రాజ్యం అక్రమంగా నిర్బంధించిన ప్రజా మేధావి ప్రొ. సాయిబాబను కన్న తల్లి సూర్యవతమ్మ తాను ప్రాణంగా భావించిన కొడుక్కు తన చివరిచూపును కూడా దక్కనివ్వని రాజ్యం కళ్ళల్లో రెండు దోసిళ్ళ మట్టి గొట్టి వెళ్ళిపోయింది.
అమ్మ ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ అయ్యిందని తెల్సినప్పటి నుండే ఆందోళన మొదలయ్యింది. కాని ఈ వార్త తెలిసిన రెండు రోజులకే పరిస్థితి చేజారిపోయింది. ఇక ఆశలు లేవని తెలిసిన కొన్ని గంటలకే అమ్మ ఇక లేదని మెస్సేజ్ వచ్చింది. చెప్పనలవి కాని బాధ. ఈ బాధ కేవలం ఆ తల్లి మరణం గురించి మాత్రమే కాదు. మరణించిన పరిస్థితుల గురించి.
జీవితమంతా ఎంతో కష్టపడి తన ముగ్గురు పిల్లల పెంచి పెద్ద చేసింది. ఆ పిల్లలు తమ స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. విప్లవోద్యమంలో భాగమైన కూతురు గంగాభవానిని రాజ్యం దొంగ ఎదురుకాల్పుల్లో హత్య చేసింది. ప్రజా ఉద్యమకారుడైన పెద్ద కొడుకు ప్రొ. సాయిబాబను రాజ్యం దొంగ కేసుల్లో ఇరికించి అత్యంత ఘోరమైన అండా సెల్ లో నిర్బంధించింది. సాయిబాబ 19 ప్రాణాంతక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, వెంటాడుతున్న మృత్యువును సహితం ధిక్కరిస్తూ మొండిగా బతుకుతున్నాడు.
ముఖ్యంగా ఈ కరోనా కాలంలో సాయిబాబ గురించి ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని కుటుంబ సభ్యులు, మిత్రులు, ఉద్యమకారులు ఆందోళన చెందుతున్నారు. సాయిబాబకు కనీసం చావుబతుకుల్లో ఉన్న తన తల్లినైనా చూసే అవకాశం ఇవ్వమని ప్రపంచ మేధావులు భారత రాష్ఠ్రపతికి, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి విజ్ణప్తి చేశారు. అంతర్జాతీయ, జాతీయ మానవ హక్కుల సంఘాలు కనీసం మానవీయ దృక్పధంతోనైనా సాయిబాబను విడుదల చేయాలని రాజ్యంలోని అన్ని అధికార అంగాలకు విజ్ణప్తి చేశాయి.
దొంగ కేసు పెట్టిన రాజ్యం సాయిబాబ ఆరోగ్యం గురించి తప్పుడు నివేదికలు కోర్టులకు అప్పగించి అతని ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని బొంకుతూవస్తుంది. రాజ్యం మాటే తన మాట అంటూ తమ స్వతంత్రతను సహితం పాలకుల పాదాల దగ్గర తాకట్టు పెట్టిన న్యాయవ్యవస్థలు అతనికి కనీసం మెడికల్ బెయిల్ కూడా ఇవ్వ నిరాకరిస్తున్నాయి. చివరికి తన తల్లిని చూసే అవకాశం ఇవ్వమని అడిగినా ముంబై హైకోర్ట్ అనుమతి ఇవ్వలేదు.
ఇప్పుడు ఆ తల్లి లేదు. కాని ఆమె తన చివరి ఘడియాల్లో ఎంత క్షోభ పడివుంటుంది. ఇన్ని రోజులుగా ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రటించిన ఆ తల్లి ఎంత నిరాశ చెందివుంటుంది. ఇప్పుడు తల్లి లేదనే వార్త వినే సాయిబాబ ఎంత తల్లడిల్లిపోతాడో? “ఏడువకు అమ్మా” అని కవిత కబురు పంపిన అతనిని “ఏడ్వకని” ఎవ్వరు ఓదార్చుతుతారు? ఎవరున్నారని అక్కడ? ఎంత దుర్మార్గం! ఏ సమాజంలో బతుకుతున్నాము. ఏమి చేయలేమా? నిస్సహాయంగా బతుకులీడ్చుడేనా?
అసలు ఆ కొడుకు చేసిన తప్పేంటి? ఆ తల్లి చేసిన నేరమేంది?
దాదాపు పది నెలల క్రితం ఆ తల్లితో చేసిన సంభాషణ గుర్తుకొస్తావుంది. అమ్మ అడిగిన ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ సమాజం ముందు పెట్టాలని అనిపిస్తుంది.
“కాళ్ళు లేవని బాధ పడకుండ పెంచుకున్న. పువ్వులాగ. చివరికి నా కొడుకును కండ్లకు కానరాకుండ చేసింది గవర్నమెంట్. నా బెంగంతా ఆయన గురుంచే తండ్రి. ఆయన మీద గవర్నమెంట్ ఎందుకు అంత పగ పట్టిందో? ఈ పిల్లాడు ఏమైనా చేయగలడా? నడవగలడా? బరువులెత్తగలడా? తుపాకితో కాల్చగలడా?… పెద్ద పెద్ద హత్యలు చేసినోళ్ళేమో బయటున్నరు. ప్రజల బాగు కోసం మాట్లాడిన నా కొడుకేమో ఏండ్ల కొద్ది జైళ్ళ వున్నడు. అసలు నా కొడుకు ఏం తప్పు చేసిండు?”
బహుశా ఆ తల్లి తనను కలిసిన ప్రతివారిని ఈ ప్రశ్నలు అడిగే వుంటుంది. మనమేదో సమాధానం చెప్తామని కాదు. ఆ తల్లికి తెలుసు తన కొడుకు ఏ తప్పు చేయలేదని. లేకపోతే తన కొడుకు మీద అంతటి విశ్వాసాన్ని ప్రకటించేది కాదు: “మీకేమైనా వీలయితే నన్ను మోడీ దగ్గరకు తీసుకుపోండి. ఆయనకు దండం పెట్టి అడుగుత. నా కొడుకును వదిలిపెట్టమని కాదు. నా కొడుకు ఏం తప్పు చేశాడో చెప్పమని? ఎప్పటికైనా ప్రభుత్వం తప్పు తెలుసుకుంటది. నా కొడుకు బయటికొస్తడు. ఆ నమ్మకం నాకుంది.”
అమ్మకు రాజ్య వ్యవస్థల మీద నమ్మకం వుండే అవకాశమే లేదు. ఎందుకంటే తన ఇద్దరు బిడ్డలను రాజ్యం ఏం చేసిందో కండ్లార చూసింది. ఆమె నమ్మకం ప్రజల మీద. పోరాట శక్తుల మీద.
“అసలు ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు” అని సగటు మధ్యతరగతి అడుగుతుండొచ్చు.
అదే ప్రశ్నను అమ్మను నేను అడిగాను. “నీ కూతురును చంపేసిండ్రు. నీ కొడుకును జైల్లో పెట్టిండ్రు. ఇంత హింస అనుభవిస్తున్నప్పుడు మీకు ఏమనిపిచ్చింది?” అని.
“నా పిల్లలు ఏం తప్పు చేస్తుండ్రు. నలుగురికి మంచి జరగాలనే పోరాటం చేస్తుండ్రు కదా అని సంతోషపడ్డ,” అని గర్వంగా చెప్పింది.
“నలుగురికి మంచి జరుగొచ్చేమో కాని, మీకేమొచ్చింది?” అని మళ్ళీ అడిగిన.
“అందరు మాకేమొస్తది అనుకుంటే, ఇక మనుషులెట్ల బతుకుతరు. నా కొడుకును చంపుతరేమో. మేము ఇంకా కష్టాలు పడుతమేమో. కాని మిగిలినోళ్లన్న మంచిగ బతుకుతరు కదా,” అని బదులిచ్చింది.
ఇదే కదూ ఉద్యమాల తల్లులు చెప్పే మాట. ఆ తల్లి మాటలను అర్థం చేసుకోవడానికి ఏ సిద్ధాంత గందరగోళం అవసరం లేదు. కేవలం మనిషయితే చాలు. ఆ మనుషులను బతికించుకోవడం కోసమే ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించింది, అనుభవిస్తుంది.
మొన్ననే స్కాలర్స్ అట్ రిస్క్ అనే అంతర్జాతీయ సంస్థ కెనడాలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో సాయిబాబ గురించి మాట్లాడితే అక్కడున్న ఒక విద్యార్దిని బోరున ఏడుస్తూ “అసలు ఆ దేశంలో మనుషులు లేరా? నోట్లోకి అన్నం ముద్దెట్ల పోతుంది? కంటికి నిద్రెట్ల వస్తుంది?” అని తన అవేదనను, కోపాన్ని ప్రకటించి పొద్దున్నే ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి తాను స్వంతంగా క్యాంపైన్ మొదలుపెట్టింది.
ఇప్పుడు గుండెల్లో ఇంకా తడివున్న మనుషులు ఏకం కావాలి. ఆ తల్లి ప్రకటించిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. సాయిబాబను, ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేసేవరకు ప్రజా బలాన్ని కూడగట్టుకోని రాజవ్యవస్థతో సంఘర్షించాలి. అదే ఆ ఉద్యమాల తల్లికి నిజమైన నివాళి!
ఫిబ్రవరి చివరిలో అమ్మను ఆసుపత్రిలో కలిసినప్పుడు సాయి ఎప్పుడు వస్తాడు, ఒక్కసారి చూడగలిగితే బాగుండు అని అన్నది.
రాజ్యం ఎంత వికృతంగా వ్యవహరించిందో కదా.