె 90 శాతం కాలిపోగా, గుడిసె సగానికి పైగా కాలిపోయింది. తెల్లవారి రాములును పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్ కు బస్తీ వాళ్ళు తీసుకు వెళ్ళే లోపే బేబమ్మ చనిపోయింది. పిల్లలు అనాథలయ్యారు!
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపొలిటిన్ నగరమైన హైదరాబాద్ లో జరిగిన సంఘటన ఇది. తెలంగాణా రాష్ట్రాన్ని ఆసాంతం కుదిపేసిన నిన్న గాక మొన్న జరిగిన హాజీపూర్ వరుస అత్యాచారాల, హత్యల ఘటన! రాజస్థాన్ లో ఆ మధ్య జరిగిన దళిత యువకుడిపై దాడి, అతని ముందే అతని భార్య పై అత్యాచారం చేసి వీడియో తీయటం లాంటి అమానుష చర్యలు… గతంలో జమ్మూలో కథువా జిల్లాలో 8 సం. ఆసిఫా పై జరిగిన అత్యాచారం… హత్య… ఇలా చెప్పుకుంటూ పొతే మన దేశంలో ఏ రాష్ట్రం లో చూసినా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు!
అంతర్జాతీయంగా ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఎదగాలనుకుంటున్న భారత దేశం మహిళలపై, బాలికలపై జరిగే అత్యాచారాలలో, హత్యలలో ముందు వరసలో అంటే ప్రపంచం లోనే మూడో స్థానంలో ఉండటం శోచనీయం. ఐతే,మన ముందు ఒక ప్రశ్న తలెత్త వచ్చు… ఇలాంటి సంఘటనలు ఇతర దేశాలలో జరగటం లేదా? మన దేశంలోనేనా అని. వాస్తవానికి ప్రపంచ వ్యాపితంగా మహిళల అణిచివేతలో కొద్దో గొప్పో తేడాలు ఉన్నాయే తప్ప ఏ దేశమూ మినహాయింపు కాదు… గతంలో WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాపితంగా 35% పైగా మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారని ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ ఒక ప్రకటనలో అనేక దేశాలలో మహిళలపై లైంగిక వివక్ష, అత్యాచారాలు తీవ్రమవుతున్నాయని వాటిని అరికట్టాలనీ పేర్కొంది. సమాజంలో, కుటుంబంలో, పని ప్రదేశాలలో ఎక్కడైతేనేమి, ఎక్కడో ఒక చోట ఎదో ఒక రూపం లో వివక్ష ఉన్నదనే చెప్పాలి. భారత దేశం లో మహిళలకు రక్షణ లేదని ఐక్య రాజ్య సమితి చెప్తున్న నేపథ్యంలో మన దేశ జాతీయ నేర పరిశోధనా రికార్డ్స్ మన దేశం లో రేప్, కిడ్నాప్, వరకట్న హత్యలు, లైంగిక వేధింపులు, ట్రాఫికింగ్, మహిళల పై మానసిక, శారీరిక హింస అధికంగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నటం శోచనీయం. ఇక మహిళల పై, బాలికల పై జరుగుతున్న అత్యాచారాలలో అగ్రభాగాన ఉన్నదీ మన దేశమేనని అనేక సర్వేలు వెల్లడించాయి. గతం నుండీ సామాజిక వేత్తలు రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు అనేక సూచనలను, సిఫార్సులు చేశారు. మన ప్రభుత్వాలు అన్నిటినీ పెడ చెవిన పెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనలు మన దేశ భవిష్యత్తు లో మహిళల స్థితిని ప్రశ్నిస్తున్నాయి.
ఇక చట్టాల విషయానికి వస్తే సెక్సువల్ అఫన్సివ్ యాక్ట్ 2012, క్రిమినల్ లా అమాండ్మెంట్ యాక్ట్ 2013, నిర్భయా చట్టం -2013, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం -2013, లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం -2012, బాల్య వివాహ నిరోధక చట్టం -2006, ఇలా ఎన్నో చట్టాలు. ఐతే ఇవన్నీ ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే. మన రాజ్యాంగం మత విశ్వాసాల ఆధారంగానే స్త్రీ లకు పర్సనల్ లా లో హక్కులు కల్పించింది. పితృస్వామ్యం, మతం, ఆచార వ్యవహారాలు, సంస్కృతి రూపం లో మహిళల పట్ల అమలవుతున్న వివక్షను కాదని స్త్రీ లకు సమానత్వ హక్కులను కల్పించలేక పోయింది. వీటన్నిటికీ లోబడే చట్టాల రూప కల్పన జరుగుతోంది. అందుకనే గృహ హింస నుండి రక్షణ చట్టం మొదలు నిర్భయా చట్టం దాకా ఎన్ని చట్టాలు చేసినా వివక్షను తొలగించలేక పోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల, బాలికల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టాయి. మాతా శిశు సంక్షేమ పథకాల నుండి బేటీ పడావ్ -బేటీ బచావ్ దాకా చట్టాల, పథకాల అమలులో ఎంతవరకు చిత్త శుద్ధి ఉన్నది,ఎం త వరకు ఇవన్నీ ప్రజలకు అందుబాటులో యన్నది ప్రశ్నార్థకమే!
మహిళల పై బాలికల పై జరుగుతున్న అత్యాచారం కేసుల్లో నేర పరిశోధన దగ్గర నుండీ శిక్షల దాకా అంతా లోపభూయిష్టంగానే జరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాస్తవానికి అనేక సంఘటనలు వెలుగు లోకి రావటమే లేదు. నేరం జరిగినా సామాజిక, కుటుంబ పరిస్థితుల రీత్యా బాధితురాలు సమాజంలో కుటుంబ గౌరవం ఎక్కడ తగ్గుతుందో అని ఫిర్యాదు చేయటమే గగనం. ఒకవేళ ఫిర్యాదు చేసినా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే దాఖలాలే లేవు. చట్టాల పై పూర్తి అవగాహన మహిళలకు లేకపోవటం, చట్టాలలోని లోపభూయిష్టతా, చట్టాల అమలులో చిత్త శుద్ధి లేకపోవటం ఇవన్నీ ప్రధాన కారణాలు.
మానవ హక్కులన్నీ పురుషులకే అన్న స్థితి నుంచి మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే స్థితి దాకా మహిళలు తమ హక్కులను సాధించుకునే క్రమం లో అనేక ఉద్యమాలు చేశారు. హక్కుల సాధన లో భాగంగా అనేక చట్టాలను తెచ్చుకోగలిగారు. 2000-2010 వరకు దశల వారీగా మహిళల అభివృద్ధికి సంబంధించిన అంశాలు అప్పటి ఆర్ధిక మంత్రి మహిళా సాధికారతలో భాగంగా పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, మహిళా గ్రూపులను పటిష్టం చేయటం, సమాజంలో, కుటుంబంలో మహిళల పట్ల వివక్షను, హింసను వ్యతిరేకించటం, ఐక్య రాజ్య సమితి సంస్కరణలు, గృహ హింస నుండి రక్షణ చట్టం -2005 ఇవన్నీ పొందుపరిచారు. ఐతే, మార్పు రాలేదా అంటే కొంత వచ్చిందనే చెప్పాలి. కానీ చెప్పుకోదగినంత స్థాయిలో మార్పు రాలేదు. ఇన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని పథకాలు పెట్టినా మహిళల, బాలికలపై కొనసాగుతున్న వివక్ష, హింస, అత్యాచారాలు, అక్రమ రవాణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తరుగుతున్న దాఖలాలు కనిపించటం లేదు. వీటిని సత్వరం నియంత్రించాలని సామాజిక విశ్లేషకులు అనేకులు గతంలో సూచించారు. లేని పక్షంలో అత్యంత ప్రమాదకరమైన స్థితులను ఎదుర్కోవలసి వస్తుందనీ చెప్పారు.
స్త్రీని ఒక వస్తువుగా చూసే దృష్టి కోణం మన సమాజ మూలాలలోనే ఉందన్నది కాదనలేని సత్యం. ఏదో ఒక రూపంలో స్త్రీలపై అనునిత్యం వేధింపులు, హింస సర్వసాధారణమై పోయాయి. ప్రపంచీకరణ తరువాత అంటే 1990 ల తరువాత మహిళలు మరింత మార్కెట్ సరుకులుగా మారారు. ఇతర దేశాలలో పిల్లలకు నిషేధించబడిన వెబ్ సైట్ లు మన టీనేజర్స్ కు అత్యధికంగా అందుబాటులో ఉంటున్నాయి. మత్తు పదార్ధాలకూ, మద్య ప్రవాహానికీ అడ్డు కట్టే లేదు. జుగుప్స కలిగించే సెక్స్ వీడియో లు సరే సరి. టెక్నాలజీ ముసుగులో విచ్ఛిన్న, విధ్వంస, విశృంఖలతను గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకుండా, సామాజిక రుగ్మతులకు పరిష్కారాలను వెతకకుండా, సంఘటలకు ఉపశమనం మాత్రమే చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు గాక దొరకదు.
సామాజికంగా అణిచివేతబడుతున్న ప్రజల గురించి వారి మధ్య తిరుగుతూ వారి బాధలను అర్ధం చేసుకొని రాసే తక్కువమంది సాహిత్యకారుల్లో కవిని గారోకరు. ఆవిడ రచనలను మనల్ని ఆలోచింపచేస్తాయి